Mar2009
బతుకు మెట్లు
అప్పుడు
నాకు ఆరేళ్ళ వయస్సునుకుంటాను
అప్పుడే రెక్కలు విప్పుకున్న తుంటరి తూనీగలా
అమ్మను చుట్టేసి అన్నాను…
“అమ్మా నేను పెద్దాడినైపోయాను”…
ఇప్పటికీ మరుపుకురాదు
ఆనాటి అమ్మ పెదవుల మీద వెలిగిన మురిపెపు హాసం
“చిన్ని కన్నా!” అని
వెన్నకుండలా
నన్ను కౌగిలించుకున్న దృశ్యం
“పదహారేళ్ళు నా నెత్తిమీదకొచ్చినా
ప్రతిదానికీ నామీద ఇంకా నీ పెత్తనమా?”
రోషంతో ఎరుపెక్కిన
నా గులాబీ నేత్రాలలో సునామీని కని
“సారీరా కన్నా..!” అని
వెన్నెల కవ్వంలా నన్ను ఊపిన అమ్మను చూసి
నా నూనూగు మీసాలు
ఊపిరి పీల్చుకున్నాయి
ఆనాడు గర్వంతో…
అమ్మ నెత్తుటి త్యాగాల్ని తాగుతూ..
ఆమె గుండెల్లో నిక్షిప్తమై నిశ్శబ్దమైపోయిన
ఆమె కోరికల్ని గుర్తించకుండా
పాతికేళ్ళు దాటిన మరు సంవత్సరంలోనే
పెళ్ళికొడుకునయ్యాను.
కొత్త భార్యతో తొలి రోజుల మైకం…
మలిరోజుల్లో
తల్లికి ఇల్లాలికి మధ్య కలహాలు తీర్చలేని దౌర్బల్యం…
తనని కూతురి ఇంటికి తోలేసినప్పుడు
ఎదురైన అవమానాన్ని
ఎండిన కనురెప్పల వెనుక వేలాడదీసి,
చేతికర్ర కావాల్సిన నన్ను క్షమించేసి,
వేదన లాంతరు పట్టుకొని వలస పోయిన
అమ్మ ఔన్నత్యం… గుండె కవాటంలో దాక్కుని
నన్ను ఈనాటికీ స్పృశిస్తూనే వుంది.
ముప్పయి ఆరేళ్ళ వయస్సు…
ఎదిగిన బిడ్డలతో మీదపడ్డ బాధ్యతల ఉషస్సు…
భార్య కోరికలు తీర్చడంలో పెరిగిన అప్పుల యశస్సు…
“రుణదాతల మోచేతి పాయసం చేదు నాయనా!”
అన్న అమ్మమనస్సు
అవన్నీ..
మనసుపొరల్లో ఎప్పటికీ మాసిపోని మరకలు
నలభయ్యవ పడిలో సగం జరిగిపోయిన ప్రాయం
సీతాకోక చిలుకలై పిల్లలు ఎగిరిపోయిన దృశ్యం…
“కాలం గాయాన్ని మాన్పుతుందిలే నాన్నా!”
అన్న అమ్మ అనుభవం…
ఇవీ…
తవ్వుకునే కొద్దీ ఊరే గుర్తులు
సగం జీవితకాలం అయిపోయిన నేపథ్యంలో…
రేపో మాపో రిటైర్ అవబోతున్న వర్తమానంలో…
మిగిలినవి..
రుణదాతల శాపనార్థాలు…
తల్లి శోకాలు,
ఇల్లాలి సాధింపులు,
అన్నిటికీ ఒంటరి పోరాటం…
ఆదుకునే హస్తం కావాలనే ఆరాటం..
అప్పుడు అర్థం కాలేదు గానీ…
పదహారేళ్ళకే పెత్తనం కావాలని…
ఎంత పరితపించాననీ.
అరవై ఆరేళ్ళ బతుకు పుస్తకం తెరిచి
అమ్మ అనురాగపు అక్షరాల్ని చదువుకుంటున్నాను
అమెరికాకు అమ్ముడు పోయిన
అవిటి బంధాల కోసం వలసపోయిన
శ్రీమతి ఒడి అందక అల్లాడుతున్నాను
ఇది నిలువెత్తు నిజం,
ఇప్పుడు నేను..
అదును తప్పి వేసిన పంట రాలేదని వాపోయే రైతును,
పశ్చాత్తాపపు ఊచల వెనక ఖైదీని.
నామీద అంధకారం అద్దకం వేసే ఈ వేళ..
కావాలన్నా విన్పిస్తాయా అమ్మజోలపాటలు?
జాలి జోలిలో జ్ఞాపకాల తూకాలు తప్ప
March 2nd, 2009 at 5:51 pm
చాలా భాగుంధి
March 3rd, 2009 at 2:28 pm
Wonderful, moving, truthful depicting the current status in the wheel of time…..
April 18th, 2009 at 4:49 am
very nice and hear touching poem. congratulations: ethakota