Jun2009
అమ్మ
- ‘తాయమ్మ‘ కరుణ
ఎండెక్కింది. “పొద్దుబాయె. లే! లోపలికిరా” లచ్చుమమ్మను చెయ్యిపట్టి లేపబోయాడు నర్సయ్య.
పొద్దుకు చెయ్యి అడ్డం పెట్టుకొని దారి దిక్కు చూసుకుంటూ “ఆగయ్య, పిలగాడు ఇంకా రాకపాయె. కాసేపు చూసొస్త” లచ్చుమమ్మ చిరాకు పడుతూ అంది.
“ఏం జూస్తవ్. చూసినకాడికి సాల్లే. ఇంత తిందువుగాని రా’
“ఏందీ నీ యావారం. నా పిలగాని కోసం నేను ఎదురుచూస్తుంటే చూడనియ్యరేంది” కోపమూ చిరాకుతో ముఖం అంతా చించుకుంటూ అంది లచ్చుమమ్మ.
“ఈడిదాక వచ్చినోడూ ఇంట్లకు రాకుండా బోతాడా ఏంది” సముదాయిస్తూ నర్సయ్య మళ్లీ లేపబోయాడు లచ్చుమమ్మను.
చెయ్యి నెమ్మదిగా నర్సయ్య చేతిలోంచి విడిపించుకుంటూ ” ఏందయ్యా, పిలగాడు ఇంకా రాకపాయె” కన్నీటిని కొంగుతో తుడుచుకుంటూ అంది లచ్చుమమ్మ.
ఆ బాధ అలవాటయిన నర్సయ్య కళ్ళలో నీళ్లు ఇంకిపోయి చాన్నాళ్ళే అయింది. అయినప్పటికీ నర్సయ్య కడుపులో ఏదో మెలిపడ్డట్టు అయింది.
ఇది రోజూ ఉండే సన్నివేశమే. చీకటితోటి లేవడం, గబగబా ఇంట్లో పనులు, వంటపని చేయడం. ఇంటి ముందర అరుగు మీద కూర్చొని కొడుకు మల్లేషు కోసం ఎదురుచూడడం. చివరకు ఏడుస్తూ లోపలికి పోవడం.
ఆ బజార్న పోయేవాళ్లకూ ఇది అలవాటే. అయినప్పటికీ ఇప్పటికీ లచ్చుమమ్మను చూసి కండ్లనీళ్లు ఒత్తుకుంటరు.
ఒక్కగానొక్క కొడుకు. ఆ తల్లికి ఆడపిల్ల అయినా మగపిలగడయినా మల్లేషు ఒక్కడే. చిన్నప్పుడు ఆడపిల్లగా చూడాలనుకుంటే గౌను వేసి మురిసిపోయేది. లచ్చుమమ్మకు కొడుకే సర్వస్వం. కూలికి పోయినా, నాలికి పోయినా, పొలానికి పోయినా ఎప్పుడూ వెంట తీసుకుపోయేది. బడిలో షరీక చేసిన రోజు కంటికి కడివెడు ఏడ్చింది. బడి నుంచి వచ్చేదాకా ఏ పని చేస్తున్న కొడుకు ధ్యాసతోనే ఉండేది. “ఈ బడి పాడుగాను ఇన్నిగంటలు చెప్పుతరేంది” అని విసుక్కునేది.
మల్లేషు కూడా తల్లికి అన్ని పన్లల్లో సాయం జేసేటోడు. తల్లి ఇల్లలుకుతే నీళ్ళు తెచ్చిపోసేటోడు. ముగ్గు పెట్టేటోడు. తల్లి వెనకాలే తిరుగుతూ వంట పనిలో సాయం చేసేటోడు. ఊర్లో నలుగురు నాలుగురకాలుగా అనుకునేటోళ్లు – “దీనికే కొడుకున్నట్టు ఎవ్వరికీ లేనట్టు జేస్తది”, “ఆడు ఆడంగోడు అయ్యేటట్టున్నడు. ఎప్పుడూ తల్లి కొంగు పట్టుకొని తిరుగుతడు”, “గా తల్లి పిలగాని లెక్క ఉండాలె” అని ఎవరికి తోచినట్టు వాళ్ళు వ్యాఖ్యానించేవాళ్లు. కొన్నిసార్లు నర్సయ్య కూడా విసుక్కునేవాడు. “ఏంది, పిలగాన్ని ఎటూగానియ్యకుంట జేస్తవా? ఇట్లయితే వాని సదువెట్ల సాగుతది. బల్లె ఉన్నాగూడ ఎప్పుడెప్పుడు ఇల్లు జేరాలె అని ఆత్రపడుతుండు” అని మెత్తగా భార్యను కోప్పడేవాడు.
ఎవరెన్నన్నా తల్లీ కొడుకుల ప్రేమ, ఆరాటం తగ్గేది కాదు. మల్లేషను చూసి మురిసిపోయేది లచ్చుమమ్మ. “మల్లేషు అన్నిట్ల ఫస్టమ్మా” అని సార్లు కొడుకును పొగిడితే పొంగిపోయేది. మల్లేషు ఎదుగుతున్నా కొద్దీ చిన్నప్పటంత ముద్దు చేయనప్పటికీ కొడుక్కి అన్నం పెట్టి కూచొని అడిగి అడిగీ వడ్డించేది, కొడుకు బట్టలు సర్దడం, కొడుకు పనులన్నిటిని శ్రద్దగా చేయడంలో తన ప్రేమను చూపేది. మల్లేషుకు వయసుతోపాటు ఊర్లో స్నేహితులు పెరగడం, దాంతోపాటు ఊరి విశేషాలు, రాజకీయాలు అర్ధమవుతుండేవి.
పదవ తరగతిలో స్కూలు ఫస్టు వచ్చినరోజు లచ్చుమమ్మ కొడుకును ఎక్కడికీ కదలనీయలేదు. దిష్టి తీసింది. బయటికి వెళీతే కొడుక్కు దిష్టి తగుల్తదని భయపడ్డది. తల్లి చాదస్తాలను నెమ్మదిగా అర్ధం చేయించడంతో పాటు ఊర్లోని విషయాలను తల్లితో చర్చిస్తుండేవాడు. పదవతరగతి తర్వత పక్క టౌన్లో ఇంటరు, డిగ్రీకి జిల్లా కేంద్రంలో చదవాల్సి వచ్చింది. ఆ తర్వాత పీజీకి దూరప్రాంతాలకు వెళ్ళడం, తల్లీ కొడుకుల మధ్య ఎడమూ పెరిగింది. తల్లీ కొడుకులు కలిసుండే రోజులు తగ్గిపోయాయి. దాంతో పాటే మల్లేషుకు రాజకీయాల్లో ప్రవేశమూ పెరిగింది. లచ్చుమమ్మ తల్లడిల్లి పోయేది. తన ప్రేమ కొడుకు భవిష్యత్తుకు ఆటంకం కారాదని బాధనంతా కడుపులోనే దాచుకునేది. కొడుకు వచ్చి ఉన్న ఒకటి, రెండు రోజుల్లో ఇన్నాళ్ల తన ప్రేమనంతా కురిపించేది.
ఊర్లోకి అన్నలు వస్తారని తెలిసినప్పటికీ ఎన్నడూ కలిసింది లేదు. పీజీలో చేరడంతో పాటు, రాజకీయాల ప్రవేశంతో కూడిన ప్రేమ పెరిగాయి. తల్లిప్రేమ ఎప్పుడు పక్కనే ఉన్నట్టే అనుభూతి చెందేవాడు మల్లేషు.
సెలవులకు ఊరికి వస్తె లచ్చుమమ్మ ఎంత సంబరపడేదో. తనకు కలిగినదాంట్లో కొడుక్కు ఇష్టమైనవి వండిపెట్టేది. ఎప్పుడు ఇంటికొచ్చినా కూలికిపోయే మల్లేషును వద్దని చెప్పేది. “చిన్నప్పుడంటే ఏదో. . . జాస్తివి. పెద్దసదువులు సదువుతున్నవు. నీకియ్యన్ని ఎందుకురా” అనేది. కానీ, ఎంత పెద్ద సదువులు సదువుతున్నా నా కొడుకు మారలేదని మనసుల సంతోషంగా ఉండేది లచ్చుమమ్మకు. కొడుకు దోపిడీ, అన్యాయల గురించి, మహిళల పరిస్థితి గురించి మాట్లాడుతుంటే “నా కడుపున బిడ్డకు ఇంత తెలివి యాన్నుంచి వచ్చింది” అనుకుంటూ కొడుకును మురిపెంగా చూస్తూ ఆశ్చర్యంతో వింటూ ఉండేది.
