వర్తమానం కోసం ఒక స్మృతి గీతం

ఎడోనిస్ (జననం: 1930) అనేది కలం-పేరు. కవి అసలు పేరు అలీ అహ్మద్ సయీద్. సిరియాలో పుట్టి పెరిగారు. అక్కడే చదువుకున్నారు. ఆయన రాజకీయ అభిప్రాయాలు గిట్టని ప్రభుత్వం ఆయనను బాగా వేధించి, జైలు పాలు చేసింది. 1956లో బీరుట్‍ వెళ్లిపోయి, లెబనాన్ పౌరుడిగా స్థిరపడ్డారు. 1958లో ‘మవాఖిఫ్’ పత్రిక ప్రారంభించి, అరబిక్ కవిత్వంలో ఆధునిక మార్పులు తీసికురావడానికి కృషి చేశారు. అరబిక్ సాహిత్యంలో గొప్ప కవిగా, విమర్శకుడిగా పేరొందారు. పకడ్బందీ వాదంతో సాగే సాహిత్య విమర్శతో, తరచు ప్రతీకావాద, భవిష్యద్దర్శన స్పర్శతో సాగే కవిత్వంతో “స్థిరపడిపోయిన భావాల నుంచి బయటికి దూకి, నేటి పరిస్థితులలోనూ, మనం ప్రపంచాన్ని చూసే పద్ధతిలోనూ మార్పులు తీసుకురావడం అవసరమ”ని పిలుపునిచ్చాడు. సాంప్రదాయిక అరబిక్‍ సాహిత్యాన్ని బాగా అధ్యయనం చేసిన వ్యక్తి. పాత కవితా రూపాలను తిరిగి లేవనెత్తడమే గాక, వచన పద్య రూపాలతో ప్రయోగాలూ చేశాడు. తన గురించి, తననూ తన కవిత్వాన్ని నడిపించే ప్రాంతీయ స్థితిగతుల గురించి మాట్లాడుతూ “కవిత్వం మనిషి నడతను గమనిస్తూ నిలబడిన చెట్టులా, కవి ఈ ప్రపంచ లయను అర్థం చేసుకున్న రక్షక భటునిలా పని చేసే నేల నుంచి వచ్చిన వాడిన”ని చెప్పుకున్నాడు.

పిలిగ్రిమ్స్ వాయేజ్‍ ని గుర్తుకు తెచ్చే ఈ పద్యాన్ని ఎన్ని సార్లు చదువుకుంటే అన్ని సార్లు కొత్త అందాలు చూసిన సంతోషం కలిగింది. రచనలోనే కాదు, పఠనంలోనూ పద్యాలు ‘మన’ భాషలో అందినంతగా ‘పర’ భాషలో అందవు. పద్యానికి వీలయినంత సన్నిహితం కావాలనే కోరిక నన్ను ఈ అనువాదానికి (బహుశా, ఏ అనువాదానికైనా) ప్రేరేపించింది. కనీసం ఇంగ్లిష్ వర్షన్ మేరకు, ఇందులో ఏమీ కలపకుండా వుంటానికి, ఏమీ తీసేయకుండా వుంటానికి నా శక్తి మేరకు ప్రయత్నించాను. వ్రాత-భాషకు తప్పనిసరి అయినప్పుడు తప్ప వ్యావహారిక తెలుగు నుంచి దూరం కాకుండా వుంటానికి కాన్షియస్ గా ప్రయత్నించాను. నేను అడ్డుపడకుండా, ఎడోనిస్ ని మీకు ఎంత ఎక్కువ చేర్చి వుంటే, అంత సంతోషం.

* * *

వర్తమానం కోసం ఒక స్మృతి గీతం

- ఎడోనిస్

1.
పెదిమల మీద బహిష్కృతి మంత్రం
వదిలే ఊపిరిలో మంటలు
ప్రవాసుల బండ్లు
గోడలను ఢీకొంటున్నాయి.

లేక ఈ బండ్లు
నా పద్యాల వేడి నిట్టూర్పులా?

తుపాన్లు మమ్మల్ని నలిపేశాయి.
దగ్ధమైన దినాల బూడిదలో కూలబడి,
కత్తుల మెరుపుల మీదుగా
శిరస్త్రాణాల కొసల మీదుగా
జారిపోతున్న
మా ఆత్మ‍లను మేము చూస్తున్నాం.

ఉప్పు ద్రవం వంటి శిశిరం
మా గాయాల మీద పేరుకుపోతుంది.
ఏ చెట్టూ మొగ్గలెత్తదు,
లేదు వసంతం.

ఇప్పుడీ చివరి అంకంలో
మా చరిత్రను బోర్లా మా మీదికి
తోసేస్తోందొక విధ్వంసం.
ఏమిటి మా గతం,
బొమ్మజెముళ్లు గుచ్చి ఎత్తిన ఎడారుల వలె
బొక్కలు పడిన జ్ఞాపకాలు వినా?
ఏ నదులు కడిగెయ్యగలవు దీన్ని?
తీర్థయాత్రల నుంచి తిరిగొచ్చిన
పెళ్లి కాని ప్రౌఢల, వితంతువుల
మైపూతల మదం వాసన అంతటా.
పంట్లాములను గిరగిర తిప్పి
వాటిని అద్భుతాలుగా మార్చే
ముస్లిం సాధువుల చెమట బురద దీన్నిండా.

మిడతల వసంతం వికసిస్తోందిప్పుడు.
రాత్రి-పాటల పక్షుల శవాలపై స్వయంగా రాత్రి
తూగుతోంది బరువు బరువుగా.
గట్టిగా మూసి గొళ్లెం పెట్టిన
సముద్ర ద్వారం
మమ్మల్ని తిరస్కరిస్తుండగా
ఉదయం వైపు ఒక్కో అంగుళం జరుగుతోంది పగలు.

బాధగా అరుస్తాం,
ఏడుస్తున్నట్టు కలగంటాం,
కన్నీరు మా కళ్లను నిరాకరిస్తుంది.
పెను ఉప్పెనల మధ్య
మా మెడలు మెలితిరుగుతాయి.

ఓ నా తల్లి నేలా,
నువ్వొక కోరికతో రగిలే స్త్రీ వలె,
వాంఛ వంతెన వలె కనిపిస్తావు నాకు.

తమ చిత్తం వచ్చినప్పుడు ఫారోలు నిన్ను స్వీకరిస్తారు,
ఇదే ఇసుక వారికి జేజేలు కొడుతుంది.
కను గవ్వ‍ల లోని బంకమట్టి గుండా
ఏ మనిషికైనా కనిపించే దాన్నే నేనూ చూస్తాను:
పసిపిల్లల గోరీల వద్ద నైవేద్యాలు,
సాధుసంతులకు ధూప దీపాలు,
నల్ల-చలువరాతి సమాధులు,
అస్తిపంజరాలు వెదజల్లిన పొలాలు,
రాబందులు,
వీరుల పేర్లతో జవజవలాడే కళేబరాలు.

ముందుకు పోతాం అలా మేము
సముద్రానికి రొమ్ములొడ్డి.
నిన్నటి గురించి దిగులు పడుతూ.
మా పదాలకు ఏ వారసత్వం అంటదు,
అవి దేన్నీ ప్రసవించవు,
మేము ద్వీపాలం.
అగాథం లోంచి బొంతగద్దల వాసన.
దయ్యం పిల్లల్ని పొదిగే
నిరాశా నెలవంకకు మాత్రమే
అపద వేడికోళ్లు పంపిస్తాయి మా ఓడలు.
నదీపాతం వద్ద, మృత సముద్రం వద్ద
నడిరాత్రి తన సంబరాల్ని కలగంటుంది,
ఇసుక, నురగ, మిడతలు మాత్రమే
సంబరాలకు వచ్చే వధువులు.

ముందుకు పోతాం అలా మేము,
మురికిలో కన్నీళ్లలో
మా యాత్ర బండ్లను సమీకరిస్తూ,
మా సొంత రక్తంతోనే
భూమి రక్తం స్రవింపజేస్తూ,
పచ్చని సముద్రం ఆనకట్ట
మాత్రమే
మమ్మల్ని ఆపేసే వరకు.

2.
ఏ దేవుడు తన రక్త మాంసాలతో
తిరిగి లేవనెత్తగలడు మమ్మల్ని?
ఇంతా చేసి, ఇనుప పంజరం ముడుచుకుంటోంది.
పుట్టినప్పటి నుంచి మేమీ
ఆనంద శిథిలాల పేరిట రోదిస్తున్నా
ఏమాత్రం ఆగడు తలారీ.

ఇవేమి ఇరుకు గతాలు,
పాచిపోయి, ముడుతలు పడ్డ సంవత్సరాలు…
బూడిద రంగు ఇసుకతో ఆకాశం
తన రంగు సరిచూసుకుంటున్నప్పుడు
తుపాన్లు కూడా దేబెరిస్తూ వస్తాయి,
శతఘ్నుల్లా, కంచర గాడిదల్లా కదిలే
మేఘాల కింద కవాతు చేస్తున్న మమ్మల్ని
కళ్ల ముందు దృశ్యాలే దాటరాని అవరోధాలై
రుతువుల మధ్య నిలబెట్టేస్తాయి.
మా కళ్లు బూడిద-బురదతో గరగరలాడేలా
వాటిపై శ్మసాన ధూళి కమ్ముకుంటుంది,
రెప్పల-వెంట్రుకలు సూర్యుడికి పటం కట్టవు
కన్బొమలు పగటికి నీడనివ్వవు,
పేదల వద్దకు మాత్రమే చేరినట్లుగా
బొట్టు బొట్టుగా రాలుతుంది బతుకు,
ఇసుక దిబ్బలు, మంచుగడ్డల నీడలో
మేము బతికేస్తుంటాం.

ఇలాగే బతికేస్తుంటారు మనుషులందరూ.

మనుషులందరూ… ఎక్కడెక్కడి నుంచో వచ్చి చేరే తుక్కు ,
తాజా ఆర్సెనిక్ విషపుటెరలు.
ఏ పచ్చదనం మొలకెత్తగలదు వీళ్ల ఆకాశం కింద?

మనుషులందరూ… బూడిద కూరిన గొంతులతో,
మౌనం బండ రాళ్ల కింద నలిగిపోతూ,
సామ్రాజ్య నిర్మాతలను మూపులపై మోస్తూ,
వారి వినోదం కోసం గోదాలలో జబ్బలు చరుస్తూ
ఎన్నెన్నో పాద పీఠాలు,
ఎన్నెన్నో బ్యానర్లు…
బరాదా, యుఫ్రెటీస్ అలల్లో ఎవరూ గుసగుసలాడరు,
ఏదీ దేనికీ జన్మనివ్వదు, ఉరకలెత్తదు.
ఓ నా ఎండిపోయిన మౌన భూమీ,
ఎవరిలా నిన్నొక శిలాజంలా వదిలేశారు?
ప్రపంచ పటం మీద నువ్వొక వీర భూమివే,
గోధుమ పొలాలు, చమురు, ఓడరేవులు,
వ్యతిరేక-వర్ణంగా ప్రవాస యానాలు… నువ్వు సంపన్నవే.
గంజాయి తోటల్లో ఒక కొత్త జాతి పెరుగుతుందా?
తాజా గాలులు ఇసుక రూపురేఖల్ని మార్చేస్తాయా?

రానీ వాన,
మన శిధిలాల్లో మన‍ల్ని శుభ్రం చెయ్యనీ,
కడగనీ శవాల్ని, కడిగెయ్యనీ చరిత్రని,
మన పెదిమల మీద గొంతు-నొక్కబడ్డ పద్యాలు
వీథుల్లో గులకరాళ్ల వ‍లె వూడ్చుకుపోనీ.
మన ఆవులు, బాతులు, పువ్వులు, దేవుళ్లను
మనం చూసుకుందాం.
కప్పలు ఆకలి గొన్న ఈ నేలకు
బెకబెకలు తిరిగి రానీ.
మిడతలూ బహిష్కృత చీమలు
రొట్టెలు పట్టుకు రానీ.

నా పదాలు దూసుకుపోతున్న బల్లెం అవుతాయి.
సత్యం వలె ఎవరూ ఎదిరించలేనిదై,
నా బల్లెం తిరిగొస్తుంది
నన్ను తాకి పడెయ్యడానికి.

3.
అబ్బాయిలూ, ముడవండి మీ శిగలలో మరింత పచ్చని ఆకులు.
ఇప్పటికీ మన వద్ద పద్యాలున్నాయి
మనకు సముద్రం వుంది, మనకు మన కలలున్నయ్.
“చైనా గడ్డి మైదానాలకు
గుర్రాల సకిలింతలు అందించిన వాళ్లం,
జార్జియాకు పదునైన బళ్లాలు.
ఇటు నుంచి హిమాలయాల వరకు
నిర్మిద్దాం ఒక స్వర్ణ మందిరం.
ఎగరేద్దాం సమర్కండ్ లో జెండాలు,
సంపదలు నిక్షిప్తమైన పచ్చని నేలల
మీద నడుద్దాం,
మన రక్తాన్ని గులాబీలతో దీవిద్దాం,
మన దినాలపై మరకలు తుడిచేసి
నడుద్దాం రాళ్ల మీద
పట్టు తివాచీల మీద నడిచినట్లు.

“ఇదొక్కటే దారి.
ఇందుకోసం మెరుపులతో కలుద్దాం,
బూజుపట్టిన నేలకు తైల సంస్కారం చేద్దాం,
పుట్టుక కేకలతో నేల
మార్మోగు మార్మోగు మార్మోగు వరకు.

“ఆపలేదు ఏదీ మన‍ల్ని,
గుర్తుంచుకోండి,
మనం సముద్రం కన్న పచ్చని వాళ్లం,
కాలం కన్న చిన్నవయసు వాళ్లం,
సూర్యడూ దినం
మన వేళ్ల మధ్య పాచికలు.”

ప్రవాస చంద్రుని కింద
వణుకుతున్నాయి మొదటి రెక్కలు.
మృత సముద్రం మీద
పడవలు కదుల్తున్నాయి, నగరం గేట్ల వద్ద
వేడి సిరొక్కో గాలుల సవ్వడి.
రేపు ఈ గేట్లు తెరుచుకుంటాయి.
ఎడారిలో మిడతలను దహిస్తాం.
అగాథాల్ని అధిగమించి
రేపటి ప్రపంచం ముంగిట్లో నిలబడతాం.

“చీకటీ,
సముద్రపు చీకటీ,
నింపుకో నీలో చిరుతపులి సంతోషం,
మాతో త్యాగాలు చేయించు
ఇవ్వు మాకొక కొత్త పేరు,
భవితవ్యం డేగ నిరీక్షిస్తోంది,
కళ్లలో సమాధానాలు దాచుకుని.

“చీకటీ,
సముద్రపు చీకటీ,
ఈ శవాల విందును పట్టించుకోకు,
నీ గాలులతో
నేలను వికసింపజెయ్యి,
బహిష్కరించు మహమ్మారిని, నేర్పించు ఈ రాళ్లకే
నాట్యమూ ప్రేమ.”

ఇసుక దేవత సాగిల పడుతోంది.
వసంతం వికసిస్తోంది సముద్రం నుంచి జీవితం వలె.
ప్రతి దీపం ఒక ప్రార్థన మందిరం,
ప్రతి ఈగ సన్యాసిని కన్న పవిత్ర మయిన
ఈ దిగ్బంధ నగరాన్ని వదిలేస్తాం.

4.
ఎక్కడ నీ ఇల్లు?
ఏ దేశం నీది?
నీ పేరు లేని శిబిరమేది?”

“నా దేశం వదిలేయబడింది.
నా అత్మ నన్ను విడిచిపోయిది.
లేదు నాకు ఇల్లు”

ఫారోలు ఏలిన కాలంలో, నరమాంస భక్షకుల కాలంలో
కవి మాట చచ్చిపోయింది.
ఫారోలు ఏలుతున్నప్పుడు
నేను నా పుస్తకాలు పట్టుకుని వెళ్లిపోతాను,
నా హృదయం నీడలో జీవిస్తూ
పద్యాల పట్టుదారాలతో
ఒక కొత్త స్వర్గాన్ని నేస్తాను.

సముద్రం మా గాయాల్ని కడిగేసి
ఉప్పుతో వాటికి బంధుత్వం కలుపుతుంది…
తెల్ల సముద్రం,
రోజువారీ యుఫ్రెటీస్‍,
తన ఉయ్యాలలో ఒరాంటీస్,
బరాదా నది___
అన్నిటినీ రుచి చూశాను,
ఏదీ నా దప్పిక తీర్చలేదు.
అయినా వాటి ప్రేమను నేర్చుకున్నాను,
యోగ్యమే అలాంటి జలాలు నా నిరాశకి.

దిక్కు తోచని స్థితి అయినా
నేను మృత్యువును ద్వేషిస్తాను.
పోగొట్టుకుపోయాను అయినా
భూమికి గట్టి పొరగా‍, ఇసుక‍ వూబిగా పని చేసే
అబద్ధాలూ సందేహాలన్నిటి లోంచి
నా రస్తా నేను వెదుక్కుంటాను.
నాకు ప్రవాసి తెరచాప ఇవ్వండి
యాత్రిక ముఖాన్నివ్వండి
చెరసాలలకు, మార‍ణహోమాలకు వీపు తిప్పి
మృతులను మృత్యువుకు వదిలేసి
ఇదిగో నేను వెళ్తాను,
నా అనంత వేదనలను నాతో వుంచుకుని,
నక్షత్రాల నుంచి నా దూరాన్ని,
నా తీర్థ యాత్రను,
నా ప్రేయసిని,
నా పద్యాలను నాతో వుంచుకుని.
నుదుటి మీద ఆరని
ప్రవాసం చెమటతో
కళ్లలో నిద్దరోతున్న
విస్మృత పద్యంతో నేను వెళ్తాను,
తోటల్లో, ద్రాక్షతోటల్లో ఖననమయిన వాళ్ల గురించి
కలలు గంటూ వెళ్తాను.
నేను ప్రేమించిన వాళ్లను గుర్తుంచుకుంటాను,
ఆ కొద్ది మందిని.
సముద్రం నా రక్తాన్ని ఉరికించే సమయంలో,
గాలి నా ప్రేయసి కురులను ముద్దాడే సమయంలో
నేను మా అమ్మను గుర్తు చేసుకుంటాను,
ఆమె జ్ఙాపకంలో ఒక
గడ్డి చాప అల్లుతాను
ఆమె కూర్చుని దుఃఖించడం కోసం.

ఈగల యుగానికి స్వస్తి.

నా కాళ్ల కింద నేల ఇంకా వున్నందుకు
నా పాలిపోయిన నిరాశా దేవత సంతసిస్తుంది.
ఒక కొత్త గొంతు నా పదాల్ని పలుకుతుంది.
గులాబీల వలె నా పద్యం నగ్నంగా వికసిస్తుంది.

నాక్కొంచం కాగితమివ్వండి,
కొంచం సిరా.
నిరాశే ఇప్పటికీ నా నక్షత్రం,
దౌష్ట్యం ఎప్పుడూ పుడుతూనే వుంటుంది.
ఇసుక మీద మౌనం పైకి లేస్తుంది.
తాకవలసిన హృదయాలున్నాయి.
కొంచం సిరా…
కొంచం కాగితం…

“ఎక్కడ నీ ఇల్లు?
నీ పేరు లేని శిబిరమేది?”

“నా దేశం వదిలేయబడింది.
నా ఆత్మ నన్ను విడిచిపోయింది.
లేదు నాకు ఇల్లు.”

ఒక అభిప్రాయం »అనువాదాలు, కవితలు

ఒక అభిప్రాయం

  1. sky baaba Jun 30, 2009 1

    ఆదాబ్ హెచ్ఆర్కె గారు.. అద్భుత కవిత అనువాదమ్ అన్దిన్చారు.. షుక్రియా..
    ..స్కైబాబ

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో