నెర్రెలు

అదో పల్లెటూరు. గ్రామ పంచాయితీ ఆఫీసులో జనం నిండిపోయి వున్నారు. ఎంతగా వున్నారంటే దాదాపు ఊరు మొత్తం అక్కడే వున్నారు. లోపల స్థలం సరిపోక గోడలపైన, దాని పక్కన పెరిగిన చెట్లపైన జనం ఎక్కి కూర్చున్నారు. పంచాయితీ ఆఫీసు గద్దెమీద నాలుగైదు కుర్చీలు వేసివున్నాయి. ఆ ఊరికి పెద్దలుగా పిలువబడేవాళ్ళు కూర్చుని ఉన్నారు. వ్యవసాయం చేసుకునే వాళ్ళు, వ్యవసాయ కూలీలు, కాపులు, రెడ్లు, బీసిలు, ఎస్సీలు అందరూ అక్కడ పోగై ఉన్నారు. గోలగోలగా వుంది. కక్కిరిబిక్కిరి అరుస్తున్నారు. రోడ్డుమీద వెళ్ళేవారు జనాన్ని చూసి ఏం జరిగిందో తెలుసు కోవడానికి ఆగిపోతున్నారు. సంకలో పిల్లలు గుక్కపట్టి ఏడుస్తున్నారు. విసుగుతో రెండు దెబ్బలు వేసి పాలరొమ్ము నోటికి అందిస్తున్నారు తల్లులు. దెబ్బలను మరిచి ఆబగా పాలను తాగుతున్నారు చంటిపిల్లలు.  

”ఎహె… ఇగ మొదలువెట్టరాదుండ్రీ” గుంపులోంచి అసహనంగా అరిచారెవరో….

”ఉడికిందాకా ఆగినోనివి …ఉమ్మగిల్లేదాక ఆగబుద్ది అయితలేదారా… సర్పంచ్‌ రానీండ్రీ… ఈయనకు తీరది వొడువది” విసుక్కుంటూ చెప్పాడో పెద్దమనిషి.

”రాజీరికం గట్లనే వుంటది…” గుణిసిందో ముసలవ్వ.

”అరె సాయిలు పొయ్యి సర్పంచ్‌ను తోలుకరాపో..” నున్నగా దువ్వి తెల్లబట్టలు వేసుకొని మీసాలు వడి తిప్పిన నారాయణరెడ్డి మళ్ళీ చెప్పిండు.

”గిప్పుడే గాన్నుంచి అత్తి పటేల? అత్తన్నపా..అత్తన్నపా అని నన్ను ఎల్లగొట్టవట్టే…” మళ్ళీ పోవడం ఇష్టంలేని సాయిలు చెప్పిండు. గ్రామపంచాయితి బంట్రోతు సాయిలు.

”కొత్తగా పెండ్లి అయినోనికి పెండ్లాన్ని ఇడిసిపెట్టి రాబుద్దయితలేదుగావచ్చు” ఏదో అర్థం స్ఫురించేలా అన్నాడో ముసలివాడు.

అంతా గొల్లున నవ్వారు.

”అబ్బో ముసలోనికి మల్లా ఈడు అత్తాందిరో” వ్యంగ్యంగా అన్నాడు పక్కనే నిలబడ్డ పడుచు పిల్లగాడు.

”ఈడు రాకపోతేందిరా… నాకున్న ఈడు సాలదా?” రోషంతో చేతిలోని కర్రతో పొడవబోయాడు ముసలతను.

”అబ్బో ముసలోడు పాడుగాను…” అనుకుంటూ దూరం జరిగాడు పడుచు పిల్లగాడు.

ఇట్ల ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటుంటే…

”సర్పంచ్‌ అత్తాండు….” గట్టిగా అరిచారెవరో!

అంతా సద్దుమణిగారు. రెండు చేతులతోటి నమస్కరిస్తూ గద్దెనెక్కాడు సర్పంచ్‌ లింగమూర్తి.

”అందర్నీ జమ జేయించినవ్‌… నువ్వు గిప్పుడు అత్తాన్నవు” ఊరిపెదకాపు మల్లయ్య అన్నడు.

”జల్దీ అద్దామనుకుంటే ఇంటికి సుట్టాలచ్చిండ్రు. బామ్మర్దీ,అత్త అచ్చిండ్రు. అరుసుకొని అచ్చేటాల్లకు గిదువారయ్యింది” సంజాయిషి చెప్పాడు.

”పెండ్లాం కోసం ఊసుగండ్ల బామ్మర్దీని ముద్దువెట్టుకోవాన్నట” బావ వరసున్న పోశన్న అన్నడు.

”మారే… ఎన్నిసార్ల ముద్దువెట్టుకుంటివి బావనన్ను” చురక అంటించాడు లింగమూర్తి.

”పరిగ్యాసం సాలుగని…ముచ్చటి ముంగటవెట్టుండ్రీ” అన్నడు రాజయ్య. రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి అతనిది. ఈ రోజు పనిలోకి వెళ్లలేక పోయిన కారణంగా అతని కంఠంలో కోపం ధ్వనిస్తోంది.

జోరుగా పనిరోజుల్లో…అలా అందరూ ఒక్కచోట చేరి సమయం వృధా చేయడం ఎవ్వరికి ఇష్టంలేదు. తప్పని పరిస్థితిలో అందరూ పోగైయ్యారు.

”సరే…సరే… విషయం అందరికి తెలియాలికదా! సాంబన్న ముచ్చట అందరికీ చెప్పవే” నారాయణరెడ్డి సిగరేట్‌ వెలిగించుకుంటూ అన్నాడు.

”అరె ఎవ్వనికి తెల్వని ముచ్చటది. ఊరు ఊరంతా తెల్సిందేనాయే. రాజిగాడు నా పొలం కొయ్యనియ్యకుంట అడ్డం తిరిగిండు. పక్కకు దొబ్బేసినా… మల్ల అచ్చి గదే పని చేసిండు…కోపం అచ్చి దవడమీదికెయ్యి ఒక్క సరుపు సరిసినా” చెప్పి ఆగిండు.

”నిజమేనారా… రాజీగా” అడిగిండ్రు పెద్దమనుషులు.

”నివద్దే పటేలా… పొలం కొయ్యద్దని అడ్డంబడ్డ. కోపమచ్చి పటేలు కొట్టిండు. కైకిలోల్లం నలుగురు కలిసి పటేలును దొబ్బేత్తే, కిందవడ్డడు” నిజం అంగీకరిస్తూ చెప్పాడు రాజయ్య.

”పాపం పాడువడ గిట్లుంటాదిరా…” వాని పొలం వాడు కోసుకుంటే మీకేం నొచ్చిందిరా” కోపంగా అన్నడు మల్లయ్య పెద కాపు.

నిజమే సాంబయ్య పొలం సాంబయ్య కోసుకుంటే తప్పెట్ల అయితది. అందరూ అదే అనుకున్నారు. అదే విషయం రాజయ్యను అడిగారు.

”వాని పొలం వాడు కోసుకుంటే, మీరెట్ల అడ్డం బోతరు. మీకెమన్న అప్పున్నడా! మీ పాలోడా! రాను రాను మీకు నియ్యతి లేకుంట పోతాంది. ఇగ ఊల్లే మీరే ఉన్నార్రా. గిట్లయితే మేం ఊరు ఇడిసిపెట్టుడే…” కోపంగా అన్నాడు మళ్ళీ మల్లయ్యే.

”గంతమాటెందుకు పటేలా” అన్నడు రాజయ్య.

”లేకపోతేందిరా! ఊరా? అడివా? మీ పొలం కోసుకున్నట్టు అడ్డం తిరిగితిరి! సాంబనికి అడ్డం తిరిగినోళ్ళు రేపు మాకు సుత అడ్డం తిరుగుతరు. గిదేం పద్దతిరా” నారాయణరెడ్డి తెచ్చి పెట్టుకున్న దర్పంతో గదమాయించాడు.

”ఔరా రాజీగా అడ్డం ఎందుకు తిరిగినవో చెప్పరాదురా” కైకిలి చేసుకుని బతికే కనుకయ్య అన్నాడు.

”ఔ పటేల…రేపటి సంది ఎవ్వలు పొలంకోసుకున్న అడ్డం పడుతం…” గట్టిగా అరిచిండు రాజయ్య.

ఆ మాటలకు అందరూ నివ్వెరపోయారు.

”పిసలేసిందిరా ఈనికి… గిట్ల మాట్లాడుతాండు” మనుసులో అనుకున్నరు.

”ఏందిరా రాజయ్య…గిట్లనవడితివి. చేతికచ్చిన పొలాలు పాడుచేసుకోమంటవా? నీ ఇట్టం అచ్చినట్టు మాట్లాడవడితివి. ఇంకోని పొలంల నువ్వెట్ల అడుగువెడుతవ్‌! లేని లొల్లులు పుట్టియ్య వడితివి కదరా! దయ్యం గిట్ట పట్టినాదిరా” అన్నాడు సర్పంచ్‌.

”కొత్తలొల్లులు మేం పుట్టిత్తలేం సర్పంచ్‌ సాబ్‌. మీరు పుట్టిత్తాండ్రు. ఇగ మా బతుకు బజాట్ల వడ్డది” కండ్లపొంటి నీళ్ళు తిరుగుతుంటే అన్నడు రాజయ్య.

”తాగినవురా…ఎవ్వల మీదకంటే వాళ్ళ మీదికి గుర్రుకారుతున్నవ్‌ గాడ్దికొడుకా” పక్కనే ఉన్న రాజయ్య తల్లి   , అతన్ని వెంట్రుకలు రెండు చేతులతో పట్టి అటు ఇటు లాగింది.

”ఎహె… నువ్వాగు అవ్వ… మనసేతలకు బతుకుడే కట్టమైతాంది. తాగుడుకు ఏన్నుంచి అత్తయ్‌..”

”చెప్పేదేందో అందరికి తెలిసేటట్టు సెప్పరాదురా”

”చెప్పుత పటేలా! మా బతకులు బాజాట్ల వడ్డయ్యి ఇగ మేము ఎట్ల బతకాలే… మమ్ములను కైకిలి ఎవ్వలు పిలుత్తలేరు. మరి మేము ఏం చేసుకొని బతకాలె. రెక్కలను నమ్ముకుని బతికేటోళ్ళం.”

”పిలుత్తలేరని పొలాల పొంటి అడ్డం తిరుగుతరా”

”లేదు పటేలా అడ్డం తిరుగుడు నాది తప్పే. గతిలేక అడ్డం తిరిగినా. సాంబయ్య పటేలు ఏండ్లకుఏండ్లు మమ్ముల కైకిలి పిలుసుకునేటోడు. ఇయ్యలా వరికోత మిషన్‌ తీసుకచ్చి మమ్ముల ఆగం చేసిండు. సాంబయ్య పటేలు ఒక్కడే కాదు అందరూ మిషన్‌ వెట్టి కోయించుతాండ్రు. ఇగ మేమెట్ల బతకాలె…మీరే చెప్పుండ్రీ…”

కూలీనాలి చేసుకునే వాళ్ళందరూ….

”నిజమే…నిజమే… మేమెట్ల బతకాలే” అరిచారు.

పెదకాపు మల్లయ్యకు ఎక్కడలేని కోపం ముంచుకు వచ్చింది.

”నీయక్క! ఇయ్యాలా మీకు కాపుదనపోడు యాదికచ్చిండ్రా! యాసంగప్పుడు కోతలకు రమ్మని ఇంటింటికి తిరిగి ఎంత బతిలాడినా ఒక్కడు అచ్చినార్రా. కోతకచ్చి పొలాలను నాశ్నంకాంగా మిట్టమిట్టసూసుకుంట ఉన్నరుగని కైకిలికి అచ్చిండ్రా! మా గోస ఎవ్వనికి చెప్పుకున్నం. అయినకాడికి చేసుకున్నం. కాంది అట్లేనే గొడ్డుగోదలకు యిడిసిపెట్టినం. గానాడు మేమెంత బాధపడ్డమో ఇసారిచ్చినార్రా మీరు. వందరోజుల పనికి మరిగి మమ్ముల గై సెయ్యకనే పోతిరి…..” అప్పుడు తనకు వచ్చిన నష్టం గుర్తుకువచ్చింది.

”…మీరు తిన్నది కాదు…మేము తిన్నది కాదు. సేతంతా సెర్ల కలిసిపాయే…ఇగ మిమ్ములను నమ్ముకుంటే మేము ఎవుసం చేసినట్టే… గందుకే కోత మిషన్లను  తోలుకచ్చుకుంటాన్నం” తప్పంతా మీదే అన్నట్లు మాట్లాడిండు మల్లయ్య.

” ఏంది పటేలా తప్పంతా మాదే అన్నట్టు మాట్లాడవడితిరి కైకిలి సరిపోతలేదు పెంచుండ్రంటే పెంచక పోతిరి. ఏదో ఆశపడి వందరోజుల పనికి పోయినం. ఊరు ఇడిసిపోయినట్టు జేత్తాండ్రు” ఎల్లవ్వ అన్నది. పొలంలో ఎండి పోతున్న పంటలాగే ఉన్నది ఆమె.

కూలీలు, వ్యవసాయం చేసేవాళ్ళు రెండు వర్గాలుగా చీలి పోయారు.

”అవునే ఎల్లి నీకు సేసినా నడుత్తది… సెయ్యకున్న నడుత్తది. నడిమిట్ల మేమే బతక లేనిది… నీయక్క గీ సర్కారు సుత మీకు అరుసుకోవట్టే… రెండు రూపాయల బియ్యం ఇచ్చిరి. ఆరోగ్య శ్రీ అనవట్టిరి. ఇందిరమ్మ ఇండ్లు పిలిసి ఇచ్చిరి. ఇగ మీకు మేం కనిపిత్తామే” గొల్లా శేరాలు అన్నడు.

” ఆ మాసేసిండ్రు తీయ్యి. రెండు రూపాయల బియ్యంతోటి బిచ్చపోల్లను చేసిండు. ఆరోగ్యశ్రీ పాడుగాను దవాఖాన్ల మమ్ముల కానినోడు ఎవడు. ఇండ్లను ఇత్తె ఎదురు అప్పుచేసి కట్టుడాయే. చూసెతందుకు మంచిగనే కనిపిత్తన్నాయి…” వాటివల్ల అవస్థలు పడ్డ సాలే హనుమాండ్లు సొద చెప్పు కచ్చిండు.

”ఎవన్నీ అంటే ఏమున్నది… మన రాతలే గిట్లున్నయ్‌!” ఏండ్లు మారినా బతుకులు మారని సమ్మయ్య మెల్లిగా గులిగిండు.

”రాత మారాన్నంటే మనకు తెలంగాణ రావాలే” ఉడుకు రక్తం మీదున్న జరంత చదువుకున్న పోరడు గట్టిగనే అన్నడు.

”ఇగ తెలంగాణ అచ్చినట్టే ఉన్నది. తెచ్చేటోడు తెగియ్యకపాయే. ఇచ్చేటోడు ఇడిసిపెట్టకపాయే” కొద్దిగా రాజకీయం తెలిసిన రామస్వామి అన్నడు.

”ఎహె… జర్ర సైసుండ్రీ. ముడ్డికి మూతికి అంటకుంట మాట్లాడవడితిరి. గీ ముచ్చట తెల్లగోలు జెయ్యిండ్రీ” జీవితానుభవం కలిగిన జితేందర్‌ రెడ్డి కసురుకున్నాడు.

”తెల్లగోలు ఏమైయ్యేటట్టున్నది. కాపుదనపోల్లేమో పిలిత్తే రాలేదంటున్నరు. కైకిలోళ్ళు పిలుత్తలేరంటారు. ఎవ్వలను కాదనేటట్టు లేదు. మరి ఏంజేసుడు” అర్థంకాక బుర్ర తడుముకున్నాడు నడీడు వయసున్న మల్లేశు.

” పటేల వందరోజుల పనికి పోతేనే మీకు కోపం అచ్చింది. మరి మీకు అప్పులు మాఫీ చేసిండ్రు కదనే..” లాజిక్కు బయటికి లాగిండు కొద్దిగా బుర్ర ఉన్న శీనుగాడు.

”నిజమే…నిజమే” అన్నరు అందరూ.

”థూ…మాపట మాఫీ… ఎవ్వనికి మాఫీ చేసిండ్రో ఎరికెనారా! దొంగలకు లంగలకు. తీసుకున్న అప్పు పైస వోకుంట కట్టినోనికి నోట్లే మట్టి కొట్టిండ్రు. అప్పు గట్టకుంట ఎగవెట్టినోనికి మాఫీ చేసిండ్రు. గిది ఎంతవరకు నాయం” మాఫీ పథకంలోకి రాని కొప్పుల కొమురయ్య కైయ్యిమని అరిచిండు.

”ఏమిటికీ అక్కరకు రాని పథకాలు. ఎవ్వనికి ఆడు చేసుకుని తినేటట్టు వుండాలేగని. రెండు రూపాయల బియ్యం ఎందుకు తినాలే… ముప్పై రూపాయల బియ్యం వాళ్ళు సుత కొనుక్కుని తినేటట్టు వుండాలెగని, రుణం మాఫీ చేస్తరుకని గిట్టుబాటు ధర మాత్రం యియ్యలేమంటరు… ఇది మంచిదేనా” ఓ పెద్ద మనిషి అన్నడు.

”మరి ఓట్లు పడాన్నంటే కుక్కకు బొక్క ఇసిరినట్టు ఇసిరిండ్రు. ఎప్పటి సిప్ప ఎనుగుల్నే అన్నట్టు జనాలుండాలే. వాడేమో ఖద్దరు బట్టలేసుకొని, కార్ల తిర్గాలే… అయినా జనానికి బుద్దుండాలే….” రాజకీయంలో తిరిగి తిరిగి మానుకున్న ఉప్పలయ్య అన్నడు.

”ఆగుండ్రీ. ఉసికెల ఉచ్చవోసినట్టున్నది. మనిషికో మాట మాట్లాడవడితిరి. పొద్దు పోతాంది. పనిలేక అచ్చినట్టు మాట్లాడుకోవడితిరి. ముచ్చట సంబురానా దొంగ తిండి మర్సినట్టు అసలు ముచ్చట అడుగువట్టిత్తిరి” కోపంగా గుంపులోంచి గట్టిగానే అన్నారెవరో…

లొల్లి ఎక్కువైంది.

ఒకరిని ఒకరు దూషించుకుంటున్నారు. కారణం మీరంటే మీరని నిందించుకుంటున్నారు. వాదోపవాదాలు ఎడతెరపిలేకుండా నడుస్తున్నాయి.

కూలీలందరూ ఒక్క మాటమీద నిలబడ్డారు. పొలాలు మిషన్లతోటి కోత్తే ఖచ్చితంగా అడ్డుకుంటామని తెగేసి చెప్పారు. వాళ్ళ నిర్ణయం చూస్తే అంతపని చేసేలాగా వున్నారు. ఏం చెయ్యాలో మిగతావాళ్ళకు అర్థం కావట్లేదు.

”గీవీళ్ళను నమ్ముకుంటే నట్టేట్లే ముంచుతరు” కూలీలు దొరకక పంటచేతికి రాక అవస్థ పడ్డ ఒకరు అన్నరు.

”నిజమే…వీళ్ళను ఎట్లనమ్ముడు”

సుదీర్ఘంగా చర్చ కొనసాగింది. ఆఖరికి పెద్దలందరూ  కలిసి నిర్ణయం తీసుకున్నారు.

అదే విషయాన్ని సర్పంచ్‌ లింగమూర్తి వివరిస్తున్నాడు. ”ఇగో అందరూ ఇనుండ్రి…

కైకిలోళ్ళు, కాపుదనపోళ్ళు అందరూ కలిసి మెలిసి వుండాలే… ఒకలకు ఒకలు కొట్లాడుకుంటే ఊరు మంచిగ వుండది. గందుకనే ఒక తీర్మానం చేసినం. అందరూ దీనికి కట్టుబడి వుండాలే…. ఎవ్వల బతుకు వాళ్ళు బతకాలే…. మనం మనం కొట్లాడుకుని ఇంకోని సందివ్వద్దు. పొలాలు కోసే తందుకు ఊల్లేకు కోత మిషన్లు రావద్దు”

కూలీలు ఈలలు చప్పట్లు కొట్టారు.

”గట్లనే ఈ ఊల్లే ఎవ్వలు సుత వందరోజుల పనికి పోవద్దు. ఎవ్వల పనులు వాళ్ళు చేసుకోండి. ఇది అందరికి సమ్మతమేనా?” అని అడిగిండు లింగమూర్తి.

”దోడ్త్‌ నీయక్క ఏం తప్సె చెప్పిండ్రా! వందరోజుల పనికి పోతం. లేన్నాడు కూలీ చేసుకుంటం ఇండ్ల తప్పేమున్నది” అని కూలీలు లేసి వెళ్ళిపోతున్నారు.

”గీళ్లను నమ్ముకుంటే మన పనులేడయితయి. నడువుండ్రెహే…” అంటూ వ్యవసాయ దారులు కూడా లేచి వెళ్ళిపోయారు.

పంటకొచ్చిన భూములు వీళ్ళ కోసం ఎదురు చూస్తున్నాయి.

అభిప్రాయాలు లేవు »కథలు

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో