కోస్తా కవిత్వం – మహాసంగమమూ మహా సంగ్రామము

“ఏ తోబుట్టువు లేని ఏకాకి మా అమ్మ…” అంటారు ‘అమ్మకవి’  రాం (సి. హెచ్ . రాం ). నిజమే ఈ చరాచర ప్రపంచంలో చలనంలేని వస్తువులు సైతం మనల్ని ఆదరిస్తాయి అక్కున చేర్చుకుంటాయి. కన్నీళ్ళు తుడుస్తాయి. కవిత్వం కూడా అంతే. కవిత్వం చదివే వాళ్ళకీ, రాసేవాళ్ళకీ ఏకాకితనం వుండదు ఎలాంటి బాంధవ్యాల లేమి వుండదు.
“నిజంగా ఈ రాయిదెంత మెత్తని గుండె
అమ్మ చేతి చలువను
రుచులాలా వినిపిస్తోంది” అంటాడు కోసూరి రవికుమార్‌.
“మిలటరీ హోటల్‌ పూరీ పిండి కింద
నిగనిగ లాడుతూ నవ్వు” అని రాయిని పలకరిస్తాడీ కవి. నిజమే! ఈ ఆశ్చర్యకరమైన నిజం…నిత్యం బస్సు ప్రయాణాలు చేస్తూ తోవలో భోజనాలకని ఆపినప్పుడు మనలో చాలామందిమి చూసే వుంటాం కానీ కవి స్పందన మూలాల్లోకి వెళుతుంది కదా!
“బడిమాని ప్లేట్లు తీస్తున్న పసి చేతుల్ని చూసి
గోల చేస్తుంది” అంటూ రాతికీ గుండెవుంటుంది. దానికి కూడా కవిలా వూరుకోలేని తనం వుంటుందని చెప్పిన కోసూరి రవికుమార్‌ తన కళ్ళముందు జరిగిన అనేక సంఘటనల్ని చూసి అందుకే వూరుకోలేక పోయివుంటాడు.
“విద్యాలయపు వాకిట్లో ప్రతిష్ఠించాల్సిన
సరస్వతి వీణకర్ర
కత్తిలా మెరుస్తోంది” అనే బలమైన ప్రతీకతో కోసూరి రవికుమార్‌… విద్యావ్యవస్థలోకి ప్రవేశించిన హింసను, ఆడపిల్లలపై దాడులను ఎంతో ఆవేదనతో కూడిన ఆవేశంతో ప్రశ్నిస్తాడు. ఒకప్పుడు నాలుగు గోడల మధ్య బంధింపబడిన స్త్రీలు ఈ రోజు విద్యా రంగంలో ముందునుండి విజయం సాధించడం ద్వారా అభివృద్ధి పథంలో అప్రతిహతంగా సాగిపోతున్నారు. కానీ వారిపై యాసిడ్‌ దాడులు, తరగతి గదుల్లో కత్తిపోట్లు జరగడం వలన వాళ్ళు బైటకి రాలేని పరిస్థితి వస్తే ఈ సమాజం మళ్ళీ వెనక్కి పోదా? అప్పుడు ‘అభివృద్ధి’ అనే పదం ….కలలో మాటలా మారిపోదా? అందుకే అంటాడు
“కంప్యూటర్‌తో పాటు
కత్తి తిప్పడంలో తర్పీదు నివ్వాలి” అని!
కౌలుకి నేల తీసుకుని పొగాకు, వేరుశనగ పండించిన రోజుల్లోని అమ్మమ్మ, తాతయ్యలను తన కవిత్వం నాలుగుమాటల్లో ముందుగా తలచుకున్న ఈ ‘బొడ్డుపేగు’ కవి కోసూరి రవి కుమార్ ఆత్మ ‘ఇచ్చోటనే” అనే కవితలో ప్రతిఫలించింది.

బొడ్డుపేగు - కోసూరి రవికుమార్
బొడ్డుపేగు - కోసూరి రవికుమార్

“ఇక్కడే… ఈ నేల మీదనే
పల్లె….అమ్మలా పలకరించేది” అనే ఆర్ద్రమైన వాక్యంతో మొదలైన ఈ కవిత…నేటి వ్యవస్థను సూటిగా ప్రశ్నించింది. కోసూరికి, మనసు చలించే గుణంతో, పదునైన భావచిత్రికలతో చిత్రిక పట్టే నేర్పు పాలలో నీరులా కలిసిపోయింది.
“పల్లెల రక్తంలోని నిర్లిప్తతా విషం ఒక్కోబొట్టు ప్రవహిస్తూ
నీరే…నిప్పై ఊరిని కాల్చేస్తుంటే
దేనితో ఆర్పుకోవాలో అర్థంకాదు” అని ఆవేదనని తీవ్ర స్వరంతో సర్రున చరుస్తాడు.
“నమ్మకం కోల్పోయిన మట్టిలోకి
విత్తనాలు కరువౌతుంటే
బతుకునెలా పండించుకోవాలో తెలీదు” అనే తన అక్షరాలతో …పాలకుల వైఫల్యాలపై లక్ష అక్షౌహిణుల సైన్యాన్ని కవాతు తొక్కిస్తాడు కోసూరి రవికుమార్‌. ఈ కవిలోని భోళాశంకరుడిని, మనుషుల్ని రాజుల్ని చేయాలనే కవిత్వ ఆశలని, గుండెల్లో దాచుకున్న ఊహల బలీయతను ‘రాయి’ కవిత మధురంగా వెల్లడించింది.
“నిజంగా ఈ రాతిదెంత మెత్తని గుండె
ప్రపంచం నెత్తిమీద
జెండా అయి ఎగురుతోంది” అంటూ రాయి విశిష్టతను ఏ కవీ చెప్పలేనంత బలంగా చెప్పాడు. ఈ కవిత చదివితే… రాయి మీద కూడా ఇంత అద్భుతంగా మాత్రం రాయవచ్చా? అని ఆశ్చర్యమనిపిస్తుంది. ఈ కవి వస్తు విస్తృతికి ఒళ్ళు జలదరిస్తుంది.

“మట్టి ఒక గొప్ప విత్తనం
ఇప్పటికీ మొలుస్తూనే వుంది స్వతంత్రమై” అనగలిగిన ఈ కవికి…” మా తాత నా  నాలుక మీద
వేమన పద్యాలు అద్దేవాడు” అనే పెద్దల ఎడ గౌరవం, కృతజ్ఞత ఈ పుస్తకం నిండా పరుచుకుంది. ‘బొడ్డుపేగు’ చదివితే మనిషికి తన మూలాలు గుర్తురావడం ఓ తక్షణ ప్రయోజనం.

 

“గోడకు వేలాడిన అద్దం వెనుక చీకటిని
రాత్రి ముఖానికి పులుముకుంటుంది వూరు”

అనే ‘రాం’ (సి. హెచ్ . రాం ) కవిత్వం… రంపపు కోతకు కూడా శబ్దలిపిని అందించే తత్వం. పొట్టు రాలినట్టు అలా పదాలు రాలవు. చిత్రిక పట్టిన చేతికి, కోయబడుతున్న జ్ఞాపకాల వృక్షానికీ మధ్య గుక్క పట్టిన చీకటి పాట వేలాడుతూనే వుంటుంది.

“అమ్మ తన్మయత్వమై
ఏడు పాయలు కలిసే ఓ మహాసముద్రంలా వుండేది” అని అర్థణాలోనూ..

కోయిటా అమ్మకు కన్నీటి ఉత్తరం - సి.హెచ్ . రాం
కోయిటా అమ్మకు కన్నీటి ఉత్తరం - సి.హెచ్ . రాం

 “ఏడువారాల నగలు లాంటి మమ్మల్ని కనికూడా
అమ్మ నిరలంకారం గానే వుండిపోయింది” అనటంలోనూ …….
 “మా నట్టింట పధ్నాలుగు కాళ్ళ కదలిక ఈ ఊయల” అని రాయడంలోనూ ఈ కవి అంతస్సూత్రం మనల్ని కట్టిపడేస్తుంది. ఇలా ఏడుగురిలో ఒకడిగా పుట్టడం వల్లెనేమో ఈ కవికి లోకంలోని స్త్రీల బాధలన్ని తన బాధలుగానే కవిత్వమయ్యాయి.

