జ్ఞాపకశక్తిలో రకాలు, మతిమరుపు

ప్రస్తుతపు సమాచార యుగంలో లెక్కలేనన్ని విషయాలను మనకు క్షణంలో గుర్తుచేసేందుకు ఎన్నో సాధనాలున్నాయి. ఉదాహరణకు టెలిఫోన్‌ నంబర్లనూ, ఈమెయిల్‌ అడ్రసులనూ కంఠతా పట్టనవసరం లేకుండా పని జరుపుకునేందుకు సదుపాయాలున్నాయి. పొద్దున్నే అలారం మోగినట్టుగా ప్రతిరోజూ చెయ్యవలసిన పనులనూ, హాజరు కావలసిన సమావేశాలనూ, సంవత్సరం పొడుగునా బంధు మిత్రుల పుట్టిన తేదీలనూ, ఇతర సందర్భాలనూ సమయానికి మనకు గుర్తు చేసేందుకు పరికరా లున్నాయి. విద్యార్థులకు రెండురెళ్ళు నాలుగన్నదికూడా గుర్తుండనవసరం లేదు; కాల్‌క్యులేట ర్లున్నాయి. ఈ పరిస్థితులలో మనకు జ్ఞ్ఞాపకశక్తి అవసరమా అనిపిస్తుంది. అయితే అనేక సందర్భాల్లో ఇప్పటికీ మనకు జ్ఞ్ఞాపకశక్తి లేకుండా జరగదు. అందుచేత దాని వివరాలు తెలుసుకోవడం ముఖ్యమే.
జ్ఞాపకశక్తి ఎలా పనిచేస్తుందన్న విషయం గురించి పరిశోధకుల మధ్య ఏకాభిప్రాయం కనబడదు కాని కొన్ని వివరాలు నిరాకరించలేనివి. ఉదాహరణకు జ్ఞాపకాలనేవి ఆడియో టేప్‌ రికార్డింగ్‌లూ, వీడియో టేప్‌లూ, చిత్రాలూ వగైరాలవంటివి కావనీ, విడివిడి శకలాలుగా అనిపించే సమాచారపు తునకలవంటివనీ ఎక్కువమంది పరిశీలకుల అభిప్రాయం. మనకు ప్రత్యక్ష అనుభవం లోకి వచ్చేవేవీ పూర్తిగా నమోదుకావు. నమోదైన విషయాల్లోకూడా మన ఆసక్తినీ, అవసరాలనూబట్టి కొన్నిటినే మనం గుర్తిస్తాం. తక్కినవన్నీ వృథాయే. వీటిలో కూడా అధికభాగం మనం మరిచిపోయేవే. 
అసలు గుర్తుండేవన్నీ కొన్నికొన్ని అనుభవాల పరిమితఅంశాలే; ఇవి ఎలా నమోదవుతాయో ఇంకా ఖచ్చితంగా తెలియదు. జరిగిన సంఘటనలను మళ్ళీ గుర్తుచేసుకోవడంవల్ల జ్ఞాపకాలు బలపడతాయి. మనకొచ్చిన కలలవంటివి మనం మరిచిపోతున్నామంటే నమోదయే ప్రక్రియ తగుమాత్రం బలంగా జరగలేదన్నమాట. లేదా, మన స్మృతులకు తగినంత ప్రేరణ అందకపోవడం వల్ల అవి మనకు గుర్తు రావడంలేదన్నమాట.
ఒక్కొక్కప్పుడు మనకు కొన్ని వివరాలు బాగా గుర్తున్నప్పటికీ సందర్భాన్ని గురించి మరిచిపోతాం. తన రాజకీయ ఉపన్యాసాల్లో రొనాల్డ్‌ రేగన్‌ రెండో ప్రపంచయుద్ధంలో అమరుడైన ఒక బాంబర్‌ పైలట్‌ను గురించి హృదయాలను కదిలించే ఉదంతం చెప్పేవాడట. నిజానికి అది యదార్థ సంఘటన కాదు; ఏదో పాత సినిమాలోని సన్నివేశం. ఆ సంగతి ఆయనకు గుర్తులేదు. సామాన్యుల విషయానికొస్తే రోజువారీ విషయాలకన్నా ప్రత్యేకమనిపించేవి మరింత బాగా గుర్తుంటాయి. నిజానికి ప్రతిదీ ఇలా గుర్తుండకపోవడమే మంచిది; లేకపోతే పనికిరానివన్నీ మెదడులో శాశ్వతంగా నిలిచిపోయి దాని పని భారాన్ని విపరీతంగా పెంచేస్తాయి.
జ్ఞాపకశక్తిలో ఎన్నోరకాలు కనిపిస్తాయి. వీటిలో జ్ఞానేంద్రియాలద్వారా అందే సమాచారం పై ఆధారపడే సెన్సరీ, లేదా సంవేదక జ్ఞాపకశక్తి ఒకటి. మనం కన్నవీ, విన్నవీ, రుచి, వాసన, స్పర్శ వగైరాల ద్వారా అనుభవంలోకి వచ్చినవీ ఇందులో భాగం కాగలవు. అతి కొద్దిసేపు (ఒక సెకండులో ఇరవయ్యో వంతు) వావీవరసా లేకుండా రాసిన అక్షరాలను మనకు చూపించి, ఆ తరవాత వాటిని గుర్తుచేసుకోమనే పరీక్షలు కొన్ని ఉంటాయి. అయితే అలా కనబడి, మాయమైన అక్షరాల్లో కొన్ని మాత్రమే మనకు గుర్తుండే అవకాశం ఉంటుంది. ఈ పద్ధతిలో మనం గమనించే వివరాలు మనకు నిత్యాచరణకు పనికొచ్చే జ్ఞాపకశక్తిలో భాగం కాకపోతే ఎక్కువసేపు గుర్తుండవు. నిత్యాచరణకు పనికొచ్చే జ్ఞాపకశక్తికూడా స్వల్పకాలికమైనదే; అప్పుడే మనకు తెలియవచ్చిన టెలిఫోన్‌ నంబర్‌ వంటిది పదేపదే పైకి అనుకుంటే కొంతసేపు గుర్తుంటుంది. దాన్ని రాసిపెట్టుకునే లోపల మరేదైనా అడ్డుతగిలితే మరిచిపోతాం. అష్టావధానంవంటివాటిలో ఇటువంటి శక్తుల ప్రదర్శనకు ప్రాధాన్యత ఉంటుంది. అలాగే రెండు పెద్ద సంఖ్యల గుణకారం లెక్కలో ఇది ముఖ్యం.
దీర్ఘకాలికం అనిపించే జ్ఞాపకశక్తిలో కొన్ని విశేషాలుంటాయి. వీటిలో కొన్ని ప్రత్యేక సంఘటనలకు సంబంధించినవి. ఏళ్ళు గడిచినా ఫలానా పెళ్ళి సందర్భంగానో, ఒకానొక ప్రయాణం లోనో, చిన్నప్పటి దుర్ఘటనలోనో జరిగిన విషయాలు మనకు గుర్తుంటాయి. మరికొన్ని విషయాలు అర్థ వివరణనుబట్టి గుర్తుంటాయి; సంఘటనలద్వారా మనం పొందే ప్రత్యక్ష అనుభవాలతో వీటికి సంబంధం ఉండదు. ఉదాహరణకు తాజ్‌మహల్‌ నిర్మించినది ముగల్‌ చక్రవర్తి షాజహాన్‌ అనీ, ఉప్పును సోడియం క్లోరైడ్‌ అంటారనీ, మూడుమూళ్ళు తొమ్మిదనీ మనకు గుర్తుండటం ఈ పద్ధతిలోనే జరుగుతుంది. మెదడులో ఇటువంటి జ్ఞాపకాలు సంఘటనల స్మృతులకు భిన్నమైన పద్ధతిలో నమోదవుతాయని తెలుస్తోంది. ఎందుకంటే కొన్నిరకాల మెదడు వ్యాధులకు లోనయినవారు తమ వ్యక్తిగత విషయాలను మరిచిపోయినా ఇటువంటి శాశ్వతస్మృతుల విషయంలో మామూలుగానే ప్రవర్తిస్తారని తెలిసింది.
దీర్ఘకాలిక జ్ఞాపకశక్తిలోని కొన్ని అంశాలు కార్యనిర్వహణకు సంబంధించినవి. సైకిల్‌ తొక్కడమూ, ఈత కొట్టడమూ, క్రికెట్‌వంటి ఆటలు ఆడడమూ, సంగీత వాయిద్యాలు వాయించడమూ వగైరాలన్నీ ఒకసారి నేర్చుకున్నాక గుర్తుండిపోతాయి. తక్కిన విషయాలలాగ వీటిని ప్రతిసారీ ప్రయత్నపూర్వకంగా గుర్తుచేసుకోవలసిన అవసరం ఉండదు. మొదటిసారి నేర్చుకుంటున్నప్పుడు వీటికి అధికశ్రమ అవసరం కావచ్చుగాని, ఇటువంటివన్నీ అభ్యాసంతో మెరుగవుతాయి. అయితే ఈ ఉదాహరణలన్నీ ప్రత్యేకమైనవి; నిత్యజీవితంలో వివిధరకాలైన ఈ జ్ఞాపకశక్తులన్నీ మనకు కలగా పులగంగా పనికొస్తూ ఉంటాయి. ప్రతి సందర్భంలోనూ వీటిని విడదీయడం సాధ్యం కాకపోవచ్చు. ఉదాహరణకు మనం పెద్దఎత్తున జరుగుతున్న ఏ డిన్నరు పార్టీకో హాజరయినప్పుడు అక్కడి సంప్రదాయాలనూ, లాంఛనప్రాయమైన మర్యాదలనూ మనకు అలవాటు లేకపోయినా పాటించ వలసిరావచ్చు. అటువంటి సందర్భాల్లో మనం ఎప్పుడో నేర్చుకున్నవీ, కొత్తగా అలవాటయినవీ, ఇతరులను గమనించి పాటించేవీ రకరకాల విషయాలుంటాయి. అలాంటప్పుడు మన జ్ఞాపకశక్తులన్నీ మనకు రకరకాలుగా తోడ్పడవచ్చు.
మనం దేన్నైనా గుర్తు చేసుకుంటున్నప్పుడు మన జ్ఞాపకశక్తి ప్రత్యక్షంగానో, అంతర్గతంగానో పనిచెయ్యవచ్చు. ఇందులో మొదటి పద్ధతిలో మన గత అనుభవాలను మనం ప్రయత్నపూర్వకంగా నెమరువేసుకోవలసివస్తుంది. ఇటువంటి పరీక్షల్లో మనకు కొన్ని పదాలను చూపి, ఆ తరవాత వాటిని గుర్తుతెచ్చుకోమంటారు. మరికొన్ని పరీక్షల్లో బొమ్మలను గుర్తించమంటారు. అంతర్గత జ్ఞాపకశక్తి మాత్రం మనకు అప్రయత్నంగా పనికొస్తుంది. ఉదాహరణకు మన రోజువారీ సంభాషణలో వాడనటువంటి “పరపరాగ సంపర్కం” వంటి అరుదైన మాటను కూడా ఒక్కసారి ఎక్కడైనా వినగానే అదేమిటో తెలిసిపోతుంది. కొన్ని సందర్భాల్లో ఎక్కడో, ఎవరో అన్నమాటను ఈ పద్ధతిలో గుర్తుంచుకుని దాన్ని మన మాటగా మరొకచోట వాడడం కూడా కద్దు. ఆ క్షణంలో మనం మరెవరినో అనుకరిస్తున్నామన్న స్పృహ కూడా మనకు కలగకపోవచ్చు.
ఇలా విశ్లేషిస్తూ పోతే మన జ్ఞాపకశక్తి ఎంత జటిలంగా, ఎన్ని రకాలుగా నిత్యమూ పనిచేస్తూ ఉంటుందో అర్థమవుతుంది. జ్ఞాపకశక్తికి ఎటువంటి బాహ్యప్రేరణలూ, భౌతికఆధారాలూ ఉంటాయో అర్థమైతే కొన్నిరకాల స్మృతుల కారణంగా పూర్వజన్మ వగైరా తప్పుడు భావనలు ఎలా రూపొందు తాయో తెలుస్తుంది.
ఏదైనా సమయానికి గుర్తుకు రాకపోతే చిరాకుగా అనిపిస్తుంది. అదే గనక ఏ పరీక్ష రాస్తున్నప్పుడో, ప్రేక్షకుల ఎదుట నాటకంలో నటిస్తున్నప్పుడో, ప్రసంగిస్తున్నప్పుడో జరిగితే మరీ కంగారుగా ఉంటుంది. ఉన్న కాస్త మతీకూడా పోయినట్టనిపించడంతో మరిన్ని పొరబాట్లు చేస్తాం. ఎంతో సామర్య్థం కలిగిన మానవమేధస్సుకు మతిమరుపు అనే అవలక్షణం ఎందుకుంటుంది? మహా మేధావంతులుకూడా చిన్నచిన్న విషయాలు మరిచిపోయి అభాసు పాలవుతూ ఉంటారెందుకు? అయితే ఈ ప్రశ్నలకు ఎన్నో పార్శ్వాలు కనిపిస్తాయి. వాటన్నిటినీ పరిగణిస్తే మతిమరుపు అనేది జీవ పరిణామంలో ఒక లక్షణంగా ఎందుకేర్పడిందో అర్థం చేసుకోవచ్చు. మొదటి విషయమేమిటంటే జ్ఞాపకశక్తి ఎల్లవేళలా లాభకరం కాదు. కొన్ని జ్ఞాపకాలు బాధాకరంగానూ, తీవ్రమైన మానసిక సంక్షోభాన్ని కలిగించేవిగానూ ఉంటాయి కనక కాలక్రమాన వాటిని మరిచిపోవడం మనసుకు ప్రశాంతత నిస్తుంది. అలా జరగకపోతే ఎల్ల కాలం మానని గాయాలూ, శారీరక బాధల్లాగే కొన్ని రకాల స్మృతులు మనకు దీర్ఘకాలికమైన హాని కలిగించగలవు. అందుచేత కొన్ని సందర్భాల్లో మతిమరుపు అనేది శ్రేయస్కరమైన ఏర్పాటు.
ఇందులో మరొక అంశంకూడా ఉంది. మనకు నిత్యమూ అనేక కొత్త అనుభవాలు కలుగుతూ ఉంటాయి. ఇవాళ్టి సంఘటనకన్నా నిన్నటిదీ, అంతకన్నా మొన్నటిదీ పాతబడిందనే అవగాహన వాటి జ్ఞాపకాలు క్రమంగా బలహీనపడడంద్వారానే మనకు కలుగుతుంది. అలా కాకుండా ప్రతిదీ ఒకే స్థాయిలో ప్రస్ఫుటంగా, శాశ్వతంగా గుర్తుండిపోయేటట్టయితే మనకు కాలం గడుస్తున్నట్టుగా అనిపించదు. కొందరు పరిశీలకుల లెక్కన కాలవ్యవధిని గురించి సరిగా తెలియకపోతే మనుషులకైనా, ఇతర ప్రాణులకైనా పరిస్థితులకు అనుగుణంగా మారడం కష్టమౌతుంది. ఒకప్పటి తమ ప్రవర్తన ప్రస్తుతకాలానికి పనికిరాదనే సంగతి తెలుస్తూఉండడం జీవపరిణామపు పోటీలో నెగ్గడానికి అవసరమని వారి ఉద్దేశం. మరి కొందరు జ్ఞాపకశక్తి విషయంలో మెదడుకు పరిమితమైన సామర్య్థం ఉంటుందనీ, సమాచారం మరీ ఎక్కువయితే కొన్ని మరిచిపోవడం తప్పనిసరి అనీ అంటారు.
ఏదైనా జ్ఞాపకంగా నమోదయే క్రమంలో నాలుగు దశలుంటాయని పరిశీలనలు తెలుపు తున్నాయి. వీటిలో మొదటిది ఇంద్రియాలద్వారా అందే సంవేదకస్మృతి. మనం వినేవీ, చూసేవీ అన్నీ కొన్ని సెకండ్లపాటు గుర్తుండి అంతలోనే మాయమైపోతాయి. అనుభవాలన్నీ ఒకదాని వెంట మరొకటిగా కలుగుతున్నట్టనిపిస్తాయి. రెండోరకం జ్ఞాపకశక్తి ఆచరణకు సంబంధించినది. ఇది భావి జ్ఞాపకాలకూ, కార్యాచరణకూ మధ్యస్థంగా ఉంటుంది. విషయాలను గుర్తుతెచ్చుకునేందుకుకూడా పని కొస్తుంది. ఇది కొన్ని నిమిషాలసేపే పనిచేస్తుంది. దీని సామర్య్థం పరిమితం; మనం సామాన్యంగా ఒక్కసారిగా ఏడు విషయాలకన్నా ఎక్కువ గుర్తుంచుకోలేమని ప్రయోగాల్లో రుజువైంది. జాబితాకు మరొకటి చేరిస్తే మునుపటి వాటిలో ఒకటి మరిచిపోతాం.
మూడోరకపు జ్ఞాపకాలు స్వల్పకాలికంగా అనిపిస్తాయి; ఇవి ఒకటిరెండు రోజులపాటు గుర్తుంటాయి. ఇవి గుర్తుండడానికి కారణం వీటిని మనం దీర్ఘకాలికస్మృతుల్లోకి నెట్టకపోవడమే కావచ్చు. ఈ జ్ఞాపకాలు కొన్ని ప్రక్రియలకు లోనయిన తరవాతనే దీర్ఘకాలికమైనవిగా గుర్తుండి పోతాయి. నాలుగోరకానికి చెందిన ఈ దీర్ఘకాలికజ్ఞాపకాలేవీ మనం మరిచిపోము. ఎల్లకాలం ఈ పద్ధతిలో ఏవైనా విషయాలు గుర్తుండాలంటే అవి వివరాలవారీగా మస్తిష్కభాండాగారంలో పొందు పరచబడాలి. ఇదెంతో జటిలమైన ప్రక్రియలద్వారా జరుగుతుంది. మెదడులోని లక్షలకోట్ల నాడుల కణ జాలంలో ప్రసారమయే సంకేతాలు ఇందులో భాగమే. ఇలా నిక్షిప్తమైన సమాచారం మెదడులోని వివిధభాగాలకు చేరుకున్నట్టుగా అనిపిస్తుంది. కావలసినప్పుడల్లా విషయాన్ని వెలికి తీయడంలో విఫలమైనప్పుడే మతిమరుపు అనే భావన కలుగుతుంది.
పూర్వపు రోజుల్లో వృద్ధాప్యపు సహజలక్షణాల్లో మతిమరుపు ఒకటని భావించేవారు. ఈనాటి జీవితవిధానమూ, దృక్పథమూకూడా మారుతున్నాయి. సరైన వైద్యబీమా సదుపాయంలేని అమెరికా వంటి దేశాల్లో 70 ఏళ్ళకు పైబడినవారు సైతం ఉదరనిమిత్తం కార్లు నడిపి ఉద్యోగాలు చెయ్య వలసివస్తోంది. తక్కిన ఇబ్బందులతోబాటు వీరికి తమ ఆరోగ్యం గురించిన ఆందోళనకూడా ఉంటుంది. వైద్యుల లెక్కన ఈ వర్గంలో కూడా అప్పుడప్పుడూ ఏదైనా మరిచిపోవడం ఎవరికైనా స్వాభావికమే కాని వయసు మీరినవాళ్ళలో ఇది మరీ ఎక్కువైతే ఆల్జ్‌హైమర్‌ వ్యాధి వంటిదేదైనా మొదలౌతోందేమో పరీక్ష చేయించుకోవాలి. 65 ఏళ్ళు పైబడినవారిలో పది శాతానికి మతిమరుపు ఒక రుగ్మత రూపంలో కనిపిస్తుంది. వీరిలో 65 శాతం ఆల్జ్‌హైమర్‌ వ్యాధికీ, 15 శాతం ధమనుల గోడలు దళసరిగా మారే రోగాలకూ, తక్కినవారు ఇతర రుగ్మతలకూ లోనవడం జరుగుతుంది. అడిగిన ప్రశ్నలే మళ్ళీమళ్ళీ అడుగుతూ ఉండడం, పరిచితప్రాంతాల్లోకూడా అయోమయానికి లోనవడం, స్వంత వస్తువులను తరుచుగా మరిచిపోవడం, సమయాన్ని గురించీ, మనుషుల, స్థలాల గురించీ అవగాహన కోల్పోవడం మొదలైన లక్షణాలన్నీ కొన్ని హెచ్చుతగ్గులతో ఇలాటివారిలో కనబడతాయి.
ఇలాకాకుండా ఆరోగ్యవంతులు ఒక్కొక్కప్పుడు బాధను కలిగించే కొన్ని జ్ఞాపకాలను బుద్ధి పూర్వకంగా మరిచిపోగోరుతూ ఉంటారు. వీరు ఆత్మశక్తిద్వారా అటువంటిది సాధించగలరని ప్రయోగాల్లో తెలుస్తోంది. వీటిలో స్వచ్ఛందంగా పాల్గొన్నవారికి కొన్ని పదాల జంటలనిచ్చి ప్రతి జంటలోనూ ఒక మాటను ప్రయత్నపూర్వకంగా మరిచిపొమ్మని చెప్పారు. అలాగే జరిగింది కూడాను. మెదడును చిత్రీకరించే ఎంఆర్‌ఐ యంత్రాల పర్యవేక్షణలో వారికి ఒక పదం కనబడేట్టు చేసి రెండో పదాన్ని గుర్తు చేసుకోమన్నారు. వారీ పని చేస్తున్నప్పుడు జ్ఞాపకశక్తికి కేంద్రం వంటిదైన హిపో కేంపస్‌లో ప్రక్రియలు తగ్గడం, మెదడు ముందుభాగంలో తీవ్రమవడం గుర్తించారు. సుమారు వందేళ్ళ క్రితం ఫ్రాయిడ్‌ ప్రతిపాదించిన విషయాలకు ఇది శారీరకనిరూపణలాగా అనిపించింది. అవాంఛనీయ మైన జ్ఞాపకాలు అణచివేతకు గురి అవుతాయనీ, అవన్నీ అప్పుడప్పుడూ మనం అప్రయత్నంగా పలికే మాటల్లోనూ, కొన్ని వింత కలలద్వారానూ బైటపడతాయని ఫ్రాయిడ్‌ అనేవాడు. దీన్నిబట్టి చూస్తే మెదడుకు అన్నీ గుర్తుంచుకోగలగడం ఎంత ముఖ్యమో, కొన్నిటిని మరిచిపోగలగడంకూడా అంతే ముఖ్యమని తెలుస్తోంది.
తక్కిన ప్రాణుల్లాగే మనుషులకుకూడా చైతన్యం అనేది ప్రాథమికరూపంలో మొదలై, మెదడు ఎదుగుతున్నకొద్దీ అనుభవాలను సంతరించుకోవడం, అవసరమైనవాటిని జ్ఞాపకాలుగా నిలుపుకోవడం, తక్కినవాటిని మరిచిపోగలగడం వగైరా సంక్లిష్టప్రక్రియల స్థాయికి చేరుకుంటుంది. శ్రద్ధగా వినడం, గమనించడం, అభ్యాసం చెయ్యడం మొదలైనవన్నీ పనికొచ్చే విషయాలను బాగా గుర్తుంచుకునేందుకు పనికొస్తాయి. తెలివైనవారుగా పేరు పొందేవారు ఆ విషయాలను అర్థం చేసుకుని, వాటిలోని వివరాల మధ్యనుండే సంబంధాల అవగాహనద్వారా కావలసినప్పుడల్లా తమ మనసులో ఉన్న సమాచారాన్ని గుర్తుచేసుకుంటూ విజయం సాధించగలుగుతారు. ఇవన్నీ అస్తవ్యస్తంగా జరిగితే స్వతహాగా తెలివితేటలున్నప్పటికీ కొందరు అపజయాలను ఎదుర్కుని బాధ పడవలసివస్తుంది.

ఒక అభిప్రాయం »ప్రత్యేక వ్యాసాలు, సైన్స్

One Response to “జ్ఞాపకశక్తిలో రకాలు, మతిమరుపు”

  1. 1
    ప్రాణహిత » ఎప్రిల్ 2009 సూచిక Says:

    [...] జ్ఞాపకశక్తిలో రకాలు, మతిమరుపు : డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ [...]

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో