Mar2009
మన చరిత్రలోకి
- ఆర్‌క్యూబ్
ఇప్పటి దాకా
వానెవని పాదయాత్రలో కదా ఇవి
చుక్కలు చుక్కలుగా మనం పూలై పరచుకున్నం
అవి అస్పృశ్య వాక్యాలైనా
ఇన్వర్టెడ్ కామాలమై పూదిచ్చుకున్నం
అదొట్టి పదాడంబరమని తెలిసినా
ఆశ్చర్య చకితులమై అట్లనే కట్టె జరుసుకపోయినం
వానక్షరంతో ఏమోక్షమూ సిద్ధించవని రూఢీ అయినా
అండర్ లైన్లమై అదే పనిగ తట్ట మోసినం
వాని తత్సమోత్సాహ మాత్సర్యంలో
కామాలు కామాలుగా మైలు రాల్లమై గూనిపోయినం
వాని జబ్బలు చరిచిన బొంకుతనం పొల్లుపోకుండా
బ్రాకెట్లు బ్రాకెట్లుగా రాసులుపోసి సొమ్మసిల్లినం
నిజానికి ఎంత దండిది మన అస్తిత్వ చరిత్ర
ధిక్కార సొగసు ఆత్మతో కుల్లకుల్ల
వాడు-ఏ ఉక్కుపాదం మోపినా
సాగిలపడి ఖాళీ అవ్వని మన ప్రశ్న గుర్తుకు
వేన వేల శరణార్తులు
మన హంసపాదాలు మధన పడుతన్నై
తారకలు రగులుతున్నై
సెమికోలనులు ఎదురొడ్డుతున్నై
కోలన్ డాష్‌లు కళ్ళు తెరిచినై
ఫుల్ స్టాప్ ముందు నడిచింది
ఇది కప్పిపెట్టిన చరిత్రలోకి వానపాము ప్రయాణం
ఇది కాట గలిసిన పురామూలుగను కూడ గట్టుకునే కత్తులయానం
ఇది పేరాగ్రాప్ ఛేంజ్ చేసుకొని
కొత్తగా అచ్చుగడుతున్న సంగీతం
March 16th, 2009 at 5:50 am
చాలా చక్కటి సైటు, అంతర్జాలంలో తెలుగు కవిత్వాన్ని చదవదగ్గ కొన్ని సైట్లలో మఖ్యమైనది.
ఈగ హనుమాన్