Mar2009
రెండు ఉత్తరాలు
బళ్ళలో ప్రవేశపెట్టిన పథకాలలో పోస్ట్ బాక్స్ పథకం ఒకటి. పిల్లలు పోస్ట్ బాక్స్ వద్దకు వెళ్ళే బదలు పోస్ట్ బాక్స్ పిల్లల వద్దకు వచ్చింది. పోస్ట్ బాక్స్ ను ఏవిధంగా ఉపయోగించు కోవాలో పిల్లలకు నేర్పి తమ తమ అభిప్రాయాల్ని రాయించి, వేయించడం పంతుళ్ల పని. ఉత్తరాలు రాసే విధానాన్ని పిల్లలందరికి నేర్పడానికి ఒక్కచోట కూర్చోబెట్టాం. పిల్లలు తరగతి వారీగా కూర్చున్నారు. తెలుగు టీచర్ మాట్లాడుతున్నారు. తయారు చేసిన పోస్ట్ బాక్స్ టేబుల్ పై ఉంది. పిల్లలందరు దాన్ని ఆసక్తిగా చూస్తున్నారు. చిన్నప్పడు మా ఊళ్ళో వేప చెట్టుకు కట్టిన పోస్ట్‌డబ్బా నాకు గుర్తొచ్చింది. నడీ ఊర్లో ఉన్న ఆ డబ్బా వద్దకు వెళ్ళి ఆసక్తిగా, ఆశ్యర్యంగా చూసేవాళ్ళం. ఆ రోజు పోస్ట్ బాక్స్ అడ్వాన్స్ సదుపాయం. అందుకే అంత విచిత్రం.
దూరంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను ఒకటి చేసేవి ఉత్తరాలు. వాటికి నిలయం పోస్ట్ బాక్స్ ఆత్మీయంగా పలకరించే ఉత్తరాల గర్భసంచి ఇది….
ఆ విధంగా తెలుగు సార్ విద్యార్థులకు పోస్ట్ బాక్స్ విశిష్టత గురించి తెలుపుతుంటే పిల్లలు ఆసక్తికరంగా వింటున్నారు. వారి జీవితాల్లో పోస్ట్ బాక్స్ కు చోటు లేదు. అందుకే దాని పరిచయం అవసరమైంది. పిల్లలు కొందరు నోట్స్ రాస్తున్నారు. మరికొందరు వింటున్నారు. పిలల్ల చేతుల్లో ఉన్న కంపాస్ బాక్స్‌లు ఆకర్షణీయంగా రకరకాల ఆకారాలతో ఉన్నవి. అందులో కొన్ని సెల్‌ఫోన్ ఆకారాలలో కనిపించాయి. ఒకమ్మాయి దాన్ని చెవికి అనించుకుని సార్ చెప్పేది వింటున్నది. పిల్లలు మానసికంగా సెల్‌ఫోన్‌కు దగ్గరవుతున్న దృశ్యం అవిష్కృతమైంది. అది అనేక సంగతులను నా ముందుంచింది.
పోస్ట్ బాక్స్ గురించి తెలిపిన తెలుగు సార్. వాళ్ళలతో తమ అభిప్రాయాలను ఉత్తరాల రూపంలో రాసి పోస్ట్ బాక్స్‌లో వేయమని తెలిపాడు. ఎలా వేయాలో వేసి చూపించాడు. పిల్లలు బుద్దిమంతుల్లాగ విని తలలూపారు. ఆ విధంగా ఆ రోజు బడిలో కార్యక్రమం ముగిసింది.
ఇది జరిగిన రెండు రోజుల తరువాత పోస్ట్ బాక్స్ ముందుంచుకొని తెరిచాను. కుప్పలు కుప్పలుగా కాగితాలు రాలాయి. ఒక్కటొక్కటే తెరిచి చూసిన క్లాస్ టీచర్, హెడ్ మాస్టర్‌లను ఉద్దేశించి రాసినవి ఎక్కువ ఉన్నవి. అక్షర దోషాలు, అసంపూర్తి వాక్యాలు, భావ ప్రకటన సరిగాలేపోవటం, గజిబిజిరాత ఇన్ని అవాంతరాలు మధ్య ఒకటి, రెండు ఉత్తరాలు నన్ను ఆకర్షించాయి. ఆ రెండు ఉత్తరాలు తీసుకొని, మిగతా వాటిని ఫైల్ చేసిన. పోస్ట్ బాక్స్ మూసి యథాస్థానంలో పెట్టిన. నెమ్మదిగా కూర్చుని రెండు ఉత్తరాలు విప్పిన. రాసిన వారెవరా? అని ఆసక్తితో చూసిన. రామయ్య, సురేష్‌లు రాసిన ఉత్తరాలవి. రెండూ ప్రధానోపాధ్యాయుల నుద్ధేశించి రాసినవే. పిల్లలపై నాకున్న మంచి అభిప్రాయం చదవమని తొందరపెట్టింది. చదువుల్లోనూ, ఆటల్లోనూ, చెప్పిన పని బాధ్యతగా చేయడంలోను ఇద్దరూ ఇద్దరే. అందుకే బడిలో గల ప్రతికమిటీలో ఇద్దరి లో ఒకరి పేరు తప్పనిసరి ఉంచి, మిగతావారిని వీరికి అటాచ్ చేయడం నాకు అలవాటయింది. పేద పిల్లలనే సానుభూతి కొంత, పిల్లల ప్రవర్తన కొంత, వారిని నాకు దగ్గర చేసింది. బహుశ ఆ కారణంతోనేమో ఇద్దరు కూడా ప్రధానోపాధ్యాయుల పేర ఉత్తరాలు బాక్సులో వేశారు. పిల్లలమీద ఉన్న వాత్సల్యాన్ని పక్కన పెట్టి అందమైన దస్తూరిగల సురేష్ ఉత్తరం చదవసాగాను.
గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులకు నమస్కారములు.
మొన్న మీరు చెప్పినాక ఉత్తరం రాయాలని కూర్చున్న. ఏం రాయాలె? అని ఆలోచించగా మీకు తెలువని ముచ్చట్లేమున్నయి. రాయక తప్పది కనుక మా ఇంటి గురించి రాస్త. పెద్దమనిషి లెక్కే రాసిండు అని అనుకోకండి. తింటున్న దెబ్బలు, తిట్లు నాతో రాయిస్తున్నవి. బడికి లేట్‌గా వచ్చినందుకు, అడిగితే కారణం చెప్పినందుకు మీతో తిట్లు తిన్న. పదిమందిల చెప్పుడు సిగ్గయి ఇప్పుడు చెబుతున్న రాత్రి తాగిన సారాతో మా అయ్య పొద్దున తొమ్మిదింటికి లేస్తడు. తెల్లారంగనే మా అవ్వ ఇండ్లల్ల్ల బోళ్ళు తోమీ, పాచి పని చేసుటానికి పోతది ఆ విధంగా ఇంటి పాచిపనంత నా మీద పడతది. పని చేసుకొని, తానం చేసి వచ్చె సరికి టైమ్ అయిపోతది. అట్ల నేను రావడం లేట్ అయ్యేది. పొద్దున తిండి ఉండదు. బల్లె పెట్టే మధ్యాహ్న భోజనమే దిక్కు. బడి అయిపోయినాక ఇంట్ల ఉండుడు లేదు. మార్కెట్‌కు పోవాలె. అక్కడ సేట్ చెప్పిన పని చెయ్యాలే. అక్కడనుండి ఇంటికి వచ్చేవరకు రాత్రి తొమ్మిది అయితది. అంతటతోటి తిని పండుడే. బడిల ఉన్నంతసేపే చదువుడు. ఇన్ని సమస్యలతోటి చదువు మనసున పడతలేదు. బడి ఎప్పుడు బంద్ చేసేది తెలియదు. సర్కార్ హాస్టల్లో చేరి చదువుకోవాలనుంది. దాంట్ల ఉంటె మా అయ్య ఉండనీయడు. నేను మా అవ్వ పని చేయక తప్పదు. మా అయ్య సంపాదన తాగుడు, అప్పుకు పోతది. మేం ఇద్దరం పని చేస్తే ఇల్లు గడుస్తది. ఒక రకంగా మేం ముగ్గురం పని చేస్తున్నట్లే. కాని ఓ తీరుగ కూడా బతుకుతలేం. మా లాంటి కోట్లాది మంది ఇలా బతుకులీడుస్తుండగా దేశ ఆర్థిక ప్రగతి బాగుందని, వృద్ధిరేటు పెరిగిందని మీరు క్లాసులో పాఠం చెబుతరు. అదెలా సాధ్యం? ఇంటా బయట అర్థం కాని విషయాలు చాల ఉన్నాయి. వాటన్నిటిని అర్థం చేసుకోవాలనుంది ఎల్లప్పుడు మీ సహాయసహకారాలు కోరుతున్నా…
మీ విధేయడు
సురేష్
పసి హృదయపు మూగవేదన మనసును పిండింది. తలవెనక్కి వాల్చి కళ్లు మూసుకొని రిలాక్స్ అయ్యాను. పైన తిరుగుతున్న ఫ్యాన్‌తో నా ఆలోచనలు పోటీ పడుతున్నాయి. ఆర్థిక శాస్త్రవేత్తలు వేసుకునే మౌలిక ప్రశ్నలను తన ముందుంచిన పిల్లవాణ్ణి అభినందించాలా? జీవితం చేదును దోసిళ్ళ నిండా తాగాల్సి వచ్చినందుకు అనునయించాలా? ఏదీ అర్థంకాని పరిస్థితి గుండె బరువెక్కింది. బరువు దించుకునే మార్గం ఏదీ కనిపించలేదు. కడుపులోని వెత కడిగివేసుకోవాలి. సురేష్‌ను పిలిపించాను. బడికి రాలేదని తెలిసింది. తెలుగు సార్‌ను పిలిపించి విషయం వివరించాను.
“మన బళ్ళలో ఉండే పిల్లలందరి పరిస్థితి ఇదే” నెమ్మదిగా జవాబిచ్చాడు.
“వీళ్ళు మరింత మంచిగ బతికే అవకాశం లేదా”
“అది మనకు సంబంధించిన విషయం కాదు. అనవసరంగా ఆలోచించకండి.”
“ఈ రోజు వాడు రాలేదట”
“రాకపోని. ఈ నెల నా ఇంక్రిమెంట్ ఉంది”
“ఎందుకింత పొడిపొడిగా ఉంటవు. నీ మాటలు వినే కాదా వారు ఉత్తరం రాసింది”
“నేను చెప్పింది చేసినందుకు వాడు బాగుపడడు. వాడు చెప్పింది నేను వింటే ఆరోగ్యం చెడిపోతది”
“ఇంత మెటీరియలిస్ట్‌గా ఉంటే ఎలా?”
“మన చేతిలో ఏమీ లేనపుడు, మనం ఏం చేయలేనపుడు ఆలోచించడం వృధా”
“సరే, వెళ్ళండి”
తిరిగి ఒంటరితనం ఆవహించింది. ఆలోచనలు ఆక్రమించాయి. వాటి దారి నుండి పక్కకు తొలగడానికి ఇంక్రిమెంట్ పని ముందేసుకున్న. పనిలో పడి అంతా మరిచాను.
క్లాసంతా అల్లరల్లరిగా ఉంది. పిల్లలు ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. నేను వెళ్ళేసరికి ఒకడు కర్రతో చేసిన బ్లాక్‌బోర్డు ఎక్కి కిందికి జారుతున్నారు. కాగితం విమానాలు విసురుతున్నాడొకడు. ఒకమ్మాయి నేలపై నిద్దురపోతున్నది. పగటి ఉక్కపోతతో పిల్లలు జిడ్డుగా ఉన్నారు. గోడల నిండా ఉన్న బోధనోపకరణాలు ఆ సమయంలో ఉపయోగపడేలా లేవు. నన్ను చూడగానే అల్లరి సుద్దుమణిగింది. పాఠం చెబితే వినేలా లేరు. అందుకే పాటలు పాడమని పురమాయించాను ఒకరిద్దరు ముందుకొచ్చారు. పాట అందుకున్నారు.
సిన్నంగ పోయేటి ఓ వదినె
నీ సీరెట్ల చినిగిందె ఓ వదినే
అరుట్ల ముసలోడు ఓ మరిది
గొంగడనుకొని గుంజిండు నా మరిది
. . . . . . . . .
. . . . . . . . .
గాలికి తిరిగేటి ఓ వదినె
నీ గాజెట్ల పలిగింది ఓ వదినె
పువ్వు కొయ్యపోతె ఓ మరిది
కొమ్మ తగిలి పగిలింది నా మరిది
అలా క్లాసురూం పిల్లల పాటల్తో మోగుచుండగా మా అటెండర్ సెలవుచీటి తెచ్చి ఇచ్చింది. అది సురేష్ పదిరోజుల కోసం పంపిన పత్రం. ఆ క్లాస్ పిల్లవాణ్ణి పిలిపించాను.
“సురేష్ వాళ్ళ ఇంటి పక్కనే వుంటవు కదా” అడిగాను.
“మా ఇంటి పక్కనే వాళ్ళ ఇల్లు” జవాబు
“నిన్న మొన్న సురేష్ కనపడ్డడా”
“సురేష్ ప్రతిరోజూ స్టేడియం పోతుండు”
“ఎందుకు?”
“బఠానీలు, సపోటలు, పల్లీలు ఇట్ల ఒక్కోరోజు ఒక్కోటి తిరుక్కుంటు అమ్ముతుండు. అప్పుడప్పుడు బస్‌స్టాండ్‌కు కూడా పోతడు…
“సరే, నువ్వెళ్ళు”
ఆ విధంగా సురేష్ బడికి దూరమయిండు. రామయ్య రాసిన ఉత్తరం జ్ఞాపకమచ్చింది. ఉత్తరం కోసం ఆఫీసు వైపు అడుగులేశాను. రామయ్య, సురేష్ కంటే భిన్నమైన విద్యార్థి. చురుకుదనం, తెలివితేటలు, సమపాళ్ళలో ఉన్నవాడు. క్లాస్‌రూంలో అతనడిగే ప్రశ్నలు. ఒక్క క్షణం ఆలోచింపజేస్తాయి. జీవితానుభవాలు అనేక కొత్త ఆలోచనలకు పునాదులు. ఇలాంటి పిల్లల్ని చూస్తే అది నిజమనిపిస్తుంది. రామయ్య రాసిన ఉత్తరాన్ని ఆసక్తిగా తెరిచాను.
“గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులకు నమస్కారములు.
మొన్నమీరు చెప్పినట్లుగా ఉత్తరం రాయాలని కూర్చున్న. ఏం రాయాల్నో తెలుస్తలేదు. మన బడి గురించే రాద్దామనిపించింది. నాలుగేండ్ల కింద నా క్లాసుల ఇరవై మందిమి ఉన్నాం. ఈ ఏడు పదిమందిమి మిగిలినం ఒక్కొక్కరు పెరగాల్నో, పోతున్నారు. ఎందుకో అర్థం అయితలేదు. నేను ఒక్కణ్ణే అయితనా అనిపిస్తుంది. నాలుగేండ్ల కింద ఉన్నాసార్లు, టీచర్లు ఇప్పుడు లేరు. రూము కొక్కసారు కూడా కనపడుతలేడు. మా రూముల నిండా పోటోలతో కూడిన చార్టులు వేసిండ్రు. మాకు మాత్రం పాఠాలు మనసున పడుతలేవు. మా తమ్ముని కాస్లుల రోజంతా ఒకే టీచర్ ఉంటుంది. బోర్ కొడుతుందట. నెలకో పరీక్ష పెడుతున్నారు గ్రేడులు ఇస్తున్నారు. ఒకే గ్రేడు ఉన్నోళ్లు క్లాసుల చాలమంది ఉంటున్నారు. మా ఇంటి పక్కబల్లె ఫస్ట్ వచ్చినోల్లకు ఫస్ట్ అనే బల్ల ఇస్తున్నారు. ఆటలు,పాటలు, పిల్లలు, సార్లతో ఆ బడి ఎప్పుడు హంగామాగా ఉంటది. మాకైతె ఇంట్ల ఉన్నా, బల్లె ఉన్నా ఒక్క తీర్గనే ఉంటంది. సర్కార్ బల్లె వానాకాలం చదువులకు, ఎండాకాలం పరీక్షలు ఉంటయి అని మా తాత ఎప్పుడు అంటడు. మా అన్న డిగ్రీ పాసయిండు. ఝండా (ఆగష్టు15) నుండి ఝండా (జనవరి26) వరకు బడి నడుస్తుదంటడు. నాకు ఇవన్నీ పూర్తిగా అర్థం అయితలేవు. వీటి అర్థాలు వాళ్ళు చెప్పరు. మీరు అయినా చెప్పాలె. మీరు కోపానికి రారని ఈ ఉత్తరం రాస్తున్న. ఎందుకో అర్థమయితలేదు. కాని నాకు ఈ బల్లె ఉండబుద్ది అయితలేదు. ఎటుపోదామన్నా దారి లేదు కనుక చచ్చుకుంట ఉంటున్నా. మా అయ్యవ్వల క్కూడా ఈ బడి అంటే ఇష్టం లేదు. మీరు పేరెంట్స్ మీటింగ్ పెట్టినా వాళ్లు రారు. ఇసొంటి బల్లె ఉంటేంది, లేకుంటేంది.మా పోరగాండ్లకు కూడా ఆటల మీద ఉన్న ఇష్టం చదువులమీద లేదు. అంత అడవిల ఉన్నట్లుంది. రోజురోజుకు సదువుమీద ఇష్టం తగ్గుతుంది. నా మనసుల ఉన్న ముచ్చట చెప్పిన మీరైతే ఏమి అనరు అనే నమ్మకంతో రాసిన.
ఇట్లు
మీ విధేయుడు
రామయ్య
ఉత్తరం పూర్తయ్యేసరికి కళ్లు బైర్లు కమ్మినాయి. ఏడవ తరగతి పిల్లలకింత అవగాహనా? ఆశ్చర్యమనిపించింది. గతవారం పల్లె నిద్రలో ఒక విద్యార్థి కలెక్టర్‌ను ప్రశ్నించిన ఉదంతం గుర్తుకొచ్చింది. తనొక్కడికే సైకిల్ ఇస్తే సరిపోదని ఊర్లో తనలాంటి వారు చాలామంది ఉన్నారని, వారికి కూడా సైకిల్లు ఇచ్చినప్పుడే ప్రభుత్వ ఉద్ధేశ్యం నెరవేరుతుందని చెప్పి, ఊళ్లో వాళ్ళందరికి సైకిల్ ఇప్పించిన వైనం జ్ఞప్తికి వచ్చింది. జీవితానుభవాలు వివేకాన్ని పెంచుతాయనాడానికి ఇంతకన్నా నిదర్శనమేముంది. వివేకం వల్ల కలిగిన ఆలోచనల సారాంశమో ఈ ఉత్తరాలనిపించింది. రామయ్య స్థితి అర్థమయింది. ఆ స్థితి వాణ్ణి ఎక్కడికి తీసుకోపోతదో అని భయం అయింది. ఉత్తరంలోని విషయాలన్ని నిజమైనవే. వాటిని సరిదిద్దదటమంటే ఎండమావిలో నీళ్ళు తోడడం లాంటిది. ఈ వ్యవస్థ తనను తాను అంతం చేసుకునే దిశగా బయల్దేరింది. ప్రమాదానికి దోహదం చేసే శక్తులకు తెలిసో తెలియకో వ్యవస్థ లోని వ్యక్తులు కూడా సహాయం చేస్తున్నారు. ఒక్క క్షణం మెదడును ఫ్రిజ్‌లో పెట్టి తీసినట్లయింది. ఆఫీసు నుండి తిరిగి తరగతివైపు మళ్ళిన. రామయ్యను కలవాలనిపించింది. మొహం చెల్లలేదు. కలవడం వాయిదా పడింది.
మరునాడు యధావిధిగా పాఠశాల ప్రారంభమైంది రామయ్యను పిలిపించాను.రాలేదని తెలిసింది. ఒకటి, రెండు, మూడు, నాలుగు అలా పది, నెల రోజులైంది. రామయ్య బడికి రాక వివరాల కోసం ఇంటివరకు వెళ్ళాం. ఇంట్లో కనపడలేదు. తల్లిదండ్రులు కనపించాడు “సారూ! వాడు సదువు బంద్ చేసిండు” అని ఏక కంఠంతో అన్నారు. వెనుతిరిగి మెకానికల్‌గా వీధుల్లో మునిగి తేల సాగాను. బోధనలోను, బాధ్యతల్లోను మార్పు లేక మురిగిపోవడమైంది.
చాలా కాలం తరువాత రోడ్డుపై పరధ్యానంగా నడుస్తున్న నాకు నమస్తే సార్ అనే మాట వినపడింది. క్షణం ఆగి చూశాను. ఎదురుగా రామయ్య.
‘రామయ్యా! బాగున్నావా ‘-పలకరించాను.
‘మీరు బాగున్నారా’- పరామర్శించాడు.
‘ఏం చేస్తున్నావు?’
‘టైలరింగ్ నేర్చుకున్న’
“సొంతంగా షాప్ పెట్టినావా”
“లేదు. షాప్ లో పనిచేస్తున్నా”
“చదువు మానేసినట్లేనా”
“ఒపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేస్తున్న”
“ఇంకా విశేషాలు ఏమున్నయ్”
“సంపాదిస్తున్న. చదువుకుంటున్నా”
“సురేష్ కనిపించాడా”
“వాడు కూడా నాతోపాటు డిగ్రీ చేస్తున్నాడు”
“మొత్తానికి చదువుకైతే దూరం కాలేదు”
“బడికి దూరం అయినం కాని చదువుకు మాత్రం కాలేదు.”
నిజమే నంటూ ముందుకు కదిలాను. ఇప్పుడు నా కళ్ళ ముందు ఆ రెండు ఉత్తరాలు కదలసాగాయి.
March 2nd, 2009 at 4:19 am
1970 ల కాలపు – తెలంగాణ పల్లెల్లోని సర్కారు బళ్ళ పరిస్థితులకూ, ఇప్పటికీ పెద్దగా తేడాలు లేవని అర్థమవుతున్నది. నేను చదివింది (తుర్కల)కొత్తపల్లిలో..
తెలంగాణ పల్లెల “s0-called” అభివృద్ధిని మంచిగ వాతలువెట్టి చూపిన స్వామి సార్ కు ధన్యవాదాలు.
March 21st, 2009 at 2:20 am
Hello swammygaru,i like your story very much.i dint now much telugu tiyping.anduke telugune englishio rasthunanu.pellalatho utharallo rainchina idia nakku challa nachindi.idi kalpanana leka nijama tellucukovalani undi.nenu kuda oka teacherni.bhhusha anduke e sandeham vachindi.your story is reflecting a lot of students expirense.bagundi.
anuradha.
November 28th, 2010 at 7:58 am
చాలా బాగుంది.
అభినందనలు.