పతంజలి వర్సెస్ ఏక్యుఖాన్

- పి. మోహన్

పతంజలి చనిపోలేదు. అనునిత్యం చస్తూ బతికినవాళ్ళే నిజంగా చచ్చిపోతుంటారు. పతంజలి అనునిత్యం బతికారు. చుట్టూ ఉన్న మనుషుల పట్ల పిల్ల తెమ్మెర లాంటి ఆప్యాయానురాగాలతో గౌతమబుద్దుడిలా జీవించారు. ఆయన సాహిత్యం గురించి ఆయన భౌతికంగా బతికున్నప్పుడు ఇప్పుడూ చాలామందే రాసారు. రాస్తున్నారు. పతంజలి రచనల్లో మాదిరే ఆయన కూడా! సుతిమెత్తని వాతల్లాంటి ఎకసెక్కాలుండేవి. ఆ మాటల్ని, ఆమాటల్లో దాగిఉన్న చండోమారుతం లాంటి ఆగ్రహావేశాలను ఏడాదినర కాలం పాటు అపురూపంగా దాచుకున్నాను. 2007లో “సాక్షి” లో సబ్-ఎడిటర్ ట్రైనీ గా చేరినప్పట్నుంచి నాకు ఆయనో దూరపు బందువుగా ఉండేవారు. అంతకుముందే ఆయన సాహిత్యం చదివి, ఒక్కన్నీ నవ్వుకుని, ఏడ్చుకుని, పదిమందికీ ఆ సాహిత్యాన్ని పంచిపెట్టి ఉన్నాను.

జీవితంలో ఎదురైన ఆటుపోట్లను మర్మయోగిలా నవ్వుతూ స్వీకరించే తత్వం ఆ రచనల్లో ఉంది. తెలుగు సహిత్యంలో రావిశాస్త్రి, గురజాడ తదితరులు వ్యంగ్యాన్ని శిఖరాగ్ర స్థానానికి తీసుకెళ్ళారని నేను కొత్తగా చెప్పనక్కర్లేదు. గోపాత్రుడు, పిలకతిరుగుడు పువ్వు వగైరా రచనలను సాహితీ పిపాసులు ఎంతగా మెచ్చుకుంటున్నారో దెయ్యం ఆత్మకథలను ఐదో తరగతి పిల్లలు కూడా అంతగానే మెచ్చుకున్నారు. నేను బిఈడీ ట్రైనింగ్ లో ఉన్నప్పుడు దెయ్యంకథలను రోజూ పిల్లలకు చెప్పి వాళ్ళ రియాక్షన్ గమనించేవాన్ని. చెప్పిన కథనే మళ్ళీ చెప్పాలని వాళ్ళు డిమాండ్ చెసేవాళ్ళు. పతంజలి రాతకున్న బలానికి ఇదో రుజువు. నిజానికి ఆయన గొప్పదనం వ్యంగ్యంలో లేదనిపిస్తుంది. మానవజీవితంలో తలకిందులుగా ఉన్నదాన్ని చూసి పెను విషాదంలోంచి వెళ్ళగక్కిన లావాను అక్షరాలుగా మార్చి పతంజలి మనచేతిలో పెట్టి పోయారు. ఆయనకు సాహిత్యం గురించి, జీవితాన్ని ఎట్లా నెట్టుకురావాలన్న దాని గురించి నిక్కచ్చి ఆలొచనలున్నాయి. లోకంలోని కుళ్ళును, నక్కజిత్తులను ఎట్లా అర్ధం చేసుకోవాలో, వాటిని అంటించుకొకుండా ఎంత నైపుణ్యంగా బతకాలో ఆయన తరచూ చెప్పేవారు. బతుకులో ఢక్కా మొక్కీలు తిన్నవాళ్ళే కాక జీవితంలోకి ఇప్పుడిప్పుడే అడుగుడుతున్న వాళ్ళకు కూడా ఆయన మాటలు శిరోధార్యాలే.

పతంజలికి మానవతావిలువలపై అపార విశ్వాసం. ఆయన ఆలోచనలు ‘రాజుల లోగిళ్ళ’ లోని డాంబికాలను తిట్టిపొయడం దగ్గరనుంచి అంతర్జాతీయ చిత్రపటంలో పుట్టుకొస్తున్న అణు ఉపద్రవాలను అసహ్యించుకోవడం వరకూ కొనసాగేవి. జర్నలిజం జీవితంలో మానవీయ కోణాన్ని ఎట్లా చూపాలన్న విషయంపై ఆయన దగ్గర కొన్ని పాఠాలు నేర్చుకున్నాను “అమెరికాతో మనదేశం కుదుర్చుకున్న అణు ఒప్పందం గురించి నువ్వేమంటావ్”అని ఆయన నన్నోమారు అడిగారు. “నేనేమనుకుంటే ఏం ప్రయోజనం సార్! నేను వద్దు అంటే ఆగుతుందా, కావాలంటే అవుతుందా?” అని తప్పించుకొవడానికి ప్రయత్నించాను.

“నువ్వన్నది నిజమే, కాని నీకు ఓ సొంత అభిప్రాయం వుండాలిగా”, అన్నారు

“ఈ ప్రపంచంలో అణుశక్తే ఏ రూపంలోను ఉండకూడదని నా అభిప్రాయం” అన్నాను.

“మరి దానివల్ల బోలెడన్ని లాభాలున్నాయని చెబుతున్నారుగా” అని పతంజలి మళ్ళీ అన్నారు.

“దానివల్ల బొచ్చెడన్ని నష్టాలు కూడా ఉన్నాయంటున్నారుగా” అన్నాను.

అణు ఒప్పందం గురించి అలా ఓ అరగంట పాటూ మాట్లాడుకున్నాం. తర్వాత ఆతన లెమన్ టీ తెప్పించారు.

“అణుఒప్పందం కంటే లెమన్ టీ మన దేశానికి చాలా అవసరం “అని నవ్వేసారు. తర్వాత ప్రపంచంలో తొలి అణుబాంబు గురించి, నాగసాకి, హిరొషిమా లో బాంబులు సృష్టించిన మారణ హోమం గురించి హిస్టరీ మాస్టారులా చెప్పుకుపోయారు. పనిలొ పనిగా తన ఆజన్మ శత్రువు హిట్లరు కు శాపాలు పెట్టారు. “సాక్షి” ప్రచురణ ఇంకా ప్రారంభం కాలేదు కనక ఆయన అప్పుడు కాస్త ఖాళీగానే ఉండేవారు. ఆయన గదిముందే నా టేబుల్. ఆయన బయటకొచ్చినప్పుడల్లా ఓచూపు నామానిటర్ వైపు వేస్తుండేవారు. బిడ్డ అ, ఆ లు సరిగ్గా దిద్దుతున్నాడో లేదో చూదామనే భావం ఆ కళ్ళల్లో కనిపించేది

ఓ సారి పాకిస్థాన్ అణు ‘పితామహుడైన’ అబ్దుల్ ఖదీర్ ఖాన్ గురించి పీటశ్రీ టేక్ ను తెలుగు చేస్తున్నా ఎప్పుడొచ్చారో ఏమో పతంజలి గారు నా వెనకే నిల్చుని చూస్తున్నారు. నేను గమనించలేదు. ఏక్యుఖాన్ పాపాల చిట్టా, అమెరికా అతగాడిపై పెట్టిన నిఘా, ‘ధూర్త ‘ దేశాలైన ఇరాన్, ఉత్తరకొరియా, లిబియా, సిరియా దేశాలకు అతడు అణ్వాయుధాలను సాంకేతిక పరిఙ్ఞానం అమ్మిన వైనం అన్నీ రాసుకుంటూ పోతున్నాను.

“ఏక్యూఖాన్ వల్ల పాకిస్తాన్ కు లాభం లేదా ?”అని తాపీగా ప్రశ్నించారు పతంజలి. దిగ్గుమని వెనక్కి తిరిగా. ఆయన తనదైన స్టైల్లో నవ్వుతూ కనిపించారు.

“పాక్ కు ఉన్నాయి గానీ పాక్ ప్రజలకు, మనకూ మొత్తం ప్రపంచానికీ చాలా నష్టాలున్నాయి”అని జవాబిచ్చా.

“యూ ఆర్ రైట్!” అని భుజం తట్టి అభినందించాడు. ఐటెం ఐపొయాక తనను కలవమని చెప్పి వెళ్ళి పోయారు. వెళ్ళి ఆయన ముందు కూచున్నా. ఏక్యూఖాన్ గురించి ఓ ఇరవై నిమిషాలు చెప్పారు. చెప్పారు అనడం కంటె బూతులు తిట్టారంటే బావుంటుందేమో !

పతంజలి గారు బాగా ఎమోషన్ స్థాయికి వెళ్లినప్పుడు ఆయన ముఖంలో కంపనం కనిపించేది. ఏక్యూఖాన్ గురించి అంతగా ఉద్వేగ పడాల్సిన అవసరం ఆయనకెందుకొచ్చిందో? ఎందుకంటే ఆయన మనిషిని ప్రేమించాడు కనక. భూమిపై ప్రతి ఒక్కటీ తలకిందులుగా ఉందని బాధ పడిపోయారు కనక. అణుయుధ్ధం, మతోన్మాదం, కులపిచ్చి, ఆదిపత్యం వివక్ష వంటి సకల దుర్మార్గాలను ఆయన మహోగ్రంగా ద్వేషించారు. ఇన్ని ఉపద్రవాల మధ్య చిక్కుకున్న ఒక్కమనిషికి కాస్తంత ఆహ్లాదం, దాంతోపాటే కత్తిలాంటి ఆలోచనాశక్తిని రేపే భావాలను ఆయన తెలుగు జాతికిచ్చారు. ఏక్యూఖాన్ను ద్వేషించడం వెనక పతంజలికి ఉన్నది దేశభక్తి కాదు. అంతకుమించిన విశ్వమానవ సౌభ్రాతృత్వం.

సుడాన్, ఇథియొపియా, సోమాలియా దేశాలు మన రాష్ట్రంలోని ప్రాంతాలుగానే భావించారు ఆయన. వాటిగురించి తల్లిలా కలవరపడి పోయారు. దైనందిన రాజకీయాలే కాకుండా కళలు సాహిత్యం గురించి ఆయన అభిప్రాయాలు ప్రజా పక్షపాతంతో కూడుకున్నవి.

నేను చిత్రకళపై రాసిన వ్యాసాలను ఆయన తెగ మెచ్చుకున్నారు మరిన్ని రాయమని బలవంత పెట్టారు. ఓ సారి చిన్న పరీక్ష కూడా పెట్టారు.

“రవివర్మ కు అందని అందాలున్నయా?”అని ప్రశ్నించారోసారి.

“రవివర్మ కు ఒక్క అందము దొరకలేదు, “అన్నాను జవాబుగా.

“మరెందుకు లోకులు అతగాడిని తెగపొగిడేస్తున్నారు”అని ఎదురు ప్రశ్నించారు.

“వారి కళాభిరుచి అట్లా ఉంది”అన్నాను.

“నువ్వు మార్చేయ్ “అన్నారు టక్కున. నాకు మాట పెగల్లేదు

ఇలాంటి ముచ్చట్లన్నీ నిన్నా మొన్నా జరిగినట్లుగా ఉన్నాయి. పతంజలి గారు ఇంకా బతికే ఉన్నారని, ఆఫీసులో ఆయన గదిలోకెళ్ళి ఏదో ముచ్చట పెట్టుకోవాలనీ అంత గొప్ప రచయిత నాకూ తెలుసు, ఆయనతో నేనూ కబుర్లాడా అని గొప్పలు పోవాలని ఉంది కానీ ఆయన అన్యాయం చేసి వెళ్ళి పోయారు. ఆయన చెప్పగా రాసిన ‘చిడీ ఒకొయో ఆఫ్రికా అందాలూ ‘, మంజిత్ బావా, సాల్మాన్ పై వ్యాసాలు, ఆయన చెప్పకున్నా రాసి కాంప్లిమెంట్లు కొట్టేసిన పథేర్ పాంచాలి, అమృతా షేర్గిల్ వ్యాసాలు. . . . . . . పతంజలి కళాస్వాదనకు తీపి గురుతులు.

ఆఫ్ట్రాల్ ఓ సబ్ ఎడిటర్ తో ఆయన బాల్యస్నేహితుడిలా మాటలు కలపడం భుజం తట్టి ప్రోత్సహించడం, ఎవరో ఇచ్చిన చేగువేరా క్యాలండర్ ను సంవత్సరం పాటు దాచు కొమ్మని ఇవ్వడం. . . . . అన్నింటికీ మించి లోకంలో ఎట్లా బతకాలో ‘నేర్పడం’. . . . ఇవీ ఆయనతో నాకున్న జ్ఞాపకాలు. . . . . . .

పతంజలి గారు నాకు కొన్ని భాద్యతలూ అప్పజెప్పి పోయారు.

భారతీయ గిరిజన కళలగురించి వ్యాసం రాయమన్నారు. ఇటాలియన్ నియోరియలిజం సినిమాలపైనా రాయమన్నారు. బైబిల్ను చదవమన్నారు. డికెన్స్ ‘ద టేల్ ఆఫ్ టూ సిటీస్ ‘ నవల ఆరంభ వాక్యాలను తప్పుల్లేకుండా బట్టీకొట్టమన్నారు. థామస్ హార్డీని, మార్క్వూజ్ ను శ్రీపాద సుబ్రమణ్యాన్ని, మార్క్స్ ను చదవమన్నారు. చదివి అర్ధం చేసుకోమన్నారు. అన్నింటికీ మించి విలియం ఎల్. షీరర్ అపురూప పుస్తకం “రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ద థర్ద్ రీచ్”ను అనుదిన పారాయణం చేయమన్నారు. మనిషిని అంటిపెట్టుకొని, మనిషి జాడ్యాలను వెక్కిరిస్తూ, తలకిందులుగా ఉన్నదాన్ని సరిగ్గా ఉంచమన్నారు. ఏదో రాయాలనిపిస్తేనే రాయమన్నారు. ఊకదంపుడు వద్దన్నారు. భోజనంతో పాటు విశ్వాసమూ ముఖ్యమన్నారు. కొన్నిసార్లు రాజీ పడినా విశ్వాసాన్ని కోల్పోవద్దన్నారు. ఆయనకిచ్చిన వాగ్దానాల్లో ‘థర్డ్ రీచ్’ ను యాభై పేజీలే చదివి పక్కన పెట్టా. . . వాటిని పూర్తి చేసే శక్తి కోసం మళ్లీ పతంజలి రచనలనే శరణం గచ్ఛామి అంటున్నా. . .

ఒక అభిప్రాయం »సంస్మరణ

ఒక అభిప్రాయం

  1. kcubev May 28, 2009 1

    మీరు అదృష్టవంతులు….

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో