Apr2009
ఎల్లి-నవల – గిరిజన జీవన సంస్కృతి
పరిచయం
అరుణ రాసిన ‘ఎల్లి నవల 1992లో నవంబరులో తొలిసారి అచ్చయ్యింది. ‘నీలి’తో కలిపి 1996 ఆగస్టున తిరిగి ముద్రించారు. ‘విరసం’ వారు ప్రచురించిన ఈ నవల దళిత జన జీవన సంస్కృతిని ప్రతిబింబించింది.
కథావస్తువు
‘కొయిలారం’ అనే గ్రామ సరిహద్దుల్లో గుడిసెల్లో నివసించే, అట్టడుగు కులాల వారైన ‘ఎరుకల’ వాళ్ల జీవితం. ఎరుక అంటే జ్ఞానం. ఎరుకలోళ్లు అంటే జ్ఞానవంతులు అని అర్థం చెప్పుకోవచ్చు. వీళ్ళల్లోని కొందరు స్త్రీలు ‘ఎరుక చెప్తామమ్మ ఎరుక’ అంటూ సోది చెప్పడానికి ఊళ్ళు తిరుగుతుంటారు.మనిషి ముఖ కవళికలను బట్టి వారి జీవితానుభవంతో ఎదుటి వ్యక్తితో గతవర్తమాన భవిష్యత్ సంభాషణలు చేస్తుంటారు.
ముఖ్యంగా ఈ నవలలోని ప్రత్యేకత ఏమిటంటే, స్త్రీల జీవితాల్లోని కౌటుంబిక కష్టాలను, వాళ్ళు పెంచుకునే ‘పందుల’ కంటే హీనంగా, నీచంగా హేయంగా స్త్రీల పట్ల వారు కట్టుబాట్లు, కులాచారాల పేరిట జరిపే అమానుషాలను, స్త్రీలు పడే మానసిక ఘర్షణలను, చాలా ప్రతిభావంతంగా చర్చించారు, చిత్రించారు.
స్త్రీల పాత్రలు
ఈ నవలలో ప్రధాన పాత్ర
1. మాలచ్చిమి
60,70 ఏళ్ళ స్త్రీ చాలా పరిణితి పొందిన జీవనావగాహన కలిగివున్నామె తోటి స్త్రీల పట్ల రకరకాలుగ జరుగుతున్న హింసను ఖండిస్తూ, ప్రశ్నిస్తూ, పోరాట పటిమ కలిగివున్న పాత్ర.
2. పారోతి
‘బిచ్చాలు’ లాంటి అసమర్థుడు. తాగుబోతు ఐన భర్తతో వేగుతూ, తాగినప్పుడల్లా నేను హరిశ్చంద్రుణ్ణి. పెళ్ళాన్ని అమ్ముకుంటాను అని రంకెలేస్తున్నా. తాగనప్పుడు మనిషి మంచోడే గందా అని సరిపెట్టుకుంటూ, చాలీ చాలని తిండి కడుపునిండని పిల్లల్తో రోజుల్ని వెళ్ల మారుస్తుంటుంది.
ఒక రోజు నిజంగానే తాగిన మైకంలో పెళ్ళాన్ని అమ్మేసి, వాళ్ళను వెంట బెట్టుకొని ఇంటికొచ్చి గొడవచేస్తే, అప్పటి వరకు భరించిన పారోతి ధైర్యంగా ఎదురుతిరిగి, నన్నెట్లా అమ్ముతావని పోరాడుతుంది. పక్కింటి మాలచ్మికూడా ఆమెకు అండగా నిలబడి ఈ స్త్రీలకు డబ్బిచ్చి కొనుక్కునే ‘ఓలి’ అనే ఆచారం, పిల్లల తల్లి పట్ల క్రూరంగా తయారవ్వడాన్ని దుయ్యబడుతుంది మత్తు దిగిన తర్వాత ‘బిచ్చాలు’ పశ్చాత్తప పడతాడు.
3. ‘ఎల్లి’
ఈ నవలా నాయిక. నిర్మలమైన మనస్సుతో హాయిగా పిల్లల్తో గోలి లాడుకుంటూ స్వేచ్ఛగా పెరిగిన 10 సం. ల పిల్ల. తండ్రి ఎంకన్న. ఎవరి మాటా వినక, నాయనమ్మ మాలచ్చిమి మాటనూ ఖాతరు చేయక, ఎక్కువ డబ్బొస్తుందని ఒక ముదురు వయసు వాడిదగ్గర ‘ఓలి’ తీసుకుని పెళ్ళి డాబుసరిగా చేస్తాడు.
పెళ్ళంటే ఏమటో తెలీని ‘ఎల్లి’ కి పెళ్ళయి ఆ తర్వాత కాపురానికి వెళ్ళాక, భర్త మొరటు ప్రవర్తనను భరించలేక పారిపోయి వస్తుంది. చిన్నప్పడు తాను కలిసి ఆడుకున్న ‘జీవాలు’ పట్ల ఆ కర్షితురాలవుతుంది. ఆమెపట్ల జాతి, ప్రేమ వున్నప్పటికీ, పిరికితనం ఎక్కువవున్న అతను ఆమెకు అండగా నిలబడలేకపోతాడు. కూతురుకి మళ్ళీ పెళ్లి చెయ్యడంకంటే తాను చిన్న వయసుదాన్ని చేసుకుని తను సుఖపడాలను కుంటాడు. ‘ఎల్లిని బలవంతంగా అత్తారింటికి పంపేసి, ‘ఓలి’ని తిరిగి చెల్లించకుండా తప్పించుకుంటాడు.
4.దురగ
ఎల్లి తల్లి. వున్న పిల్లలకి తిండిపెట్టలేక, గర్బిణిగావున్న తానేమీ తినక, ప్రసవించలేక చనిపోతుంది. కూతురు ‘ఎల్లి’కి పెళ్ళి అప్పుడే చెయ్యవద్దని, చెప్పినా వినని భర్త మొండి వైఖరి వల్ల మనస్థాపానికి కూడా గురవుతుంది.
5. బాజి
మాలచ్చి, సుబ్బన్నల కూతురు. అమాయకమైంది అందమైంది చింత చిగురు కోయడానికి వెళ్ళినప్పుడు దొరలపిల్లలు పైశాచికంగా ఆమెపై లైంగిక హింస జరుపుతారు. తల్లికి చెప్పుకుంటుంది.
ఊరిలో దొరల పెత్తనం, దుర్మార్గం తెలిసిన మాలచ్చిమి కూతురికి మానసికంగా ధైర్యాన్నివ్వడానికి ప్రయత్నిస్తుంది. నలుగురికీ తెలియక ముందే కూతురు పెళ్ళి చేస్తే మంచిది అనుకుంటుంది. భర్తకు తెలిస్తే ఎక్కడ అగ్గిమీద గుగ్గిలమౌతాడోనని విషయాన్ని దాస్తుంది. బలికి పందిని నరికినట్లు నరకాలి అంటాడని భయపడ్తుంది. పెళ్ళి చేస్తారు బండారు గూడెం నుంచి భయపడి వచ్చేస్తుంది బాజి. భర్తను చూస్తే , మగవాడిని చూస్తే ఒణికి పోతుంటుంది. సంసారానికి పనికిరాని ఈ వస్తువు నాకొద్దు ‘మారు మనువు’ చేసుకుంటా నా ఓలి నాకిచ్చెయ్యండనే ఒత్తిడి పెరుగుతుంది.
కొన్నాళ్ళకు ఎవరెంత చెప్పినా భయం పోగొట్టులేక పిచ్చిదానిలా మారిపోతుంది. కులపోళ్ళంతా జాలిపడతారే గాని, పెద్దోళ్ళని ప్రశ్నించే ధైర్యం చెయ్యలేక పోతారు. ప్రాణాలు మిగలాలంటే ప్రశ్నించడం మానుకోవాలనే వాళ్ళ అనుభవం నేర్పింది. ఒకరోజు పిచ్చిదానిలా తిరుగుతున్న బాజిని చూసి లైంగికదాడి చేసినవాళ్ళు చాలా అసహ్యంగ మాట్లాడుతుటే కోపమొచ్చిన బాజి వాళ్ళపై ఉమ్మేస్తుంది. దాంతో అలగాజాతి దాని కింత అహంకారమా అని చావగొడతారు. ఎందరు ఆపినా ఆగరు. ఆ దెబ్బలకు బాజి చచ్చిపోతుంది. తిండీ,నిద్ర మానిన అర్భక శరీరం కదా! మాలచ్చిమికి బాజి గుర్తొచ్చినప్పుడల్లా కూతుర్ని రక్షించకోలేక పోయానే అనేబాధే.
గిరిజన సంస్కృతి
గూడెం గూడెమంతా కులకట్టులోనే వుండాలకుంటారు. కుల కట్టు బాటును అధిగమించిన వారికి పెద్దలంతా కూర్చుని పంచాయితీ జరిపి, తీర్పులివ్వడం ఆచారం.
పెద్దల తీర్పును పాటించనివారికి అంతిమంగా ‘వెలి’ వేస్తారు. ‘నీలి’ ‘దువ్వ’ లను ధిక్కరించారనే కోపంతో ‘వెలి’ వేస్తారు.
‘ఓలి’ అనే వివాహ పద్దతి వీరిలో వుంది. ఆడపిల్ల తండ్రికి (అది ధనరూపంలో నైనా, పందుల రూపంలోనైనా ఉండొచ్చు) ధనమిచ్చి, కొనుక్కుని తమ ఇంటికి తీసుకెళ్ళడం, పంది మాంసం. యాటమాంసాలు, కల్లు, సారాల ప్రవాహాలతో ఊరబంతులుండేవి. ఒక విధంగా చెప్పాలంటే ఊరందరికి పెళ్ళిళ్ళల్లో కడుపునిండా తిండి దొరికేదనొచ్చు. ఇక్కడ ఆడపిల్లల ఇష్టాయిష్టాలతో ప్రమేయం వుండదు. తండ్రీ, కొనుగోలు దారుల ఒప్పందాలలోనే నిర్ణయాలు జరిగిపోయేవి. కాదనే హక్కునీ, అవకాశాన్ని ఆయా కుటుంబ స్త్రీలకు ఇవ్వరు. కాదనే హక్కులేదని చావు దెబ్బల్ని బహుమతిగా ఇచ్చేవారు.
వీరిలో కూతుర్నే కాక, భార్యనుకూడా అమ్ముకునే హక్కును కులపెత్తందారులు ఇచ్చారు. ఎవరి భార్య మీదైనా మనసైనా కొనుక్కోవచ్చు. ఇక్కడ స్త్రీలు అభిప్రాయంతో ప్రమేయం లేదు. ‘ఓలి’ ఇచ్చి కొనుక్కున్న దానికన్నా ఎక్కువివ్వాలన్న లావా దేవీలుండేవి.
కనిపెంచిన పిల్లలమీద తల్లికి హక్కుండదు. పిల్లల్ని భర్త దగ్గరే ఒదిలేసి వెళ్ళాలి. పిల్లలు కావాలనకూడదు. పందిని లాక్కెళ్లి నట్లే లాక్కెళ్లి పోయేవారు. కడుపు శోకంతో ఆ తల్లులు విలాపాలు ఎన్నో ఈ నవలలో. మళ్ళీ కొనుక్కున్న వాడితో కాపురం చేసి, పిల్లల్ని కని, పన్లన్నీ చేయాల్సిన స్థితే వారి స్త్రీలది.
పెళ్ళయిన స్త్రీ, మరొకరి మీద మనసుపడి సంబంధం పెట్టుకుందని బయటపడితే. వాళ్ళిద్దర్నీ చెట్టుకు కట్టేసి, పంచాయితీ జరిపి, తప్పు ఏయించి ఊరబంతిపెట్టడం. పెద్దలకు పన్నుకట్టడం లాంటి తీర్పులుండేవి.
‘అర్లప్ప’ చిన్నకోడలు ఇలాంటి తప్పే చేసిందని చెట్టుకు కట్టేసి కూర్చున్న వాళ్ళపై మామ అర్లప్ప ఆగ్రహాన్ని వెలిబుచ్చుతాడు. దొరలు ఆమె భర్తను జైల్లో పెడితే, బావ వెంటాడుతుంటే తప్పించుకుంటూ. తనకు ఇష్టమైన వ్యక్తితో గడిపితే తప్పెట్లా అయింది. ఆమె మనసు, ఆమె జీవితం ఆమిష్టం. కాదనడానికి మీరెవరు? వయసులో వున్న పిల్లకు కోరికలు సహజం మగాడికి ఒప్పయినవి ఆడదానికి తప్పెట్లా అవుతయి. ఆ పిల్ల నెవరన్నా సహించేది లేదు అని ఆమె కట్లు విడిపించి ఆమె పక్షాన కులపెద్దలతో పోరాడుతాడు. కానీ, మామ మంచి తనాన్ని, కులపెద్ద అహంకారాన్ని మనవాళ్ళు అనుభవించొచ్చుగాని, ఇంకోకులపోడితో సంబంధమా అనే విషయాన్ని భరించలేక, బలహీన మనస్కురాలైన ఆమె ఇంటోకి పారిపోయి తనను తాను తగలబెట్టుకొని చచ్చిపోతుంది.
అగ్రకులాల వివాహవ్యవస్థ
భర్త చనిపోయినా, వదిలేసినా, ఇష్టంలేకపోయినా మరోపెళ్ళి చేసుకునే అర్హత మాలో వుండదని, మీరే నయం, నచ్చకపోతే వెళ్లిపోతారు. మారుమనువు చేసుకోవచ్చు అని ఒక బ్రాహ్మణయజమానురాలు, ‘మాలచ్చిమి’తో అంటే వాటివల్ల తమకులపోళ్ళు ఎంత నరకాలను అనుభవిస్తున్నారో, పిల్లలకోసం ఎంత అల్లాడిపోతున్నారో, తల్లిలేక పిల్ల పక్షుల రెక్కలెలా ఇరిగిపోతాయో వివరిస్తుంది. మీరు అమ్మాయి గోరి భర్త ఇడిసిపెట్టి ఇంకో పెళ్ళి చేసుకున్నాడని బాధపడ్తున్నారు నిజమే. కాని మీరనుకున్నట్లు మేం సుఖంగ లేము’ అంటుంది.
స్త్రీకి తనకు నచ్చిన వ్యక్తితో జీవించే హక్కున్నప్పుడే స్వేచ్చున్నట్లు సంతోషమున్నట్లు లెక్క అని తేల్చేస్తుంది.
అగ్రకులాల దౌర్జన్యాలు
తాము మోహించిన, ఆశించిన స్త్రీలను ఏమైనా చెయ్యొచ్చుననుకొనే దౌర్జన్యాలు. తమ భూములలో సాగు చేసినా. అడుగడుగునా బానిసలుగా చూసే వైనాలు. కంపేరుకున్నా, ఆఖరికి వల్లేట్లో చేపలు పట్టుకున్నా నేరమనే శాసనాలు. కొరడా దెబ్బలు, చంపడానికైనా వెనుదీయని క్రూరత్వాలు, ప్రశ్నించిన నేరానికి, చేయని నేరాన్ని అంటగట్టి ‘దువ్వ’ను క్రూరంగా చావగొట్టిన పైశాచికత్వాలు, బాజిలాంటి మొగ్గల్ని అనుభవంచిన దుర్మార్గాలు ఈ నవలనిండా వున్నాయి.
మానవ సంబంధాలు
ఈ నవల అపురూపమైనది కావడానికి ప్రధాన కారణం రచయిత్రి మానవసంబంధాలను విశ్లేషించిన తీరే! కుటుంబజీవితాల్లో నాయనమ్మ తాతయ్యల మధ్యనుండే అనుబంధాలు, తల్లీ పిల్లల అనురాగాలు. తోటి స్త్రీ పట్ల స్త్రీలకుండే మమకారాలు, సహస్పందనలు. పిల్లలపై పెద్దలు చూపించే అనురాగాలు, లేమి ఇంట్లోనే కాని అనుబంధాల లేమికాదని, లేదని నిరూపించే ఎన్నో ఘట్టాలు, సంఘటనలు, కళ్లు చెమర్చే, గుండెను తడిపేసే, ఆర్ద్రతను కురిపించే జీవన పార్శ్వాలనెన్నింటికో ఈ నవల వేదిక ఐంది. ‘నీలి’ తల్లి కోమల పరిపూర్ణమైన స్త్రీ ఈ సమాజాన్ని ఎట్లా చూడాలో జీవితాన్ని ఎట్లా హాయిగా గడపొచ్చో, స్త్రీ తన వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ, సాధికారికతను ఎలా సంపాదించుకోవచ్చో, ఆత్మగౌరవాన్ని ఎలా కాపాడుకోవచ్చో, ఆత్మ విశ్వాసంతో బ్రతకడమెలాగో నిరూపించి, తన కూతురు ‘నీలి’ని ఒక బలమైన ‘వ్యక్తిత్వమున్న స్త్రీగా తీర్చిదిద్దుతుంది.
అగ్రవర్ణాల అవినీతులు
బుధవారం నాడు ఆడపిల్ల పుడితే అరిష్టమనే మూఢనమ్మకంతో ‘మాలచ్చిమి’ని గొల్ల కులం వాళ్ళు వదిలేస్తే ఎరికల గూడెంలో పెరిగింది ‘దువ్వ’ కూడా అనుకోకుండా పెళ్ళి కాకముందే తల్లయిన అగ్రవర్ణ స్త్రీకి పుట్టిన పసికందే. వడ్లగింజేస్తావో, పెంచుకుంటావో, ఇస్తావో, పారేస్తావో నీ యిష్టం అని మంత్రసాని మాలచ్మికి యిచ్చేస్తారు. పండులాంటి పిల్లాడని పారెయ్యలేక, ఆళ్ళ యీళ్ళ దగ్గర పాలడిగి పెంచుతుంది. ఇలా ఉన్నత కులాలనుకుంటున్న వాళ్ళల్లో పుట్టి కూడా, విసిరి వేయబడటం వల్ల ఎరుకలోళ్ళ కష్టాలన్నీ పడతారు. అవినీతులు గా కాక అవి -నీతులుగా చెలామణియైన ధాఖలాలు.
భాష
కృష్ణాజిల్లాలోని ‘ఎరుకలోళ్ళు’ మాట్లాడే యాసతో నవలంతా ఉంటుంది. చుట్టూవున్న ప్రకృతిలోని, పశుపక్ష్యాదుల, జంతువుల ఉపమానాలు ఎక్కుగావున్నాయి. జానపదులశైలి ఇది సామెతలు, జాతీయాలు, పడికట్టు పదాలతో స్వభావోక్తి అలంకారాలు ఎక్కువగా వున్నాయి. శరవేగంతో ఆద్యంతమూ చదివించే లక్షణమున్న రీతి ఇది.
మూఢ నమ్మకాలు
ఊళ్లో పశువులకు జబ్బులు తగులుతున్నాయి. వీటికి క్షుద్రదేవతలు కారణమని, ఆ దేవతల్ని వూళ్లోకి రాకుండా చెయ్యలంటే పొలిమేర మీదవున్న పోలేరమ్మకు బలి యివ్వాలని జాతర చేయాలని వూళ్ళోవాళ్ళు తలపెట్టారు.
ఒక బండిమీద అన్నం గుండిగలతో వండిపెట్టారు. బండిని కట్టిన ఎడ్లని అలంకరించి, గులాం చల్లి, పాముగారడీల విన్యాసాలు చేస్తూ, డప్పులు కొట్టుకుంటూ, వీరంగం తొక్కుతున్నారు. డప్పుల శబ్దాలకు లయబద్దంగా వూగుతూ, పూర్తిగా తాగివుండి వీరతాడుతో బాదుకుంటున్నారు. యిసకేస్తే రాలనంత జనం.
పోలేరమ్మ గుడిముందు అన్నపురాశి కుంభంపోశారు. ఎంకన్న, బిచ్చాలు వొచ్చి గొయ్యితవ్వి అందులో పందితల మాత్రం బయట కుండేటట్టు పాతేసి వెళ్ళిపోయారు. మేకను ఒక పెద్ద రాయి మీద మెడ ఆనేటట్టు పట్టుకున్నారు. యెట్టి బసవయ్య ఒక్క దెబ్బతో తలనరికాడు. అన్నిటికన్నా ముందు ఆ వూరి పెద్ద పశువులే వెళ్ళాలి అది రివాజు.దాన్నెవరూ కాదనరు అవినున్నగా నూనెగారే మాళీ గేదెలు, ఎద్దులు, గిత్తలు, దూడలు అన్నీ ముందుగా పంది తలమీదుగా వెళ్ళాయి ఒక మాళీగేదే కాలు పంది ముట్టెమీద పడటంతో అంత వరకూ గింజుకుంటున్న దాని తల పక్కకి వాలింది ఘోరంగా నెత్తురు కారుతూ. ఆ తరువాత అందరి పశువులు పంది మీదుగా వెళ్లాయి. చిట్ట చివరికి మేకలు, గొర్రెలు (పేదోళ్ళవి) చితికినపంది తలమీదనుంచి బెదురుగా పందికి తగలకుండా గెంతుకుంటూ వెళ్ళి పోయాయి.
‘పెలుగు పెమాణాలు’ వాళ్ళు ప్రామాణికంగా తీసుకొనె పద్దతి.
మతాంతర వివాహం
కత్రేణి మాలపిల్ల. సిలారు అనే సాయిబు ఇష్టపడి వూర్నించి పారిపోయి, పెళ్ళి చేసుకుంటారు. కత్రేణిని వూరు వెలేసింది. ‘సిలారు’ మొదట్లో చూపిన ప్రేమ తగ్గిపోయాక, ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత, అమ్మ నాన్నల ప్రోద్బలంతో ఈమెను విడిచిపెట్టి వేరే సాయిబు పిల్లని చేసుకుందా మనుకుంటాడు. మిత్రుడు మస్తాను, అసెంబీలు అతనికి నచ్చచెప్పి మార్చడానికి ప్రయత్నిస్తారు. విసుగుతో దురలవాట్లకు బానిసై, కత్రేణి పాలిట యముడౌతాడు. కొడుకు ‘నబి’ తండ్రి అడుగుజాడల్లో నడిచి, ‘ఉరుములు’ అనే ఆమెతో పెళ్ళయినా, ఆమెను చాలా హింసల పాలు చేస్తాడు.కత్రేణి కూతురు హిందువును ప్రేమించి ఇంట్లోంచి పారిపోతుంది ఏమైందో తెలీదెప్పటికీ, కూతురులేచి పోయిందన్న అవమానంతో ఉరేసుకుంటాడు సిలారు. బతికి, చచ్చి రెండు విధాల కత్రేణిని కష్టాలపాలు చేస్తాడు.
కత్రేణి బలమైన వ్యక్తిత్వమున్న స్త్రీగా పరిణతి చెందిన రీతి ఈ కథలో కన్పిస్తుంది. కోడలిని కూతురికంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. తోటి స్త్రీగా ఆమె స్థితిని అర్థం చేసుకుంటుంది. ‘దువ్వ’ నీలి సహజీవనాన్ని ప్రోత్సహిస్తుంది.
ఆహార పద్దతులు
కొయిలారంలోని ఆ గిరిజనుల ప్రధాన ఆహారం పులినీళ్ళే! ఎప్పుడన్నా పరికిరి, ఒట్టి చేపలు, చింతచిగురు పచ్చడి, చింతపులుసు, చిట్టుడుకునీళ్ళు, ఎప్పుడన్నా వరన్నం వరికేళ్ళు ఏరోజు కడుపునిండా తిన్న దాఖలాలు లేవు భర్తకూ, ఇంట్లోని పెద్దవాళ్ళకూ, పిల్లలకూ పెట్టగామిగిలిన కొద్దిపాటి దానితోనే సరిపుచ్చుకునే వారు ఎరుకల స్త్రీలు.
వృత్తులు -వ్యాపకాలు
స్త్రీలు, బుట్టలల్లడం, సోది చెప్పడం, ఇళ్లళ్లో పనులు చేయడం చింత చిగురు కోసుకొచ్చి పోగుల చొన ఊళ్ళో తిరిగి అమ్మడం. ఈనెలు తీయడం ప్రధానంగా పందుల పెంపకం వారి వృత్తి. పందుల్ని కాయడం, వాటి పోషణ చేయడం, వారి ఆస్తిపాస్తుల కొలమానాలు కూడా పందులే. పురుషులు దొరల ఇళ్ళలో పనులు చేయడం, కాపలా ఉండటం, సాయంత్రమయ్యెసరికి తాగడం. బలికి పందుల్ని వేయడం. జాతరల్లో సాముగారిడీలు చేయడం, స్త్రీలపై పెత్తనం చేయడం. స్త్రీలను తమకు సంబంధించిన, క్రయవిక్రయాలు చేయదగిన వస్తువులుగా పరిగణించడం.
వివాహ పద్దతులు
ఊరందరూ పొరుగూరికి వచ్చి, ఊరబంతి భోజనాలు, పెళ్ళి కుమార్తెను ఉన్నంతలో ముళ్ళ గోరింట పూలు, కనకాంబరాలతో అలంకరించి, పెళ్ళి చేసిన తర్వాత ఆమెకు తోడుగ ఇద్దరు ముగ్గురు వెళ్ళి సాగనంపి రావడంతో ఆ పిల్ల మాది కాదనుకుంటారు. ఆడపిల్లలకు అతి చిన్న వయస్సులోనే పెళ్ళి చేస్తారు. మారు మనువులు మాములే.
అంతర్వాహిని
ఈ నవలనిండా అంతర్వాహినిగా వ్రవహిస్తున్నది. స్త్రీవాద దృక్పథమే.
వర్గచైతన్యమూ, సామాజిక తిరుగుబాట్లవల్లనే సమస్యలు పరిష్కరింపబడతాయనే వాస్తవాలే.
1. స్త్రీవాదం
మాలచ్చిమి స్త్రీలందరి తరువునా వకాల్తా పుచ్చుకున్న లాయర్‌లా, నవలంతా ఆవరించి వుండి, విషయవిశ్లేణ చేస్తూ తిరుగుబాటు బావుటాతో పోరాడుతూనే వుంటుంది.
ఎల్లి శారీరక మానసిక దాడులకు ఎదురు తిరిగి జీవించి తిరిగి జీవిద్దామనే అనుకుంటుంది కానీ, పిరికివాడైన జీవాలు వల్ల, స్వార్థ పరుడైన తండ్రివల్ల తిరిగి నరకకూపంలోకే నెట్టివేయబడుతుంది.
ఎల్లి
‘ఎల్లి మానసిక పరిణామ క్రమాన్ని చిత్రించడంలో రచయిత్రి ప్రతిభ కనబడుతుంది.
పారోతి తనను తాగుడు మత్తులో అమ్మిన భర్తపై తిరగబడి, మాలచ్చిమి యిచ్చిన ధైర్యంతో, తన పిల్లలకి దూరం కాకుండా, తనకుటుంబాన్ని నిలుపుకుంటుంది. నన్ను అమ్మే హక్కు నీకులేదు? అని తీవ్రంగా ప్రశ్నిస్తుంది. కొన్న వాడు పారిపోయేలా చేస్తుంది.
కోమల పాత్ర తెలివైన పాత్ర. తనకేంకావాలో ఆ స్త్రీకి తెలుసు. లోకంలో బ్రతకాలంటే కొంత లౌక్యమూ తెలివితేటలుండాలని నమ్మిన పాత్ర కష్టాల్లో కూడా సుఖంగా ఎలా జీవించవచ్చో నిరూపించిన పాత్ర. ఆత్మగౌరవాన్ని ఎక్కడా కోల్పోని ధీర వనిత ‘నీలి’కి పోరాట పటిమ నేర్పిన చాతుర్య మామెది. మనసుకేదిష్టమో, ఏం చేస్తే నువ్వు సంతోషంగా వుంటావో అదే చెయ్యి అని కూతురికి రకరకాల సందర్భాల్లో వివరించి చెబ్తుంది.
నీలి
తండ్రి డబ్బుకాశపడి సంసార యోగ్యం కాని వాడికిచ్చి పెళ్ళిచేస్తాడు. బావ తన కోర్కె తీర్చమని వెంటబడితే, చావదన్ని పారిపోయి వస్తుంది. అన్న చేస్తున్న అరాచకాన్ని చూడలేక ఆమె భర్త ఆత్మహత్య చేసుకుంటాడు. ఓలి తిరిగివ్వమనీ లేదా నీలిని పంపమని వస్తే, వారికి తగిన సమాధానమిచ్చి కత్తితో తెగనరుకుతానని బెదిరించి కూతురికి ఇష్టమైన వ్యక్తితో పెళ్ళి చేయాలనుకుంటుంది. ‘దువ్వ’ నీలిని ఇష్టపడటంతో సంతోషిస్తుంది. ఊరి కామందులు ‘దువ్వ’ని చంపడానికి ప్రయత్నించినప్పుడు. వూరందరి కంటే ముందు తల్లీ కూతుళ్ళే అతడి రక్షణ బాధ్యత తీసుకుంటారు. అతడికి ఆస్పత్రిలో సేవలు చేయడానికి, పెళ్ళి కాకుండా కూతురు అతనితో సహజీవనం చేయడానికి ఏమాత్రం అభ్యంతరం చెప్పదు. ఈ కట్టుబాట్లు , ఆచారాలు కావు ముఖ్యం. మనసెరిగిన మనిషితో జీవించడమే ముఖ్యం అంటుంది. తల్లి పెంపకంలో నీల తమను వెలేస్తామన్న పెద్దలకు తగిన సమాధానం చెప్పడమేకాక ధైర్యంగా ముందడుగువేస్తుంది.
వర్గచైతన్యమూ
అనేకానేక సన్నివేశాల్లో, సంభాషణల్లో, ఉన్నత వర్గ, దిగువ, ఎగువ తరగతుల్లో చైతన్యం రావాల్సిన అవసరాన్ని, స్థితినీ ఈ నవల చర్చించింది. సూచించింది.
సామాజిక తిరుగుబాటు
‘దువ్వ’ ఆద్యంతమూ తిరుగుబాటు ధోరణితో, మృత్యు శిఖరాలకు వెళ్ళినా, వెనుతిరిగి వచ్చాడు. ‘ఎల్లి’ జీవితాన్ని మార్చడానికి అహరహమూ మాలచ్చిమి తో పాటు పోరాడుతాడు. జీవాలు పిరికితనాన్ని ఎంకన్న అవకాశవాదతనాన్ని అస్యహించుకుంటాడు. దొరల దురాగతాలకు ఎదురు తిరుగుతునే వుంటాడు. స్త్రీలపట్ల దయ, గౌరవమూ వున్న వాడు స్త్రీలను కించపరిచిన సందర్భాలన్నింటినీ ప్రతిఘటించినవాడు స్వార్థరహితుడు. తిరుగుబాటొక్కటే పోరుబాటని, సమసమాజంలోనే అది సాధ్యమని నమ్మి తనను ఒణికించబోయిన పంచాయితీని వణికేట్లుగా చేసి, తనకిష్టమైన నీలితో కొత్త జీవిత్తాన్ని కొనసాగించడానికి ముందడుగు వేసినవాడు.
గిరిజనుల వైద్యవ్యవస్థ
మాలచ్చిమి ఆకులు, పసర్లు చెట్ల బెరడులతో మందులు తయారుచేసి తన దగ్గరున్న చెక్క పెట్టెలో భద్రంగా దాచేది. ఆ చుట్టు పక్కల అన్ని ఊళ్ళకూ మంత్రసానిగా పనిచేసేది. మాలచ్చిమి వచ్చిందంటే తల్లి బిడ్డ క్షేమం అనుకునే వారు. కళ్ళు కనిపించకుండా పోయాక కూడా , తన వైద్యానుభవంతో మందులుస్తూ వుంటుంది. గర్భస్రావం కొరకు పెద్దింటోళ్ళు కూడా మాలచ్చిమి దగ్గర కొచ్చి రహస్యంగా మందులు తీసుకెళ్ళేవాళ్ళు. ఒకసారి ఒక పెద్దింటి పిల్ల కొరకు మందుకొచ్చినా సకాలంలో రాకపోవటం వల్ల ఆ పిల్ల చనిపోతుంది. మాలచ్చిమి దువ్వ- మరణం ఎవరిదైనా మరణమే కదా అని దు:ఖిస్తారు’.
‘సంచికట్టోడు’ అని పిలుచుకునే వ్యక్తి కూడా వారి వైద్యుడే. సుబ్బన్నకూ, దువ్వకూ వైద్యం పసర్లతో చేశాడు. అతడివైద్యం మీద ఊరందరికీ బాగాగురి. వీళ్ళిద్దరనీ మించి వైద్యులు లేరు వారిదృష్టిలో. బయటి ప్రపంచంలో ఉన్న ధర్మాసుపత్రి వైద్యమంటే ఎంతో వైద్యం చేసుకున్నట్టే. అక్కడి వరకూ వెళ్ళే శక్తిని లేని వాళ్ళే. ఆయువుంటే బతుకుతాడు లేకుంటే లేదన్న నమ్మకంతోనే బతుకులు వెళ్ళదీస్తుంటారు. మూలికలు, ఆకులలములే వాళ్ళ ప్రధానవైద్యం.
ఒక అభిప్రాయం »సాహిత్య వ్యాసాలు
sandeep Apr 16, 2009 1
మంచి విశ్లెషణ. నవల చదవాలనిపపి0చి0ది.