వస్తువులో స్పష్టత, శిల్పంలో పదును వెరశి కొ.కు. గల్పిక

హిందీ, సాహిత్యంలో గల్ప అంటే కథానికే. తెలుగులో  గల్పిక, కథానిక వేరు వేరు ప్రక్రియలుగా స్థిరపడ్డాయి. గల్పికని కుటుంబరావు అల్పిక అనీ, అభూతకల్పన అనీ సరదాగా అన్నట్టు భావించవచ్చు.
గల్పికకు వెటకారం ప్రాణం. వ్యంగ్యం దేహం. అందువలన చూడగానే కనుముక్కు తీరు అంతగా బాగుండని మనిషిలా అనిపిస్తుంది. లేదా దానికి వ్యతిరిక్తంగా ఆశ్చర్యమూ కలిగించవచ్చు. కథానికా మనిషి జీవితంలో ఒక కోణాన్ని, లేదా ఒక పార్శ్వాన్ని చిత్రిస్తే, గల్పిక ఆ కోణంలోని లేదా పార్శ్వాన్నిలోని కొన్ని దశావిశేషాల్ని అంటే కొన్ని వంకరల్ని స్పృశిస్తుంది. గల్పికని ఆ పేరుతోనే రాసి ప్రాచుర్యని కలిగించినవాడు కుటుంబరావయితే, స్కెచ్‌ పేరుతో ప్రాచుర్యం కలిగించింది ఆనాటి తెలుగు స్వతంత్ర.

”కథానికలు ప్రధానంగా సంస్కారాన్ని మెరుగుపరిస్తే, గల్పికలు ప్రధానంగా విజ్ఞానాన్ని పెంచడానికి ఉపకరిస్తాయి. గల్పికకు గొప్ప ఎడ్యుకేటివ్‌ వాల్యు ఉన్నట్లు ఈయన (కొ.కు.) గల్పికలు చదివితే స్పష్టంగా తెలుస్తుంది” అన్నారు డా.కేతు విశ్వనాథరెడ్డి.

కొ.కు. మొత్తం 52 గల్పికలు రాసినట్లు తెలుస్తోంది. గల్పికలో వస్తువు కేవలం ఒక భావన ఆధారంగా ఉండవచ్చు. కొ.కు. ఇలాంటి గల్పికలూ రాశారు. ఒక కాముడు ‘బిచ్చగాల్ల’ రచయిత నుంచీ వేరే అవతారమెత్తి ‘వచన సమాట్ర్‌’ అయ్యాడు. వందల కొద్దీ సన్మానాలు పొందుతున్నాడు. ఎలా? ప్రజాపూజితుడినుంచీ రాజపూజితుడైపోయాడు. అంటే ప్రభుత్వ పక్షపాతకవి అయ్యాడని ధ్వని. ‘కీర్తి కాముడు’ గల్పిక పేరు. వ్యంగ్యం దట్టించబడేవుంది. హేళన నిండుగావుంది. వాస్తవికత కళాత్మకం చెందింది. కొ.కు. గల్పికల్ని వర్గీకరిస్తే రాజకీయ ఆర్థిక సామాజిక వస్తువులు కలిగినవిగా నిలుస్తాయి. రాజకీయ సందర్భాలు ఇతివృత్తాలైన, మంచి గల్పికలు చాలా వున్నాయి. ‘ఉద్దరింపు’ వీటిలో అసామాన్యమైన రచన, అనన్య సామాన్యమైన వాస్తవికతకి ప్రతి బింబం. ‘చిన్న పల్లిలో పదహారు మంది హరిజనులను భూస్వాముల గుండాలు-” ”పాపం” ”పెదపర్రులో ఎనిమిది మంది హరిజన స్త్రీలను ముగ్గురు భూస్వాములు-” ”పాపం, పాపం!” ‘మధ్య కుంటలో నాలుగు వందల హరిజన గుడిసెలకు నిప్పుపెట్టగా అయిదుగురు హరిజన వృద్ధులూ, ఇరవై ఇద్దరు హరిజన బాలికలూ-” ”దారుణం! దారుణం!” ”భూస్వాములను చంపి, మరి ముగ్గురిని గాయపరచి-” ”వాళ్ళందరికీ ఊరి శిక్షపడేటట్టు చూస్తాం! దేన్నయినా సంహిస్తాం కానీ, ఆరచకాన్ని-” ఇదీ మొత్తం గల్పిక. ఇదే మొత్తం గల్పిక వ్యాఖ్యానాలు దేనికీ? శతకోటి చెంపదెబ్బలు పెట్టుకదా- గల్పికలోని వ్యంగ్యం! కొ.కు. అభ్యుదయవాది, వర్గస్వభావం తెలిసిన పండితుడు ఇలాంటి ప్రశంసలు ఆయనికి చాలా ఉన్నాయి. మంచిది. కానీ ఇంత చిన్న గల్పికలో కూడా ఎంత మానవీయ విలువనీ చూడవచ్చు? 1953లో కొ.కు. పద్మరాజు మంచికథ అంటే ఏదనే దానిమీద చర్చ చేసుకున్నారు. ఆ చర్చలో కొ.కు. అన్నాడు (రచయితకి) తాను రచించే విషయాన్ని గురించి అనుభవంతో పాటు ఆ అనుభవం వెనుక ఉండే జీవిత సత్యాన్ని తెలుసుకునే శక్తికూడా వుండాలి” అని. జీవిత సత్యాలు అంటే సమాజ స్వరూపం గురించిన జ్ఞానసారమే.
ప్రజాస్వామ్యంలో ప్రభువులకెప్పుడూ తమ భవిష్యత్తు గురించిన బెంగే ఎక్కువ. ప్రజలు తెలివిమీరి తమ అధికారాలు గుర్తిస్తారు. అప్పుడు తమగతి ఏం కాను? ఒక ప్రభుభక్తి పరాయణుడు ”ప్రజలను అదుపులో పెట్టే సాధనం కావాలి” అన్నాడు. చర్చి సాగింది. అంచెలంచెలుగా ఉపాయాలు తోచాయి. చివరికి ”పిశాచత్వం వాళ్ల ప్రవృత్తి అయ్యేలా ఒక సిబ్బందిని తయారు చేయాలి. జనాన్ని చెండుకు తినటం  నేర్పాలి. అంటే తమ పై వాళ్లపట్ల కుక్కలా ప్రవర్తించే గుణం కూడా నేర్పాలి” అని నిర్ణయం జరిగింది. ”గ్రేట్‌! గ్రేట్‌! అన్నారు” ఇదీ  ”ప్రజా పిశాచాలు” అన్న గల్పిక. ఉత్తమమైన కాల్పనిక ప్రక్రియ జీవితనానికి దర్పణంగా నిలవాలని చాలా మంది విమర్శకులు రాసిరాసి కథా సాహిత్యాన్ని పాడు చేయటానికి తమ వంతు సహకరించారు. కానీ, కథానిక కానీ, నవలకానీ, నాటకంకానీ, గల్పిక కానీ జీవితాన్ని వ్యాఖ్యానించగలగాలి. అప్పుడే చదువరిలో ఆలోచనాప్రేరణకి అవకాశం కలుగుతుంది. దర్పణంలోలాగా ఉన్నది ఉన్నట్లు చూపటానికి మళ్లీ వేరే వాడెందుకూ తనకు తానే ఆ ఛండాలన్ని చూస్తున్నాడు కదా? అనుభవం వెనుక సత్యం చదువరికి అందేటట్లు నిరాడంబరంగా చెప్పే నైపుణ్యం కావాలి రచయితకి. కొ.కు. లాంటి మహారచయితలు సాధించుకున్నది- ఆనైపుణ్యాన్నే! ‘ఎన్నికలప్రచారం’ ”పందికొక్కులు” వంటి ఎన్నో గల్పికలు రాజకీయ సెటైర్లే!
ఆర్థిక పరమైన సమస్యలూ, సందర్భాలూ ఇతివృత్తలైన గల్పికలూ చాలా కన్పిస్తాయి, కొ.కు. రచనల్లో. ”సర్వరోగ నివారిణి” వుంది. అపరధన్వంతరి ఒకడు దీన్ని తయారు చేశాడు. నాలుగుదినుసులు. వాడికొక్కడికే తెలుసు ఓషధులు కలిపే రహస్యం. అది శ్రమతోకూడినపని. పేదవాడుగా ఉన్నప్పడు ఉత్సాహంగా శ్రమపడ్డాడు. డబ్బుపోగయింది. శ్రమపట్ల విముఖత ప్రబలసాగింది. ధరపెంచాడు. రాబడి పెరిగింది. కానీ శ్రమతప్పటం లేదు. కల్తీ మొదలెట్టాడు. గిరాకీ తగ్గింది. రాబడీ తగ్గింది. పాతసంపాదనమీద బతికినన్నాళ్లు దర్జాగా బతికి చిల్లిగవ్వకూడా మిగల్చకుండా చచ్చాడు. ”సర్వరోగనివారిణి ఎలా తయారు చేయాలో ఎవరికీ తేలీదు. అదే అతను మానవజాతికి చేసిన ద్రోహం. అని ముగుస్తుందీ గల్పిక. వెంటనే మీ బుర్రలోకి అనేక కంపెనీల పేర్లు, మందుల పేర్లు రావటం లేదూ! అదీ ఆ చురకనివేయటం గల్పిక పరమార్థం.!
చవకబారు సినిమాలు తీశాడు. కుదేలయిపోయాడు. అన్నీ ప్లాపులే. ఇప్పుడంటాడు. ”చూడండీ! మన పిచ్చెర్లలో మంచి అభిరుచి ప్రతిబింబించేట్టు చూసే బాధ్యత ప్రజలది. దిగజారి పోతున్న చలనచిత్ర పరిశ్రమని ప్రజలే ఉద్దరించాలి” అని! గల్పిక ”ప్రజలదే భారం”. వస్తువులో ”ఏకాంశవ్యగ్రత” సాధించటమంటే ఇదే. చిన్న గల్పిక ఒక్కటే పాయింట్‌. నిత్యమూ మనందరి కళ్లముందూ జరుగుతున్న భాగోతమే కదా ఇది?! ఈ సాధారణీకరణ లక్షణమే గల్పికకు శ్వాస.
సామాజిక సమస్యల్ని ఆధారం చేసుకుని కొ.కు. రాసిన అద్బుతమైన గల్పికలు ఎన్నో ఉన్నాయి. వాటిలో విలక్షణమైనవీ, అధిక్షేపతత్త్వాన్ని నిగూఢంగా ఉంచి కథాత్మకశిల్పంతో రచించినవీ కొన్ని ముఖ్యమైనవి ఉన్నాయి.
‘మాయపొర’ అని గల్పికపేరు. ఒకడు తనమిత్రుడి స్వభావన్ని ఇంకో మిత్రుడి ముందు వన్నె చిన్నెలుగా, పిసినారిగా చిత్రించాడు. పోరాగ పోరాగ హోటల్‌కి తీసుకుపోతాడు. పిసినారి. బిలూల చెల్లిస్తాడు. ”ఏడుస్తూనూ”! ”రెండునెల్లనుంచీ ఇదే వరసా?” అని అడిగాడు వింటున్నవాడు. అవునన్నాడు- ఆ అమూల్య మిత్రుడు! అంటే ‘పిసినారి’ అనే బడే వాణ్ని… చేస్తున్నది ఎవరో అర్తం అవుతోంది కదా!
భేషజాలూ, మిధ్యా గౌరవాలూ ఎలా కొంపలు ముంచుతాయో చెప్తుంది ‘బేడకాసులు అదా’ అనే చాలా గొప్ప గల్పిక, కొడుకు సినిమా అని అడ్డు తగుల్తూ ఉంటాడు. తల్లి దండ్రుల సంభాషణలో, 4/బిట్లు అంతే. పిల్లపుట్టింది? బారసాల అందర్నీ పిలవటం, బట్టల పెట్టటం. కొడుకుని అవతలికి విదల్చటం. ఇది మొదటి బిట్‌. పెళ్లి సంబంధం రెండోబిట్‌. ఊళ్లో సంబంధం చూడటం. కొడుకుగోల. వీళ్ల తృణీకారం. మూడోబిట్‌ పెళ్లి. ఇల్లమ్ముదామా, పొలం అమ్ముదామా? సమస్య. మళ్లీ కొడుకు సినిమా పైసలకి చెయ్యి జాపటం. పక్కకి విదల్చటం. ఇక నాలుగో బిట్‌. ”నినిమాకు పోవద్దు నాన్న” బంగారం లానిటి పొలం కాస్తాపోయింది. ఇంకా సినిమా ఏమిట్రా వెధవా? జరిగిన దంతా సినిమాకాదూ?” తండ్రి ప్రశ్న అన్నమాట! ఇంకా ‘దయ్యం’, తల్లి ప్రేమ’, ‘తండ్రిప్రేమ’ వంటవి మనలోకి మనం చూసుకునే పరిస్థితికల్పించే గల్పికలే. కాగా, కొ.కు- గల్పికా రచయితగా కూడా గొప్ప దార్శనికుడు అని నిరూపించే రెండు గల్పికల్న చెప్పుకుతీరాలి. ఒకటి ‘ఫారిన్‌ కొలాబొరేషన్‌’ రెండవది’స్వాతంత్య్రం ఖరీదు’ ‘ఫారిన్‌ కొలబొరేషన్‌’ ఇలా నడుస్తుంది. పాపారావు బంకు మారిపోయింది. అతనూ మారిపోయాడు. పెరిగిన జుట్టుతో, బెల్‌బాటమ్‌ పాంట్‌తో దర్శనమిచ్చాడు. కోకోకోలా ఇచ్చాడు. షాపంతా అవే. ఫారిన్‌ కొలాబొరేషన్‌. పెట్టుబడంతా అమెరికా వాడిదే. ‘నాకు రోజుకు అయిదారు రూపాయలు మిగులుతాయి. చాలదా?’ అన్నాడు. ఇది  జరిగి ఏడాదయ్యింది ఇప్పుడు అటువైపు వెళితే పాపారావు లేడు. ఇంకెవడో వున్నాడు. పాపారావు ఏమయ్యాడో?…. ఇంకా నాకు కనిపించే అవకాశం లేదు.’ ఇది దార్శనికత అంటే. ప్రపంచీకరణ. ప్రపంచీకరణం అని ఫ్యాషన్‌ రచనలు చేసి చేసి, కవితలూ కథానికలూ రాసిరాసి, ఒకటే అరుపులూ,కేకలూ… సభలూ,సమావేశాలూ … సంపుటాలూ…సంకలనాలూ… జబ్బలు చరుచు కోవటాలూ…! చూడండి. ఈ గల్పిక ఎంత సారవంతమైనదో. 1977 జూన్‌లో రాసాడు. కొ.కు. ఇంతకు మించి ఆ దుష్ఫలితం మీద చెప్పేందుకేంవుంది? తిరగేసి మళ్లేసి ‘గ్రేట్‌’ రైటర్స్‌ అంతా చెప్పుకొస్తున్న, చేస్తున్న పిష్టపేషణం దీన్ని గురించే కదా? ఎన్ని కథలొచ్చినా అన్నీ ఆ తాసులో ముక్కలే! నింపాదిగా ఆలోచించుకోవాలి.
అలాగే, కొ.కు కాలాంతకుడు(!) అనిపించే మరో గల్పిక- ‘స్వాతంత్య్రం ఖరీదు’ అనేది. భర్త తన భార్య పేరుతో స్త్రీల విమోచనం గురించి వ్యాసాలు రాద్దామని ఉద్యమం మొదలెట్తున్నాడు. తన పేరున వద్దంటుంది భార్య . భర్త వినడు. చివరికి భార్య అంటుంది, ”….సరే, నా స్వాతంత్య్రాన్ని అమ్ముకుంటాను. దానికి ఏమిస్తారు?అయిదు తులాల బంగారం నగలూ, మూడు పట్టు చీరెలూ ఇస్తారా?” అని అడుగుతుంది. అతను విస్తుపోయాడు. ”పెట్టుబడి దారీలో ఎవరికీ స్వాతంత్య్రం ఉండదని లక్షసార్లు అన్నారే, ఆడవాళ్ల స్వాతంత్య్రానికి పెట్టుబడిదారీ అడ్డంరాదా?” ని వాతపెడుతుంది.! స్త్రీవాదం. ఇంత కంటే స్పష్టంగా పటిష్టంగా చెప్పేదేముంది? ఇది జనవరి 77 లో రాశాడు.
సమాజ జీవనంలో వున్న వైచిత్రి అంతా కొ.కు. రచనల్లో వుంది. మానవ సంబంధాల్లోని వైరుధ్యాలన్నీ కొ.కు. రచనల్లో వున్నాయి. యదార్థ, వ్యధార్త జీవితాల్లోని అస్తవ్యస్తత, సంక్లిష్టతలన్నీ కొ.కు. రచనల్లో ఉన్నాయి. ఎన్నో జీవితాల్లో ఉన్న అయోమయత్వాన్ని ఉద్వేగంతో తన రచనల్లో చిత్రించాడు కొ.కు.
ఈ గల్పికలన్నీ కూడా మరి కొ.కు. రచనలే. అందుకే వాటికంత పదునూ, ఫోర్సూ!! ముఫై ఏళ్ళముందే ఆ మాటకొస్తే  70ఏళ్లముందే ఈ నాటి మనిషి బతుకుని దర్శించగలిగిన మహా రచయితని, మహాదార్శనికుడు అనే అనాలి.

ఒక అభిప్రాయం »సాహిత్య వ్యాసాలు

One Response to “వస్తువులో స్పష్టత, శిల్పంలో పదును వెరశి కొ.కు. గల్పిక”

  1. 1
    Rohiniprasad Says:

    రెండో ప్రపంచయుద్ధ కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం మన దేశంలో పత్రికల పేజీలనూ, పేజీల సైజునూ చట్టరీత్యా తగ్గించింది. పత్రిక సైజు తగ్గిస్తే మనం కథ సైజును ఎందుకు తగ్గించకూడదూ అనే ధోరణితో మా నాన్న గల్పికలు రాయడం మొదలెట్టారట. దానికి అవసరమైన శిల్పమూ, టెక్నిక్లూ ఆయనే పెంపొందించుకున్నారు.

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో