జ్ఞాపకశక్తి

మనిషి మెదడుకు ఉండే అనేక అద్భుత శక్తుల్లో సమాచారాన్ని పొందుపరుచుకోగలగడం ఒకటి. మన ఘనాపాఠీలు ఎన్నెన్నో వేదమంత్రాలను ఏకరువు పెట్టగలరు. టర్కీలోని ఒక వ్యక్తి 6 గంటలపాటు కురాన్‌లోని 6666 సూక్తులను అనర్గళంగా వల్లించగలడు. మంగళూరుకు చెందిన రాజన్‌ మహాదేవన్‌ గణితంలో 3.14… అని అనంతంగా సాగిపోయే “పై” సంఖ్యను 31,811 స్థానాల వరకూ ఖచ్చితంగా చెప్పగలడు. ఇంతగా కాకపోయినా మనంకూడా రోజువారీగా బోలెడన్ని విషయాలను గుర్తుపెట్టుకో గలం. ఏదైనా మరిచిపోయినప్పుడు మనకు విసుగు పుడుతుంది; అయితే కొందరిని మతిపరుపు ఒక రుగ్మతగాకూడా బాధిస్తుంది. జ్ఞప్తి అనేది న్యూరాన్‌ నాడీకణాల మధ్య తిరుగులేని విధంగా సంపర్కం ఏర్పడి నమోదయే ప్రక్రియవంటిది.

కేవలం జ్ఞప్తి ఆధారంగా మాగ్నానీ గీసిన చిత్రం, ఆ స్థలం ఫోటో

అరుదుగా కొందరు ఈ విషయంలో మానవాతీతం అనిపించే శక్తులు ప్రదర్శిస్తారు. 1958లో పాతికేళ్ళ వయసులో ఫ్రాంకో మాగ్నానీ అనే చిత్రకారుడు తన స్వస్థలమైన ఇటలీనుంచి అమెరికాకు వచ్చి స్థిరపడ్డాడు. మరొక ఎనిమిదేళ్ళకు అతనికేదో పెద్ద జబ్బు చేసినప్పుడు అతనికి తమ గ్రామాన్ని గురించిన కలలు రాసాగాయి. ఎన్నెన్నో వివరాలతో కూడిన దృశ్యాలు అతన్ని రోజంతా మానసికంగా వెంటాడడంతో అతను వాటిని చిత్రీకరించడం మొదలుపెట్టాడు. అందులో ఒకటి ఫొటోగ్రాఫ్‌ను సరిగ్గా పోలి ఉండడం అందరినీ నిర్ఘాంతపరిచింది (పటం). అద్భుతమైన జ్ఞాపకశక్తికి ఇదొక అపూర్వమైన ఉదాహరణ.

