Mar2009
మనం మళ్లీ వెనక్కి వెళ్ళిపోదాం…!
మనమంతా ‘లైఫ్-టైం’ ఖైదీలం!
సెల్ జైళ్ళల్లో మగ్గుతున్నాం!
అగ్రరాజ్యం రింగ్ మాస్టరై
ఆడించే గ్లోబులా…
సెల్ చేతిలో కీలు బొమ్మలం!
సెల్ భ్రమణం చేస్తూనే వున్నాం!
కలికాలం కాల్ కాలమై కూర్చుంది!
జీవితాన్ని ఓ మిస్‌డ్ కాలై మింగేసింది
అనుక్షణం – ‘కాల్‌గర్ల్’ కవ్వింపులతో
చెవులతో మొదలెట్టి
గుండెను కొరుక్కుతింటుంది!
కాలాన్ని రీచార్జ్ చేసుకుంటూ
ఫ్రీ పెయిడో.. పోస్ట్ పెయిడో..
ప్రతి మనిషి తనకు తానే ఓ పేయింగ్ గెస్ట్!
కూడు… గూడు… గుడ్డ లేకున్నా…
చవులూరించే సెల్‌ఫోన్ వ్యసనానికి బానిసలం!
ఆమె మెడలో పసుపుతాడైనా
అతడి నడుముకు మొలతాడైనా సెల్ తాడే ఇప్పుడు!
సెల్లెప్పుడు దొంగ కోడై కూస్తూనే వుంటుంది!
అబ్బాయిల చెవిలో సెల్ పువ్వులై
అమ్మాయిల చెంపకు చారడేసి సెల్లై
సేవ్‌కు…క్యాన్సిల్‌కు మధ్య…
హలోకు.. బై కు మధ్య..
‘ఛా’టింగ్‌లు..డేటింగ్‌లు..
నమిలి ఊసే బబుల్ గమ్‌లు!!
“డోంట్ మిక్స్ సెల్ అండ్ డ్రైవ్”
మూడు కోతుల సామెతయ్యింది
చీకటి పనులకు రాత్రే కానక్కర్లేదు!
సెల్‌తో కబురు పెడితే చాలు..
వాత్సాయనుడికి సైతం వాంతయ్యేలా
జుగుప్సాకర దృశ్యా దృశ్యాలు…
పసిమనసుల్లో గుచ్చే స్టెరాయిడ్లు
ప్రపంచం నడిచే మొబైలై
ప్రతివాడు బిజీ మంత్రం జపిస్తూ..
చెవిలో సెల్లు కట్టుకుని పోరేవారే అందరూ…
సెల్లిప్పుడు హస్తభూషణం కాదు
మనల్ని ఆవహించిన కర్ణ పిశాచి!
సమూహంలో వున్నా
ఒంటరి పక్షిలా ఎగిరిపోతూ
ఒంటరిలోనూ…
సమూహంలా నటిస్తూ
ఎటు చదివినా ఎస్‌ఎంఎస్‌లు
ఎటు చూసినా వాలే రింగ్‌టోన్ కాకులు
చెవిలో సీసం పోస్తూ
సెల్లెప్పుడు నీడలా వెంటాడి మ్రోగించే…
మృత్యు ఘంటికలు!
సారే జహాసే అచ్ఛా! వందేమాతరం! సైతం…
సెల్‌లో బంధించబడ్డ నేపథ్యంలో
సర్వం సె(సొ)ల్లు మయమై
నిరతము ఘల్లు మయమై
టాక్ ఆఫ్ ది టౌనై… మనమంతా చెవులు పోతులమై
నిత్యం బతుకు రింగులో యుద్ధం చేస్తూనే ఉంటాం
ట్రాయ్‌ని టాయ్ చేసి ఆడుకుంటున్న బహుళజాతి సంస్థలు
సెల్ ‘కీ’ ఇస్తే చాలు
భూగోళం బద్దలౌతూనే వుంటుంది
సెల్ మనచేతిలో అణ్వాయుధమా?
మనల్నే దహించే టైంబాంబా?
తెలిసీ సమాధానం చెప్పకపోతే
నీ బతుకు వేయి ముక్కలౌతుంది
టెలివిజన్లు, సెల్ కంప్యూటర్లలో
ప్రపంచమంతా మన ముందువాల్తున్నా…
జీవితంలో ఏదో కోల్పోయాం అన్న ఆకాశమంత దిగులు!
వ్యక్తిగతాన్ని విచ్ఛేదనం చేస్తూ
నిశ్శబ్ద సౌందర్యాన్ని వికృతం చేస్తూ
సంస్కృతిని సైతం విషతుల్యం చేసే
ఈ సాంకేతిక విప్లవం
హిరోషిమా…నాగసాకీలకు ఓ సాదృశ్యం!
నాదో లెటెస్ట్ మెసేజ్…
మెదళ్ళ విశృంఖల శాస్త్ర విజ్ఞానాన్ని
మొదళ్ళలోనే స్విచ్ ఆఫ్ చేసేద్దాం!
చెవుల్ని కోసుకున్న మనం, ఇక గుండెలను కోసుకుందాం!
ఆ సర్వ స్వర కాలుష్యాలకు దూరంగా
మనం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం!
యాంత్రిక నేపథ్యంలోంచి, కృతకమైన బ్రతుకుల్లోంచి
కాలచక్రంలో మనం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం!
పాలపిట్టల్లా పాటలు పాడుకుంటూ
బాల్యపు తటాకాల్లో ఆటలాడుకుంటూ…
జ్ఞాపకాల పుస్తకాలలో దాచుకునే
నెమలికన్నుల ఉత్తరాలవుదాం…
బతుకు చెట్ల క్రింద వనభోజన మహోత్సవంకై
జీవనోత్సవంకై మనం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం!
ఒక ఆత్మీయ స్పర్శ కోసం!
ఒక స్వచ్ఛమైన అనంతమైన ఆనందం కోసం!!
March 3rd, 2009 at 2:49 pm
Very nice writing. I think this requires translation into other languages, especially into English for wider circulation/audience.
March 3rd, 2009 at 9:25 pm
నరస రాజు గారు!
ప్రాణహిత లొ మీ … మనం వెనక్కి వెల్లి పొదాం…అన్న మీ భావ వ్యక్తీకరణ చాలా బాగుంది.అందులొ..
” మెదళ్ళ విశ్రున్ఖల శాస్త్ర విఙ్నానాన్ని
మొదళ్ళ లొనే త్రుంచెద్దాం ” అనె పదాలు,అద్భుతం.
గొప్ప సామాజిక అవగాహన, సామాజిక స్ప్రుహ దండి గా కల వారే యీ తరహా భావాలను వ్యక్త పరచ గలరు. సామాజిక రుగ్మతలు పెరగటానికి మనమందరం తలొ ఇసుక పలుకు వేస్తూనె పొతున్నాం.
అది రుగ్మత అను కొవదడానికి మనలొ ఎవ్వరం సిద్ధంగా లేకపొవడం దురద్రుష్టకరం..
ఈ మాట వారికి, ఫప్రానహిత పత్రిక వారికి ప్రత్యెక క్రుతగ్నతలు.తెలుగులొ వ్యాఖ్యానించచే అవకాసం యిచ్హిన యీ తెలుగు పరికరం అనుసంధానించదం పత్రిక వారి స్రుజనాత్మకతకు అద్దం. గొప్ప సౌకర్యం.ఆభినందనలు.: నూతక్కి రాఘవెంద్ర రావు.
March 4th, 2009 at 7:00 pm
కొన్నేళ్ళ కిందట ఫిన్లండ్ వెళ్ళినప్పుడు అక్కడ సెల్ ఫోన్ల విస్తృత వినియోగం చూశాను. చలిలో, మంచులో ఇంటికి దూరంగా చిక్కుకుపోయినవారికి చావుబతుకుల్ని నిర్ణయించే ఏకైక సాధనం సెల్ ఫోనేనని తెలిసింది. ఇక బొంబాయిలో ఇల్లు కూడా లేకుండా చిన్న వ్యాపారాలూ, పనిపాట్లూ చేసుకు బతికే పాటకజనానికి సెల్ ఫోన్లు ఎంత సహాయపడతాయో కళ్ళారా చూశాను. డబ్బూ, మదం పెరిగి, ఆడవాళ్ళని కన్స్యూమబ్ ల్ కమోడిటీల్లా చూసే వెధవలు దుర్వినియోగపరిచినంత మాత్రాన పాపం సెల్ ఫోన్లదేం పాపం?
March 12th, 2010 at 10:36 am
శ్రీ నరస రాజు గారూ,కామెంట్లకు సమాధానాలిస్తే,అభిప్రాయాలు పంచుకోవచ్చు.
నా మొదటి కామెంటుకు కొనసాగింపుగా….శ్రీ రోహిణిప్రసాద్ గారితో ఎకీభవిస్తాను. ఇంటిలో ఎలుక చేరిందని ఇంటిని తగలెట్టుకోలేముకదండీ.ఆధునిక విఙాన ఫలితాలు దుర్వినియోగం కాకుండా నియంత్రణా వ్యవస్తలుండాలి… మంచి చెడులు ప్రతి ఆధునిక ఆవిష్కరణకూ వుంటాయి. విచక్షణ ముఖ్యం. …..నూతక్కి