Apr2009
డిపెండెంట్ స్వర్గం
ప్రతీ రోజూ ముఖాన్ని అద్దంలో చూసుకుంటూనే ఉన్నాను
ఏ మార్పూ లేదు-
డిపెండెంట్ ముఖానికి మార్పులేం వుంటాయి?
ఇస్త్రీ చేయాల్సిన ఇంటిల్లపాదీ బట్టల్లా బద్ధకం పేరుకు పోతూంది
సింకులో పెనాలు
డిష్ వాషర్ లో ప్లేట్లు
అంతా సుఖమే
చన్నీళ్ళ బాధ లేదు
ఇల్లంతా కార్పెట్టు-
యంత్రమే శుభ్రం చేస్తుంది- నాచెయ్యి పట్టుకుని
ప్రత్యేకించి నాకో కారు
పిల్లల్ని స్కూల్లో దించడానికి-
పచారీ పన్లకీ-
చిన్నప్పటి పేంటూ చొక్కాల మోజు తీరిపోయింది
ఇంటర్నెట్టులో బంధువుల పలకరింపూ బానే ఉంది
రేడియో మిర్చి- టీవీ నైను- తెలుగు డీవీడీలు-
మంచు కురిసే నెగళ్ల రోజులు
చూసి తీరాల్సిన మాల్ లు
ప్రవాసాంధ్ర సాంస్కృతికోత్సవాలు
ప్రతీ రోజూ అద్దంలో నేను- అదే ముఖమేసుకుని
ఎంత చదూకున్నా నిరుద్యోగ వీసా గడప దాట నివ్వదు
ఏ రోజూ ఏ అద్భుత దీపమూ ప్రత్యక్షమవ్వదు
అతడి కెరీరే నా జీవిత గమ్యం
అతడి కాళ్ల మీద నించోవడమే- తప్పదు తథ్యం
అవును ప్రేమించాలీ దేశాన్ని
ఎలాగైనా చేరుకోవాలీ త్రిశంకు స్వర్గాన్ని
చెట్లూ పుట్టలూ ఆకురాలుస్తాయి
నా దగ్గర రాలేందుకు కన్నీళ్ళు తప్ప డాలర్లు లేవు
గాలులూ మబ్బులూ వాన కురిపిస్తాయి
నా దగ్గర కురిసేందుకు నిశ్శబ్దం తప్ప నోట్లు లేవు
వంట మనిషి, పని మనిషి
ఇస్త్రీ వాడు, డ్రైవరు
తోటమాలి, ఫైనాన్స్ మేనేజరు
షిఫ్టు తర్వాత షిఫ్టు….
ఓవర్ టెములున్నా ఒక్క పెన్నీ వుండదు
హైక్ లు, బోనస్ లు, అడ్వాన్స్ లసలే వుండవు
రోజుల తరబడి, నెలల తరబడి-ఏ మార్పూ లేదు
అద్దంలో – అదే డిపెండెంట్ ముఖం
April 4th, 2009 at 4:31 pm
‘అవును ప్రేమించాలీ దేశాన్ని’ అనే నిబంధన ఎవరికీ లేదు, పాటించరు కూడా. మన దేశపు వాళ్ళు చాలామంది నాలుగు రాళ్ళు సంపాదించుకోవటానికే విదేశాలకు వస్తారు తప్ప దేన్నీ ప్రేమించటానికి కాదనుకుంటాను. విదేశాలే కాదు, స్వంత ఊరిని వదిలి ఏ బొంబాయిలోనో, కలకత్తాలోనో ఉద్యోగాలు చేసుకుంటున్నవారిదీ అదే పరిస్థితి. ఇదొక ఆర్థిక సమస్య. ఇంటర్నెట్ తెలుగు పత్రికలూ, వెబ్ సైట్లతో కాలక్షేపం, అనుకున్నంత డబ్బు సంపాదించి వీలున్నప్పుడు వెనక్కెళ్ళిపోవడం తప్ప ఇక్కడివారికి మరో మార్గం లేదు. మహిళలది కాస్త ఎక్కువ ఖైదులా అనిపిస్తుంది.
April 16th, 2009 at 6:05 am
అమ్మా డాక్టరు గారూ,
డిపెండెంటు ముఖాలది అక్కడైనా ఇక్కడైనా మీరు చెప్పిన త్రిశంకు స్వర్గమే. అతడికాళ్ళమీద నుంచునీ వాళ్ళకి తప్పదుకదమ్మా?
చిన్నప్పటి పేంటూ చొక్కాల మోజు తీరిపోయింది అన్నావు అంటే? చిన్నప్పుడే ఆ పేంటూ చొక్కాలు మేం వేయుంచుంటే, ఈ త్రిశంకు స్వర్గంలోకి రాకుండా వుండేదానివా తల్లీ?
నీదగ్గర రాలేందుకు కన్నీళ్ళు తప్ప డాలర్లు, నీ దగ్గర కురిసేందుకు నోట్లూ లేవనెందుకు బాధపడతావు తల్లీ?
అమ్మడూ! వూరుకోకు. నీలాటి అమ్మాయిలు వూరుకుని, భరించడం వల్లనే, ఆయొక్క గిరీశాలూ, రామప్ప పంతుళ్ళూ, ఆఖరుకి వెంకటేశాలూ నీలాటి వాళ్ళందర్నీ చెడుగుడు ఆడేస్తారు తల్లీ.
అయితే, ఇది కవిత్వమేనా? కదిలించేది కవిత్వమే. ఇది కవిత్వమే.
రోహిణీప్రసాదు గారూ, మహిళలది కాస్త ఎక్కువ ఖైదు అని ఎలా అనగలిగేరండీ?
April 16th, 2009 at 9:50 am
అమెరికాలాంటి దేశాలకు భార్యలు మొదట డిపెండెంట్ వీసాల మీదనే వస్తారు. ఆ తరవాత క్రమంగా వారి పని పెరుగుతుంది. ఇంటో భారతనారి నిర్వర్తించవలసిన బాధ్యతలేవీ తగ్గవుగాని కారు తీసుకుని రోడ్డెక్కగానే మగ, ఆడ తేడాలు లేకుండా హక్కులూ, కొత్త బాధ్యతలూ కూడా మీదపదతాయి. ఇవన్నీ కాక ఇంట్లో ‘సాంస్కృతిక వాతావరణం గురించి మథనపడేది కూడా మహిళలే. అందుకనే వారిది ఎక్కువ ఖైదు అన్నాను. ఇంతా చేసి వారిది ‘రెండో’ కెరీర్, సంపాదనగానే ఉంటుంది. ఈ విషయాలు ఇక్కడుంటే కాని తెలియవు.
April 20th, 2009 at 1:00 pm
అమెరికా అద్దంలొ యెవరిముఖాల ముఖకవళికలయినా అంతె. యంత్రానికి చేతి స్పర్ష అర్థం కాదు కదా. యెన్ని ఓవర్ టైములు పని ఛేసినా నిశ్శబ్డం,కన్నీళ్ళు త్రిశంకు స్వర్గంలో మంచు కురిసె నెగళ్ళ్ లాం టివే. భర్త కెరేరె బాధ,బాద్యత అయిన చోట యె అద్బుతదీపం ప్రత్యక్షమవ్వదు, బలమయిన కవిత్వం, ……..గీత గారికి అభినందనలు.
October 11th, 2009 at 6:22 pm
[...] డిపెండెంట్ స్వర్గం : డా. కె. గీత [...]
January 17th, 2011 at 11:23 pm
[...] http://www.pranahita.org/2009/04/dependent_svargam/ This entry was posted in కాలిఫోర్నియా కవితలు. Bookmark the permalink. ← డంబర్టన్ బ్రిడ్జి వైరుధ్య ఉగాది → LikeBe the first to like this post. [...]