స్టీవెన్‌ విల్ట్‌షైర్‌, ఒకసారి దృశ్యాన్ని చూడగానే అతను గీసిన బొమ్మ

అలాగే 1987లో ఇంగ్లండ్‌లో అప్పటికి పన్నెండేళ్ళ వయసున్న స్టీవెన్‌ విల్ట్‌షైర్‌ అనే కుర్రవాడి గురించిన వార్తలు వచ్చాయి. ఏదైనా పెద్ద భవంతిని ఒకసారి చూడగానే దానికి వీపుపెట్టి కూర్చుని దాని బొమ్మను సవివరంగా అతను గీసెయ్యడం బీబీసీ టీవీలో ప్రత్యక్షంగా ప్రసారమయింది. ఆ తరవాత కొన్నేళ్ళకు ఇతనికి సంగీతంలోకూడా ప్రావీణ్యం ఉన్నట్టు బైటపడింది. అయితే అతనికి మూడేళ్ళ వయసునుంచీ ఆటిజం అనే రుగ్మత ఉండేది. చిన్నతనంలో మానసికంగా ఎదగకుండా వెనకబడేట్టు చేసే ఈ వ్యాధి వైద్యులకు తెలిసినదే. అతను గీసిన బొమ్మల్లో ఎన్నెన్నో వివరాలు కనబడతాయి (పటం). మొత్తంమీద పై రెండు ఉదాహరణల్లోనూ మెదడు అనారోగ్యానికి గురిఅయింది. సాధారణ పరిస్థితుల్లో ఎవరికైనా ఇటువంటి శక్తులు అరుదే.
అయితే మోనే అనే ఫ్రెంచ్‌ చిత్రకారుడికీ, ప్రసిద్ధ సంగీతకారుడైన మొజార్ట్‌కూ అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉండేదని అంటారు. మనవారిలో ముగల్‌ చక్రవర్తి జహంగీర్‌కు సమకాలికుడైన జగన్నాథ పండితరాయలవంటివారు ఏకసంతగ్రాహి అని పేరుపొందారు. అష్టావధానాలు చేసేవారి ప్రజ్ఞ తెలుగు వారికి తెలిసినదే. 1920లో రష్యాలోని షెరెషేవ్‌స్కీ అనే వ్యక్తికి అసాధారణమైన జ్ఞాపకశక్తి ఉన్నట్టు గుర్తించారు. అతను వందకు పైగా అంకెలున్న సంఖ్యలనూ, అర్థంపర్థంలేని మాటలూ, సంకేతాలూ ఉన్న పెద్దపెద్ద పట్టికలనూ చూడగానే క్షణంలో కంఠస్థం చేసి వప్పచెప్పేసేవాడు. ఇలాంటి 50 పదా లున్న ఒక పట్టికను చూసిన పదిహేనేళ్ళ తరవాతకూడా ఒక్క తప్పులేకుండా చెప్పగలిగాడు. ఇటువంటి అసాధారణ జ్ఞాపకశక్తి ఉన్నవారి విషయంలో చూసినది యథాతథంగా చిత్రం రూపంలో మెదడులో నమోదవుతున్నట్టుగా పరిశోధనలవల్ల తెలుస్తోంది. దీనికి సరైన శాస్త్రీయవివరణ ఇంకా అందుబాటులో లేదు.
పుట్టినప్పటినించీ గిట్టేదాకా మన మెదళ్ళలో అంతులేదనిపించేంత సమాచారం నమోదవుతూ ఉంటుంది. వీటికి సంబంధించిన అనేక విషయాలూ, పేర్లూ, ముఖాలూ, శబ్దాలూ, వాసనలూ, సంఘటనలూ, భావాలూ, అలవాట్లూ ఎన్నెన్నో ఉండవచ్చు. అసలు జ్ఞాపకాలంటే ఏమిటి? అవి ఎలా గుర్తుంటాయి? వాటి సామర్య్థం ఏపాటిది? జ్ఞాపకశక్తిని కోల్పోవడం ఎలా జరుగుతుంది? ప్రతి నాడీ ప్రక్రియలోనూ ఎన్నెన్నో రసాయనాలు విడుదల అవుతున్నప్పటికీ కొన్ని సంగతులు మాత్రమే ఎందుకు మనసులో నిలిచిపోతాయి? ఇవన్నీ మెదడుకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు.
జ్ఞాపకశక్తి అనేది మనకు కొత్త విషయాలను గురించి తెలుసుకోవడానికీ, వాటిని మననం చేసుకుని అవసరమైనప్పుడల్లా గుర్తుకుతెచ్చుకోవడానికీ పనికొస్తుంది. స్మృతుల వల్లనే మనం చేసేసిన పనులగురించీ, నేర్చుకున్న విషయాలగురించీ మెదడు పునరాలోచన చెయ్యగలుగుతుంది. జ్ఞాపకశక్తి ఉండడం వ్యక్తిగతంగా మనకు చాలాముఖ్యం. దానివల్లనే మనకు ఆత్మజ్ఞానమూ, మన వ్యక్తిత్వం గురించిన అభిప్రాయాలూ, మన చరిత్ర గురించిన అవగాహనా, ప్రపంచజ్ఞానమూ ఏర్పడతాయి. మనం పుట్టకమునుపే గర్భంలో ఉన్నప్పుడు మొదలయే జ్ఞాపకాలు “మనం ఎవరం?” అనే స్పృహకు కారణ మవుతాయి; ఇవాళ్టి “నేను”కూ, రేపటి “నేను”కూ, ఇరవయ్యేళ్ళ తరవాతి “నేను”కూ సంబంధం కలుపుతాయి. ఏ ప్రాణికయినా జ్ఞాపకశక్తి లేనటువంటి జీవితాన్ని ఊహించుకోవడమే కష్టం. దాదాపుగా మనం చేసే పనులన్నిటిలోనూ జ్ఞాపకశక్తి అవసరమౌతూనే ఉంటుంది; ఇతరులతో సంపర్కమూ, సంబంధ బాంధవ్యాలూ, మనం తిరిగే ప్రాంతాలూ, సమస్యలకు పరిష్కారాలూ అన్నీ ఏదో ఒక విధంగా దానిమీదనే ఆధారపడతాయి. భూతకాలాన్ని గురించిన అవగాహనే లేకపోతే మనకు భాషలు అర్థం కావు; బంధువులూ, సన్నిహితులుకూడా గుర్తుండరు; దుస్తులు ధరించడంవంటి రోజువారీ పనులు కూడా ఎప్పటికప్పుడు కొత్తగా అనిపిస్తాయి; ఏదీ గుర్తుపెట్టుకోలేని వ్యక్తులు త్వరలోనే అంతరించి పోతారు. ఎందుకంటే వివిధ సంఘటనల మధ్యనుండే సంబంధాలు వారికి అర్థంకావు. అందువల్లనే జ్ఞాపకశక్తి మన జీవితాలకు ఆధారం. అసలు జ్ఞాపకశక్తి అనేది కేవలం గతాన్ని గుర్తు చేసుకునేందుకే కాదనీ, భవిష్యత్తును గురించి అర్థం చేసుకునేందుకు ఎక్కువగా పనికొస్తుందనీ కొందరి ఉద్దేశం.
మనిషి అయినా, ఇతర ప్రాణి అయినా సమాచారాన్ని సంకేతరూపంలో స్వీకరించి, కొంతకాలం పాటు మనసులో భద్రపరుచుకుని, అవసరమైనప్పుడల్లా తిరిగి పొందే ప్రయత్నం చేస్తాయి. ఈ తిరిగి పొందే ప్రక్రియ ఖచ్చితంగానో, అస్పష్టంగానో ఉంటుంది కనక కొన్ని జ్ఞాపకాలు తక్కినవాటికన్నా బాగా గుర్తుంటాయనిపిస్తుంది. పైన చెప్పిన ప్రక్రియల్లో ఏది అపసవ్యంగా జరిగినా మనం జరిగినది మరిచి పోతాం. గుర్తున్నవాటిలో కొన్ని ప్రస్తుతకాలానికి సంబంధించినవీ, మరికొన్ని ఎంతో పాతవీ కావచ్చు. ఎటొచ్చీ మనం నిరంతరమూ అసంఖ్యాకమైన అనుభవాలకు లోనవుతూ ఉంటాం. అలాంటప్పుడు మన మెదడు ఇన్ని విషయాలనెలా గుర్తు పెట్టుకుంటుందనిపిస్తుంది కాని నిజానికి అది వదిలేసే సమాచారమే ఎక్కువ. సామాన్యంగా మనం గుర్తుంచుకుంటున్న విషయాలను గురించి కొంత మనకు ముందే తెలిసిఉన్నట్టయితే వాటిలోని లోటును ప్రస్తుతం గమనిస్తున్నవాటితో భర్తీ చేసుకుంటూ ఉంటాం.
జ్ఞాపకశక్తికీ, మనం నేర్చుకునేవాటికీ దగ్గర సంబంధం ఉంటుంది. ఇందులో కొన్ని అనుభవం లోకి వస్తున్న క్షణంలో అవగాహనకు వస్తాయి. అనుభవం పూర్తయి కొంతకాలం గడిచాక మననం చేసుకోగలిగిన విషయాల గురించే జ్ఞాపకశక్తి ప్రస్తావనకు వస్తుంది. వీటిలో కొన్ని విషయాలు గుర్తుంటే మరికొన్ని గుర్తుండవు. నేరవిచారణ జరుగుతున్నప్పుడు దోషిగా నిలబడ్డ వ్యక్తి ప్రాణం సాక్షి జ్ఞాపకశక్తి మీద ఆధారపడే అవకాశం ఉంటుంది. మనకు బాగా అలవాటయిపోతుంది కనక జ్ఞాపకశక్తిని గురించి పెద్దగా పట్టించుకోం. అయితే ఇదంత సామాన్యవిషయం కాదు. జీవపరిణామంలో తలెత్తిన జ్ఞాపకశక్తి గురించిన విశేషాలెన్నో ఉన్నాయి.
మనం మతిమరుపు అనేదాన్ని పెద్ద జాడ్యంగా భావించం. ఎవరికైనాసరే కొన్ని విషయాలు బాగా గుర్తుంటాయి; మరికొన్ని గుర్తుండవు. తాము చెప్పేది తమ భర్తలు ఎన్నడూ వినిపించుకోరనే ఫిర్యాదుచెయ్యని భార్యలు అరుదే. శ్రద్ధగా వినని సంగతులు ఆతరవాత గుర్తుకు రాకపోవడం సహజమే. “ఒక చెవితో విని రెండో చెవితో బైటికి వదలడం” అనేది అశ్రద్ధకు సంకేతం.
