Mar2009
నల్లానల్లని నవ్వు
మెట్రో బస్ వెనకాతల
వొక కితకితల నల్ల సముద్రమేదో
అల లలుగా తుళ్ళి తుళ్ళి పడ్తుంది
ఏ ఇరుకు నగర శరీరాన్నో పగలగొట్టి
నవ్వుల వానలో ముంచెత్తాలని.
వెనక్కి తిరిగి చూస్తాను
నా లోపలి అతిమర్యాద తెల్లకణమేదో
వొక్క క్షణం మర్యాదగా జూలు విదిలించి
ఆ నల్ల సముద్రంకేసి,
అసయ్యపు చూపులు పొడుస్తుంది.
అలా అలలు అలలుగా యెగసి పడలేక
నవ్వుల తరగలతో ముంచెత్తుకోలేక
నవ్వలేని తనాన్ని దాచుకోలేక
లోపల ఎక్కడో గడి వేసుకుని
దూరానికి దొర్లిపోతాను.
మెట్రో బస్ వెనకాతల
వొక కితకితల నల్ల సముద్రమేదో
హోరు హోరుగా చిలిపి చిలిపిగా
వెంటాడ్తుంది నిద్రలోనూ
నిద్ర కళ్ళు వాలకుండా!
March 7th, 2009 at 6:47 am
కవిత బావుంది.
May 7th, 2009 at 7:54 am
హలొ,అఫ్సర్ గారు,మీ కవిత్ బాగునంది..గగీథాంజలి
May 7th, 2009 at 11:28 pm
అప్సర్ కవిత లొని అక్షరాత్మ అపూర్వం