May2009
మే 2009 సంపాదకీయం
ప్రాణహిత మే సంచికకు స్వాగతం!
ఏప్రిల్ 30 మహాకవి శ్రీ శ్రీ జయంతి. 1910 ఏప్రిల్ 30న విశాఖపట్నంలో శ్రీ శ్రీ జన్మించి ఇప్పటికి 99 ఏండ్లు! ఈ సంవత్సరం మనం శ్రీ శ్రీ శతజయంతి సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. 1930 – 40లలో తన మహాప్రస్థాన గీతాలతో ఒక ప్రచండ ఝంఝామారుతంలా ప్రవేశించి తెలుగు సాహిత్యాన్ని ఊగించి శాసించి ఖండించి దీవించిన మహత్తర శక్తి మహాకవి శ్రీ శ్రీ . నెత్తురూ కన్నీళ్ళూ కలిపి ప్రపంచానికి ఒక కొత్త టానిక్ తయారుచేసాడు శ్రీ శ్రీ. తెలుగు కవిత్వం జీవితాన్ని, ప్రజల్ని, సమాజాన్ని మర్చిపోయి సైడు కాల్వల్లో ప్రవహిస్తున్న రోజుల్లో తన భీషణ కవితా జ్వాలలతో కొత్త జీవం పోసాడు. జలపాతాలు, అగ్నిపర్వతాల్లాంటి తన గీతాలతో తెలుగు కవిత్వానికి కొత్త ఊపిరులూదాడు. ఆకాశపు దారులంట హడావిడిగా వెళ్ళిపోయే తెలుగు కవితా రథచక్రాలను భూమార్గం పట్టించి భూకంపం సృష్టించాడు. వస్తువులోనూ రూపంలోనూ తెలుగు కవిత్వానికి కొత్త మార్గం చూపినవాడు శ్రీ శ్రీ. పాత వర్ణనలు, చందస్సు, అలంకారాలు, డిక్షన్ అన్నింటినీ ఇంక మళ్ళీ లేవకుండా నడ్డి విరగ్గొట్టి కొత్త నుడికారాన్ని, డిక్షన్‌ను ప్రసాదించి తెలుగు కవిత్వాన్ని ప్రజల పరం చేసాడు. ప్రజాస్వామ్యీకరించాడు. కష్టజీవికి ఇరువైపుల నిలబడ్డవాడే కవి అనే సరికొత్త నిర్వచనాన్ని తెలుగు సమాజానికి, సాహిత్యానికీ, సాహిత్యకారులకు అందించాడు. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదనే ఒక గొప్ప సత్యాన్ని తెలుగు సమాజానికి తన మహత్తర గీతాల ద్వారా అందించాడు. చలం అంతటి వాడే శ్రీ శ్రీ గీతాలను తూచే తూనిక రాళ్ళు తన దగ్గర లేవని, అనుభవించి పలవరించమని ‘యోగ్యతాపత్రం’ ఇచ్చేసాడు. ‘ఇప్పటి దాకా తెలుగు కవిత్వం నన్ను నడిపించింది. ఇంక దాన్ని నేను నడిపిస్తాను. ఈ శతాబ్దం నాది’ అని సగర్వంగా చెప్పుగోగలిగిన కవి తెలుగులో శ్రీ శ్రీ ఒక్కడే.
అయితే శ్రీ శ్రీ ఆకాశం నుండి ఊడిపడలేదు. ఆనాడు ఉన్న సామాజిక స్థితిగతులు, ఆర్థిక మాంద్యం ప్రబలి సామాన్యుల జీవితం దుర్భరమైన పరిస్థితి, ఆకలి చావులు, కరువులు మహమ్మారిలా వ్యాపిస్తున్న రెండు ప్రపంచ యుద్ధాల మధ్య కాలం, స్పెయిన్ అంతర్యుద్ధం, ప్రపంచమంతా వణికిపోతున్నా చెక్కుచెదరక నేనున్నానంటూ కష్టజీవులకు అండగా నిల్చిన సోషలిస్టు రష్యా, – ఇవన్నింటి మధ్యా శ్రీ శ్రీ గీతాలు ప్రవహించాయి. సార్వజనీనత విశ్వజనీనత ప్రధాన లక్షణాలుగా శ్రీ శ్రీ కవిత్వం ఒక గండభేరుండ వీక్షణంతో ప్రపంచాన్ని పరికించింది. కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, సాలెల మగ్గం, శరీర కష్టం స్ఫురింపజేసే సహస్ర వృత్తుల చిహ్నాలను నిర్ధిష్టంగా స్పృశించినా, పతితులు, భ్రష్టులూ, బాధాసర్పదష్టులనుద్దేశించి ‘జగన్నాథ రథచక్రాలని’ నేలకు దింపినా శ్రీ శ్రీ కవిత్వం సార్వజనీనమైన విలువలని ఎలుగెత్తి చాటింది. విశ్వజనీన సత్యాలని ప్రతిష్టించింది. రానున్న సూర్యోదయాల కోసం గానం చేసిన నవయుగ వైతాళికుడు శ్రీ శ్రీ. కవిత్వంలో పాటకపు జనుల ప్రాణవాయువులని పీల్చుకుని, వ్యావహారిక భాషలో రాయమన్న గురజాడ అడుగుజాడల్లో నడుస్తూ ఆ మార్గాన్ని మరింత వెడల్పు చేసాడు శ్రీ శ్రీ. అతడూ, అతని కవిత్వమూ తర్వాత అనేక తరాలమీద మహత్తర ప్రభావాన్ని నెరపాయి. ఒక లెజెండ్‌గా ఒక సాంస్కృతిక చిహ్నంగా శ్రీ శ్రీ తెలుగు సాహిత్యంలో మహాకవిగా చిరస్థాయిగా నిల్చిపోతాడు.
శ్రీ శ్రీ తాను జీవించిన కాలంకన్నా కనీసం ఒక అర్థ శతాబ్దం ముందుకు ఆలోచించాడని ఆయన రచనల్ని చదివితే అర్థమవుతుంది. ముఖ్యంగా ఆయన అనువాదం చేసిన కవుల్ని చూసినా ఆయన మహాప్రస్థాన, ఖడ్గసృష్టి, ‘మరో ప్రస్థాన’ గీతాలని చూసినా ఇది చాలా స్పష్టంగా విదితమవుతుంది. ‘మరోప్రస్థానం’ లోని జట్కావాలా లాంటి కవితల్ని 1970లలో రాసిన శ్రీ శ్రీ మూడు దశాబ్దాల తర్వాతి తెలుగు కవిత్వానికి పథ నిర్దేశం చేసాడా అనిపిస్తాడు. ఆ నాడు పాటలో ప్రజల ప్రాంతీయ భాషలని వాడడం జరిగింది. అప్పటికే కాళోజీ తెలంగాణ భాషలో కవిత్వం రాస్తూ ఉన్నారు. వచన కవితలో ప్రజల ప్రాంతీయ భాషా డిక్షన్ నీ , నుడికారాన్నీ, భాషనూ వాడి నిరలంకారంగా చెప్పినట్టున్నా అద్భుతంగా కవిత్వం చెప్పాడు శ్రీ శ్రీ ది! బహుశా ఇప్పుడు సమకాలీన తెలుగు కవులు రాస్తున్న ప్రాంతీయ భాషా కవిత్వానికి అప్పుడే నాందీ ప్రస్తావన జరిగిందేమో! అట్లే ఆయన అనువదించిన పరభాషా కవులు సీజర్ వయేహో (Cesar Vallejo), ఓడిస్సిస్ ఎలైటిస్ (Odysseus Elytis), ఒటో రినె కస్తియో (Otto Rene Castillo), నెరూడా (Neruda), పాల్ ఎల్వా (Paul Eluard) లాంటి అనేక గొప్ప కవులని, అనువాదం దుర్లభం అనిపించే మహాకవులని తెలుగు సాహిత్యలోకానికి పరిచయం చేసాడు శ్రీ శ్రీ. ప్రతి అనువాదమూ ఇది తెలుగు కవితే అనిపించేంతగా తెనుగీకరించి అద్భుత సృజనాత్మకతని ప్రదర్శించాడు. ఎక్కడా తన ముద్ర కనబడకుండా మాతృక కవికి అత్యంత దగ్గరగా అనువదించి, ఆ అనువాదాలు చిరస్థాయిగా నిల్చిపోయేట్టు చేసాడు. ఏంజిలో కాట్రోచి (Angelo Quattrocchi) ‘The beginning of the end’ ని ‘రెక్క విప్పిన రెవొల్యూషన్’గా శ్రీ శ్రీ చేసిన అనువాదం, అనువాద సాహిత్యంలో ఒక పరమాద్భుతం. కాట్రోచి రచనలోని వేగాన్ని, వాడినీ, భగ భగ లాడే మంటల్నీ, రగిలే కవిత్వాన్నీ యథాతథంగా, కొన్ని సార్లు మాతృకని మించేంతగా తెనుగీకరించిన శ్రీ శ్రీ సృజనాత్మకత మనని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. అట్లే తెలుగు కవిత్వాన్ని ఇంగ్లీషులోకి అనువదించడలోనూ శ్రీ శ్రీ చూపిన ప్రతిభ అసామాన్యమైనదే. దిగంబర కవిత్వాన్ని ప్రముఖ విమర్శకులు దుమ్మెత్తి పోస్తుంటే శ్రీ శ్రీ వాటిని రానున్న విప్లవానికి నాందీ ప్రస్తావనలుగా గుర్తించి ఇంగ్లీషులోకి అనువదించి ప్రపంచానికి పరిచయం చేసాడు.
ఏ సాహిత్యకారుడినైనా అతని చారిత్రిక పరిస్థితులనుండి, సామాజిక స్థిగతులనుండీ వేరు చేసి చూడలేము. శ్రీ శ్రీ ని కూడా అంతే. శ్రీ శ్రీ మరణించి 25 ఏళ్ళు గడిచాయి. తెలుగు సమాజం, తెలుగు సాహిత్యం చాలా ముందుకు నడిచింది. శ్రీ శ్రీ జీవించినంత కాలం, ప్రజలవైపు ముఖ్యంగా కష్టించే ప్రజల వైపు, దోపిడీకి గురవుతున్న పేద ప్రజల వైపు, అధికారానికి, నిరంకుశత్వానికి, దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా పోరాడుతున్న అసంఖ్యాక ప్రజానీకం వైపు నిలబడ్డాడు. చైనాలో రిక్షావాలా, చెక్ దేశపు గనిపని మనిషీ అని అంతర్జాతీయ దృక్పథాన్ని మహా ప్రస్థానంలో చెప్పినా ‘మరో ప్రస్థానం’ కల్లా శ్రీ శ్రీ కళింగాంధ్రలోని జట్కావాలా పక్షం వహించిన నిర్దిష్టతలోకి ప్రయాణించాడు. తన షష్టి పూర్తి సభల సందర్భంగా జన్మించిన విరసానికి అధ్యక్షుడై విప్లవ సాహిత్యంతో బుజం బుజం కలిపి నడిచాడు. పౌర హక్కుల ఉద్యమంలో ఆంధ్ర దేశమంతా కాళ్ళరిగేలా తిరిగాడు! చివరి శ్వాస వరకూ పోరాడుతున్న ప్రజలతో నిలిచాడు. శ్రీ శ్రీ తర్వాతి కాలంలో విప్లవ సాహిత్యం సృష్టించిన భూమికనుండి అనేక ప్రజాస్వామిక సాహిత్య బీజాలు మొలకెత్తినయి. అన్ని రకాల పీడనల్ని, ఆధిపత్యాలని వ్యతిరేకించే కొత్త వుద్యమాలు, అనేక కొత్త ప్రజాస్వామిక ఆకాంక్షలని, ఆశ్వాసాలని ముందుకు తెచ్చినయి. ఇంతవరకూ అణచివేతలకు గురయిన అనేక అస్తిత్వ వాదాలు గళం విప్పి తెలుగు సాహిత్యాన్ని మున్నెన్నడూ లేనంతగా సుసంపన్నం చేస్తున్నయి. ప్రాంతీయ, స్త్రీ వాద, దళిత, వెనుకబడిన కులాల, మైనార్టీ ప్రజల ఆకాంక్షలు, సమాజంలో మార్జినలైజ్డ్ ప్రజానీకం ఆకాంక్షలు తెలుగు సాహిత్యంలో బలమైన గొంతుకలుగా వినబడుతున్నై.
ఏదీ శూన్యంలోంచి ఊడిపడదు. ఇవాళ్ల ఈ గొంతులింత బలంగా పలకడానికి తెలుగు సమాజానికి దాదాపు శతాబ్దకాలపు పోరాట చరిత్ర ఉన్నది. ఆ పోరాటాలని ప్రతిఫలిస్తూ, ప్రగతి నిరోధక భావజాలానికి వ్యతిరేకంగా రూపంలోనూ, సారంలోనూ సాహిత్యంలో, సాంస్కృతిక రంగంలో ఉద్యమించిన ప్రజాస్వామిక భావజాలమున్నది. అందుకు బీజాలు వేసిన గురజాడ, శ్రీ శ్రీ, జాషువా, వట్టికోట వంటి గొప్ప సాహిత్య విప్లవకారుల మహత్తర కృషి ఉన్నది. ఇవాళ్టి అస్తిత్వ వాదాల ప్రజాస్వామిక ఉద్యమాలని, వాటి ఆకాంక్షలని శ్రీ శ్రీ అవే నిర్దిష్ట రూపాల్లో చూసివుండకపోవచ్చు, రాసి ఉండకపోవచ్చు. కానీ తెలుగు సాహిత్యం మరింత ముందుకు నడవడానికి, మరింత ప్రజల పరం కావడానికి, ఇన్నాళ్ళూ సాహిత్యం దరిదాపులకి రాలేని వాళ్ళు చిరస్థాయిగా నిల్చిపోయే గొప్ప సాహిత్యాన్ని సృష్టించగలగడానికీ, శ్రీ శ్రీ వేసిన బాట, వెడల్పు చేసిన మార్గమే ప్రధానంగా దోహదం చేసాయనడం అతిశయోక్తి కాదు. ఇక్కడ శ్రీ శ్రీ ఒక వ్యక్తి కాదు. ఒక అనివార్య చారిత్రిక శక్తి. ఆయన చూపిన మార్గం ప్రజల మార్గం. సాహిత్యంలో ప్రజాస్వామ్య పద్దతి. అంతిమంగా సమాజంలోనూ సాహిత్యంలోనూ విజయం పీడిత ప్రజలదే! శ్రీ శ్రీ మార్గానిదే! 1930ల సంక్షుభిత దశాబ్దంలో కాలం ప్రసవ వేదన పడితే శ్రీ శ్రీ జన్మించాడు. ఇవాళ్ళ 21 వ శతాబ్దంలో కాలం ప్రసవవేదనపడుతూ అనేక శ్రీ శ్రీ లని కంటున్నది! అన్ని రకాల దోపిడీ పీడనలు, నిరంకుశత్వాలు అంతరించి నిజమైన ప్రజాస్వామ్యం పరిఢవిల్లే దాకా శ్రీ శ్రీ లు పుడుతూనే ఉంటారు. అప్పటి దాకా ‘నిజంగానే నిఖిల లోకం నిండు హర్షం వహిస్తుందా! నిజంగానే మానవాళికి సకల సౌఖ్యం రహిస్తుందా! దారుణ ద్వేషాగ్ని పెంచే దారుణత్వం నశిస్తుందా? బానిసల సంకెళ్ళు బిగిసే పాడుకాలం లయిస్తుందా? సాధుతత్వపు సోదరత్వపు స్వాదుతత్వం జయిస్తుందా?’ అని గొంతెత్తి పాడుతూ, ఆ మహాకవి ‘గళ గళన్మంగల కళా కాహళ హళా హళిలో’ కలసి పోదాం, కరిగిపోదాం, కానరాకే కదిలిపోదాం!!!