Jun2009
అద్వీతయ మహాకవి శ్రీశ్రీ
- డా|| అక్కిరాజు రమాపతిరావు (మంజుశ్రీ)

శ్రీశ్రీ
శ్రీశ్రీ
20వ శతాబ్దాన్ని తెలుగు సాహిత్యాన్ని ముఖ్యంగా కవిత్వ పరంగా అసదృశంగా, అత్యంతంగా ప్రభావితం చేసిన గొప్ప సాహితీ వేత్తలు, అందునా మహాకవులను ఇద్దరిని చెప్పండి అని అడిగితే, ఎవరిని అడిగినా,వాళ్లకు ఏమాత్రం సాహిత్య పరిజ్ఞానం ఉన్నా, వాళ్లు ఎన్ని రకాలైనా జంటలకోసం అన్వేషించినా, ఆలోచించినా, ఈ రెండుపేర్లలో శ్రీశ్రీది తప్పకుండా ఒకపేరై ఉంటుంది. కాబట్టి 20వ శతాబ్దపు తెలుగు మహాకవులలో ఆయనది ద్వితీయాద్వితీయస్థానమని ఒప్పుకొని తీరాలి. ఆయనదే మొదటిపేరు ఎందుకు కాకూడదు? అంటే వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యం అనాదృతమవుతుంది. అప్పుడు అస్థిత్వంకోల్పోతుంది. శ్రీశ్రీకి అది ఎంతమాత్రమూ ఇష్టంలేదు,మనపూర్వకాలపు తెలుగు కవులపట్ల ఆయకు ఎంతో గౌరవం,అభిమానం,మెప్పు ఉన్నాయి. కాబట్టి 20వ శతాబ్దపు మహాకవులను ఇద్దరిని మాత్రమే ఎంచుకోండి అని అడిగినప్పుడు మొదటిపేరు ఆ చెప్పే వారి అభిరుచినిబట్టి జాషువా కావచ్చు,విశ్వనాథ సత్యనారాయణ కావచ్చు,దేవులపల్లి కృష్ణశాస్త్రి కావచ్చు,తుమ్మల సీతారామమూర్తి కావచ్చు వారివారి అవగాహనను బట్టీ,అభిరుచినిబట్టి, ఆంతర్యాన్యిబట్టి ఏదో ఒక పేరు కావచ్చు. కానీ రెండోపేరు వచ్చేసరికి అది శ్రీశ్రీది కావడం అనివార్యం. 20వశతాబ్దపు తెలుగు సాహిత్యం దురదృష్టాలలో,అక్రమాలలో,అపశ్రుతులలో జ్ఞానపీఠపురస్కారం జాషువాకో,శ్రీశ్రీకో రాకపోవడం కూడా ఒకటని చెప్పాలి.
20వ శతాబ్దంలో ప్రంపచాన్ని బహు విషాదంపాలు చేసిన రెండు ప్రపంచయుద్ధాలలో మొదటి ప్రపంచయుద్ధం సమయంలో పుట్టాడు శ్రీశ్రీ. అందువల్ల ఆయన కవిత్వం కన్నీళ్ళు,కష్టాలు,ఆక్రందనలతో ప్రతిధ్వనిస్తుంది. రెండో ప్రంపచయుద్ధం మొదలయ్యేనాటికి ఆయన మహాకవిగా,తెలుగుభాషఅపరిమేయ శబ్దశక్తికి మూలాధారంగా, ప్రతీకాత్మకంగా రూపొందాడు. 1934 ఏప్రిల్ 12నాడు’మరోప్రపంచం’అని ఒక వ్యాసం రాయడానికి ఆయన కలం,కాగితం సిద్దం చేసుకొని రాయడానికి పూనుకోగా కలంలో సిరా అయిపోయింది. రాయడానికి మొరాయించింది. ఉద్వేగాన్ని,కవితావేశాన్ని ఆపుకోలేక కాపీయింగ్ ఇంక్ పెన్సిల్ తీసుకొని. . మరో ప్రపంచం. . మరో ప్రపంచం. . మరో ప్రపంచం పిలిచింది, అని అక్షరాలను ఉరకలెత్తించాడాయన. ఈ గొప్ప గీతం ఐదు నిమిషాలలో పూర్తయిందని ఆయన చెప్పుకున్నారు. మర్రోజే అప్పట్లో ఒక ప్రసిద్ధ సాహిత్య మాసపత్రికకు ఈ ఉజ్జ్వల గీతం ప్రచురణార్థం పంపగా మూడోనాటికి అది తనను చేరేట్లు దానిని తిప్పి పంపించింది ఆ పత్రిక అని శ్రీశ్రీ రాసుకున్నారు. ఆ తర్వాత ఈ కవితా గీతిక జ్వాల పత్రికలో వచ్చినప్పుడు దీని కవితాశీర్షిక మహాప్రస్థానం అని వస్తుంది అని కూడా ఆయన అన్నారు. మూడవసారి భజగోవిందం అనకుండా గోవిందంభ అని తిప్పికొట్టడంలో ఆచార్య శంకరుల అసాధరణ ప్రజ్ఞ సుస్పష్టమవుతుంది అని కూడా శ్రీశ్రీ అన్నారు. అంటే ఈ ప్రశంసల వల్ల,ప్రస్తానాల వల్ల శ్రీశ్రీ సంప్రదాయ కవి అని చెప్పాలన్న ప్రయత్నం కాదు ఇది. ఆయన దుష్ట సంప్రదాయనిరాసకుడు,విధ్వంసకుడేకానీ, సంప్రదాయపట్ల,పూర్వ కవులపట్ల నిరసన చూపినవాడు కాడు అని చెప్పటమే.
తన కవితా సవ్వడిలో తిక్కనగారి ప్రభావం కూడా ఉందని శ్రీశ్రీ చెప్పారు. ఆయన అన్నమాటలివి. . ’తిక్కన మహాభారతంలోని ఎన్నెన్నో వచన గమకాలలో ‘కవనమణి గణరణన గణగణలు’ వినపడతాయి కదా! అవంటే నాకు ఇష్టం అని చెప్పాడు శ్రీశ్రీ. ఆయన 75 ఏళ్ల కిందట ఈ మాటలు చెప్పారంటే ఆయకప్పుడు 25 ఏళ్ల వయసు. ఇటు తెలుగు ప్రాచీన సాహిత్యాన్ని, అటు పాశ్చాత్య నవ్య సాహిత్యాన్ని ఆయన ఎంతగా స్వాధీనం చేసుకున్నారో ఇందువల్ల తెలుసుకోవచ్చు. శ్రీశ్రీ స్వార్థప్రియుడు కాదు, అర్థ ప్రియుడు కూడా కాదు. ఆయనలో ఉన్న శబ్దప్రియత తెలుగు కవులలో మరి ఎవ్వరిలోనూ కనపడదు. ప్రియతే కాదు ,శబ్దం మీద అధికారం ఆయన సంపాదించినంత అటు పూర్వకువలోలకాని, ఇటు నవ్యకవులలో కాని మరెవరూ సాధించలేదనే చెప్పాలి. తెలుగు కవితను ఇతర ప్రక్రియలను శ్రీశ్రీలాగా నవీకరించిన వారు మరొకరులేరు. రెండు ప్రపంచయుద్ధాల మధ్య కాలంలోని విశ్వస్థాయి కవితా ప్రయోగాలను శ్రీశ్రీలాగా ఆకళింపుచేసుకున్నవారెవ్వరూ తెలుగు కవులలో ఇంకొకరులేరు. విశ్వనాథ సత్యనారాయణగారి కిన్నెరసాని పాటలు,కోకిలమ్మ పెళ్ళి ఖండకావ్య సంపుటిని జ్వాల పత్రికలో శ్రీశ్రీ సమీక్షించాడు. ఈసమీక్షలో కూడా విశ్వనాథ కవిత్వంలోని లయను,తూగును,కిన్నెరహోయలను శ్రీశ్రీ ప్రస్తావించాడు,మెచ్చుకున్నాడు. 1934లో నాటికి శ్రీశ్రీకి 24 ఏళ్ళే కదా!.
ఒక స్నేహితుడి ఇంట్లో శ్రీశ్రీ కవితాసల్లాపం చేస్తుండగా తన కొత్త రచనలు విన్పిస్తుండగా,ఆ ఇంటి వాళ్ల కుర్రాడు పన్నెండు పదమూడేళ్ళవాడు ఎంతో కులాసాగా,ఉల్లాసంగా ఓహో! కవిత్వమంటే ఇదా, ఎంతో కష్టమనుకున్నాను కవిత్వం చెప్పడము. నేను కూడా కవిత్వం రాయగలను. . రాస్తాను. . అని అన్నాడట. అప్పుడు శ్రీశ్రీ. . ,కవిత్వం ముఖ్య ఆశయమిదే,ప్రయోజనమిదే, అని సంతోషించాడట. బహుశా అగ్గిపుల్ల సబ్బుబిళ్ళా . హారం పళ్ళం. . తలుపు గొళ్ళం. . గుర్రపు కళ్ళం. . కాదేది కవితకనర్హం. కావాలోయ్ కవితావేశం, ఉండాలోయ్ రసనిర్దేశం. . అని చెప్పటంవల్ల ఆ బాలుడు అట్లా ఉత్సాహించి ఉంటాడు.
సినిమా పాటలలో కూడా శ్రీశ్రీది ప్రత్యేకమైన ప్రతిభ. పరిపూర్ణమైన మానవతా స్పందన. . ఆయన పాటలో కనపడుతుంది. అవి కూడా అచ్చపు కవితాఖండాలే అనిపిస్తాయి. చైతన్య స్రవంతి రీతిని తెలుగువారికి ఇచ్చినవాడు శ్రీశ్రీయే అనిపిస్తుంది.
శబ్దం మీద అధికారంలో శ్రీనాథుడు తనకు చాలా ఇష్టుడు అని ఒక ఇంటర్వ్యూలో శ్రీశ్రీ చెప్పాడు. 20వ శతాబ్దపు తెలుగు కవితా సంపుటాలలో నాలుగు ఉత్తమైనవి చెప్పమంటే ఎటువంటి సంయోగాలు,ప్రస్తారాలు,పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఊహించినా,ఎంపిక చేసినా అందులో మహాప్రస్థానం ఉండడం తప్పనిసరి. అభ్యుదయ కవిత్వానికి ఆనవాలు శ్రీశ్రీ.
శ్రీశ్రీకి ముందటి కవులు అర్ధాన్ని,భావాన్ని,కల్పనను, వర్ణనను తమ ప్రతిభకు నిదర్శనంగా ఎంచుకోగా శ్రీశ్రీ, శబ్ద ప్రయోగ ప్రజ్ఞ వాటికంటే ప్రతిభా నిదర్శనంఅని నిరూపించాడు. అక్షరాలతో ఆడుకున్నాడాయన. అదీ ఆయన గొప్పతనం,విశిష్ఠత. ఆధునిక కవులలో ఆయన ఛందప్రయోగనైపుణ్యం మరొక అలవడలేదు. అందువల్లనేఆయన కవితా శీర్షికలతో కథలు,నవలలు,నాటికలు, నాటకాలు వచ్చాయి.
3 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు
pravallika Jun 1, 2009 1
మంచి వ్యాసాన్ని రాసిన మంజుస్రీ గారికి క్రుతఙతలు
Praveen Jun 1, 2009 2
శ్రీశ్రీ పై విమర్శలు కూడా చదవండి: http://telugu.stalin-mao.net/2009/05/26/442
ప్రాణహిత » జూన్ 2009 సూచిక Jul 6, 2009 3
[...] అద్వీతయ మహాకవి శ్రీశ్రీ : డా|| అక్కిరాజు రమాపతిరావు (మంజుశ్రీ) [...]