Mar2009
కొండాపూర్‌లో తెలంగాణ కైత్వ సభ
- గుర్రం సీతారాములు, ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్
ప్రపంచ తొలి కథకు అడుగులు పడ్డనేల. గుణాఢ్యుని ఘంటంనుండి జాలువారిన బృహత్కథ అడుగుపెట్టిన శాతవాహనుల టంకశాల. హైదరాబాద్‌కు కొద్ది దూరంలో, మెదక్ జిల్లాలోని సంగారెడ్డి కేంద్రానికి 15 కి.మీ. పరిధిలో కొండాపూర్ ప్రాంతం ఉన్నది. అది గొప్ప నాగరికతకు ఆనవాలైన ప్రదేశం. చూడచక్కని వస్తువులు టెర్రాకోట్ మట్టితో చేసిన మదర్ బొమ్మ ఒక గొప్ప కళాఖండం. రోమన్ నాణాలు లభ్యమైన ప్రదేశం అంత గొప్ప సంస్కృతీ నాగరికతలు కలిగిన కొండాపూర్‌లో మంజీరా రచయితల సంఘం ‘తెలంగాణ కైత’ పేరుతో సభను పెట్టి వివిధ జిల్లాల్లోని కవులను, గాయకులను, సాహిత్యాభిలాషులను పిలిచి చక్కని కవిత్వాన్ని వినిపించడానికి పీటవేసింది.
కవిత్వమంటే జాలీగా చదువుకుని హాయిగా ఆనందించే ప్రక్రియలా కాకుండా మనిషి లోపట ఆలోచనల్ని రగిలించేదిగా వుండాలి. శాతవాహనుల కాలంనాటి మట్టి వాసల్ని పీలుస్తూ , సాంస్కృతిక ఆనవాళ్ళమధ్య కవిత్వం సభ జరిగింది. పెద్దరచయితలు, చిన్న రచయితలు అన్న తేడాలు మరిచి అందరూ ఒక్క దగ్గర కూర్చోని, పరిసరాలనుంచి వచ్చిన ప్రజల మధ్య కూర్చోని కవిత్వాన్ని వినిపించడం, వినడం ఒక తియ్యని అనుభూతిని కలిగించింది.
ఈ కార్యక్రమానికి మంజీరా రచయితల సంఘం కవి వేముగంటి మురళీకృష్ణ ఆహ్వానం పలుకుతూ ఒక విలువైన సాహిత్యాన్ని ప్రజలకు అందించాలని కొండాపూర్ చరిత్ర, సాంస్కృతిక వికాసాలకు సంబంధించిన విషయాలను తెలంగాణ ప్రాంతం అంతటా తెలియజేయాలని ఈ కవిత్వ సభను మంజీరా రచయితల సంఘం ఏర్పాటు చేసిందన్నారు. ప్రముఖ తెలంగాణ కవి గాయకుడు దేశపతి శ్రీనివాస్ పాటతో మొదలైన ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రముఖ కవి వఝల శివకుమార్ మాట్లాడుతూ ఇదొక విశేషమైన చారిత్రక సందర్భమని, క్రీ.పూ. 2వ శతాబ్దం నాటి చారిత్రక సాంస్కృతిక సంపదకు చేరువలో ఉండి స్వచ్ఛమైన తెలంగాణ కవిత్వాన్ని ఆస్వాదించడం, గొప్ప అవకాశం, తెలంగాణ సాహిత్య ఉద్యమ ఉధృతికి ఈ సభ తోడ్పడుతుందని, ప్రతి కవి రచయిత, తెలంగాణ జీవన వైచిత్రిని, సాహిత్య సాంస్కృతిక విశేషాలను, సంఘర్షణ ప్రజలకు వివరించాలని ఈ సందర్భంగా కోరాడు.
ఈ కవి సమ్మేళనంలో ప్రముఖ కవి, రచయిత డా. నందిని సిద్దారెడ్డి, కాంచనపల్లి, వి.ఆర్. శర్మ, దాసరాజు రామారావు, విశాల్, ఆర్ క్యూబ్, హరగోపాల్, రూప్‌కుమార్ డబ్బికార్, ఒద్దిరాజు ప్రవీణ్‌కుమార్, సరిగొండ నరసింహరాజు, ఎస్.రవీందర్, గుర్రం సీతారాములు, పసునూరి రవీందర్, కొత్త కవి వడ్లకొండ రమేశ్ తమతమ కవితల్ని వినిపించారు.
అనంతరం జరిగిన కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య పరిశోధకులు సంగిశెట్టి శ్రీనివాస్ ఒక ప్రతిపాదన చేశారు. మెదక్ జిల్లాలో వచ్చిన తొలితరం కథల్ని కలిపి ఒక పుస్తకం ప్రచురించాలని అన్నారు.
ఈ సభలోనే మంజీరా రచయితల సంఘం కొన్ని తీర్మానాలు చేసింది. అవి తెలంగాణ చరిత్రకు ఆలవాలమైన కొండాపూర్ మీద చిన్న పుస్తకం తీసుకురావాలని. తెలంగాణ చరిత్ర సంస్కృతి పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలను రూపొందించాలి. కొండాపూర్‌లో జరిగిన కవిత్వం ఒక పుస్తకంగా తేవాలని, కొండాపూర్ చుట్టుపక్క ప్రాంతాలలో తిరిగి తవ్వకాలు చేపట్టాలని ప్రతిపాదించగా సభ ఆమోదం తెలిపింది. అనంతరం కవుల మందరం కొండాపూర్ చరిత్ర అవశేషాలు దొరికిన ప్రదేశాల్ని తిరిగి తిరిగి చూసి ఇంటి దారి పట్టాము.
అభిప్రాయాలు లేవు »సాహిత్య వార్తలు