Apr2009
కుటుంబరావు సమాజ సాహిత్యం
అతిశయోక్తులు లేకుండా, అలంకారాలు లేకుండా, ఆర్భాటాలు లేకుండా, మరీ ముఖ్యంగా నిర్మొహమాటంగా మనం కొడవటిగంటి కుటుంబరావుగారి గురించి మాట్లాడుకోవలసే వుంది.
రాశిపొయ్యడం కుటుంబరావుగారి విశిష్టతకాదు. గురజాడ గురించి మాట్లాడుతూ చా.సో. నన్నయ నుంచి అంటే తొమ్మిది వందల సంవత్సరాల నుంచీ వున్న భాషని ఆయన మార్చి వేశాడు అన్నారు. గురజాడ తర్వాత మళ్లీ, కొంతకాలమైనా, భాష పాత కృతక, గ్రాంధిక వాసనలు వేసింది. వచనంలో కూడా వ్యావహారికం పేరుతో కూడా ”బరువైన” పదాలు రాజ్యమేలాయి. కుటుంబరావుగారు భాషని వున్నదున్నట్టుగా రాస్తారు. ఒకపాత్ర ”ఈ దిక్కుమాలిన పిల్లి ప్రెద్దాన్లోనూ మూతిపెడుతున్నదీ” అంటుంది. ప్రతి దాంట్లోనూ అని ఇప్పటికీ మనం రాస్తూనే వున్నాం. ప్రెద్దాన్లోనూ-అంటూనే వున్నాం. కానీ 1946లో రాసిన ”పిల్లికథ” లో ఆయన రాసిన వాక్యంతోనే అయన వాడుకభాషనేకాదు మనుషులు మాట్లాడిన ప్రతి మాటనీ ఎంత జాగ్రత్తగా, శ్రద్దగా గమనించారో అర్థం అవుతుంది.
పదం వాడకమేకాదు. ప్రతి పదం యొక్క అర్థాన్నీ ఎంతో స్పష్టతతో నిర్వహిస్తారు కొ.కు. ”సహజంగా, అంటే నా మనస్తత్వాన్ని బట్టి అని అర్థం. నాకు తెలిసినంత వరకు ఈ మాటను అందరూ ఈ అర్థంలోనే వాడతారు” అంటారు. 1966లో రాసిన ‘దైవాధీనపు జీవితం ” అనే కథలో.
మామూలుగా తారుమారయిపోయే పదాల మధ్య మన్న అత్యంత బిన్న అర్థభేదాల్నీ కూడా గమనించి ఎంతో స్పష్టంగా మన ముందుంచుతారు. “అతనిలో సాహసము వున్నంతగా ధైర్యం లేదని రూఢి అయిపోయింది” అంటుంది.1947లో రాసిన సద్యోగం అనే కథలో పాత్ర. ఇలా భాష విషయంలో ఎన్నో గొప్ప ప్రమాణాల నెలకొల్పిన వారు కుటుంబరావు. ఎన్ని వుదాహరణలైనా ఇవ్వచ్చు, స్థలాభావంలేకుంటే, కానీ ఆయనంత ఖచ్చితత్వంతో భాషని మనముందుంచడం అంత సులువైన విషయం కాదు.దానికి కేవల అధ్యయనం, కేవల పరిశీలనా చాలవు.
పాఠకుడి సమయం పట్ల కుటుంబరావుగారికెంతో గౌరవం. చెప్పదలచుకున్న దేదో రెండు ముక్కల్లో చెప్పేసి ఇంత మౌనానికీ ఇంత ద్యానానికీ వ్యవధి నివ్వరాదా? అన్నట్టు క్లుప్తతకి ఆయనెంతో ప్రాధాన్యత ఇస్తారు. ఎన్ని వుదాహరణలైన ఇవ్వచ్చు కానీ ”ఆకర్షణలేని అమ్మాయి” అనే కథలో ఏవైనా రెండు వాక్యాల్ని తీసేసి కథ మళ్ళీ చదవండి క్లుప్తతకీ పదాల పొందికకీ ఆయనిచ్చే గౌరవం అర్థం అవుతుంది. తాతయ్య, నాకు తెలీదు, ఇలా ఏ కథలోనైనా వ్యర్థంగా ప్రయోజన రహితంగా ఆయన పదాల్ని వృధా చెయ్యరు.
డెభై ఎనభై ఏళ్ల క్రితం నాటికి సమాజంలో పౌరాణికాలు, జానపదాల గాలి వీస్తోంది. సాహిత్యం అంటే అవే అనే ఒక వాతావరణం వున్నది. గతాన్ని తోసిరాజనడం అందరీ వల్లా అయ్యేపనికాదు.
పౌరాణికాల్లో ప్రధానంగా వుండేది బరువైన భాష. నాటకీయత. ఆ రెండింటికీ ఒక గట్టి సంబంధం వుందనే అనిపిస్తుంది. ఆ భాష నుంచి విడివడ్డ కొ.కు. నాటకీయత నుంచి తొందరగానే బయట పడ్డారు. నాటకీయత ఒక కృతక వాతావరణాన్ని మన కళ్లముందుంచి పాఠకుడ్ని కథా వస్తువు నుంచి పరాయికరిస్తుంది. సమాజం మీద అటువంటి కథా వస్తువు ప్రభావన్ని నాటకీయత అడ్డుకొంటుంది. కానీ ప్రయోజనవాది కొ.కు. ఈ అడ్డంకిని అధిగమిస్తారు. అందుకే ఎంతో నాటకీయత సృష్టించగలిగిన సన్నివేశాల్లో , కూడా ఆయన వాస్తవికతకే పెద్ద పీట వేస్తారు. ” పానకంలో పీచు” కథలో రంగడు తను భార్యని వదిలేసాననీ, పోషించననీ స్వంత అన్న దత్తుతో చెప్పడం ఎంతో నాటకీయంగా చెప్పొచ్చు. కానీ ఆయన చెప్పించిన విధానం ఆ విధానం, కల్గించిన ప్రయోజనం మనలో ఎంతో ఆలోచనకి అవకాశమిస్తాయి.
ముప్ఫయ్యేళ్ల పాటు పిల్లల పత్రిక సంపాదకుడిగా వేలాది పౌరాణిక కథల్ని నవీకరించిన వ్యక్తికి నాటకీయత ”నిర్మించడం” తెలియలేదనలేం కాదా!” 32 డౌన్ క్రాసింగ్” చదవండి.
నాటకీయత పాఠకుల్ని వస్తువునుంచి ఎలా దూరం చేస్తుందో వాస్తవికత పాఠకుల్ని వస్తువుకి అంత దగ్గర చేస్తుంది.
జానపదంలో ప్రధానం అద్భుతాలు. అవి వీరులైన వ్యక్తులు” చేసేవి కావచ్చు. మానవాతీత” శక్తులు చేసేవి కావచ్చు. అయితే అవి చివరగా ఇచ్చే ప్రయోజనం వినోదం అందుకే నాటి మామూలు ప్రజలకు-పొద్దల్లా శ్రమచేసి సాయంకాలం అలసిన వానికి వినోదం కలిగించి అంతప్రాచుర్యం పొందేయి. అయితే కుంటబరావుగారి ఆశించిన సాహిత్య ప్రయోజనం వినోదం కానే కాదు. అందుకే ఆయన రచనల్లో మనకి అద్భుతాలు, ఆసాధ్యాలూ కనబడవు. ఇది జరిగే పనేనా? అనిపించవు ఆయన చిత్రించిన సన్నివేశాలు. ఇది జరిగే పనేగా! అనిపిస్తాయి తప్ప ఏమాత్రం శ్రద్దగా ఆయన రచనల్ని చదివినా ఈ విషయం మనకి స్పష్టమవుతుంది. రాసిన విషయం, విధానం చూసి అద్భుతంగా రాసేర్రా అనిపిస్తుంది తప్ప అద్భుతాలు రాసేర్రా అనిపించదు. అద్భుతాలు, అసాధ్యాలూ- అవి బాలవర్ధరాజో, కావచ్చు, సూపర్‌మాన్ కావచ్చు, నేటి హారీపోటర్ కావచ్చు అనుభవమూ, జ్ఞానమూ తక్కువగా వున్న వారిని ఉదాహరణకి పిల్లల్ని ”ఆకర్షిస్తాయి” తప్ప కొంత అనుభవమూ, జ్ఞానమూ వున్నవారిని ఆకట్టుకోలేవు. చిన్న పిల్లలు సూపర్‌మేన్‌లాగా వేషం వేద్దామని సరదాపడతారు. మరి పెద్దవాళ్ళు ఆవేషంతో తిరగగలరా? కుటుంబరావుగారు పాఠకులలో ఆశించినది అనుభవవిస్తరణా, జ్ఞాన విశాలతే తప్ప వినోదకాలక్షేపం కాదు సాహిత్య ప్రయోజనం పట్ల ఆయనకున్న నిబద్ధత అది.
పౌరాణిక వస్తువుని కూడా తీసుకొని జానపద పద్ధతిలో కథనడుపుతూ సాంఘికప్రయోజనం ఎలా సాధించొచ్చో ఆయన కథలు ”దీపావళీ” దీపావళి రాజకీయాలు వగైరా చదివితే అర్థమౌతుంది.
రచయితగా ఆయన ఆనాటి భట్రాజు పాత్రనో, (రాజునో దేవుణ్ణో కీర్తిస్తూ) విదూషకుడి పాత్రనో (రాజుకో, ప్రజలకో వినోదం కలుగజేస్తూ) పోషించలేదు. సాహిత్యంలో ఆయన పాత్ర ఒక వైతాళికుడి పాత్ర.అది ప్రవక్తల పాత్ర కంటే వున్నతమైనది. ఉపాధ్యాయుడి పాత్ర కంటె భిన్నమైనది. ఎందుకంటే, ఆయన, వేలసంవత్సరాల గతసాహిత్యంతో రూపంలోనూ, సారంలోనూ, భావం లోనూ, భాషలోనూ పూర్తిగా విడివడి తనదైన కాళ్ళపై నిలబడి, తనదైన ముద్ర వేశారు.
చరిత్ర మన కళ్లముందే నిర్మించబడుతువుంది. అన్న స్పృహ ఆయనకి ఎంతో స్పష్టంగా వుంది అందుకే తన కళ్లముందు జరుగుతున్నా ప్రతి సంఘటననీ ఎంతో జాగ్రత్తగా గమనించి అవసరమైనవెన్నో ఎంతో నిర్మాణాత్మకంగా గ్రంధస్థం కావించిన ద్రష్ట ఆయన. కాటకాన్నీ, యుద్ధాల్ని చిత్రీంచడం పెద్ద విషయం కాకపోవచ్చు. – అవి చరిత్రలో పెద్ద విషయాలు కాబట్టి – కానీ ఎంతో చిన్న సంఘటన అయిన 1931 నెల్లిమర్ల వరదల్నీ కూడా 1970లో రాసిన ”అనుభవం” నవల్లో గ్రంధస్థం చేశారు. అయితే చరిత్ర పట్ల ఆయనకెంతో విశ్లేషణ, స్పష్టత ఉన్నది. ఎంతో మంది చనిపోయినా ”తిలక్ మహాశయుడు పోయినాడ్రా” అని మేష్టరు పాత్ర ద్వారా గ్రంధస్థం చేసిన ఆయన మిగతా మరణాల్ని వదిలేయడం ఆయన దృక్ఫథాన్ని, స్పష్టతనీ తెలియజేస్తుంది. కాంగ్రెసు, దాని నాయకుల చరిత్ర ఏమాత్రంతెలిసిన వారైనా రచయిత చారిత్రక దృక్ఫధాన్ని గుర్తిస్తారు.
చరిత్రనే కాదు. పరిసరాల్నీ, వ్యక్తుల్ని, ప్రత్యేకతల్నీ కూడా ఎంతో శ్రద్ధగా గమనించి గ్రంథస్థం చెయ్యడం ఆయన నిశిత పరీశీలినని స్పష్టం చేస్తుంది.ఆయన విజయనగరంలో వున్నది రెండేళ్లే. అయినా ”విజయనగరంలో ఎక్కడా నాలుగురోడ్ల కూడలి లేదనీ” గమనించి రాసారు. చిత్రం ఏమిటంటే ఏ వుత్తరాంధ్రా రచయితా ఇది ఇప్పటికీ గ్రంథస్థం చెయ్యక పోవడం. విజయనగరంలో ఆడవాళ్ళు రోడ్డు మీదకి రాకపోవడం, అడ్డ పొగ పీల్చడం, చేతి మీదకి నూనె వేసుకోవడం ప్రయోజన పూర్వకంగా గ్రంథస్థం చేశారు. భూస్వామ్య సంస్కృతి, అనాగరిక సంస్కృతి, బీదరికం చూపించడానికి.
చరిత్ర తెలియకుండా భవిష్యత్తు నిర్మించలేం అన్న స్పృహతో ఇలా ఎంతో చరిత్రని గ్రంథస్థం చేసిన రచయిత ఎంతశ్రమ చేసి వుండాలి! ఎంత జాగరూకుడై వుండాలి! ఎంత అధ్యయన శీలి, విశ్లేషణాకారుడు అయివుండాలి.!!
కథ లేదా రచన అనగానే అందులో ప్రధానంగా ఒక సంఘటన వుండాలన్న ”మూఢనమ్మకాన్ని” ఆయన ఎంతో ప్రతిభావంతంగా అధిగమించారు. ”ఆకర్షణ లేని అమ్మాయి” ”వుద్యోగం” ఇలాఎన్నో కథల్లో ”సంఘటన”లేదు. కానీ అవి చక్కటి కథలాగానే గాక, ఒక సామాజిక ప్రయోజనాన్ని నెరవేర్చిన కథలుగా నిలబడ్డాయి. ఎంతోమంది వుదహరించే ”ట్యూటర్” నువ్వులు- తెలకపిండీ” లాంటి కథల్లో కూడా బలమైన సంఘటనలు లేవు. కానీ అవి నెరవేర్చిన ప్రయోజనం చాలా గొప్పది. మధ్యతరగతి నేలబారు సంస్కారాన్నీ, దోపిడీ నీతినీ బట్టబయలు చేసిన కథ ”మహా యిల్లాలు” లో సంఘటన లేదు. అన్యవర్గ ఆలోచనా ధోరణి అనితర సాధ్యమైన వ్యంగ్యంతో, అధిక్షేపంతో తుత్తునియలు చేసిన ”నాకు తెలీదు” ”మిత్రద్రోహం” కథలో సంఘటనలేదు.
అలాగే, ప్రతి కథలోనూ ఒక సమస్య వుండాలన్న ”పాతివ్రత్య నియమాన్ని” ఎంతో విజయ వంతంగా తోసిరాజన్నారు. కొడవటిగంటి కుటుంబరావు ఉదాహరణలకంటె ఆయన మాటలే రాయడం మంచిది. ”రాసే ప్రతికథలోనూ ఒక సమస్య వుండడానికి నేన్నెడూ ప్రయత్నించలేదు” తాతయ్య, అమ్మమ్మ, దేవుడింకా వున్నాడు వగైరా ఎన్నో కథల్లో సమస్య ఏది? అవి కథలు కావా? అవి ఎంత గొప్ప ప్రయోజనం నెరవేర్చాయి!!
భాష మాత్రమే కాదు- కథా సంవిధానం ఎంత సులువుగా వుంటే-అంతమంది పాఠకులను అదిచేరుతుంది. ”ప్రయోగాలు” పండితమ్మన్జులకు చేరవచ్చు. వారిని రంజింప జెయ్యనూవచ్చు. కానీ కుటుంబరావుగారు వుద్దేశించిన పాఠకులు వారు కారు. ఆనాటి మధ్యతరగతి అక్షరాస్య తీరుబాటు జీవులు. వాళ్ళ తీరుబాటుని తిరుగుబాటుగా మలచడానికి ఆయన ఆయుధం సాహిత్యం. అందుకే ఆయన సంవిధానంలో సాధారణంగా” ప్రయోగాలు” ఫ్లాష్‌బాక్, చైతన్య స్రవంతి, అబ్సర్డ్ స్టోరీ, ట్విస్ట్ ఇన్‌ది టెయిల్, డబుల్ ట్విస్ట్ లాంటి వాటికి తావులేదు. ఎంతో కష్టంతో, శ్రమతో, పరిశ్రమతో ఆయన తన వచనాన్నీ, భాషనీ, సంవిధానాన్నీ, పాఠకులకి అత్యంత సులువుగా అర్థం అయ్యేలా తీర్చిదిద్ది వాటిని పాఠ్యగ్రంధాలుగా (కథలుగా కాదు) తీర్చి దిద్దారు. సాంఘిక ప్రయోజనం పట్ల ఆయన నిబద్ధత అంతగొప్పదీ.
రచయితగా ఆయన ఏ లౌక్యానికి, లౌల్యానికీ లోనుకాలేదు. ప్రధానంగా డబ్బు. ఐశ్వర్యం దరిద్రం రెండింటినీ వెంట వెంటనే చూసినా ఆయన డబ్బు కోసం సాహిత్యాన్ని వాడుకోలేదు.
”తెలుగు పత్రికల వాళ్లు బహుమానంగా ఒక కాపీ పంపిస్తారు”అని 30ల్లోనే తమ్ముడికి చెప్పిన రచయిత డబ్బు ఆశించే అవకాశమే లేదు. కానీ ఆయన చివరి దాకా రచనలు ఆపనే లేదు మూడు దశాబ్దాల పాటు సినిమాలకీ, సినిమా వాళ్లకీ అత్యంత సన్నిహితంగా వుండి కూడా ఆయన ”తెగబడి” సినిమాలకి రాయలేదు. అది ఆయన వ్యక్తిత్వ దారుడ్యం. రెండు వేల కోసం ”తులసిదళం” రాసానని రచయితే చెప్పుకున్నాడు. కానీ పోటీలో వందరూపాయల బహుమతి కోసం రాసికూడా తన రచనని బహుమతికి ”అనుగుణంగా” మార్చని స్థిర చిత్తం ఆయన సొంతం.
ఆయన కీర్తి లౌల్యానికి కూడా లోనుకాలేదు. ”నేను ఏ పోటీలోనూ గెలవను” అని ఆయనే గుర్తించి చెప్పుకున్న రచనలు ఆపలేదు. మార్చలేదు. పత్రికా సంపాదకుడిగా ఆయన తన ”వృత్తి”ని ”వ్యావృత్తి” కోసం వాడుకోలేదు. అందుకే ఆయన రచనలు ఎక్కువగా, కష్టం మీద నడిచిన చిన్న, సాహిత్య, సిద్దాంత పత్రికల్లోనే వచ్చాయి. కీర్తి కోసం, వ్యాపార పత్రికల్లో ప్రచురణకోసం తన సిద్దాంతాల్ని, రచనల్నీ బలి పెట్టని ధృఢత్వం ఆయన ఆస్తి.
తన రచనల పట్ల వ్యామోహాన్ని ఆయన పెంచుకోలేదు. ఆయన రచనలో మొదలు పెట్టిన అర్థశతాబ్దం తర్వాత వాటిని స్వీకరించడానికి పెద్ద తప్సే జరిగింది. ఏం రాశాను? ఎవరి కోసం రాశాను? అనే తప్ప ఏ పత్రిక కోసం రాసేను? అనేది ఆయన పట్టించుకోలేదు. ఆయన వ్యాసాలన్నీ చిన్న పత్రికల్లోనే వచ్చాయి- ఆయన కొంత లబ్దప్రతిష్టుడయ్యాక కూడా-
ఇలా సాహిత్యాన్ని కేవలం భావ విప్లవ సాధనంగా భావించి సాహిత్యం -వచనానికి -అన్ని రకాలుగానూ భావవాదం నుండి భౌతిక వాదం వైపు దారి మళ్ళించిన కుటుంబరావుకి శతజయంతి సందర్భంగా జేజేలు. ఆయన మాటల్లోనే ముగిద్దాం
”సంఘానికి ఇంత కుక్క కాపలా కాయడానికి చాలా శక్తి కావాలి”
6 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు
April 2nd, 2009 at 11:51 am
కొ.కు.తో వ్యక్తిగత పరిచయం్ ఉన్నంత చక్కగా రాసిన వ్యాసం. అభినందనలు.
April 5th, 2009 at 9:44 pm
చిత్ర రామారావు గారు నాకు చాలా కాలంగా పరిచయమే. మా నాన్న అంటె ఆయనకి ఎంత అభిమానమో నాకు బాగా తెలుసు.కొ.కు. రచనల లొనించి విరివిగా వాక్యాలకి వాక్యాలె అప్పజెప్ప గల చిత్ర గారు స్వయంగా మంచి రచయిత. వ్యాసం గొప్పగా ఉంది.చిత్ర గారికీ, ప్రాణహితకీ అభినందనలు.
April 6th, 2009 at 3:47 pm
వ్యాసం చాలా బాగుంది. రచయితకి కొకుతో సన్నిహితమైన పరిచయం ఉండి ఉండాలి. మంచి పరిశీలనతో పాటు చక్కని విశ్లేషణ. ఒక చిన్న సందేహం. కొకు కథలు తాతయ్య, అమ్మమ్మ పేర్లలో, “ఆమ్మమ్మ” అని ఉండి ఉండాలనుకుంటా. కథలో అమ్మమ్మ తల్లి ప్రస్తావన ఉంటుంది.
అభినందలతో,
విష్నుభొట్ల లక్ష్మన్న
April 7th, 2009 at 11:51 am
రామారావు గారు:
కుటుంబ రావు గారి వ్యక్తిత్వంలోంచి ఆయన రచనాశిల్పాన్ని వెతికే మంచి ప్రయత్నం మీ వ్యాసం.
చాలా మంది ఆయన వచనంలో శిల్పం లేదన్న పొరపాటు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు. అలంకారాలన్నీ వదిలించుకొని రాయడం ఎంత కష్టమో ఇంకా మన వాళ్లకి తెలియదు. శిల్పం అంటే గంగిరెద్దు బట్టల్లాంటివనీ, చూపుని మింగేసే కాటుక అనీ అనుకుంటారు.
నిరలంకార వచనం వైపూ, ఆ మాటకొస్తే కవిత్వం కూడా నిరలంకారత వైపు వెళ్లాల్సిన కొత్త సౌందర్య దృష్టి అవసరాన్ని ఎప్పుడొ చెప్పిన రేపటి రచయిత కొ.కు.
మీ వ్యాసం ఆయన మీద కొత్త విమర్శ కి నాంది కావాలని కోరుకుంటున్నా.
అఫ్సర్
April 7th, 2009 at 7:55 pm
కొన్ని సాహిత్యపరమైన బాధ్యతలను నిర్వహించదలుచుకున్నవారే చేపట్టడం జరుగుతుంది. కొకు శతజయంతి సభలు విరసం, జనసాహితి తప్ప ఇండియాలో మరే సంస్థా ఇంతవరకూ నిర్వహించలేదనుకుంటాను. హైదరాబాద, మద్రాసు తదితర నగరాల్లో సాహితీ కార్యక్రమాలు ఇతర వ్యాపకాలవల్లనో ఏమో, పట్టించుకున్నట్టు కనబడవు.
వెభ్ పత్రికల్లో ప్రాణహిత తప్ప తక్కినవీ అంతే. కొకు గురించిన వ్యాసాలు ప్రతి సంచికలోనూ వెలువరించడం వారి శ్రద్ధకు నిదర్శనం.
ఇటీవల మరణించిన రచయితల్లో ప్రముఖులందరినీ తలుచుకున్నది ప్రాణహిత ఒక్కటే. సాహిత్యంలో ఆసక్తి ఉన్న పాఠకులు ఇది గమనించే ఉంటారు. ఈ విషయంలో ప్రానణహిత సంపాదకవర్గాన్ని ప్రత్యేకంగా అందరు అభినందించాలి. తక్కిన వెబ్ పత్రికలూ ఇది గమనించాలి.
April 7th, 2009 at 9:20 pm
కుటుంబరావు గురించి ఎవరెంత చెప్పినా ఏవిటో తక్కువే అనిపిస్తుంది. ఎన్ని కధలు ఉదహరించినా..అయ్యో.. ఆ కధలో అంతబాగా ఆ మాటన్నాడు అదికూడా ఉదహరించవలసింది.. అనేట్టుగా ఏదో కధో గల్పికో మిగిలిపోతూ గుర్తుకు వస్తూనే ఉంటుంది. ఎంత నిశితవైన బుద్ధి తనది.. పరిశీలనా, విశ్లేషణ, అవగాహనా, వ్యక్తీకరణ .. స్పష్టత..స్పష్టత..స్పష్టత.. స్పష్టత.. అన్నట్టు ఆ భాష.. తెలుగు ని అంత చక్కగా ఉపయోగించుకున్న రచయిత ఎవరున్నారని?.. విరివి కి విరివి, పొదుపు కు పొదుపు. తన కధల్లో మొదళ్ళు చూడండి. కధలోకి ఠక్కున దిగడం ఎలాగో తెలుస్తుంది వెధవ నాన్పుళ్ళు లేకుండా..
నాకు మతిపోతుంది.. అవన్నీ తలుచుకుంటే..
రామారావు గారికీ ఇలానే అనిపించుండాలి.
- రమానాథ్