Mar2009
గాలిసోకిన ఊరుబాల్యం
మనిషి పుట్టగానే ఆట
ఏడుపు పాట ఏకకాలంలోనే పుట్టి ఉంటాయి
అలా మొదలై బాల్యంతో
అల్లుకపోయిన ఆట
బాదరబందీ లేని స్వేచ్ఛాతీరంలోకి
బంతిలాగ వచ్చి విహరింపజేస్తుంది
ఆటలు లేని బాల్యాన్ని విహరింపజేస్తుంది.
ఆటలు లేని బాల్యాన్ని వుహించడం కష్టం
బాల్యసంబంధం లేని ఆటల్ని బతికించటం మరీ కష్టం
బాల్యం మధురస్వప్నం
తీయని జ్ఞాపకాల పుస్తకం
పేజీ తిప్పితే చాలు ఆటలే ఆటలు
కాలాన్ని మనల్ని మరిపించి ఆనందలోకాల్లోకి మోసుకెళ్ళి
అంత తొందరగా మనల్ని గుర్తుకుతేవు
వూరు ఆటలిప్పుడు అపురూపమే
అప్పటి వూరు బాల్యాన్ని కదిపి చూడు
వేనవేల ఆటలదృశ్యాలు
మనసుకు తుమ్మగోందులా అంటుకుంటాయి
వూళ్ళు ఆటపాటల ఉత్పత్తి కేంద్రాలు
శ్రామిక జనజీవన దృశ్యాల తోరణాలు
ఇప్పుడు వూరు ఆటలు మోటయిపోయినయ్
మరుగునవడ్డ మోటబిళ్ళ దండెడై పోయినయ్
పనికిరాని పాతాళగరిగలయి పోయినయ్
పిల్లల ప్రపంచాన్ని క్రికెట్ బూచి కరిచింది
పాలగోకు మాధుర్యంలో వేపచేదు వొలికింది
బొంబాయి మిఠాయి వంటి టి.వి. తీపికి
బాల్యం దాసోహమైంది
* * *
ఆటలు లేని బాల్యాన్ని వూహించటం కష్టం
బాల్య సంబంధం లేని ఆటల్ని బతికించటం మరీ కష్టం
చిర్రగోనె ఆటలో వీధులకు ప్రాణం పోసే బాల్యం
దుర్భిణీ వేసినా కనబడదు
చెమ్మచెక్కా చారడేసి మొగ్గలతో
గంతులేసే చిట్టితల్లుల్ని చూడగలమా
కోతికొమ్మచ్చితో కొమ్మల్లో
కిలకిలలాడాల్సిన బాల్యం పక్షులు
ఎక్కడ ఎగిరిపోయినట్టు
ఇంటి ముంగటి వాకిళ్లలో వికసించే
రంగు రంగుల లక్కకోలల సంగీత సవ్వడులేవీ
పుంజీతం ఎత్తుగడల్లో ఆరితేరి పునీతమైన బాల్యం
మచ్చుకైనా కానరాకపోవటం
శిథిల సంస్కృతికి నిదర్శనం
వూరు పిల్లల్లారా
చిన్నితెర ప్రసారాగ్ని సమిధల్లారా
మీరిక వూరు ఆటల్నీ వూరు పాటల్నీ
లైబ్రరీ గాదెల్లోనో ఇంట్లో పాతుకుపోయిన టి.వి. పెట్టెల్లోనో
సినిమారీళ్ళ చుట్టల్లోనో చూడాల్సిందే
తప్పదు గాక తప్పదు
వూరుకు గాలి సోకింది.
March 4th, 2009 at 7:03 pm
నోస్టాల్జియా కవిత.
March 30th, 2009 at 6:41 pm
రాజిరెడ్డి గారు చోడవరం కవితా వీక్షణం మిత్రుడ్ని. మీ కవిత బాగుంది. కానీ సబ్జెక్టు పై చాన్నాళ్ళుగా ఎంతో మంది రాస్తున్నారుగా.
వర్మ..