Mar2009
కుటుంబంలో సంగీతం
మా నాన్న కుటుంబరావుగారికి ఉండిన సాహిత్యేతర అభిరుచుల్లో శాస్త్రీయసంగీతం ముఖ్యమైనది. ఆయనకు హిందూస్తానీ, కర్ణాటక శాస్త్రీయరాగాలూ, వాటి వివరాలూ తెలుసు. స్వంతంగా నేర్చుకుని హార్మోనియం, దిల్రుబా వాయించేవారు. ఎవరిముందరా ప్రదర్శనలివ్వకపోయినా బాగా పాడగలిగేవారు. చివరిదాకా సంగీతాభిమానం ఆయనకు తగ్గలేదు. రచయితగా పేరు పొందిన వ్యక్తికి ఇతర రంగాలలో ఉండిన అభిరుచి కళాప్రదర్శన స్థాయిని అందుకోకపోతే పాఠకులకు అంత ఆసక్తికరంగా ఉండదు. కాని, ప్రస్తుతం ఆయన శతజయంతి సంవత్సరం (1909-2009) నడుస్తోంది కనక ఆయన వ్యక్తిత్వం లోని ఈ అపరిచిత అంశం గురించి కాస్త ప్రస్తావిస్తాను.

1925లో జరిగిన కొకు మొదటి వివాహం
మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టిపెరిగే పిల్లల మీద ఇంట్లోని వాతావరణం పడడం సహజం. తల్లిదండ్రులకు పిల్లలతో గడపగలిగిన వ్యవధిని బట్టీ, వారి అభిరుచులనుబట్టీ, ఆర్థిక, సామాజిక సందర్భాలనుబట్టీ పిల్లలకు కళల్లో అభినివేశమూ, ఆసక్తీ ఎదిగే అవకాశం ఉంటుంది. వారికి సహజంగా ఉండే శక్తులకు ఈ పరిస్థితులూ, ప్రోత్సాహమూ అనుకూలిస్తే మరింత లాభం కలుగుతుంది. మా నాన్న విషయంలో ఇదెలా జరిగిందో ఊహించడం కష్టం. ఎందుకంటే ఆయనకు అయిదేళ్ళ వయసులోనే తండ్రీ, మరొక అయిదారేళ్ళకు తల్లీ చనిపోయారు. అందుచేత మా నాన్న సహజపటిమకు తోడ్పడినది తెనాలిలోని 1920ల సాంస్కృతిక వాతావరణమే అయుండాలి.
మా నాన్న పుట్టిన కుటుంబనేపథ్యం సాంప్రదాయకంగా ఉండేది. ఆయనకు పదహారో ఏటనే పెళ్ళయింది. ఆ వయసుకే ఆయనకు పాతిక రాగాలు గుర్తుపట్టడం తెలుసు. తనకు సహజంగా ఉన్న సంగీతాభిరుచిని ఆయన స్వయంకృషితో వినికిడిద్వారా అభివృద్ధి చేసుకున్నారు. ‘అందరూ ఆడపిల్లల వెంటపడే వయసులో నాకు సంగీతం పిచ్చి పట్టుకుంది’ అని మా నాన్న నాతో అన్నారు. 1972-75 ప్రాంతాల్లో బొంబాయి చెంబూరులో నేను తెలుగుసాహిత్యసమితి మెంబర్లను కలుసుకుంటూ ఉండే రోజుల్లో కస్తూరి శ్రీనివాసరావు అనే ఒక పెద్దాయన తగిలాడు. ఈయన తెనాలిలో మా నాన్నకు పొరుగింట్లో ఉండి 1927 ప్రాంతాల తాను కుర్రాడుగా ఉన్నప్పుడు ఆయనను చూస్తూ ఉండేవాడట. ‘మీ నాన్న ఆ రోజుల్లో అస్తమానం వాళ్ళింటి బైట చెట్టుకింద కూర్చుని హార్మోనియం వాయించుకుంటూ ఉండేవాడు’ అని నాతో అన్నాడు. ఆయనకు హార్మోనియం ఎవరైనా నేర్పారో, తనే నేర్చుకున్నారో తెలియదు. ఆయనకు అది బాగా వచ్చునని మాత్రం చెప్పగలను. ‘జిలుగు’ పద్ధతిలో కార్డ్ ప్రోగ్రెషన్ల జోలికి పోకుండా అనుస్వరాలతో, గమకాలతో వాయించేవారు.

దీనానాథ్ మంగేశ్కర్, బాలగంధర్వ, రఘురామయ్య
తన చిన్నతనంలో ఆనాటి ప్రసిద్ధ కర్నాటక విద్వాంసుల కచేరీలన్నిటికీ ఆయన హాజరయే వారు. శంకరశాస్త్రిగారి తండ్రి ఈమని అచ్యుతరామశాస్త్రిగారి వీణ కచేరీకూడా విన్నానని చెప్పారు. తనకు స్వరజ్ఞానం పుట్టుకతో రాకపోయినప్పటికీ సాధనద్వారా నేర్చుకున్నానని చెప్పారు. (మా అబ్బాయి కార్తిక్ విషయంలోకూడా ఇదే జరిగింది). చిన్నప్పటినుంచీ సంగీతం వినడం, వినే అవకాశాలను అన్వేషించడం చేశారు. దీనికి సంబంధించిన తన చిన్నప్పటి అనుభవాలను అనేక వ్యాసాల్లో వివరించారు. పార్శీ, ధార్వాడ నాటక ప్రదర్శనల్లోని ఉత్తరాది బాణీలూ, మరాఠీ ‘నాట్య సంగీత్’ను అనుకరించే తెలుగు పాటలూ, ఆ తరవాత మొదలైన తెలుగు పద్యనాటకాలూ, వీటన్నిటి గురించీ రాశారు. మరొకవంక మరాఠీ నాటకాల్లో కర్ణాటక కీర్తనలకు అనుకరణలు రావడం, ‘మెలోడిఫై’ అయిన ఆ ట్యూన్లను మళ్ళీ తెలుగువాళ్ళు తమ నాటకాల్లో కాపీ కొట్టడం మొదలైన అంశాలను ప్రస్తావించారు. అప్పటి నాటకగీతాల రచయిత పాపట్ల లక్ష్మీకాంతయ్యనూ, అనేక నటగాయకుల పేర్లనూ ప్రస్తావించారు.
