Apr2009
తీర్థం
కచ్చురానికి పయ్యలు తయారైతే
తీర్థం పోయినట్టే
బత్తీసపేర్లు కొని
కొరుక్కుంట తింటుంటే
నోరంతా తీయతీయగైనట్టే
ఊరికి ఆమెడదూరం
గుట్టమీద తీర్థం
యాడాది కొక్కసారి సాగేది
అన్ని ఊర్లు హాజరైనట్టు
మా ఊరు కూడా మనుషుల మందల్లో కలిసేది
పెళ్ళిపల్లకి తయారైనట్టు
సవారి కచ్చురం
ముసలోల్లు ముడిగోల్లు ఎక్కి
కుక్కి కుక్కి కూసుండేటోల్లు
పసి పోరగాళ్ళను వాళ్ళ తొడలమీద పండపెట్టుకునేటోల్లు
వయసోళ్ళు శాతనైనోళ్ళు
కచ్చురం వెనకాల కాలినడకనే
బర్రెనుక దుడ్డెలొచ్చినట్టు
గుట్టకింద వంట వండేందుకని
సామానంతా కచ్చురం లోపల్నే
పట్టితే అదే పదివేలు
కాయకష్టం చేసే టోళ్ళకు
నడకేంది నడక?
పది ఆమెడలైనా లెక్కేం? తరువాయేం?
ఎడ్ల మెడలకు మువ్వలుగట్టి
నాగళ్ళను లావట్టి
కానిని వలపటెద్దు మీద దాపటెద్దుల మీద పెట్టి
మే జోళ్ళు కడితే చాలు
‘అడే’ అనంగనే
నాలుగు నాలుగు ఎనిమిదికాళ్ళ
కచ్చురం కదిల్తే
గజ్జెల గుర్రాలు ఉరికినట్టుండేది
నడీడు పోరగాళ్ళం
కచ్చురం వెనకాల పోటిపడి ఉరికెటోళ్ళం
దమ్ము వచ్చేదాకా నడిచీ నడిచీ
ఓ చెట్టుకింద ‘చొంచొంచొ’ అంటే
ఎడ్లు నిలబడంగనే కచ్చురం ఆగేది
అద్ద గంటకో గంటకో
ఎన్క బడ్డోల్లు వచ్చి
కాల్లు గుంజుతున్నాయని
ఆ చెట్టు కింద కూలబడేటోల్ల
ఎడ్లను కచ్చురం నుండి ఇడిసి
ఎండుగడ్డి ఏస్తే ఆవురావురని తినేవి
సద్ది ముల్లెవిప్పి
తలాయింత మేం తొక్కన్నమే గని
పెళ్ళి భోజనం తిన్నంత
సంబర పడేటోళ్ళం
గొంగడి సాపలాగ పరిస్తే
పెద్దోళ్ళంతా నడుము వాల్చేటోల్లు
తలకాయలు మాత్రమే గొంగళ్ళో ఉండేవి
నడుము కాళ్ళు చేతులు భూమ్మీదనే
రెండు గడియలు కాంగనే
మళ్ళా తయారై
రాత్రిపూట ఎపుడోగాని
గుట్ట దగ్గరికి జేరి దానికిందనే
ఉన్నది దిని జల్ది పండుకనే టోళ్ళం
మబ్బుల లేస్తేగాని దేవుని దర్శనం కాదట!
ఆకాశం చూసుకుంట పంటే
చుక్కలన్ని మా కోసమే పొడిశినట్టుండేవి
పొద్దున్లేసి
గుటుక్కున గుండంల మునిగి
గుడిముందట తడిబట్టల్తోనే
కోసంత లైను కట్టె టోళ్ళం
మెల్ల మెల్లగా నడిచి
దేవుని దర్శనం చేసుకోవటం
తీర్థం తీసుకుని నెత్తి మీద చల్లుకోవటం
ఎంత ఆనందమో