Apr2009
ఓడి బియ్యం
దేవిక బస్సు ఎక్కింది.
వెంట రవిఉన్నడు. బస్సుఎక్కి కూసున్నడు.
ఇద్దరికీ ఆగమాగముంది. సీట్లో కూసుండి చేతి సంచిని చూసుకుంది దేవిక. పాత జాకెట్ ముక్క రెండు ఎండిన కుడుకలు, కజ్జరపండ్లు, పోకవక్కలు. వాటిని ముట్టుకోవాలంటే మనుసొప్పలేదు.
రవి పక్కనే కూసున్నడు. ఒకలు ఒకలతో మాట్లాడుకుంటలేరు. ఎంతో ఆశతో వచ్చిండ్రు. అంతకంటే నిరాశతో వెళ్తున్నరు.
దేవిక సీట్లో ఒరిగి కండ్లుమూసుకుంది. ఇంటికి వెళ్లాలంటే భయంగా ఉంది. అయినా తప్పదు. కండ్లు మూసుకుంటే కండ్లముందు షాందిరి మెదిలింది.
అది ఇప్పటిదికాదు. ఐదేండ్ల కింద అత్తగారింట్ల అడుగుపెట్టినప్పడు అత్త చేతికిచ్చిన షాందిరి. రెండు నిలువు ఎలిత బద్దలు వాటికి ఆరు అడ్డం ఎలిత బద్దలు వాటికి పుల్లన్న గొయ్యలు, రబ్బరు బొమ్మలు, రంగుకండ్లద్దాలు… బుగ్గలు …పిల్లల ఆటవస్తువులు. అంగళ్ళు జాతరలు, తిరిగి వస్తువులు అమ్మి పొట్టపోసుకోవడం.
కండ్లు తెరిచి పక్కకు చూసింది దేవిక. ఆమె కంటే ఎక్కువ రందితో ఉన్నడు రవి. కండక్టర్ ఇంకారాలేదు. ఎక్కేటోళ్లు ఎక్కుతండ్రు. దిగోటోళ్ళు దిగుతండ్రు.
‘రేపులేదు ఎల్లుండి కొత్తపెల్లి రథం. సామాన్లు లేకపాయె. ఏంజేద్దాం’ అడిగింది దేవిక.
రవి గాజులాటగురించే ఆలోచిస్తున్నడు. ఆట ఎంతపని చేసే అనుకున్నడు. దేవిక మాటలకు ఉలిక్కిపడి చూసిండు.
మల్లా అవే మాటలన్నది దేవి. ‘అవును కొత్తపెల్లి రథం ఏం లేదన్నా మూడు రోజులు అమ్మకం. ఎప్పుడూ లాభం వెయ్యికంటే తక్కువ రాలేదు. ఇప్పుడెట్ల…’ అనుకున్నడు.
‘చెల్లే…చెల్లే.. అంటివి. మా చెల్లె ఏదో దారి చూపిస్తదంటివి ఏది దారి …ఇప్పుడు మనదారి ఏట్లేకే…” అన్నది దేవిక దెప్పిపొడిచినట్టు.
రవి కండ్లళ్ల నీళ్లు తిరిగినయి.
ఆ సంఘటనలన్నీ ఒక్కొక్కటి గుర్తుకచ్చినయి.
* * *
‘ఓడి బియ్యం…ఓడి బియ్యం పొయ్యాలె’ గుర్తుచేసిండు రవి.
‘వాళ్ళు ఉన్న మారాజులు…ఏం బోత్తం…ఏంబెడుతం.’ అన్నది దేవిక
‘ఏం బెట్టుడు. … ఏం లేదు ఐదు పిడికిళ్ళ బియ్యం… పసుపు కుంకుమ.ఎంత ఉన్న మారాజలైతే ఏంది?… బియ్యం ఎత్తగొడుతరా…. మా అవ్వ మరి మరీ గుర్తుచేసింది.అదే ఉంటే నన్ను బతుకనిచ్చునా…ఎంటవడి పోపిత్తుండే’ అన్నడు.
‘వాళ్ళు వత్తరా మరి….?’ అనుమానంగా అడిగింది దేవిక.
‘వాళ్లేం వత్తరు…. మనమే పోదాం. బియ్యం కనుములు తీసుకపోదాం. రెండురోజులు ఉండివద్దాం’ చెప్పిండు రవి.
షాందిరి నిట్టాడుకు బొమ్మలను సదురుకుంటున్న దేవిక భర్త మాటలు విని కోపంగ చూసింది. ‘ఉంటవుంటవు… ఎవ్వడేం అనకపోతే రెండురోజులుగాదు…వారం రోజులుంటవు. నీ అసొంటోడే ఆషాఢ మాసంల ఆటీటు తిరిగి కార్తీకమాసంల కండ్లకు నీళ్ళు తీసుకున్నడట. రేపు అంగడుంది… మూడు రోజులాగితే కొత్తపల్లి రథం. అక్కడుంటే నీ పొక్కలకెవడు పెడతడు’ అన్నది యాష్టగా.
రవి అంగట్ల గాజులాట పెట్టుడుకు సామాన్లు సదరుకుంటున్నడు. దేవిక మాటలకు నోరెత్తలేదు. దేవికనే మళ్లీ ‘నిన్నురమ్మని పోన్ల మీద పోన్లు చెయ్యవట్టిరి…. నువ్వే పోకపోతివి. నిన్ను రమ్నన్నాడు లేడు. బియ్యం తెమ్మన్నోడు లేడు… నీకునువ్వే మురువవడితివి. …’ అన్నది ఎక్కిరిస్తూ.
రవి నవ్వుకున్నాడు.నవ్వుకుంటూ ‘నన్ను ఒకలు రమ్మనాలెనా….అది నా బాధ్యత…బియ్యం తప్పియ్యద్దు. ఐదేండ్లు దాటనియ్యద్దు. నేనుపోతే వద్దంటర ఏంది? అయినా నీకో సంగతి తెలుసునా…. ఈసారి వట్టిగ పోదామంటలేను’ అన్నడు.
‘వట్టిగేందో పచ్చిగేందో’ కోపంతో అన్నది దేవిక.
దగ్గరగా వచ్చి గుసగుస చెప్పుతున్నట్టు ‘మొన్న మన సర్పంచ్‌తోని నా పేరు యాది చేసిండట మా బావ’ అన్నడు.
‘ఎందుకో’ ఎక్కిరిస్తున్నట్టుగా అన్నది దేవిక.
‘సర్పంచ్ అడిగిండట దగ్గెరికి దీత్తేంది అని. మా బావ అన్నడట వాడు దగ్గెరికి వత్తెగదా… ఎత్తుకుంటే సంకకు రాడు…. దించితె దిగడు ‘ అని అన్నాడు.
దేవికకు కోపం మరింత ఎక్కువయ్యింది. ‘అయిన ఎత్తుకున్నదేందో మనం సంకకురానిదేందో…పెట్టిపొయ్యనోడు పెయ్యంత ముట్టిచూసెనన్నట్టు జేత్తండు’ అన్నది.
దేవికకు కోపం పెరుగూతుంటే రవికి నవ్వువస్తుంది. నవ్వుకుంటనే ‘కాదే… ఒకసారే నువ్వే ఆలోచించు….ఎన్నడన్న మనం బావనో చెల్లెనో ఏదన్న అడిగినమా….మనంతల మనమే ఉంటిమి వాళ్ళింతల వాళ్ళే ఉండిరి. బావా…. నాకు గీపని చూపియ్యి….గీపనిజెయ్యిఅని మనం అడిగినమా…. మా చెల్లెనే అడిగినమా….’ అన్నడు.
దేవిక కొంత సేపు మౌనంగా వుండి ‘ఏం మాట్లాడుతం…ఏం అడుగుతం సుక్క తెగిపడ్డట్టు ఎప్పుడన్న ఒక్కసారి వచ్చె…. మనను కనీసం రమ్మని నోటిమాటకన్న చెప్పరు. సూసుకుంట గుడ్డాట అన్నట్లు మన బతుకు దెలువదా….మన బాధ తెలువదా….’ అన్నది.
రవి దేవికను సముదాయిస్తున్నట్లు ‘సరె సరే… మనం ఇట్లనుకుంటున్నం. వాళ్ళు ఏమనుకుటున్నరు…అడుగంది మేమేం జేస్తం అని వాళ్ళనుకుంటుండ్రు. ఏది…. ఈ సారి అడిగేసూద్దాం…ఏదన్నా పని చూపించుమందాం… లేకపోతే ఏదన్నా దుకానం పెట్టియ్యమందాం… కాదనరనే నమ్మకం నాకుంది… ఎన్ని రోజులు ఈ ఎత్తుపోగుల బతుకు చెప్పు. సావకుంటబతుకుంట… అయ్య చిన్నప్పడే పాయె. అవ్వపాయె…మన జేసే కట్టం మన ఇద్దరికే సాలుతలేదాయే. .. రేపు పిల్లలైతే మనబతుకు ఎట్ల చెప్పు. వాళ్లను ఎట్ల సాదుతం…మనం ఎట్ల బతుకుతం..’ అన్నడు రవి.
దేవిక మరింత ఆలోచనల్లో పడింది. ఆమెకు లోలోపల ఏదో ఆశపుట్టింది. రవి చెప్పుతున్నది నిజమే అనిపించింది. ‘ ఎన్నడన్న ఏదన్న అడిగినమా…’ అనుకుంది.
అట్ల అడుగక పోవడానికి కారణం కూడా ఆమెకు తెలిసివచ్చింది. ఈ మధ్య బతుకుదెరువుకు ఇబ్బంది అయితుందిగాని అంతకుముందు ఆడుకుంటూ పాడుకుంటూ గడిచిపోయింది. లాభం ఎక్కువగానే ఉంటుండె. షాందిరి నిట్టాడు పట్టుకుని తిరుగుతుంటే జాతరలో అటువంటి నిట్టాడులు ఒకటో రెండో ఉంటుండె. చెప్పిందే ధర. పిల్లల ఏడుపు పడలేక కొని తీరాల్సిందే! లాయిలప్ప లబ్బరి బొమ్మ… రంగు రంగుల బంగారు బొమ్మ అని అరుస్తూ తిరుగుతుంటే ఒకరౌండులనే షాందిరి మొత్తం అమ్ముడువోతుండె. ఈ మధ్య అమ్మకం పూర్తిగా తగ్గింది. జాతరల ఎటుచూసినా…,షాందిరీలే.
రవి గాజులాటకైతే పూర్తిగా గిరాకిలేదు’ గాజులాట రాజులాట గాజులాట రాజులాట ఏసుకో తీసుకో…’ అని పేటనడుమల వందనోటును అతికించి చుట్టూ గుబ్బులు బొట్టు బిళ్లపాకెట్లు కాటిక డబ్బీలు, ఐదు రూపాయల బిళ్ళలు అతికించి ఐదురూపాయలకు రెండుగాజులు పదిరూపాయలకు ఐదుగాజులు అమ్మేటోడు.
ఎప్పుడో సుక్క తెగిపడ్డట్టు ఐదు రూపాయలుపడేది. అప్పుడో ఇప్పుడో సబ్బు బిళ్లలు, కాటిక డబ్బీలు పడేవి. వందరూపాయలైతే ఎవరికే పడేది కాదు. వాటిని అట్ల అమర్చేవాడు రవి. జనం గుంపులు గుంపులుగా వచ్చేవారు ఇప్పుడు ఒర్రి ఒర్రి నోరు పోతుంది గని ఆట ముందటి జోరులేదు.
‘సరే…మరి ఎప్పుడు పోదాం….’ దేవిక అడిగింది.
‘ఎప్పుడేంది…రేపే మంచిరోజు బాపనైనను అడిగిన రేపే పోదాం’ రవి అన్నడు.
‘పోతే పోదాంగని ఒక పనిజేద్దాం… మీ చెల్లెకు పోన్ చేద్దాం… వత్తన్ననని చెప్పుదాం…’ అన్నది
రవి సరేనని చెల్లెకు పోన్ కొట్టిండు. చెల్లెఫోన్ ఎత్తి ‘అన్నా’ అన్నది. లౌడ్‌స్పీకర్ వెట్టి సంగతంతా చెప్పిండు రవి.
పద్మ సంబురపడిపోయింది ‘ అవ్వతోనే అన్ని పోయినయనుకున్న. నాకుయాదే లేదు. తప్పక తీసుకరాండ్రి…మట్టెలు గూడా చేయించురాండ్రి… బావగూడా మొన్న యాదిజేసిండు.’ అన్నది.
చెల్లెలు ఉత్సాహం చూస్తుంటే రవికి పట్టరాని సంతోషం వచ్చింది. దేవికకు కూడా ఒక మార్గం దొరికినట్టయ్యింది.
‘రెండు మూడు రోజులు ఉండేతట్టు రాండ్రి… ఇక్కడికి వచ్చి ఆగం జెయ్యద్దు మరి’ అని ఫోన్ పెట్టింది పద్మ.
అసలు సమస్య అక్కడ మొదలయ్యింది. మట్టెలంటే తోడు బట్టలు కావాలె..ఎట్ల..?అని
అప్పు తెద్దామని చెప్పిండు రవి. ఎక్కడా పుట్టదని హెచ్చరించింది దేవిక.
‘ఏంలేదన్నా….కనీసం రెండువేయిల రూపాయలు…ఎక్కడినుండి తెద్దాం… తీసుకపోనేవద్దు తీసుకపోతే ఏలువెట్టి చూపియ్యకుంట ఉండాలె’ అన్నది.
ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చిండ్రు. ‘ఎలాగూ మనం ఈ పని మానేద్దామనుకుంటున్నం. వీటితో పనేంది…? అనుకున్నరు.
అటు నిట్టాడును ఇటు గాజుల పేటను అమ్మకానికి పెట్టిండ్రు. జాతర్ల దినం కాబట్టి వెంటనే బేరంకుదిరింది. ధర గురించి ఆలోచించలేదు ఇద్దరు. తక్కువ ధరకే పక్కవాళ్ళు కొన్నారు.
దేవిక ఓడి బియ్యం సదిరింది. రవి బట్టలు మట్టెలకు వెండి కొన్నరు కొండంత ఆశతో తెల్లారే ఇద్దరు బస్సు ఎక్కిండ్రు.
సిరిసిల్లల దిగి ఇంటికి నడుత్తుంటే ఎందుకో అనుమానం వచ్చింది దేవికకు. ఆడుగుదునా వద్దా అని అడుగనే అడిగింది. ‘మనను కొనగంట సైసనోళ్ళు…పండుగలకు పబ్బాలకు పిలువనోళ్లు… ఆధారం చూపిస్తరంటవా…?’ అన్నది.
రవికి కోపం వచ్చింది. “నీకు అన్ని అనుమానాలే… నడువు నడువు….’ అన్నడు. ఇంటికి చేరుకుని గేటు తీస్తుంటే ఎదురుగా వచ్చిండు బావ.
‘నమస్తె బావా… బాగున్నావా….’ అని పక్కకు జరిగిండు.
రాజారాం మొఖం గూడా తిప్పి చూడలేదు. తలఊపుకుంటూ వెళ్ళిపోయిండు. రవి మనసు కలికలి అయింది. దేవిక మొఖం చిన్నగ చేసుకుంది. ‘పెండ్లయినప్పుడు ఎట్లుండె…బక్కగ…నూకితె నూరుజాగల పడేతట్టు…. నడుమంత్రపు సిరి చూసినావు…. భూముల ధరకు రెక్కలచ్చి మనిషి కండ్లు నెత్తి మీదికి వచ్చే…కనీసం ఎప్పడచ్చిండ్రని అంటలేడు సూడు….’ అనుకుంది.
ఇంట్లకు పోంగనే పద్మ ఎదురుంగ వచ్చింది. పెయ్యినిండ నగలతో అమ్మవారులెక్క ఉంది. ‘ఆటోల రావద్దా…నెత్తిమీద ముల్లెవెట్టుకుని నడుసుకుంట వచ్చిండ్రా… ఆయన మిమ్ములను గాదు…నన్ను తిడుతుడు’ అన్నది కోపంగా.
రవి నవ్విండు. దేవిక మనుసుల ముల్లుగుచ్చినట్టయింది. చేతుల సంచిని పక్కకు బెట్టి నిలబడ్డది. పద్మ పనిమనిషిని పిలిచి ముల్లెను రవి చేతుల సంచిని ఒకమూలకు పెట్టించింది.
రాజారాం బయట నుంచే పద్మను పిలిచాడు. పద్మ వత్తన్నా అని చెప్పులేసుకుంది. బయటకు నడుత్తుంటే ‘చెల్లె…పన్నెండు లోపలనే బియ్యం పోసుకోవాలని చెప్పిండు పంతులు… అందుతమో లేమోనని మబ్బుల బస్సుకే వచ్చినం’ అన్నడు.
‘ఆ…వత్తం వత్తం అద్ద గంటల వత్తం’ అంటూ బయకు నడిచింది. పని మనిషి అదోటి ఇదోటి సదిరి వెళ్లిపోయింది. ఇంట్ల ఇద్దరే మిగిలిండ్రు. పిల్లివట్టినకోడిలెక్క ముడుచుకుని కూసున్నరు.
అద్దగంట అన్నది గంటయ్యింది. రెండు గంటలయింది. పన్నెండు దాటింది. పద్మ జాడలేదు పత్తలేదు.
ఇద్దరు ఒకల మొఖాలు ఒకలు చూసుకున్నరు. బిందెల మంచినీళ్ళుంటే ముంచుక తాగిండ్రు. ఆకలైతుంది. దేవిక ఆ గిన్నె ఈ గిన్నె తీసి చూసింది. అన్నీ కడిగి బోర్లేసినయే. ఇద్దరికీ ఏడుపచ్చింది. రవి పైకి మాత్రం ఏదో ధైర్నం చెప్పుతుండు. లోపల భయం భయంగానే ఉంది.
రెండు దాటుతుండంగ ఇంటిముందు కారుచప్పుడు వినిపించింది. పద్మ ఒక్కతే వచ్చింది. ఇంట్లకు రాంగనే ఇద్దరిని చూసి ‘తిన్నరా’ అని అడిగింది. అడిగి ‘ఏందే పరాయిలలెక్క జేత్తరు…. వండుకోని తింటే తప్పా…’ అని అరగంటల వంటచేసింది.
‘చెల్లే… మూర్తం దాటిపాయె…ఎట్లా? ఇప్పుడన్నా పోద్దామంటే బావరాకపాయె’ అన్నడు రవి.
‘అన్ని ఒక్కటేనాడాయె…వాళ్ళ దోస్తు ఇంట్ల పంక్షన్ వాళ్ళు మనకు చిన్నదానికి పెద్దదానికి నిలవడతరు. మనం నిలవడకపోతె ఎట్లా…అప్పటివరకు వత్తడు తియ్యి’ అని ఇద్దరికే అన్నం బెట్టింది.
తిన్నట్లు చేసి టీవి పెట్టుకుని కూసున్నరు. నాలుగుగొట్టంగ వచ్చిండు రాజారాం. ఇంట్ల పదినిమిషాలు నిలువలేదు. భార్యా భర్తలిద్దరు ఏదో మాట్లాడుకున్నరు. అన్నీలక్షల ముచ్చట్లే. బియ్యం ఊసే రాలేదు. రాజారాం కండ్లతోనే సైగ జెత్తండు. పద్మ భయం భయంగా చుట్టు తిరుగుతుంది.
రాజారాం బయటకు నడుత్తుంటే రవి వెంటవచ్చి ‘బావా’ అంటూ బియ్యాన్ని గుర్తు చేసిండు.
రాజారాం కిందికి మీదికి చూసి ‘మీ చెల్లెకు పోసిపో’ అని పోయిండు.
రవికి కండ్లళ్ల నీళ్లు దిరిగినయి. లోపలికి వచ్చి పద్మతో చెప్పిండు పద్మ నవ్వుతూ ‘ఆయన ఆగం కాదు లెక్కగాదు.. నువ్వు అడుగుడుగనీ… ఇంత ఆగంల ఎట్ల పోసుకుంటడే’…అన్నది చివరగా తనే… అని అట్లనే తీసుకపోండ్రి….మల్ల ఎప్పుడన్న పోత్తురు’ అన్నది.
భార్యభర్తలిద్దరు సల్లబడ్డరు. ఒకల మొఖాలు ఒకలు సూసుకున్నరు. ముందుగా తేరుకున్న దేవిక ‘కొంటవోవుడెందుకు…వరుస పడగొట్టద్దని తెత్తిమి…ఇక్కడనే ఉండని…మీకు తీర్పాటమున్నప్పుడు ఫోన్ జెయ్యిండ్రి…వచ్చిపోసిపోతం’ అని బయలుదేరింది.
పద్మ ఉండుమనలేదు. పొమ్మనలేదు. బయటకు నడుత్తుంటే మాత్రం ‘ఆగుండ్రి’ అని ఇంట్లకుపోయింది. అప్పుడే రాజారాం వచ్చిండు. పోతున్నరా అనలేదు.. ఉంటున్నరా అనలేదు. భార్యనే అనుమానంగా చూస్తుండు. ఇంట్లోంచి పాత జాకెట్టు బట్ట తెచ్చి దేవిక చేతులపెట్టింది పద్మ. బట్టను సంచిలో పెట్టుకుని బయటకు వచ్చింది దేవిక. కనీసం కడుపదాటి గూడా ఎవలు రాలేదు.
* * *
బస్సు వేగాన్ని అందుకుని ఊరు దాటింది.
సంచిలోని జాకెట్ ముక్కను చూస్తుంటే దేవికకు కోపం వచ్చింది. ‘కనీసం ఓ కొత్తముక్కనన్నా పెట్టలేదు…. ఆమె ముల్లేంపోయిందో’ అనుకుంటూ దాన్ని బయటకు తీసింది.
ఎలిసిపోయి పసుపు మరకలంటి పాతవడిన జాకెట్ ముక్క.
‘చీ…గీ వక్కకోసమా…ఇంతదూరమచ్చింది…చేతుల పని అమ్ముకుంటిమి…మంచిగ మాట్లాడుతరేమో పని చూపియ్యిమందామనుకుంటిమి…వాళ్ళు మాట గూడా మాట్లాడకపోయిరి. గీ ఎలిసిపోయిన వక్క నాకెందుకు’ అనుకుంట కిటికీలనుంచి బయటకు ఇసిరింది.
గాలికి బట్ట ఇచ్చుకపోయి బట్టమడతల్లో ఉన్న ఐదువందలనోట్లు ఎండకు మెరుస్తూ ఎగురుతున్నాయి.
* * *
April 20th, 2009 at 9:32 pm
దయనీయమైన జీవితాలు.దరిద్రునికి-ధనికునికి అంతరాలను కులాలు ,రక్తసంభందాలు కూడా తొలగిస్తలేవు.ఆవిసిరేసిన జాకెట్ ముక్కలో వదిన కావాలని పెట్టివున్నవో , కావో తెలిస్తే మరికొంత రాయొచ్చు.
May 9th, 2009 at 4:04 pm
పెద్దింటి అశోక్ కుమార్ గారి కథలు ఎక్కడ కనిపించిన చదవటం విడిచిపెట్టను.
పేదవారి దయానీయ స్తితులు కాలంతో కూడ పరిష్కారం కావని అన్పిస్తోంది.
November 22nd, 2010 at 3:55 am
మనోహర్ గారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.