Mar2009
చరిత్ర పూసిన పువ్వు
నల్లజాతి కలువా,
నాలోని ఆత్మగౌరవ పతాక!
నీ విజయానికి మా దళిత దండాలు.
ఈ కాలం నీది, కొంత నాది,
ఇంకొంత మన అస్తిత్వ గొంతుకలది.
మొత్తంగా మొనగాళ్ళదీ కాలం,
దీన స్వరాలది.
1
చరిత్ర ఎప్పుడూ
తెల్ల తోలు మంచు పర్వతాలదే కాదు,
పడిలేచే కెరటాలది కూడా.
నీ విజయ రహస్యాన్ని
మాక్కూడా కొంచెం పంచు.
నడుములు వంగిపోయి, అడుగేయలేక పోతున్న
నా దళిత బహుజనులకు
ఒక ప్రైవేట్ క్లాస్ తీస్కో !
నీ పోరాట పటిమతో కూడగట్టిన
అనుభవ మోపునుండి కొంత పరిగెను
మా కోసం వదిలిపో.
2
నువ్విప్పుడు ….!
కోట్లాది గుండెల్లో
రేపటి ఆశల రూపానివి.
అంతరాల్ని గెలిచి,
అనుమానాల్ని పటాపంచలు చేసిన
ఔన్నత్యం నీది.
శ్వేత సౌధంలో
నీ పవిత్ర నల్ల పాదాలను మోపి
దాన్నొక సారి పావనం చెయ్ .
వివక్ష లేని సమాజం కోసం
తెల్ల చట్టాలను నీ పొగ చుట్టలు చేసుకో.
యుద్దాలు లేని లోకం కోసం
ఒక అత్యవసర యుద్ధాన్ని ప్రకటించు.
3
ఒబామా …. ఒబామా ….
గ్లోబ్ మీద దేశాల గోస నొక సారి
కండ్లారా చూసిరా.
శ్వేత సౌధం తెల్లబిడ్డల దురాగతాలకు
అసువులు బాసిన
అర్జెంటినా అన్నదాతల పెండ్లాం పిల్లలకు
బంధువై పరామర్శించిరా.
కాలిన పేగు కమురు వాసన
ఆఫ్ఘన్ తల్లుల ఆక్రందన విను.
ఏ పాపం చెయ్యకుండానే
కాళ్ళు, చేతులు పోగొట్టుకున్న
ఇరాక్ పసిబాలుడి ఇంటిదాకా పోయిరా.
వస్తూ.. వస్తూ..
ఆఫ్రికా గుండెల జెండై ఎగసిన
మన తాత ‘మండేలా’ ను పలకరించిరా.
4
మా వూరి పోషవ్వ తల్లి మీదొట్టు…!
నీ ముందటోళ్ళ
అడుగుల్ల అడుగేయబోకు.
పేరు పెగ్గెలు లేకుంటమాయె గాని
మచ్చ రాకుండ….
మబ్బు పట్టిన ఆకాశమై
జనం గుండెల్ల నిలువు.
ఎత్తుల జిత్తుల తెల్లనక్కల నడుమ
జరంత తెలివి తోటి ఉండు.
- (అమెరికా కొత్త అధ్యక్షుడిగా బారక్ ఒబామా గెలుపుకు స్పందిస్తూ…)
K.Rohiniprasad Mar 6, 2009 1
ఆవేశం, భావాలూ బాగానే ఉన్నాయి కాని ఒబామాకూ, మన దళితులకూ చాలా తేడా ఉందని మరిచిపోవద్దు. మన ‘కంపు’ లో వర్గాలూ,కులాలూ రెండూ బలమైనవే.
GURRAM SEETARAMULU Mar 17, 2009 2
కవిత బాగుంది కాకుంటే
బారత దెసానికి దలితుడూ ప్రదాని అయితె
యెలగొ
ఒబామా కుడా అంతె ఒబామా వల్ల్ నల్ల వాల్లకు యెమీ ఒరగదని
ముకొమా గుగీ యెప్పుడో రాసాడూ ……..
janardhan Jul 24, 2009 3
ఇది సాహిత్యానికి పునరుజ్జివనం. నా రచనలు కూడా పంపుతాను. మెయిల్ చేస్తున్నందుకు ధన్యవాదాలు