May2009
పొద్దు ములిగిపోయింది
- గంటేడ గౌరునాయుడు
పొద్దు ములిగి పోయింది.
సంధ్యా రాగంలోని అందాల్ని కాక విషాదాన్ని కళ్ళకు కట్టినట్టు చిత్రించిన ఓ నీటి రంగుల చిత్రానికి ఆ చిత్ర కారుడు పెట్టిన పేరది.
దిగంతాలకు విస్తరించిన అపారమైన జలరాశి. ఆ జలరాశి నడుమ ధ్యాన మన్నుడైన మునీశ్వరుడి శిరస్సులా గుడి గోపురం గూటి నుండి శలవు తీసుకుంటున్న కాంతి పక్షిలా గోపరుని వెనుక అస్తమిస్తున్న సూర్య బింబం.
చెరువులో యీదు లాడుత్ను నీటి బాతులా మరబోటు.నీటి అడుగు నుండి పారదర్శకంగా కనబడుతున్న గుడి. రెక్కలల్లారుస్తు గోపుర కలశం మీద వాలుతున్న గెద్ద. ఓ విషాద గీతం లాంటి రంగుల కవిత్వం ఆ చిత్రం దిగువున ‘పొద్దు ములిగి పోయింది’ అనే అక్షరాలు చేతిరాతలో…
నాగావళి నది మీద బేరేజీ నిర్మాణం కోసం సర్వే జరుగుతున్న రోజులు. సాహితీ మిత్రులం కొందరం ఆయా ముంపు గ్రామాల్లో తిరిగి ప్రజాభిప్రాయం సేకరించి కవితలు రాయాలని, అవి ఓ సంకలనంగా వేయాలని అనుకుంటున్నపుడు వేది చిత్రించిన ఊహా చిత్రమిది. నేను ‘సంధ్యారాగం’ అనే పేరు పెడితే తను ‘పొద్దు ములిగిపోయింది’ అన్నాడు.
ములిగి పోయింది పొద్దా? మన బతుకులా?
అర్థమయ్యింది నామ సార్థక్యం.
ఇప్పుడా చిత్రాన్ని ఓ ప్రముఖ దినపత్రిక ఆదివారం అనుబంధంలో ప్రచురించింది. ఆ చిత్రం పక్కనే ఓ ఫోటోని కూడా ప్రచురించిందా పత్రిక. వాటిని గురించి వివరిస్తూ… ‘ఆరేళ్ళకు ముందు చిత్రించిన వూహా చిత్రం… ఆరు రోజుల నాడు తీసిన ఫోటో రెండూ ఒకేలా వుండటం…అరుదైనా వింత. అస్తమిస్తున్న సూర్య బింబంతో పాటు గోపుర కలశం మీద వాలుతున్న గద్దనూ, మర బోటునూ చిత్రించడం యాదృచ్చికం అని కొట్టి పారేయలేమని, అది ఓ కళాకారుని దార్శనికతకు నిదర్శమనీ అన్నారు. భవిష్యత్ చిత్రపటాన్ని కొన్నేళ్ళకు ముందే ఆవిష్కరించిన ఆ చిత్ర కారుడు బ్రతుకు భారమై రోడ్డున పడటం అత్యంత విషాదం. అనుమతి లేని కారణంగా అతని పేరు, ఫోటో ప్రచురించలేకపోతున్నాం’ అని రాసేరు.
మనసు కల్లోల సాగరమైంది.
చిత్రం లోని జలరాణి, నా కళ్ళలో సుడి తిరిగింది.
నాగావళి పూల కెరటాలతో నాలో ఎగిసిపడింది.
ఆ నీటి అలల రేఖల్లో చిరపరిచితమైన కుంచె కదలికల గీతల దొంపుల్లో….కలిసి పోయేలా…. ఆపేరు…
వేది.
నా మిత్రుడు పరశువేది.
ఆనందాల హరివిల్లులోని రంగులన్నీ కరిగి మిగిలిన దు:ఖపు చీకటి నలుపునీ, కంట కొసలలోని అరుణ వర్ణాన్నీ తన బొమ్మలకి రంగులుగా అద్దుతూ… ఎక్కడున్నాడో…?
ఏటి కెరటాలకు గడ్డి పరకలు కొట్టుకు పోయినట్టు మనిషో వైపు చెదిరి పోయేం. జ్ఞాపకాలు కూడా మాసి పోతున్న తరుణంలో ఇప్పుడీ చిత్రం. బుక్‌షెల్ఫ్ లోంచి ‘నిర్వాసిత గీతం’ కవితా సంకలనం తీసేను… ముఖ చిత్రం వేది చిత్రించిన పేయింటింగ్. ‘పొద్దు ములిగిపోయింది’ దాన్ని తాకితే…నీటి అడుక్కి చేరిన వూళ్ళోని మా ఇల్లు చేతికి తగిలినట్టైంది.
ఆ అనంత జలరాశి నడుమ ఓ కన్నీటి బొట్టు జారి అలలు రేగేయి… వలయాలు వలయాలుగా.
* * *
ఈ వొంపు నాగావళి కెంత అందాన్నిచ్చిందో చూసేనా… నాగావళి… జంఝావతి కలిసిన ఈ సంగమ క్షేత్రంలో మహాశివుని పాద పద్మాలను అభిషేకించి, తీర భూముల దాహార్తిని తీర్చి, హరిత రాగాలను ఆలపిస్తూ ఎంత వుత్సాహంగా ఉరక వేస్తోందో… వయ్యారమంతా ఆ మలుపులోనే వున్నట్టుంది కదూ! సందె వెలుగులో ఆలయ గోపురం నీటి అద్దంలో తుది మెరుగులు దిద్దు కుంటున్నట్లు కోవెల నీడ….
‘చేతిలో చెయ్యేసి చెల్లెలితో కలిసి పరుగులు తీసే అల్లరి పిల్లలా లేదూ జంఝావతితో కలిసే నాగావళీ! పాదాల పట్టీల మువ్వల్లా అలలు రవళిస్తుంటే ఏటవాలు కిరణం ఒకటి నది అంచున సుడి తిరిగి నీట పిట్టలతో కలిసి పచ్చని పంట చేలమీద ఆరవేసే మసక వెతురు మేలి ముసుగూ… తీరం పొడవునా పాల నురగలా విరబూసి అలలతో పోటీ పడే ఆ రెల్లు పూల ప్రవాహమూ..”
నాగావళి ఒడ్డున కూర్చుంటే మాకు కాలం తెలిసేది కాదు. నేను నా ఆలోచనలకు అక్షర రూపం యిస్తే, బొమ్మ గీసేవాడు వేది. విశేష మేమంటే వేదికి కుంచెలు, రంగులు, కేన్వాసు అక్కరలేదు. దళసరి తెల్లకాగితం ముక్క చాలు. కుడి చేతి బొటన వేలు చూపుడు వేళ్ళ గోళ్ళమధ్య సాధారణమైన తెల్లకాగితం ముక్క క్షణాల్లో అసాధారణ అద్భుత కళా ఖండంగా మారిపోతుంది. నేను నా కవితల్లో ఆవిష్కరించుక్ను అందాలు ఆ తెల్లకాగితం మీద ప్రత్యక్షం కావడం అద్భుతంగా వుండేది. నాగావళి ఒడ్డున వేది, నేను ఎన్ని సాయంత్రాలు రాత్రులుగా మారిపోతుంటే చూస్తూ గడిపేసామో! వేది గీత నాగావళి. నా గీతం నాగావళి. మేము నాగావళి ప్రేమికులమని…నాగావళి తప్ప మరో లోకం తెలీదని మా మిత్ర బృందం మమ్మల్ని ఆటపట్టించే వాళ్ళు.
ఓ రోజు నాగావళి ఉదృతంగా వ్రవహిస్తోంది. పెద్ద దూలం ఒకటి కెరటాల్లో తేలి వస్తుంటే నేను దభాలున ఏట్లో దూకి దూలాన్ని వొడ్డుకు చేరేవేసే లోపల తిరుగుడు గుమ్మిలోకి జారిపోయేను. నాకు స్పృహ వచ్చేసరికి నా చుట్టూ జనం. పరిచర్యలు చేస్తూ వేది.
‘నాగావళి మీ అమ్మ కదా ఇలగ చేసిందేట్రా…” అని యికటాలాడేరు మా మిత్రులు. అప్పుడు వేది అన్నాడు కదా… ”అమ్మ కాబట్టే అరి చేతిల పెట్టుకొని ఒడ్డుకు తెచ్చింది” అని. అంత నమ్మకం వేదికి. నాగావళితో వున్న అనుబంధం… ఆ సాన్నిహిత్యమే తనను కళాకారుణ్ణి చేసిందంటాడు.
నల్ల్గగా.. సన్నంగా రివటలా వుండే వేదికి తనని, తన కళనీ ప్రపంచం గుర్తించాలనీ తపన తనను ఏ అమ్మాయీ ప్రేమించదనీ, అంత గొప్ప అందం తనదనీ నవ్వేవాడు. వాడి అపనమ్మకాన్ని వమ్ము చేస్తూ కొనగోట సౌందర్యానికి ముగ్దురాలై ఓ గొప్పింటి అమ్మాయి ప్రేమ లేఖ రాసింది. ఆ అమ్మాయి కోసమే అద్భుతమైన బొమ్మలు గీసేడు. వాడి ముఖంలో ఓ కొత్త వింత అందం మెరిసింది. ప్రేమకున్న శక్తి యింత గొప్పదా అనిపించింది. అయితే అన్ని ప్రేమ కథలలాగానే వాళ్ళ కథా విషాదాన్నే మిగిల్చింది. యిక్కడా…కులమూ, డబ్బూ ప్రధాన పాత్ర వహించాయని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కొన్నాళ్ళు బొమ్మల ప్రపంచానికి దూరమైనా మళ్ళీ మా ప్రపంచంలో పడ్డాడు. బొమ్మల ప్రపంచంలో ములిగిపోయేడు.
”చేతిలో పరశువేది వున్న వాడు పట్టిందల్లా బంగారమవుతుంట. మా వాడు పేరుకే పరశువేది. ఏది పట్టుకున్నా మట్టే… అంటాడు వాళ్ళ పెదనాన్న, నేనందుకు అంగీకరించలేకపోయే వాణ్ణి. ఒక అర్థవంతమైన, అద్భుతమైన బొమ్మ గీసినప్పుడు అతని కళ్ళలోని వెలుగును చూడాలి. ఆ భాగ్యం ఎంత మందికి లభిస్తుంది. అదే నేనంటే కూడుకి గుడ్డకి పనికిరాని భాగ్యం.. అదే భాగ్యం?! అని సంపాదన చేతగాని వెర్రోళ్ళు అన్నట్లు చూసేవాడు మమల్ని. అలాగాని పనులు చేయడం తెలీని వాడేం కాదు వేది. వ్యవసాయం పనులు చాలా నేర్పుగా.. ఓర్పుగా చేసే వాడు. ఏరుపూసి దుక్కి దున్నితే స్కేలు పెట్టి గీత గీసినట్టే సాలు పోసేవోడు. పారపట్టి దమ్ము మడికి గట్టు చెక్కితే వర్ణ చిత్రానికి ఫ్రేమ్ కట్టినట్టే… యిక ఎడ్లకు సికుమార్లు కలుపుల పూల కారణాలు.. రంగు రంగుల దారాలతో ఎంతందంగా తయారు చేసేవాడో! వరిసేలుని వోపులు బండికి ఎక్కించడం అంటే అది చాలా నైపుణ్యంతో చెయ్యాల్సిన పని. ఏ పని చేసినా కళాత్మకంగా చేసేవాడు.
నాగావళి నదికి ఇరువేపులా వున్న తీరగ్రామాలు మావి. నాగావళి ఇసకదిబ్బ మా కళా సృజనకు వేదిక. అందరూ సంపాదనలో చూసుకునే సౌందర్యం…సంతోషం మేము నాగావళి అలల తీగలను మీటే వెన్నెల వేళ్ళలోను, రెల్లుపూల కెరటాల మీద తేలియాడే పిల్లగాలి తరగల్లోనూ చూసుకునే వాళ్ళం. ఆ అందాలను అక్షరాల్లో, గీతల్లో పట్టుకుని పొంగిపోయే వాళ్ళం… అదే గొప్ప భాగ్యం మాకు.
వేది ఎస్సెస్సెల్సీ తో చదువుకు చుక్క పెట్టేసాడు. తండ్రి పోవడంతో. వేది నాన్న అభ్యుదయ భావాలున్న వ్యక్తి నాటకాలకు రంగాలంకరణ, మేకప్ చేస్తూ చిన్న చిన్న పాత్రలు వేసే వాడు. ముఖ్యంగా అప్పటి కమ్యూనిస్టు పార్టీకి బాగా పట్టున్న గ్రామం తోను… కామ్రేడ్‌ల తోనూ మంచి పరిచయాలుండేవి. రచయిత భూషణం మాష్టారు ఆ నాటక సమాజంలో ఒక నటుడు. అప్పుడాయన ‘కొండగాలి’ నవల రాస్తున్నారని చెప్పుకునేవాళ్ళం. ఎ.పి.టి.ఎఫ్ సభలు, సమావేశాలు భూషణం మాష్టారి ప్రసంగాలు, వారి రచనలు మమ్మల్ని బాగా వుత్తేజ పరిచేవి. అటువంటి రచనలుంటాయని, అవి మన జీవితాల్లోంచే పుట్టుకొస్తాయని తెలీనీ మాకు మరో కొత్త లోకాన్ని చూపించేవి.
వేది చిత్రా రచనలో నేనూహించని మార్పు, శిల్ప సుందరి, దీపకన్య, అభిసారిక వంటి చిత్రాల నుంచి శ్రమైక జీవన సౌందర్య చిత్రంలో ‘కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం’, జాలరి పగ్గం, సాలెల మగ్గం, శరీర కష్టం చిత్రింపజేసే సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలునే చిత్రించే నవీన చిత్రాలన్నాడు.
ఉపాధ్యా సంఘ సమావేశాల్లో, మహా సభల్లో రాష్ట్ర నాయకుల్తో చెప్పి వేది నఖచిత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేసే వాణ్ణి. ఆ సభల్లో ప్రత్యేక అకర్షణలుగా నిలిచేవి భూషణం మాష్టారి ప్రసంగం వుందంటే ఆ సభకి తప్పకుండా హాజరయ్యే వాళ్ళం. అయన వ్యంగ్య బాణాలు, చతురోక్తులు సభను ఉత్తేజితంచేసేవి. అటువంటి సాహిత్య సందర్భంలోనే పరిచయ మయ్యేడు వరీనియా. వేది బొమ్మలు చూసి ప్రశంసిస్తూనే కొన్ని సూచనలు చేసేడు. కొత్తదనం వుండాలన్నాడు. తక్కువ గీతోల్ల భావావిష్కరణ జరగలాన్నాడు. ఉత్తరాంధ్ర జన జీవితాన్ని బొమ్మల్లో చూపించాలన్నాడు. అది మొదలు వేదికి మరో ద్యాస లేకపోయింది. స్కెచ్ బుక్ పట్టుకొని రామ్మందిరం దగ్గరా… పొలం గట్ట మీదా నీలాటి రేవులో … మాలపేట వీధుల్లో తనదైన ముద్రతో ఉత్తరాంధ్ర జీవన శైలిని పట్టుకోవడం కోసం ఎంత శ్రమపడ్డాడో!
”వీడి కిదేం పిచ్చి… వ్యవసాయం ఎలాగుందో… పిల్లల చదువుల సంగతేటో… యివేవీ పట్టించుకోకుండా బొమ్మలనీ, మీటింగులనీ ఇల్లు పట్టకుండా తిరగడమే పనిలాగుంది. దాని వల్ల పైసా వొచ్చిందా అంటే అదీ లేదు. నువ్వైనా ఒక మాట అనకపోతే ఏలాగమ్మ ” అని కోడలు మీద విసుక్కునే వాడు వేది పెదనాన్న. ఆ మహా యిల్లాలు ఒక్క మాట అనలేదు. సరికదా ‘పోన్లే మామయ్యా నేను సూసుకుంటన్నాను కదా. అతనికి అందులోనే ఆనందం అతనికి నచ్చినట్టే చెయ్యనీ. మనకా విద్య రమ్మన్నా వచ్చేది కాదు. మనమా పని చెయ్యగలమా… చెందగలమా!” అని సమర్థన. ఏమీ చదువు కోకున్నా ఎంత గొప్ప మాట అన్నాదా యిల్లాలు! నా భార్యా వుంది. డిగ్రీ పాసయ్యింది. నా బుక్ షెల్ఫ్‌లో ఏ పుస్తకాలున్నాయో తెలీదావిడకి. సొమ్మంతా పుస్తకాలకే తగలేస్తున్నాని గోల. ఎప్పుడో కవిత రాయాలనిపించి కాగితాలు ముందేసుకుంటే చాలు… ఓ వాగ్భాణం…ఎప్పుడైనా ఏదన్నా సాహిత్య సభ వారు ఇచ్చిన జ్ఞాపికను అపురూపంగా తీసికెళ్తే….ఆ.. తెచ్చారు చెక్కముక్క” అనే యిసడింపు. వేది అప్పుడప్పుడూ వచ్చి నచ్చ జెప్పబోయవాడు. ఇద్దరినీ కలిపి దులిపేసేది. కొందరంతే. యీ విషయంలో వేది అదృష్టవంతుడు అనుకునే వాళ్ళం. అప్పుడు మాకు తెలీదు అందర్లోకీ వాడే గొప్ప దురదృష్ట వంతుడనీ. ఆ దురుదృష్టం ప్రోజెక్టు రూపంలో ముంచుకొస్తుందనీ… ఏ నదిని మేం మా ప్రాణాధికంగా ప్రేమించామో… ఏ నదిని మా జీవితం లోంచి వేరు చేయలేని భాగమనుకున్నా ఆ నది మాకు కాకుండా పోయింది. మాకు కాక పోవడం కాదు. మమ్మల్ని ముంచింది.
ఓ రోజు బాగా ముసురు పట్టింది. బంగాళా ఖాతంలో వాయు గుండం అన్నారు. ఊరు ఖాళీ చెయ్యాలన్నారు. ఇల్లు పొల్లు పిల్లా జెల్లా, గొడ్డు గోదా, కళ్ళాలు గడ్డి కప్పులు అన్ని వదలి ఎలా వెళ్ళాలో మాకు బోధ పడలేదు. అధికారులొచ్చేరు. పోలీసులొచ్చేరు. లాఠీ లొచ్చేయి. ‘సావైనా, బతుకైనా యీ మట్టి మీదనే…’ అని మొండి పట్టు పట్టేరు ముసిలోళ్ళు. అందర్నీ బలవంతంగా లారీల కెక్కించి ఊళ్ళు ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. కొద్ది రోజుల్లోనే ముంపు గ్రామాలకు కేటాయించిన స్థలాల్లో ఇళ్ళ నిర్మాణాలు పూర్తయి శాశ్వతంగా ఊళ్ళు ఖాళీ చేసేం. నదిని దానం చేసి అలల మీద ఆశ వదులుకుని చెట్టుకో పిట్టగా ఎగిరి పోయాము. ప్రోజెక్టు పేరుతో అందిన పరిహారం ఫలహారమై పోయింది. ఇల్లు భూములు ఏట్లో కలిసిపోయాయి. మా గ్రామాల మధ్య దూరం పెరిగి ఉద్యోగం పేరుతో నేనింకా దూరమయ్యోను. నాగావళి ఒడ్డున నిలబడి సూర్యోదయాలకు స్వాగతం పలికి, సూర్యాస్తమాయాలకు వీడ్కోలు చెప్పే భాగ్యానికి శాశ్వతంగా కోల్పోయేం మేము.
ఇంటికి పొలాలకీ వచ్చిన పేకేజీ సొమ్ము అప్పులు తీర్చడానికి పుట్టు కొచ్చిన కొత్త అవసరాలకు హరాయించుక పోగా మిగిలిన కొద్ది సొమ్ముతో కూతురు పెళ్ళి జరిపించేసి రిక్త హస్తాలతో మిగిలేడు వేది. కొడుకు ఏవో చిన్న ‘చిన్న వ్యాపారాలు చేసినా ఏవీ కలిసి రాలేదట. ఆఖరికి టీ కొట్టు పెట్టుకున్నా దినం తీరక వలసెళ్ళి పోయేడట కొడుకుతో కొందరు మద్రాసెళ్ళేడన్నారు. మద్రాసు నుండి హైదరాబాదు వెళ్ళి పోయేడన్నారు కొందరు. ఏలూరు లో ఓ చౌదరి గారి పొలం పనికి కుదురుకున్నాడన్నారు మరికొందరు. వేది ఖాళీ చేసిన ఇంటినైనా చూసెళ్ళాలని ఆ వూరెళ్ళాను. ఊరు వల్లకాటి దిబ్బలా కనిపించింది. చుట్టూ నీరు కమ్ముకుని ఆరిపోయిన కార్తీక దీపంలా గుంది. నర సంచారం లేని వూరిలో చెట్టు చేమా కూడా ఎంత గుబులు పుట్టిస్తాయో అక్కడ మిగిలి వున్న చెట్లను చూస్తే అర్థమయ్యింది. భయంకర నిశ్శబ్దం అంటే కూడా అపుడే తెలిసింది. ఊరికి తూరుపు మొగలో కూలిన గోడలతో విరిగిన పలకలా బడి. ఉత్తర దిక్కున నీటిపై తేలుతున్న చిరిగిన బద్దల గిడుగులాగ అసిరమ్మ గుడి. పాటలతో పరవశించే అరుగులేనా అవి. ఆటలతో హోరెత్తే వీధులేనా అవి! వేది గీసిన బొమ్మలతో ఆదరంగా ఆహ్వానం పలికే గోడలేనా అవి!!
నా వొళ్ళు జలదరించింది.
ఇప్పుడా వూరు…. మా వూరు మరో ఏడు గ్రామాలు అనంత జలరాశికి అట్టడుగున అదిగో ద్వారక సముద్ర గర్భాన అన్నట్టు…
నా చేతిలో నిర్వాసిత గీతం
అలలను మీటి నట్టే వుంది. అట్టమీది బొమ్మను తాకితే. పేజీలు తిప్పేను.
ప్రతి కవితా ఒక తడి కన్నులా..
* * *
”నీరు నిండిపోతే ఆ గుడీ ములిగిపోతుందా” దూరంగా కనిపిస్తున్న గుంపసోమేశ్వరాలయాన్ని చూస్తూ అన్నాడో సారి వేది. ప్రతియేటా శివరాత్రికి జరిగే యాత్ర. రాత్రి జాగారాలు, అభిషేకాలూ… కార్తీక సోమవారాలూ… వన భోజనాలు… ఆ సందడీ గుర్తొచ్చేయేమో… గొంతులో దిగులూ…
”కార్తీక మాసం గదా మన సాహితీ మిత్రులతో పిక్నిక్ ఇక్కడే” చింతా తన నిర్ణయం ప్రకటించేడు.
”సాహితీ మిత్రులందర్ని పిలుద్దాం. మళ్ళీ ఇక్కడకు వచ్చే అవకాశం రాకపోవచ్చు… ” చింతను బలపరిచేడు మల్లిపురం.
”కార్తీక మాసం ఆఖరి సోమవారం…గుంప కోవెల తోటలో వన భోజనం… మీకిదే ఆహ్వానం” అని ఎస్సెమ్మెస్‌లతో అడుగు పెడుతున్న వుత్సాహం మల్లిపురంలో…
అదే మేము చివరిసారి గుంప కోవెలకి వెళ్ళింది.
గుంప సోమేశ్వరాలయం.
నాగావళి జంఝావతి నదుల పవిత్ర సంగమక్షేత్రం. ఇరు తీరాల తోటలు, చెట్లు జనంతో విరగబూసినట్టు. వుత్సాహంతో వూగి పోయేయి. ఆకుల్ని వువ్వుల్ని కాక మనుషుల్ని ఆటలు పాటలు, నవ్వులు, తుళ్ళింతలు కేరింతలు గుంపకోవెల పరిసరాలు పరవశించపోయేయి.
మళ్ళీ ఇక్కడకు రాలేం కదా. గుడిని యిక చూడలేం కదా! అనే భావన అందరిలోనూ. ఆ భావన లోనే జనం ఎక్కువ సంఖ్యలో కొచ్చేరక్కడికి.
ఇక్కడి శివలింగాన్ని ద్వాపర యుగంలో బలదేవుడు ప్రతిష్టించేడంటారు. కురుక్షేత్ర యుద్ధంలో రక్త పాతం తన కళ్ళతో చూడలేని తీర్థ యాత్రలకు బయలు దేరిన బలరాముడు అనేక పుణ్య క్షేత్రాల్ని దర్శిస్తూ ఈ ప్రాంతానికి వచ్చేడట. ఒరిస్సా లోని పాయకపోడు దగ్గర తన హలాయుధంతో నేలను చీల్చితే ఒక నీటి పాయ వుబికి వచ్చిందట. అక్కడ శివలింగాన్ని ప్రతిష్టించి హలాయుధంతో ఆ నీటి పాయను తన వెంట తీసుకెళ్ళి కళ్ళేపల్లి సముద్ర తీరంలో కలిపాడట. అదే నాగావళిగా మనం పిలుస్తున్న యి నది. బలరాముని నాగలి మొనతో ఉద్భవించిన నది కాబట్టి దీని పేరు నాగావళి అయ్యిందట. దీన్ని ‘లాంగుల్యా’ అనీ అంటారు.
యీ నది ఒడ్డునే పాయక పాడు తర్వాత. గుంప, సంగం, శ్రీకాకుళం, కళ్ళేపల్లిలో ఒకే రోజు పంచలింగాలు ప్రతిష్ఠించాడట. యీ ఐదు క్షేత్రాల్ని ఒకే రోజు అభిషేకం చేసిన వాళ్ళకు పునర్జన్మ వుండదని నమ్ముతారు భక్తులు.
శ్రీశైలం నుండి వచ్చిన ఓ జంగమయ్య యి ఏటి ఒడ్డున వెదురు గుంపుల మధ్య శివలింగాన్ని చూసి ఇక్కడే పూజాదికాలు నిర్వహిస్తూ వుండిపోయేడట. ఆ తరువాతేప్పుడో 1617 సం.లో జయపురం మహారాజు విశ్వంభర మహాదేవ్ దేవాలయం నిర్మాణం గావించారని చెబుతారు.
వేది చెబుతుంటే గోరాలో ఉద్విగ్నత.
”బలదేవుడు పాద స్పర్శతో పునీతమైన నేలలో మనం నిలుచున్నామనే భావనే నాకేదో తెలియని పారవశ్యాన్ని కలుగజేస్తోంది. హరికథా పితామహుడు ఆదిభట్ల బండి కట్టించుకుని వచ్చాడంటారే ఆ గుంప…యిదే కదా” రవీంద్ర సందేహం.
వరీనియా, లాంగుల్య, వేది యీ ముగ్గురు తప్ప మిగతా అందరూ గుంపకోవెలకు వచ్చింది అప్పుడే. అదే చివరిసారి కూడా. బేరేజీ నిర్మాణంలో ములిగి పోతున్న గ్రామాల్లో తిరిగి అందరూ కవితలు రాసేం. వాటిని ఓ సంకలనంగా తేవాలని అప్పటి మా ఆలోచన. వరీనయా, సాగర్, చలం కవితలు చూడ్డంలో నిమగ్నమై పోయేరు.
”పురాతన యాత్రా స్థలంగా ప్రసిద్ధి గాంచిన యీ శైవ క్షేత్రం కను మరుగై పోతున్న నేపద్యంలో ‘ఆలయం అదృశ్యమైపోతున్న దృశ్యం! గురించిన కవిత లేకపోతే ఎలాగా?” అన్నాడు వేది. అందరి కవితల్ని అప్పుటికే చదివేశాడు.
”ముఖచిత్రం కూడా అదే కాన్సెప్టెతో బొమ్మ యిద్దాం. కవిత్వ సందర్భానికి తగినట్టుంటుంది. కోవెలంటే కేవలం రాళ్ళ పేర్పు మాత్రమే కాదు కదా. అది వేలసంవత్సరాల జనం విశ్వాసాల కూర్పు. సాంస్కృతిక మూలాల నిర్మాణం. భక్తి, పూజ, దేవుడు.. కేవలం బయటికి చెప్పే కారణం మాత్రమే. అనేక జాతుల, భిన్న మతాల, వివిధ ప్రాంతాల, భిన్న సంస్కృతుల ప్రజలను ఒక చోటికి చేర్చే సంగమ క్షేత్రం. ఐక్యతా సందేశాన్ని లోకానికి అందించే గొప్ప వేదికలు కదా దేవాలయాలు. కాలప్రవాహానికి ఎదురు నిలిచిన శిల్పకళా ప్రాభవానికి ప్రతీకలు. దేవాలయాలు మన జాతి సాంస్కృతిక సంపదలు. గుడి ములిగిపోవడమంటే ప్రాచీన జాతి సంపదను భావి తరాలకు అందకుండా పోవడంగా భావించాలి…”
ఏవేవో ముప్పిరి గొంటున్న భావాలతో చూసేడు వేది వేపు లాంగుల్య ఏ చారిత్రక కాలాల్లోనో పరిభ్రమిస్తున్నట్టు.
”హలాయుధుడైన బలరాముడు తొలుత రైతు ప్రతినిధిగా మనకు దర్శన మిచ్చే పురాణ పురుషుడు. ఆ నాగలి అస్థిత్వం ప్రశ్నార్థకమై పోయిందిపుండు, రైతుల వలసతో వ్యవసాయం వ్యాపారమైపోయింది పెట్టుబడి దారుల వాణిజ్య పంటలతో విధ్యంస కృషికి జీవన చిహ్నాలుగా విరిగిన నొల్ల, బండి చక్రం, కబేళా దారిలో పశువులు… యి చిత్రం అట్టవెనక వేస్తే, మరింత అర్థ వంతంగా వుంటుంది కదా! వరీనియా సూచన.
అప్పటికే వేది మనో ఫలకం మీద బొమ్మ సిద్దమైపోయినట్టుంది. ‘కోవెల అదృశ్య మౌతునన్ని దృశ్యం’ శీర్షికతో కవిత రాసే బాధ్యత లాంగుల్య తీసుకున్నారు.
అందరం కవితలు చదివేం. అన్ని కవితలూ జాగ్రత్తగా విని సాగర్, వరీనియా, నిష్కర్షగా చెప్పేరు కొన్ని కవితలు సంకలనంలో వేయడానికి తగినవిగా లేవన్నారు తిరిగి రాయాల్సిందే అన్నారు.
అదీ యిప్పుడే జరగాలని పట్టుబట్టేరు చలం. స్వా.నా. తన కవిత నిడివి తగ్గించుకోడానికి ఓ చెట్టు కిందికి చేరుకున్నాడు. మేము మా కవిత్వ చర్చలో వుండగా వేది తన నఖ చిత్రాన్ని గీసేడు. గీసి, ఆ తెల్ల కాగితాన్ని ఎందటో ఏట వాలుగా వుంచి చూపించేడు. కాగితమీద ఎంబాస్ చేసినట్టు ఉబ్బెత్తుగా వున్న ఆ బొమ్మ నీడల రేఖలతో స్పష్టంగా కనిపించింది. అది నాగలి మొనమీద గిర గిరా తిరిగే భూగోళం.
” ఈ చిత్రాన్ని ఫోటో వేయించి పుస్తకానికి లోపలి టైటిల్ పేజీలో వేస్తే….”చలం, సాగర్ ఒకేసారన్నారు.
”భూమి నీటి అడుక్కి జారిపోయి జనం పక్షుల్లా ఎగిరి పోతుంటే నాగలి మొన మీద నిలబెట్టిన ఘనుడు మా పరిశి వావ్” చింతా తన సహజ ధోరణిలో చమత్కరిస్తే అప్పుడు వేది ఏమన్నాడూ?
”అవినీతి బంధం ప్రతీ కెరటాలై ఎగిసిపడే జల యాగంతో ములిగి పోతున్న భూగోళాన్ని రైతులోకమే సంఘటితమై రక్షించుకోవాలి కదామరి”
”ఔన్నిజమే. ఆ బాధ్యత మన అందరిదీ, రైతులోకాన్ని ఈ కవితా సంకలనంతో మనమే మేల్కొలుపుదాం. ఊరూరా పుస్తక పరిచయ సభలు జరుపుదాం” ఉద్వేగంగా అన్నాడు మల్లిపురం.
”అది సరే మరి పుస్తక ప్రచురణ కోసం ఆర్థిక వనరులు…” సందేహంగా చూసేడు వేది.
”ఆ పని నాది కదా” ఎప్పడొచ్చాడో శాంతి. అతని మాటతో అందరిలో మరింత ఉత్సాహం.
అప్పుడొచ్చేరు రాజు, అప్పారావు, ఆలస్యానికి సంజాయిషీ చెప్తూ. ఆ యిద్దరూ.. వేది దగ్గర డ్రాయింగ్ నేర్చుకుంటున్నారు. వస్తూనే ఆ నాగావళి ఒడ్డున తోటలో చెట్టుకు ప్లాస్టిక్ వైర్లు బిగదీసి వాటికి వేది గీసిన నఖ చిత్రాలఫోటోలు…పౌరాణిక చారిత్రక, సామాజిక అంశాలుగా విడదీసి ‘నఖ చిత్ర ప్రదర్శన’ ఏర్పాటు చేసేరు.
‘ఎవరిదీ ఆలోచన…బాగుంది’ సంతోషపడిపోయారు. అందరూ.
వన భోజనాలకు వచ్చిన వారంతా ఆ ప్రదర్శన చూసి ‘అద్భుతం’ అన్నారు. వేది కళ్ళలో మెరుపు.
”ఎన్నో చోట్ల విద్యా వైజ్ఞానిక మహాసభల్లో నఖచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేసేం. కానీ యిప్పటి యీ అనుభవం గొప్పది” అని సంబర పడిపోయేడు.
సందర్శకులంతా… ఆనఖ చిత్రాల్న చూసి అబ్బుర పడ్డారు.
ఆ చిత్రాల్ని ఎలా గీస్తారో వేది… అడిగిన వాళ్ళకు గోటితో బొమ్మతో గీసి చెప్పేడు.
ఇదో అరుదైన కళ. అంటూ వేదిని సంబ్రమంగా చూసేరు. కొందరు తమ బొమ్మలు గీయించుకుని మురిసి పోయారు.
ఎవరో అన్నారు ‘అరుదైన ఈ చిత్రాల్ని పుస్తకంగాతెస్తే?’ వేది వన్వి వూరుకున్నాడు.
కవిత్వ పఠనం. సాహితీ చర్చలు, మోహన్, రామానాయుడు, మల్లిపురం పాటలు, చింతా వోలకాలు.. వేది నఖచిత్ర ప్రదర్శన… ఆ కార్తీక మాసపు ఆఖరి సోమవారం సాయంత్రాన్ని అద్భుతంగా మార్చేసాయి.
నాగావళీ జల శరీరం. అలలు అలలుగా పులకరించింది.
మా చుట్టూ జనం. అనుకోని రీతిలో ఆ సాయంత్రం. అదో సాహిత్య సభగా మారిపోయింది. వరీనియా ఉద్వేగ భరిత మైన ప్రసంగం చేసేడు. నదిని దానం చేసాక కోల్పోనున్న జీవితాన్ని కళ్ళముందు అవిష్కరించేడు. ‘ముంపు మనది. సొంపు సంపన్నులది’ అని జలయజ్ఞం నేపద్యాన్ని… ఉత్తరాంద్ర వెనుక బాటు తనాన్ని ఎన్నెన్ని కథల్ని ఉదహరిస్తూ చెప్పేడు.
హృదయాలు బరువెక్కిపోయేయి.
అప్పుడందుకున్నాడు మల్లిపురం హూషారైన పాట
”మళ్ళీ మళ్ళీ ఆడింది గాలి
కొంటె చూపు విసిరి నవ్వింది నాగావళి…”
నాగావళి అలల తుళ్ళింతుల్లాగానే సాగి, హృదయాలను తేలిక పరిచి పాట చిరుగాలి మేనాలో పరిసరాలను చుట్టు ముట్టుంది.
గుంపకోవెల వెనక్కి పొద్దు జారి పోతుంటే తదేకంగా చూస్తూ వేది కవితా సంకలనం ముఖ చిత్రానికి మనసులోనే రంగులు కలుపుకుంటున్నట్లు కనిపించేడప్పుడు.
* * *
అనుకున్న దాని కంటే బాగా వొచ్చి పుస్తకం. వేది చిత్రించిన నీటి రంగుల ముఖచిత్రం సంకలనానికి గొప్ప ఆకర్షణ అయ్యింది.
బేరేజీ పూర్తయ్యాక జల సమాధి కానున్న గుంపసోమేశ్వరాలయం చిత్రాన్ని అద్భుతంగా చిత్రించలేదు. ఆలయ గోపురం కలశం మీద రెక్కలల్లార్చుతూ వాలుతున్న ‘గెద్ద’ను .. ఆ ప్రక్కనే జల సమాధి మీద నౌకా విహారాన్ని చిత్రించి మా గ్రామాలకు పట్టబోయే దుర్దశను ముందుగానే సూచించాడు. డి.టి.పీ అవుతున్నప్పుడే కంప్యూటర్ ముందు కూర్చుని ఫ్రూపులు దిద్దారు. ఒక్క అచ్చు తప్పూ లేకుండా చేసేరు. పుస్తకం పూర్తమయ్యేదాకా పట్నంకీ, ఇంటికీ కాళ్ళరిగేలా తిరిగేడు. అయినా అనుకున్న తేదీకి పుస్తకం ఇవ్వలేక పోయేడు ప్రెస్ వాడు ఏవేవో కారణాలు చెప్పి. ఆవిష్కరణ సభ. అనేక ప్రాంతాల నుండి విశేషంగా వచ్చేరు సాహితీ మిత్రులు. పుస్తకం బాగా వచ్చిందన్నారు. ముఖ్యంగా కవర్ పేజీ వేదిని ప్రశంసలతో ముంచెత్తేరు. విషాద మేమంటే ఆనాటి ఆవిష్కరణ సభలో వేది లేకపోవడం.
ఊరు ఖాళీ చేసేక పరిస్థితులు మారిపోయేయి. ప్రస్తుతం వుంటున్న వూరును వదలి వలస బండిని ఎక్కక తప్పలేదని ఎక్కడో బతుకు తెరువు చూసుకున్నాక ఆవిష్కరణ సభ తేదీ తెలియ జేస్తే వచ్చే ప్రయత్నం చేస్తానని ఉత్తరం రాస్తూ ఓ సెల్ నంబరు యిచ్చేరు. ముఖ చిత్రం ఒరిజినల్ పెయింటింగు ప్రెస్ నుండి తీసుకు పోతున్నట్టు రాసేరు.
ఆవిష్కరణ సభ అనుకున్నాక వేది యిచ్చిన నవంబర్‌కి ఫోన్ చేస్తే… నంబరు మనుగడలో లేదని సమాధానం. వేది నుంచి ఫోన్ లేదు.
తాను గీసిన బొమ్మ ముఖచిత్రంగా వస్తుందని ఎంత పొంగి పోయేరో వేది. వేది కోసం చేసిన ఏ ప్రయత్నమూ ఫలించలేదు.
ఆలస్యంగా తెలిసిన విషయం ఇదీ…
”ఊరు ఖాళీ చేసే సమయం లోనే ‘గ్లకోమా’ ఆపరేషన్ కోసం పర్లాఖిమిడి వెళ్ళేడు వేది. ఇల్లు ఖాళీ చేసే హడావిడిలో వేది చిత్రించిన వర్ణచిత్రాలు, సభ చిత్రాలు పాత ఇంట్లోనే వదిలేసాడు వేది కొడుకు. ఆ బొమ్మలంటే కూడా ఏమూలో కోపం వేది కొడుక్కి… వేది పెదనాన్నకి.. ఆ బొమ్మలే తాము ఆర్థికంగా ఎదగలేక పోవడానికి కారణమని వారి ఆరోపణ. తరువాతెప్పుడో వెళ్ళి చూస్తే ఊరు చుట్టూ నీరు. ఇంట్లో పాములు. తేళ్ళు..పురుగూ పుట్రా… బొమ్మలు దాచిన అట్టపెట్టి నిండా చెదా. ఒక్క బొమ్మా మిగలలేదు. జీవిత కాలపు కళాసృజన చెదపురుగుల పాలయ్యింది. అప్పటి నుంచీ వేది ఆస్థిమితంగా వున్నాడని… ఎక్కెడెక్కడో తిరుగుతున్నాడనీ…”
ఎలాగైనా వేదిని కలుసుకోవాలని అనుకున్నాను. అక్కడక్కడా వాకబు చేసుకుంటూ వెళ్ళేను. జబ్బుతో మంచానున్న వేది పెదనాన్న, వేది కొడుకు గురించిన వివరాలు చెప్పాడు.
కుతుబుల్లాపూర్‌లో ఓ అపార్ట్‌మెంట్ నిర్మాణంలో ఇటుకలు మోస్తూ కనిపించారు వేది కొడుకు.
నన్ను చూసికంట నీరు పెట్టుకున్నాడు. దుఖం ఆపుకోలేకపోయాను. ”ఆరు మాసాలయింది నాన్న ఇల్లు వదలి… ఎన్నో చోట్ల వెతికేను…జాడలేదు.” అని బావురుమన్నాడు.
నా రెండు కళ్ళూ వర్షిస్తున్నాయి. ఓ కంట నాగావళి ఓ కంట జంఝావతి. నా కన్నీటి ఏటిలో పుస్తకం మీద గుంప ఆలయ గోపుర కలశం ములిగిపోయింది.
”యీ పెయింటింగ్ ఒరిజినల్ శిల్పారామంలో చూసేన్నాన్నా” నా చేతిలో పుస్తకం తీసుకుని ముఖచిత్రం చూసి చెప్పేడు మా అబ్బాయి సంబ్రమంగా.
”పాపం ఆర్టిస్ట్ బాగా యిబ్బందుల్లో వున్నట్టుంది నాన్న. జబ్బు పడ్డట్టున్నారు. పెరిగిన జుట్టూ” గెడ్డం… అదీ పిచ్చోడిలా… దయనీయంగా వున్నాడు. నా వేపు చూసేడెందుకో… గోటితో నా బొమ్మ కూడా గీసేడు…” అని తెచ్చి చూపించేడు.
అవే గీతలు.
అత్యంత ఆకర్షణీయమైన కొనగోటి గీతలు.
వాడే మావేది..పరసువేది.
”రోజూ … సాయంత్రం ఓ గంట అక్కడ గోటితో బొమ్మలు గీస్తుంటాడట నాన్న…” మా వాడేదో చెప్తున్నాడు.
వెంటనే బయలు దేరాను.
”….నాన్నా యిప్పుడెక్కడికీ… నీ కసలే హెల్త్ బాగోలేదు..” ఆపబోయేడు మా అబ్బాయి. వినిపించుకునే స్థితిలో లేన్నేను.
పరుగు లాంటి నడకతో రోడ్డెక్కాను.
ఆటో… బస్సులు …మారి ట్రాఫిక్ జామ్‌ల పద్మవ్యూహాల్ని ఛేదించుకుని శిల్పారామం చేరుకున్నాను. అయితే…అప్పటికే…
పొద్దు ములిగిపోయింది.
May 2nd, 2009 at 1:18 am
ప్రాణహితలో మీరు ప్రచురించే కథలు, కవితలు ఎక్కడినుంచైనా ఎత్తేస్తున్నారో, లేదంటే ప్రాణహితకోసమే రాయిస్తున్నారో తెలీడం లేదు. అది చెప్పండి, చెప్పకపోండి గానీ, ఈ కథా రచయిత పేరు తప్పు కొట్టేశారు. గంటేడ గౌరునాయుడు. రచయిత పేరు సరిగా రాసి, ఈ కామెంట్ తొలగించ ప్రార్థన.
May 2nd, 2009 at 11:10 am
దుప్పల రవికుమార్ గారూ
తప్పు సరిదిద్దినందుకు ధన్యవాదాలు! ప్రాణహిత కోసం రచయిత దగ్గర తీసుకున్న రచన ఇది. రచయిత పేరు తప్పుగా ప్రచురింపబడింది. మన్నించ ప్రార్థన.
ప్రాణహిత సంపాదకవర్గం
May 21st, 2009 at 10:03 am
ఈ కధలు చదివిన తరువాత నీను కుడ రాయాలనుకున్నాను… అందుకీ ఇలా అరుణ కధను పిడిఎఫ్ లొ సెండ్ చెస్తున్నాను. నీను అను ఫాంట్స్ లొ చెయ్యగలను.. అందుకీ ఈ ఫాంట్ సరిగా చెయ్యలీక పొతునాను.
May 22nd, 2009 at 10:18 pm
నిర్వాసిత గ్రామాల ఆర్తి గీతం. కవి కధకుడైన మాస్టారి కధ బాగుంది.