ప్రసిద్ధ మరాఠీ స్టేజిగాయకుల సంగీతాన్ని తానెలా డిస్కవర్ చేశారో బాలగంధర్వను గురించిన వ్యాసంలో రాశారు. “ఆంధ్రగంధర్వ”గా ఆ రోజుల్లో పేరుపొందిన జొన్నవిత్తుల శేషగిరిరావు (నేటి సినీ రచయిత తాతగారు), కల్యాణం రఘురామయ్య (ప్రతిసారీ ఈలపాట గురించి ప్రస్తావించడం నా లెక్కన ఈ గొప్ప గాయకుడికి అవమానమే) తదితరులతో మా నాన్నకు వ్యక్తిగత పరిచయం ఉండేది. దీనానాథ్ మంగేశ్కర్ ఉగ్రమంగళ్ అనే నాటకానికి పాడిన ఒక పాట రికార్డు మా నాన్న తన గ్రామొఫోన్‌మీద మోగించగా 42 సార్లు విని, మతి పోగొట్టుకున్నంత పనిచేసిన రఘురామయ్య అర్ధరాత్రి మళ్ళీ తలుపుతట్టి ఇంట్లోకొచ్చి మరొకసారి వినిపించమని ప్రాధేయపడ్డాడంటే రఘురామయ్య సంగీతానికి 1930కి ముందే పునాది ఏర్పడిందని ఊహించవచ్చు. ఎందుకంటే ఈ పాటలో రఘురామయ్య బాణీకి మూలాలు వినబడతాయి. పాడడంలో తాన్‌సేన్ కాకపోయినప్పటికీ వినడంలో మటుకు మొదటి నుంచీ మా నాన్న ‘కాన్‌సేన్’ అనిపించుకున్నారు.
విజయనగరంలో మా నాన్న బి.ఏ. చదువుతున్నప్పుడు ద్వారంవారి కచేరీలు జరిగేవి. అప్పట్లో ఏడేళ్ళ కుర్రవాడుగా, ఆయనకు శిష్యుడుగా ఉంటూ, ఇతరత్రా ప్రాడిజీ అనిపించుకున్న సాలూరు రాజేశ్వరరావు చేత అతని తండ్రి సన్యాసిరాజు తన అనుమతి లేకుండా కచేరీ చేయించాడని తెలిసి కోపగించిన నాయుడుగారు, ఆ మర్నాడు ‘ఏరా, నువ్వూ నా అంతవాడివైనావుగా, నీకిక నేను నేర్పేదేముంది?’ అని రాజేశ్వరరావును పంపేశారట.
ఆ తరవాత బెనారెస్‌లో ఎం.ఎస్‌సీ. చదవడానికి వెళ్ళినప్పుడు మానాన్నకు ఉత్తరాది సంగీతం ప్రత్యక్షంగా వినే అవకాశాలెన్నో లభించాయి. అక్కడ తొలిసారిగా ఆయన పాట నేర్చుకునే ప్రయత్నం చేశారట. టీచరు నేర్పిన మొదటి పాఠం వెంటనే సరిగ్గా వప్పజెప్పి, రెండోది నేర్పమన్నారట. అదీ పాడి, తరవాతిది నేర్పమన్నారట. ఇటువంటి స్టూడెంటును ఏం చెయ్యాలో తెలియని ఆ టీచరు ‘ఇక నీకు నేర్పను పొ’మ్మన్నాడట. ఆ తరవాత అటువంటి ప్రయత్నాలు కొనసాగలేదు.

1947లో ఉదయ్‌శంకర్, రవిశంకర్, దేవేంద్రశంకర్, రాజేంద్రశంకర్
ఆ రోజుల్లోనే మా నాన్నకు తెలిసిన రాజేంద్రశంకర్ అనే సీనియర్ స్టూడెంట్ ఉండేవాడు. అతను చదువు మానేసి వెళిపోయే ముందుదాకా అతను ప్రసిద్ధ నాట్యకళాకారుడైన ఉదయశంకర్ తమ్ముడని మానాన్నకు తెలియదు. మద్రాసులో ఒక కచేరీలో రవిశంకర్‌తో మానాన్న ఈ పరిచయం గురించి చెప్పారు. తరవాతి కాలంలో రాజేంద్రశంకర్ లక్ష్మి అనే తమిళ హిందుస్తానీ గాయనిని పెళ్ళి చేసుకుని, తన తమ్ముడి సితార్ కచేరీల ప్రయాణ, తదితర సౌకర్యాల కోసం ఏర్పాటుచేసిన సంచారిణీ అనే సంస్థను నిర్వహించాడు.

ఆ రోజులలో మరాఠీ పాటల గురించి మానాన్నకు బాగా తెలుసుగనక నాటకాల్లో హార్మోనిస్టులు ఆయననుంచి ‘మట్లు’ నేర్చుకునేవారట. 1936లో తన మిత్రుడు నిడుమోలు జగన్నాథ్ తీసిన తారుమారు చిత్రానికి కథ రాయటమే కాక కాంచనమాలకు మానాన్న ఆ ట్యూన్లు కొన్ని నేర్పారట కూడా. చాలాకాలం తరవాత మిస్సమ్మలో సావిత్రి పాడిన ‘మీకు మీరే మాకు మేమే’ అనే పాటకు మరాఠీ ఒరిజినల్ ఉండేది కనక ఆ కంపోజింగ్‌లో మానాన్నకు కాస్త ప్రమేయం ఉంది. మొత్తంమీద మరాఠీ నాటకగీతాల ప్రభావం మానాన్న మీద బాగానే ఉండేది. వారానికొకసారైనా ఆయన హార్మోనియం వాయించుకుంటూ కూర్చునేవారు. తన కిష్టమైన ఏదో ఒక మరాఠీ పాటతో మొదలుపెట్టి క్రమంగా ఆ రాగంలోకి వెళ్ళేవారు. ఆయనకు సంగీతంలో హార్మోనియం టైప్ గమకాలే ఇష్టంగా ఉండేవి. దిల్రుబాకూడా ఆదే పద్ధతిలో వాయించేవారు. సాగదీస్తూ, ఏడుస్తున్నట్టుగా ఉండే సంగీతం ఆయనకు పడేదికాదు.
డిప్రెషన్ కారణంగా చదువు మానేసి, ఉద్యోగాలు దొరకక అవస్థ పడుతున్న రోజుల్లోకూడా మా నాన్న సంగీతాభిమానం తగ్గలేదు. 1942లో బొంబాయిలో దిగగానే దీనానాథ్ మంగేశ్కర్ ఎక్కడుం టాడని అడిగారట. అతను 3 నెలల కిందటే చనిపోయాడని విని ఆయనకు దిగ్భ్రాంతి కలిగింది. (తరవాతి కాలంలో దీనానాథ్ పాటలను ఆయన మూడో కూతురైన ఆశా భోంస్లే యథాతథంగా పాడడం నా నాన్నకు చాలా నచ్చింది. లతా కంటే ఆమె బాగా పాడుతుందనేవారు.) బొంబాయిలో ఆ రోజుల్లోనే నీలంరాజు వెంకటశేషయ్యగారితో కలిసి ఆయన దిల్రుబా నేర్చుకున్నట్టున్నారు. ఒకసారి వాళ్ళిద్దరూ గిర్‌గాఁవ్ వెళ్ళి, ప్రసిద్ధగాయని హీరాబాయి బడోదేకర్‌ను (1905-89) ఆమె ఇంట్లో కలుసుకుని, పాడమని అడిగారట. వెంటనే తంబురా తీసుకుని అరగంట పాడి, ‘బస్?’ అన్నదట. అదే మహాభాగ్యం అనిపించిందట.

హీరాబాయి, ఫయ్యాజ్‌ఖాన్, దిల్రుబా
ఆ రోజుల్లో బొంబాయిలో ఉస్తాద్ ఫయ్యాజ్‌ఖాన్ గాత్రకచేరీలు తరుచుగా జరిగేవి. అందులో ఆయన ప్రేక్షకులతో సరదాగా సంభాషిస్తూ పాడేవాడట. ఒక పాట పాడుతూ కూర్చుని నాట్య భంగిమలు చేస్తే జనం నవ్వారట. ‘దీనికేం నవ్వుతారు? మా ఊళ్ళో ఒకాయన ఎలా పాడతాడో తెలుసా?’ అంటూ ఇంకా మెలికలు తిరిగి జనాన్ని నవ్వించాడట. 1944లో తొలిసారిగా బడేగులాం అనే కొత్త లాహోర్ గాయకుడి కచేరీ ఏర్పాటయిందట. (అదొక చారిత్రాత్మక సంఘటన అనీ, ప్రసిద్ధ గాయకుడు 90 ఏళ్ళ అల్లాదియాఖాన్ హాజరైన చివరి కచేరీ అనీ నేను చదివాను) రెండున్నర రూపాయల టికెట్టుతో రాత్రంతా ఫయ్యాజ్‌ఖాన్ కచేరీ విన్న ప్రేక్షకులు బడేగులాం కచేరీకి మూడున్నర ఇచ్చుకున్నప్పటికీ సరిగ్గా మూడు గంటలే పాడి అయిపోయిందన్నాడట. అతని ప్రచండమైన పటిమ అందరినీ ఆశ్చర్యపరిచిందట.
ఆ తరవాత జైపూర్ మెటల్ ఫాక్టరీలో పనిచేస్తున్నప్పుడు ఎవరింట్లోనో మంచి సితార్ కచేరీ విన్నారట. సితార్ బాణీల్లో ఇప్పుడు ప్రసిద్ధులెవరూ లేకపోయినప్పటికీ జైపూర్‌కు మంచి పేరుంది. 1943లో సిమ్లాలో వార్ పబ్లిసిటీ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నప్పుడు మా నాన్న తెల్లవాడైన తన పై అధికారి వుడ్‌తో కాసేపు ఫస్ట్‌క్లాస్ పెట్టెలో ప్రయాణించారట. పక్క కూపేనుంచి ఒక పరిచితమైన కంఠం ఎవరితోనో ‘ఆవో బేటా ఆవో’ అనడం వినబడిందట. మానాన్న అప్రయత్నంగా ‘ఈజిట్ మిస్టర్ సైగల్?’ అని చూడకుండానే అడిగారట. ‘యస్?’ అంటూ కె.ఎల్. సైగల్ బైటికొచ్చాడట. తానెవరో తెలియక పోయినప్పటికీ సైగల్‌ను ప్రసిద్ధ నటగాయకుడుగా వుడ్‌కు మానాన్న పరిచయం చేశారట. వుడ్ భారతీయసంగీతం గురించి కాస్త విమర్శించడంతో సైగల్ ఆయనకు సుదీర్ఘవివరణ ఇవ్వసాగాడట. డ్రింక్స్ కూడా ఉన్నాయి గనక ఇది ఇప్పట్లో తేలేది కాదనుకుని మానాన్న తన సీటుకు తిరిగి వెళ్ళారట. మానాన్నకు సైగల్ పాటలు చాలా ఇష్టం. రజనీకాంతరావు, మాధవపెద్ది గోఖలే తమ వ్యాసాల్లో మా నాన్న సంగీతాభిమానం గురించి ప్రస్తావించారు.

కె.ఎల్. సైగల్
1945 తరవాత మద్రాసులో స్థిరపడి, 1952నుంచీ చందమామ ఆఫీసులో చేరాక మానాన్న జీవితం కాస్త కుదుటపడసాగింది. ప్రఖ్యాత రచయిత చలంగారి తమ్ముడి కూతురైన మా అమ్మ వరూధినికి కూడా సంగీతమంటే ఇష్టమే. చలంగారికి కాస్త పాడటం వచ్చు. ఆయన చెల్లెలు జానకి అనే ఆవిడ సంగీతం నేర్చుకుందట. ఆమె పెద్ద కుమారుడు (రంగారావు కాదంబరి) లక్నో మారిస్ కాలేజ్‌లో హిందుస్తానీ గాత్రం నేర్చుకుని, సంగీతం టీచరుగా పనిచేస్తూ, ఒక నేపాలీ శిష్యురాలిని ప్రేమించి, పెళ్ళి చేసుకుని, నేపాల్ సంగీతకళాశాలలో అధ్యాపకుడుగా జీవితం చాలించాడు. నన్ను చిన్నతనంలో ఈయన పాట బాగా ఇన్‌స్పైర్ చేసింది. చలంగారి మరొక తమ్ముడు గోపాలరావు కొన్నాళ్ళు సితార్ నేర్చుకున్నాడట. ఆయన భార్యకూడా సంగీతాభిమాని. ఆయన కూతురే ప్రసిద్ధ గాయని వక్కలంక సరళ. మా అమ్మ సంగీతం నేర్చుకోకపోయినప్పటికీ చిన్నతనంలో పాడేది. రజనిగారి దర్శకత్వంలో 1939 ప్రాంతాల మద్రాసు రేడియోలోకూడా పాడింది. ఆవిడకు సాత్వికమైన సంగీతం నచ్చేది కనక మానాన్న అబ్దుల్ కరీంఖాన్ రికార్డ్లు నాలుగైదు కొన్నారు. నేను పుట్టీపుట్టగానే విన్న తొలి సంగీతం అదే. బడేగులాం కాకరూఁ సజ్‌నీ కూడా ఉండేది. ముగ్గురు పిల్లలతో మా అమ్మా నాన్నా తమ సంసారాన్ని సర్దుకునేప్పటికి మా అక్క శాంతసుందరికి ఎనిమిదేళ్ళు వచ్చాయి. శాంతివర్ధన అనే ఒక తెలుగాయన ఆమెకు వీణ నేర్పేవాడు. నేను అప్పటికే ‘సంగీతపిచ్చి’ ప్రదర్శించానట; నా నాలుగోఏట ఏదో పాటకు మాటలు తెలియని చోట స్వరాలతో పాడుకుంటున్నానట. ఆరేళ్ళకు మా అమ్మమ్మ ఏనాడో కొని వదిలేసిన ఒక డొక్కు హార్మోనియం మా ఇంటో ఉండేది. నా అంతట నేనే నేర్చుకుని దానితో తిప్పలు పడుతూ ఉండేవాణ్ణి. అప్పటికే నాకు స్పష్టంగా హిందుస్తానీ సంగీతాభిమానం ఉండేది కనక నేను కర్నాటకం జోలికి పోలేదు. అయినా వినికిడిద్వారా మా అక్క నేర్చుకున్న పాటలన్నీ నాకూ వచ్చేసేవి. వీణ కనక కీర్తనల సాహిత్యం ఇప్పటికీ చాలామటుకు తెలియదు.
1952 ప్రాంతాల మా నాన్న కినిమా మాసపత్రికకు రాస్తున్న రోజుల్లో సినిమా రికార్డింగులకు వెళ్ళి వార్తలు కవర్ చేసేవారు. ‘పి. లీల అనే కొత్త అమ్మాయి’ గురించీ, పెళ్ళిచేసిచూడులో ఘంటసాల వాడిన రాగాల గురించీ అందులో రాశారు. సంగీతంలోకి తిన్నగా ప్రవేశించకపోయినా ఆయన సంగీతాన్ని వదిలి దూరంగా ఎన్నడూ వెళ్ళలేదు. నేను చందమామ ఆఫీసుకు వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి ఆయనతో రికార్డింగ్ స్టూడియోలకు వెళ్ళేవాణ్ణి. ఒకసారి ఘంటసాల ‘ముద్దబంతి పూవులో’ పాడుతున్నారు. రికార్డిస్ట్ వల్లభజోస్యుల శివరాంగారు మా నాన్నకు బంధువూ, పాత మిత్రుడూ కూడా. ఆయన రికార్డింగులు చాలా చూశాను.

1952 ప్రాంతాల ఘంటసాలతో కొకు, పక్కన సినీ హీరో రామశర్మ
మా ఇంట్లోని శాస్త్రీయసంగీతాభిమానం నామీద చాలా బలంగా పనిచేసింది. మా అన్నయ్య రామచంద్రరావు వాహినీ స్టూడియోలో ఎడిటర్ ఉద్యోగం వదిలేసి 1956లో బొంబాయికి వెళ్ళి ఫిల్మ్స్ డివిజన్‌లో చేరాడు. అక్కడే పనిచేస్తున్న మా బాబాయి కృష్ణమూర్తిగారు మానాన్న ఏనాడో కొని ఉంచిన దీనానాథ్, బాలగంధర్వ రికార్డులను ఆయనకిచ్చి మద్రాసు పంపాడు. వాటివల్ల నా వినికిడి కలెక్షన్ అకస్మాత్తుగా పెరిగినట్టయింది. ఒక్కసారి వినగానే నాకు బాలగంధర్వకన్నా దీనానాథ్ పాటలు చాలా గొప్పగా అనిపించాయి. అప్పటికే కర్నాటక రాగాలను గుర్తుపడుతున్న నాకు ఏడో ఏట హిందుస్తానీ రాగాలు అవగతం కాసాగాయి. ఇతరత్రా ఇంట్రోవర్ట్‌గా ఉండేవాణ్ణి కనక సంగీతం నన్ను తీవ్రంగా ప్రభావితం చేసింది. నా బాధ చూడలేక మా నాన్న 1958లో తేనాంపేట వెళ్ళి మదురై ఎన్. పొన్నయ్య నుంచి ఒక డబ్‌ల్ రీడ్ హార్మోనియం కొన్నారు. దానితో నా ఉత్సాహం కట్టలుతెంచుకుంది.

1954లో మద్రాసు విజయా వాహినీ స్టూడియోలో బడేగులామలీ గాత్రకచేరీ. ఆయన కుమారుడు మునవ్వరలీ తంబురా, తమ్ముడు బర్కతలీ హార్మోనియం వాయిస్తున్నారు. ప్రేక్షకుల్లో ఎడమవేపు కిటికీ వద్ద సముద్రాల సీనియర్, పక్కనే బి.ఎన్.రెడ్డి, ఉస్తాద్‌గారికి కుడివేపున ఘంటసాల, ఇంకాస్త వెనకగా గడ్డం కింద చెయ్యి పెట్టుకున్న కొకు.

1956లో మా అన్నయ్య రామచంద్రరావు మోగిస్తున్న గ్రామొఫోన్; వెనకగా నేను, శాంతసుందరి, వీపుపెట్టి కూర్చున్నది మా తమ్ముడు బగ్గీ (1951-57)
క్రమంగా మా ఇంట్లో నేను పడిక్కాద మేదై (చదువుకోని మేధావి)గా గుర్తింపు పొందసాగాను. మా అక్కకి మాత్రం సభాపతి అయ్యర్ అనే ముసలాయన వీణ నేర్పేవాడు. 1960 ప్రాంతాల నాకూ, మా అక్కకీ మా సినిమాపాటల పిచ్చి మొదలైంది. హిందీ, తమిళ పాటలన్నీ ఇంటర్లూడ్స్‌తో సహా పక్కాగా హార్మోనియంమీద వాయించేవాణ్ణి. ఇద్దరం పాడుకునేవాళ్ళం. ఇంటికెవరైనా వస్తే, వాళ్ళకి నిజంగా ఇంట్రస్ట్ ఉందని మాకనిపిస్తే వినిపించేవాళ్ళం. మా అమ్మా నాన్నా పెద్దగా పట్టించుకునేవారు కాదు. సినిమాపాటలని ఇలా ఒక్క తప్పులేకుండా పట్టుకోగలగడం తరవాతి దశల్లో నాకు చాలా పనికొచ్చింది. సైగల్ తరవాతి కాలపు సినిమా పాటలని మా నాన్న అరుదుగా ప్రస్తావించేవారు. అందాజ్ సినిమాకు నౌషాద్ బిలావల్ రాగంలో (శంకరాభరణం) చేసిన పిల్లల పాట మేరీ లాడ్‌లీ ఆయనకిష్టం. పిల్లల పాట అలాగే ఉండాలనేవారు. ఘంటసాల అష్టపది ‘క్షణమధునా’ ఆయనకు నచ్చేది. షావుకారు సినిమా హరికథలో ఖరహరప్రియ రాగంలోని ‘కావుమయా మహారాజా’ అనే పాటను గుర్తుచేసుకునేవారు.

1960-61 ప్రాంతాల్లో హార్మోనియంతో నేను, ఎదురుగా శాంతసుందరి
మా తలిదండ్రులకు ఉండిన సంగీతాభిమానంవల్ల పిల్లలుగా మేము మొదటినుంచీ సంగీతాన్ని ఒక కళగానూ, శాస్త్రంగానూకూడా గుర్తించగలిగాం. అదేదో కాలక్షేపం వ్యవహారమనీ, భోగ లాలసత్వంతో కూడుకున్నదన్నీ ఎన్నడూ అనిపించలేదు. 1954లో నా అయిదో ఏట మా నాన్నతో నేను మద్రాసులో బడేగులాం కచేరీకి వెళ్ళాను. తక్కినవేమీ గుర్తులేవుగాని, మేము ఇంటికి తిరిగి వెళ్ళబోయేసరికి ఆయన జమునాకీ తీర్ అనే (సింధు) భైరవి పాట అందుకున్నాడు. నేను వెంటనే అది కరీంఖాన్ పాటగా గుర్తుపట్టి మానాన్నను కదలనివ్వలేదు. మళ్ళీ 1958లో మద్రాసులో ఆయన కచేరీ జరిగింది. ఆయనను స్టేజి పక్కనుంచి దగ్గరగా చూసివచ్చాను.

1964 లో వీణ, సితార్ వాయిస్తున్న శాంతసుందరి, నేను
ఆ తరవాత 1963లో తొలిసారి బాలమురళిదీ, రవిశంకర్‌దీ కచేరీలు విన్నాం. ఒక రోజున ఉన్నట్టుండి అక్కా తమ్ముళ్ళం మా సినీసంగీతాభిమానం కట్టిపెట్టేసి పూర్తిగా శాస్త్రీయసంగీతంలో పడ్డాం. 1964లో నా స్కూలు చదువు పూర్తికాగానే మైలాపూర్‌లో కేళ్కర్‌గారి దగ్గర సితార్ మొదలు పెట్టాను. అప్పటికి నా గొంతు ‘విరుగుతూ’ ఉండడంతో పాడడానికి బిడియంగా ఉండేది. 1963లో పిన్నులు అరిగిపోయే గ్రామొఫోన్‌ను పక్కన పెట్టి మా నాన్న ఎలక్ట్రిక్ టర్న్‌టేబ్‌ల్ కొన్నారు. అప్పట్లో బాపూగారింటికి వెళ్ళి ఆయన దగ్గరున్న అపూర్వమైన హిందూస్తానీ కలెక్షన్ చూసిన నాకు మతిపోయినంతపనైంది. మేము కొత్త ప్లేయర్ కొనడానికి అదొక ప్రేరణ. లాంగ్‌ప్లే రికార్డుల శకం మొద లయింది. రేడియో, కచేరీలూ, రికార్డులతో మా సంగీతప్రపంచం హడావిడిగా ఉండేది. బాలమురళి, చిట్టిబాబు, ఈమని మొదలైనవారి కచేరీలకు తప్పనిసరిగా ఇంటిల్లిపాదీ వెళ్ళేవాళ్ళం. రవిశంకర్ కచేరీలు పూర్తయేసరికి అర్ధరాత్రి దాటేది. కొన్ని స్పెషల్ బస్సులు మా ఇంటికి రెండు మూడు మైళ్ళ దూరంలో వదిలేసేవి. అక్కడినుంచి నడుచుకుంటూ ఏ రెండింటికో ఇంటికి చేరుకునేవాళ్ళం. కాలేజి ఫైనల్ పరీక్ష రోజుల్లో కూడా వెళ్ళాం. ఇతర కుటుంబాల్లోనివారు మమ్మల్ని పిచ్చివాళ్ళ కింద జమకట్టేవాళ్ళు. 1965లో మొదటిసారిగా విలాయత్‌ఖాన్, ఇమ్రత్‌ఖాన్‌ల సితార్, సుర్‌బహార్ కచేరీ మద్రాసులో విన్నాం. దానికి చిట్టిబాబు, ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ కూడా హాజరయారు. విలాయత్‌ఖాన్ సితార్ విన్నాక మాకు రవిశంకర్ పరిమితులు అర్థంకాసాగాయి. అయినా అన్ని కచేరీలకూ వెళ్ళేవాళ్ళం.

1965 ప్రాంతాల్లో మా అమ్మ, నాన్న
మొదట్లో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సినిమాలలో పాడడానికి ప్రయత్నిస్తూ, తన కేసెట్ తీసుకుని తిన్నగా ‘విజయచిత్ర’ ఆఫీసుకు వచ్చేశాడట. రావి కొండలరావుగారు కాస్త కంగారుపడి పక్కనే చందమామలో కుటుంబరావుగారున్నారు. ఆయనకు సంగీతం గురించి బాగా తెలుసు అంటూ అతన్ని తీసుకొచ్చారట. ఆ పాట మా నాన్నకు నచ్చలేదుగాని అప్పటికే ఘంటసాల ‘ఆయాసం’తో కాస్త చిరాకుపడుతున్న కె.వి.మహాదేవన్‌గారిని మనసులో ఉంచుకుని, ఆయనను సంప్రదించమని బాల సుబ్రహ్మణ్యానికి సలహా ఇచ్చారట. మరొకసారి రంగులరాట్నం రికార్డింగ్‌లో చిట్టిబాబు శృంగారలహరి కీర్తన వాయిస్తూ సా, రిసనిప సనిపమ గమపా అని చివరి స్వరాన్ని గుంజుతున్నారట. అది వింటున్న మా నాన్నకు నచ్చక ‘ఎందుకలా గుంజుతారు, ప్లెయిన్‌గానే వదలండి’ అన్నారట. చిట్టిబాబు ఆ సలహా పాటిస్తూ ‘ఈ పాటకు మ్యూజిక్ డైరెక్టర్ రాజేశ్వరరావు కాదు, కుటుంబరావుగారే’ అని జోక్ చేశాడట.
1965 తరవాత మా ఇంట్లో రికార్డులు కొనే బాధ్యత నాదయింది. పుట్టినరోజుకూ, పండగలకీ కొత్తబట్టలు కొనుక్కోకుండా మా అమ్మనుంచీ, అమ్మమ్మనుంచీ డబ్బు తీసుకుని లాంగ్‌ప్లే రికార్డ్లు కొనేవాణ్ణి. ఒక పరిస్థితిలో నాకు మంచి బట్టలు లేకుండాపోయాయి. ఇటువంటి ‘పిచ్చివేషాలని’ మా ఇంట్లో కొంతవరకూ సహించేవాళ్ళు. విన్న కచేరీల విశేషాలను క్షుణ్ణంగా చర్చించడం, నా నాన్న చెప్పిన అనుభవాలని వినడం పరిపాటిగా ఉండేది. రేడియో అప్పట్లో శాస్త్రీయసంగీతానికి మంచి సాధనంగా ఉండేది. శనివారాలు నేషనల్ ప్రోగ్రాం, ఏడాదికొకసారి సంగీత సమ్మేళన్ తప్పనిసరిగా వినేవాళ్ళం. ఆ రోజుల్లో నేను వినని సితార్ విద్వాంసుడు ఉండేవాడు కాదు. మా నాన్న కామెంట్లు కొన్ని ఉపయోగకరంగా ఉండేవి. నేను నేర్చుకుంటున్న సితార్ పాఠాలు కచేరీలకి పనికిరావని నాకు తెలుస్తూ ఉండేది. అందుకు మానాన్న హెచ్చరికలు తోడయేవి. ఇంట్లో రహస్యంగా నాకు కావలసిన వన్నీ రికార్డ్లు విని నేర్చుకుని వాయిస్తూ ఉండేవాణ్ణి.
మేము నలుగురం కలిసి ప్రతి కచేరీకీ వెళ్ళేవాళ్ళం కనక ఎప్పుడూ చివరి క్లాసులోనే కూర్చునే వాళ్ళం. త్వరలోనే చిట్టిబాబు, బాలమురళి తదితరులు మా నాన్న రాకపోకలను గుర్తించసాగారు. ముందుకొచ్చి కూర్చోమని చిట్టిబాబు అడిగేవారు. మేము అలా మటుకు చేసేవాళ్ళంకాదు. బాలమురళి తండ్రిగారిని మా నాన్నే ముందుగా పలకరించి, తమ పూర్వ పరిచయాన్ని గుర్తుచేశారు. ఆ తరవాత బాలమురళి మమ్మల్ని వాళ్ళింటికి పిలిచారు. వీళ్ళిద్దరితో మా కుటుంబానికి రాకపోకలుండేవి. మాలాగ మొత్తం కుటుంబమంతా సంగీతాభిమానం ప్రదర్శించడం తెలుగువాళ్ళలో అరుదు కనక వాళ్ళకీ మేమంటే ఆసక్తిగానే అనిపించేది. చిట్టిబాబు తండ్రి రంగారావు గారికి మా నాన్నతో పొగాకు తాంబూలం దోస్తీ ఉండేది. బాగా పరిచయం ఉంటే తప్ప సినిమావాళ్ళ పెళ్ళిళ్ళకు వెళ్ళేవాళ్ళం కాదు. జమున వివాహంలో బిస్మిల్లా కచేరీ జరిగింది కనక వెళ్ళాం.

1984లో సితార్‌తో మా అబ్బాయి కార్తిక్
మా నాన్న కొన్ని వ్యాసాల్లో మద్రాసులో జరిగే సంగీతకచేరీలకు తెలుగు సినీ గాయనీ గాయకులుగాని, సంగీత దర్శకులుగాని హాజరుకారని గుర్తించారు. మద్రాసులో ఒకే రోజున శ్రీశ్రీకి సన్మానసభలో రావిశాస్త్రి నిజం నాటకప్రదర్శనా, దానితో క్లాష్ అవుతూ మరొకచోట ద్వారం సత్యనారాయణ వయొలిన్ కచేరీ ఏర్పాటు కావడాన్ని నిరసించారు. మా నాన్న అభిమానించే గాయకుల్లో కరీంఖాన్, ఫయ్యాజ్‌ఖాన్, బడేగులాం, అమీర్‌ఖాన్, హీరాబాయి, పర్వీన్ సుల్తానా తదితరులుండేవారు. కర్నాటకంలో బాలమురళి కాక చెంబై, మదురై మణిఅయ్యర్, ఎం.ఎల్.వసంత కుమారి తదితరులుండేవారు. చివరి రోజుల్లో ఆయన మద్రాసు రేడియోలో ఉదయం ప్రసారం అయే ఏ కర్నాటక కచేరీ అయినా పెట్టుకువినేవారు.
రచయితగా ఆయనను గుర్తించిన తెలుగువారికి ఆయన శాస్త్రీయసంగీతాభిమానం గురించి కాస్త అయోమయంగా అనిపించేది. మా కుటుంబంలో మటుకు సంగీతానికి పెద్దపీట లభించడానికి మా తల్లిదండ్రుల ప్రోత్సాహమే కారణం. నేను సంగీతంతో ఇప్పటికీ కాస్త కుస్తీ పడుతూనే ఉన్నానంటే అప్పటి ఉత్సాహంవల్లనే. మా అబ్బాయికికూడా ఏడో ఏటనే సితార్ నేర్పగలిగాను. ‘మా పిల్లలకు సంగీతం నేర్పిద్దామనుకుంటున్నాం’ అని చాలామంది నాతో అంటూ ఉంటారు. ‘ముందు మీరు వినడం మొదలుపెట్టండి; వాళ్ళకు అదే వస్తుంది’ అని నా సలహా. కుటుంబంలో సంగీతం మోగుతూ ఉండడం ముఖ్యం.
14 అభిప్రాయాలు »ప్రత్యేక వ్యాసాలు, సంగీతం
కొత్తపాళీ Mar 1, 2009 1
చాలా సంతోషం రోహిణీప్రసాదుగారూ. కుటుంబరావుగారు ఇంత సంగీత పిపాసి, ఆస్వాది అయినా తన కథల్లో నవలికల్లో మరీ ఎక్కువ రాయలేదు దాన్ని గురించి. శ్రీశ్రీ మాత్రం ఎక్కడొ నా వూళ కేదార గౌళ అన్నాడు. ఏదేమైనా ఒక అద్భుత సాహితీమూర్తి వ్యక్తిగత పార్శ్వాన్ని తెలిపే ఈ వ్యాసం .. అరుదైన ఫొటోలతో కలిసి .. మాకు వెలలేనిది. ధన్యులము.
సోమశేఖర్ ధవళ -విజయనగరం Mar 2, 2009 2
@రోహిణీప్రసాదు గారు: అరుదైన ఫొటోలతో, ఎంతో విలువైన సమాచారాన్ని, మీరు మాత్రమే అందించగల సమాచారాన్ని మాకిస్తున్నందుకు ధన్యవాదాలు. కొ.కు గారి, ఆమాటకొస్తే ఏ రచయిత పుస్తకాలు నేను చదవలేదు, కానీ, మీ వ్యాసాలన్నె ఎంతో ఆశక్తితో చదువుతాను.
K.Rohiniprasad Mar 2, 2009 3
మరొక ముచ్చట. 1956లో అనుకుంటాను, లతా మంఘేశ్కర్ మద్రాసుకు వచ్చినప్పుడు (నిదురపోరా తమ్ముడా రికార్డింగు కోసమేమో) మా నాన్న ఆమెను కలుసుకుని దీనానాఠ గురించిన తన ఆసక్తిని ప్రస్తావించారు. బొంబాయి తిరిగి వేళ్ళాఖ ఆమె తన తండ్రి గురించిన స్మారక సంచిక ఒకటి ఆయనకు పంపింది. ఆ మరాఠీ పుస్తకం ఇప్పటికీ నా దగ్గరుంది.
మా అన్నయ్య కొడుకులు సంగీతం నేర్చుకున్నారు. పెద్దవాడు పద్మాకర్ పూనాలో షాహిద్ పర్వేజ్ వద్ద సితార్ ఏర్చుకున్నాడు.
విష్ణుభొట్ల లక్ష్మన్న Mar 2, 2009 4
రోహిణీ ప్రసాద్ గారు:
ఈ వ్యాసంలో కొన్ని వివరాలు మీ నుంచి నాకు తెలిసినా, అందరితో ఎలా పంచుకోటం బాగుంది.
కొత్తపాళీ గారు:
కొకు “సంగీతం” విషయంగా కొన్ని కథలు రాసారు. నిజానికి ఆయనకి సంగీతంతకిఉన్న పరిచయం వల్లే, ఆ కథలు కూడా చాలా బాగా ఉంటాయి.
లక్ష్మన్న
పరుచూరి శ్రీనివాస్ Mar 2, 2009 5
రోహిణీప్రసాద్ గారు,
“ఆయన వ్యక్తిత్వం లోని ఈ అపరిచిత అంశం గురించి” అనే మాట ఎందుకన్నారో అర్థం కాలేదు. ఒక వేళ ఈ తరం వాళ్ళకు తెలియదేమో అనడానికి, విరసం వాళ్ళు వేసిన “చరిత్ర, సంస్కృతి” వాల్యూములు ఆ సమచారాన్ని గత పదేళ్ళలో అందరికీ అందుబాటులోకి తెచ్చాయి. నా వరకు నేనైతే ఈ 2 సంపుటాల వరకు ఎన్ని సార్లు చదువుకున్నానో లెక్క తెలియదు. ముఖ్యంగా బాలగంధర్వ, దీనానాథ్, స్థానంల మీద వ్యాసాలు ..
7, 8 నంబర్ల ఫోటోలు మాత్రం చాలా విలువైనవి. పంచుకున్నందుకు thanks!
వ్యాసం ప్రథమ పురుషలో కాకుండా ఉత్తమ పురుషలో సాగుంటే బాగుండేదని మాత్రం అనుకుంటున్నాను. ముఖ్యంగా రెండో అర్థ భాగంలో ఆ feeling గట్టిగా కలిగింది.
కొన్ని చిన్న చిన్న తప్పులు దొర్లాయి. “తారుమారు” సినిమా వచ్చింది 1941 లో. (అదో హాస్య ప్రధానమైన సినిమా. దానితో పాటు “బొండాంపెళ్ళి” అనే మరో సినిమా కూడా కలిపి విడుదలయ్యాయి.) కానీ మీ నాన్న గారు దాని కంటే చాలా ముందే “వీరాభిమన్యు” (1936) అనే సినిమాకి పనిచేసి, కొంత దర్శకత్వం బాధ్యతలు, కాంచనమాల పాటలకు సంగీతం అందించడం లాంటివి చేశారు. ఈ వీరాభిమన్యు సినిమా పైన, కాంచనమాలతో పరిచయం గురించి ఆయనదే ఒక వ్యాసం వుండాలి.
– శ్రీనివాస్
ఎన్ వేణుగోపాల్ Mar 3, 2009 6
రోహిణీప్రసాద్ గారూ,
అక్షరాలతో మనిషినీ మనసునూ మరోప్రపంచం లోకి తీసుకుపోయే విద్య ఏదో మీకు బాగా వచ్చు. కుటుంబరావు గారి సంగీతప్రియత్వం గురించి ఇదివరకు కొంత తెలిసినా, ఈ జ్ఞాపకాలలో మీరు పంచుకున్న విషయాలు అద్భుతం. మీరు కుటుంబరావుగారి జీవితచరిత్ర రాస్తే బాగుంటుందని ఇదివరకే కోరాను. ఈ శతజయంతి సంవత్సరం ముగిసేలోగానైనా మీరు ఆపని చేస్తే బాగుంటుంది. కుటుంబరావు గారు పోయినప్పటినుంచీ ఆయన జీవితచరిత్ర – జ్ఞాపకాలు రాయమని, అది ప్రేమ్ చంద్ మీద శివరాణీదేవి గారి పుస్తకం లాగా ఉంటుందని కెవిఆర్ గారు వరూధిని గారితో అంటుండేవారు. వరూధిని గారు మొన్న తెనాలిలో విరసం కొకు శతజయంతి పాఠశాలలో ఐదు నిమిషాలే మాట్లాడినా చాల విలువైన విషయాలు చెప్పారు. దయచేసి కుటుంబరావు గారి మీద మోనోగ్రాఫ్ రాయడం గురించి ఆలోచించండి.
ఎన్ వేణుగోపాల్
వేణు Mar 3, 2009 7
రోహిణీప్రసాద్ గారూ,
వేణుగోపాల్ గారి సూచన బాగుంది.
అందులో మీ నాన్న గారి శైలి గురించి వివరంగా రాయాలి. చాలా పాత కథలలో కూడా కుటుంబరావు గారు చక్కటి వాడుక భాష ఉపయోగించారు.
…. వేణు
D.Girija Mar 3, 2009 8
Rohiniprasadgaru,
Thanks for such an interesting article and for sharing such rare and precious photos with all. With regards.
D.Girija
lalitha Mar 3, 2009 9
అవునండి. వేణుగోపాల్ గారు చెప్పింట్లు మీరు మోనోగ్రాఫ్ రాయగలిగితే చాలా బాగుంటుంది.
అది అవసరం కూడా.
K.Rohiniprasad Mar 3, 2009 10
థాంక్స్ శ్రీనివాస్ గారూ. వీరాభిమన్యు అని రాయడానికి బదులుగా తారుమారు అని రాశాను.
సంగీతం మీద ఎంతటి అభిమానం ఉన్నప్పటికీ, ఎంత అభిరుచి, అభినివేశం న్నప్పటికీ కనీస స్థాయిలో సంగీతప్రదర్శనలు చెయ్యకపోతే అది కొంతవరకూ అపరిచితమైన అంశంగానే మిగిలిపోతుంది. కుటుంబరావుగారి కథలూ, వ్యాసాలూ అన్నీ చదివినవారికి మాత్రమే ఆయన వ్యక్తిత్వం కొంతవరకూ అవగాహన అవుతుంది.
మా నాన్న నా కన్నా 40 ఏళ్ళు పెద్ద. తన గత జీవితాన్ని గురించి ఆయన పెద్దగా చర్చించేవారు కాదు. సందర్భం వచ్చినప్పుడల్లా ఏవో కొన్ని విశేషాలు చెప్పేవారు. ఆయన జీవితచరిత్ర కాకపోయినా వివిధ అంశాల గురించిన వ్యాసాలు రాయడానికి ప్రయత్నిస్తాను. వాటికి కొన్ని పాత ఫోటోలను కూడా జత చేస్తాను. సాహిత్యపరమైన అంశాలను చాలామంది రచయితలూ, విమర్శకులూ ప్రస్తావిస్తూనే ఉన్నారు.
ఈమాట » కొడవటిగంటి కుటుంబరావు రచనలలో కుటుంబ నేపథ్యం Nov 1, 2009 11
[...] ఎదుగుదలా, పరిణామాలనూ grandstand view పద్ధతిలో వీక్షించే అవకాశాలు ఆయనకు కలిగాయి. వివిధరంగాల్లో పేరు [...]
mgv.laxman Feb 1, 2010 12
anta bagane undi kani sarigamalu ela nerchukovalo teliyacheste bagaundedi.
mgv.laxman Feb 1, 2010 13
anta bagane undi kani sarigamalu ela nerchukovalo teliyacheste bagaundedi.naku chala istam.
Rohiniprasad Feb 1, 2010 14
సంగీతం గురించి నేనెన్నో వ్యాసాలు రాశాను. ఈ కింది లింకులు చూడండి:
http://www.eemaata.com/em/issues/200709/1139.html
http://www.eemaata.com/em/issues/200609/905.html