May2009
తలదన్నే చెప్పుదెబ్బ!
ఇపుడే ఆయుధమూ అవసరం లేదు
అదొక్కటే చాలు!
దాన్ని కనిపెట్టే డిటెక్టర్లూ లేవు
నరుడు నడిచే దారిలో విశ్వాసాన్నిచ్చేది
ఈ లోకం నడకను పసిగట్టేది
రాముడు లేకున్నా రాజ్యాన్ని నియంత్రించిన శక్తి
తలనిండా పొగరు పొంగి పొర్లినపుడు
తాడునుదన్నే అహంకారపు కోరలు పెరిగినప్పుడు
అధికార ధన మదం మత్తు
సింహాసనం శిరస్సుపై కిరీటమైనపుడు
దాన్ని నేల రాల్చే అస్త్రమది
ప్రజల మనోభావాల సాఫ్ట్‌వేర్ మీద
యుద్ధోన్మాద పైరసీ దాడి జరిగినపుడు
రెట్టింపు వేగంతో తిరగబడే
హార్డ్ వేర్ ఈ ఫుట్‌వేర్!
నక్షత్ర యుద్ధాలవసరం లేదు
సైన్యపు మోహరింపు అవసరం లేదు
కాచుకో! అనంత అణ్వాయుధాలొకవైపు
అడుగులకు మడుగులొత్తే పాదరక్షలొకవైపు
అసలైన శత్రువుమీద
ఒక్క ఎడమ కాలు చెప్పుదెబ్బచాలు!
నువు సరిగా నడిపిస్తావనిగదా నిన్నెన్నుకున్నది
నువు చక్కగా నడుచుకోవాలనిగదా
ప్రజల చేతులను నీకు పానుపుగాలి పరిచింది
నడిచేవాన్ని, నడిపించేవాన్ని
నిరంతర నిఘా కనులతో చూసే
జనుల చేతిలోని ఆటంబాంబు అది
ఉరి ఒక క్షణకాలపు మరణం
చెప్పుదెబ్బ నీకు జీవితకాలపు చావు
నువ్విపుడు ఊరేగుతున్న శవానివి!
ఇక ముందెవడైనా సరే!
ప్రజలను చెప్పు చేతుల్లో వుంచుకోవాలనుకుంటే
ప్రజల చేతుల్లోంచి చెప్పులే దూసుకొస్తాయ్!
వాన్ని చూసిన వెంటనే
నీలో మెసపటోమియా నాగరికతా చిహ్నాలు
పోటెత్తి వుంటాయి.
టైగ్రిస్ నది తలనిండా హోరెత్తి వుంటుంది
శరీరమంతా ఖర్జూర చెట్ల ముండ్లు మొలిచే వుంటాయి
వాన్ని చూసిన వెనువెంటనే
నీకు ఎడారి తుఫానులో చిక్కుకున్న
నీదేశపు పసిపిల్లల హాహాకారాలు వినిపించి వుంటాయి
వాని ముఖం మీద ఉమ్మిన
సద్దాం కనుల కత్తులు నిను వెంటాడి వుంటాయి
అల్‌జైదీ! ఏ ప్రపంచ న్యాయస్థానం విధించని
సరైన శిక్ష అది!
ఒక్క చెప్పుదెబ్బతో
ఈ లోకపు రెండు కనులు తెరిపించినావు
kcube varma May 5, 2009 1
అంజయ్యగారు చాలా బాగా చెప్పారు. మెటల్ డిటెక్టర్ లు కనిపెట్టలేని ఆయుధమై సామాన్యుది చేతిలో వజ్రాయుధమై హిరణ్యాక్షులందరికీ కునుకులేకుండా చేస్తోంది. మీ కవిత బాగుంది. ధన్యవాదాలు.
Pasunoori Ravinder May 21, 2009 2
”ఉరి ఒక క్షణకాలపు మరణం
చెప్పుదెబ్బ నీకు జీవితకాలపు చావు”
కవిత కేక
బాగున్నదే అంజన్న !
కంగ్రాట్స్
ఫ్రమ్
పసునూరి