May2009
పతంజలి ఒక అపురూప జ్ఞాపకం
- కె వి కూర్మనాధ్
పతంజలిది ఎంత అసాధారణ వ్యక్తిత్వమో అంత సాధారణమైన వ్యక్తిత్వం. చిట్టచివరి వరకూ సాహిత్యానికీ జర్నలిజానికీ అంతకంటే ముఖ్యంగా మానవీయ విలువలకూ ఒక జీవన విధానంగా గడిపేరు. నమ్మిన సిద్ధాంతాలొకటి, రాసే రచనలొకటి, బతికిన బతుకు మరొకటి కావు పతంజలికి. నమ్మిందే రాసి, రాసిన వాటిల్లోని విలువలను పాటించేరు.
పతంజలిగారికి చాల యిష్టమైన పద్యమొకటుంది. కాళహస్తీశ్వర శతకంలోని ‘డాతుల్సెప్పుట, సేవసేయుట, మృషల్ సంధించుట’ అన్న పద్యం ఆయనకు చాల యిష్టం. ప్రపంచంలో డబ్బు వల్ల, డబ్బు కోసం ఎన్నెన్ని హింసలు, అనర్ధాలూ జరుగుతున్నాయో, ఏయే నంగరితనాలకు అది కారణమో వివరించే ఈ పద్యం పతంజలి గారికి ఎంత యిష్టమంటే, తను ‘మహనగర్ ‘కు ఎడిటర్ గా ఉన్న రోజుల్లో సంపాదకీయాలకు పైన మకుటంగా పెట్టుకున్నారు. ఆస్తికి సంబంధించిన అసలు స్వరూపాన్ని అంత బాగా అర్ధం చేసుకున్నారు కాబట్టే ఆయనకు డబ్బు ఏనాడు గీటురాయి కాలేదు. డబ్బు చుట్టూ అల్లుకున్న ఏ ప్రలోభమూ ఆయనను ఆకర్షించలేకపోయింది – ఎన్ని అవసరాల్లో ఉన్నప్పటికీ.
పతంజలి జీవితం రచయితలకూ, జర్నలిస్టులకూ ఒక పాఠ్యపుస్తకం లాంటిది. ఆయన చేసిన ఏ రచన చెడుకు ఉపకారం చెయ్యలేదు, మంచికి అపకారం చెయ్యలేదు. రచయిత అన్నవాడు ఎట్లాంటి మినహాయింపులూ, షరతుల్లో లేకుండా ప్రజల పక్షాన నిలబడాలని పతంజలి రచనలు ప్రకటిస్తాయి. ఎటువంటి రక్షణా లేని, వనరులూ లేని ప్రజల చేతిలో తిరుగులేని ఆయుధం రచన అనీ ఆయన రచనలు చదివితే బోధపడుతుంది.
ప్రజల్నించి గ్రహించిన సామెతల్ని, వ్యంగ్యాన్ని, లోకజ్ఞానాన్నీ వంటబట్టించుకొని తన రచనల్లో అవసరాన్ని బట్టి వాడుకున్నారు. అందుకే ఆయన రచనల్లోని పాత్రలు – గోపాత్రుడు, ఫకీర్రాజు, వీరబొబ్బిలి, పాకలపాటి రంగరాజు మాష్టారు, రొంగలి అమ్మన్న, అప్పన్నసర్ధార్ – మన చుట్టూ సంచరిస్తున్నట్టనిపిస్తుంది మనకి, ఆయా పాత్రల అజ్ఞానమూ, తెలివిడీ, గొప్పదనమూ, లేకితనమూ, కపటత్వమూ, నిర్హేతుకత్వమూ మనకు కొత్తగా అనిపించదు. మనలోనో, మన చుట్టుపక్కల వాళ్లలోనో ఆయా ఛాయలు మనకి కనిపిస్తుంటాయి. మన రోజువారీ జీవితం లోని మనుషుల కపటత్వాన్ని అసహ్యించుకున్నాడు. నంగిరితనాన్ని, జుగుప్సాకర ప్రవర్తనను ఎగతాళి చేశాడు. అజ్ఞానాన్ని, మూర్ఖత్వాన్ని ఏవగించుకున్నాడు. దుర్నీతినీ, దోచుకోవడాన్నీ కసితీరా తిట్టాడు.
గోపాత్రుడు నవలికలో మెజిస్ట్రేటు పాత్ర ద్వారా సమాజపు హిపోక్రసీ మీద పతంజలి తీవ్రంగా విరుచుకుపడతాడు. “మన జ్ఞానానికి సార్ధకత లేదు. మన విశ్వాసాల మీద మనకు విశ్వాసం లేదు. మన విలువల మీద మనకు గౌరవం లేదు. మన దేవుడి మీద మనకి భక్తి లేదు. మన నాస్తికత్వం మీద మనకు నమ్మకం లేదు. మన మీద మనకు గౌరవం లేదు. మన తోటి వాళ్ల మీద మనకు మమకారం లేదు. మన ప్రజాస్వామ్యం మీద మనకు అవగాహన కానీ, గురి కానీ లేవు. మన జ్ఞానానికీ, విశ్వాసానికీ, ఆచరణకూ పొందిక లేదు. భూమి బల్లపరుపుగా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి జీవితం కళ్లబడుతుంది. మన భూమి బల్లపరుపుగా ఉన్నది గనుకనే మన సమాజం ఇలా ఉంది” అని అంటాడు. నా వరకు నాకు పతంజలి రచనల మొత్తం సారాంశం ఈ కొటేషన్లో ఉందనిపిస్తుంది.మత గ్రంధాల్లో, రాజ్యాంగంలో చెప్పుకునే గొప్పలు, నియమాలు, విలువలు, సామాజిక న్యాయం ఎక్కడా కనబడకుండా చేసిన పద్ధతిపై ప్రజాపక్షపాతి అయిన ఒక రచయిత వెళ్లగక్కిన ఆక్రోశం ఇది. కథను పండించడానికో, ఎవరి మెప్పుకోలుకో రాసిన వాక్యాలు కావివి. తను ఏది రాసినా, ఏది మాట్లాడినా వాటి సారంలో ఈ ఆగ్రహ ప్రకటన కనబడేది. మనుషుల స్వభావాల్లోని మరుగుజ్జుతనాన్ని అవహేళన చేశాడే తప్ప మనుషుల్ని ఏనాడూ దూరం పెట్టలేదు. మనుషుల మరుగుజ్జుతనానికి బాధ్యత సమాజపు సామూహిక కురచతనానిదేనని భావించాడు కాబట్టే మనుషుల్ని వారి స్వభావాలతో నిమిత్తం లేకుండా ప్రేమించగలిగేవాడు.
ఆస్తి స్వభావాన్నీ, మనుషుల స్వభావాన్నీ ఎంత లోతుగా అర్ధం చేసుకున్నాడో వీటిని గవర్న్ చేసే రాజ్యమూ, వ్యవస్థలనీ కూడా అంత విస్తృతంగా అర్ధం చేసుకున్నాడు. ఈ అర్ధం చేసుకోవడం ఏ స్థాయిలో ఉంటుందంటే వ్యవస్థీకృతమైన దుర్మార్గాన్ని వడిశెల పట్టుకొని గురిచూసి కొట్టే డేవిడ్ వలె కొట్టాలన్నట్టు ఉండేవి పతంజలి రచనలు.
పతంజలి చాలా చిన్న వయసులోనే రాయడం మొదలు పెట్టేడు. తను పుట్టి పెరిగిన రాజుల లోగిళ్లలోని అనవసర మర్యాదలూ, చాదస్తాలూ, భేషజాలూ, మనకి మించిన జ్ఞానులు లేరనుకునే అజ్ఞానాలూ – వీటన్నిటినీ గమనించేడు. కేవలం తమ ఇళ్లలోని వెనుకబాటుతనాల్నే కాక సమాజంలోని అంతరాలను కూడా చాలా నిశితంగా గమనించేడు. ఒకసారి అడిగాను – పేదవాళ్ల పట్ల అంత ప్రేమ ఎలా కలిగిందండీ అని. పేరు గుర్తుకు రావడం లేదు కాని, తక్కువగా చూడబడుతున్న కులానికి చెందిన ఒక మిత్రుడి గురించి చెప్పేడు. “వాళ్లింటికి వెళ్లినపుడల్లా, వాళ్లమ్మా నాన్నా కూడా నన్ను చూసి నిల్చునేవారు. అది నాకూ మా ఫ్రెండుకు కూడా యిబ్బందిగా ఉండేది అలా లేచి నుంచోవద్దని యిద్దరమూ చెప్పేం, మాకర్ధమయిందేమిటంటే, నా మీద గౌరవంకంటే ఊళ్లో పెద్దకులాల వాళ్లు ఏమనుకుంటారోననే భయమే వాళ్ల ప్రవర్తనకు కారణమనిపించింది” అని.
‘ప్రేమ సమాజంలో’ ఉండే పిల్లల దైన్యాన్ని, అనాధత్వాన్ని చూసి కూడా చలించిపోయానని చెప్పేరొకసారి. పతంజలి గారి చిన్నప్పటి పరిస్థితులే, మనుషులే ఆయన తర్వాతి రచనల ముడిపదార్ధాలు. చాసో, రావిశాస్త్రి, శ్రీశ్రీ, కుటుంబరావుల రచనల ప్రభావంతో పాటు ప్రపంచ సాహిత్యంలో గొప్ప రచయితల రచనలన్నిటినీ చదివేరు. కేవలం చదవడం మాత్రమే కాకుండా కనిపించిన ప్రతివారికీ ఆ రచనల ఔన్నత్యాన్ని వివరించేవారు. అప్పుడే రాస్తున్న వాళ్లకైతే చదవాల్సిన అవసరం గురించి మరీ మరీ చెప్పేవారు.
చాల ప్రతిభావంతమైన రచయిత, గొప్ప జర్నలిస్టు, అన్నిటికీ మించి మానవతావాది అయిన పతంజలి అకాల మరణం తెలుగు సాహిత్యానికి, నుడికారానికి తీరని లోటు. ప్రజాస్వామ్యవాదులకు, రాజ్యం దమనకాండకు గురయ్యేవారికి చాల పెద్ద నష్టం. తాగుడు వ్యసనం, తద్వారా ఆయన్ను భౌతికంగా ఇబ్బంది పెట్టిన లివర్ కేన్సర్ కబళించకుండా ఉంటే ఆయన కనీసం మరో రెండు దశాబ్దాలు ఉండి వుండేవారేమో!
హి ఎన్రిచెడ్ అవర్ లైవ్స్. హిజ్ రైటింగ్స్, మెమోరీస్ విల్ ఎన్ లైటెన్ అజ్ ఫరెవర్.
May 2nd, 2009 at 1:13 am
ఇప్పుడే ఈమాటలో గొరుసు జగదీశ్వరరెడ్డిగారి వ్యాసం చదివి ప్రాణహిత కొచ్చాను. మీ వ్యాసం చదువుతున్నాను. మీరన్న …”ఆయన చేసిన ఏ రచన చెడుకు ఉపకారం చెయ్యలేదు, మంచికి అపకారం చెయ్యలేదు”… అన్నమాట అక్షరసత్యం. ప్రతి రచనలోనూ ప్రజల పక్షపాతం వహించిన పతంజలిబావు మరిలేడన్న మాటే మింగుడుపడడం లేదు.
May 3rd, 2009 at 9:58 pm
పతంజలి గారిపై మీరు రాసింది అక్షర సత్యం. ఆయన సూటిదనం రచనలకే పరిమితంకాక జీవితంలోనూ కొనసాగించగలిగిన ధన్యజీవి. ఈనాటి కుహనా కమ్యూనిస్టులుంగా పిలువబడుతున్న అనేకమందికంటే ఆయన ఎన్నో రెట్లు గొప్ప. అక్షర తూటాల మాల ధరించిన సాహితీ విప్లవకారుడు. ఆయన లేని లోటు భర్తీ కాగలదా?