May2009
మా చరిత్ర మాక్కావాలె!
- దాసరాజు రామారావు
కొంచెం తవ్వి వదిలేసిన కందకాల్లో నిలబడి,
పురాస్మృతుల వికసిత పరిమళాలను పీలుస్తున్నా!
చరిత్ర జ్వలితనేత్ర
పట్టించుకోక శిధిలాల మరపున తోసినా కంచు గర్జన చరిత్ర
అసెంబ్లీ పోడియపు ప్రజాస్వామిక సింహాసనం కింద
తుపాకితో నిలువునా పాతినా ————?????
వసంతకాలానా
పూలరంగులు వెలిసిపోతే వెలిసి పోవచ్చు
అచ్చువొత్తని గురుతులు మాసిపోవు
మట్టిపెళ్ళ పెకిలిస్తే
కాగంచుముక్క మహాధాన్యాగారమై
ఎదుట నిలుస్తది
కడుపులు నిండిన
కమనీయ రాగాలను ధ్వనిస్తది
బాటో, రాజమార్గమే అయ్యుంటది
ఇరువైపులా సోలుపూతా
రాజ్యం ప్రజలు బారులు తీరిన రాతికనీల్లా
శాతవాహనుడు అశ్వారూఢుడై బయలు దేరిండని
చెట్లాకుల జయజయ ధ్వనాల హోరు కోటలో
కలిసున్న ఎనిమిది అర్రల అపూర్వ కళానిర్మితం
భూమిల ఒరిగె
ఎన్ని జ్ఞానాలు
ఎన్ని స్వేదరాశులు
ఎన్ని కళా భోగాలు
ఈ మట్టి చెరల
మౌనంగ ఘూర్ణిల్లుతున్నాయో!
గాధల బరువుతో
బరువు బరువుగా నడుస్తున్నానా…
పాదాలకు బంగారు నాణేలు తగులుతయి
సొక్కం బంగారమై మెరుస్తున్న చరిత్రకు
తవ్వకం మెరుగు పెట్టని నిర్లక్ష్యపు వంచనని
‘తొవ్వల నిలబెట్టు’ మని ప్రార్థిస్తయి
చెరువుకట్ట
గోడు గోడుగా వెంటనడుస్తది
రుజువులు
పొలిమేరలు దాటి పోనీకుండా
కోట బురుజులెక్క కావలి వుంటనన్నది
నాలుగు చలువరాతి గోడలు మధ్యన
టంకశాల గోల ఎవలు ఆలకిస్తన్నరు?
క్యూలు కట్టడానికి
మ్యూజియం అమ్యూజ్‌మెంట్ పార్క్ కాదాయె
తిరుపతి ఎంకన్నలా
గుండైనా ప్రసాదించదాయె
వస్తువో, ధనమో దొంగిలించొచ్చు
జ్ఞాపక చిహ్నాలను,
చారిత్రిక సన్నివేశాల్ని
మాయం చేయడం చోరకళ
పొసగని తమ మెహాలకు
పులుముకోవడం నీచకళ
అవశేషాల వైభవాలను
కథలుగా వర్ణించి చెప్పని
మ్యూజియం గైడ్
వీలైనప్పుడల్లా చరిత్ర గొంతుకి అడ్డం పడుతుంటడు
అద్దాల షెల్పుల్లోంచి బేలగా చూస్తున్న
ఆనవాళ్ళ ముందర
కట్టేయబడ్డ అపరాధిలా కదుల్తున్నా
పగిలి ముక్కలైన
చుక్కల మట్టి పాత్రలో
తళతళ లాడుత్ను తక్షశిలా నగరం
చూపులే జారిపోయేంత
నునుపు దేరిన మట్టి కూజాలను
మల్లా మల్లా తాకి చూడాలే
తాజ్‌మహల్ పాలరాయికి
ప్రపంచ సుందరి బుగ్గలకు
ఈ లెక్కన గిరాకీ ఎందుకో?
దర్వాజంత ఎత్తు
దర్వాజల పట్టని
కాగును కావలించుకుని ఏడ్వాలని
కన్నీళ్ళతో నింపేంత దు:ఖమై పోవాలని
చిన్నవిలో చిన్నవి
పెద్దవిలో పెద్దవి
అనేక రూపాల సహజ సౌందర్యాత్మకం
నన్ను ఆనాటి కాలంలోకి విసిరేస్తూ
కూలిపోయిన ఒక శకపు సాక్ష్యం
మదర్ గాడ్డెస్
మనకు దీవెనార్తి పలుకడానికి చెయ్యి ఎత్తిపట్టే వుంచింది
గంటం చేసే శబ్దాలతో
గుణాఢ్యుడు ఆజ్ఞాపిస్తున్నట్టే వుంది
కవీ!
సభపెట్టు
మహత్తర బృహత్కథ
మరోటి వెలుగు జూడాలె!
(కొండాపురం మ్యూజియం సందర్శనానుభవం)