పబ్లిక్ హియరింగ్

- పి. వరలక్ష్మి

ఏడేళ్ల తరువాత దిలీప్ వాళ్ల అవ్వగారి ఊరికి పోతున్నాడు. తాత చనిపోయినప్పుడు పోయిందే చివరి సారి. అవ్వ చాలా సార్లు కబురు పంపింది రమ్మని. టెంత్ క్లాస్, ఎంసెట్, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ క్లాసులు, ఎప్పుడూ బిజీ బిజీ. ఇప్పుడైనా మెడిసిన్లో సీటు రాకపోబట్టి, డిగ్రీలో చేరబట్టి కొంచెం గాలి పీల్చుకుంటున్నాడు. దిలీప్ వాళ్ల అవ్వగారు ఊరు ఈమధ్య తరచు పేపర్లో వస్తోంది. తన ప్రాజెక్టు వర్క్ కు దానికి సంబంధం వుంది. తను చిన్నప్పుడు ఆటలాడిన ఊరి పట్ల ఆసక్తి పెరిగింది. అవ్వను కూడా ఒక సారి చూసి రావచ్చనుకున్నాడు.

ఆ ఆదివారం ఉదయం పది గంటలకంతా వేముల చేరుకున్నాడు. మండల కేంద్రం కావడంతో ఏవేవో పనుల కోసం కొందరు, పనీ పాట లేని యువకులు కొందరు అప్పుడపుడే బస్టాప్ చుట్టూ మూగుతున్నారు. కొత్తగా వేసిన తార్రోడ్డు మీద ఎండ పడి నిగనిగా మెరుస్తోంది. రోడ్డుకు ఇరువైపులా చిన్న చిన్న అంగళ్లు. ఓ పదడుగుల దూరంలో ఒక టీబంకు బైట దోసెలేస్తున్నారు. టిఫిన్ తిందామని అటుగా కదిలాడు దిలీప్. ఆరోజు దినపత్రిక నాలుగు ముక్కలు నలుగురి చేతుల్లో ఉంది. వాళ్లంతా సుమారు మధ్య వయసు వాళ్లు. అడ్డ పంచెలు కట్టుకుని ఉన్నారు. వాళు మాట్లాడుకునే మాటలు టిఫిన్ తింటూ ఉన్న దిలీప్ ఆసక్తిగా వినసాగాడు.

“ఔన్న! యురేనియం ఫ్యాట్రీ వస్తాదంటావా? ఏందో రోగాలొచ్చాయని చెప్తాండారే!”
“వాళ్లేమనుకుంటే అది చేసేస్తారు. ఎవర్రా వాళ్లకు ఎదురు నిలబడేది?”
“అంతకు ముందు మన రెడ్డే వొద్దని కొట్టాడ్నాడంటనే!”
“అప్పుడు ఎగస్ పార్టీ కదా”
“వొద్దనేదీ వాళ్లే, కావాలనేదీ వాళ్లే. మద్దెన మనమే ఎర్రినాకొడకలం”
“ఏం సేస్చాం లేన్నా. రాజ్జెం వాళ్లది. ”
“అందరం ఒక కట్టుమీనుంటే. . ”
“అది అయ్యేదేనా. . పోయెచ్చాన్నా. యమ్మార్వో ఆఫీసు కాడికి పోవాల. ”
పేపర్ మడిచి బెంచీ మీద పడేసి రోడ్డు దాటుతూ పోయాడతను. మిగిలిన వాళ్లు ఏవో మాటల్లో పడిపోయారు. దిలీప్ ఆ పేపర్ తీసుకొని చదవసాగాడు.
‘యురేనియం-ఉరేనయం’మొదటి పేజి వార్త చదివే సరికి బస్సొచ్చేసింది. పర్వాలేదే. తొందరగానే వచ్చింది. కిటికీ పక్కన సీటు కూడా ఉంది.

కొత్త రోడ్డు పైన సాఫీగా సాగిపోతుంది బస్సు. ఇంతకు ముందొచ్చినప్పుడు దుమ్ముపొగ మనిషెత్తు ఎగజిమ్మేది. అవే రాతి గుట్టలు . అక్కడక్కడా గుబురుగా పెరిగిన తుమ్మ చెట్లు తప్ప గుట్టలన్ని బోడిగా వున్నాయి. సెగలు సెగలుగా వేడిగాలి తట్టుకోలేక కిటికి అద్దం అడ్డుగా జరుపుకున్నాడు . మెల్లగా నిద్దురలోకి జారుకున్నాడు ముందుసీటులో చంటిబిడ్డ గట్టిగా ఏడ్వడంతో మెలుకువ వచ్చింది. ఊరి దరిదాపుల్లోకి వచ్చినట్టుంది బస్సు. గుట్టలు వాలుగా సాగు చేస్తున్న వేరుశనగ పంట ఆకు పచ్చని కార్పెట్ పరచినట్టు. భూమిలోపలి పోలలో నుండి నీరు తుంపరుగా పంటను తడుపుతూ గాలిలో ఓ గమ్మత్తైన వాసన నింపుతుంది.

“వావ్ !స్ప్రింక్లర్స్ “పైకే అన్నాడు దిలీప్.
ఈ మధ్య పంటలు బాగానే పండుతున్నాయని, మామ వాళ్ళు కాస్త ఆర్ధికంగా నిలదొక్కుకున్నారని దిలీప్ కు తెలుసు. స్ప్రింక్లర్ ఇరిగేషన్ గురించి చదువుకున్నాడు గాని ఇదే ప్రత్యక్షంగా చూడటం.
“టెక్నాలజి కెన్ బ్రింగ్ రెవెల్యూషొన్”అనకుండా ఉండలేక పోయాడు.
గట్టుపల్లి శివారులో దిలీప్ ను దించి ముందుకు వెళ్ళిపోయింది బస్సు.
అరటి తోటల్ని, పొద్దుతిరుగుడు, వేరుశనగ చేలనీ దాటుకుంటూ వెళుతున్నాడు దిలీప్. ‘క్యువ్, క్యువ్’ అంటూ పిట్టల అరుపులు తప్ప ఏ శబ్దమూ లేదు. అక్కడక్కడా మోటర్ల దగ్గర కొంత మంది రైతులు ఈ కొత్త మనిషి ఎవరా అని చూస్తున్నారు. ఈ మధ్య ఎవరెవరో పట్నమోల్లు ఆ ఊరికి వస్తూ పోతూ ఉన్నారు. పంట చేలనీ, జీవాలనీ తన సెల్ కెమెరా లో బందిస్తూ ముందుకు నడుస్తున్నాడు దిలీప్.
ఊరి మొగదాల్నే “యురేనియం కర్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్” బోర్డ్ ఉన్న చిన్న భవనం, దాని చుట్టూ కంచె. ఇంకాస్త దూరం నడిచాక యూనిఫారంలో ఉన్న బడిపిల్లల్లా అన్నీ ఒకే రంగు వున్న ప్రభుత్వ పక్కా ఇల్లు . ఊర్లోకి వస్తూనే”ఎవరింటికి పోవాల”వంటి ప్రశ్నలతో ఎదురైన వాళ్ళకు సమాధానం చెప్పుకుంటూ ఆ ఊళ్ళో ఐదెకరాల రైతు సుబ్బిరెడ్డి ఇంటిముందాగి ఎగాదిగా చూశాడు. ఇది తన అవ్వ ఉండే ఇళ్ళే అయితే బాగా మారి పోయిందనుకున్నాడు.

చొప్పదంట్లతో సగం కూలిపోతూ ఉండిన వారపాకు ఇప్పుడు లేదు. స్లాబ్ వేయించిన వరండాలో నిలబడి లోపలికి చూశాడు.
“బస్సొచ్చి చాలాసేపయ్యిందే, ఇల్లు కనుక్కోలేదా యేంది?”సీతమ్మ బైటికొస్తూ అల్లున్ని పలకరించింది. “యౌరూ వచ్చిండేది”అంటూ అవ్వ బయటికొచ్చి “ఏరా అబ్బీ, ఒక్కనివే వొచ్చినావా . అమ్మా, నాయనా అందరూ బాగుండారా”అనిదిలిప్ ను పలకరించింది.
“అంతా బాగుండారు గాని , ఊరు చానా మారిపోయినట్టుందే స్ప్రింక్లర్లు, తోటలు . . . మనిల్లు గూడా. అసలిది మనిల్లేనా?”
“ఏం మారిపోడమో!ఏమో నువ్వీసారి వచ్చ్యాలకు అసలు ఊరుంటాదో ఉండదో”అవ్వ వొచ్చి మంచం వాలుస్తూ అంది.
“అవునూ, యురేనియం ప్రాజెక్టు వస్తమదట కదా”? మంచం కింద కూలబడుతూ దిలీప్
“ఆ! అదేందో ఫ్యాట్రీ పెడ్తన్నారని చెప్పినారు. ఉజ్జోగాలొసాయంట, భూములంకు రేట్లొస్తాయంట అని ఎవడు జూసినా ఆ యవారాలే” చేతులు తిప్పుతూ అంది సీతమ్మత్త.
“ఎవరు జెప్పినారు?”

” ఎవరో పైనుంచి ఆపీసర్లొచ్చినారు. ఆడ, ఈడ మిషన్లు పెట్టి ఏందేందో రాస్కొని పోయినారు. మల్లొకపారి కలకతేరు, యంపి వచ్చి ఫ్యాట్రీ పెడ్తామని, పిల్లోల్లందరికీ ఉజ్జోగాలొస్చాయని, భూములు లచ్చలకు పోతాయని, చానా చెప్పినార్లే”
“ఏరా దిలీపూ, ఎన్నాళ్లకొచ్చినావురా. అమ్మా, నాయనా బాగుండారా” సేనుకు మందుగొట్టోఛ్ఛీ శూభ్భీఋఏడ్డి మేనల్లున్ని పలకరించాడు.
“అంతా బాగుండారు మామా. సీనూ, మురళి ఏంజేస్తన్నారు. మురళిగాడు పది పాస్ అయినాడా?”
“ఆ!కిందా మిందా పడి ఏందో ఐనాడులే మూడేండ్లకు, సీనుగాడు ఐ టి ఐ జేసి మూడేండ్లాయె. ఉజ్జోగం, ఉజ్జోగం అని రెడ్డి సుట్టూ తిరిగి వానికి సాలయ్యింది. ఇప్పుడిప్పుడే వాడు సేలో పనికి వంగుతున్నాడు. ఈ నాయాల్లు అట్ల సదువుకు గాకుంగా అట్ల పనికి గాకుండా యాడ పరంబోకులైతారో అని నా బయం”
“ఏంటికైతారు లేబ్బా, వాల్లే తెలుసుకుంటారుగాని” సీతమ్మ సర్దిచెప్పబోయింది.
“ఆ బుద్ది ఉంటే పనంతా నా నెత్తిన దిగి ఊరి మీంద బడి తిరుగుతారా”
” అబ్బబ్బా! పొద్దన లేసినాల్నించి ఈల్లతో ఇదే సంత. తలకాయ నచ్చాందిరా” అవ్వ తల కొట్టుకుంది.
“ఇది రోజూ ఉండేదిలే గాని నువ్వు పోయి కాల్లు మెకం కడుక్కొని రాబ్బీ, కాపీ తాగుదువు” సీతమ్మ
“ఇప్పుడేం కాఫీలేత్తా, కొంత సేపుంటే అన్నం తినొచ్చు” అంటూ దొడ్లోకి నడిచాడు. దిలీప్ మొహం కడుక్కొని వచ్చేసరికి సీను వచ్చాడు.
“ఏరా దిలీప్, ఇప్పుడేనా రావడం. ఇంట్లో అంతా బాగున్నారా?”
దిలీప్, సీనుదీ ఒకటే ఈడు. చిన్నప్పట్నుండి వాళ్లు మంచి స్నేహితులు కూడా.
“నేనొస్తానని ఫోన్ చేసినా యాడీకి పోయినావ్ రా”
“ఊర్లో పనుండి అట్ల పోయినా లేరా. అయినా నీకు స్వాగతం పలకాల్నారా?”
ఆ మాటా ఈ మాటా మాట్లాడూతూ మధ్యలో యురేనియం ప్రస్తావన వచ్చింది. దిలీప్ తన ప్రాజెక్ట్ వర్క్ గురించి చెప్పాడు.
“నీకేం లేరా! ఇంక జాబ్ కూడా వచ్చేస్తుంది”
“కొంపదీసి యురేనియం మైనింగ్ లో జాబారా నువ్ చెప్పేది”
“అది గాక ఇంకేంది రా!”
“మేమూ ముందు అనుకున్నాం రా. ఇంటికొక ఉద్యోగమంటే, అబ్బ ఇంగేం కావాల్రా అని. అంతా ఉత్తదిరా. మా భూములు గుంజుకోనీకి కతలు జెప్తన్నారు. ”
“అబద్దం ఎట్లయితాదిరా. ప్రాజెక్టు వచ్చినాక జాబ్స్ లేకుండా ఉంటాయ?”
“వాళ్ల ఇ ఐ ఏ రిపోర్ట్ (ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అస్సెస్ మెంట్. . పర్యావరణంపై ప్రభావాన్ని అంచనా వేసే నివేదిక) లోనే ఉంది గదరా. మొత్తం ఉండేదే తొమ్మిది వందల ఉందోగాలు. స్కిల్డ్ జాబ్స్ లో మాకు తర్టీపర్సెంట్ ఇస్తారంట. ఆపైన కాంట్రాక్టర్ల ఇష్టం. ఇచ్చినా మా సదువులకు ఆఫీసరుజ్జోగాలొస్తాయా. లచ్చనంగా బూములు జేసుకోక ఆ గనుల్లో పడి సావాల్నా?”
“నువ్వేందిరా ఇట్ల తయారైనావ్? ఉద్యోగం కోసం ఆమైన తిరుగుతాంటివి!”
“ఇన్నాల్లూ కుక్క మాదిరి వాల్లెనకాల తిరిగినారా. నానాక పనులు జేసినా. ఏమెచ్చిందిరా? ఇప్పుడు ఉద్యోగాలిస్తాం అంటే నమ్మాల్నారా?’
” ముప్పై ఏండ్ల నుంచి ఆ ఎంకరెడ్డిని నెత్తిన మోసినాం. వాడు ఎమ్మెల్యే అయినాడు, మంత్రి అయినాడు. మాకేమొచ్చింది? నీల్లు ల్యాక, పంట ల్యాక కనాకస్టంగా బతికినాం. ఇరవై ముప్పై మైల్లు పోయి సున్నం అమ్ముకున్నాం, కట్టెలమ్ముకున్నాం. ఏదో ఈ ఏడెనిమిదేండ్ల నుంచి సొంత మోటర్లేసుకొని, స్ప్రింకర్లు అయీ పెట్టుకొని ఇంత లెక్క కండ్ల జూస్తున్నాం. ఇన్నాల్లూ మమ్మల్ని పట్టీంచుకోనోడు ఇప్పుడొచ్చి అదేందో ఫ్యాక్ట్రీ అని నెత్తిన బండ దెంగుతన్నాడు. ” కొట్టం కాడికి పోయిన సుబ్బిరెడ్డి అప్పుడే వచ్చాడు.

“ఈ పెద్దోడు ఈ నడమ సొంత పనికి వొంగుతన్నాడులే అనుకుంటే ఇదొచ్చి పడింది. ఎట్ట జేయాల్నో ఏమో!”
వంట పని కానిచ్చి సీతమ్మ వరండా లోకొచ్చింది.
“ఆ నావట్టలకు మాబూములే కవాల్సొచ్చినాయా. . ” ఆపకుండా తిట్ట బట్టింది.
“ఊరికి తీసుకుంటారాత్తా, డబ్బులిస్తారు గదా” దిలీప్ అడ్డొచ్చాడు.
“ఏందయా వాళ్లిచ్చేది. ఎకరానికి లక్షిచ్చినా అంతా గలిపి రెండు మాసీలు మైన గదు. వాల్లిచ్చేది నా సమ్మచ్చరాదాయమే గదా. ఐనా అమ్మేవానిస్టం ల్యాకుండా కొన్నుక్కోనీకి వాడెవడు?” సుబ్బిరెడ్డి కయ్యిమనేసరికి దిలీప్ బిత్తరపోయాడు.
“అయినా లెక్క ఎంత సేపుంటాదిబ్బీ. ఎప్పటికైనా బూమి ఉంటే ఆదరవుగాని” అంది అవ్వ అనున యిస్తున్నట్టుగా .
“ముందు అన్నం తిందు రాండి. మల్ల జేచ్చురు యవ్వారాలు”సీతమ్మ అంతటితో సంభాషణను తెంపేసింది.
“మురళి గాడేడి, కనపడలేదు” దిలీప్ ఏదో గుర్తొచ్చినవాడిలా
“ఈ సంవత్సరం ఇంటర్ చేరినాడు గదా. పొద్దన పోతే సాయంతానికిగ్గాని రాడు. ముందు అన్నం తిందాం పాండి”సుబ్బిరెడ్డి తొందర చేసాడు.
. . . . . . . . . . . . . .
“అవున్రా! ఇందాక ఇ ఐ ఎ రిపోర్ట్ అన్నావు. అది నువ్వు చదివినావా?” సీను ను అడిగాడు దిలిప్.
“అంత రిపోర్ట్ నేన్యాడ సదువుతారా. రెండు వందల పేజీలు. పైగా ఇంగ్లీషు. నిన్న మానవ హక్కుల సంఘం వాళ్ళొచ్చినారు. వాళ్ళదగ్గర ఐదు పేజీల సమ్మరి ఉంటే ఇప్పిచ్చుకున్నా. ఒక సీడీ కూడా ఉంది. నీకు పనికొస్తుందేమో చూడ్రా” కొన్ని పేపర్లు, సీడీ తెచ్చి ఇచ్చాడు.
సీను తో కలసి ఊరంతా చుట్టి వచ్చాడు దిలిప్. పరిచయస్తుల ఇల్లకు వెళ్ళారు. ఎక్కడ చూసినా ఇదే చర్చ. “యాడ్నుంచి వచ్చిందిరా ఈ పీడ” అనుకుంటున్నారు.
“ఇంకేంటిరా విశేషాలు . ఏడుగంటల బండికి ఊరికి పోతన్నా”
పడమటి సూర్య కాంతులు ఆ ఇంటి వరండాను ఎర్రగా తడిపేస్తూ ఉండగా కాఫీ గ్లాసు ఖాళీ చేసి మంచం కింద పెడుతూ దిలీప్ లేచాడు.
“రెండ్రోజులుండి పొవచ్చుకదరా. ఎన్నాళ్ళ తర్వాత వచ్చినావు”
“ప్రాక్టికల్స్ ఉన్నాయని చెప్పినా గదరా. అయినా మళ్ళా వస్తాం అంటున్నా గదా. పబ్లిక్ హియరింగ్ రోజు మా టీం అంతా వస్తుంది”
“మురళి ఇంకా రాలేదే. వాడ్ని చూడనే లేదు . ఎన్ని రోజులైందో ”
“ఉండమంటే వినవ్ గదరా”.
“అర్ధం చేసుకోరా . నెక్స్ట్ వీక్ వస్తున్నా గదా”.
అవ్వ, అత్త, మామ దిలీప్ కు వీడ్కోలు చెప్పారు.
“అప్పుడప్పుడూ వస్తూండు నాయనా . నేనింగా ఎన్నాళ్ళుంటానో . అమ్మను, నాన్నను అడిగినానని చెప్పు. ”
అంటూ అవ్వ వద్దన్నా వినకుండా అడపం లోంచి నాలుగు నోట్లు తీసి దిలీప్ జేబిలో కుక్కింది.
దిలీప్ ను బస్సు దాకా దిగబెడతానని సీను కూడా వెంట నడిచాడు.

“ఆయప్ప కు ఎదురు చెప్పే ధైర్యం ఈడ ఎవరికి లేదురా దిలీప్ . కడప నుంచి, హైద్రాబాద్ నుంచి మానవ హక్కులోళ్ళు వచ్చి చెప్పంగా , చెప్పంగా ఇప్పుడు కొంత మేలురా. పోయిన వారం యం. పి. వచ్చినప్పుడు ఆడోల్లంతా జీపుకు అడ్డంగా నిలబడినారు. ఇన్నేండ్లనుంచి మిమ్మల నమ్ముకున్నందుకు ఇట్ట జేస్తవా రెడ్డీ అని మొత్తుకున్నారు. ఏమనుకున్నాడో ఏమో , సైగ్గాకుండా ఎనిక్కి పొయినాడు. రొండ్రోజుల్నుండి రెడ్డి మనుషులు ఇంటింటికీ తిరుగుతున్నారు. మొన్నటిదాకా బాగుండె మా సర్పంచి . నిన్న టీవి వాళ్ళతో అంతా అడ్డం మాట్లాడినాడు. “

ఆ కొట్టలపల్లోల్లేమో ఇప్పటికే బూములు అమ్మేసుకున్నారు. సచ్చినోని పెండ్లికి వొచ్చిందే కట్నమని, అ బరక బూములకు ఆ మాత్రం రేటొస్తే సలనుకున్యారేమో! వాల్లందర్నీ మాకు అడ్డం తిప్పుతన్నాడు రెడ్డి. “

మే, మే. . అని అరుచుకుంటూ మేకల మందలు, గొర్రెల మందలు, మందంగా నెమరేసుకుంటూ యనుములు, దూడలు దుమ్ములేపుకుంటూ ఇండ్లకు తిరిగి పోతున్నాయి. వాటిని అదిలిస్తూ వెనకనే పిల్లకాయలు ఏవో సినిమా పాటలు పాడుకుంటూ నడుస్తున్నారు.
“చాలా అశ్చర్యంగా ఉందిరా. మీ భూములకేమో నీళ్లుండాయి. పక్కనే చుక్క నీళ్లు పడని పల్లెలు. ”

మనూర్లో కూడా బోర్లు ఎత్తిపోతన్నాయిరా. ఈసారి కాలవకు నీళ్లిడిచ్చామన్నరు. అన్నీ సాంక్చన్ అయినాయని చెప్పినారు. అవి యురేనియం కోసమని ఇప్పుడర్ధమైతాంది. ”
“ఇద్దరూ రోడ్డు మీదికొచ్చారు. పక్షులు గోలగోలగా అరుస్తూ గూడు చేరుకుంటున్నాయి. మెల్లగా చీకట్లు అలముకుంటున్నాయి.
“ఊరోళ్లంతా ఏమంటనార్రా? పబ్లిక్ హియరింగ్ రోజు అందరూ మాట్లాడతారా?”
“ఆ రెడ్డి మనుషులు తప్ప, నూటికి తొంభై మంది గట్టిగా మాట్లాడదామనే ఉండారు. సారోళ్లు గూడా చెప్పి నార్లే, ఇప్పుడు మాట్లాడకుంటే ఇంగ మీ గోడు ఎవ్వడూ వినడని. . ”
“ఈ లోపల వాళ్లేమైనా చెయ్యరా?”
“ఆ భయం గూడా ఉందిరా. అయినా తప్పదు గదరా. అయినా మేమేం అడుగుతన్నం, మా భూములు మా కున్నియ్యమంటన్నాం. ఆ రెడ్డి ఆస్తి గావాల్నెన్నామా?”
“బస్సొస్తాన్నెట్టుంది” హారన్ శబ్దం వింటూ అన్నాడు సీను.
“మరి నేనొస్తాన్రా. నెక్ట్ సండే కలుద్దాం”
“సరేరా! అందరూ ఇంటికొచ్చేయండి. మీటింగ్ కాడికి కలిసే పోదాం. నాకు ఫోన్ చెయ్యి. ఎన్ని గంటలకు రావాల్నో చెప్త”
“బాయ్ రా. . ” చెయ్యి ఊపుతూ బస్సెక్కాడు. దిలీప్. బదులుగా చెయ్యి ఊపాడు సీను.
. . . . . . . . .
ఆ రోజు క్లాసులో దిలీప్ పరిస్థితి బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్ అన్నట్టుగా ఉంది.
“ఏరా మామా మూడాఫ్ గా ఉన్నావ్?” ఇంట్ర్వెల్ లో సురేష్ పలకరించాడు.
“మా అవ్వోళ్ల ఊరికి పోయెచ్చినారా. మన ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకోవాల. ఈవినింగ్ మన టీం వాళ్లమంతా కలవాలి” సురేష్ ప్రశ్నను పట్టీంచుకోలేదు దిలీప్.
“ఊర్లో ఏమన్న. . ? ఎటో వెళ్లిపోయింది మనసు, ఎటెళ్లిందో అది నాకు తెలుసు. . ” పాట పాడుతూ ఆట పట్టించాడు సురేష్.
“మూస్కోరా, ఎప్పుడూ అదే గోల. ఈవినింగ్ అంతా మాఇంటికి రాండి. నాకు హెడేక్ గా ఉంది, నేనింటికి పోతన్నా. . బాయ్. . . ”
. . . . . . . .
సాయంత్రం సురేష్, మనోహర్, రాజు దిలీప్ వాళ్లింటికొచ్చారు.
“మిగితా వాళ్లేరిరా” వాకిట్లోనే అడిగాడు దిలీప్.
“సినిమాకు పోయినార్రా. వాళ్లతో ఏంగాని మ్యాటర్ ఏందో చెప్పు”
ఊరి విషయాలన్నె చెప్పుకొచ్చాడు దిలీప్.
“ఆ సి. డి. చూసినాన్రా. రియల్లె హారిబుల్. రేడియేషన్ ఎఫెక్ట్స్ అని మనం చదువుకున్నాం గదా. చూస్తాంటే ఎంత భయంకరంగా ఉందిరా!
జాదూగూడలో ట్వెంటీ పర్సెంట్ మందికి కాన్సర్ ఉందంట. మ్యుటేషన్స్ (జన్యుమార్పులు) వల్ల ఎంతో మంది పిల్లలు డీఫార్మిటీస్ (అంగవైకల్యాలు) తో పుడ్తున్నారు. మనకు గూడా ఆ పరిస్థితి వస్తాదా?”

“రేయ్! నువ్ కొంచెం ఎక్కువ ఫీలైతన్నావ్రా. మనం ప్రాజెక్ట్ వర్క్ చేసినామా అంటే చేసినాం. అంతే!
అయినా రేడియేషన్ ఎఫెక్ట్స్ గురించి మనకెందుకురా? ఇంకా ప్రాజెక్ట్ రానేలేదు. ఈఐఎ రిపోర్ట్, పబ్లిక్ హియరింగ్. .
ఈ మ్యాటర్ కలెక్ట్ చేస్తానని నువ్వు యాడికేడికో పోయినావ్” మనోహర్ తల కొట్టుకున్నాడు.
“ఇ ఐ ఎ రిపోర్ట్ గురించి నేను కొంచెం ప్రిపేర్ చేసినా. సండే పబ్లిక్ హియరింగ్ తీసుకుందాం. అక్కడ కొన్ని ఫోటోస్ తీసుకుంటే సరిపోయె!” ఇంకేమిటి అన్నట్లు చూశాడు సురేష్.
“నెట్ లోనుండి నేను కొన్ని డౌన్లోడ్ చేశాను”. . రాజు

వాళ్ల ఎన్విరాన్మెంటల్ సైన్స్ ప్రాజెక్ట్ గురించి అయితే దిలీప్ ఫ్రెండ్స్ సరిగ్గానే చెప్పారు. కాని దిలీప్ ఆలోచనవేరు.

“అది కాదురా బాబూ! పబ్లిక్ హియరింగ్ రోజు మనం కూడా ప్రాజెక్టును అపోజ్ చేద్దాం” దిలీప్ సూటిగా అసలు విషయానికొచ్చిండు.
“మనకెందుకురా బాబూ. అయినా డెవలప్మెంట్ జరగాలంటే భూములు పోకుండా ఉంటాయా? ఇండస్త్రీస్ ఏమన్నా గాలిలో కడ్తారా?”
“డెవలప్మెంట్ ఏందిరా, దానివల్ల వచ్చే పొల్యుషన్?”
“ఆ సి. డి. గురించారా? మీడియా, పొలిటీషియన్స్ కలిసి బ్లోఅప్ చేస్తారు. ఎంత కాంట్రవర్సీ అయితే వాళ్లకంత లాభం”
“రేయ్ స్టుపిడ్! బ్లోఅప్ చేయడం ఏందిరా. నువ్వు చదువుకోలేదా, రేడియేషన్ వల్ల ఏమైతాదని?”
గద్దించాడు దిలీప్.

“రేయ్, రేయ్! మధ్యలో మీరెందుకు కొట్లాడుకుంటార్రా!” దిలీప్, మనోహర్లను వారించాడు రాజు.
“ఏమైనా దిలీప్ చెప్పేది నిజమేరా, మొన్న క్లాస్లో ప్రసాద్ సార్ కూడా చెప్పినాడు కదా. . ‘ఇట్స్ ఎ డేంజరస్ ప్రాజెక్ట్’ అని” సురేష్ గుర్తు చేశాడు.
“ఐతే ఓ పని చేద్దాం. మన టీం తరపున ఒక లెటర్ రాసి పబ్ల్క్ హియరింగ్ రోజు ఇద్దాం. సురేష్ నువ్వు కలిసి లెటర్ తయారు చెయ్యండి. మన క్లాస్మేట్స్తో సంతకాలు తీసుకుందాం. ఓకేనా?”

లెటర్ ఎలా రాయాలో మరుసటి రోజు ఒక గంట సేపు తర్జన భర్జన పడి మొత్తానికి తమ అనుమానాల్నీ, అభ్యంతరాల్నీ ఓ పది పాయింట్లుగా ఒక ఉత్తరం రాసి పెట్టుకున్నారు.
. . . . . .
ఊరంతా సందడిగా ఉంది. సీను ఆ ఇంటికీ ఈ ఇంటికీ తిరుగుతూ అందర్నీ తొందర పెడుతున్నాడు. సన్న పిల్లల తల్లులు తప్ప అందరూ అప్పటీకే సిద్దంగా ఉంచిన ట్రాక్టర్లలోకి ఎక్కుతున్నారు.

“రేయ్ సీనూ. . ” చప్పట్లు కొడుతూ గట్టిగా పిలిచాడు. తన స్నేహితుల్ని వెంట తీసుకుని అప్పుడే వచ్చాడతను.
“ఇప్పుడారా వచ్చేది. రొంత సేపుంటే ఊర్లో ఎవరూ ఉండేటోళ్లు గాదు. . సరే! టిఫిన్ చేద్దురు పాండి”
“దార్లో తినొచ్చినాం లేరా”
“సరే ఐతే, మీరే ఎక్కండి, ఇంగ బోదాం”
ట్రాక్టర్లలో జనం తొక్కులాడుకుంటూ గోల గోలగా అరుచుకుంటున్నారు. సీనుతో పాటు ఇంకో నలుగురు అటూ ఈటూ తిరుగుతూ అందర్నీ లోపల కూర్చోబెడుతున్నారు.
ట్రాక్టర్లు బయలుదేరాయి.
“మాకు యురేనియం ఫ్యాక్ట్రీ వొద్దు!” ఎవరో గట్టిగా అరిచారు. రెండు చేతులూ ఊపుకుంటూ అందరూ “వొద్దు, వొద్దు” అని వంత పలికారు.
దిలీప్ తో పాటు వచ్చిన టీంలో మొత్తం ఏడుగురు. వారంతా చివరి ట్రాక్టర్లో నిలబడుకుని ఈ హడావుడినంతా వింతగా చూస్తున్నారు.
“అబ్బ!ఎంత జనమ్రా! ఏమైనా గొడవలైతాయేమో”
“అసలు మా నాయన పోవొద్దని చెప్పినాడురా!”
“ఏం అవదులేరా మీకన్నె అనుమానాలే” దిలీప్ విసుక్కునాడు.

వాళ్లందరికీ ఇదంతా కొత్తగా ఉంది. దిలీప్ హుషారుగా ఫ్రెండ్స్ కి ఏమేమో నా చెబుతున్నాడు. మధ్య మధ్యలో జనంతో పాటు స్లోగన్స్ ఇస్తున్నాడు.
సురేష్ కళ్లకు కనిపించినవన్ని తన డిజిటల్ కెమెరాలో బంధిస్తున్నాడు. ఊరి పచ్చదనాన్నంతా ఆస్వాదిస్తూ. వాళ్ల ఊరి వైపు ఈ ఏడు అసలు పంటలే లేవు. వేరుశనగ, శనగ, పొద్దుతిరుగుడు, పత్తిచేలు, అకడక్కడ అరటి తోటలు. దాదాపు అన్ని చేలలో స్ప్రింక్లర్స్. తనకు ఈ స్కెచ్ అంతా దిలీప్ ఇంతకు ముందే ఇచ్చాడు. ఇప్పుడు లైవ్ గా చూస్తున్నా అనుకున్నాడు. చేలు దాటిన తర్వాత అన్నీ రాతి గుట్టలే. చాల పలుచగా తుప్పలు తప్ప చెట్లు పెద్దగా లేవు. దారి పక్కన అక్కడక్కాడా వేప, మర్రి మాన్లు.

“పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ-కాలుష్య నియంత్రణ మండలి” పెద్దపెద్ద అక్షరాలతో విద్యుత్ స్తంభాలకు కట్టి ఉన్న బ్యానర్. దాని వెనకే కలెక్టర్, యం. పి, ఎమ్మెల్యేలకు స్వాగతం పలుకుతూ పెద్దా చిన్నా బ్యానర్లు. రోడ్డుకు అటూ ఇటూ ఆకు పచ్చ టోపీలు పెట్టుకున్న పోలీసులు దారి పొడవునా కనబడుతున్నారు. కొంత మంది సివిల్ డ్రస్లో పెద్ద పెద్ద తుపాకులు పట్టుకొని వచ్చే వాళ్లని ఆపి సోదాలు చేస్తున్నారు. “నాకేదో అనుమానంగా ఉందిరా” మనోహర్ చుట్టూ చూసుకుంటూ అన్నాడు. అతడలా అనడం నాలుగోసారి.

“వీడ్ని దింపెయ్యండిరా బాబూ, ఇంటికి పోతాడు. . సతాయిస్తున్నాడురా” చిరాకు పడ్డాడు కెమెరా లోంచి కళ్లు తీయకుండానే సురేష్.
“మనమేం యుద్దానికి పోలేదు లేరా! రిపోర్ట్ రాసుకుంటాం, పి. సి. బి. (కాలుష్య నియంత్రణ మండలి) వాళ్లకు లెటర్ ఇస్తాం. అంతే కదా” రాజు
కొట్టాలపల్లె ఊరి శివారులో ట్రాక్టర్లు నిలబడ్డాయి. “యురేనియం వ్యతిరేక ఉద్యమం” అక్షరాలున్న బ్యానర్ వెనకాల జనాన్ని నిలబెడుతున్నాడు సీను, ఇంకొంతమంది యువకులు. వచ్చినప్పటి నుండి సీనుతో మాట్లాడ్డం కుదరలేదు దిలీపుకు. ముందు వరసల్లో ఉన్న వ్యక్తుల్ని ఆసక్తిగా చూశాడు దిలీప్. ఓ పది మంది దాక ఉన్నారు. సిటీ నుండి వచ్చినట్లున్నారు. చేతిలో పేపర్లు పట్టుకొని వాళ్లలో వాళ్లేమో మాట్లాడుకుంటున్నారు. ఒక ముగ్గురు యువకులు తప్ప అంతా మధ్య వయస్కులు. ఇద్దరు స్త్రీలు కూడా ఉన్నారు.

“ఎవరున్నా వాళ్లు?” పక్కనున్నాయనను అడిగాడు.
“హక్కుల సంఘాలోళ్ళు”.
కొంతమంది ఊరి జనం రకరకాల అంగవైకల్యాలతో ఉన్నపిల్లల పోస్టర్లు పట్టుకొని ముందుకొచ్చారు. కొంతమంది ప్లే కార్డులు అక్కడక్కడా ఇస్తున్నారు. కొంత మంది కరపత్రాలు పంచుతున్నారు.
“అందరూ వచ్చినారా”?
“ఇంగా రావాల్లే”
సురేష్ ఉత్సాహంగా కెమేరా పట్టుకొని అటూ ఇటూ తిరుగుతున్నాడు.
“ఆ డొక్కు కెమేరా పట్టుకొని వీడు బీబీసి రిపోర్టర్ లెవెల్లో బిల్డప్పులిస్తన్నాడ్రా” రాజు మాటలు వినపడలేదు. లేక పోతే సురేష్ పరిగెత్తుకొచ్చి కొట్టేవాడే.
“దిలీప్ గాడేడిరా” మనోహర్ చుట్టూచూశాడు.
“పాపం వాల్లనెవర్నో తినేస్తన్నాడ్రా!”
“ఆయన సైంటిస్ట్ రా అటామిక్ ఎనర్జీ మీద చాలా రీసెర్చ్ చేసినాడంట. నిన్న పేపర్లో ఆయన ఇంటర్వ్యూ చూళ్ళేదా?”

“మనం కూడా పోదాం రాండ్రా” కెమెరా బ్యాగ్లో పెట్టుకుంటు అటు నడిచాడు సురేష్. అందరూ ఆయన్ని చుట్టుముట్టారు. కాసేపట్లో పక్క ఊరి జనం వచ్చి కలవడంతో అందరూ మీటింగ్ జరిగే చోటికి గోలగోలగా కదిలారు. ఎవరో నినాదాలిస్తే జనం అందుకున్నారు.
. . . . . . .
విశాలమైన మైదానంలో వాహనాలన్నీ వరుసగా నిలబెట్టారు. ఇంకొంచెం ముందర పెద్ద వేదిక. వేదిక మీద ఇంగ్లీషులో రాసిన పెద్ద బ్యానర్ తగిలించి ఉంది. అప్పటికే జనం చాలా మంది వచ్చేశారు. వేదికకు రెండు వైపులా గుట్టలు . మధ్యన స్థలంలో జనం కిక్కరిశారు.

” వాళ్ల బండ్లు పెట్టుకోనీకి ఇచ్చిండే స్థలం మనం కూకోనీకియ్యల్యా సూడ్రా” జనం తిట్టుకుంటూ ఎలాగోలా సర్దుకున్నారు. వి. ఐ. పీ లంతా వేదిక ఎక్కారు. రెండు వరసల్లో దాదాపు ఇరవై కుర్చీల్లో కూర్చున్నారు.
జిల్లా కలెక్టర్ ముందుకొచ్చి జనాన్ని పరికించి చూస్తూ మొదలు పెట్టాడు.

“యురేనియం కార్పోరేషన్ వారు మీ ప్రాంతంలో మైనింగ్. . అంటే గనుల తవ్వకం, ప్రాసెసింగ్ ప్లాంట్. . అంటే శుద్ది కర్మాగారం నెలకొల్పడానికి సంకల్పించారు. అయితే ఈ యురేనియం ప్రాజెక్టు పైన కొన్ని అపోహలున్నాయి. . . ”
జనంలో నుంచి “మాకన్నె తెలుసులేవోయ్”
“దీని మీద మీకు యురేనియం కార్పోరేషన్ ప్రతినిధి వివరణ ఇస్తారు.
“యురేనియం . . వద్దు, వద్దు” అరుపులు, ఈలలు
“అందరూ నిశ్శబ్దంగా ఉండండి. అందరికీ అవకాశం ఇవ్వడం జరుగుతుంది”
“కూకోనిఎకే సందియ్యల్యా, ఇంగేం మాట్లాడనిస్తారు!”
యు. సి. ఐ. ఎల్ ప్రతినిధి మాట్లాడ్డం మొదలు పెట్టాడు.

ఈనాడు మనకు ఉత్పత్తి చేసే కరెంటు ఒక కేజీ యురేనియంతో చేయవచ్చు అంటూ, జాతీయ భద్రత దృష్ట్యా కూడా యురేనియం ఎంత ముఖ్యమైనదో చెప్పుకుంటూ పోయాడు. ముందర పేపర్లు పరుచుకొని ఇంకా ఏవేవో గణాంకాలు చదువుతూ పోతున్నాడు. . . ఉద్యోగాలూ, ఉపాధి అవకాశాలూ. . .
పది నిమిషాలు, ఇరవైనిమిషాలు, అరగంట దాఆటింది. జనంలో అసహనం.

“ఇంగ సాల్లేవోయ్. . . ” ఈలలు
“వొద్దు, వొద్దు. . వొద్దు” జనం నిలబడి రెడు చేతులూ పైకెత్తి ఊపుతూ అరుస్తున్నారు.
“ఓకే, ఓకే. . ఇప్పుడు స్థానిక యం. పీ. పీ మాట్లాడతారు”

ఖద్దరు చొక్కా, ఖద్దరు పంచె తొడుక్కున్న నల్లటి, పొడుగాటి వ్యక్తి ఏదో కాగితం మీద రాసుకొచ్చింది చదువుతున్నాడు. మొదటి స్టేజీ మీద ఉండే అందర్నీ పేరు పేరునా గౌరవించాడు. అలా గౌరవించేటప్పుడు సదరు వ్యక్తి వైపు చూసి వొంగి దండం పెడ్తున్నాడు. అటు తర్వాత జనానికి నమస్కారం అన్నాడు.
” ఇందు మూలంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేయడం ఏమనగా. . . మా మండలంలో ప్రజలకు ఈ ప్రాజక్టు పట్ల ఎటువంటి వ్యతిరేకతా లేదని మా మండల సమావేశంలో తీర్మానించడం జరిగింది. ”
నీయమ్మ!ఎంత లెక్క దెంగినావ్రా. . ”
కేకలు, ఈలలు. . వొద్దు, వొద్దు అరుపులు. అతను మాట్లేడేది ఎవరికీ వినిపించడం లేదు.
ఓ చిన్న గుట్ట మీద కూర్చున్న దిలీప్ బృందం ఈ తంతునంతా చూస్తూ మధ్య మధ్యలో వాళ్లూ కేకలేస్తున్నరు. సురేష్ బిజీగా తన కెమెరాకు పని చెప్తున్నాడు.

గంటయింది. యం. పీ. పీ. మాట్లాడేది అయిపోయిందేమో, మళ్లీ కలెక్టర్ వచ్చాడు.
“దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండండి. మీకూ అవకాశం ఇస్తాం” రెండు చేతులూ పైకెత్తి చెప్పాడు.
“ఇప్పుడు గట్టుపల్లె సర్పంచ్ పుల్లారెడ్డ్య్ గారు మాట్లాడతారు. ”
“వచ్చినాడ్రా, పీనిగల మీద చిల్లరేరుకునే నాయాలు”
సర్పంచ్ మాటలు పైకి వినపడనీయకుండా అరుపులు, ఈలలు.
“పబ్లిక్ హియరింగారా ఇది? ఎవడు వింటున్నాడ్రా ఇక్కడ!” వెటకారంగా నవ్వాడు మనోహర్.
“ఎవరి బాధ వాళ్లదిరా. . . ” సురేష్
ఇంతలో జనం మధ్యలోకి పోలీసులు వచ్చేశారు. నిలబడి అరిచే వాళ్లను బలవంతంగాకూర్చెబెడుతున్నారు.
కాసేపటికి కొంత సర్దుమణిగింది.
ఉన్నట్టుండి గుంపులో నుండి అరుపు “మాకు యురేనియం ఫ్యాక్త్రీ కావాలి. . . కావాలి, కావాలి. . . ”
“ఇదేం ట్విస్టురా బాబూ!” ఆశ్చర్య పోతూ అన్నాడు రాజు.
“ఏమోరా. . . !” దిలీపుకేదో అర్దమయ్యీ కానట్టు ఉంది.
ఓ ఇరవైమంది దాకా లేచి నిలబడి “యురేనియం కావాలి. . కావాలి, కావాలి” అరుస్తున్నరు. ఎందకో వదిక మీద ఎవరో ముసిముసిగా నవ్వుతున్నట్టు అనిపించింది దిలీపుకు.

“యురేనియం ప్రాజెక్టు కావాలి” ప్లేకార్డులు పట్టుకుని కొంత మంది గెంతుతున్నారు.
జనంలో అలజడి. అందరూ లేచి నిలబడుతున్నరు. చేతులు పైకెత్తి అరుస్తున్నరు. ఎవరు ఏమంటున్నరో ఏమీ అర్దంకావటం లేదు. అంతా గోలగోలగా ఉంది. ఎవరో ఒక స్త్రీ కుడి చెయ్యి నోటి దగ్గర పెట్టుకొని ఎడం చేత్తో కడుపు కొట్టుకుంటూ అరుస్తోంది. ఒకామె వేలు చూపిస్తూ బూతులు తిడుతోంది. అడ్డ పంచె ఎగ్గట్టి ఒకాయన గుంపు మీదికి తోసుకుపోతున్నాడు.

“మనం ముందుకు పోదాం పాల్లిరా. . రాండిమే సూసికుందాం ఏందో!”
దిలీప్ బృందం గుట్ట దిగి జనం వెనకల నిలబడ్డారు. ఈ సందడిలో వాళ్లూ ఊరుకుండలేక పోయారు. చేతులూపుతూ వద్దు, వద్దు అని అరుస్తున్నరు. స్టేజీ మీద మాట్లాడే వ్యక్తి మౌనంగా నిలబడి చూస్తున్నాడు. కలెక్టర్ జోక్యం చేసుకున్నాడు.
“అందరూ కూర్చోండి. మీకు అవకాశం ఇస్తాం. మీలో ఒకరు వేదిక మీదికి రండీ”

పోలీసులను తోసుకుంటూ, వాళ్లతో వాదులాడుతొ ఒకామె ముందుకొచ్చి స్టేజీ ఎక్కింది. ఆమె గొంతు వణుకుతోంది.
“మాకే ఫ్యాక్ట్రీ రావొద్దు. మేం లచ్చనం గా బతుకుతున్నం. మా బూములు మాకు ఉన్నియ్యండి నాయనా. మాకదే సాలు”
జనం ఉత్సాహంగా చప్పట్లు కొట్టారు.
“ఇప్పుడు కొట్టాల పల్లె వాస్తవ్యులు సుబ్బయ్య మాట్లాడతారు”

“మా ప్రియతమ నాయకుడు, మన దేశ క్షేమాన్నీ, మన ఊరి క్షేమాన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం చే పట్టినాడు. మేమందరం బాగుపడాలంటే ఈ ఫాక్ట్రీ రావాల. “

కలెక్టర్ ఒక్కొక్కరి పేరూ చదువుతున్నాడు. దాదాపు అందరూ సుబ్బయ్య మాటల్నే చెబుతున్నారు. ఓ అరగంట గడిచింది. మళ్లీ జనంలో అలజడి. కొంత మంది పోలీసుల్ని తోసుకుంటూ స్టేజీ మీదికెక్కారు. పోలీసులు వారి మీదకురికి అందర్నీ కిందికి లాగారు. మీడియా వాళ్లూ హడావుడిగా అటూ ఇటూ తిరుగుతున్నారు.

ఇంతలో హక్కుల సంఘం ప్రతినిధి ఒకరు అతి కష్టం మీద స్టేజీ ఎక్కి కలెక్టర్తో ఏదో మాట్లాడుతున్నాడు. అందర్నీ కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు. కాస్త సర్దుమణిగాక అతనికి మైకిచ్చారు. క్రికెట్ బాల్ సైజులో ఉన్న రాయి ఒకటి అతని కుడి చెవిని రాసుకుంటూ పోయింది. తేరుకోక ముందే ఐదారు రాళ్లు భుజాల్నీ, మెడను తాకాయి.

“ఇది చాలా అప్రజాస్వామికంగా, ఏక పక్షంగా జరుగుతోంది. దీన్ని నిరసిస్తూ మేం ఈ సభను బాయ్ కాట్ చేస్తున్నాం”
గబగబా స్టేజీ దిగి ఊపిరి పీల్చుకున్నాడు.
చూస్తుండగానే ఒక రాయెచ్చి దిలీప్ గడ్డాన్ని తాకింది, ఉలిక్కి పడ్డాడు.

“మనం ఇకడుండొద్దురా, వెళ్లిపోదాం . . రాండ్రా. . ” ఫ్రెండ్స్ అందర్నీ కేకేస్తూ పరిగెత్తాడు. అతని వెనకాలే అతని ఫ్రెండ్స్ పరుగందుకున్నారు.
వడగళ్ల వానలాగా రాళ్లు కురుస్తున్నాయి. పిచ్చెక్కినట్టు జనం అన్ని దిక్కులా పరిగెత్తుతున్నారు. లాఠీలు విరుగుతున్నాయి, విరుచుకుపడుతున్నాయి.
“అబ్బా!. . ” మనోహర్ వీపు మీద బలంగా రెండు లాఠీ ముద్రలు.

పరిగెత్తి, పరిగెత్తి ఓ మర్రి చెట్టు కిందికి చేరుకున్నాడు. మనోహర్ బిత్తర పోయాడు. అతని కాళ్లు వణుకుతున్నాయి. దిలీప్ రెండు సార్లు బోర్లా పడ్డాడు. మోచేతులూ, మోకాళ్లు దోక్కుపోయాయి. తుఫానుకు కొట్టుకొచ్చినట్లుంది వాళ్ల పరిస్థితి.
“ఇదేం పబ్లిక్ హియరింగ్ రా బాబూ. . ” గుట్ట మీదుగా జనాన్ని వెంబడిస్థున్న పోలీసుల్ని చూస్తూ అన్నాడు రాజు.
ఠాప్, ఠాప్మని ఇంకా లాఠీల శ్బ్దాలు వినిపిస్తున్నాయి.
“పబ్లిక్ హియరింగ్ కాదురా, పబ్లిక్ ఫియరింగ్. . ” గస పోసుకుంటూ మనోహర్ చెట్టు కింద కూలబడ్డాడు. ఒక్కొక్కరే నీడలో కూలబడిపోయారు. ఎవరికీ నిలబడే ఓపికా కూడా లేదు. ‘బతికి బయట పడ్డాం’ అన్న భావన.

“ఒరేయ్! ఆరు మందిమే ఉన్నామ్రా. ఒకరు మిస్సింగ్. . . !” దిలీప్ కంతా గందర గోళంగా ఉంది.
“నిన్ను నువ్ ఎంచుకున్నావ్ రా?”
“నీఎయబ్బ! ఈ టైంలో ఏందిరా కుళ్లు జోకులు”
“రేయ్! సురేష్ గాడేదిరా. . ?” దిలీప్ కంగారుగా అరుచాడు.
” ఆ డొక్కు కెమెరా పట్టూకొని యాడికేడికి పోయాడో! ఎక్కడని ఎతస్కాలరా వాన్నిప్పుడు?”
“ఎనిక్కి పోయి చూద్దాం రారా”
“రేయ్! ఇట్లాంటప్పుడు ఫైరింగ్ కూడా జరుగుతాదిరా!”

టి. వీ వార్తల్లో దృశ్యాలు కళ్లముందు కొచ్చి భయపెట్టాయి. టెన్షెన్ తో, మిట్టమధ్యాహ్నం ఎండ వేడితో చెమటలు కారిపోతున్నాయి. మనోహరుకు ఇంకా గుండె దడ తగ్గలేదు. సురేష్ ఎక్కడున్నాడో! ఒక ఐదు నిమిషాలు తర్జన బర్జన పడ్డారు. ఒక నిర్ణయానికొచ్చారు. మనోహర్, మహేష్ , కుమార్ అక్కాడే ఉంటారు. దిలీప్, రాజు, చంద్ర వెనక్కి వెళ్లి సురేష్ ని వెతకాలి.

“అడుగోరా సురేష్గాడు!” అరిచాడు చంద్ర.
“రేయ్ సురేష్. . . ఇక్కాడరా. . ” చప్పట్లు కొడుతూ పిలిచారు మిత్రులు.
“రారా, నీకుందిగానీ. . ”
“యాడునావ్రా బాబూ! మేమీడ టెన్షెంతో సచ్చిపోతన్నాం”
“స్టేజ్ పక్కనుంచి ఫోటోస్ తీస్తాన్నేం న్రా. లాఠీ చార్జ్ స్టార్టయ్యింది. నన్ను గూడా ఎంట బడినార్రా! పరిగెత్తి, పరిగెత్తి గుట్టంక దాక్కున్నా. కొంచెం కాం అయినాక వస్తాన్నా. . . ”
“నీకంత అవసరమా రా? నువ్వు పెద్ద బిబీసీ రిపోర్టర్వి. . !” అమాంతం సురేష్ మీద పడ్డాడు మనోహర్.
. . . . . . .
“యురేనియం ప్రజాభిప్రాయ సేకరణ రసాభాస. . పోలీసుల లాఠీచార్జ్”. . . మొదటి పేజీ వార్తను చూస్తున్నాడు దిలీప్.
” ఇది అప్రజాస్వామికం, కోర్టులో సవాలు చేస్తాం. . యురేనియం వ్యతిరేక వేదిక”

రెండో పేజీలో యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పేరుతో ఒక ప్రకటన. ఆశ్చర్యపోయాడు దిలీప్. ప్రాజెక్టుకు ప్రజలు ఆమోదం ప్రకటించారని, మూడు నెలల్లో పనులు మొదలు పెడతామని దాని సారాంశం. బుర్రగోక్కున్నాడు దిలీప్. పొల్ల్యుషన్ కంట్రోల్ బోఅర్డ్ వాళ్లు కదా ప్రకటించాల్సింది. ఆ ప్రాసెస్ ఇంకా ఒక నెల పడూతుంది. అంతా గందర గోళంగా ఉంది. తల్లకిందులుగా ఉంది. ఆ ప్రకటన మళ్ళీ చదువుకున్నాడు. కొంత మంది అల్లరి మూక ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకోజూశారని, పోలీసులు సమర్ధవంతంగా అదుపు చేశారని కూడా ఉంది. ఏదో డౌటొచ్చి తన లోంచి పుస్తకం తీసి చూశాడు.
” ఏందిదంతా!”

జిల్లా ఎడిషన్ చూసేసరికి అతనికి చమటలు పట్టాయి. ప్రజాభిప్రాయ సేకరణలో రాళ్లతో, కర్రలతో దాడులకు దిగిన ఇరవై మందిని పోలీసులు అరెస్టు చేశారని ఉంది. అందులో సీను, వాళ్ల నాన్న కూడా ఉన్నాడు.

ఒకసారి ఊరికి పోయి రావాలనిపించింది. ఆ విషయం ఇంట్లో చెప్పి తిట్లు తిన్నాడు. అయిష్టంగా కాలేజికి బయలుదేరాడు. కాలేజి బస్సులో సురేష్ తో జరిగింది చెప్పాడు. సురేష్ ఏమీ మాట్లడలేదు.

ఆర్. టి. సీ బస్టాండ్ దగ్గర దిగాడు. దిలీప్.
“ఊరికి పోతన్నావా?”
“ఔన్రా”
“నేను వస్తాన్రా” దిలీప్ వెనకాలే సురేష్ దిగిపోయాడు.
. . . . . .
ఊరంతా చాలా నిశ్సబ్దంగా ఉంది. రచ్చబండ మీద పులిగీతం ఆడే వాళ్లు లేరు. పంచాయితీ ఆఫీసు ముందు చెట్టు కింద పేకాట ఆడే వాళు లేరు. వీధిలో దిలీపును ఎవరూ పలకరించలేదు.

ఇంట్లోకి పోతూనే మురళి ఎదురుగా వచ్చాడు.
“మామను, సీనును అరెస్టు చేసినారంటనె! పేపర్లో చూసినా. ”
“రాత్రి పదకొండు గంటలప్పుడు వచ్చి తీస్కపోయినారు!” మురళి మొహంలో ఇంకా భయం తాలూకూ చాయలు.
ఇద్దరికీ కూర్చోమని చెప్పి అత్త వంటింట్లోకి పోయింది. వరండాలో అవ్వ పక్కన అదే మంచం మీద దిలీప్ కూర్చున్నాడు. పక్కనే సురేష్. ఎవరూ ఏమీ మాట్లాడలేదు. కాసేపటీకి అత్త కాఫీ తీసుకొచ్చింది. అవ్వ చెప్పటం మొదలు పెట్టీంది. చిన్నప్పుడు దిలీపుకు చెప్పిన కథ.

పూర్వం బకాసురుడు ఉండేవాడు. రోజుకు బండి అన్నం, దాంతో పాటు ఒక మనిషిని కూడా తినేసే వాడు. ఇప్పుడూ ఉన్నారు బకాసురులు. బండి అన్నం పంపమంటే పంపుతాం. రోజుకు ఒక మనిషిని యాడ పంపేది. . . .

ఎదురుగా అత్త తడి కళ్ళలోకి చూడలేక సురేష్ వైపు తల తిప్పాడు దిలీప్. సురేష్ కాపీ తాగడం కూడా మర్చి పోయి ఏదో దీర్ఘాలోచనలో పడ్డట్టున్నాడు. దిలీప్ కు ఇప్పుడంతా మెల్లమెల్లగా అర్ధమవుతుంది.

మామూలుగా ఆ వూరి జనానికి పోలీసులు, కేసులు కొత్త గాదు. అవి వాళ్ళకు ఒక లెక్క గాదు. అప్పటికి ఇప్పటికి తేడా అల్లా అప్పుడు రెడ్డి కోసం, ఇప్పుడు రెడ్డికి వ్యతిరేకంగా

3 అభిప్రాయాలు »కథలు

3 అభిప్రాయాలు

  1. ramakrishna May 14, 2009 1

    రచయిత్రి అణుదుస్పలితాలను బాగా చెప్పారు. అయితే కత ప్రచారం కొసం రాసారని తేటతెల్లం అవుతొంది. కతాగమనం సాగదీశారు. ఇలాంటి కతలకు రాజకీయ ప్రాధాన్యం తప్ప సాహిత్య విలువలు శూన్యం. రచయిత్రి పాత్రల్లొ దూరి మాట్లాడారు. కత ఫర్వాలేదు.

  2. sajaya..K May 18, 2009 2

    కధ బాగుంది. అణు దుఫ్ఫ;లితాఅ గురించి కధలు రావట0 చాలా అవసర0. మనముందున్న ప్రమాద0 ఇదె. యురెనియ0 వ్యతిరెక ఉద్యమ0 తరుపున అభినందనలు. చాలా మ0దికి పబ్లిక్ హియరింగ్ గురి0చి తెలియదు.

  3. ప్రాణహిత » మే 2009 సూచిక Oct 11, 2009 3

    [...] పబ్లిక్ హియరింగ్ : పి. వరలక్ష్మి [...]

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో