జీవితంలో వ్యంగ్యమే రచనల్లో చూపాను

కె.ఎన్‌.వై.పతంజలి ఇంటర్వ్యూ, గమనం సౌజన్యంతో పగడాల నాగేందర్‌

కథలు, నవలలు మీరు ఎందుకు రాస్తారు?

పతంజలి
పతంజలి

సహజంగా రాస్తాను. రాయకుండా ఉండలేను కాబట్టి రాస్తాను. నాకు రాయబుద్ది అవుతేనే రాస్తాను. నా 11వ ఏట నుంచే రాయడం అలవాటైంది. ఎదుటి వాళ్ళకు ఏవైనా బోధించాలనుకునే దురహంకారం నాకెప్పుడూ లేదు. నా రచనల్లో తిట్లు ఉండొచ్చు గాని, కేవలం తిట్టడానికే నేనెప్పుడూ రచనలు చేయలేదు. కథల వెనుక, నవలల వెనుక, పాత్రల వెనుక దాక్కోవడానికి నేను వ్యంగ్యాన్ని ఆశ్రయించలేదు. స్పష్టంగా జీవితంలో ఉన్నదే, రచనల్లో చూపాను.

వ్యంగ్య సాహిత్యంలో మీది పధ్రాన స్థానమా?

సాహిత్యంలో ”వ్యంగ్య సాహిత్యం” అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. వ్యంగ్య సాహిత్యం, విషాద సాహిత్యం అంటూ ఇలా వర్గీకరించాల్సిన అవసరం లేదు. గురజాడ, రావిశాస్త్రిలు – నా మీద బాగా ప్రభావం చూపిన రచయితలు. నా కన్నా ముందు తెలుగులో ఎందరో మహా రచయితలున్నారు. వారందరిని నుంచి నేను నేర్చుకున్నాను.

కన్యాశుల్కం” అందరికీ అర్థమయ్యింది కదా! మీ రచనలు, వానిలోని మాండలికం, ఉన్నతమైన వ్యంగ్యంతో కూడిన సంక్లిష్టస్థాయి- అందరికీ అర్థం కావన్న అభిప్రాయం ఒకటి ఉంది కదా? మీ సమాధానం?

”కన్యాశుల్కం”  అందరికీ అర్థం కావడం గురజాడ గొప్పతనం. నా కథలు, నవలలు అందరికీ అర్థం కావడం లేదంటే అది నా వైఫల్యం. గురజాడ నిజంగా చాలా గొప్ప భాష తెలిసిన రచయిత. నేను కాదు. నిజంగా ఇప్పటికీ గురజాడను చదువుతుంటే, ఇంత భాష జీవితం తెలిసిన తెలుగు రచయిత మరొకరు లేరన్పిస్తుంది.

తెలుగు సాహిత్యంలో మీ స్థానం గురించి ఏమనుకుంటున్నారు?

తెలుగు నేల మీద సాహిత్యం కానిదే ఎక్కువగా సాహిత్యంగా ప్రచారంలోనికి రావడానికి ఎవరినీ తప్పుపట్టాల్సిన పనిలేదు. రాకపోనీయండి పెద్దగా వచ్చినా నష్టమేమి లేదు. అయినా పేరు రావాలని నేను రచనలు చేయలేదు. చెడును, దుర్మార్గాన్ని వెక్కిరిస్తే నాకు సంతోషం. అన్యాయాన్ని బజారుకీడిస్తే ఆనందం. అందుకే నా తృప్తి కోసమే, నన్ను నేను సంతోషపరచుకోవడానికే ఆ రచనలు చేశాను. నావ్యంగ్యంలో బాధ, క్రోధం ఉన్నాయి. అందులో స్వచ్చమైన ప్రతిస్పందన కనిపిస్తుంది. నాకు రాయాలనిపించింది. తెలిసింది నేను రాశాను. పేరు కోసం రాయలేదు. అయినా కొవ్వలికీ, జంపనకు అప్పుడు, ఆ తర్వాత యండమూరి వీరేంద్రనాథ్‌ కొచ్చిన పేరు గురజాడ అప్పారావుకు రాలేదంటే ఏం చెప్పగలం? పేరు వేరు, యశస్సువేరు వేరు. పుస్తకాలు అచ్చేసుకోవడం, వాటిని పట్టుకొని అందరి చుట్టూ తిరగడం – ఇలాంటివి నా వల్ల కాని పనులు, బహుశా నాకందుకే ఎక్కు పేరు (మీరుంటున్న పేరు) రాలేదేమో!

తెలుగు సాహిత్యంలో ”విమర్శ” రంగం ఎలా వుంది?

కట్టమంచి, రాళ్ళపల్లి తెలుగులో మంచి విమర్శకులు. విమర్శ అనేది ఒక సృజనాత్మకమైన కళ అందరికీ అబ్బదు కదా! విమర్శకులు బాగా చదువుకోవాలి. గొప్ప అభివ్యక్తి కావాలి. చక్కని వచనం, సాహిత్యం, భౌతిక విజ్ఞానం, చరిత్ర రాజకీయ స్థితిగతులు, తాత్వికశాస్త్రం ఇవన్నీ విధిగా తెలియాలి. పరభాషా సాహిత్యం బాగా తెలియాలి ఇవన్నీ చదువుకున్న వారే సాహిత్య విమర్శకులు కావాలి. అలాంటి మహానుభావులు ఇప్పుడు వున్నట్టు నాకు తెలీదు.

చూసే దృష్టికోణం నుంచి విమర్శ ఉంటుందని చెప్పలేం. మార్కిస్టు విమర్శకులు ఉంటే, శూద్ర విమర్శకులు, దళిత విమర్శకులు, స్త్రీవాద విమర్శకులు కూడా ఉండాలి కాదా! ఈ స్థిటిక్స్‌ నుండి విమర్శ అభివృద్ధి చెందితే బావుంటుంది.

రా.రా. గాని, మరెవరైనా గాని మార్కిస్టు విమర్శను అభివృద్ధి చేసారని మీరు భావిస్తున్నారా?

రా.రా. గొప్ప విమర్శకుడు. విమర్శకూడా కళే! ఖచ్చితంగా విమర్శలో మంచి వచనం రాయగలగాలి. ఇప్పుడు విమర్శకుల్లో వల్లంపాటి వెంకటసుబ్బయ్య ఒక్కరే కనిపిస్తున్నారు. రా.రా. అభివృద్ధి చేశాడా? లేదా? అంటే నేనేమీ చెప్పలేను. త్రిపురనేని మధుసూదనరావుకి సాహిత్యం కన్నా సిద్ధాంతం ముఖ్యం. కె.వి. రమణారెడ్డి గారికి విమర్శనాశక్తి బాగా ఉన్నా, వ్యక్తీకరణ శక్తి లేదు.

మార్కిస్టు, విమర్శ-నిబద్ధత పరిధిలో రచయితలకు, రచనలకు నష్టం చేసిందా?

ఖచ్చితంగా, నిబద్ధతత పరిధిలో మంచి రచనలు ఎప్పుడూ రావు. జీవితం విస్తృతమైంది. సృజనాత్మక భావాలకు అదృశ్యమైన శృంఖలాలు ఉండకూడదు. రావిశాస్త్రి గురజాడ, శ్రీశ్రీలాంటి మహా రచయితలను ఒకే పరిధిలోంచి చూడలేం! నిబ్ధతత పరిధిలో చాలా మంది రచయితుల నష్టపోయారు. ప్రజలకు బాగా దగ్గరయిన రచయితలను కూడా ఒక సిద్ధాంత, నిబద్ధత పరిధిలో, చట్రంలో బిగించి చూపడం వల్ల -వారు సమాజంలోని చాలా రకాల స్వభావాలు గల ప్రజలకు, ఇతరులకు దూరమయ్యే ప్రమాదం ఉంది.

మార్కిస్టు సిద్ధాంతం మీద వున్న విముఖతతో, శ్రీశ్రీ, రావిశాస్త్రి లాంటి రచయితలను ఎందుకు చదవాలి? వారు మాకేం ఒరగబెట్టారు? అనే సరిక్రొత్త ప్రశ్నలు దళిత బహుజన వాదాల్లోంచి విన్పిస్తున్నాయి కదా? వీని మీద మీ కామెంట్‌?

దళితులైనా, మరెవరైనా శ్రీశ్రీ, రావిశాస్త్రిలను చదవకపోతే, ఆ రచయితలకొచ్చే నష్టం ఏవీ వుండదు. ఎప్పుడైనా చదవని వారికే నష్టం! విమర్శించడానికైనా చదవాలి గదా! చదవకుంటే ఎలా విమర్శించగలరు? ఒక సిద్ధాంతానికి, ఒక నిబద్ధతకు కట్టుబడ్డ రచయితలుగా వారిని ప్రచారం చేయడం వలన వచ్చిన నష్టం ఇది. కాబట్టే సిద్ధాంతం మీదున్న సందేహాలను రచయితల మీద కూడ వ్యక్తం చేస్తున్నారు. -కొత్త వాదాల కవులు, రచయితలు, విస్తృతంగా చదవడం, మంచిది స్వీకరించడమే ఇప్పుడు మనం చేయాల్సింది.

ప్రస్తుత తెలుగు నవల పరిస్థితి ఏమిటి?

ఈ ప్రశ్న విమర్శకులను అడగాలి. నన్ను కాదు.

మీ మీద రావిశాస్త్రి ప్రభావం బాగా ఉందంటారు?

నేను రావిశాస్త్రి దగ్గర నేర్చుకున్నాను. ఆయనతో సాన్నిహిత్యం బాగా ఉండేది. నా దృష్టి కూడా అదే. ఒక్క రావిశాస్త్రే కాదు. నా మీద చాలా మంది ఇన్‌ఫ్లూయెన్స్‌ ఉంది. చెకోవ్‌, మొపాసా, గురజాడ, రావిశాస్త్రి, చాసో, ఆస్కార్‌వైల్డ్‌, మార్క్‌ట్వయిన్‌, వేమన, సెర్వాంటిజ్‌ కవుల ఇన్‌ ఫ్లుయెన్స్‌ బాగా ఉంది. ఎవరి ప్రభావం లేకుండా ఏ రచయితా ఉండడు. అది తప్పేం కాదు. ఎవరివల్లా ప్రభావితం కాని వాడు కళాకారుడే కాదు.

ఖాకీవనం, పెంపుడు జంతువులు” నవలలు రాసిన మీరు ఆ తరువాత రాజుల గురించి రాస్తున్నారు. కారణం ఏమిటి?

 అవి రెండూ నా మొదటి దశ. అవి జర్నలిస్టిక్‌ రచనలు. మరొకరి జీవితాల్లోకి తొంగి చూసి, తెలియని వాటి గురించి తెలుసుకుని రాసినవి. వాటికంత ప్రాధాన్యం లేదు. ఆ తర్వాతి రచనలు నాకు తెలిసిన విషయాల గురించి తెలిసి రాసివని, ఇవి ”స్వదేశి”. ఎవరైనా ఈ స్వదేశీ రచనలే చేయాలనుకుంటాను. దళిత సాహిత్యం, మైనారిటీ సాహిత్యం, సీమ సాహిత్యం, స్త్రీ వాద సాహిత్యం, తెలంగాణ సాహిత్యం అనేవి కూడా ఈ స్వదేశీ సాహిత్యం కోవలోకే వస్తాయని నేను అనుకుంటున్నాను.

 మీ రచనల్లో తీసుకున్న పాత్రలు, స్వభావాలు మీ ఏరియాకి సంబంధిచినవా? ఆ ప్రాంతాల ప్రజలు, రాజులు (రాజవంశీయులు) అలా ఉంటారా?

 ఆ పాత్రల పేర్లు మా ప్రాంతానివే! గుణాలు మాత్రం మన అందరివీనూ! భాష మార్చవచ్చు, వేషం మారవచ్చు. మనుషులందరిలో అవే గుణాలు, స్వభావాలుంటాయనుకుంటాను.

 ఆ విషయాలు అంత బాగా మీరెలా రాయగలిగారు?

 జీవించడమే! జీవిచడంలో చుట్టూ ఉన్న వాటిని పరిశీలించడం. కన్ను, ముక్కు చెవి ఉంటే చాలు. అంతా కనబడుతుంది. వినబడుతుంది. మనుషుల స్వభావాలను వాసన ద్వారా పసిగట్టగలం కూడా.

 కమ్యూనిజం ప్రభావం మీ మీద ఉందా? కమ్యూనిస్టు ఉద్యమాల వల్ల ఏవైనా మేలు జరిగిందా?

 ఉంది!   అయితే ఆ తరహా రచనలు నెనెప్పుడూ చేయలేదు. అంటే కమ్యూనిస్టు రచనలు.

రాజ్యం తాలూకు హింసను తప్పు పడుతూ రాశాను నేను కమ్యూనిస్టు ను మాత్రం కాదు.

కమ్యూనిస్టుల వల్ల చాలా మేలు జరిగింది. వాళ్ళ ఎడల ప్రగాఢమైన ప్రేమ గలవాణ్ణి. వాళ్ళకైమైనా నష్టం జరిగిదంటే, ప్రమాదం సంభవించిందంటే, నా మనసుకు చాలా కష్టంగా వుంటుంది చైనాలో మావో విప్లవం తీసుకురాక ముందు  కాలంలో ప్రజలు దుర్భర బాధలతో, ఆకలితో బ్రతుకులీడ్చారు. ఇప్పుడు అక్కడ ఆకలి లేదు. దారిద్య్రం లేదు. రోగాలు లేవు. అంత ఎక్కువ జనాభాగల దేశంలో అది ఎలా సాధ్యమైంది. కమ్యూనిస్టుల వల్ల ఇక్కడ కూడా ఎంతో కొంత మేలు జరిగింది. మాయింట్లో కమ్యూనిస్టు అనుకూల, వ్యతిరేక పుస్తకాలు చాలా ఉండేవి. అవన్నీ చదివాను. నేను యువకుడిగా ఉన్నప్పుడు శ్రీకాకుళ ఉద్యమ ప్రభావం మా యువమనసుల మీద బాగా పడింది.

 దళిత వాదం మీ అభిప్రాయం ఏమిటి? కులాల వారీగా కవిత్వం, రచనలు రావడం సరియైనదేనా?

 దళితవాదం ఆహ్వానించదగ్గ పరిణామం. ఖచ్చితంగా అన్ని కులాల మంచి సాహిత్యం రావాలి. వారి అనుభవాలు, జీవితాలు వారే బలంగా వ్యక్తీకరించగలరు. అలా వచ్చినప్పుడే సాహిత్యం పరిపుష్ఠం కాగలదు.

 స్త్రీవాదం’ మీద మీ అభిప్రాయం ఏమిటి?

 స్త్రీల బాధలు రచనలలో ప్రతిఫలించాలి. స్త్రీలే ఆ విషయాలు మాట్లాడాలి. స్త్రీలు మాత్రమే అవి రాయాలి.

 ఇప్పుడు ‘స్త్రీవాదం’  బలహీన పడుతున్న దశ కనిపిస్తుందా?

 అది ప్రబలంగా రావాలనే నేను కోరుకుంటున్నాను. సరిగ్గా రాకపోతే మనమేం చెప్పలేం. బలహీనపడడం అంటే మనమేలా చెప్పగలం. అది స్త్రీవాదులు చెప్పాలి.

 కొత్తగా వస్తున్న గ్లోబలైజేషన్‌ పరిణామాలను ఇప్పటి కవులు, రచయితలు అర్థం చేసుకుంటున్నారా? తెలుసుకోవాలంటారా? రాయాలంటారా?

 ఖచ్చితంగా కొత్తగా వస్తున్న ఏ మార్పులకైనా, పరిణామాలనైనా రచయిత తెలుసుకోవాలి. గ్లోబలైజేషన్‌ గూర్చి తెలిసుండాలి. చదివి తెలుసుకోవాలి. తెలియకపోవడం అజ్ఞానం. తెలుసుకొని రచనలు చేయాలి.

 మీ ”ఒక దెయ్యం ఆత్మకథ” ఎవరి మీద  రాసారు?

 అది నా మీదే రాసుకున్నాను. అది నా కథే. నా దుర్లక్షణాల మీదే రాసుకున్నాను. అవే లక్షణాలు మీలోగాని, మరెవరిలోనైనాగానీ ఉంటే నేనేం చేయలేను నాలో ఉండే లక్షణాలే మీలో కూడా ఉండొచ్చు కదా!

 భూమి బల్ల పరుపుగా వుందా? గుండ్రంగా వుందా” అనే వాదన దేనికి సింబల్‌?

దేనికీ సింబల్‌ కాదు. మా బంధువుల్లో ఒక వ్యక్తి ఒక సందర్భంలో భూమి బల్లపరుపుగా ఉందని గట్టిగా 3 గంటలు వాదించడం విని, వాడి పట్టుదలకు ఆశ్చర్యపోయాను. అదే విషయాన్ని ”గోపాత్రుడు” లో తీసుకున్నాను.

 కవిత్వం కేంద్ర స్థానం నుంచి తప్పుకుంది” అనే వాదనొకటి ”ఇప్పటి సాహిత్యంలో విన్పిస్తోంది కదా? మీ కామెంట్‌? మీరిప్పటి కవిత్వం చదువుతుంటారా? మీకు నచ్చిన కవి ఎవరు?

 కవిత్వం చాలా క్రితమే తప్పుకుంది. శ్రీశ్రీ తరువాత ఆ స్థానంలోకి ఎదిగిన కవి ఎవరూ రాలేదు. రాకపోవడమే మంచిది. ఇప్పుడందరూ రాస్తున్నారు. నాకు బాగా నచ్చిన కవి శ్రీశ్రీనే! ఇప్పుడొస్తున్న కవిత్వం కూడా చదువుతున్నాను. యువకవులు బాగా రాస్తున్నారు.

 రచయితలలో మీకు ఎవరి వచనం, శైలి బాగా నచ్చుతుంది?

 మొదటగా గురజాడ, రావిశాస్త్రి నాకు బాగా యిష్టం,ఇప్పుడు రాస్తున్న వాళ్ళలో నామిని సుబ్రహ్మణ్యం నాయుడు. కేశవరెడ్డి, నందిగం కృష్ణారావు మంచి రైటర్స్‌.

 ఈ మధ్య మీరైమైనా రాసారా? కొత్తగా రాయాలనుకుంటున్నారా?

 చాలా కాలం నుంచీ ఒక కొత్త నవల రాయాలనుకుంటున్నాను. ఎప్పుడు రాస్తానో చెప్పలేను.

 సాహిత్యానికి ప్రాంతీయత ఉంటుందా? శ్రీశ్రీ కవిత్వం తెలంగాణా ప్రాంతం వారికి అర్థం కాదని ఈ మధ్య ఒక కవి అన్నారు. మీ కామెంట్‌?

 సాహిత్యానికి ఖచ్చితంగా ప్రాంతీయత ఉంటుంది. శ్రీశ్రీ కవిత్వం అర్థం గాక పోవడం అంటూ ఏవీ ఉండదు. ఆ ఇంటర్వ్యూ నేను చూడలేదు. ఆ కవి ఏ ఉద్దేశ్యంతో అన్నాడో? మరి. దీని మీద నేనేమీ చెప్పలేను.

లాటిన్‌ అమెరికాలో లాగా, తెలంగాణా నుంచే మంచి సాహిత్యం వస్తుందని మీరన్నారు” ఎందుకు?

మార్క్వెజ్‌ One Hundred years of Solitude రాశాడు తెలంగాణాది One thousand years of solitude .వేల సంవత్సరాల బాధ, కాకతీయులు ముందు నుంచి ఎంత మంది పీక్కుతిన్నారు తెలంగాణాను. ఎన్ని గాయాలు? మాటల్లో చెప్పలేనంత బాధ చరిత్ర ఉన్నాయి తెలంగాణకు. మంచి సాహిత్యం ఇక్కడి నుంచే రావడానికి వీలుంది.  ఆ వీలుందనడానికి తెలంగాణాలోని జానపద గేయ సంపదే సాక్ష్యం. ఇక్కడున్నంత జానపద సాహిత్యం మరెక్కడా లేదు. ఇక్కడి ప్రజల జీవితాల్లో సజీవ సాహిత్యం ఉంది. చచ్చు పడిన ప్రాంతాల నుంచీ ఏవీ రావు. బ్లీడింగ్‌ ఏరియా తెలంగాణా నుంచే గొప్ప సాహిత్యం వస్తుంది. నెత్తురోడుతున్న ఆ గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. అందులోంచే ఏవైనా రావాలి.

ఇప్పటి వరకు వచ్చిన దాన్ని గురించి….

రాకపోతే ఇప్పుడొస్తుంది. కొత్తగా వస్తున్న ఈ తరం రచయితలే ఆ పని చేయాలి. తెలంగాణా 10 జిల్లాల ప్రజలు, తమ వేల సంవత్సరాల గాయాల నుంచి ఎంతో బాధపడ్డారో- ఒక్క నవలైనా రాయొచ్చు కదా! చరిత్రను తెలుసుకోవాలి. రికార్ట్‌ చేయాలి. ఇలా చేయాలని అనుకోకపోవడం, అనిపించకపోవడం సరికాదు.

అలా అనిపించక పోవడానికి తెలంగాణాలోని ఉద్యమాలు నిమగ్నతకు కాకుండా, నిబద్దతకు పెద్ద పీటవేయడమే కారణమా?

అవును. ఖచ్చితంగా నిబద్ధత అనేది నష్టం చేసింది. దాని నుంచే యంగ్‌ జనరేషన్‌ బయటపడి- ఈ దళిత సాహిత్యం, ఇంకా కొత్త వాదాలు, ఇవీ… వస్తున్నాయి. అని నేనను కుంటున్నాను. రావాలి. జీవితం అన్ని కోణాల్లోంచి సాహిత్యీకరించబడాలి.

అభిప్రాయాలు లేవు »ఇంటర్‌వ్యూలు

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో