May2009
చిన్ననాటి జ్ఞాపకాలు
ప్రతివారికీ తమ చిన్నప్పటి సంగతులు కొన్నయినా గుర్తుంటాయి; బాల్యస్మృతులన్నీ గడిచిపోయిన కాలానికీ, సంఘటనలకూ, అనుభవాలకూ ఆనవాళ్ళుగా మనసులో నిలిచిపోతాయి. అయితే ఇవన్నీ సామాన్యంగా మూడేళ్ళ ప్రాయంనుంచీ మొదలవుతాయి; అంతకు మునుపటి సంగతులు మనకు గుర్తుండటం చాలా అరుదైన విషయం. ఆ తరవాతివైనా ఏడేళ్ళ వయసు వచ్చినదాకా అక్కడా ఇక్కడా స్మృతుల శకలాల రూపంలోనే మనసులో మెదులుతాయే తప్ప పూర్తిగా గుర్తుండవు. ఇలా ఎందుకు జరుగుతుంది? పుట్టక ముందునుంచీ మనకు మెదడంటూ ఉన్నప్పుడు తొట్టతొలి జ్ఞాపకాలకు ఒక హద్దు వంటిది ఎందుకేర్పడుతుంది? దీన్ని గురించిన అనేక శాస్త్రీయ ప్రతిపాదనలు కనిపిస్తాయి. వాటిని చర్చించే ముందుగా పుట్టినప్పటినుంచీ మన మెదడు నిర్మాణంలో ఎటువంటి మార్పులు కలుగుతాయో చూద్దాం.
పుట్టినప్పుడు మన మెదడులో సుమారుగా పదివేల కోట్ల నాడీకణాలుంటాయి. ఇది రమారమి మన పాలపుంతలో ఉన్న నక్షత్రాల సంఖ్యతో సమానం. అయినప్పటికీ ఆ స్థితిలో మెదడు పూర్తిగా తయారవదు; అది సరిగ్గా పనిచెయ్యాలంటే నాడీకణాలమధ్య సంబంధాలు నెలకొనాలి. శిశువుకు ఇంద్రియాలద్వారా అనుభవం పెరుగుతున్నకొద్దీ ఈ లంకెలు ఏర్పడుతూ ఉంటాయి. సామాన్యంగా రెండేళ్ళ వయసుగల పిల్లలకు పెద్దవారి మెదడులో ఉన్నన్ని లంకెలు తయారవుతాయి; ఈ సంఖ్య మూడేళ్ళు వచ్చేసరికల్లా రెండింతలవుతుంది. ఈ అదనపు సంబంధాలన్నీ కొన్నేళ్ళలో యుక్త వయస్సు వచ్చేలోపున క్రమంగా అంతరించిపోవడంతో కావలసినన్ని మాత్రమే మిగులుతాయి.
జ్ఞాపకశక్తివంటిది పసితనంలోనే మొదలవుతుంది. రెండు నెలలకే శిశువులకు ధ్వనుల్లోని తేడాలు తెలియనారంభిస్తాయి. నాలుగు నెలలు నిండేసరికి పసిపిల్లలు తమకు వినబడుతున్న ధ్వనులన్నిటికీ స్పందిస్తారు. 8-9 నెలలకు వారికి బంతిని దొర్లించడంవంటి విషయాలు అనుభవ పూర్వకంగా గుర్తుంటాయి. మరొక నెల తరవాత పిల్లలు తామే శబ్దాలను పదాలుగా పలకనారంభిస్తారు. సంవత్సరం గడిచాక ఎవరైనా దేన్నైనా చూడమనగానే అటుకేసి తిరగడం అలవాటవుతుంది. ఏడాదిన్నర పిల్లలకు దాచి, కనబడకుండా ఉంచిన వస్తువులను గుర్తుపెట్టుకుని వెతకడం తెలుస్తుంది. రెండేళ్ళు నిండాక పిల్లలకు ఇష్టులకూ, అయిష్టులకూ తేడా తెలుస్తుంది; ఇష్టమైనవారి నుంచి వేరైతే ఏడుస్తారు. రెండున్నరేళ్ళ తరవాత పిల్లలకు ఏ వస్తువు ఎక్కడుందో గుర్తుండనారంభిస్తుంది. పరిసరాల గురించిన అవగాహన ఏర్పడుతుంది. మూడేళ్ళనుంచీ పిల్లలు ఒకేసారిగా వేరువేరు అనుభూతులను పొందగలుగుతారు; ఉదాహరణకు ఏ దీపావళి ఉత్సాహం మధ్యలోనో వేసుకున్న కొత్త బట్టలు పాడవడం వంటిది జరిగితే కాస్త నొచ్చుకుంటారు.

మెదడులోని లింబిక్ వ్యవస్థ
ఈ సందర్భంలో మెదడులోని కొన్ని నిర్మితుల సంగతి తెలుసుకోవాలి. మన జ్ఞాపకశక్తికీ, భావోద్వేగాలకీ, ప్రేరణలకూ ఆధారమైన గ్రంథులతో కూడిన లింబిక్ వ్యవస్థ మన మెదడులో మస్తిష్కమూలానికి ఎగువన ఉంటుంది (పటం). ఇది అతి ప్రాచీన ప్రాణుల్లో కూడా కనబడుతుంది కనక దీని పాత్ర ప్రాథమికమైనది. ఎవరైనా “పశువులా” ప్రవర్తిస్తే అందుకు కారణం ఇదేనని అనుకోవచ్చు. వాసన పసికట్టడం, తన అజమాయిషీగల ప్రాంతాన్ని సంరక్షించుకోవడం, వేటాడి చంపడం మొదలైన పురాతన జంతువుల కార్యకలాపాలకు ఇది పనికొస్తూ ఉండేది. మనవంటి ప్రాణుల్లో ఈ వ్యవస్థలోని స్పందనలు పెద్ద మెదడుకు చేరుతాయి. ఇందులోని గ్రంథులన్నిటికీ పరస్పర సంబంధాలుంటాయి.
వీటిలో హిపోకేంపస్ జ్ఞాపకశక్తికి కేంద్రం వంటిది. అమిగ్డలావల్ల భయమూ, ఆగ్రహమూ, దాడి చేసే నైజమూ కలుగుతాయి. ప్రమాదస్థితిలో ఆత్మరక్షణకై పారిపోవాలో, నిలిచి పోరాడాలో తేల్చుకో వలసివస్తుంది. హైపోథాలమస్ ఆకలినీ, దాహాన్నీ, శరీరపు ఉష్ణోగ్రతనూ, లైంగికవాంఛలనూ నియంత్రిస్తుంది. భయాందోళనలకు కారణమైన ఇంద్రియసంకేతాలు థాలమస్‌కు చేరగానే అది వాటిని మెదడు పైపొరకు చేరవేస్తుంది. తత్ఫలితంగా గుండె వేగమూ, రక్తపోటూ పెరగడమూ, ముచ్చెమటలు పొయ్యడమూ, ఒత్తిడిని బట్టి హార్మోన్లు విడుదల కావడమూ మొదలైనవన్నీ జరుగుతాయి. జ్ఞాపకశక్తి విషయంలో హిపోకేంపస్ కేవలం టేప్‌రికార్డర్‌లా పనిచేస్తుందనీ, అందులో నమోదైన సంగతులు మెదడు పైపొరకు (కార్టెక్స్) చేరితేతప్ప అది దీర్ఘకాలంపాటు గుర్తుండే విషయంగా మారదనీ అంటారు.
చిన్నపిల్లల్లో హిపోకేంపస్ సరిగ్గా ఎదిగి ఉండదనీ, అందువల్లనే మరీ పసితనపు సంఘటనలు మనకు గుర్తుండవనీ కొందరు పరిశీలకుల అభిప్రాయం. నమోదే కానటువంటి విషయాలు గుర్తుకు తెచ్చుకునే ప్రశ్నే తలెత్తదని వీరి వాదన. మరికొందరి లెక్కన ఇందుకు భాష రాకపోవడమే కారణం కావచ్చు. పసివారు తమ అనుభవాలను మాటలతో వ్యక్తీకరించలేరు గనక తమకు జరిగిన అనుభవాలను సంకేతరూపంలో గుర్తుంచుకుని అర్థం చేసుకోలేరనేది వీరి ప్రతిపాదన. అంతమాత్రాన చిన్నపిల్లలకు ఏదీ గుర్తుండదని కాదు. పాకడం, నడవడం, మాటలు పలకడం మొదలైన పనులన్నిటికీ అవసరమైనంత మేరకు వారి జ్ఞాపకశక్తి పనిచేస్తూనే ఉంటుంది.
చిన్నప్పుడు మనకు ఎదురైన అనుభవాల ప్రభావం సున్నితమైన మనస్థితిమీద తీవ్రంగా పనిచేస్తుందనీ, చిన్నతనంలో మనకేదైనా ప్రగాఢమైన అనుభూతి కలిగితే అది జీవితాంతం మనను ప్రభావితం చేస్తుందనీ అంటారు. పెద్దయిన తరవాత మనం ఒత్తిడికి తట్టుకునే పద్ధతీ, భాషల విషయంలో సౌలభ్యమూ మొదలైన విషయాలన్నీ పసితనపు సంఘటనలమీద ఆధారపడతాయనే ప్రతిపాదన ఉంది. అలాంటప్పుడు బాల్యదశలోని సంగతులు మనకు గుర్తుండకపోవడం ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏది ఏమైనా పిన్నవయసులో జరిగినవాటి గురించిన స్మృతులన్నీ అస్పష్టంగా రూపొందుతాయనే విషయంలో మాత్రం సందేహం లేదు.
ఎలుకల విషయంలోకూడా ఇలాగే జరుగుతుందని ప్రయోగాల్లో రుజువైంది. ఫలానా స్థలంలోకి ప్రవేశిస్తే ప్రమాదం అనే సంగతి ప్రయోగాలద్వారా కొన్ని ఎలుకలకు తెలిసేలా చేశారు. వాటిలో వయసొచ్చిన ఎలుకలన్నీ ఎన్నాళ్ళు గడిచినా ఈ సంగతి గుర్తుంచుకుని మళ్ళీ అక్కడికి రాకుండా జాగ్రత్తపడ్డాయి. ఎదగనివి మాత్రం ఆ సంగతి వెంటనే గుర్తుంచుకున్నాయి కాని, మూడు వారాలు గడిచేసరికల్లా అదంతా మరిచిపోయినట్టే ప్రవర్తించాయి.
జ్ఞాపకశక్తిని గురించిన పరిశోధనలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. కొన్ని జ్ఞాపకాలు మరుగున పడడం, జరిగినవి మరికొన్ని బాగా గుర్తుండటం వగైరా వివరాల గురించిన పరిశీలనలన్నీ వయసు మళ్ళినవారి మీదా, కొన్ని రకాల మానసికవ్యాధులకు లోనయిన వారి మీదా జరుపుతారనీ, అటువంటి సందర్భాలకు వర్తించే ప్రతిపాదనలూ, సిద్ధాంతాలూ పసితనపు జ్ఞాపకశక్తిని అర్థం చేసుకోవడానికి పనికిరావనీ కొందరంటారు. పసిపిల్లల విషయంలోనేకాక జంతువులూ, పక్షుల విషయంలోకూడా జ్ఞాపకశక్తిని గురించిన కొత్త వివరాలు తెలియరావటంతో శాస్త్రవేత్తలకు పని పెరుగుతోంది. అందువల్ల దీన్ని గురించిన తర్జనభర్జనలు ఎటువంటివో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.
ఏదైనా నేర్చుకోవడానికి చిన్నతనమే తగిన వయస్సనిపిస్తుంది. మనదేశపు సంప్రదాయంలో ముందు ప్రతిదాన్నీ మంత్రాల్లాగా “భట్టీయం” వేయించడం పరిపాటి. ఆ దశలో ఏం నేర్పుతున్నారో ఏమీ అర్థంకాదు. ఆ పద్ధతిలో కంఠతా పట్టినది మరిచిపోము కనక నేర్చుకున్నదేమిటో ఆ తరవాత సావకాశంగా అర్థమౌతుంది. చిన్నప్పుడు మన మెదడుకు మైనంలా రూపాన్ని మార్చుకోగల మైశీల గుణం ఉంటుంది కనకనే చదువూ, రకరకాల నైపుణ్యమూ చిన్నతనంలోనే త్వరగా అబ్బుతాయి. ఇక్కడ “చిన్నతనం” అంటే అయిదారేళ్ళ వయసు అని అర్థం; అంతకు మునుపటి విషయాలు గుర్తుండవనేది తెలిసినదే. జ్ఞాపకశక్తి వికసించే క్రమంలో ఇదొక విచిత్రమైన పరిణామం. ఒకరకంగా చూస్తే పెద్దయాక మనకు “పనికొచ్చే” చిన్నప్పటి విషయాలే గుర్తుంటాయనిపిస్తుంది. చిన్నప్పుడు ఏ సంవత్సరంలో ఏ పండగ నాడు ఏయే మిఠాయిలు తిన్నామో కలకాలం గుర్తుండకపోతే మనకొచ్చే నష్టమేమీ లేదు. ఏనాడో కంఠతా పట్టిన ఎక్కాలవంటివి మాత్రం బాగా గుర్తుంటాయి.
పసితనంలో ఏం జరిగిందో మనలో ఎవరికీ జ్ఞాపకం ఉండదు. దీన్ని మతిమరుపు అనాలా? వృద్ధాప్యం బాగా ముదిరినప్పుడు మళ్ళీ ఇంకొకరకం మతిమరుపు మొదలవుతుంది. ఎటొచ్చీ వయసుమళ్ళినవారు ఒకప్పుడు గుర్తున్న విషయాలు మరిచిపోతారుగాని, మరీ చిన్నప్పటి సంగతులు ఏ దశలోనూ ఎవరూ జ్ఞాపకం పెట్టుకున్నట్టుగా అనిపించదు. అందరిలాగే పసిపిల్లలు కూడా ఎన్నెన్నో అనుభవాలు పొందుతారుకాని అవేవీ మనసులో నిలిచినట్టుండవు. ఏ వయసులో నైనా జ్ఞాపకశక్తికి ఆధారం మెదడే కనక ఈ రెండురకాల పరిస్థితుల్లోనూ మెదడు స్వరూపం ఎలాంటిదో తెలుసుకోవాలి.
పసిపిల్లల మెదడులోని కణజాలం అపరిపక్వంగా ఉంటుంది; ఉదాహరణకు దృష్టికి సంబంధించిన మెదడుభాగాలు పుట్టిన తరవాతగాని ఎదగవు. అలాగే మేధోవల్కలంలోని నాడీ కణాలకు ఉండే మయెలిన్ కొవ్వుపొర అన్నిటికీ పూర్తిగా రూపొంది ఉండదు. అయితే జ్ఞప్తి విషయంలో కేంద్రంలా పనిచేసే హిపోకేంపస్ మాత్రం పుట్టేసరికే దాదాపు పూర్తిగా ఎదిగి ఉంటుంది. అందుచేత పసివారికి ఏదీ గుర్తుండకపోవడానికి కారణం హిపోకేంపస్ అయిఉండదనీ, వారి మెదడుయొక్క నొసటి, కణత భాగాలు సంపూర్ణంగా వృద్ధి చెందకపోవడం వల్లనేమోననీ కొందరు విశ్లేషకులంటారు. వృద్ధాప్యంలో మతిమరుపు పెరగడానికి మెదడులోని నాడీకణాల సంఖ్య తగ్గడం ఒక్కటే అంత ముఖ్య కారణం కాకపోవచ్చనీ, ఉన్నవాటి మధ్య ప్రక్రియల్లో జరిగే మార్పులే అందుకు దారితీస్తాయనీ పరిశోధనలు తెలుపుతున్నాయి.
పసితనంలో జరిగినవన్నీ గుర్తుండాలంటే భాష రావడం ముఖ్యమని వాదించేవారు మన తొట్టతొలి జ్ఞాపకాలన్నీ మాటలు నేర్చే (మూడు, నాలుగేళ్ళ) వయసునుంచే మొదలవుతాయని చెపుతారు. అనుభవాలను మననం చేసుకోవడానికి భాష మీద కొంత పట్టు ఉంటే తప్ప వీలవదు కనక ఇందులో కొంత నిజం ఉండవచ్చు. అయితే నెలలు నిండని పసివారు కూడా అభ్యాసం ద్వారా కొన్ని చిన్న విషయాలు గుర్తుంచుకోవడం చూస్తే ప్రతిదానికీ భాష అవసరం ఉండకపోవచ్చునని కూడా అనిపిస్తుంది. అలాగే రెండేళ్ళ పిల్లలకు ఆరునెలల కిందటి సంగతులు చెపితే గుర్తుకొస్తాయని రుజువయింది. ఇంత జరిగినప్పటికీ పెద్దవుతున్నకొద్దీ చిన్నప్పటి సంగతులు గుర్తుకు రాకుండా పోతాయి.
దీనికి మరొక కారణం కూడా ఉండవచ్చని కొందరి అభిప్రాయం. మరీ పసివారంగా ఉన్నప్పుడు మనకు పరిసరాల గురించిన అవగాహన వేరుగా ఉంటుంది; ఉదాహరణకు మన శరీరం ప్రమాణాన్ని బట్టి మామూలు వస్తువులు కూడా పెద్దపెద్దవిగా అనిపిస్తాయి. మనం పెద్దవుతున్నకొద్దీ ఇటువంటి భావనలు తగ్గిపోతూ ఉంటాయి; వస్తువులనూ, పరిసరాలనూ గురించిన గుర్తులేవీ పాతపద్ధతిలో కనిపించవు. ఒకప్పుడు మెదడుకు గుర్తుకు తెచ్చే సంకేతాలన్నీ త్వరలోనే మాయమై, వాటి స్థానే ఎప్పటికప్పుడు కొత్తరకం చిహ్నాలు ఏర్పడినట్టుగా అనిపిస్తుంది. మొదట్లో జ్ఞాపకాలకు పనికొచ్చిన తాత్కాలిక ఆధారాలన్నీ రూపాంతరం చెందడంతో తొలి స్మృతులన్నీ వాటితోపాటే మాయమైపోతాయి. మరొక ప్రతిపాదన ఏమిటంటే జరిగినదాన్ని గుర్తుంచుకోవడానికి సంఘటనలను స్మృతులుగా ఒకదానివెంట ఒకటిగా మనసులో పునర్నిర్మించుకోగలిగి ఉండాలి. ఇందుకు సరిపోయేంత అనుభవం మరీ చిన్నపిల్లలకు ఉండదు. మరొక చిక్కేమిటంటే చిన్నపిల్లలు సామాన్యంగా జరిగినవాటిని గురించి తామే చెప్పరు. అటువంటివాటిని గురించి గుర్తు చేస్తూ వారిని ప్రశ్నలు అడుగుతున్నప్పుడు వారి జ్ఞాపకాలు ప్రభావితం అయే అవకాశం ఉంటుంది.
చిన్నప్పటి విషయాలన్నీ అంతర్గతంగా గుర్తుంటాయే తప్ప ప్రత్యక్షపద్ధతిలో అవగాహనకు లోనవవు కనక అవి జ్ఞాపకాలుగా నమోదు కాలేవనే సిద్ధాంతమూ ఒకటి ఉంది. ఈ పరిశీలనలన్నిటిలోనూ 2 నెలల వయసునుంచీ పసిపిల్లలపై ఎన్నో ప్రయోగాలు చేస్తారు. చేతితోనో, కాలితోనో కదిలించగానే రకరకాలుగా తిరిగే బొమ్మలను వారికి అందుబాటులో ఉంచి, వాటిని ఎలా కదిలించవచ్చో పిల్లలకు తెలిసేట్టుగా చూస్తారు. ఒకసారి ఈ ప్రక్రియను వారు తెలుసుకున్నాక కాలం గడుస్తున్న కొద్దీ అటువంటి బొమ్మలను మళ్ళీ వారికి అందించి, పాత విద్యలు గుర్తున్నాయో లేదో పరిశీలిస్తారు. ఇటువంటి సందర్భాల్లో తక్కువ వయసున్న పిల్లలు త్వరగా మరిచిపోతారని తేలింది; వయసు పెరుగుతున్నకొద్దీ జ్ఞాపకశక్తికూడా పెరిగింది. ఈ ప్రయోగాల్లో పిల్లలను ఎన్నేసి నిమిషాల పాటు బొమ్మలను చూడనివ్వాలో, ఎన్నివారాల తరవాత వారి జ్ఞాపకశక్తిని మళ్ళీ పరీక్షించాలో నిర్ణయిస్తారు. అలాగే రకరకాల బొమ్మలను వివిధ క్రమంలో వారికి చూపడం, ఆ తరవాత వాటిని చూపినప్పుడు వారి స్పందనలను పరీక్షించడం చేస్తారు.
ఈ ఫలితాలను మతిమరుపు ముదిరిన వృద్ధులమీదా, జ్ఞాపకశక్తి క్షీణించిన మానసిక రోగుల మీదా జరిపిన పరిశీలనలతో పోలుస్తారు. పెద్దవారి విషయంలో అంతర్గతజ్ఞాపకశక్తీ, ప్రత్యక్షజ్ఞాపకశక్తీ వేరువేరుగా అనిపిస్తాయి. మొదటిది చెక్కుచెదరదు; రెండోది వెంటనే రాసిపెట్టుకోని టెలిఫోన్ నంబర్‌లాగా తొందరగా మరిచిపోయే రకం. ఆరునెలల పిల్లల్లోకూడా ఇది కనిపిస్తుంది; కొత్తదేదైనా నేర్చుకున్నాక దాన్ని భంగం చెయ్యగలిగిన మరొక సంఘటన కనక జరిగితే ఆ తరవాతి పరీక్షలో మొదట గుర్తు చేసినది మరిచిపోతారు. తొలి ప్రేరణ ఎక్కువ సమయంపాటు అందిస్తే విషయం పసివారికి అది మరింత ఎక్కువకాలం గుర్తుంటుందని తేలింది.
మొత్తంమీద పెద్దవారి విషయంలోలాగే పసిపిల్లలకు కూడా రెండురకాల జ్ఞాపకశక్తి ఉంటుందని అనుకోవచ్చు. తాత్కాలిక ప్రయోజనాలకు పనికొచ్చేవీ, దీర్ఘకాలికంగా నేర్చుకునే పద్ధతిలో నమోదయేవీ జ్ఞాపకాలుంటాయి. అయితే చిన్నవయసులో మనసును తీవ్రంగా ప్రభావితం చేసే సంఘటనలూ, దుర్ఘటనలూ తొందరగా మరపుకురావు. తెలిసీతెలియని వయసులోకూడా లైంగిక హింస వంటివాటికి లోనయితే ఆ మానసిక ఒత్తిడి ప్రభావం కలకాలం పనిచేస్తుందని ఫ్రాయిడ్‌నుంచీ అనేక విశ్లేషకులు అంటూనే ఉన్నారు. మరొకవంక పిల్లలు పైకి రావాలనే ఆత్రుతతో వారి జ్ఞాపకశక్తిని పెంచేందుకు రకరకాల ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కంఠతా పట్టేందుకు కొత్త పద్ధతులూ, ఆయుర్వేదం మందులూ, ఇతర సాధనాలూ ఉపయోగించి వారిని ఎలాగో అలా ముందుకు నెట్టాలనే ధోరణి పెరుగుతోంది. నిత్యజీవితంలో సహజ వాతావరణం లోపించడం, పసివయసు నుంచే పోటీ తత్వాన్ని పెంచడం మొదలైనవన్నీ అవాంఛనీయాలుగా అనిపిస్తాయి.
ఒక అభిప్రాయం »ప్రత్యేక వ్యాసాలు, సైన్స్
May 4th, 2009 at 4:00 am
“మరీ పసివారంగా ఉన్నప్పుడు మనకు పరిసరాల గురించిన అవగాహన వేరుగా ఉంటుంది; ఉదాహరణకు మన శరీరం ప్రమాణాన్ని బట్టి మామూలు వస్తువులు కూడా పెద్దపెద్దవిగా అనిపిస్తాయి.”
——————————————
నిజమే!!
మూడు దశాబ్దాలకు పైబడిన gap తరువాత, మొన్నామధ్య కొత్తపల్లి (హవేలి) వెళ్ళాను.
అదో గమ్మత్తయిన అనుభవం!!
నా చిన్ననాటి mental picture కి భిన్నంగా మెయిన్ రోడ్డూ, సందులూ, దూరాలూ అన్నీ కుదించినట్టుగా (scaled-down) కనిపించాయి.
అంటే, ఊహల్లోని కొత్తపల్లి imagery పూర్తిగా ఆ పసితనపు scale, proportion, view-point దగ్గరే స్థిరీకృతమైవుండి, వాస్తవానికి – ఊహకూ పొంతనలేనట్టుగా (కొద్దిసేపయినా) అనిపించింది.
ఇదిలావుంటే -, మిగతా ప్రాంతాలకు సంబంధించి ఎప్పటికప్పుడు రాకపోకలుండడంతో, ఈ రకమైన “కుదింపు” అనుభూతి ఎప్పుడూ కలుగలేదు.
కొ.రో.ప్ర. గారి వ్యాసం బాల్యపు రోజుల్ని గుర్తుచేసింది.
థాంక్స్ !!