తెలంగాణలో ఉద్యమాలు – పాట – తెలంగాణ చరిత్ర (ఒకటో భాగం)

-సి.కాశిం

ఇది తెలంగాణ. మారు పేరు గాయాలవీణ. దీని గతం పోరాటచరిత్ర. వర్తమానంలో నా ఆశను, ఆశయాలను భుజానికి తగిలేసుకొని సాగిపోతున్న బిడ్డలను కన్న తల్లి. నాడు నైజామోడికి వ్యతిరేకంగా పోరాడింది. అరవై తొమ్మిదిలో ఆంధ్ర దోపిడికి వ్యతిరేకంగా కొట్లాడింది. డెబ్బైలో దొరోడికి వ్యతిరేకంగా దండు కట్టింది. ఇంకా దండు సాగుతున్నది. ఇన్నేండ్లు నడిచి… నడిచి… కొట్లాడి…. కాళ్ళకు కలుకులొచ్చినవి. అయినా ఒంట్లో సత్తువ ఉన్నంతవరకు ఉద్యమిస్తూనే ఉంది.

తెలంగాణ గురించి తెలుసుకోవటమంటే నిప్పుల చరిత్రను తేలుసుకోవటమే. దీని బాట పూల బాటకాదు. ముళ్ళ బాట. ఆ ముళ్లను ఏరేసుకుంటూ నడిచినా నడుస్తున్న వాళ్ళు ఉన్నారు. నిజాం పిశాచి నిప్పుల్లో నడిపించాడు. అట్లా నడుస్తూనే సాయుధమయ్యింది. శత్రువును పరిగెత్తించింది. తన బిడ్డలకు పూల బాట వస్తుందని ఆశపడ్డది. మోసం చేశారు. సీటు కోసం దగా చేసారు. నమ్మినవాళ్లే నట్టేట ముంచారు. వాళ్లే ఇవ్వాళ విశాలాంధ్ర పేరిట విశాల దోపిడీలో భాగమవుతున్నారు. భాష పేరిట, సంస్కృతి పేరిట ఒకటవుదామని ఢిల్లీలో పంత్ నాయకత్వంలో ‘పెద్దమనుషుల ఒప్పందం‘ ద్వారా కుట్ర చేశారు. న్యాయం చేస్తామన్నారు. అన్నదమ్ముళ్లా ఉందామన్నారు. అందరం ఒకటేనన్నారు. అన్యాయం చేశారు. పదేండ్లపైగానే చూసింది. కొలువులు లేవు. సీట్లు లేవు. చదువులు లేవు. అన్నీ తన్నుకుపోయారు. చదువురాదని ఎక్కిరించారు. భాష రాదని హేళన చేశారు. ఎన్నాళ్లని ఓర్చుకొనేది. ఎదురుతిరిగి కొట్లాడడం తెలంగాణకు కొత్తకాదు. “వాని తాతకు తాత నైజామోడు నాకెదురెవ్వని నాట్యమాడితే వీర తెలంగాణ చుట్టుముట్టితే పైజామూడి పరుగు తీసిండు” (జననాట్యమండలి పాటలు – పుట.40)

1707 లో ఔరంగజేబు మరణం తరువాత మొగల్ సామ్రాజ్య సుబేదార్‌గా ఉన్న నిజాం 1724లో స్వతంత్ర్యం ప్రకటించుకున్నాడు. ఇట్లా పురుడోసుకున్న నిజాం నిరంకుశ పాలన 1948 వరకు కొనసాగింది. ఈ కాలంలో తెలంగాణ ప్రజలు బానిస సమాజపు ఆనవాళ్లను చవిచూశారు. స్త్రీలను నగ్నంగా బతుకమ్మను ఆడించిన విసునూర్ దొరలకు అధికారం ఇచ్చినవాడు నిజాం. చెమటను నీరు చేసి పండించిన పంటను దోపిడి చేసిన జాగీర్దార్లకు అండగా నిలచింది నిజామే. ఉర్దూ అధికార భాష పేరిట తెలుగుభాషకు జీవం లేకుండా చేశాడు. మతోన్మాదంతో మత మార్పిడులను ప్రోత్సహించాడు. ఎదురు తిరిగిన వాళ్లను బూడిద చేశాడు.

ఉద్యమాల నేపధ్యం

మట్టిని ముట్టుకుంటే ఉద్యమాలు పూసే నేల ఇది. మట్టిమనుషుల ఆగ్రహం ఉద్యమాలుగా రూపొందింది. వ్యక్తులుగా శక్తులుగా ఈ ప్రాంతంలో అనేక ఉధ్యమాలు వచ్చాయి. “ఉద్యమం అనే మాటకు పైకెత్తుట, శ్రమము, ప్రయత్నము, సిద్ధమగుట, గట్టిపూనికతో చేసే ప్రయత్నము” (సూర్యారాయాంధ్ర నిఘంటువు, పుట.637) అని డిక్షనరీ అర్ధాలు ఉన్నాయి. అయితే ఆధునిక కాలంలో ఉధ్యమాన్ని విశాల అర్ధంలో వాడుతున్నాం. ఆంగ్లంలో ‘మూవ్మెంట్’ అనే పదానికి సమాన అర్ధం ‘ఉద్యమం’ అని వాడుతున్నాం. “ఒక లక్ష్యాన్ని సాధించడంకోసం జరిగే వ్యవస్థీకృత ప్రయత్నం” (చాంబర్స్ మినీ డిక్ష్నరీ, పేజి.324) ఉద్యమంగా చెప్పవచ్చు. మానవ జీవితంలో అనేక మార్పులు జరుగుతాయి. ఈ మార్పులన్నీ వాటంతటావే జరిగినవి కావు. వీటికొక గతితార్కిక నియమం ఉంటుంది. ప్రజలు ఒకవైపు ప్రకృతిపై పోరాడుతూ విజయం సాధిస్తూ ఉంటారు. మరోవైపు తోటి మనిషిపై కూడా పోరాటం మొదలు పెడతారు. ఈ పోరాటమే ఒక సమిష్టి రూపం తీసుకుంటుంది. దీనినే మనం ఉద్యమం అనొచ్చు. ఈ ఉద్యమం సమాజంలో మౌలిక మార్పుకు దారితీస్తుంది. ఏ మార్పు అయినా ప్రజల ప్రయత్నం వలన వస్తుంది తప్ప అప్రయత్నంగా ఊడిపడదు.

వేళ్లూనుకొని ఉన్న పాత సంబంధాలు, పాత పద్ధతులు ఇక ఏ మాత్రం కొనసాగడానికి వీల్లేని పరిస్థితులాసన్నమయి, పాత వాటి మీద క్రమంగా అసంతృప్తి ప్రారంభమై, ఆ అసంతృప్తి రాను రాను పెరిగి పెద్దదవుతుంది. తద్వారా పాత-కొత్త సంబంధాల మధ్య సంఘర్షణ ఉద్యమాలకు దారితీస్తుంది” (తెలుగులో ఉద్యమం గీతాలు పుట 4)

మార్పు లేకుండా మానవ సమాజం లేదు. ఆ మార్పు కచ్చితంగా ముందడుగే. మనుగడ కోసం మనిషి పోరాడుతాడనే డార్విన్ సిద్ధాంతం మానవ పురోగతికి అద్దం పడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా “పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టిందని” మార్క్స్ చెప్పిన మాట శాస్త్రీయ సత్యం. ప్రపంచంలో వలస వాదాన్ని తరిమికొట్టి స్వేచ్చాగానాలు పీల్చుకున్న పోరాటం అమెరికన్ విప్లవం. భూస్వామ్య విధానాన్ని కూలదోసి పెట్టుబడిదారి విధానానికి పునాదులు వేసింది ఫ్రెంచ్ విప్లవం. రష్యాలో భూస్వామ్య, పెట్టుబడిదారి విధానాలను అంతం చేసి సామ్యవాదాన్ని నెలకొల్పింది సోషలిస్టు విప్లవం. ఇలా అనేక చోట్ల అనేక విప్లవాలు, ఉద్యమాలు పాత సామాజిక వ్యవస్థ పునాదులను కదిలించి కొత్త వ్యవస్థను నిర్మించాయి.

భారత దేశంలో కూడా అనేక ఉద్యమాలు వచ్చాయి. సంఘ సంస్కరణ, జాతీయోద్యమాల కాలంలోనే ఒకవైపు బ్రిటీష్ వారిపై పోరాడుతూనే అంతర్గత అసమానతలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిచాయి. ఈ ప్రభావంతో తెలుగు నేలలో కూడా ఎన్నో ఉద్యమాలు జీవం పోసుకున్నాయి. దేశవ్యాపితంగా విస్తరించిన జాతీయోద్యమ భావాలు తెలుగు సాహిత్యంపై విశేష ప్రభావాన్ని చూపాయి.

ఇక బ్రిటీష్ పాలన ప్రభావం ఏమాత్రం లేని తెలంగాణలో భూస్వామ్య, జమీందారీ, జాగీర్దార్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు వచ్చాయి. ఈ ఉద్యమాలు ప్రారంభంలో జానపద హీరోల నాయకత్వంలో మొదలయ్యాయి. నల్గొండ జిల్లాలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్, పాలమూర్లో మీరాసాబ్, పండుగోల్ల సాయన్న లాంటి వ్యక్తులు కొద్ది సమూహాన్ని కూడగట్టుకొని స్థానిక దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపారు. అయితే ఇవి వ్యవస్థలో సమూల మార్పును తీసుకరావడానికి నడిచిన ఉద్యమాలు కావు. స్థానిక నిరసనలు మాత్రమే. ఈ నాయకులను ఆనాటి పాలకులు దుర్మార్గంగా చంపేశారు. వీరిపై ప్రజలు వివిధ జానపద రూపాలలో కథలల్లుకున్నారు. పాటలు పాడుకున్నారు. తమ గుండెల్లో ప్రేమగా నిలుపుకున్నారు. కలుపుల్లో, కోతల్లో, కోలాటంలో ప్రత్యక్షం చేసుకొన్నారు.

తెలంగాణలో నిజాం పాలనకు వ్యతిరేకంగా సమిష్టి ఉద్యమ రూపాలు 1930లలో మొదలయ్యాయి. మొదటి నిర్మాణ రూపం అంధ్ర మహసభ. తెలుగు భాష మాట్లాడటానికి, రాయటానికి, చదవటానికి వీలులేని రోజులివి. జన్మనిచ్చిన భాష కోసం పోరాటం మొదలయ్యింది. అది రాను రాను ఆర్ధిక, సామాజిక, రాజకీయ ఆకాంక్షలతో పరిపక్వమైంది. అన్నిరకాలుగా బలవంతుడైన నైజామును ఎదుర్కోవటానికి ఆంధ్ర మహాసభ 1946లో సాయుధ పోరాటానికి సిద్దమైంది. ఈ ఉద్యమం 1953 వరకు అనేక తర్జనభర్జనల మధ్య కొనసాగి అదే సంవత్సరంలో ఆగిపోయింది. ఈ సంవత్సరంలోనే తెలంగాణ విద్య ఉద్యోగ రంగాలలో స్థిరపడిన హిందీ రాష్ట్రాల ప్రజలకు వ్యతిరేకంగా ఇక్కడి యువత ‘నాన్ ముల్కీ గో బ్యాక్’ అంటూ ఉద్యమాన్ని లేవదీశారు. ఈ సందర్భంలో జరిగిన కాల్పుల్లో 8 మంది విద్యార్ధులు మరణించారు. 1956లో నిరసనలు, విన్నపాల మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఇక్కడి విద్యా, ఉద్యోగ రంగాలలో కోస్తాంధ్ర వాళ్లు నిండిపోయారనే కారణంతో 1969లో విద్యార్ధి, నిరుద్యోగులు 9 నెలలు ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని నడిపారు.

ప్రపంచ వ్యాప్తంగా 60వ దశకం గర్జించు అరవైలుగా నమోదైంది. చైనా సాంస్కృతిక విప్లవ ప్రభావం ప్రపంచంపై పడింది. సమాజంలో మౌలిక మార్పు కోసం ఉద్యమాలు-పోరాటాలు జీవం పోసుకున్నాయి. పరిమిత ఆకాంక్షల కోసం వచ్చిన 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, నక్సల్బరి, శ్రీకాకుళ పోరాటాల ప్రభావంతో విప్లవోద్యమంగా రూపంతరం చెందింది. తరువాత దేశమంతా విస్తరించింది. 80వ దశకంలో అంధ్ర ప్రాంతంలో ప్రారంభమైన దళిత ఉద్యమం తెలంగాణలో స్థిరత్వాన్ని సంపాదించింది. సిద్ధాంత భావజాలాన్ని పెంచుకుంది. 1969లో ఆగిపోయిన తెలంగాణ ప్రజల ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష 90వ దశకంలో ఎజెండా మీదికి వచ్చి ఉద్యమ రూపాన్ని సంతరించికుంది. ఇది స్థూలంగా తెలంగాణలో ఉద్యమాల నేపధ్యం.

‘సమాజంలో సాహిత్యం, కళలు ఉపరితల అంశాలు. అయితే వీటికి పునాది అంశాలను ప్రభావితం చేసే లక్షణం కూడా ఉంది. ఎక్కువ మేరకు పునాది అంశాల చేత ప్రభావితమవుతూ సమాజంపై ప్రభావమేస్తాయి’. (ప్రజాసాహిత్యం-జయధీర్ తిరుమలరావు-పుట.1) సమాజంలో వస్తున్న మార్పులకు స్పందనగానే సాహిత్యం వస్తుంది. ఈ సాహిత్యం మౌఖిక రూపంలో ఉంటుంది. లిఖిత రూపంలో ఉంటుంది. శ్రమజీవుల భౌతిక సామాజిక జీవితం పునాది కాగా సాహిత్యం, కళలు ఉపరితలంలో ఉంటాయి. పనిచేస్తున్నప్పుడు, శ్రమనే వస్తువుగా చేసుకొని జీవితాన్నే పాడుకుంటారు. ఈ పాటలు వీరి పనిలో భాగంగా నోళ్ల నుంచి సహజంగా వెలువడుతాయి. ఇట్లా పుట్టే సాహిత్యమే మౌఖిక సాహిత్యం అవుతుంది. ఈ మౌఖిక సాహిత్యమే లిఖిత సాహిత్యానికి మూలమవుతుంది. ఈ సాహిత్యంలో ఉండే వస్తువు, రూపం, శిల్పం గొప్పగా కనిపిస్తాయి. ఈ సాహిత్యం నిండా గొప్ప జీవిత చిత్రణ ఉంటుంది.

ప్రజా కవిత్వం – జీవితం

అకాడమిక్ మేధవులు చెప్పే జానపద కవిత్వాన్నే నేను ప్రజా కవిత్వంగా చెప్పదల్చుకున్నాను. “పది శతాబ్దాలుగా రాత సాహిత్యమే సాహిత్యంగా ఏలుబడి అయింది. మిగిలిన సాహిత్యమంతటినీ అనేక ముద్దు పేర్లు పెట్టి దాని అసలు అస్థిత్వాన్ని కప్పిపెట్టారు. దాని వ్యక్తిత్వాన్ని గుర్తించలేదు.” (జయధీర్ తిరుమలరావు – ప్రజాసాహిత్యం -పుట.9)

సాహిత్యం అనే మాటలోనే జానపద సాహిత్యం అని వర్గీకరించి దానిని చిన్నచూపు చూశారు. ప్రజాసాహిత్యాన్ని సృష్టించిన వారిని జానపదులన్నారు. లిఖిత సాహిత్యాన్ని రాసిన వాళ్లను పండితులన్నారు. ఈ విభజననే మనుషుల మధ్య అసమానతలకు దారితీసింది. సాహిత్యపరంగా వారిని జానపదులన్నారు. కాని ఉత్పత్తిపరంగా చూస్తే వారు ఉత్పత్తి శక్తులు, శ్రమజీవులు. వీళ్లు లేకుండా ఈ సమాజ బండి ఇరుసు సాగదు. “వీరి కష్టసుఖాలను, రాజకీయాలను మొదలైన వాటికి సంబంధించిన వీళ్ల ఉద్యమ స్ఫూర్తి గల వస్తువుగా వచ్చిన సాహిత్యాన్నే ప్రజా సాహిత్యం అంటున్నాం” (కేతవరపు రామకోటిశాస్త్రి – ప్రజాసాహిత్యం – పుట.7)

తెలంగాణ ప్రాంతంలో ప్రజాసాహిత్యం విస్తృతంగా వచ్చింది. జానపదులుగా పిలుస్తున్న ప్రజలు శ్రమ నుంచి సృష్టించిందే ప్రజాసాహిత్యం. అది వివిధ రూపాలలో లిఖిత సాహిత్యంగా మారటమంటే వీళ్లంత శ్రమజీవులను అనుకరించటమే అవుతుంది.

“మా అయ్య అల్లినదాన్నే
వాడయ్య రాశాడు
అల్లిక అంటరానిదయింది
రాతేమో రాజయ్యి కూసుంది”

అని కళ్యాణరావు ఆధునిక నాటక మూలాలలో రాసింది అక్షర సత్యం. అజ్ఞాతంగా ఉన్న ప్రజలు తాము అల్లిన దానికి ప్రాధాన్యత ఇస్తారు. కాని ఈ అల్లిక వారసత్వంపై పేటెంట్ సంపాదించిన కొందరు పండితులు సాహిత్యంలో రాజులుగా చలామని అవుతుంటారు.

…………………
కవియు మరణించె నొక తారగగనమెక్కి
…………………
సుకవి జీవించే ప్రజల నాలుకలందు”

 

అని జాషువా చెప్పిన మాటల్లో పండిత కవి మరణించి ఒక తార అయ్యాడు. కాని సుకవి (ప్రజాకవి) ప్రజల నాలుకల మీద జీవిస్తాడు. ఈ ప్రజా కవి పేరు మనకు తెలియదు. శ్రమజీవుల హృదయంలో జీవిస్తాడు. నాలుకల మీద పాటై పల్లవిస్తాడు. అల్లిక వారసత్వం కావటం వలన ఒకరి నుంచి ఒకరికి సాహిత్యం అబ్బుతుంది. అట్లే ప్రచారంలో ఉంటుంది. అందువల్లనే ఈ ప్రజా కవిత్వంలో మానవ జీవితమంతా సూక్ష్మంగా అల్లిక ఉంటుంది. కవిత్వంలో పదాలకూర్పు, ఉపమానాలు చక్కగా పొదుగుతాయి.

 

“బాయిల బచ్చలి కూర నా స్వామి
బండ మీద చెంచల్లి మొలక
వాలుకొమ్మల చింత చిగురు నా స్వామి
వండిపెడితే వలపులందు”

 

ఈ కవిత్వం ప్రకృతిలో ఉండే కొమ్మలు, పక్షులు, చిగురుతో మొదలవుతుంది. ‘వాలుకొమ్మలా’ అనే ప్రయోగం ఔచిత్యంగా చేసిందే. బాయిలో వంగిన కొమ్మ చిగురు ‘పూవు -పసరూ’ కలిసి ఉంటుంది. తొక్కు నూరుకోవడానికి అనువైన ఆకు కూడా అదే. సహజమైన ఉపమానాలతో శ్రమజీవులు కవిత్వాన్ని అల్లుతున్నారు. ప్రజాకవిత్వమంటే అది అనివార్యంగా పాట రూపమే. ప్రజాసాహిత్యమంతా పాటగానే వ్యక్తమవుతుంది. నాగరిక సమాజాలలో మద్యం సేవించటం విశ్రాంతి వర్గాల నుంచి వచ్చింది. మత్తు పదార్థాలను సేవించటం సామజిక హోదాగా భావించే భావజాలాన్ని ప్రజలలో ప్రచారం చేశారు. అందుకే ప్రజలు వాటి వలన కలిగే నష్టాలను కూడా సరిగానే గుర్తించారు.

 

“మానారు మానారయ్య
ఈ నిషబంది
ఇక నన్న మారరయ్య
చెరువెనక భూమి పోయే
చేసే సేద్యం పాయే
కమ్మ కోడెలుపాయే
గాటి తలుగులు పాయే
అత్తగారిచ్చిన
అరణం చెంబుపాయే”

 

మద్యం సేవించటం వలన ఉన్నదంతా ఊడ్చుకపోయింది. ఇంకా అట్లే కొనసాగిస్తే మనిషే పోతాడనే సందేశాత్మక పాటను అల్లుకొని పాడుకున్నారు. పాటకు లయ చాలా ముఖ్యం. వినసొంపైన లయతో అందరికి అర్ధమయ్యే సామాన్య పదాలతో పాట అల్లటం వారికి సహజంగా అబ్బుతుంది. అందుకే వాళ్లు ప్రజాకవులు.

వ్యవసాయంపై దువ్వూరి రామిరెడ్డి లాంటి కర్షక కవులు చాలా రాశారు. కాని ప్రజలే తమ జీవితాన్ని అల్లితే ఎంత వైవిధ్యంగా ఉంటుందో ఈ పాట ద్వారా చూడవచ్చు.

 

కమ్మరి ఇంటికాడ / కలిమాక చెట్టు
గంపతో బొగ్గులు / తుమ్మెద మోతలు
లేచేటి మిరుగులు / రాంబాణాలు
…………………
పోతనే మన గొర్రు / బొడ్రాయి మొక్కే
అసుంతు పాయెర/ అనుమడ్లు మొక్కే
నిలిచెర మన గొర్రు / నిండు రేగట్ల
…………………
ఏసిరి మనజొన్న /ముత్యంబోలే
ఎయ్యంగ / కొండెత్తు పడే
సుంకుపోయి / సురచంద్ర రాజులకు ముట్టే
గగ్గిపోయి / కర్రావు గాట్లెపడే

 

నాగలిని తయారుచేసే క్రమం నుంచి పంట ఇంటికొచ్చే ఉత్పత్తి ప్రక్రియనంతా పాటలో చెప్పారు. ఉత్పత్తి సంబంధాలను కూడా చిత్రించారు. ముగింపు కవితాత్మకంగా ఉంది. అట్లే ప్రకృతి ధర్మంగా ఉంది. తూర్పార పట్టాక సుంకు గాలిలో కలిసి ఎక్కడి కెళ్తుందో చెప్పటం భావాత్మకంగా ఉంది.

ప్రజల మధ్య కులముంటుంది. మతముంటుంది. వైరుధ్యముంటుంది. కలిసి శ్రమ చేస్తారు. వీటన్నింటికి అతీతమైన ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమకు సాంఘిక కట్టుబాట్లు అడ్డొస్తాయని తెలుసు. ఒక రెడ్డి కులస్తురాలు మాదిగ కులస్తున్ని ప్రేమించింది. కాని ఆ ప్రేమకు ఎన్నో ఆటంకాలున్నయి.

మావూరి కోనేరు
మెడ నిండా తాయితలు
వంగొంగి స్నానాలు చేస్తుంటే
మాదిగ
వలపు నిలపలేక వస్తిర మాదిగ
నీళ్ల వంటి కులం నీదిరా మాదిగ
పాల వంటి కులం నాదిరా మాదిగ
… … …

కాబట్టి కుటుంబం ఒప్పుకోదు. అట్లని ప్రేమను చంపుకోలేరు. తీవ్ర మానసిక ఘర్షణ. తల్లిదండ్రులు ప్రేమించిన వాడిన చంపుతారేమోననే బాధ నుంచి

సిన్నేటి ఒడ్డున / పెద్దేటి ఒడ్డున
నట్టనడి ఒడ్డున / నేల గుయ్యారం
నేల గుయ్యారానికి / నిన్నిడిసి కొట్టంగ
నీ సిన్ని శోకంబు / నే చూడలేను

 

అనే పాట పుట్టింది. ప్రేమ, దుఃఖం కలిసి పాటగా పరిణమించింది. వినేవారికి బాధ, సానుభూతి కలగటం కోసం ముగింపులో చిక్కటి కవితా వాతావరణంలో పాట ముగుస్తుంది. ఈ ప్రజా కవిత్వంలో పొడి పొడి మాటలో, నినాదాలో కాకుండా పండితులు చెప్పే కవితా నిర్మాణమంతా ఉంటుంది. దానిని ప్రజలు అభ్యసించలేదు. అనుభవం ద్వారా చేర్చుకున్నరు. రాయటం తెలియక పోయినా అల్లటం నేర్చుకున్నారు. అల్లిక వారసత్వాన్ని సజీవంగా ప్రజలు కొనసాగిస్తున్నారు. ఈ కోణంలో పరిశోధకులు ప్రజాసాహిత్యాన్ని చూడలేదు. ఇప్పటి నుంచైనా ఈ దృష్టిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ప్రజలు అల్లిన పాటలను కవిత్వంగా భావించి పరిశోధించాలి.

(మిగిలింది వచ్చే సంచికలో…)

  • సి.కాశిం: లెక్చరర్, ఆంధ్ర సారస్వత పరిషత్తు ఓరియంటల్ కళాశాల, తిలక్ రోడ్, హైదరాబాద్.

6 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు

6 Responses to “తెలంగాణలో ఉద్యమాలు – పాట – తెలంగాణ చరిత్ర (ఒకటో భాగం)”

  1. 1
    Pasunoori Ravinder Says:

    చక్కని విశ్లేషణతో కూడిన వ్యాసాన్ని అందించిన కాశీం గారికి,
    ప్రాణహితకు ధన్యవాదాలు
    పసునూరి రవీందర్

  2. 2
    uday bhanu Says:

    వ్యాసం చాలా బాగుంది.

  3. 3
    Santosh Says:

    చాలా బాగుంది…

  4. 4
    Rakesh Says:

    ఇలాంటివే జాజిరి పాటలు కూడా…

    .. అడిగుండిడిగుండిత్తడి గుండు..
    గుండువాయి గుండచ్చె.. . ….
    మోత రాజు వోయి (మోతె ఒక ప్రాంతం పేరు) తాండూరెక్కె..
    తాండూరంతా దండై నిలిచె,
    నిలిచి కొట్టరా నీలపు రాయ్…
    తలిచి కొట్టరా తాళపు రాయ్……..

    ఇక్కడి ప్రతి పల్లెలోనూ, ప్రజల నోళ్ళలోతరాలుగా ప్రవహిస్తున్న పాత పాటల్లో తెలంగాణ చరిత్ర ఆనవాళ్ళెన్నో… పరిశోధించాల్సిన అవసరం ఉన్నది.
    .

  5. 5
    Rakesh Says:

    గుండరాజుల గురించి, అప్పటి యుద్ధాల గురించీ చరిత్ర subject అధ్యయనం చేస్తున్నవారెవరైనా వ్యాసరూపంలో రాస్తే బాగుంటుంది.

  6. 6
    Rakesh Says:

    ప్రజానాయకుల పట్ల స్త్రీలు నిరసన తెలపడానికి బతుకమ్మ పాటలు వాడుకున్న వైనం…

    సంజీవరెడ్డీ…. వుయ్యాలో…
    సచ్చెన్నడువోతడో… వుయ్యాలో…
    సద్దూల బతుకమ్మ… వుయ్యాలో..
    మూడొద్దులున్నదే… వుయ్యాలో…

    ఇంకా,
    ..బండి బెదిరె కొడుకో…. బ్రమ్మనందరెడ్డి కొడుక
    బాపట్లవాడు, వాడు, బదిమాషిగాడు వాడు
    లక్షట్టిపేటవాడు, వానిపేరె సర్గాడిస్టు!!

    యెములాడ కాడ లగ్గం… వాని మెడకువాడె (పడె) పగ్గం!!

    ఇక మహమ్మదీయులతో, సాంస్కృతికంగా ఎంతగా కలిసిపోయేవారంటే… మొహర్రం ఊరేగింపుల్లో అందరూ పాల్గొనడం, హస్సన్ – హుస్సేన్ లను తమవాళ్ళుగానే భావించడం, పిల్లలు పుడితే ఆశన్న – ఊశన్న అని పేర్లు పెట్టుకొనేదాకా!!

    “ఆశన్న – ఊశన్న ఇద్దరన్నదమ్ములంట..”

    “సోడు బియ్యమూ – సొంగరొట్టెలూ ఆశన్న – ఊశన్నలారా…
    మానెడు బియ్యము – మలీదముద్దలు – ఆశన్న – ఊశన్నలారా!!”

    (సశేషం..)

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో