Apr2009
వృద్ధ
ఆమె మొన్న ట్రెయిన్ స్టేషన్ లో
నా ప్రక్కనే కూర్చుంది.
ఆర్థ్రిటిస్ తో వంకర తిరిగిన వేళ్ళని
బలహీనతతో వణికే చేతుల్ని
వళ్ళో మడిచి పెట్టుకుని
వంగిన శరీరాన్ని కుర్చీ అంచుకి ఆనించి
మూర్తీభవించిన నైరాశ్యం లా
ఆమె మౌనంగా కూర్చుంది.
మూగబోయిన వాయిద్యమైన సంతోషాన్ని
వెలిసిపోయిన వర్ణచిత్రమైన యవ్వనాన్ని
వడలిపోయిన మొగలిచెండు వంటి లావణ్యాన్ని
భారంగా మోసుకుంటూ
రాజ్యం కోల్పోయిన మహారాణిలా
ఆమె తలవంచి వంటరిగా కూర్చుంది .
అయినా కనురెప్పలెత్తి ఆమె చూసినపుడు
అలసిన ఆమె కన్నులలో
ఒకప్పటి గొప్ప సౌందర్య వైభవం
ఏదో గాఢమైన ఆనందపు అనుభవం
మరేదో చెమ్మగిలిన జ్ఞాపకాల పరిమళ రహస్యం
వంతెన క్రింద పారే సన్నని పిల్లకాలువలా
నిగూఢంగా తళుక్కుమని మెరుస్తుంది
April 9th, 2009 at 8:37 am
టచి0గ్ గా వు0ది.
April 16th, 2009 at 5:15 am
వైదేహి గారికి,
కవితారహస్యం తెలుసు మీకు.
మొదట ఆవిడ ప్రస్తుత స్థితి వర్ణించడంలో మొహమాటం లేకుండా రాయడం. తరవాత మూగబోయిన వాయిద్యం, వెలిసిపోయిన వర్ణచిత్రం, వడలిపోయిన మొగిలిచెండు లతో పోల్చి ఆపకుండా ; కోల్పోయిన సంతోషాన్ని, యౌవనాన్ని,లావణ్యాన్ని భారంగా భరిస్తోంది ఆవిడ అనడం గడుసుదనం. ఈ గడుసుదనమే కవిత్వం కాబోలు. ముగింపులో ఈ గడుసు కవిత్వంవల్లనేమో ఆవిడ కనురెప్పలెత్తి ప్రపంచం వైపు చూస్తే ప్రపంచానికి ఆ అలసిన కన్నులలో తళుక్కుమని మెరుపు కనబడుతుంది, మామూలుగా కాదు నిగూఢంగా. నిగూఢంగా వుండేవి మామూలు కంటికి కనబడవు. కవులకు తప్ప.
చెమ్మగిలిన జ్నాపకాల పరిమళ రహస్యం చిక్కని ప్రయోగం.
మీరు రోజుకో కవిత రాయాలి. అయితే చిన్న విన్నపం. రాసిన దానిని మళ్ళీమళ్ళీ చెక్కాలి. పుష్కరం పాటూ చెక్కబట్టే కదండీ ఇప్పటి కన్యాశుల్కం మొదటి కన్యాశుల్కం కన్నా బాగున్నది.
కవితా రహస్యం తెలిసిన మీకు, వెన్నెలకోలు.
April 21st, 2009 at 9:00 pm
ఇట్లాంటి పద్యాలు చదివి నైస్ అనో, బాగుంది అనో అనలేము.
ఒక దృశ్యాన్ని, దాన్లోంచి ఒక గాఢమైన అనుభూతిని ఆవిష్కరించారు.
May 12th, 2009 at 12:56 am
వైదేహి గారి కవిత్వం లొ సూటిదనం, స్వచ్చత హృద్యమం