Apr2009
ద పోస్ట్ మాన్ : (ఏడవ భాగం)
- మూలం: ఆంటొనియో స్కార్మెటా (తెలుగు: ఎన్ వేణుగోపాల్)
తర్వాత కొన్ని రోజులపాటు మారియో తన అలంకారాలలో, పదచిత్రాలలో మునిగిపోయి తిరుగుతూ ఉండిపోయాడు. బీట్రిజ్ తన గదిలోనే బందీ అయి ఉండిపోయింది. లేదా బయట ఏదయినా కొనడానికి వెళ్లినప్పుడో, కొండలమీద నడవడానికి వెళ్లినప్పుడో, ఆమె మణికట్టులో తల్లి పంజా గుచ్చుకుని ఉండేది. మారియో కూడ వాళ్ల వెనకాలే కాస్త దూరంలో వెంటాడుతుండేవాడు. దారిపొడుగునా వాళ్లకు కనబడకుండా ఉండేదుకు ఇసుక కుప్పలవెనుక దాక్కుంటూ నడుస్తుండేవాడు. తన ఉనికి బీట్రిజ్ మెడకు కట్టేసిన బరువైన బండరాయిలాగ ఉందని మారియోకు సంపూర్ణంగా తెలుసు. ఆ అమ్మాయి తల తిప్పి చూడడానికి ప్రయత్నించినప్పుడల్లా, ఆమె గూబ గుయ్యిమనేలా ఒక దెబ్బపడేది. అది ఆమె మంచికొరకే కావచ్చుగాని, చాల బాధ కలిగించేలా ఉండేది.
ప్రతిరోజూ మధ్యాహ్నం మారియో ఆ సారాకొట్టు ముందర నిలబడి ఓదార్పులేని విషాదగీతం వింటుండేవాడు. ఎక్కడ ఏ నీడ కదిలినా ఒక పొట్టిగౌను కనబడుతుందనే చావని ఆశ మోసులెత్తుతుండేది. ఇటీవల మారియోకు తరచుగా ఒక కల వస్తోంది. అటువంటి పొట్టి గౌనును తాను తన నాలుక చివరతో ఏదో ఉత్సవంలో లాగ లేపుతున్నాడట. మారియోకు తొడలమధ్య ఎప్పుడూ ఏదో చాల విధేయంగా, నిరంతరంగా లేచి నిలబడుతుండేది. దాన్ని చేతులతో ఒత్తి తగ్గించుకోగూడదని మారియో ఒక నిగూఢ కాంక్షతో దృఢంగా నిర్ణయించుకున్నాడు. దానికి బదులుగా, పొద్దంతానేమో, కవి లావుపాటి గ్రంథం వెనుక ఆ లేచినిలబడిన కోరికను దాచుకునేవాడు. రాత్రుళ్లేమో ఆ కోరిక నమిలివేస్తుంటే చెమటతో తడిసి ముద్దయిపోయేవాడు. అప్పుడు మారియో అనుభవించిన భావోద్వేగమంతా అర్థం చేసుకోదగిందే. అప్పుడు తాను వాడిన ప్రతి అలంకారమూ, తాను తీసిన ప్రతి నిట్టూర్పూ, ఆమె నాలుక తన తొడల మధ్య గిలిగింతలు పెడుతోందనో, తన చెవిని కొరుకుతోందనో చేసుకున్న ప్రతి ఊహా తనలో ఊటలూరుతున్న జీవరసాలను బలోపేతం చేస్తున్న లోకాంతర శక్తి అని మారియోకు అనిపించేది. ఏదో ఒక రోజున ఆమెను తన ఒడిలో పడవేసి భగవంతుడు తాను ఉన్నానని రుజువు చేసుకోకపోతాడా అనిపించేది మారియోకు. అందుకోసం భగవంతుడు తలచుకుంటే ఆమె తల్లికి గుండె ఆగిపోయేలా చేయవచ్చు. లేదా తాను ఒక అనివార్య క్షణంలో ఆమెను ఎత్తుకురావడానికి భగవంతుడు సహకరించవచ్చు. అలా ఆమె తన ఒడిలో వాలినప్పుడు ఈ తన కాంక్షనుంచి వెలువడుతున్న అపారమైన సాంద్రద్రవంలో ఆమెను తాను ఓలలాడిస్తాడు.
ఇలా గడుస్తుండగానే, ఆవారంలోనే ఒక ఆధివారం నాడు, రెండునెలలకింద వచ్చిన ఎర్రలారీ మళ్లీ వచ్చింది. అప్పుడు నెరూడాను ఇక్కడినుంచి ఊడ్చుకుపోయిన ఆ వాహనమే మళ్లీ ఆయనను ఇస్లా నెగ్రాలో దిగబెట్టడానికి వచ్చింది. ఈసారి ఆ వాహనం మీద కొత్త పోస్టర్లు ఉన్నాయి. వాటిమీద గాంభీర్యమూ దయా నిండిన ఒక తండ్రిలాంటి ముఖం కనబడుతోంది. ఆ ముఖంలో ఒక పావురం ముఖంలోని మృదుత్వం వెల్లివిరుస్తోంది. ప్రతి బొమ్మ కిందా ఆయన పేరు కాబోలు, సాల్వడార్ అయెండీ, అని రాసి ఉంది.
మత్స్యకారులందరూ ఆ ట్రక్ వెంట పరుగెత్తడం మొదలుపెట్టారు. మారియో కూడ వాళ్లను అనుసరించాడు. అలా పరుగెత్తడంలో మారియో ఎప్పుడూ వ్యాయామ శిక్షణ ముఖం చూడలేదని స్పష్టంగా కనబడుతూనే ఉంది. ఆ ట్రక్ నెరూడా ఇంటికి చేరగానే, ఆ ఇంటి గేట్ దగ్గర నెరూడా, చేతులు మడిచిపెట్టుకున్న నిలువెత్తు గౌను వేసుకుని, ఎప్పుడూ పెట్టుకునే టోపీ పెట్టుకుని ఒక చిన్న ఉపన్యాసం చేశాడు. అది చాల క్లుప్తంగానే ఉండిందిగాని మారియోకు మాత్రం అది అనంతంగా సాగినట్టు అనిపించింది.
“నా అధ్యక్ష అభ్యర్థిత్వం ప్రతిపాదన కార్చిచ్చులాగ వ్యాపించింది” అన్నాడు కవి, సముద్రపు సువాసనను గుండెలనిండా పీలుస్తూ. “నేను ఎక్కడికివెళ్ళినా అందరికందరూ నా పేరే గోలగోలగా పిలిచారు. అలా వందలాది మంది దయాళువులైన పురుషులూ స్త్రీలూ నన్ను ఎత్తిపడుతుంటే, నన్ను ముద్దుపెట్టుకుంటుంటే, కళ్లనీళ్లు పెట్టుకుంటుంటే, నేను లోలోపలి నుంచి కదిలిపోయాను. నేను వాళ్లందరితో మాట్లాడాను. వాళ్లకు నా కవిత్వం చదివి వినిపించాను. కొన్నిసార్లు భోరున వాన కురుస్తుంటే నా కవిత్వ పఠనం సాగింది. మరికొన్నిసార్లు బురదనిండిన వీథులమీదా, రహదారులమీదా నా కవిత్వం వినిపించాను. మరికొన్నిసార్లు దక్షిణాదిన ధృవప్రాంతపు చలిలో, ఎముకలు కూడ కొరికేసే చలిలో నా కవిత్వం వినిపించాను. అలా నా కుతూహలం పెరిగిపోతూ వచ్చింది. నా సభలకు ఇంకా ఇంకా ఎక్కువమంది రావడం మొదలుపెట్టారు. ఇంకా ఇంకా ఎక్కువమంది స్త్రీలు హాజరయ్యేవారు.”
మత్స్యకారులు పకపకా నవ్వారు.
“నాకు ఆశ్చర్యం వేయడం మొదలు పెట్టింది. దిగ్భ్రాంతీ కలిగింది. భయమూ కలిగింది. నిజంగానే నేను చిలీకి అధ్యక్షుడుగా ఎన్నికయితే ఏం చేయగలను అని ఆశ్చర్యపోయాను. ఏమయినా చేయగలనా అని భయపడ్డాను. అప్పుడిక నాకొక శుభవార్త తెలిసింది,” కవి ట్రక్ మీద ఉన్న పోస్టర్ల వైపు వేలు చూపించాడు. “పాపులర్ యూనిటీ ఫ్రంట్ ఏకైక అభ్యర్థిగా, మరే అభ్యర్థీ లేరన్నట్టుగా అయెండీ పేరు ప్రతిపాదనకు వచ్చింది. ఆయనకు నా పార్టీ, కమ్యూనిస్టుపార్టీ పూర్తి మద్దతు ఇచ్చింది. నేనిక ఆ అధ్యక్షపదవి ఎన్నిక నుంచి వెంటనే ఉపసంహరించుకున్నాను. ఒక పెద్ద మహాసభలో, జనసమూహం ఆనందోత్సాహాలతో కేరింతలు కొడుతుండగా నేను నా అభ్యర్థిత్వం ఉపసంహరించుకుంటున్నానని ప్రకటించాను. అయెండీ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించాడు.”
అక్కడ హాజరయి ఉన్న జనం కొట్టగల చప్పట్ల కంటె ఎక్కువ ధ్వనితో చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత నెరూడా ట్రక్ నుంచి కిందికి దిగాడు. తన రాతబల్ల దగ్గరికీ, తాను పోగేసిన సముద్రపు గవ్వల దగ్గరికీ, సగం రాసి వదిలేసిన కవిత్వాలదగ్గరికీ, తాను సేకరించిన బొమ్మల దగ్గరికీ ఎప్పుడెప్పుడు వెళ్లిపోదామా అని నెరూడా తొందరపడుతున్నట్టు అనిపించింది. మారియో ఆయన దగ్గరికి వెళ్లాడు. రెండే రెండు మాటలు ఉచ్చరించాడు. ఆ రెండు మాటలే వాటికవిగా ఒక విజ్ఞప్తిలా ధ్వనించాయి: “పాబ్లో గారూ…”
ఒక వస్తాదు తప్పించుకోవడానికి పక్కకి తిరిగితే ఎట్లా ఉంటుందో అట్లా తిరిగి నెరూడా ఆ కుర్రవాడిని తప్పించుకుందామని చూశాడు. “రేపు” అన్నాడు. “రేపు.”
పోస్ట్ మాన్ కు మరొక నిద్రలేని రాత్రి గడిచింది. చుక్కలు లెక్కపెట్టాడు. గోళ్లు కొరుక్కున్నాడు. ఎర్రని ద్రాక్షాసవం నిండుసీసా నీళ్లు కలపకుండానే లాగించాడు. చెంపలమీద చర్మం చెక్కుకుపోయేలా గీరుకున్నాడు.
మర్నాడు ఉదయాన్నే, మారియో పార్థివశరీరం అవశేషాలను చూసే గౌరవం టెలిగ్రాఫ్ ఆపరేటర్ కు దక్కేసమయానికి, ఆ ఆపరేటర్ కు ఆ కుర్రాడి మీద బోలెడంత జాలి కలిగింది. ఆ కుర్రవాడికి ఏదయినా ఉపశమనం కలిగిద్దామనుకుని, తనకు తోచిన ఒకేఒక్క ఉపశమనం ఇచ్చాడు. కవికి వచ్చిన ఉత్తరాల బొత్తి కుర్రాడి చేతిలో పెట్టాడు.
“ఒరే అబ్బాయ్, తెలుసా, బీట్రిజ్ ప్రస్తుతం చాల అందంగా ఉండవచ్చు. కాని యాభై ఏళ్ల తర్వాత చూస్తే అది ముసలి డొక్కు అయి ఉంటుంది. అట్లా ఆలోచించి చూడు, నీ మనసు కాస్త కుదుట పడుతుందేమో.”
మారియో ఆ మాట విన్నాడో లేదో. తన చేతికి అందిన ఉత్తరాల కట్టకు కట్టిన రబ్బర్ బ్యాండ్ కాస్త వదులు అయింది. అందువల్ల మారియోకు ఆ బొత్తిలోంచి ఒక ఉత్తరాన్ని చూసే అవకాశం కలిగింది. ఆ ఉత్తరం చూసేసరికి మారియోకు ఎంత ఉద్వేగం కలిగిందంటే, ఒక్క గంతువేసి కవి ఇంటి వైపు పరుగెత్తడం మొదలుపెట్టాడు. అసలు మిగిలిన ఉత్తరాలు కూడ అక్కడే వదిలిపెట్టేశాడు.
అక్కడికి వెళ్లేసరికి ఇంటి మేడ పైన కూచుని కవి ఫలహారం చేస్తున్నాడు. సముద్రం మీద సూర్యుడి ప్రతిఫలనపు వెలుగుతో కళ్లు బైర్లు కమ్మిన సముద్ర పక్షులు ఆయన తల చుట్టూ ఎగురుతున్నాయి.
“పాబ్లో గారూ” అని మారియో గట్టిగా అరిచాడు, “నేను మీకో ఉత్తరం తెచ్చాను.”
అప్పటికే తాను చప్పరిస్తున్న ఘాటయిన బ్లాక్ కాఫీ మరొక గుటకవేసి కవి తన భుజాలు ఆడించాడు. “దానిలో అంత ఆశ్చర్యం ఏముంది? నువ్వు నా పోస్ట్ మాన్ వే గదా, నాకు ఉత్తరాలు తేవడమే నీ పని గదా!”
“నేను మీ నేస్తాన్నీ, పొరుగువాడినీ, కామ్రేడ్ నూ కదా. కాస్త ఆ ఉత్తరం నా ముందే విప్పి చదివి వినిపించరూ!”
“నాకు వచ్చిన ఉత్తరం నీకు చదివి వినిపించమని అడుగుతున్నావా?”
“ఉహు, అదేంటంటే, ఆ ఉత్తరం బీట్రిజ్ వాళ్లమ్మ రాసింది.”
మారియో ఆ ఉత్తరాన్ని నెరూడా చేతికి అందించాడు.
“బీట్రిజ్ వాళ్లమ్మ నాకు ఉత్తరం రాసిందా? మారియో, అయితే పిల్లి మెడలో గంట కట్టావన్నమాట. నువు చేసిన పని చూస్తుంటే నాకు నేనెప్పుడో రాసిన ‘పిల్లిపై గీతం’ గుర్తుకొస్తోంది. ఆ కవితలో నుంచి కొన్ని అలంకారాలు, పదచిత్రాలు గుర్తుకొస్తున్నాయి. ప్రదర్శనశాలలో పులి బొమ్మ లాంటి పిల్లి, ఒక విశాల భవనంలో గదిగదికీ తిరిగే రహస్య పోలీసు లాంటి పిల్లి, శృంగార గృహాల పైకప్పులమీద కూచునే సుల్తాన్ పిల్లి.”
“కవి గారూ, ఇవాళ నా మనసు అలంకారాలనూ పదచిత్రాలనూ ఆస్వాదించేటట్టు లేదు. దయచేసి ఆ ఉత్తరం తెరిచి ఏమి ఉన్నదో చూడండి…”
నెరూడా ముందర బల్లమీద ఉన్న వెన్నకోసే కత్తి తీసి ఆ ఉత్తరాన్ని తెరవబోయాడు. కాని ఆ పని ఆయన ఎంత ఉద్దేశ్యపూర్వకమైన అసమర్థతతో చేశాడంటే ఆ అతి మామూలు పని చేయడానికి ఆయనకు ఒక నిమిషంకన్న ఎక్కువే పట్టింది. పగతీర్చుకోవడంలో దేవతలకు ఆనందం ఉంటుంది అనే సామెత నిజమే అనుకుంటూ ఆయన ఆ ఉత్తరం మీద అతికించి ఉన్న స్టాంపు వైపు తదేకంగా చూశాడు. ఆ స్టాంపు మీద ఉన్న జాతీయ నాయకుడి గడ్డంలో ఎన్ని ఉంగరాలు తిరిగి ఉన్నాయో ఒక్కొక్క ఉంగరాన్నీ దీర్ఘంగా చూశాడు. శాన్ ఆంటోనియో పోస్టాఫీసు వేసిన అర్థంకాని పోస్టుముద్రను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. కత్తిరించేటప్పుడు ఆ ఉత్తరం అంచుకు అంటుకున్న చిన్న బ్రెడ్ తుంపును అతి జాగ్రత్తగా పక్కకి తప్పించాడు. ప్రపంచంలోకెల్లా మహత్తరమైన అపరాధ పరిశోధక చిత్రం కూడ అంత ఉత్కంఠను రేకెత్తించి ఉండదు. అప్పటికే మారియో తన గోళ్లు కనబడకుండా కొరికేసుకున్నాడు. గోళ్ల పని అయిపోయి ఇక వేళ్లు కొరకడం మొదలుపెట్టాడు.
కవి నాటకీయంగా తన కవిత్వం చదివేటప్పుడు ఉపయోగించే మధురమైన కలకూజిత స్వరాన్నే ఉపయోగించి ఆ ఉత్తరం చదవడం మొదలుపెట్టాడు. “ప్రియమైన పాబ్లోగారూ, నా పేరు రోజా గొన్జాలెజ్. నేను ఇక్కడ సముద్ర తీరం మీద సారాకొట్టుకు కొత్త యజమానురాలిని. నేను మీ కవిత్వాభిమానిని కూడ. రాజకీయంగా నేను క్రిస్టియన్ డెమొక్రటిక్ ను. రానున్న ఎన్నికలలో నేను మీకయితే వోటు వేసి ఉండేదాన్ని కాను. అయెండీకి కూడ వోటు వేయను. కాని ఒక తల్లిగా, మీతోపాటు ఉన్న సహ చిలియన్ పౌరురాలిగా, ఇస్లా నెగ్రాలో మీ పొరుగుమనిషిగా మిమ్మల్ని నేను జరూరుగా కలవాలనుకుంటున్నాను. మీతో నేను ఒక విషయం చర్చించవలసి ఉంది…”
ఇక్కడిదాకా వచ్చేసరికి కవికి ఆశ్చర్యం పెరిగిపోయింది. అప్పటిదాకా ఉన్న ప్రతీకారవాంఛ పోయింది. దానితో ఒక్క నిమిషం ఆగి, మిగిలిన వాక్యాన్ని తనలో తానే చదువుకున్నాడు. కవి ముఖం మీద హఠాత్తుగా వ్యాపించిన గాంభీర్యం చూసి ఆదుర్దాతో మారియో చిటికెనవేలు గోరు పొట్ట పగిలిపోయి రక్తం కారడం మొదలయింది. నెరూడా ఉత్తరం పూర్తి చేసి మడతపెట్టాడు. కుర్రవాడివేపు చూపు సారించాడు. మిగిలిన వాక్యాన్ని జ్ఞాపకం నుంచి గుర్తు తెచ్చుకుని వినిపించాడు: “…మీతో జరూరుగా చర్చించవలసిన విషయమేమంటే మారియో హిమేనెజ్ అనే ఒక కుర్రవాడు ముక్కుపచ్చలారని పసి కూనలను ముగ్గులో దింపుతున్నాడు. చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. మీరు నాకు కాస్త సమయం ఇస్తే కృతజ్ఞురాలినయి ఉంటాను. భవదీయురాలు, రోజా గొన్జాలెజ్.”
ఈ వాక్యం వినిపించి, కవి లేచి నిలబడ్డాడు. చాల లోతయిన విశ్వాసం ధ్వనించే గొంతుతో, “కామ్రేడ్ మారియో హిమేనెజ్, మామూలుగానయితే ఈ చెత్తకుండీని పది అడుగుల దూరం నుంచి ఒక బొంగుతో తాకడానికి కూడ ఈ కవికి ఆసక్తి లేదు” అన్నాడు.
సముద్రపు గవ్వలు, పుస్తకాలు, బొమ్మలు నిండిన తన గదిలోకి కవి వెళ్లగా మారియో ఆయన వెంటపడ్డాడు. “నన్నిట్లా దిక్కులేకుండా చేసి మీరట్లా వెళ్లిపోవడానికి వీలు లేదు, పాబ్లో గారూ. ఆమెతో ఒక్కసారి మాట్లాడండి. ఆమె ఎంత అర్థం లేకుండా మాట్లాడుతున్నదో చెప్పండి.”
“బిడ్దా, నేను కేవలం ఒక కవిని. ఈ ప్రపంచంలో అత్తలను సంస్కరించే మహత్తర ప్రతిభాపాటవాలు నాదగ్గర లేవు.”
“కాని ఎట్లాగైనా సరే, మీరు నాకు సాయం చేయవలసిందే. మరి మీరు రాయలేదా? ‘నాకు కప్పులేని ఇల్లంటే ఇష్టంలేదు, అద్దంలేని కిటికీ అంటే ఇష్టం లేదు. పనిలేని రోజంటే ఇష్టంలేదు, నిద్రలేని రాత్రంటే ఇష్టం లేదు. ఆడది లేని మగవాడినీ, మగవాడు లేని ఆడదాన్నీ నేనూహించలేను. జీవితాలు పెనవేసుకోవాలనీ, ఇప్పుడు నిద్రాణంగా ఉన్న ముద్దులను రగిలించాలనీ నేను కోరుకుంటాను. నేనొక కవిని, జతపడవలసినవాటిని జతకలిపే కవిని’ అని మీరే గదా రాసింది! ఆ కవిత ఊరికే రాశాననీ, అది ఒక చెల్లని చెక్కు లాంటిదనీ చెపుతారా ఏం?”
కవి కడుపులోలోపలి నుంచి కళ్లదాకా రెండు భావోద్వేగాల అలలు ఒత్తుకొచ్చాయి. ఒకటి భయంతో నిండినది. మరొకటి ఆనందోత్సాహపుది. హఠాత్తుగా ఆయన పెదాలు ఎండుకుపోయాయి. నాలికతో పెదాలు తడుపుకున్నాడు. ఆశ్చర్యంతో, “నువు చెప్పే తర్కం ప్రకారం, హామ్లెట్ తండ్రిని హత్య చేసినందుకు షేక్ స్పియర్ ను జైలులో పెట్టాలి. పాపం పిచ్చివాడు షేక్ స్పియర్ ఆ విషాదాంత నాటకం రాయకపోయి ఉన్నట్టయితే, హామ్లెట్ వాళ్ల నాన్నకు ఏమీ అయి ఉండేది కాదు.”
“కవి గారూ, దయచేసి నన్నింకా గందరగోళం చేయకండి. ఇప్పటికే పిచ్చెక్కి ఉన్నాను, అది చాలు. నిజంగా నేను మిమ్మల్ని అడుగుతున్నది చాల సులభమైన సాదా సీదా విషయం. దయచేసి ఆవిడతో మాట్లాడండి. నేను బీట్రిజ్ ను కలిస్తే కొంపలేమీ ముంచుకుపోవని ఆవిడను ఒప్పంచండి.”
“అంతమాత్రం చేస్తే నీకు సంతోషమేనా?”
“అంతకంటేనా?”
“తనకూతురిని నువ్వు చూస్తే ఫరవాలేదని ఆవిడ అంటే ఇక నన్ను వదిలేస్తావా?”
“కనీసం రేపటిదాకా.”
“సరే, అదయినా మంచిదే. చూద్దాం, ఆవిడతో ఫోన్ లో మాట్లాడుదాం.”
“ఇప్పుడేనా?”
“ఔను, ఈ క్షణమే.”
అంటూ కవి ఫోన్ ఎత్తి, ఆ కుర్రవాడు ఒళ్లంతాకళ్లు చేసుకుని తననే చూస్తూ ఉండడం గమనించాడు.
“బిడ్డా, నీ హృదయం ఎట్లా కుక్కలాగ మొరుగుతోందో నాకు వినబడుతోంది. కాస్త సంబాళించుకో.”
“అబ్బ, ఓపలేకున్నానీ బాధ.”
“సరే, సారాకొట్టు నంబరెంత?”
“ఒకటి.”
“అది గుర్తు పెట్టుకోవడానికి చాల ప్రయత్నించి ఉంటావే!”
నెరూడా ఆ నంబర్ కలిపిన తర్వాత, కవి గొంతులోంచి మాటవచ్చే లోపు సుదీర్ఘ మౌనం వ్యాపించిందని మారియోకు అనిపించింది.
“రోజా గొన్జాలెజ్ గారా?”
“ఔను, మాట్లాడుతున్నా.”
“నేను పాబ్లో నెరూడాను.” కవి సాధారణంగా చేయడానికి ఇష్టపడని పని చేశాడప్పుడు. తాజా సినిమా తారను పరిచయం చేస్తూ ఎవరో టెలివిజన్ వ్యాఖ్యాత పలికినట్టుగా ఆయన తన సొంతపేరును కులుకుతూ పలికాడు. కాని ఆమె రాసిన ఉత్తరమూ, ఫోన్ సంభాషణలో ఆవిడ స్వరంలోంచి వినబడిన తొలి ధ్వనులు చూడగానే తాను కాస్త జాగ్రత్తగా ఉండాలని కవికి అర్థమయింది. ఈ అమాయకపు కుర్రవాడిని రక్షించాలంటే ఈవిడతో జాగ్రత్తగా వ్యవహారం నడపాలి అనుకున్నాడు కవి. ఏది ఏమయినా, ఆయన చరిత్రాత్మకమైన పేరు వినగానే సాధారణంగా ఉండే స్పందన ఈవిడ దగ్గర ఎంత మాత్రం పనిచేయలేదు. ఆమె చాల పొడిగా “ఓహో” అని మాత్రం స్పందించింది.
“మీరు రాసిన సొగసయిన జాబు అందింది. ధన్యవాదాలు చెపుదామని చేశాను.”
“నాకు మీరు దేనికీ ధన్యవాదాలు చెప్పనక్కరలేదు. అయ్యా, నేను మీతో తక్షణమే మాట్లాడాలి.”
“చెప్పండి శ్రీమతి గొన్జాలెజ్ గారూ, ఫర్లేదు చెప్పండి.”
“మీతో ముఖాముఖీ చెప్పాలి”
“ఎక్కడ?”
“మీరు ఎక్కడంటే అక్కడే.”
నెరూడా ఒక్క క్షణం ఆగి ఆలోచించాడు. అప్పుడు జాగ్రత్తగా “మీకు ఇబ్బంది కాకపోతే, మాఇంట్లో కలుద్దామా?”
“సరే, బయల్దేరుతున్నా.”
ఫోన్ పెట్టేసేముందు కవి రిసీవర్ ను అటూ ఇటూ దులిపాడు. ఆవిడ మాటల ముక్కలో, ధ్వనులో అక్కడ మిగిలిపోయి అంటుకుని ఉంటే దులిపి పారేస్తున్నట్టు అనిపించింది.
“ఏమందావిడ?” అడిగాడు మారియో.
“నేను బయల్దేరుతున్నా అంది.”
నెరూడా తన చేతులు రుద్దుకున్నాడు. ఇస్లా నెగ్రా కు తిరిగి వచ్చిన మొదటిరోజున ఆకుపచ్చ అలంకారాలతో నింపాలనుకున్న నోట్ బుక్ ఇంక చేసేదేమీలేదన్నట్టు మూసేశాడు. కుర్రవాడికి ప్రోత్సాహం ఇవ్వడం అత్యవసరమన్నట్టు చాల ఔదార్యంతో, “కనీసం ఆవిడతో మాట్లాడడానికి మనకిపుడు స్థానబలం ఉంది” అన్నాడు.
(మిగతా వచ్చే సంచికలో)
అభిప్రాయాలు లేవు »అనువాదాలు, ద పోస్ట్ మాన్