పద్యాలైనాసరే, ఎక్కాలైనాసరే వినబడేట్టుగా అనేకసార్లు వల్లెవెయ్యడం కంఠతా పట్టడానికి తోడ్పడుతుంది; ఇది ఒకే విషయాన్ని పదేపదే వినడంతో సమానం. ఫోన్‌ నంబర్‌వంటిది ఎవరైనా మనకు చెప్పగానే ఒకసారి పైకి అనుకుంటే రాసిపెట్టుకునేంత వరకూ గుర్తుంటుంది. లేకపోతే పొరబాట్లు జరగవచ్చు. మనస్తత్వాన్నిబట్టి కూడా కొన్ని తేడాలుంటాయి. లెక్కలు సరిగ్గా రానివారు సైతం ఏ క్రీడా రంగంలోనో మరీ ఆసక్తి ఉన్నట్టయితే ఎప్పుడెప్పుడు ఏవేం ఆటల ఫలితాలు ఎలాంటివో పొల్లు పోకుండా అంకెలతో సహా చెప్పేస్తూ ఉంటారు.
అలాగే మరపురాని సంఘటనలు కొన్ని మనసులో ముద్రితమైపోతాయి. అతిగా ఆనందాన్నో, దుఃఖాన్నో కలిగించిన సందర్భాల్లో ఏమేం జరిగిందో ఎన్నేళ్ళు గడిచినా కళ్ళకు కట్టినట్టే ఉంటుంది. అది మనకు వ్యక్తిగతంగా సంబంధించని ఏ దేశనాయకుడి మరణమో అయినా ఆ క్షణంలో మనకు కలిగిన అనుభవాలు ఎన్నటికీ మరిచిపోలేనంతగా మనను ప్రభావితం చెయ్యగలవు. ఒక్కొక్కప్పుడు కొన్ని శబ్దాలూ, మాటలూ, వాసనలూకూడా నిద్రాణంగా ఉన్న స్మృతులను మేల్కొలపగలుగుతాయి. దాని వల్ల కొందరు ఏనాటివో జరిగినవన్నీ ఖచ్చితంగా గుర్తుచేసుకోగలరు. ఎటొచ్చీ ఇలాంటివారికి తమ భార్య పుట్టినరోజు తేదీ, ఇంటి తాళాలెక్కడున్నాయో అనే సంగతీ వగైరాలు మాత్రం గుర్తుండకపోవచ్చు.
జ్ఞాపకశక్తిలో హెచ్చుతగ్గులుంటాయి. గదిలోకి వచ్చాక తాము అక్కడికి ఎందుకొచ్చామో గుర్తుకురానివారు చాలామంది ఉంటారు. ఇది అసహజమేమీ కాదుగాని వయసు పెరుగుతున్నకొద్దీ ఈ ధోరణి గురించిన కలత పెరుగుతుంది; ఆల్జ్‌హైమర్‌ వ్యాధివంటిది మొదలౌతోందేమో అన్న భయం కూడా కలుగుతుంది. దీనికి వయసుతో సంబంధం లేకపోలేదుగాని ఎన్నేళ్ళొచ్చినా మానసికంగా చురుకుగా ఉన్నవారికి ఇటువంటి భయాలతో పని ఉండదు.
మనకు గుర్తుండే విషయాల్లో వ్యక్తుల పేర్లూ, సంఖ్యలూ, సంఘటనల వివరాలూ ఒకరకమైతే, మనం నేర్చుకున్నవీ, అనుభవంలోకి వచ్చినవీ మరొకరకం. రెండోరకానికి చెందినవాటిలో సైకిల్‌ తొక్కడం, క్రీడలు ఆడడం, పద్ధతి ప్రకారం పనులు పూర్తి చెయ్యడం వగైరాలుండవచ్చు. తాత్కాలిక మనిపించే జ్ఞాపకశక్తి నిన్నామొన్నటి విషయాలకు పనికొస్తే దీర్ఘకాలికమైనది ఏళ్ళనాటి అనుభవాలను గుర్తుకు తేగలదు.
జ్ఞాపకశక్తిని గురించి ఎన్నో శాస్త్రీయ పరిశోధనలూ, పరిశీలనలూ దశాబ్దాలుగా జరుగుతూనే ఉన్నాయి. కొందరి లెక్కన జ్ఞాపకాలనేవి తక్షణపరిస్థితుల ప్రభావాలమీదా, అవసరాలమీదా, కోరికల మీదా ఆధారపడతాయి. వాటి వెంట అనుభూతులూ, ఉద్వేగాలూ ఉండే అవకాశముంటుంది. జ్ఞాపకం పెట్టుకుంటున్నామనే విషయం తెలుస్తూఉంటుంది. మనసుకు ఎక్కువ క్షోభ కలిగించేవి బాగా గుర్తుం డవచ్చు.
గుర్తున్నవన్నీ నిజంగా జరిగాయని చెప్పలేము. ఇతరులు చెప్పే కొన్ని విషయాలు అప్పు డప్పుడూ మన జ్ఞాపకాల్లోని లోటును భర్తీ చేసినట్టుగా అనిపిస్తాయి. నేరవిచారణ వంటిది జరుగు తున్నప్పుడు పోలీసులు సాక్షికి ఎవరిదైనా ఫోటోను ముందుగా చూపించి, ఆ తరవాత అనుమానితుణ్ణి వరసలోని వ్యక్తుల మధ్య గుర్తించమంటే సాక్షిమీద ఆ ప్రభావం ఉండవచ్చు. అలాగే కొందరికి కొన్ని విషయాలు బాగా గుర్తున్నట్టనిపించినప్పటికీ అవన్నీ నిజం కాకపోవచ్చు. ఇటువంటిది ముఖ్యం అయిన సందర్భాల్లో దాన్ని రూఢిపరిచే ఇతర సాక్ష్యాలపైకూడా ఆధారపడాలి. ప్రత్యేకసందర్భాల్లో తెలిసో, తెలియకో ఎవరికైనా సమాచారం అందజేసినప్పుడు వారు దాన్ని తమ పూర్వజన్మల స్మృతులుగా పొరబడే అవకాశంకూడా ఉంటుంది.

ఎలుకలతో ప్రయోగాలు

జ్ఞాపకాల సంగతి కేవలం మనస్తత్వనిపుణులకే పరిమితం కాదు. శరీరశాస్త్రం దృష్య్టా జ్ఞాపకాలనేవి మన మెదడులో ఎక్కడుంటాయి? కొన్ని ప్రయోగాల్లో ఎలుకలను తికమక దారుల్లో పరిగెత్తించి సరైన మార్గాన్ని వెతుక్కునేందుకు ప్రేరణలనిస్తారు (పటం). ఎలుకలు మొదట్లో అయోమయానికి లోనయినా త్వరలోనే బైటకు తప్పించుకునే దారిని తెలుసుకుని గుర్తుంచుకోగలుగుతాయి. ఆ తరవాత మరిచి పోవు. శస్త్రచికిత్సద్వారా అటువంటి ఎలుకల మెదడులో వేరువేరు భాగాలను తొలగించినప్పటికీ వాటి జ్ఞాపకశక్తి కాస్తోకూస్తో మిగిలే ఉంటుందని తెలిసింది. దీన్ని బట్టి మెదడులో జ్ఞాపకాలు పొందుపరుచు కునేందుకు ప్రత్యేక స్థలమేమీలేదనీ, మెదడులోని వివిధభాగాలు ఇందుకు పనికొస్తాయనీ తెలుస్తోంది. వీటిమధ్య ఏర్పడే లంకెల్లోనే జ్ఞాపకాల సంకేత నిర్మాణం జరుగుతూ ఉంటుందని ఊహిస్తున్నారు. ఈ లంకెలు ఎంత బలవత్తరంగా ఉంటే జ్ఞాపకాల ప్రభావం అంత గట్టిగా ఉంటుంది.

1. అమిగ్డలా, 2. హిపోకేంపస్‌

మెదడుకు మూర్ఛరోగంవంటివి వచ్చినవారిమీద దశాబ్దాలుగా జరుపుతున్న శస్త్రచికిత్సల వల్ల మెదడులోని అమిగ్డలా, హిపోకేంపస్‌ తదితరభాగాలు జ్ఞాపకాల విషయంలో ప్రధానపాత్ర నిర్వహిస్తా యని తెలుస్తోంది (పటం). మెదడును చిత్రీకరించే అధునాతన పద్ధతుల్లోకూడా ఈ సంగతి తెలియ వస్తోంది. మనిషి స్పృహలో ఉన్నప్పుడే జరిపే ఇటువంటి పరిశీలనల్లో చురుకుగా పనిచేస్తున్న మెదడులోని భాగాల్లో నాడీప్రక్రియలు ఎక్కువవడం, అక్కడికి ఎక్కువ రక్తం ప్రవహించడం జరుగు తాయి. నుదుటిభాగాన మెదడులో ఉండే లలాటికలంబికలో సమాచారం నమోదవుతున్నప్పుడు ఎడమవేపునా, గుర్తుకుతెచ్చుకుంటున్నప్పుడు కుడివేపునా ప్రక్రియలు ఎక్కువవుతాయని తెలుస్తోంది. ఏదైనా మరిచిపోయిన విషయాన్ని గుర్తుచేసుకుంటున్నప్పుడు నుదుటిమీద కొట్టుకోవడం దీన్నిబట్టి అంత అర్థంలేని పని కాదనిపిస్తుంది.
నాడీకణాలను పరిశీలిస్తునప్పుడు జ్ఞాపకశక్తియొక్క ఉనికి నాడుల్లోకాక రెండు నాడులను కలిపే సూక్ష్మమైన సినాప్స్‌ అనే ఎడంమీద ఆధారపడుతున్నట్టుగా తెలుస్తోంది. అప్లీసియావంటి సముద్ర జీవులమీద జరిపిన పరిశోధనల్లో వాటికేదైనా కొత్త సమాచారం అందినప్పుడు సినాప్స్‌లో విడుదల అయే జీవరసాయనాల్లో మార్పులు కలుగుతున్నట్టుగా గమనించారు. మరికొన్ని పరిశోధనల్లో పోషక పదార్థమైన గ్లూకోజ్‌, క్లోమంలో విడుదలఅయే ఇన్సులిన్‌ రెండిటికీ జ్ఞాపకశక్తితో ప్రమేయం ఉండవచ్చని తెలుస్తోంది. మామూలుగా అందరికీ ఉండే సెరోటోనిన్‌ అనే న్యూరోట్రాన్స్‌మిటర్‌ కాకుండా అందులో మరొకరకం ఉన్నవారికి స్వల్పకాలికజ్ఞాపకశక్తి కాస్త తక్కువ ఉంటుందని కొన్ని పరీక్షలు తెలుపుతున్నాయి. అలాగే జన్యుపరిశోధనల్లో జ్ఞాపకశక్తికి ఆధారమైన కిబ్రా అనే ఒక జన్యువు ఉన్నట్టుగా తేలింది. ఈ పరిశోధనలన్నీ సామాన్యంగా ఏవో కారణాలవల్ల జ్ఞాపకశక్తికి హాని కలిగినవారికి ఉపయోగపడేందుకు జరుగుతున్నాయి. వీటివల్ల మెదడు పనిచేసే తీరును గురించిన అనేక కొత్త విషయాలు తెలుస్తున్నాయి.

ఒక అభిప్రాయం »ప్రత్యేక వ్యాసాలు, సైన్స్

ఒక అభిప్రాయం

  1. sivaprasad Jul 22, 2009 1

    super but u can write on the newspaper becoz
    all are dont open site kada

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో