తోట

‘నా స్థలం పక్కనే నీ స్థలం. ఇద్దరం ఇరుగుపొరుగుగా ఉందాం’ మన్నుతో ఫ్రాన్సిస్‌ చెప్పాడు.
చంక కర్రలు చిందులు వేయగా మన్ను డాన్స్‌ చేశారు. మన్నుకు అరవై, ఫ్రాన్సిస్‌కు ఎనభై ఏళ్ళు.
మన్ను తన స్థలం చుట్టూ చూచి నడిమధ్యలో కూర్చుని కన్నీరు పెట్టుకొన్నాడు. ఫ్రాన్సిస్‌ ఓదార్చాడు.
సంతోషంతో మన్నుకు రాత్రంతా నిద్రపట్టలేడు. తెల్లారినా నిద్రలేవలేదు.
పిట్టలు పిలిచాయి. మన్ను పలకలేదు. కోకిలకూసింది. మన్ను కొక్కిరించలేదు. పిట్టలు స్నానం చేయలేదు. మన్ను కుళాయి కొట్టలేదు. మన్ను పూలు ఏరలేదు. పళ్ళు కోయలేదు. గేటు హాలు యాచనకు పోలేదు.
నిద్రలేచేసరికి వళ్ళంతా ఊగిపోతూ వుంది. సంతోషం సర్కారు ఎక్స్‌ప్రెస్సై గోదావరి పాతబ్రిడ్జిని పటపటాలడించింది.
ఫ్రాన్సిస్‌ కాళ్ళకు నమస్కరించి, గేటుహాలు పక్క నావబండ ఊదుకొని మళ్ళీ నిద్రపోయాడు. ఊపిరి అలిసిపోయింది.

ఏభై ఏళ్ళక్రితం మన్ను తండ్రితో పాటు తోటకు వచ్చాడు. నలుగురూ వెళుతూ అతణ్ణి రమ్మన్నారు ‘నాన్న?’ అడిగాడు.
‘వస్తాళ్ళే!’
‘నాన్నతో వస్తా’ తోట బాగుంది ఆడుకోసాగాడు. తండ్రి రాలేదు. రాత్రి. నిద్రపోయాడు. పొద్దుట ఆడుకోసాగాడు. ఆకలి అన్నంలేదు. తండ్రిరాలేదు.
అసలు పేరు మనోరంజన్‌. తండ్రీ మనూ అని, పక్కవాళ్ళు ‘మన్ను’ అని పిలిచేవాళ్ళు. మన్నుకు తల్లిలేదు. అన్నదమ్ముల్లేరు. అక్క చెల్లెళ్ళు లేరు. బంధువుల్లేరు. ఇరుగుపొరుగున్నారు. వాళ్ళ గూడుల్లో వాళ్ళు ఇరుకు గూళ్ళు. ఇద్దరు పడుకొంటే ఖాళీ ఉండదు. ఇరుకు గొందులు.
ఆ స్థలం ఎవరిదో, ఖాళీచేయమంటున్నారు. గుడిసెలవాళ్ళు వీల్లేదు అంటున్నారు. ఏరోజో పాకలు పీకేస్తారు. గూళ్ళుండవు. తండ్రిలేకపోతే ఆ గుడిసె గుడిసెకాదు. గుడిసెలమధ్య స్థలమే పిల్లల లెవెట్రీ బాత్‌రూం. ఎప్పుడూ తడిగా గలీజుగా కంపుగా ఉంటుంది.
పదేళ్ళ మన్నుకు కళ్ళు మెరుస్తుంటాయి. తల రింగుల జుట్టు.గుండ్రని ముఖం. కళ్ళలో కళ. అందమైన బొమ్మ. పోలియో కాళ్ళు కాకపోతే, మన్ను నిలువెల్లా బంగారు బొమ్మే.
పిల్లవాడు పెరిగాడు. బుద్ధి పెరగలేదు. తెలివితేటల్లేవు. స్కూలుకు పోడు. హోంలో చేర్చమన్నారు. తండ్రి చేర్చలేదు. మన్ను పిచ్చి వాడుకాడు. ఎవరినీ తిట్టడు. కొట్టడు. నవ్వటం ఏడవటం ఏదన్నా అడగటం బదులోడటం తెలుసు. ఆకలి దాహం తెలుసు. తండ్రికి అన్నీ తెలుసు.
గోడలమీది సినీమా బొమ్మల్ని చూస్తూ ఏంతసేపయినా నిలబడగలడు. చంకకర్రలతో కూడా పరుగెత్తగలడు. కుక్కల్ని రానీడు. తరమమని తండ్రి చెప్పాడు. మన్ను అంటే గుడిసెల్లో కుక్కలకు హడలు.
దాహమయితే బోరింగు కుళాయి కొట్టుకొని నీళ్ళు తాగాడు. ఆకలి. తండ్రిరాలేదు. టీలో ముంచుకొని బన్ను తింటున్న దావీదు మారాజు తుంచి ఇచ్చాడు. తింటూ అతడి పక్కనే కూర్చున్నాడు. ఎవరో తనకూ బిచ్చంవేసినట్లు డబ్బు పడేశారు. మన్నుకు డబ్బు విలువ తెలుసు. అది అన్నం పెడుతుందనీ తెలుసు.
అప్పణ్ణుంచి రాత్రయినా పగలయినా అతడి పక్కనే కూర్చునేవాడు. తండ్రి గుర్తుకు రావటంలేదు. బన్ను టీకి భయంలేదు. దాల్‌ చావల్‌ మేలు. బిరియాని, అబ్బో!.
తోటలోకి పొద్దుటా మాపిటేల జనం వస్తారు. సెలవుల్లో ఎక్కువ ఆదివారాలు రోజంతా వస్తారు. ఎంత జనం వస్తే అంత ధర్మం. అడగనక్కరలేదు. వాళ్ళే ఇస్తారు. ఎక్కువెక్కువ.
జనం తోటకువస్తూ అగరొత్తులు, కొవ్వొత్తులు, పూలూ, పూలదండలు తెస్తారు. ఇష్టం వచ్చిన చోట అలంకరిస్తారు. నమస్కరిస్తారు. నవ్వరు. దిగులుగా ఉండరు. దయగా ఉంటారు.
జనం గుంపుగా వచ్చినప్పుడు పూల పరుపులు తెస్తారు. పగలే వస్తారు. రాత్రి రారు. ధర్మం బాగా చేస్తారు. బిరియానీ తినవచ్చు.
ఫ్రాన్సిస్‌ తోటకు కాపలా. మన్ను అంటే ఇష్టం ఎప్పుడయినా బుగ్గ గిల్లుతాడు. తోటలోకి వచ్చేవాళ్ళు ఫ్రాన్సిస్‌ని పలకరిస్తారు.
ఫ్రాన్సిస్‌ లేనప్పుడు కుక్కల్ని మన్ను తరమాలి. రెండు కర్రలు వెంటపడటం యిష్టం లేక కుక్కలు రావు.
మొదట్లో చాలా సార్లు మన్ను ఫ్రాన్సిస్‌ అన్ననడిగాడు ‘మా నాన్న ఎప్పుడొస్తాడు?’ ‘వస్తాళ్ళే!’ ‘ఎప్పుడు?’ ‘వస్తాళ్ళే’ ఉండు మేమంతా లేమూ!
దావీదు మారాజు మన్నును ఓదారుస్తూ ఉండడేవాడు. యాచించటం, తినటం, నిద్రపోవటం ఇంతే మన్నుపని.
తను గుడిసె చూడటానికి పోయి బుల్‌డోజర్‌ కూల్చిన శిధిలాలు చూశాడు. ఇంకోసారి ఊడ్చినట్లున్న మైదానంచూశాడు. కళ్ళెత్తి చూస్తే కనిపించనంత ఎత్తుగా ఉన్న పదో పరకో పాతికో అంతస్తులున్న ఆకాశం చూశాడు. నేలమీద కార్ల తుర్రుబుర్రులతో నిలబడే చోటులేకుండా పోయింది. తమ గూటి నేల ఏ నీలి నింగిలోకి పాకి పోయిందో ఎప్పుడూ కింద పడిఉండే నేల ఇన్ని అంతస్తుల భవనమెక్కి.నేనెంత ఎత్తుకొచ్చానో చూడమని తొడగొట్టి, మీసం మెలేస్తూ, ఆకాశాన్ని ఎగతాళి చేస్తూ ఉండి ఉంటుంది.
‘మా గుడిసెలేదు. నేలకూడాలేదు.’ మన్ను ఏడ్చాడు.
ఫ్రాన్సిస్‌ చాలాసేపు ఆలోచించి ‘ నేనున్నానను. తోట ఉంది’ అన్నాడు
‘నాకేదీలేదు. అని ఏడుస్తుంటే,
‘ఏడవ్వద్దు. నేను కొంతస్థలం కొనుక్కొంటున్నాను. నీకూ కొనిస్తాను.’
‘డబ్బు?’
‘నువ్వే ఇవ్వాలి’
‘ఎంత?’
‘ఇస్తూ ఉండు’
‘సరే’!
‘నువ్వు ఇక్కడే ఉండు!’
‘సరే’
‘నాతోనే ఉండు’
‘సరే’
‘మనకు మనస్థలం ఏర్పడ్డాక మనం కలిసి సొంతం చేసుకుందాం’
‘సరే’!
స్థలం సొంతం ఉంటే గూడుంటుంది. తృప్తి ఉంటుంది. ఉత్సాహంగా ఉన్నాడు మన్ను.
తోటలోకి జనం బాగా వచ్చేరోజుల్లో బిచ్చగాళ్ళు చిక్కురొక్కురుగా వస్తారు. జనం రానిరోజుల్లో వాళ్ళు రారు. జనం వచ్చినా రాకున్నా దావీదుమారాజు తానూ ఎప్పుడూ తోటలోనే ఉండేవాళ్ళు.
దాన ధర్మాలు జరిగే రోజు వచ్చిన బిచ్చగాళ్ళు ఏమయిపోతారు? ఎక్కడో యాచిస్తుంటారు. పంటలు పండని కన్న తల్లి వంటి నేలను వదలి కూలికి ఊరువదలి దేశం మిదపడే రైతుల్లాగా యాచకులు. పనిదొరికేచోట వాళ్ళు ధర్మం దొరికేచోట వీళ్ళు. వాళ్లు వలసకూలీలు. వీళ్ళు వలసబిచ్చగాళ్ళు.
మన్ను అన్నం లేకపోయినా తోటవదలడు. అడుక్కోటానికి వేరే చోటికు పోడు. తోటంటే వల్లమాలిన ప్రేమ. తోట తండ్రి, తల్లి దేవుడు.
తోటనిండా చెట్లు పూలు కాయలు సువాసన. చెట్లు ఆకాశంతో స్నేహం. నేలతో గుసగుసలు. పొద్దుట, మాపేటల పిట్టల గోల. పిల్లల అల్లరే, ఎన్నిగూళ్ళు! ఎన్ని పిట్టలు.
చెట్టు క్రిక్కిరిసి నేలమీద ఎండ పొడ పడదు. తోట చల్లగా ఉంటుంది. అరుగైనా బండయినా మంచినిద్ర. చలిలో వానలో కష్టం. గేటు హాలే శరణ్యం. వచ్చేవాళ్ళు. పోయేవాళ్ళు హాలులో ఆగుతారు. దానం చేస్తారు.
వేసవి రాత్రిపూట స్వర్గమే! బతుకో చావో ఈడే మేలు. బండలమీద చంకకర్రల పోట్లు ఎంతలయగా, రాత్రి, దూరంగా వినిపిస్తాయి.
పట్టణం వెన్నల ఎరగదు. తోటకు తెలుసు. నగరానికి కోకిలకూడ తెలియదు. మన్నుకు తెలుసు. కోకిలని రెచ్చగొడితే పిచ్చిగా కూస్తుంది.
‘లైట్లు లేవు. వెలుతురు పడదు. భయం పుట్టదా? ఫ్రాన్సిస్‌ అడిగాడు
‘ భయం ఏమిటి? మన్ను అడిగాడు.
రాత్రి కలలువచ్చేవి అందమైన చందమామ ఆకాశంలోంచి దిగివచ్చి. చేయిపట్టుకొని తోటంతా తిప్పి, పాటలు పాడి జోకొట్టి నిద్రపుచ్చేది. ఒకోసారి పళ్ళు తెచ్చి వలిచి పెట్టేది, పూలు తెచ్చి మాల కట్టి. మెళ్ళో వేసేది కల కరిగిపోయేది. చందమామ మాయం.
చందమామ నేర్పిన పాట, ఆమె వెళ్ళాక చాలా సేపు పాడుకొనేవాడు. పాటతో నవ్వి ఏడ్చి తోటకు ప్రాణం పోసే వాడు. రోడ్డున పోయేవాళ్ళ తోటపాట విని దెయ్యాలు తిరుగుతున్నాయనుకొనేవాళ్ళు.
తోటలోకి చందమామ పాటతెస్తే, పూల పరిమళం తన గుండెలోకి పాటలాగా ప్రవహించేది. తీపిగా, తేనెగా, కన్నీరుగా, గానంగా పాట ప్రవహించేది.
చిన్నప్పుడు ఏ తల్లులో మేం పెంచుకొంటామంటే రానని తోటలో ఉండిపోయాడు మన్ను.
నడుస్తున్న వాళ్ల కాళ్ళు చూస్తే ఆనందం. కారు స్కూటర్‌ సైకిల్‌ ఏది నడపాలన్న కాళ్ళుండాలి. కాళ్ళను ప్రేమించే వాడు కాళ్ళున్న వాళ్ళను ప్రేమించేవాడు. వాళ్ళను ప్రేమించినట్లుగానే తనను తాను ప్రేమించుకొనేవాడు. నిన్నువలె నీ పొరుగువాళ్ళను ప్రేమించటం కాదు. పొరుగువాళ్ళను కాళ్ళున్న వాళ్ళను ప్రేమించినట్లే నిన్ను నువ్వు ప్రేమించుకో అనుకోసాగాడు.
వచ్చేపోయేవాళ్ళు మాట్లాడు కొనే మాటలు కొన్ని మన్ను వినేవాడు
‘నేను దేవుణ్ణి చూశాను’
ఫ్రాన్సిస్‌ నవ్వి ‘నువ్వు దేవుడి కొడుకువు’ అన్నాడు.
‘మా నాన్న?’
‘వస్తాడు!’
‘ఎప్పుడు?’
‘ఆ టైం రావాలి’
‘ఎప్పుడు?’
‘ఒకరోజు దేవుడువస్తాడు. ఆ దేవుడు ప్రేమయుడు. దయగల దేవుడు మృత్యుంజయుడు’
‘ వచ్చి?’
‘మృతుల్ని వెంట తీసుకపోతాడు!’ ‘
మనం మృతులమా?’
‘ఒక నాటికి మనమూ మృతులమే!’
‘ఎక్కడికి తీసుకుపోతాడు?’
‘స్వర్గానికి!’
‘ఎక్కడుంది?’
‘దేవుడి రాజ్యంలో!’
‘ఏముంటుంది?’
‘నిత్యానందం. నిత్య సుఖం కొదవలుండవు. కొరతలుండవు. అంతా సంతోషం. అంతా ప్రేమ ఆదరణ. ‘అన్నం?’
‘ఉంటుంది’
‘నాపబండ? ‘
‘ఉంటుంది’
‘అరుగులు?’
‘ఉంటాయి?’
‘చెట్లు?’
‘ఉంటాయి!’
‘పిట్టలు?’
‘ఉంటాయి?’
‘మా నాన్న?
‘ఉంటాడు!’
‘నేనూ పోతాను’
‘వద్దు’
‘ఏం?’
‘ముందు నేను, తర్వాత నువ్వు’
‘నీతోవస్తా!’
‘వద్దు’
‘ఏం?’
‘తోటకు కాపలా?’
‘కాపలా నేనుంటా?’
‘ఉండు’
‘సరే!’
మన్నుకు తోటంటే తీరని తీపి ఆ తీపే కలలు, పాటలు. ఆ పాటలకు మాటల్లేవు. సరిగమల్లేవు. సంగీతం లేదు. ఏదో సంభాషణ. ఎవరితోనే మాటలు. దేవతతోనా, దేవుడితోనా తెలియదు. చెప్పలేని ఆర్తి. తీరని అర్థం కాని ఆవేదన. కనిపించని దేవుడితో, కానరాని స్వర్గంతో, కనిపించే చెట్లతో తోలే గాలితో, వచ్చే చల్లదనంతో, పూల పరిమళంతో, కాలంతో, నేలతో, నింగితో, కోకిల కూతతో మాట్లాడటం. ఆడటం. పాడటం. ఏవో ధ్వనులు, ఏవో స్వరాలు, ఏదో ఆర్తి, ఏది ఏమిటో తెలియని శబ్ద చలనం. నడక, వయ్యారం, కులుకు, సోయగం. కాళ్ళుంటే పాట వయ్యారపు నడక అయ్యేది. వయస్సుంటే ఆ కులుకు శరీరమయ్యేది. కర్రల్లేకపోతే ఆ సోయగం కాయకష్టమయ్యేది.
‘రాత్రి పాడింది నువ్వేనా?’
‘పాటా? నేనా?’
ఆ! నువ్వే! ఎంతబాగా పాడావో!’
‘నేనుకాదు!’
మన్నుకు పాటలు రావు. సంగీతం రాదు. మన్ను ఆర్తి! మన్ను ఆవేదన. మన్నుకు అది తన ఆర్తి అని తెలియదు.
పొద్దున్నే పూలేరుకొనేటప్పుడు. చుట్టూ చేరిన పక్షుల్ని ఏరుకోబోయేవాడు. అవి మేతకు వెళ్ళిపోతే. తాను గేటు హాలు ధర్మం కోసం చేరేవాడు.
సాయంత్రం కుళాయి కొట్టి నీళ్ళు పోసుకొంటుంటే పక్షులు చుట్టూ చేరి వినోదం చూచేవి. పిట్టలు నీళ్ళుతాగి స్నానం చేసి, రెక్కలు విదిలించి, నీళ్ళ తుంపర్లు మన్నుమీద విదిలిస్తే ఎంత హాయిగా ఉండేదో!
కోకిల దొంగ.దొరకదు. కోకిల సోగ్గత్తె. మహా టెక్కు దగ్గరకురాదు. మిగతా పిట్టలు మంచివి. ముద్దుగా దగ్గరకు వస్తాయి.
మన్నుకు మహా శుభ్రం. మూడుసార్లు స్నానం.
మన్నుకు ఏ జబ్బూలేదు. తుమ్ము లేదు. దగ్గు లేదు, జర్వంకూడా లేదు.
దావీదు మారాజుకు జ్వరం. వళ్ళు కాలిపోయింది. నాలుగో రోజు ఊపిరిలేదు. తన గోడు చెప్పుకొనే వాడు. గేటు హాలునుంచి తీసి రోడ్డు మీద పెట్టారు శవాన్ని. మునిసిపాలిటి వేన్‌ వచ్చింది. పిచ్చి కుక్కల్ని. మంచి కుక్కల్ని కూడా పట్టుకుపోయే వేన్‌. శవాన్ని ఎక్కించారు. తీసుకుపోయారు ‘కుక్కలాగా చంపుతారా?’
‘చనిపోయాడు’
‘కుక్కల్ని పారేసే చోట పడేస్తారా?’
‘ పడెయ్యరు’
‘మరి?
‘కాల్చేస్తారు
‘వళ్ళంతా కాలుతుందా?’
‘కాలుతుంది’
‘బూడిద అవుతుందా?’
‘అవుతుంది!’
‘బాధకదా!’
‘బాధే-బతికి ఉంటేనే అన్ని బాధలు’
‘నవ్వు చచ్చి పోతావా?’
‘ఆ’
‘నేనూ చచ్చిపోతానా?’
‘ఆ’
‘మనల్ని కాలుస్తారా?’
‘కాల్చరు!’
‘మరి?’
‘పాతిపెడతారు!’
‘బాధ ఉండదా?’
‘ఉండదు, బతికి ఉండటమే బాధ చనిపోవటం సుఖం’
‘ ‘నేనూ- దావీదు మారాజు లాగా చచ్పిపోనా’
‘వద్దు!’
‘ఎందుకు?’
‘కొన్నాళ్ళు బాధలు భరించాలి’
‘సరే’ అంగీకరించాడు మన్ను.
అయోమయంగా చూశాడు ప్రాన్సిస్‌.
స్థలం కొనుక్కోవాలన్న ఆలోచన మన్ను జీవితంలో పెద్ద మార్పు తెచ్చింది. తిండి యావతగ్గింది. బిచ్చం డబ్బులు ఫ్రాన్సిస్‌కు ఇవ్వసాగాడు. తిండి తీర్థం సహించటంలేదు.
స్థలం కోర్కె లేనప్పుడు వచ్చిన డబ్బులన్నీ ఖర్చు చేసేవాడు. కడుపునిండా తినేవాడు. ఆ రోజుకు డబ్బు సరిపోతుందంటే ఇక అడుక్కొనేవాడు కాడు. గేటు హాలులో ఉండేవాడుకాడు. అవసరానికి మించి అడుక్కోవటం, అతడి దృష్టిలో అనవసరం. నిద్ర మేలు.
మన్నుకు రేపటి దృష్టిలేదు. సంపాదించే అవసరం లేదు. సుఖంలేని యాచన చేయడు. తిండికి దొరికితే తిని మేనువాల్చటమే.
స్థలం చింతపట్టుకొంది. సమయం సందర్భంలేదు. యాచనే యాచన. రోజంతా బిక్షాటనమే! వసూలయిన మొత్తం ఫ్రాన్సిస్‌ ఇచ్చేవాడు. తిండిలేదు. తీర్థంలేదు. ఎప్పుడయిన బన్ను టి. అంతే!
ఈ రెండేళ్ళలో కోకిలన్ని కొక్కిరించ లేదు. చందమామ దేవదూతను కల్లోకి తెచ్చుకోలేదు. ఆర్తి ఆవేదన పాట ఎండి గొంతులో తడి మాయమయింది. పిట్టల పడి, పూల పుప్పొడి, ఫలాల రుచి, స్నాన సుఖం, నిద్ర ఆనందం అతణ్ణి ఉత్సాహ పరచటం లేదు.
గుండెలో ఊరే గుబగుబలు లేక, గొంతులోపలికే తేనే సెలయేళ్ళ తుళ్ళింతలు లేక, ముఖంలో చిందులు వేసే సూర్యుడి మెరుపులు లేక, కళ్ళలో ప్రతిబింబించే సముద్రతరంగాలు లేక, నిద్ర రాక, మెలకువ కాక, చంకకర్రల నృత్యం మాయమయింది. మనిషి ఢీలాపడిపోయాడు.
స్థలం ఆరాటం లేకపోతే ముసలితనం వచ్చేదికాదు. కోరికలెంత కోతివి, తిక్క రేపుతాయి. స్థిమితం లేకుండా ఎగురుతాయి. ఈ ఎగురుళ్ళకు అవిటి మన్ను తట్టుకోలేకపోయాడు.
ఫ్రాన్సిస్‌ గుర్తించాడు. మన్నుకీ స్థలం తిమ్మరి కిర్రెక్కించి ఉండకపోతే సుఖంగా ఉండేవాడు. దిగులు మాన్చబోయి, మన్నుకు అకాలంగా వృద్ధాప్యం తెచ్చిపెట్టాడు.

సాయం కాలం దాకా నిద్రపోయిన మన్ను రాత్రి తన స్థలం దగ్గరకు పోయి చుట్టూ చాశాడు. చెట్లు పూలు పరమశాంతంగా ఉన్నాయి. తన స్థలంలోని మట్టి వాసన పీల్చి తల పంకించాడు మన్ను.
తన స్థలంలో కూర్చుని గుప్పెడు మట్టి ఎత్తి ముద్దాడాడు. గుండెలమీద పోసుకొన్నాడు.చల్లగా ఉంది. లేవలేకపోయాడు. అరుగు మీదో, బండమీదో పడుకొనే మన్ను నేల మీద నిద్రపోయాడు.
తెల్లారాక ఫ్రాన్సిస్‌ మన్ను కోసం చూశాడు. ఎక్కడా లేడు. పిట్టలు మేతకు పోలేదు. చుట్టూ చేరాయి. కోకిల కూయలేదు. చెట్టుపూలు కన్నీరు రాల్చాయి. పూలమధ్య మన్ను.
తోటలో మన్ను కోసం తాను కొన్న స్థలంలో తమ్ముడు పూలలో మునిగి ఉన్నాడు.
ఫ్రాన్సిస్‌ స్థలం పక్క మన్ను స్థలంలో ఆరడగుల పొడవు, మూడడుగుల వెడల్పు, మూడడుగుల లోతు తవ్వారు.
మన్ను శరీరం గుంతలో పెట్టారు. మన్ను మీద మన్ను కప్పారు.
ఆ మట్టి కుప్పమీద ఫ్రాన్సిస్‌ మల్లెతీగ నాటాడు.

ఒక అభిప్రాయం »కథలు

One Response to “తోట”

  1. 1
    pravallika Says:

    చాలా మంచి కథ, కథ నదిపినథిరు బాగుంది,

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో