ఏప్రిల్ 2009 సంపాదకీయం

ప్రాణహిత ఏప్రిల్ 2009 సంచికకు స్వాగతం. ప్రాణహిత పాఠకులందరికీ విరోధినామ సంవత్సర శుభాకాంక్షలు! ఈ విరోధినామ సంవత్సరం ప్రజాకంటకులకు విరోధియై, వైరుధ్యాలని పరిష్కరించి వైవిధ్యాలని ప్రసాదిస్తుందని ఆశిద్దాం.
సాహిత్యం ప్రజల వైపు నిలవాలా ప్రజాకంటకుల వైపు నిలవాలా అంటే ప్రజల వైపే నిలవాలని, రాజ్యం పక్షం వహించాలా, రాజ్యంచే అణచివేతకు గురవుతున్న వారి పక్షం వహించాలా అంటే నిస్సందేహంగా పీడక రాజ్యాన్ని ప్రతిఘటించాల్సిందేనని ప్రజాస్వామిక దృక్పథంగల వాళ్ళందరూ దాదాపుగా అంగీకరిస్తారు.  అయితే ప్రజల మధ్య వైరుధ్యాలని, విభిన్న సమూహాల ప్రజాస్వామిక ఆకాంక్షల మధ్య వైరుధ్యాలను సాహిత్యం ప్రతిఫలించినప్పుడు అనేక సున్నితమైన సమస్యలు ముందుకొస్తాయి. అప్పుడు అన్నీ నలుపు తెలుపుల్లా స్పష్టంగా ఉండకపోవచ్చు. ఒకరికి ప్రజాస్వామికంగా అనిపించింది మరొకరికి అప్రజాస్వామికమనిపించవచ్చు. సరిగ్గా ఇటువంటి పరిస్థితుల్లోనే  సంయమనమూ, సాహిత్య విమర్శా ఎంతో ఉపయోగపడతాయి.

సాహిత్యంలో వ్యక్తీకరించిన అభిప్రాయాలు మనకు వ్యతిరేకమైనా, అవి ఒక ప్రజాసమూహం ప్రజాస్వామిక ఆకాంక్షలయితే గనక వాటిని గొప్ప సంయమనంతో అర్థం చేసుకుని స్వీకరించాల్సిన అవసరముంది. ఆయా సాహిత్యాల్లో చిత్రించిన జీవితాన్ని, సమాజ పరిస్థితులను, జీవన వైరుధ్యాలని ఆ వైరుధ్యాలు వెతికే పరిష్కారాలని వాటి ప్రజాస్వామికతను సాహిత్య విమర్శ పనిగట్టుకుని పాఠకులకు విశ్లేషించి పరిచయం చేయాలి. సాహిత్య విమర్శ కేవలం చరిత్ర, సమాజము అని పై పై పడికట్టు మాటలతో సరిపెట్టుకోకుండా సమకాలీన సాహిత్యాన్ని సృష్టిస్తున్న ప్రజల దృక్కోణాన్ని,  ఆ సాహిత్యంలో చిత్రించిన జీవితాన్ని, ఆ జీవితం లోని వైరుధ్యాలని పరిశీలించి లోతుగా చర్చించాలి.  అప్పుడే ఆ సాహిత్యం ఎక్కువ మంది పాఠకులకు చేరగలుగుతుంది. సమకాలీన తెలుగు సాహిత్యం ఇంతకు ముందెన్నడూ లేనంతగా సమాజంలోని అనేక సమూహాల ప్రజలనుండి, విభిన్నంగానూ,  ఎంతో వైవిధ్యభరితంగానూ సృష్టించబడుతున్నది. సమకాలీన సాహిత్యంలో వస్తువు, ఇతివృత్తం, జీవితం, వైరుధ్యాలు, భాష అన్నీ ఎంతో కొత్తవి. మనకు పరిచయం లేనివి. చాలా సార్లు మన సాధారణ జ్ఞానానికి (common sense) అందనిది. కొన్ని సార్లు ఊహక్కూడా అందనిది. ఇటువంటి జీవితం కూడా ఉంటుందా, ఇటువంటి మనుషులు కూడా ఉంటారా, ఇటువంటి కోరికలు కూడా ఉంటాయా అని అచ్చెరువొందేంత వైవిధ్యం సమకాలీన సాహిత్యంలోనున్నది.

అయితే మనకర్థంకాని వాటిని, మనకెన్నడూ అనుభవంలోకి రాని మనకెన్నడూ పరిచయంలేని వాటి గురించి సాహిత్యం మాట్లాడినప్పుడు ఆ సంభాషణ , మనకర్థం కావాలన్నా, మనకు చేరువవ్వాలన్నా బాధ్యతాయుతమైన సాహిత్య విమర్శ ఎంతో అవసరం. కేవలం రూపం గురించే చర్చిస్తూ పోతూ,  ఇంతకు ముందే ఏర్పర్చుకున్న పడికట్టు రాళ్ళతో తూకం వేస్తూ, కొలబద్దలతో కొలుస్తూ సాహిత్యం బాగోగులు నిర్ణయిస్తే సమకాలీన సాహిత్యానికి అన్యాయమే జరుగుతుంది. జీవితంలోని వైరుధ్యాలని నిజాయితీగా చిత్రించి , వాటి పరిష్కారాల్ని నిర్దిష్టతలోనూ, సార్వజనీనతలోనూ వెదికే ప్రయత్నం చేస్తున్న గొప్ప సాహిత్యం, prejudices వల్లా కృత్రిమ సరిహద్దులవల్లా నిర్లక్ష్యానికి గురికాకుండా చూసే బాధ్యతను సాహిత్య విమర్శకులు స్వీకరించాలి.  నిజానికి రచయితకూ, విమర్శకునికీ, పాఠకునికీ సరిహద్దులు చెరిగిపోతున్న ఈ అంతర్జాల సమాచారయుగంలో ఆ బాధ్యత సహృదయులూ, ప్రజాస్వామికవాదులూ అయిన  పాఠకులే నెరవేరుస్తారు.                

‘భూమి గుండ్రంగా ఉందా బల్లపరుపుగా ఉందా’ అని నిర్ణయించేది అధికారం చలాయించేవాళ్ళేననీ, ‘బోజనం ముఖ్యమా విశ్వాసం ముఖ్యమా’ అనే ప్రశ్న ఒక్క పూటకయినా సరిగ్గా తిండి దొరుకని  అట్టడుగువర్గాల ప్రజానీకానికి అనవసరమయిందని, రాజ్య వ్యతిరేకతను, ప్రజలని పీడించే, అణచివేసే పాలకుల పట్ల వారికి కొమ్ము కాసే ఖాకీ వ్యవస్థ పట్ల క్రోధాన్ని తన రచనల్లో చాలా బలంగా, శక్తివంతమైన వ్యంగ్యాస్త్రాలతో చీల్చి చెండాడిన కె. ఎన్ . వై . పతంజలి మనకింకలేరు. ‘ఖాకీ వనం’ ‘గోపాత్రుడి కథ’, ‘ఒక దెయ్యం ఆత్మకథ’, ‘పిలక తిరుగుడు పువ్వు’ లాంటి గొప్ప నవలలు, సమకాలీన రాజకీయాలపై ‘పతంజలి భాష్యం’, హృదయాల్ని కదిలించే ‘చూపున్న పాట’ లాంటి ఎన్నో కథలు రాసిన పతంజలి పెద్ద వయస్సేమీ మీరకుండానే కాన్సర్ బారినపడి అకాల మరణానికి గురయ్యారు. ఎన్నో పత్రికలకు చీఫ్ సబ్ ఎడిటర్ నుండి సంపాదకుడిగా పనిచేసినా, కష్టకాలంలో ఆయుర్వేదాన్ని ఆశ్రయించినా పతంజలి ఆత్మనెన్నడూ అమ్ముకోలేదు. ప్రజాకంటకుల కీర్తిస్తూ రచనలు చేయలేదు. తన జీవితాంతం అణగారిన ప్రజల పక్షమే వహించారు. దుర్మార్గపు రాజ్యవ్యవస్థనూ దానికి కొమ్ము కాస్తూ అమాయకుల పొట్టనబెట్టుకునే క్రూర ‘ఖాకీ’ మృగాలనూ తన పదునైన రచనల్లో దునుమాడారు. రాజులని. రాచరిక వ్యవస్థనూ, ఫ్యూడల్ విలువలని, అధికారాలని నిరంతరం ప్రశ్నించి ఎద్దేవా చేసారు. తన రచనల్లో ఒక అద్భుతమైన ‘మాంత్రిక వాస్తవికతతో’ అబ్బురపరిచే పాత్రలతో, సంభాషణలతో, శైలితో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసారు. గొప్ప విషయమేమిటంటే పతంజలి తన రాజ్య వ్యతిరేకతను కానీ, దుర్మార్గపు పాలకుల పట్ల క్రోధాన్ని కానీ, అణగారిన ప్రజల పట్ల ప్రేమను కానీ పడికట్టు పదాలతోనో సైద్దాంతికచర్చల్లోనో చెప్పలేదు. జీవితాన్ని నిజాయితీగా ప్రతిబింబించిన సాహిత్యంలో నిఖార్సైన నిజాలుగా చెప్పారు. జీవితం కానిదేదీ పతంజలికి సాహిత్యం కాలేదు. ఆయన సాహిత్యంలో సమాజం, జీవితం అనేక అద్బుత కోణాల్లో ఆవిష్కరించారు. రావిశాస్త్రి శైలికి కొనసాగింపుగా అనిపించినా సాహిత్యంలో పతంజలి ఒక అడుగు ముందుకే వేసారు. దేశదేశాల సాహిత్యాన్ని క్షుణ్ణంగా చదువిన పతంజలి ప్రపంచసాహిత్యం స్థాయికి ఏమాత్రం తీసిపోని  తెలుగు సాహిత్యాన్నిసృష్టించారు. పతంజలికి ప్రాణహిత అశృనయనాలతో నివాళులర్పిస్తున్నది.  ప్రజల పక్షం నిలిచిన పతంజలి తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్మరణీయుడు.

3 అభిప్రాయాలు »సంపాదకీయం

3 Responses to “ఏప్రిల్ 2009 సంపాదకీయం”

  1. 1
    నెటిజన్ Says:

    సంపాదకుడు పతంజలి కన్నా, కధకుడు పతంజలిగా నే మిగిలి “ఉంటాడు.

    ఇక పతంజలి క్లబ్ గురించి వివరాలు ఇక్కడ చూడండి.

  2. 2
    Ramulu Says:

    సాక్షి పత్రిక ఎట్లా ఆవిర్భవించింది అందరికి తెలుసు. దానికి ఎడిటర్ గా ఉండిన పతంజలిగారు ఆత్మనమ్ముకున్నట్టు కాదా? ఈనాడుకు గట్టి పోటీనివ్వగలిగే ఒక పత్రిక (సాక్షి) వచ్చినందుకు సంతోషమే ఐనా అందులో పని చెయ్య్డడం అంటే్ కొంతవరకు ఆత్మనమ్ముకున్నట్లే అనుకుంటాను. పతంజలి గారి రచనలు నేను చదవలెదు,కాని సాక్షి ఎడిటోరియల్స్్ కొన్ని చదివాను.

  3. 3
    కొత్తపాళీ Says:

    తగిన నివాళి.

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో