Feb2009
తెల్లారింది…
- ఎలికట్టె శంకర్‌రావు
‘ఉప ఎన్నికల దుందుభి మోగింది. ఎన్నికల కమిషన్ పచ్చజెండా ఊపింది. ఈ నేపథ్యంలో వివిధ పార్టీల నాయకుల అభిప్రాయాలను తెలుసుకుందాం…’ టివి నైన్‌లో రజనికాంత్ మాట్లాడుతుండు. ఆయన మొకంలో నవ్వు తొణికిసలాడుతున్నది.
‘దేవేందర్‌గౌడ్ టెలిఫోన్ లైన్లో ఉన్నారు. ముందుగా ఆయనతో…’
ఇంతలో దేవేందర్‌గౌడ్ మాటలు… ‘నేను రెండు గంటల క్రితమే ఎన్నికల వార్త విన్న…మేము పార్టీలో మాట్లాడుకుంటం… ఎన్నికల్లో ప్రజల ముందుకు ఎట్ల పోవాలా? కాంగ్రెస్ అరాచకాలను ప్రజలకు ఎట్ల వివరించాలా? చర్చించి నిర్ణయం తీసుకుంటం.’
ఆ వెంటనే సిపిఐ నారాయణ, సిపిఎం రాఘవులు ఎలక్షన్లకు తాము ఎట్ల సిద్దం కానున్నరో రెండు మాటల్ల చెప్పిండ్రు. మంత్రి పొన్నాల ముసిముసి నవ్వులతో అభివృద్ధి మంత్రాలను, వైఎస్ భజనను వినిపించిండు. పొన్నాల గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతుంటే రజనీకాంత్ మొకంలో అదో రకమైన నవ్వు ఎన్నికల విషయాలను ఉత్కంఠగా చూస్తూంటే ఓ పదినిమిషాల పాటు నిరంతర ప్రకటనలు.
ఆ తర్వాత నాయిని నర్సింహారెడ్డి తెలంగాణ జెండా రెపరెపలాడబోతుందని. కరీంనగర్ ఫలితాలే పునరావృతమైతయని ఢంకా మోగించిండు.
అప్పుడే ఎన్నికల సందడి. ఏ ఛానల్ తప్పినా ఎన్నికల వార్తావాహిని….
వార్తలు వింటున్న పెయింటర్ కమల్ మొహంలో దిగులు… టీవీ దిక్కే కన్నార్పకుంట చూస్తుండు.
కమల్ భార్య యాదమ్మ ఓ మూలకు దిగులుగా కూసుంది.
భర్త దిక్కు టీవి దిక్కు చూస్తుంది. ఆమె ఒడిలో ఏడాది పిలగాడు.
* * *
కాశయ్యకు కోడికుయ్యముందే మెలకువొచ్చింది. ఇంటి ముందుల కాలుగాలిన పిల్లోలిగ అటూ ఇటూ తిరగుతుండూ. పదో తరగతి పరీక్షలు అయిపోయిన నాటి నుంచి ఎప్పడు ఇంతగనం ఆలోచించలే. ఇయ్యాల ఫలితాలు ఇస్త్తుండ్రు అని పటేలు చెప్పిన కాన్నించి గుండెల్ల ఒకటే దడ.
బస్సు నల్లగొండల ఎల్లినాలె.. ఇంకో గంట సేపైతే బడికాడి కొస్తది. పంతులు ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యి తోటపని చూసుకునే పటేలు బస్సుదిగుతడు. ఆయన వచ్చిండంటే చేతుల పేపరు తప్పక ఉంటది. మరి పేపర్ల తన నెంబరుంటదో?
మొకం కడుక్కొని అవుతలి బజారున ఉన్న బడికాడికొచ్చిండు. అప్పటికే అక్కడ మనుషుల అలికిడి. అది రోజూ ఉండేదే కాని ఇయ్యాలా నలుగురైదుగురు పిల్లలు తనతోపాటు పరీక్ష ఇచ్చినోల్లు… వాళ్ల తల్లితండ్రులు.. భయపడతున్నావుర కాశయ్య? పాసయితవులే క్లాసుమేటు జనార్థన్ తండ్రి కోంటి యెంకయ్య పలకరించిండు.
కాశయ్యను తరుముకొస్తున్న ఆలోచనలు. జనార్థన్ తండ్రి చూడు. కొడుకు ఫలితాలు కోసం ఎట్ల ఎదురు చూస్తుండో… అదే తన తండ్రి … రాములు … బట్టల బేరం చేస్తడు. అది పెద్ద బేరం కూడా కాదు. ఎనకటి నుంచి వచ్చిన కులవృత్తి అన్నట్లుగా నడుపుతుండు. ఆడోల్ల లంగాలు, మొగోల్ల లుంగీలు మూటగట్టుకొని నాలుగూర్లు తిరిగి అమ్ముతడు అట్ల బయటికి పోయిన్నాడు. పదోపరకో వస్తది. తల్లి కూలి పనికి పోతది ఓ పూట తింటె ఓ పూట ఉపవాసం అన్నట్లు నడుస్తుంది సంసారం.
బస్సు బడికాడికొచ్చి ఆగింది. పటేలు చేతుల పేపరు అందుకుండు కోంటి యెంకయ్య తనకొడుకుది… తరువాత ఒక్కొక్క నెంబరు చూసిండు కాశయ్య నెంబరు లేదు. ఫలితం తెలిసినంక కాశయ్య ఓ అని ఏం బాధపడలే. పాసైతే బావుండు అని మాత్రం అనుకుండు కొద్దిగా దిగులుతో ఇంటి బాటపట్టిండు.
* * *
వారం తరువాత మార్కుల మెమోలు వొస్తున్నయని ఎర్రబెల్లి బడికి పోయిండు. అప్పటికే పంతుల్లంత మెమోలు చూసినట్టుంది పాసు ఫేలు అని మాట్లాడుకుంటుండ్రు. ఒక్కొక్క పిలగాడు హెడ్మాస్టరు ఆఫీసులకు పోయి మెమో తెచ్చుకుంటుండు కాశయ్య. మెమో తీసుకుండు.
‘కాస్త తెలుగుమీద శ్రద్ధ పెడితే పాసవుదువు గదరా! అన్నడు శర్మసారు. ఆయనే పదో తరగతికి తెలుగు చెప్పిండు. కాశయ్య తప్పింది ఒక్క తెలుగులోనే.
‘తెలివి గల్ల పిలగాడే. కాకపోతే… వెధవకు తెలుగు వంటబట్టలే. అక్షరాలు ఎట్ల రాస్తడో తెలుసుగా. గుండ్రంగా ముత్యాలోలిగ ఉంటయ్. కాకపోతే సున్నాలు వొత్తులు పెట్టాల్సిన కాడ పెట్టకుంట… వాని ఇష్టంమొచ్చిన కాడ పెడతడు. జూనియర్ తెలుగు పంతులు వెంకట్ రెడ్డి చెబుతుండు.
మల్ల శర్మ సారు గొంతు… ‘వెధవ పెయింటరోలిగా రాస్తడు. చూస్తే గుండ్రంగా ఉంటయ అక్షరాలు చదవబోతే తప్పులు.’
కాశయ్య ఎక్కడ ఆగకుంట ఎర్రగూడెం బాటపట్టిండు. కొడుకు ఫేలయిండని తెలిసినా తల్లిదండ్రి పెద్దగా పట్టించుకోలె. ఆ … చదివితే ఉద్యోగాలు వచ్చేది తప్పిందా. ఏదో పని చేసుకుని బతకాల్సినోళ్లమేగా అని దీర్ఘం తీసిండు తండ్రి. కాశయ్యకు ఇంగ ఎదో ఒకపని చేయాలని పడ్డది. ముందు ఎర్రగూడెం నుంచి బయటపడాలనుకుండు.
కాశయ్యపెద్దమ్మ కొడుకు కోటేశు నల్లగొండలో ఉంటడు. పెయింటర్ అని చెప్పకుంటడు. చేసే పని ఇండ్లకు సున్నాలు వేయడం. పదేండ్ల బట్టి ఆ పనిలో ఉండు. అక్కడ పని దొరుకుద్ధి అనిపించింది కాశయ్యకు. నల్లగొండకొచ్చి కోటేశును కలిసిండు. నేను కూడా పని చేస్త అన్నా అన్నడు.
కోటేశు సరే అన్నడు. ఏడాది పాటు సున్నాలు యేసిండు కాశయ్య ఒకసారి వెంకటేశ్వర కాలనీల లెక్చరర్ ఇంట్ల గడపలకు రంగులు వేస్తుంటే.
‘పిలగాడు మంచిపనోడు పెయింటరోలిగ ఏస్తుండు’ అన్నడు లెక్చరర్.
ఆ మాట కాశయ్య మనసుకు తాకింది. తన రాతను చూసి శర్మసారు అదే అన్నడు. ఇప్పుడు ఈ లెక్చరర్ అదే అంటుండు. ఇంతమంది అంటుండ్రు అంటే తనలో పెయింటర్ కావాల్సిన లక్షణాలు ఉన్నయన్నమాట. ఈ సున్నాలు ఏసే బదులు పెయిటింగ్ నేర్చుకుంటే… ఆలోచన పడ్దది కాశయ్యకు.
మూర్తి పెయింటర్. రామాలయం కాడ చిన్నపాటి దుకాణం. పదిపదిహేను ఏండ్లుగా పని చేస్తుండు. పైసలు సంపాదించ లేదుగాని పెయింటర్‌గా మంచి పేరుంది. ఆయనదీ ఎర్రబెల్లే అన్న విషయం ఎట్లనో తెలుసుకుండు కాశయ్య పక్కూరోడు కదా దగ్గరకు తీయకపోతాడా అన్న ఆశతో మూర్తిని కలిసిండు.
తనను తాను పరిచయం చేసుకుండు. కాశయ్య రూపం, మాట తీరు చూసి కాదనలేకపోయాడు మూర్తి. దుకాణంలో గోడల మీద ఏసు, మదర్ థెరిస్సా, గాంధీ, స్థానిక ఎమ్మెల్యే బొమ్మలున్నయ్. వాటి దిక్కు కాశయ్య పరీక్షగా చూస్తుంటే ‘మనం పనిమంతులమని నలుగురికి తెల్వాలంటే నాలుగు బొమ్మలుండాలె అట్ల. ఇంక ఎమ్మెల్యే బొమ్మంటావు. మనకు నాలుగు పైసల పనిదొరుకుతది’ అన్నడు మూర్తి.
మూర్తి ఒక్కొక్క కిటుకు నేర్పిండు కాశయ్యకు ‘సూడు పెయింటర్లంటే పెద్ద పోటు మొనగాళ్లేమి కాదు. కిటుకు తెలిస్తే ఎవలైనా అందంగా రాయగలరు’ అన్నడు రొండు దినాలైనంక.
‘కరడాల కాపీల చూసిరాత రాసినవు గుర్తుందా. బోర్డులు గీర్డులు రాయడం కూడా అంతే’ అన్నడు మూర్తి బ్లూలో ముంచిన దారంతో గోడకు కొట్టిన బట్టమీద రొండు దిక్కులా పట్టుకొని గీతలు కొట్టిండు. అట్టనే మరిన్ని గీతలు…
‘ఈ గీతలు కరడాల కాపీ గీతలనుకో… వాటి నడుమ అక్షరాలు రాయి’ అన్నడు. కాశయ్యకు అర్థమైంది. నవ్వుతూ బ్రష్ అందుకుండు. నాలుగు దినాలకే కాశయ్య చెయ్యి దిరిగింది. సొంతంగా గీతలుకొడ్తుండు. గీతల నడుమ చక్కగా రాస్తుండు.
‘అక్షర దోషాలు లేకుంట చూసుకుంటే మంచిది తెలిసినోడైతే మనకు తెలవవనుకుంటడు’ అని నవ్విండు మూర్తి.
కస్టమర్ల కాశయ్యా అని పిలుస్తుంటే మూర్తికి బాగా అనిపించలే. కాశయ్యను దగ్గరికి పలిచి ‘ఇప్పటి నుంచి నీ పేరు కమల్. ఎవరడిగినా అదే చెప్పు. పెయింటర్లకు అందమైన పేరు ఉండాలి’ అన్నడు.
అప్పటినుంచి కాశయ్య పెయింటర్ కమల్ అయ్యిండు.
రెండేండ్లు మూర్తి దగ్గర పనిచేసిండు. మంచి పెయింటర్ అన్న పేరు సంపాయించిండు.
* * *
కమల్ సొంతషాపు పెట్టుకుండు షాపు మెల్లమెల్లగా పరిచయమైంది. పది రూపాయలు పోతే సంపాదించుకోవచ్చుగాని ఒక కస్టమర్ పోతే సంపాయించుకోలేము అన్న మూర్తి మాట మనసులో మెదులుతుంటే పని చేస్తుండు. రెండేండ్లకు నల్లగొండ పట్టణమంతా తెలిసిపోయిండు
కొడుకు సంపాదనపరుడయ్యే సరికి కమల్ తల్లిదండ్రులు సంబురపడ్డరు. పెండ్లి సంబంధాలు చూసిండ్రు. ఓ ఎండకాలం కమల్ పెండ్లయింది.
ఇంకో ఆర్నెల్లల్ల ఎన్నికొలొస్తయ్. గిరాకీలుంటయ్. ఇంత చిన్న షాపుల వచ్చిపోయెటోళ్లకు ఇబ్బంది. కాస్త పెద్ద షాపు తీసుకుంటే పోలే అనుకుండు కమల్. ప్రకాశం బజార్ల రెడ్డి కాంప్లెక్స్‌ల ఓ మడిగ అద్దెకు తీసుకుండు. కొత్త షాపులోకి మారిండు రెండు అర్రల ఇల్లు తీసుకొని సంసారం దించిండు.
ఎన్నికల సందడి మొదలైంది. కమల్ సంతోషపడ్డడు. చోటమోట రాజకీయ నాయకులు బ్యానర్లు, గోడల మీద రాయిస్తుండ్రు. రెండు నెలలు చేతినిండా పని.
‘ఈ ఎన్నికలకు పనిచేస్తే చాలమ్మ బతికి బైటపడుతం’ అన్నడు భార్య యాదమ్మతోని అనుకున్నట్లుగానే చేతినిండా పని. షాపు కళకళలాడింది. కమల్ సంసారంలో సంతోషం.
* * *
కమల్ చేతిలో బ్రష్షు ఆడుతోంది. చిన్నపాటి స్టూలు మీద కూసుండు. ఎదురుగా గోడపైన గుడ్డ. రాజకీయ పార్టీ బ్యానరు. తుది మెరుగు దిద్దుతుండు. బ్రష్షు రంగులో ముంచి తీస్తుంటే జారిపడ్డ ఒకటి రెండు చుక్కలు బట్టలమీద చూడగానే పెయింటర్ అనేటట్టుగా ఉండు.
దుకాణం పెట్టి మూడేండ్లయ్యింది. మంచి పరిచయాలు ఏర్పడ్డయ్. అన్ని పార్టీల నాయకులను పరిచయం చేసుకుండు. ఊళ్లె ఏ మీటింగు అయినా బ్యానర్ల గిరాకీ రావల్సిందే.
ఎక్కువగా రాజకీయ పార్టీల బ్యానర్లు రాస్తడు. అప్పుడప్పుడు దుకాణాల ముందు బోర్డులు కూడా కాని అవి అమాసపున్నాలకొచ్చే గిరాకీలే. రాజకీయ నాయకులు బ్యానర్లు రాపిస్తుంటే కమల్‌కు ఒక్కోసారి అర్థం కాదు. ‘కొడుకులు ఇబ్బడి ముబ్బడిగా సంపాయిస్తరు. పెద్ద పెద్ద నాయకులను కాకా పట్టటానికి ఇట్ల ఎగబడ్తరు. ఆ తర్వాత ఏ కాంట్రాక్టో దొబ్బుతరు. రెండు జేబులు నింపుకుంటరు.’ అని మాత్రం అనుకుంటడు.
కమల్ రాసేవి యువనాయకుని బ్యానర్లు. ఆ నడుమ ఒకడు యువజన విభాగం అని మీటింగు పెట్టి అదరగొట్టిండు. ఆ కొడుకు ఎదిగి పోతుండు మనం నిమ్మలంగ ఉంటె ఎట్ల అని ఇంకోడు యువసేన అని రాయించిండు మీటింగు పెడ్తుండు. ఆ బ్యానర్లే ఆర్డరిచ్చిండు. వాడైనా వీడైనా చేసేది భజనే. వీళ్ళ ఆరాటాలు పోరాటాలు చూస్తుంటే అసహ్యం వేస్తది కమల్‌కు. ‘ఇల్లాంటి లంజకొడకులు చేసేది ప్రజా సేవా’ అని అనుకుంటడు కసిగా.
ఆలోచిస్తూ బ్యానర్‌ను పరిశీలిస్తుండు కమల్. అప్పుడే పెయింటర్ నివాస్ హడావుడిగా వచ్చిండు నివాస్‌కు కమల్ వయస్సుంటుంది. రాష్ట్రపతి రోడ్డులో దుకాణం ఇద్దరికి మంచి దోస్తాను.
‘రా నివాస్ కూసో… ఏందో పరేషాన్ గున్నవ్…’ కమల్ నవ్వుతూ పలకరించిండు.
నివాస్ కుర్చీలో కూసుండు. టేబుల్ మీదున్న నీళ్ల సీసా అందుకొని గడాగడా రొండు బుక్కలు దాగిండు.
‘ఏందీ సంగతి….’ కమల్ మల్లా అడిగిండు.
”రాజు ఆర్టిస్ట్ ప్లెక్సీ మిషన్ తెస్తుండట తెలిసిందా కమల్’
గొంతును ఎవరో పట్టుకున్నట్టుగా ఆగిపోయిండు నివాస్,
వెన్నులో కరెంట్ షాక్ పెట్టినట్లుగా ఉలిక్కిపడ్డడు కమల్.ప్లెక్సీ… ప్లెక్సీ… పెయింటర్ల బతుకుల్లో భూకంపం. ప్లెక్సీ గురించి కమల్‌కు తెలుసు. కస్టమర్లు పెండ్లి బ్యానర్లు కావాలని అడిగితే ఒకటి రెండు సార్లు హైదరాబాదుల చేయించుకొచ్చిండు కూడా. బ్రష్షులు పట్టుకుని బతికే పెయింటర్లు బజార్ల పాలయిండ్రు అని విన్నడుకూడా.
ఇంత తొందరగా నల్లగొండ మీద పిడుగు పడతదని ఊహించలే!
‘బయానా ఇచ్చిండంట. రెండు మూడు వారాలల్ల మిషను దిగుతదని తెలిసింది’ నివాస్ మొకంలో నెత్తురు చుక్కలేదు.
కమల్‌కు మాట పడిపోయినట్లుగా అయ్యింది.
‘పదిహేను లక్షలంట మిషనుకు…’
‘అంత డబ్బు ఎక్కడిది రాజుకు’ కమల్ గొంతు పెగిలించుకొని అడిగిండు అంత డబ్బు రాజు కాడ లేదని తెలుసు తను వింటున్నది అబద్దమైతే బాగుండు అన్న ఆశ.
‘రాజు దుకాణంకాడికి వస్తరు చూడు. ఆడు పైనాన్సోడు తెల్లబట్టలేసుకొని ఆనెమ్మటొచ్చే రియల్ ఎస్టేటోడు. వాళ్లు పెట్టుబడి పెడ్తుండ్రట’
‘ఆ కొడుకలేమన్న ఆర్టిస్టులా… వాళ్లెందకు పెడ్తుండ్రు పెట్టుబడి ‘ కమల్ గొంతులో కసి.
‘పైసలే అన్ని పనులు చేస్తయ్. ఆర్టిస్టు కావాల్సిన పనిలేదు. రేపట్నుంచి కంప్యూటర్ మీద డిజైన్ చేస్తరు. మిషన్ మీద అచ్చు కొడ్తరు. ఆ లంజకొడుకుల సంగతి తెల్సుగా. పైసకు పైస పుట్టించేటోల్లు. దీంట్ల నాలుగురాల్లు సంపాయించొచ్చని వాసన పట్టిండ్రు రాజుగానిని ముంగలపెట్టి పెట్టుబడి పెడ్తుండ్రు వీనికింత జీతమిచ్చి దుకాణం సొంతం ఆల్ల చేతుల పెట్టుకుంటరు.
నివాస్ చెబుతుంటే కమల్‌కు తల తిరిగినట్లయింది.
* * *
రాజు ప్లెక్సీ మిషన్ తెచ్చిండు. నెల తిరగక ముందే నల్లగొండ సాంతం టాంటాం అయ్యింది. సావుకు పెండ్లికి, ప్లెక్సీ బ్యానర్లే. దుకాణాల ముందు అవే. రాజకీయ హంగామాకూ అవే.
కమల్ బ్రష్షు మూలకు వడ్డది. తిండిపోతలేదు. నిద్రపడ్తలేదు ఎట్ల బతకాలే. తనకు తెలిసిన పని ఇదొక్కటే, ఇది కూడా మూలకుపడితే… తన అమ్మయ్య సంపాయించిన లక్షలు లేవు. మిషను తేలేడు. భవిష్యత్తు ఎట్ల… పెండ్లం పిల్లల ఎట్ల సాదాలే ఉరిపోసుకుని సచ్చేకాలం.
ఆలోచనలు జొర్రీగలోలిగ కమ్ముతుంటే కమల్‌కు దుకాణంల కూసోబుద్దికాలే. ఎటూ తోచక మూర్తి దుకాణం కాడికి పోయిండు.
మూర్తి బండల మీద అక్షరాలు చెక్కుతుండు. ఉరుమురిమి మీద పడ్డా చలించినట్టుగా ఉండు, కమల్‌ను చూసి పలకరింపుగా నవ్విండు.
‘ఏం కమల్ ఎట్ల నడుస్తుంది షాపు’ ఏమి ఎరగనట్టుగా అడిగిండు.
కమల్ గుడ్లల్లో గిర్రున నీళ్లు తిరిగినయ్.
‘ఏం పని సార్. ప్లెక్సీ మిషన్ వొచ్చిన కాన్నించి చేతికి పని లేకుంట అయ్యింది. ఎటు తోయకుంట అయ్యింది’ కమల్ మాటలు వినకుంట అక్షరాలు చెక్కుతుండు బండను పాత గుడ్డతో తూడ్సిండు మూర్తి. అక్షరాలు సరిగ్గా వచ్చినయా లేదా చూసుకుండు. కమల్ గొంతులో తేడాను గమనించిండు కమల్ కండ్లల్లో బతుకు భయం.
‘కమల్! యంత్రాల దెబ్బకు కులవృత్తులు కూలినయ్. దాంట్లెనుంచి బయటపడి ఇట్లాంటి పని చేసుకుంటే ఇక్కడా అవే యంత్రాలు రెక్కలు నమ్ముకొని బతికే బతుకులే ఇంత దిన దినగండం. ఇక ఆయుష్షా… ఎప్పుడు మూడుతదో తెల్వదు.
మాట్లాడుకుంటనే ఉలి, సుత్తి ఆడిస్తుండు మూర్తి కమల్ మాట ముచ్చటలేకుంట ఉంటే మల్లా మూర్తే మాటలందుకుండు.
‘నువ్వొక్కనివే కాదు అందరి పెయింటర్ల పరిస్థితి కాలాన్ని యంత్రాలనుతట్టుకొని నిలబడాల్సిందే. నన్ను చూడు మీసాలు రాకముందునుంచి ఈ పని చేస్తున్న ఇప్పుడు బ్రష్షు మూలకు వడ్డది ఉలి పట్టుకున్న బండల మీద అక్షరాలు చెక్కడం సరదాకు నేర్చుక్ను ఇప్పుడు అదే నాలుగు పైసలు సంపాయింది పెడుతుంది. శిలాఫలాకలు, సమాధుల మీద బండలు చెక్కుతున్న. ఇది ఎంత కాలం నడుస్తుందీ అంటే…నల్లగొండకు బండల మీద అక్షరాల చెక్కే మిషన్ రానంత వరకు. ఆ తరువాత మల్లా మొదటికే!
కమల్ మొకంలో భయం కొట్టొచ్చినట్లుగా కనపడుతుంది.
‘కమల్ ధైర్యమే మనలబతికిస్తుంది అది పోగొట్టుకోకు’ అక్షరాలు చెక్కడంలో మునిగిపోయిండు మూర్తి.
వణికే కాళ్లతో వెనక్కు మల్లిండు కమల్.
* * *
కమల్ అల్లాడిపోతుండు.చేతికి పనిలేదు. జేబుల పైసలేదు. ఇంతకు ముందు నల్లగొండల మీటింగులైతై గోడల మీద రాయించెటోళ్ళు. ఇప్పుడది కూడా ప్లెక్సీలే.
మూడు నాలుగు నెల్లకే ఇంకో రెండు మిషన్లు దిగినయ్.
కమల్ దుకాణాన్ని కస్టమర్లు మర్చిపోయిండ్రు.
ఆర్నెల్ల సంది దమ్మిడి అదాలేదు. మడిగె కిరాయి బకాయిపడ్డది. చూసీ చూసి మడిగె యజమాని ఓనాడు చెడాపడా దులిపిండు.
‘చాతగానోనివి ఎందుకు పెట్టుకోవాలే. ఎల్లక పోతే ఖాళీ చేసి దొబ్బెయ్యాలె. ఇంకోడన్న వస్తడుగా మడిగలకు ‘ అన్నడు.
ఊపిరి మెసలకుంట వెంటపడుతుంటే ఇంక తట్టుకోలేక దుకాణం ఖాళీ చేసిండు కమల్. దుకాణంతోపాటే ఇల్లు.
* * *
కమల్‌కు చీకటి కమ్మినట్లుగా అయ్యింది. ఎటుపోవాలె…తన బతుకు తోవ ఎదీ…
దిగులు ….దిగులు…
టివీ ఒకటే చెవికోసిన మేకోలిగ మొత్తుకుంటుంది. అప్పటికే చాలారాత్రి అయ్యింది. బైట సడీసప్పుడు లేదు.
వాహనాల సప్పుడు కూడాలేదు. భార్య పిలగాడు ఎప్పుడో నిద్రపోయిండ్రు.
టివీ బంద్ చేసిండు కమల్. పక్కమీద అటు ఇటు పొర్లిండు.
ఎంతసేపు పొర్లిండో…
నడిజాము… తెల్లవారుజాము…
కంటిమీద కునుకు లేదు…
March 1st, 2009 at 10:30 pm
[...] తెల్లారింది… : ఎలికట్టె శంకర్‌రావు [...]
November 22nd, 2010 at 3:58 am
అభినందనలు.