కిటికీ కవితలో
“అమ్మంత విశాలమై నన్ను ఓదార్చింది కిటికీయే”

“అమ్మా! తడారిపోయిన కళ్ళతో మేము తడిలేని ఎడారిలో
నీవు తొందరగా వచ్చేయవే!”  అని టైటిల్‌ కవిత ‘కొయిట’మ్మకి  కన్నీటి వుత్తరం లోనూ…

“అమ్మ కనుగుడ్ల మద్య
ఎప్పుడూ బతికుండే నాలా” (మావూరు)

“అమ్మ వెచ్చదనం లేని
శీతల జీవితాన్ని చూసిన వాడ్ని” (షెహనాయి)

“అమ్మ పురిటిలో తిన్న
నల్లబెల్లం ముక్కలా” (ఊయల)
“పగిలిన పెదవి కూడా
నాన్నకు భయపడి
అమ్మనే తలుస్తుంది” (దుఃఖనది)

అంటూ దాదాపు ప్రతి కవితలోనూ అమ్మను పొదివిపట్టుకున్న ఈ కవి సి. హెచ్ . రాం “అమ్మా! నేను క్షేమం” అంటూ రాసిన కవిత ఈ సంపుటికే హైలైట్‌!

“రిజల్టొచ్చిన రోజు
పేపరు చుట్టూ చేరిన పిల్లల్లా
నా చుట్టూ చేరిన వాళ్ళు
ప్రశ్నార్థకపు చూపుల విద్య దిష్టిబొమ్మనై” 

అంటూ కామారెడ్డి హాస్టల్‌లో మైనర్‌ బాలికపై జరిగిన అత్యాచారానికి స్పందించి రాసిన కవిత మనల్ని చలింపచేసి కంటతడి పెట్టిస్తుంది. ఈ కవితను గానీ న్యాయస్థానాలల్లో “ప్రమాణం”గాను, జైలులో ప్రతిరోజూ ప్రార్థనల్లో భాగంగా నేరస్తుల చేత చదివిస్తేనూ, రెండోసారి ఇలాంటి అత్యాచారాలు ఏ మానవుడూ చేయడు. ఇలాంటి కవితలు చాలావున్న ఈ సంపుటిని కొత్తగా కవిత్వం రాస్తున్న వారు చదివి సాధన చేస్తే మంచి కవులుగా రూపాంతరం చెందుతారు.

“మా అమ్మ చేతి స్పర్శల
వెచ్చని జ్ఞాపకం వీరయోధుడ్ని చేస్తుంది” 

అంటూ ఆగక

మా నాయిన - చిత్తలూరి సత్యనారాయణ
మా నాయిన - చిత్తలూరి సత్యనారాయణ

“మా నాయిన వెన్నుతట్టి యుద్దానికి సిద్ధం చేస్తున్నట్టుంది”  అనే హత్తుకునే కవి చిత్తలూరిసత్యనారాయణ కవిత్వం చదివితే నాకు ఇప్పటికీ ఇష్టమైన చిన్నప్పటి వాణిజ్య ప్రకటన ఒకటి గుర్తుకొస్తుంది. ఎండలో అందరూ అలసిపోయి ఉస్సూరుమని వుంటే ఒక బాలుడు చేతిలో మంత్రదండంతో వచ్చి వాళ్ళని తాకగానే, వాళ్ళకి గ్లూకోజ్‌-డి తాగినంత శక్తి వస్తుంది. చిత్తలూరి సత్యనారాయణ కలంలో కూడా అలాంటి ఒక అద్భుతశక్తి వుంది. దాన్ని తాకితే ఒక విద్యుత్‌ మనలోకి ప్రవేశిస్తుంది. అది చదివించే గుణం!  కవిత మొదటి వాక్యం నుండి చివరి వాక్యానికి అలా జారుడు బల్లలా సర్రున జారిపోవడం నాన్న భుజాలపైకెక్కిన చిన్నపిల్లల్లా సంబరపడిపోవడం.

“కన్న ప్రేమల్ని వెతుక్కుంటూ
నీటి మీద నుండి నడచి వచ్చిన పితృదేవతలు
పుష్కర ఘట్టంలో తిరుగుతున్నారు” అనే ఈ కవికి లోకమంటే కన్న ప్రేమ కన్నా ఎక్కువ.
“పుస్తకమే నాకు
మా నాన్న రాసిచ్చిన వీలునామా” అని తన సంపదేమిటో చెప్పక చెప్పిన ఈ కవే దానికి కారణాన్ని కూడా” మా నాయిన” కవితలో సూటిగా చెప్పాడు.
“అందరిలా డాక్టర్నో, యాక్టర్నో, కలెక్టర్నో చేస్తే బాధపడేవాడ్ని కాని నాయిన నన్ను కవిని చేసాడు.
కవి మిగలకపోయినా కవిత్వం మిగులుతుంది.
కవిత్వం మిగిలినంత కాలం మానాయిన మిగులుతాడు”
“మసీదు గడియారం ‘అల్లా’ రంతోనే
మా వూరి దినచర్య మొదలయ్యేది” అంటూ, ‘అల్లా’ అనే కంఠస్వరాన్ని “అలారం’తో పోల్చడమే కాక, ఆ రెండు పదబంధాల్ని కలిపి “అల్లారం” చేయడం చిత్తలూరి అసమాన ప్రతిభకు నిదర్శనం.
‘ఈ వ్యాపారం ‘తెల్ల’ చిలువ’- అని డాలర్‌ డేగల్ని ………
‘స్టార్‌ రుచుల్ని అందించే వాడో రుచుల ఫైవ్ స్టార్‌ అని తోపుడు బండి వాడ్ని’
‘అందరి స్వభావమూ చంచలమే తప్ప, ఏ ఒక్కరిలోనూ “చలం” కన్పించడు’ -అని ఉద్యోగిని
ధ్వనాత్మకంగా మెటాఫర్‌ చెప్పి, కవిత్వలో మమేకం చేయడమే….  ప్రతికవితలో ప్రతిధ్వనించి మనల్ని తన్మయుల్ని చేస్తుంది. అంతే కాదు… ఈ కవి మనమేం చేయాలో కూడా శాసించినట్టు చెప్పడు. కానీ అదో శిలాశాసనంలా మనం తీసుకునేటట్టు…. ఆర్ద్రతతో కూడిన గద్దింపుతో గమ్మత్తు చేస్తాడు.
టీ కుర్రాడు గురించి రాస్తూ…
“వాడి చొక్కా జేబులో రెండు రూపాయలతో పాటు
రెండు అక్షరాలు కూడా వేద్దామనుకుంటున్నా…” అని సమాజంలోని సమస్యలను కేవలం చెప్పి ఊరుకోక, కర్తవ్య ప్రబోధం చేసే చిత్తలూరి శక్తి చాలా తక్కువ మంది కవుల్లో అరుదుగా వుంటుంది. పునుగుల్ని మువ్వలతోను, ఇడ్లీలను పూలలోను పోల్చిన ఈ కవిత్వం చదివాక వాటిని ఆహారంగా తీసుకుంటున్నప్పుడు అవి మరింత కొత్త రుచుల్తో అలరిస్తాయి
“ఎప్పుడైనా ఆలోచించావా
ప్రేమగా నీ కొడుకు పాల బుగ్గలు నిమురుతున్నప్పుడు
నీ ఆత్మ అనుభూతించిన
ఆత్మీయ స్పర్శనే
మీ నాన్న కూడా అనుభవించి ఉంటాడని”  అంటూ తన “హృదయలిపి” ని ముద్రించిన ఈతకోట

హృదయలిపి - ఈతకోట సుబ్బారావు
హృదయలిపి - ఈతకోట సుబ్బారావు
సుబ్బారావు కవితను వృద్దాశ్రమాల్లో తల్లిదండ్రులను వదిలేసిన కొడుకులందర్ని పిలిచి వినిపిస్తే తప్పకుండా అవి ఖాళీగా అనాధలైపోతాయి. గతంలో కొంతమంది కవులందరూ కలిసి రాజమండ్రిలోని చిన్న పిల్లల అనాధ ఆశ్రమానికి వెళ్ళివచ్చిన అనుభూతులతో కవితలు రాసారు. వాళ్ళలో యాకూబ్‌ అనే కవి – “అక్కడ ఇరవై ఒక్క మంది వుంటే….నేను ఇరవై రెండో వాడినయ్యాను” అంటాడు. ఆనాథ పిల్లల్లో కవులు మమేకమవడం అనే గొప్ప అనుభూతి భావన వారి హృదయవేదనకు పరాకాష్ట ఇప్పుడు కానీ ఈతకోటని తీసుకుని మనం ఒక్కసారి వృద్దాశ్రమానికి వెళితే… ఇద్దరమల్లా వందమందిమై తిరిగివస్తాం.

“గాదెనిండిన ఆకాశం
కొండెక్కిన ఆశాదీపం
దిక్కుతోచని దీన పల్లె” అంటూ ఈత కోట రాసిన ఊపిరి పీలుస్తున్న కవితను చదివితే ఇటీవలి కరీంనగర్‌ నకిలీ విత్తనాల వల్ల మొలకెత్తని మొక్కజొన్న కండెలు, ఆంధ్రరాష్ట్రమంతా రైతన్నలని పీల్చిపిప్పి చేసిన ఎరువుల కొరతలు, నకిలీ పురుగు మందులు….మన ముక్కుమీద కూర్చుని మనల్ని ముప్పుతిప్పలు పెడతాయి.

ఇటీవల యువకుల నుంచి కొత్తకవుల వరకు పల్లె ఛానల్‌ని మన కళ్ళకి కట్టని వారు అరుదు. వారి కవితల్లో గ్లోబలైజేషన్‌ చర్యలు ఎక్కువ తొంగిచూస్తాయి. కానీ ఈతకోట, రైతు హృదయవేదనను, వలస కట్టిన వూరుని, దిక్కు మరచిన నడకనీ ఆవిష్కరించిన తీరు అనితర సాధ్యం. ఇటీవల తెలుగు భాష ప్రాచీనమని ప్రకటించడమే కాక ఆ హోదా కోసం అహో రాత్రులు కష్టించిన వారికి అవార్డులు కూడా ప్రకటించారు. కానీ
“గుడ్డి ఆత్మల దర్శకత్వంలో
దూరపు కొండల నునుపై నుంచి
దొర్లి పోతుంటాయి పూలచెండై” అని ప్రశ్నిస్తున్న ఈ కవికి ఎవరు సమాధానం చెబుతారు? అసలు ఈతకోట లాంటి కవుల్ని ఎదుర్కోవడం వారికి సాధ్యం కాదు. కవి ప్రశ్నిస్తే పాలక పాముల కుబుసాలు కదులుతాయి. ఇప్పుడు మనమొక దుస్థితిలో అల్లాడుతున్నాం కదా! తను ఫోర్త్‌ ఎస్టేట్‌ అని చెప్పుకుంటున్న మీడియా ప్రజల విశ్వసనీయతను కోల్పోయే దశలో వుంది. గుడ్డి వ్యతిరేకతతోనో, గొప్ప ఆత్మబంధపు పొగడ్తలతోనో…ఏదో ఒకవైపు ఒరిగిపోతున్న మీడియా సామాన్య ప్రజలవైపు ఉండటంలో విఫలం అవుతున్న ప్రస్తుత దుస్థితిలో కవులే ఆ బాధ్యతను తీసుకుని ప్రజాస్వామ్యాన్ని బతికించాలి. ఈ తక్షణావసరాన్ని ఈతకోట లాంటి కవులు నిరూపిస్తున్నారు.
“కొంగల గుంపుమీద రాయి విసిరినట్టు
జీవితం చెల్లా చెదురైన దృశ్యాల్ని”  హృదయలిపి చదివిన వారే దిద్దగలరు.

“ఇక్కడ కాచిన వెన్నెల వృధా కాదు
ఇక్కడి చిరుగాలైనా
విషవృక్షాన్ని పెకిలిస్తుంది
ఇక్కడ అమరత్వం రేపటి
తొలిపొద్దుకు అరుణిమను
అద్దుతుంది” అనే  జంఝావతి (కె.కె.కె. వర్మ) “వెన్నెల దారిలో” మనం ఒక్కసారి కవితో ప్రయాణం చేసామంటే మనం ఎన్నోరెట్లు బరువెక్కి యోధుడిలా తిరిగిస్తాం.

వెన్నెల దారి - జంఝావతి
వెన్నెల దారి - జంఝావతి

“మేం యుద్ధభూమి నుండి మాట్లాడుతున్నాం” అనే ఈ కవి గొంతులో గొంతు కలిపామంటే సాంబశివుడిలా లొంగిపోయి పశ్చాత్తాప పడటముండదు. మన చేతివేళ్ళు విరగ్గొట్టినా కరపత్రాలై జనంలో కలిసిపోతాం. గోడలపై నినాదాలమై నిలువెత్తు కవిత్వమవుతాం,
“జీవితం ఎం.ఒ. ఫారంలోని
స్పేస్‌ ఫర్‌ కమ్యూనికేషనంత
కుంచించుకుపోవడం” అనే విషాదం మన దరిదాపుల్లోకి చేరదు. పులితిరిగే వూళ్ళల్లో మనం మువ్వల శభ్దాలమై నర్తిస్తాం. ఈ కవితలు చదివితే మన ఇంటి నలుమూలలా వెలుతురు విరజిమ్ముతుంది. పదిమంది బిడ్డల్ని ఒకే కడుపులో దాచుకున్న నిండు గర్భిణిలా గుంభనంగా వుంటాం. చేతిగడియారం ముళ్ళ లయ టిక్‌టిక్‌మని ప్రతి సెకనూ మనల్ని ఎలర్ట్‌ చేస్తుంది. చాలామంది కవులు ఆర్ద్రంగా రాయగలరు. ఆవేశంగానూ రాయగలరు. కానీ జంఝావతి మాత్రమే ఆర్ద్రతనూ, ఆవేశాన్ని కలిపి మట్టి వేదనను వినిపించగలరు.
“ఊళ్ళను ఖాళీ చేయడం గురించి వాడికేం తెలుసు,
లుకేమియా పేషంట్‌లా కొత్తరక్తం
ఎక్కించుకుని అమ్మ చనుబాలను
ఖాళీ చేయడంలా వుంది కదూ!

అని తోటపల్లి బ్యారేజి (విజయనగరం జిల్లా) నిర్వాసితుల ఆవేదనకు సంఘీభావంగా రాసిన కవిత చదివితే ఈ కవి ప్రతిభ తేటతెల్లం అవుతుంది.
ఈ కవితలు చదివితే ఇవన్నీ ప్రజాఉద్యమంలో ప్రత్యక్ష సంబంధం వున్న వాళ్ళు రాసినట్టు అర్థమవుతుంది. కానీ కవిత్వం నినాదాల్లా కాకుండా గొప్ప భావుకతతో హృదయాన్ని కదలిస్తుంది.
“ఎక్కడో చిల్లుపడిన శబ్దం
పెరట్లో వేప కొమ్మ విరిగిపడింది.
గుమ్మాన రాసిన పసుపు వెలవెల బోయింది
దేహంలో ఏదో తెగిపోతున్న బాధ
కాలం బిగ్‌బెన్‌లో అలారం మానేసింది” అంటూ బిల్‌గేట్స్‌ ఇండియా వచ్చినప్పుడు రాసిన కవితను చదివితే సత్యం చెంతన కూర్చున్న ఈ నాటి కుంభకోణం అనాడే చెప్పినట్టు అయ్యింది.
“అప్పుల ఊబిలో రైతు
మెడ విరిగిన రైతు” శబ్దాన్ని పసిగట్టి హెచ్చరించిన జంఝావతి లాంటి కవుల్ని మనం అలక్ష్యం చేయడం వల్లె ఈనాడే దుస్థితులు దాపరిస్తున్నాయనిపిస్తుంది.

చూపు - చలపాక ప్రకాష్
చూపు - చలపాక ప్రకాష్
అందుకే కాబోలు…
“మతిభ్రమించే “పరసంస్కృతి” పీడగా
వచ్చేసింది ఓ లేత దూడ
జరభద్రం…జరభద్రం నీ నీడ కూడా” అని “చూపు” కవితా సంకలనంలో చలపాక ప్రకాష్‌ చర్నాకోలాతో హెచ్చరిస్తున్నాడు.
“రెండు చూపులు కలిసే చోట
రెండు హృదయాలు ఒకటి అవుతాయి
రెండు కళ్ళు కలిస్తేనే
విశాల ప్రపంచం మరింత విశాలంగా కనిపిస్తుంది”
అనే ప్రకాష్‌ కవిత్వం చదివితే మన మనస్సు మరింత ప్రకాశం అవుతుంది. 45 కవితలు చదివినట్టు కాక 45 సూర్యోదయాలు ఒకేసారి చూసినంత అనుభూతి కలుగుతుంది.చాల మంది కుహనా విమర్శకులు కోస్తాపై దాడిచేస్తే…కోస్తా నుంచి మంచి కథలు రావడం లేదని ఆక్రోశం వెళ్ళగక్కుతున్నారు. కానీ మంచి కవిత్వం రావడం లేదనే దమ్ము వారికి లేదు. బహుశా అది చలపాక ప్రకాష్‌ కవిత్వం చదివాకే వాళ్ళకి లోపించి వుంటుంది. ప్రకాష్‌ కవిత్వంలో నంగి నంగి మాటలుండవు. అవి నిటారు కరవాలంలా నిగనిగలాడుతుంటాయి. ప్రకాష్‌ కవిత్వంలో మార్మికత వుండదు. సూటిగా ఛెళ్ళున తాకే వడగాలిలా వుంటుంది. ధైర్యంగా కవిత్వం రాసే కొందరిలో అగ్రగణ్యుడు చలపాకప్రకాష్‌…అందుకే..
“అందుకే రాస్తానమ్మా ఓ కోస్తా అమ్మా
నీ గుండె కోతలను” అంటూ మన గుండె తడతాడు.

 

ఇప్పుడు స్త్రీవాదం రకరకాల ఆటుపోట్లను ఎదుర్కొటోంది. అందరి కలిసి మన బాధల్ని రాద్దామని కొందరంటే…మా బాధలు వేరు అని మరికొందరంటున్నారు. అసలు అన్ని ప్రాంతాలు, అన్ని హృదయాలు సస్వశ్యామలమైతే ప్రాంతాలలోను, కవిత్వంలోను వేర్పాటు వాదాలు ఉండవనుకుంటాను. అసలు దీనికంతటికీ ప్రధాన కారణం చింతా లక్ష్మీసుజాత లాటి కవయిత్రులు తమ “అమ్ములపొది”లో అన్ని శక్తి యుక్తులుండి కూడా కారణాలు ఏమైనా నిశ్చలప్రవాహంలా వుండిపోవడమే అనుకుంటాను.

అమ్ములపొది - లక్ష్మీసుజాత
అమ్ములపొది - లక్ష్మీసుజాత
“అన్నార్తుల కడుపునింపే అమ్మవు నీవు
కానీ కొన్ని వేళల
నిత్య నూతన వికారాలతో ఉరకలు వేసే
కీచక సంతతి పాలిట అమ్ముల పొదిని నీవు” అని కర్తవ్యప్రబోధం చేసే లక్ష్మీ సుజాత తమ కర్తవ్యాన్ని మరచి తక్కువగా రాస్తున్నారా? లేక నిర్వాహకులు “వివక్ష” చూసి వారి కవిత్వం తక్కువగా ప్రచురిస్తున్నారా?
“బతకనివ్వండి బిడ్డను
బంగారు బాల్యానికి ప్రతీకలా
కాసింత స్వేచ్ఛా ఊపిరులూది
ఎదగనివ్వండి సృజనాత్మక శక్తులను” అన్న లక్ష్మీసుజాత పిలుపును మనమందరం అందుకోవాలి. ఆ బిడ్డలు ఎవరంటే… స్వేచ్ఛ స్వాతంత్య్రాలు, సౌబ్రాతృత్యాలు, సమత, మమత, మానవతలు.
* * * *

అభిప్రాయాలు లేవు »సాహిత్య వ్యాసాలు

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో