Apr2009
మనిషితనం/అతడు
భోజనాలు చేసి తేలిగ్గా టి.విలో తొమ్మిదిగంట న్యూస్ పెట్టగానే, ఒకటే ‘రొద ‘ఎన్నికల ముందు సాగుతున్న నాటకం, అసభ్యపదజాలాలతో తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు ”ఎవరు రాష్ట్రానికి, దేశానికి ఏం మేలు చేస్తారో చెప్పడం కష్టం. అందరూ ఎదుటివాళ్ళ తప్పులు వెదకడంలో నిమగ్నమై, ఎన్ని తిట్లు తిడితే అన్ని చప్పట్లు, కొట్టించుకుంటున్నారు. కొట్టిన ప్రతీసారి పొంగి పోతున్నారు…
కొత్తగా ప్రతి పార్టీ కాకపోయిన కొందరు మహిళల కన్నీళ్ళు తుడవడానికి ‘మధ్యపానం నిషేధం అంటూ” అంటూ వాగ్ధానాలు చేసి గెలిచినా, కొద్దినెలల్లోనే అంతకంటే వెయ్యిరెట్లుగా మద్యం బెల్టుషాపుల రూపంలో వెల్లువెత్తి అందరి జీవితాలని సునామీల కన్నా ఘోరంగా తుడిచిపెడతోందన్న, సత్యం అందురూ అనుభవిస్తున్న చేదు నిజం…
మద్యపానం అంటే ఆతడే గుర్తుకొస్తాడు..అతడితోపాటు నా అనుబంధం గుర్తుకొస్తుంది..ఆ సంఘటన గడిచి ఏడాది అవుతున్న ఆ జ్ఞాపకాలు ఇంకా తడి తడిగా ఇబ్బంది పెడతాయి. టి.వి. కట్టేసి గదిలో కొచ్చి మంచం మీద పడుకొన్నాను… కావేరి వంట ఇంట్లో ఇంక ఏదో సర్దుతోంది…సరిత ఇంకా చదువుకుంటునట్లుంది. గదిలో లైటు వెలుగుతోంది.
హైదరాబాదుకు ట్రాన్స్‌ఫరై వచ్చిన కొత్తలో… బ్యాంకు మలక్‌పేట్ కాలనీలో వుంటం వలన, కావేరి అమ్మ వాళ్ళు వనస్థలిపురంలో ఇల్లు కట్టుకోవడం..వాళ్ళ ఇంటి మేడమీద పోర్షనులు మమల్ని ఉండమని బలవంతం చేయ్యడంతో మావగారి ఇంటిపైన ఇంట్లోకి వచ్చేసాము..
రోజు బస్సులో వెళుతూ చాలా సార్లు చూసాను ఆ మనిషిని ఎందుకో తెలీదు. ఆ మనిషితో మాట్లాడాలనిపించేది, కారణం తెలియదు. ఒంటి మీద ఖరీదైన బ్రాండెడ్ జీన్‌ఫాంట్, ఖరీదైన షర్ట్, బాగా మాసిపోయి వున్నాయి. బాగా పెరిగిన గడ్డం, జుత్తు ఏం అయిపోయాయి. చెట్టుకింద, బస్‌స్టాండ్‌కి కొద్దిదూరంలో పెద్దపెద్ద అట్ట పెట్టెలు పరుచుకొని, కూర్చునేవాడు…
ఒక రోజు యథావిధంగా చూసిన నాకు ప్లాస్టిక్ బ్యాగులో వున్న పొట్లం అన్నంలో, బ్రాందీనో, విస్కినో, అవి పొసుకొని కలుపుకొని కడుపులో తిప్పింది…అప్పటి నుంచీ ఇంకా నాలో కోరిక తీవ్రమైపోయింది. అతడిని కదలించాలి మాట్లాడాలి, ఎవరూ? ఎందుకంత పతనం అయి పోయాడు. బహుశ నాలుగు నెలల నుంచీ గమనిస్తున్నాను. కూర్చోడానికైనా పడకోవడానికైనా రెండే రెండు అట్టముక్కలు..అలాగే గంటలు ఆరుబైట కూర్చునేవాడు…
ఆఫీసు నుంచి వస్తూ బస్సు ఎంత రష్‌లో వున్న సరే అతడి కోసం నాకళ్ళు వెదికేవి…ఎలాగో అలాగే చూసేవాడ్ని… అలాగే కూర్చుని కనిపించేవాడు.. ఆ కళ్ళల్లో అనంతమైన మౌనం.
ఆదివారం నాడు ఎలాగైనా అతడితో మాట్లాడాలని నిర్ణయించుకొన్నాను. మాట్లాడాలి ఏదో అడగాలి..వాడ్ని కదలించాలి అనుకుంటూ బస్‌స్టాపులో దిగి వెనక్కి నడుచుకుంటూ అతడి దగ్గరకి వెళ్లాను.
దగ్గరగా చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. పట్టుమని ముప్పై అయిదు ఏళ్ళు కూడా ఉండవు. ఇంత చిన్నవయస్సులో ఇంత పతనమా?
దగ్గరగా వెళ్ళి నిల్చున్నాను.. ఆ దారిన వెళ్తున్న కొందరి చూపులు నావైపు సందేహంగా చూస్తున్నాయి… అయినా పట్టించుకోలేదు. అతడు నావైపు చూసాడు. ఆచూపులో ఏ మాత్రం ఆత్రం.. లేదు..నిన్ను చాలా రోజులనుంచి చూస్తున్నాను ఏ ఊరు నీది, చూస్తుంటే బాగా చదువుకొన్న వాడిలా వున్నావు. ఎందుకలా పతనం అయిపోతున్నావు? అడిగాను ఎంతో ఆవేశంగా… మాట్లాడలేదు. జవాబు చెప్పలేదు. చిన్న నవ్వు నవ్వి తలవంచుకుని, పొడి అన్నంలో బ్రాందీ కలుపుకొని తింటున్నాడు. మళ్ళీ కడుపులో తిప్పింది.
జేబులోంచి వందరూపాయిల నోటు తీశాను. అలా పొడి అన్నంతో అలా తినకు కనీసం కూరో పప్పో తెచ్చుకో ఇంద అంటూ నోటు అందించాను.
చాలా నిర్లిప్తంగా చూశాడు. ఫో..ఫో.. అన్నట్లు చెయ్యి విదిలించి, అన్నం సంచి తీసుకొని అటువైపు తిరిగి తినసాగాడు.
అక్కడే కొద్ది దూరంలో వున్నా టీ కొట్టు వాడు నావైపే ఆశ్చర్యంగా చూస్తూ, నన్నే గమనిస్తున్నాడు. ఇంక అక్కడ వుండబుద్దికాలేదు. గబగబ బస్టాండ్ వైపు నడిచాను చాలా అసంతృప్తి ఎప్పటికైనా మాట్లాడించాలి..వాడిని కదిలించాలి అనుకుంటూ…
నీపేరేంటీ? … చూస్తే మంచి కుటుంబంనుంచి వచ్చినట్టు ఉన్నావు. ఎందుకు పతనం అయిపోతున్నావు.. అతడి మాటలు ”సంజీవ్”ని కదిలించాయి ఎవరతడు…నన్నే ఎందుకు చూసాడు? నా దగ్గరికే ఎందుకు వచ్చాడు.. నీ లాంటి వాళ్ళు ఈ నగరంలో చాలా మంది… నన్ను గుర్తు పట్టాడా?… మూడేళ్ళుగా దాక్కొన్న దుఖం గుండెల్ని కదిలించి, గొంతులో పెగల్చి, ఉప్పెనలా వచ్చింది… పొడి అన్నం గొంతుక్కి అడ్డం పడి వెర్రి దగ్గు వచ్చింది… దగ్గు ఏడుపు కలసి ఒంటిని కుదిపేసాయి.. కదలి కదలి ఏడ్చాడు ”సంజీవ్”….
మంచి కుటుంబం అవును సంప్రదాయ కుంటుంబం అమ్మ నాన్న చెల్లి, నాయనమ్మ తాత వున్న కుటుంబం… ఉమ్మడి కుటుంబం.. స్కూల్ రోజులనుంచి అన్నిట్లా ఫస్ట్ మార్కులే ”సంజు” నా బంగారు తండ్రి, వీడు నా పేరు నిలబెడతాడు అంటూ అమ్మ గారంగా నన్ను ముద్దాడుతుంటే పొంగి పోయే మనసు… ఇంటర్ కాలేజి ఫస్ట్.. ఇంజనీరింగ్‌లో రేంక్ హోల్డర్… కేంపస్ ఇంటర్యులో మంచి కంపెనీలో ఉద్యోగం…
ప్రశాంతమైన జీవితం… చెల్లెలు డాక్టరు ఎం.బి.బి.ఎస్. చదువు తోంది. ఇప్పుటికే ఇంతటి అధునాతమైన రోజల్లో కూడా అమ్మ మడి కట్టుకొని నాయనమ్మకి వండి పెడుతుంది… అంత నాన్నగారే చూసుకుంటారు… ఏనాడు నోరు విప్పిఇది కావాలని అడగ్గా చూడలేదు. నాన్న కూడా అంతే మహాపద్ధతైన మనిషి, తన దినచర్యలో ఏ మాత్రం మార్పు వుండేది కాదు. పొద్దున్నే పూజ, ధ్యానం, భోజనం.. ఆఫీసు, ఇల్లు.. అతని ప్రపంచంమంతా … భార్య… పిల్లలు, తల్లి, తండ్రి… పొదరిల్లు లాంటి ఇల్లు.. ఉమ్మడి కుటుంబం… మళ్ళీ పొలమారింది. దుఖ్ఖం ఉప్పెనలా చుట్టుకుంది….
ఎమ్.టెక్ చదవాలని వున్నా, ఉద్యోగం చెయ్యాలనిపించింది. అమ్మకోసం… అమ్మకు ఖరీదైన జీవితం చూపించాలి, అమ్మని ఊర్లన్ని తిప్పాలి అనుకునేవాడు. అమ్మ …అమ్మని తలుచుకొనే , మళ్లీ దుఖం పొంగి పొర్లిపోయింది.. అట్టపెట్టల మీద బొర్లాపడుకుని కుళ్ళి కుళ్ళి ఏడ్చాడు.
ఉద్యోగం కోసం ఢిల్లీ వెళుతుంటే… ఆ ఇల్లు ఆనందంతో నిండిపోయింది. ఇంక వీడికి పెళ్ళి చేసేద్దాం. ఏ పంజాబీ అమ్మాయినో ప్రేమించి, కోడలిగా తేకుండా నాయనమ్మ మాటలకి… ప్రేమించడం తప్పు కాదా. ప్రేమకోసం బతకాలి. అదే జీవితం అనుకోవాలి అంది ”అమ్మ”… ఆశ్చర్యపోయాను…. అమ్మ గుండెల్లో ఇంత ఆధునిక భావాలా? ఆ మాటే అమ్మతో అన్నాను. వేషానికి, సంప్రదాయాలకు మనిషి జీవితానికి ముడి పెట్టకు … జీవించడానికి మనసు కావాలి, మనసునీ మనిషితో జీవితం అర్థవంతం కావాలి అంటే అమ్మ నన్ను దగ్గరిగా తీసుకొని తల నిమిరుతూ… ఆశీర్వదిస్తూ….
ఆ ఇంటి నిండా నవ్వులు పువ్వులై రాలి పడ్డాయి. జ్ఞాపకాలు గాలికి ఎగిరే కాగితాల్లా లేచాయి… చూట్టూ తిరుగుతూ నా ప్రమేయం లేకుండనే గతాలని కదిలిస్తూ… గుండెని గాయం చేసాయి…
నిశ్చితార్థం మొదలుకొని పెళ్ళిదాక చాల ఘనంగా జరిగింది. అమ్మ, నాన్న, నాయనమ్మ, తాత అందరూ కలసి వెతికిన అన్నీ విధాల అందరికి నచ్చి సంబంధం, అందరూ మెచ్చుకొన్న సంబంధం. ఇంటి కోడలిగా ”కళ్యాణి” రాకతో ఆ ఇంట్లో మరోసారి ఆనందం వెల్లివిరిసింది…పది రోజలు సెలవు పెట్టి, ఇంట్లో అందరితో గడపాలని ముందే నిశ్చయించుకొన్నాను….
మొదటి రాత్రీ కళ్యాణి, నన్ను దగ్గరికి రానివ్వలేదు… ఇలాంటివి నాకు అసహ్యం అంది… ఆశ్చర్యం, అవమానంతో నోట మాట రాక శిలలా ఉండిపోయాను…
వరుసగా మూడు రాత్రుళ్ళు అలాగే ప్రవర్తించింది.. మూడురోజులు తట్టుకోలేక పోయాను… అసలు ఎందుకిలా ప్రవర్తిస్తున్నావని, కారణాలు చెప్పంది వదలనని మొండి పట్టు పట్టాను…
ఏడుస్తూ… నాకు విడాకులు కావాలి అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది… విడాకులా? పెళ్లై ఇంకా పదహారు రోజుల పండుగ కూడా అవలేదు విడాకులా?
ఒక్కసారి జీవితంలో పెను తుఫాను మొదలైయింది… ఎలాగోలా ఒప్పించి ఎవరికి ఏ విషయం బయటికి తెలియనివ్వకుండా ”ఢిల్లీ” కాపురానికి తీసుకు వెళ్ళాను ”కళ్యాణిని” .
ఒక సంవత్సరం పాటు జీవితం అంటే, ఇలా కూడా ఉంటుందనే పద్దతిలో నరకం చూపించింది… మొగవాళ్ళు ఆడవాళ్ళని హింసిస్తారన్నది… లోకసత్యం… కాని కొందరు మొగవాళ్ళ జీవితాలకి ఆడవాళ్ళు శాపాలుగా తయారవుతారన్నది అరుదైన నిజాలు… కళ్యాణి నా జీవితానికి శాపంలా మారింది… అసలు అ ఇల్లు తనది కాదు, అన్నట్లు అడుగు అడుగులో ప్రవర్తించేది… దిగులుగా కూర్చునేది, ఏ విషయం చెప్పేది కాదు… వాళ్ళ అమ్మకి కూడా ఫోన్ చేసేది కాదు… ఎంత చెప్పిన ఎన్ని విధాలుగా బతిమాలిన, మౌనం విడేదికాదు… ఏ విషయం చెప్పేది కాదు… అన్నింటికి ఒకే సమాధానం ఏడుపు… నన్ను వదిలేయండి అంటూ… ఒక రాత్రి హఠాత్తుగా ఇల్లు వదిలి వెళ్ళిపోయింది.
ఆ రోజు ఆఫీసు నుంచి రావడం చాల అలస్యం అయింది… ఎందుకు వెళ్ళిపోయిందో? రాసిపెట్టిందోమో అని ఇల్లంత వెదికాను… కట్టుగుడ్డలతో వెళ్ళిపోయినట్లుంది…ఇంట్లో ఏలా వున్న సామాన్లు అలాగే ఉన్నాయి.. నీరు కారిపోయాను. ఏం చెయ్యాలో తోచలేదు.. రోజుకోసారైన ‘కళ్యాణి’ అమ్మ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. సెల్ పట్టుకెళ్ళిందేమో సెల్‌కి చెద్దామనుకున్నాను… సెల్‌ఫోను కూడా వదిలేసి వెళ్ళిపోయింది….
ఎంత దాచుదామన్న నా వల్ల కాలేదా వారం రోజులలో. ఇటు అమ్మకి అటు వాళ్ళ వాళ్ళకి తెలిసి పోయింది, ”కళ్యాణి” ఇల్లు వదిలి వెళ్ళి పోయిందన్న సంగతి తెలిశాక, అమ్మ నాన్న వచ్చారు. కళ్యాణి తల్లి తండ్రి వచ్చారు. అందరిదీ ఒకటే ప్రశ్న ఇలా ఎందుకు చేసిందని?
”కళ్యాణి” తల్లి ఎవరూ లేనపుడు నా దగ్గరగా వచ్చి. బాబు ఎందుకు కళ్యాణి వెళ్ళిపోయింది. ఏం జరిగింది. కళ్యాణి ఏం తప్పుచేసింది? ఇద్దరు ఎందుకు దెబ్బలాడుకున్నారు? నాకు ఒక ఫోన్ కాల్ చేస్తే వచ్చేదాన్ని కదా?! పిల్ల ఎక్కడికి వెళ్లిందో తెలియదు. పరువూ పోయింది అంటూ చంటి పిల్లలా విలా విలా ఏడుస్తుంటే, ఏలా సముదాయించాలో అర్థం కాలేదు..
కళ్యాణి నాకు కూడా యేం చెప్పేది కాదు. చాలా మౌనంగాఉండేది. అసలు మాటలు వుంటేకదా, పోట్లాటలు నాతో అసలు మాట్లాడేది కాదు… మాట్లాడినా ఏడ్చేది, విడాకులియమని బతిమాలేది…అన్నాను.
అలాంటప్పుడు మాకు కబురు చెయ్యాలికదా?! దిగులుగా అడిగిందావిడ….
మారుతుందని ఎదురు చూశాను… అందర్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలనుకున్నాను…అన్నాను. తప్పుచేసిన వాడిలా తలదించుకుంటూ….
ఆ తరువాత నెలరోజులు జీవితాన్ని ఒక ప్రశ్నార్థకంగా మార్చాయి…అలా అలా ఆఫీసులో కూడా అందరికి తెలిసిపోయింది…. పెళ్ళి అయ్యి నెలరోజులు కాకముందే భార్య వదిలేసిన వాడిగా … అందరి ముందు దోషిలా నిలబడ్డాననిపించేది.
అమ్మనాన్న ఉండిపోయారు… అమ్మ కళ్ళలో దిగులు, నాన్నలో మరింత మౌనం చూడలేకపోయాను… రోజకోసారైన కళ్యాణి అన్నగారు ఫోన్ చేసి అమ్మాయి విషయం తెలిసిందా…? అంటూ దీనంగా అడిగారు….
నేను తెగించి పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకుంటుండగా…. ఆరోజు ఆదివారం …. చిన్నగా వాన పడుతోంది… డోర్ బెల్ మోగగానే, తలుపు తీసాను. .. ఎదురుగా కళ్యాణి… వేరే అబ్బాయితో…కళ్యాణిని చూసి, అందరం స్థాణువులై పోయాము.
కళ్యాణి చొరవగా ఇంట్లోకి, వచ్చీ, ఆ అబ్బాయిని కూడా లోపలకు పిలిచి….అత్తయ్య మీరు ఉన్నారా అంటూ … ఈయన మా ఆయన…మేమిద్దరం పెళ్ళి చేసుకున్నాం…
”సంజీవ్” మీదగ్గర నుంచి నాకు విడాకులు కావాలి అంటూ నిర్భయంగా అడుగుతుంటే,, నోట్లోంచి మాటరాలేదు. మిమ్మల్ని ఎన్నోసార్లు అడిగాను, వీలైనంత తొందరగా కావాలి… మేమిద్దరం…ఇండియా వదిలి వెళ్ళిపోతున్నాము అంది స్థిరంగా…
అమ్మ ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టింది… ఆడపిల్లల్లో అందులో సంప్రదాయ కుటుంబంలోంచి వచ్చినదానివి? ఇలాగేనా ప్రవర్తించేది… ముందుగానే నీ తల్లి తండ్రికి ఎందుకు చెప్పలేదు… ఎంత ఖర్చు ఎంత ఆవేదన, పరువు ప్రతిష్ట పోయి అందరం ఎంత క్షోభపడుతున్నమో…నీకు అర్థం అయ్యిందా?
అమ్మని సముదాయించడానికి చాలా సమయం పట్టింది… అమ్మ అన్ని మాటలు అంటుంటే ఒక్క దానికి సమాధానం ఇవ్వలేదు కళ్యాణి… వస్తానండీ అంటూ అందరికీ చెబుతూ… సంజీవ్ విడాకులు సంగతి మరచిపోకు అంది….
వెళ్ళిపోతుంటే అడిగాను… కళ్యాణి మీ అమ్మగారు నీ గురించి దిగులు పడుతున్నారు… ఒక్కసారి ఫోను చేసి చెప్పు అన్నాను…. నవ్వేసి వెళ్ళిపోతూ విడాకులు నోటిసు పంపిస్తాను… సంతకం చేసి పంపించండి అంటూ వెళ్లిపోయింది….
ఆమె చాలా తేలిగ్గా వెళ్ళిపోయింది…. నా మనసు ఆ గాయాన్ని తట్టుకోలేక పోయింది…. అతి కష్టం మీద హైదరాబాదు ట్రాన్స్‌ఫర్ చేయించి, తీసుకొచ్చారు… అమ్మ నాన్న ….
అంతవరకే వాళ్ళు చేయగలిగారు… కాని నా మనసు గాయానికి ముందు వేయలేకపోయారు…. కోర్టులో ”మొగవాడు కాదు” సంసారానికి పనికి రాడు అనీ బలమైన వాదంతో విడాకులు వచ్చాయి… అందరూ కుప్పకూలిపోయారు…. ఖరీదైన పెళ్ళి ఫోటోలు ఆల్బంలోంచి తీసి మంట పెట్టాను…ఒద్దురా అశుభంరా అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది అమ్మ…
జీవితపు పెను తుఫాను..ఇంట్లో అశాంతి, తల్లి కళ్ళల్లో ఆగని కన్నీరు… తండ్రి మరింత మౌనం… ఒక రోజు శాశ్వతంగా అందర్నీ వదిలి వెళ్ళిపోయారు.
నాయనమ్మ, తాతయ్యల ఆవేదన, అమ్మ దుఖం పొదరిల్లు లాంటి ఇల్లు, ముళ్ళపొదలా తాయరు అయింది….
మగతనానికి సవాలు, మంచితనానికి, పోటు… చేయని నేరానికి శిక్ష ఇది? నా మగతనాన్ని ఋజువు చోసుకోవాలా? ఇక్కడ జీవితం నలగడం మొదలు పెట్టింది…నిరాశ నీడలు కొండల్లా కమ్ముకున్నాయి….
”అందరి స్వభావం ఒకేలా వుండదు… కొందరు బతకు ఎలాంటిదైనా, దాన్ని కౌగిలించుకొని నవ్వుతూ బతికేస్తారు… కొందరు ఆగాధంలోకి జరిపోతారు… నాలాంటి వాళ్ళే… చీకట్లు కమ్ముకున్నాయి… రేగిన గాయం మండేలాగ మందులో మునిగిపోవాలి… చీకటిని మత్తుని కౌగలించుకుని నిద్రపోతే… దానంతట అదే తెల్లవారుతుంది… నిద్ర… మెలుకువ వస్తే జీవితం మొదలవుతుంది… అనారోగ్యం ఒంటిని హాయిగా చుట్టుకొంది… అట్టల మీద పడుకొన్నాడు… చెట్టు కొమ్మలోంచి వెన్నెల తళకు తళుకు మంటూ ఆకుల మధ్యలో మెరుస్తోంది… అలాగే దాన్ని రెప్ప వాల్చకుండా చూసాడు…
కళ్ళమూసుకుంటే గతాలు కళ్ళకింద పాకుతాయి.. రెప్పలు దాటి జివ్వుమని ఎగిసి పడతాయి… మూసిన కళ్ళు వెనకాల దృశ్యాలు జీవితాన్ని భంగపరుస్తాయి… కళ్లతెరిచి చూస్తూ వుంటే నడుస్తున్న రోజు కనబడుతుంది… కళ్ళు మూస్తే గతం కలవరపెడుతుంది… మెదడుని తొలిచేస్తుంది…కంట్లోంచి ఆఖరి కన్నీటి బొట్టు మండుతున్న నీటికణంలా చెంపల మీద నుంచి జారుతూ ఇసుకలో కూరుకుంది…
అందరూ తాగుబోతని వెలివేశారు… వేలల్లో జీవితం… స్కూలు నించి అన్నింట్లో ఫస్ట్…వెనకకి అడుగు వెయ్యని జీవితం… హోదా, కారు… అన్ని మందు సీసాలో మునిగిపోయాయి…
అన్ని వదిలిపెట్టి దూరంగా వచ్చేశాడు…
అతడెవరో గాని… గాయాన్ని కదలించాడు… అమ్మని చూడాలనీ ఆశని రేపాడు… అతడు వెళ్ళిపోయాడు… మళ్ళీ వస్తాడా… అమ్మని చూడాలి. దగ్గుతెర ఉప్పెన ఊపింది… రెండేళ్ళ తరువాత జాగ్రత్తగా దాచుకొని విజిటింగ్ కార్డ్ పాల్తిన్ కవరులో పెట్టింది… చేతివేళ్ళ మధ్యలో … అరచేతిలో బిగుసుకుంది….
అతడిని కలిసి వచ్చాక ఆ రాత్రి నిద్రపట్టలేదు… ఇవాళ్టి లాగే…మర్నాడు సోమవారం ఆఫీసుకి వెళ్ళుతుంటే ఎప్పటిలాగే ఆ చెట్టుకేసి చూసాను… ఇద్దరు ముగ్గురు గుమికూడి వున్నారు… అతడేడి అనుకొన్నాను. గుండే వేగంగా కొట్టుకుంది.. ముందు స్టాపులో దిగిపోయి గబగబ నడుచుకుంటూ వెళ్ళాను… అతడు చనిపోయాడని అన్నారు…
నిశ్చలంగా అట్టలమీద పడుకొని ఉన్నాడు… చేతిలో ఏదో కనిపించింది.. పిడికిలి విప్పదీసి చూసాను…
”సంజీవ్‌రావు” బి.టెక్. ఇంటి ఎడ్రస్ ఫోన్ నెంబరు అవీ ఉన్నాయి… గుండె చెరువయ్యింది… ఎందుకో ఏడ్చాను… అందరు కుతుహలంగా మీ వాళ్ళా అని అడిగారు…
ఆ తరువాత శవాన్ని గాంధీ హస్పిటల్ మార్చురికి తరలించారు.. హాస్పిటల్‌లో నన్ను పట్టుకొని ఏడుస్తూ తల్లి గర్భశోకాన్ని ఎవరూ ఆపలేక పోయారు.
మంచి చేశానో చెడు చేశానో తెలియదు…. కాని మంచే చేశాను అనుకుంటున్నా… అప్పుడప్పుడు ధైర్యంగా… అనాధగ చెట్టు క్రింద శవంలా కాకుండా తల్లి, చెల్లెలు… కుటుంబం మధ్యలోకి వెళ్ళాడు… ఇప్పటికీ వాళ్ళ అమ్మగారిని అప్పుడప్పుడు పలకరిస్తాను…
కాని ఎవరూ రోడ్డుమీద పడి మందు మత్తులో కొట్టుకుపోతున్నా మనసు గిలగిల లాడుతుంది.. ఎవరో కదా? వీళ్ళ గురించి ఎవరో ఎదురు చూస్తు ఉంటారు కదా? అనుకుంటూ ఉంటాను….
ఎందుకో మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత … ఆ అనుభవం గుర్తుకొచ్చింది… ”మద్యపానం నిషేధం” నినాదాల ముగింపులా….
ఆరి సీతారామయ్య May 3, 2009 1
రేణుక అయెల గారు చెప్పదల్చుకున్న విషయం మద్యపానం హానికరమయింది అని, రాజకీయ నాయకులు ఎన్నికల ముందు మద్యపాన నిషేదం గురించి మాట్లాడినా, ఎన్నికలు అయిపోయింతర్వాత దాని గురించి పట్టించుకోరని.
కాని, కథలో సంజీవ్ జీవితం పతనం కావటానికి కారణం అతని భార్య కల్యాణి ప్రవర్తన అన్నట్లు చిత్రించారు రేణుక గారు. మద్యపానం ముఖ్య కారణం అనిపించదు కథ చదువుతున్నప్పుడు.
ఈ కథ మొదట సంజీవ్ ని చూసిన వ్యక్తి దృక్పథంలో ఉంది. తర్వాత సంజీవ్ గురించి రాస్తూ అతడు “అట్టపెట్టల మీద బొర్లాపడుకుని కుళ్ళి కుళ్ళి ఏడ్చాడు” అని రాశారు. అంటే ఇది కథకుడి దృక్పథం నుంచి చెప్పిన విషయం. ఆ తర్వాత కథ సంజీవ్ దృక్పథానికి మారుతుంది. అతను చనిపోయింతర్వాత మళ్ళా మొదట సంజీవ్ ని చూసిన వ్యక్తి దృక్పథానికి మారుతుంది. ఇలాంటి మార్పులు చెయ్యటం వల్ల కథలో ఫోకస్ లేకుండా పోతుంది.
ప్రాణహిత » ఎప్రిల్ 2009 సూచిక Oct 11, 2009 2
[...] మనిషితనం/అతడు : రేణుక అయెలా [...]