కొడుకు ఇంట్ల ఉండేది సాయంత్రాలే. కూలి పని నుంచి ఇంటికి రావడమే ఆలస్యం మల్లేషు కంటే చిన్నవాళ్ళు. సమవయస్కులు కొన్నిసార్లు పెద్దవాళ్లు కూడా కలిసేవాళ్లు. ఇంటి ముందర అరుగుల మీద, అవి చాలకపోతే మంచాలేసుకుని, వాటి మీద కూసుని గంటలు గంటలు మాట్లాడుకునేవాళ్లు. లచ్చుమమ్మ ఇంట్లకు బయటకు తిరుగుతా ఉండేది. “ఇంకా పోరేంది ఈ జనాలు” అని తిట్టూకునేది. తల్లి ఆరాటం తెలిసిన మల్లేషు తల్లి బయటకు రాగానే మాట్లాడుతూ, మాట్లాడేవారి మాటలు వింటూ తల్లివేపు చూసేటోడు. పట్టించుకోనట్టు తన ధోరణిలో తను ఉండకపోయేటోడు. లచ్చుమమ్మకు అదే తృప్తి – యాడున్నా కొడుక్కి తను గుర్తే అని.
కొడుకు మాటలు వింటూ “వీడు అన్నోళ్లు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతుండే” అనుకునేది. లచ్చుమమ్మ అన్నలకు అన్నాలు పంపుతుండేది. అప్పుడప్పుడు మీటింగులకూ పొయ్యి వచ్చింది. ఈ మధ్య అన్నలకంటే పోలీసులే ఊర్లల్లకు ఎక్కువొస్తున్నరు. ఇంకొద్ది కాలానికి “వీడు అన్నళ్ల కలవడుగద” అని భయపడింది. అన్నల మనిషిని ఎవరూ చెప్పకపోయినా మల్లేషు మాట్లాడే విషయాలను బట్టే జనాలకు ఎప్పుడో అర్ధమయింది. లచ్చుమమ్మకే ఆలస్యంగా అర్ధమయింది. డిగ్రీలో ఉండగా రాజకీయాలు వంటబడుతున్న సమయంలో తనకు తెలిసిన వాటినీ, ఊర్లోని విషయాలను కలిపి ఆలోచిస్తూ నల్గురితో చర్చిస్తుండేవాడు మల్లేషు. రాను రాను ప్రత్యక్షంగా రాజకీయాలు మాట్లాడకపోయినా పార్టీ తిరిగే ప్రాంతాల్లోని ప్రజలు పొల్లేదో రెల్లేదో ఇట్టే గ్రహిస్తారు. ఎవరూ మల్లేషును “నీకు అన్నలు తెలుసా” అని అడగలేదు. కానీ మల్లేషును అన్నల మనిషిగానే జమకట్టారు.
ఎమ్మెస్సీ చివరి యేడాది చదివేటప్పుడు నాలుగు నెలల వరకు ఇంటికి రాలేదు. ఓ రోజు సాయంత్రం ఇంటికి వచ్చి తెల్లారే పోతానన్నాడు మల్లేషు. “నా కొడూకు నాకు దూరమయిండు” అనుకుంది లచ్చుమమ్మ. కొడుక్కు అన్నం పెట్టి పక్కనే కూచుంది. ఏమీ మాట్లాడలేకపోయింది. మనసంతా ముసురుపట్టి ఉంది. మాట పెగిలితే కండ్లనీరు కట్టలు తెంచుకుంటది.
తల్లికి అర్ధమైందన్న విషయం మల్లేషుకూ అర్ధమైంది. తల్లిమీద ఎనలేని అభిమానం, అంతులేని ప్రేమా పొంగాయి. తను మాట్లాడినా, మాట్లాడించినా తల్లి ఏడుస్తదనీ తెలుసు. తన గురించి అర్ధమైనా బయటపడకుండా తల్లి నిగ్రహించుకుంటున్న తీరు చూసి మల్లేషుకు తల్లి మీద ఎనలేని గౌరవం, ప్రేమ ఉప్పోంగాయి. “అమ్మ నువ్వు కూడా అన్నం పెట్టుకోవే” అన్నాడు మల్లేషు.
మారు మాట్లాడకుండా అన్నం పెట్టుకుంది లచ్చుమమ్మ. తల్లి వద్దంటున్నా మారు అన్నం, కూర వడ్డించాడు. లచ్చుమమ్మ కొంగుతోటిముక్కు తుడుచుకుంటూ అన్నం తిన్నది – తలవంచుకుని.
ముగ్గురు మంచాలేసుకుని ఆరుబయట పండుకున్నరు. కష్టం చేయడం తప్ప ఏమీ తెలియని నర్సయ్య గుర్రు పెట్టి నిర్రందిగా నిద్రపోతున్నాడు. భార్య వ్యవహారశైలి, ఇంట్లోవాళ్లతో కలిసుండే తీరు, ఇంటిని నడిపే తీరు పెండ్లైన కొత్తలోనే చూసిన నర్సయ్య గుండెలమీద చెయ్యివేసుకుని నిద్రపోవచ్చు అనుకున్నాడు. ఆ నమ్మకంతోనే నిర్రందిగా ఉంటాడు. లచ్చుమమ్మకు నిద్రపట్టలేదు. మల్లేషమూ నిద్రపోలేదు. ఇదే చివరి సారి అవుతుందే అమ్మను చూడ్డం అనుకున్నాడు. తల్లిని చూస్తే మనసు అర్ధమవుతుంది. రాజకీయాలు అంతకంటే బలంగా ప్రేరేపిస్తున్నాయి.
కొడుకు నిద్యపోలేదని లచ్చుమమ్మకు తెలుసు. చివరికి లచ్చుమమ్మే “కొడ్కా మల్లేషు” అని పిలిచింది.
“ఏందమ్మా”
“నిద్రపడ్తలేదారా”
“దోమలు లెస్తున్నయె”
కొడుకు మాట మారుస్తున్నాడని అర్ధమై “నాయనా మల్లేషు, నీ మీద పాణాలన్ని పెట్టుకుని పెంచుకున్నరా’ అంది లేచి మంచంల కూసుంటూ.
“ఇప్పుడేమైందే”
“ఇంతకు ముందు పది, పదిహేను రోజులకోపాలి వచ్చేటోడివి. తరువత నెలకోసారి రావడం మొదలుపెట్టినవ్. అట్లట్ల ఇప్పుడు నాల్గు నెల్లకు వచ్చినవ్. వచ్చి తెల్లారే పోతంటున్నవ్”
“పనుండి రాలేదమ్మ”
“కొడ్కా, నువ్వు చేస్తున్న పనులేందో, యేడికో అడికి అర్ధమయితున్నయిరా. అన్నలు మంచోల్లు. అది జనమందరికీ తెలుసు. కానీ, నాకు నువ్వొక్కడివేరా మల్లేషు. నువ్వు లేకపోతే నేను పాణాలతో వుండలేన్రా” లచ్చుమమ్మ ఇంక మాట్లాడలేక పోయింది. కన్నీళ్లు ధారకట్టాయి. ఆ చీకట్ల కొంగు నోట్ల కుక్కుకుంది ఏడుపు వినిపించకుండ.
మల్లేషు లేచి తల్లి మంచం మీద కూసుని తల్లిని పట్టుకున్నడు.
“అమ్మా, నీ కడుపున పుట్టడం నేను చేసుకున్న భాగ్యమే. నేను యాడున్నా నీ ప్రేమ నన్ను కాపాడుతది. వీలైనప్పుడలా వచ్చి కలిసిపోత. ఉత్తరాలు రాస్తా” అన్నాడు. ప్రత్యేకంగా పార్టీ గురించి తల్లికి చెప్పాల్సిన అవసరం లేదనీ మల్లేషుకూ తెలుసు. తల్లికి చెప్పకుండానే పోదామనుకున్నాడు. చెప్పకుండా పోతెనే తల్లి ఎక్కువగా బాధ పడ్తదని ఆలోచించాడు. ఇక్కడికి వచ్చాకనే తెలిసింది – తను వెళ్ళిపోతున్న విషయం తల్లి పసిగట్టిందని.
“నా కొడుక్కు ఊరంతటి కంటె ఎక్కువ తెలివుందని మురిసినరా. కని, నాకు దూరమయితవని అనుకోలేదురా మల్లేషు. మల్లొక్కసారి ఆలోచించుకో బిడ్డ. ” వెక్కిళ్లను ఆపుకుంటూ లచ్చుమమ్మ అంది.
“అమ్మా, సంక్రాంతి పండుగకు వస్తలేవే”
కొడుకు నిర్ణయం మారదనుకుంది లచ్చుమమ్మ. ఏం మాట్లాడలే. తల్లిని పడుకోబెట్టి దుప్పటి కప్పి పడుకున్నడు మల్లేషు. తెల్లారగట్ట ఎప్పటికో నిద్రపట్టింది తల్లీ, కొడుకులకు.
సద్దన్నం ఉంటే తిని, పోతనని తయారైండు మల్లేషు.
తల్లి రెండు చేతులు పట్టుకుని “తప్పకుండ వస్తమ్మ” అన్నడు మల్లేషు.
“అదేందిరా అప్పుడే తయారైనవ్. మాంసం తెచ్చిన. తిని పోదువు ఆగు” అప్పుడే మాంసం పట్టూకొని వచ్చిన నర్సయ్య అన్నడు.
ఇంకాసేపన్న కండ్లముందు ఉంటడనుకుని ఆగుతడేమో అని ఆశగా చూసింది కొడుకువేపు లచ్చుమమ్మ.
“లేదు నాయిన పోవాల్నె. పనుంది. ఈ బస్సుపోతే మల్ల మధ్యాహ్నం దాకా ఆగాలె”
“మీవి ఏం పనులోరా. . ఉద్యోగం చేసేటొడిలెక్క మాట్లాడతవ్. అంతగనం పనులేమున్నయిరా” కోప్పడ్డడు నర్సయ్య.
తండ్రి దగ్గరికి వచ్చి చెయ్యిపట్టుకుని “లేదే నాయిన, నిజంగానే పనుంది. మిమ్మల్ని జూసి చానా రోజులాయె అనివచ్చిన. పండక్కు వస్తగద. అప్పుడుంటలే రెండు రోజులు” మల్ల మాట్లాడేందుకు సందివ్వకుండా “పొయ్యస్త” అని చెప్పి బయటపడ్డడు.
కన్నపేగు గుంజుకపోతున్నట్టు బాధతో కొడుకు కనిపించకుండా పొయ్యేంతవరకు చూస్తూ కండ్లొత్తుకుంట బజార్లనే నిలబడ్డది లచ్చుమమ్మ.
ఏమీ తెలియని నర్సయ్య “ఏందే అట్లేడుస్తున్నవ్. పట్నంల పెద్ద సదువులు సదువుతున్నప్పుడు ఎడబాయకుంట ఉంటారా? బల్లె ఏసిన్నాటి నుంచి ఇప్పటిదాంక ఏడుస్తనే ఉంటివి” చిరాకుపడ్డాడు భార్యమీద నర్సయ్య.
లచ్చుమమ్మ యేమీ ఇన్పించుకున్నట్టు లేదు. వస్తున్న వెక్కిళ్లను ఆపుకుంట బాటై చూస్తూ అట్లనే నిలబడ్డది.
భూమిలో దిగబడిపోయినట్టు నిలబడ్డ లచ్చుమమ్మను చూస్తూ “ఏడ్చిన కాడికి సాల్లే కూర వొండుదురా. పొద్దుపోతుంది” అన్నడు. ‘ఏందో ఈతీర్ల ఎన్నడూ ఏడవలే’ అనుకున్నాడు మన్సులో.
కూలికి పోయినా, నాలికి పోయినా, యాడ ఎవరు కన్పించినా కొడుకు ముచ్చటే లచ్చుమమ్మకు. కొడుకు ధ్యాసే లచ్చుమమ్మకు. ఎప్పుడు కొడుకు గురించి చెప్తూ కొడుకు తన పక్కనే ఉన్నట్టు తనను తను ఓదార్చుకుంటున్నట్టుగా ఉండేది లచ్చుమమ్మ. కొన్నాళ్ళకు తను ఇంట్ల లేనప్పుడు కొడుకు వచ్చి పోతడేమో అని ఇల్లు కదలడమే బందు పెట్టుకుంది.
“రేపు సంక్రాంతి పండుగ్గాదే. రేపొస్తడేమోలే” అని మళ్లీ చెయ్యి పట్టి లేపాడు నర్సయ్య.
“మర్చేపోయినయ్యా, అవునుగద’ అని లేచి గబ గబ ఇంట్లకు పొయ్యింది.
నర్సయ్య అన్నం తినమన్నా తినలేదు. ఇల్లంత దులుపుకుంట జేరింది. కొత్త బట్టలు కొని కొడుక్కు కుట్టియ్యమని చెప్పింది నర్సయ్యకు వాడికి అరిసెలంటె ఇష్టమని బియ్యం నానబోసింది. ఇల్లంతా అలికింది. గోడల వెంట ముగ్గులు పెట్టింది. నర్సయ్య కూలికి పొయ్యి వచ్చేసరికి అరిసెల పిండి దంచుకుంట జేరింది. ఒకప్పుడూ అరిసెల పిండి ఐదుకిలోలయినా ఏకధాటికి దంచేది. ఇప్పుడు షేరు బియ్యాన్ని దంచేసరికి దిగచెమటలు పోసినాయి. మనిషి బాగా పీక్కుపోయింది. తిండి కూడా నర్సయ్య తినిపిస్తే ఎప్పుడోగానీ తినదు.
నర్సయ్యను చూసి “పిలగానికి బట్టలు తెస్తివా. మేరాయనకు ఇచ్చి రాపొ. పండుగకు మస్తు గిరాకీ వుంటది. పిలగాడు వచ్చేసరికి కుట్టిస్తడో లేదో” అని మళ్ళీ తనే “మనొడికి కుడ్తడులే. వాడంటే మేరాయనక్కూడ ఇష్టం” అని నర్సయ్యను తరిమింది.
నర్సయ్య ప్రతి సంక్రాంతికి కొడుక్కు బట్టలు తెచ్చి కుట్టిస్తడు. లేకపోతే లచ్చుమమ్మ ఊరుకోదు.
వంగిన నడూముతో ఈడ్చుకుంట వచ్చిన నర్సయ్యను చూసి “ఏందే చిన్నాయన, మల్లేషుకు బట్టలు తెచ్చినవా” మేరె సత్తెయ్య పలకరిస్తూ కూచోమన్నట్టుగు కుర్చీ చూపించిండు.
“అవునయ్యా” అంటూ బట్టల సంచీని సత్తెయ్య చేతికిచ్చి, కుర్చీల కూలబడ్డడు నర్సయ్య.
“చిన్నాయన, రోజు రోజుకు కుంగిపోతున్నవేమే” బాధగా అన్నడు సత్తెయ్య.
“ఏం జేసేదుంది సత్తయ్య”
“చిన్నమ్మ బాగున్నాదే”
“చిన్నమ్మ బాగు సంగతి మీకు తెల్వనిదా సత్తెయ్య. దాని లోకం దానిది. ”
సత్తెయ్య బాధతో ఏం మాట్లాడకపోయిండు.
“మల్లేషు రాడని తెలుసుగదనె. ఎందుకు ప్రతి యేడు కుట్టించి, ఎవరికో ఒకరికి పంచడం. ఇప్పుడు నీ ఒక్కని కష్టం తోటి నడవాల్నాయె. చిన్నమ్మ ఆరోగ్యమేమో అట్లుండే. ”
“అది ఈ ఒక్క పండగ రోజన్నా తృప్తిగ ఉంటదయ్య. బట్టలను చూసి వాడొచ్చినట్టే సంబరపడ్తది. పైసల్దేముంది. ఇంక నేను కూడబెట్టి ఎవ్వనికి ఇవ్వాలె. నాకు పిల్లా జెల్లా.” అని కండ్లల్ల నీరు తీసుకుండు నర్సయ్య.
ఇద్దరూ మౌనంగా కూచుండిపోయారు. కాసేపుండి “జర రేపటికల్లా కుట్టియ్యి సత్తెయ్య. లేకపోతేమీ చిన్నమ్మ ఊకోదు. ముందే కొందామంటే పన్ల తోటి తీరిక దొరకదాయె” అని పోవడానికి లేచి నిలబడ్డడు నర్సయ్య.
“నువ్వు చెప్పల్నానే. నాకు తెల్వదా. రాత్రికి కుట్టి పెడ్త. పొద్దున్నే పిల్లలతోటి పంపిస్త.” అంటూ సత్తెయ్య మిషను మీంచి లేచి నర్సయ్యను సాగనంపిండు.
అరిసెలు చేసి మల్లొచ్చి ఇంటి ముందల అరుగు మీద కూసుని, దారెంట కన్పించినోల్ల నందరినీ పిలిచి “నా కొడుకు రేపొస్తడు” అని చెప్పబట్టింది.
“నీకేం లచ్చుమమ్మ, బంగారమసొంటి కొడుకును గన్నవ్, తప్పకుండ పండుగకు వస్తడులేమ్మా” అని బాధపడుకుంటనే ఏదో ఒకటి లచ్చుమమ్మను ఓదార్చే మాటలు, పొగిడే మాటలు అనుకుంట బోతున్నరు జనాలు. లచ్చుమమ్మ పొంగిపోయి మురుసుకుంట కూసుంది.
ఇంతల్ల బజార్న పోతున్న మల్లయ్యను పిలిచి “ఓరి మల్ల, నా కొడుకు పండక్కు వస్తుండురా. వానికి కొత్తబట్టలు కుట్టిస్తున్న. అరిసెలు జేసిన వానికిష్టమని” అంది.
“మళ్లీ పూటుగ తాగినవా” అని పెండ్లాం లొల్లి పెట్టుకుంటే, పెండ్లాన్ని నాల్గు దన్ని “తాగిన మైకం దిగిపాయె, తాగిన ఫాయిదా లేకుండ చేసే లంజముండ” అని తిట్టుకుంట దారెంట పోతున్న మల్లయ్య లచ్చుమమ్మ మాటలతో మరింత చిరాకుపడి “సల్లేమ్మా, కొడుకు సచ్చి నాలుగేండ్లు అయితుందిగాని ఇంకా కొడుకొస్తుండు. . . నా కొడుకొస్తుండు అని దారెంట బోయేటోల్ల పాణందింటవ్. ఇనీ ఇనీ ఇసుకొస్తుంది” అన్నడు.
“ఏందిరా బాడుకవ్, నాకొడుకు సచ్చిండంటవురా. . నీ నోట్ల మన్నువడ. నా అసుమొంటి కొడుకు నీకు లేడురా. . . నా కొడుకును చూస్తే కండ్లల్ల నిప్పులు పోసుకుంటరు. బాడుకవ్ నా కొడుకు గురించి ఏవంటివిర. . . ? మల్లను” అంటూ వెనకాలనుంచి షర్టు గల్ల బట్టుకుని కుదేసి కూచోబెట్టి గుద్దుతుంది లచ్చుమమ్మ నర్సయ ఇంటికొచ్చేసరికి.
చుట్టూ జనం మూగి విడిపిస్తున్నా విడవట్లేదు. మల్లయ్యను లేవనిస్తలేదు. “ఈ పిచ్చిముండకు ఏం బలం వుంది. యిడిపించండె” అని అరుస్తూ లేవడానికి ప్రయత్నిస్తూనే అందినకాడికి లచ్చుమమ్మను కొడుతుండు మల్లయ్య.
నర్సయ్య వచ్చి “వాడొచ్చి తాగుబోతోడు. వాడనంగానే మల్లేషు మనల్ని వదిలి యెల్లిపోతడే. ఇడువు, ఇడువు” అని విడిపించిండు. “కడసారి సూపన్న సూసుకుందును. శవాన్నయినా ఇయ్యకపాయిరి ముండాకొడుకులు”
“లచ్చుమమ్మను చూస్తే గుండె చెరువైతది. పాణాలన్ని ఆని మీద పెట్టుకొని బతికె”
“ఈ బజార్న రావాల్నంటె కన్నపేగు మెలిపడ్డట్టయితది. ”
తలా వో మాట అనుకుంట కండ్లొతుకుంట ఎవరిదారినవాళ్లు పోయారు.
“నా కొడుకు చీమకన్న హాని జేసేటోడు కాడు
నాకొడుకు దయగల్లోడు
నా కొడుకు నల్గురి బాగును కోరుకునేటోడు
ఎవరిక్కష్ట మొచ్చినా తనకొచ్చిందనుకుంటడు
నా కొడుకును ఎందుకు సంపుతరు
నా కొడుకు ఎవలకేం పాపం జేసిండని
సూర్యుని మొఖాన మన్ను బోస్తే
ఆళ్ల మొఖానే పడ్తది
వానసుమొంటి పిల్లల్లేరా
ఆని నోట్ల అగ్గిబుట్ట” భర్త నర్సయ్య మాటలతో మల్లయ్యని వదిలిపెట్టినప్పటికీ తన కొడుకును అంత మాట అంటడా అని సాపిస్తానే వుంది లచ్చుమమ్మ కోపంతో ఊగిపోతో ఏడుస్తూ. . .
లచ్చుమమ్మ సాపెన ఎవరి మీదో. . .
- (తన కొడుకును పోగొట్టుకొని పిచ్చిదయిన కొరియర్ మల్లేషు తల్లికి, తమ పిల్లలను కోల్పోయినన తల్లిదండ్రులకీ)
kcubev Jun 1, 2009 1
ఈ కథ చదివి ఎందరో తల్లులకు కడుపుకోత పెట్టిన వాడిని మరల కసిదీరా తిట్టుకున్న.
gorusu jagadeeshwar reddy Jun 12, 2009 2
కరుణ కథ కన్నీరు తెప్పించింది. కరుణే లచ్చుమమ్మ అయింది. లేకపోతే ఇంత బలంగా రాయడం కష్టం. గాయపడ్డ ఓ కన్నపేగు ఆక్రందనకు కరుణ ఇచ్చిన అక్షర రూపం గుండెను కదిలించింది.
- గొరుసు
geethanjali Jul 14, 2009 3
కరుణ అమ్మ కథ చదివిన తరువాత బాధ కలిగింది.అన్నలు విప్లవోద్యమంలో అమరులైన తర్వాత, అమ్మలని పట్టించుకొనేదెవరు? కొడుకులు బతికే వున్నారని ఎదురుచూస్తూ, చనిపోయారన్న నిజాన్ని నమ్మలేక బతికే వున్నారన్న భ్రాంతిలో, నిరీక్షనలో చనిపోయేదాక బతికే అమ్మలు ఎందరో.. తెలంగాణలో విప్లవోద్యమ సాహిత్యాన్ని రాజయ్య తరవాత తన సుదీర్ఘ వుద్యమ జీవితానుభవాల నించి ప్రతిభావంతంగా రాస్తున్న తొలి రచయిత్రి కరుణ. అమరుల బంధుమిత్రుల జీవితాలలోని సంక్షోభాన్ని మరిన్ని కథల్లోకి కరుణ తీసుకవస్తుందని నమ్ముతూ అభినందనలతో.. గీతాంజలి
Sampath Kumar Aug 1, 2009 4
ఆ బజారును మా కండ్ల ముందరికి దెచ్చింది తాయమ్మ కరున. ఆ బజార్ల కెల్లి వోతుంటె “కన్న పేగు మెలివడ్డట్టయితది” అని ఒక తల్లి అన్నట్టు ఈ కత సదివితె నాకు “పేగు మెలివడ్డట్టయింది”. కదుపులకెల్లి దుక్కం తన్నుకచ్చింది. మొగోన్ని గదా! కన్న పేగు ఉండె భాగ్యం లేక పొయ్ నా కడుపుల పేగులున్న య్ గదా! గవ్వె మెలి వడ్డయ్. ఇగ కన్న్ పేగుల సంగతడుగాన్నా…….
నేను జెరంత ఎన్క ముందాడుకుంటనే ఇన్కొక బాధ గూడ వంచు కోవాలనుకుంటున్న. గదేందంటె, గీ మన మల్లేషు ఓ అంబేద్కరుడు గాలేకపోవునా……. గంతకు ఎద్గకపొయ్ నా గాఊరోల్లమందమన్నఓ అంబేద్కరుగ అక్కరకచ్చెటోడేమో. తోడుండి సాయపడెటోడేమో.. తక్వల తక్వ గా లచ్చుమమ్మ కన్న సాయముండెటోడేమో……
ఆన్ని కన్న పేగులూ సమానమే… కాదనేది లేదు. కని గీ కన్నతల్లి పేగెందుకొ నాకు ఎక్కువ సమానమనిపిస్తంది…. గిస్వంటి కన్న తల్లులకన్న కడుపుకోత లేకుండ ఉండెటట్టు మనిషన్నోడు యెన్కముందాడాల్నేమొ……
యెవడింటడు………. గది గట్ల్ వోని గని……
నా పేగులు గదిలిచ్చిన కరునమ్మ కు నా దండాలు. నా సుట్టూత జరుగు తున్న అన్యాయాలను సూసుడు నుంచి మంచిగ తప్పిచ్చుక తిరుగుడుకు అల్వాటు వడ్డ నన్ను దొర్కవట్టి యేడ్పిచ్చి నా గీ పూట కు జెరంత సార్థకం ఇప్పిచ్చి గట్ల త్రుప్తినిచ్చింది గీ కత.
గందుకె దండాలు… ఇగ, గిస్వంటి కతోటుందని జెప్పిన యస్ మాన్ కు, పబ్లిస్ చేసిన ప్రానహితకు, ప్రానహితల ఈతగొట్టుకుంట ఈడ్సుకస్తున్న (సివరికి యేమి ఈడ్సుకస్తడొ సూడాలె) సామికి … గూడ….
రవికిరణ్ తిమ్మిరెడ్డి Aug 3, 2009 5
లచ్చుమమ్మ, కరుణమ్మ, మాయమ్మలందరికి పాద పాదాన పరిపరి దండాలు.
suman Aug 7, 2009 6
అమ్మ కత, కత కాదు. అది ఒక కన్న తల్లి కడుపు కోత. నిజంగా ఈ కత సదువుతున్న కొద్ది గాపల్లె, గా లచ్చుమమ్మ, గా మల్లేషు, గా జనం మన కళ్ల ముందర కదలాడిండ్రు. లచ్చుమమ్మ ను సూస్తె, గీ పల్లెల్లో ఎంత మంది తల్లులు గా బాధననుభవిస్తుండ్రో అనిపిస్తుంది. ఆ బజార్న పోవాల్నంటే కన్న పేగమెలి పడ్డట్టయితది అన్నది ఒక అమ్మ. గట్లాగే తన అభిప్రాయం తెలుపుతూ సంపతన్న అనే పాఠకుడు మగాడ్నైన నాకు కన్న పేగు లేకున్న, కడుపుల పేగులు మెలి పడ్డట్టయినయి అన్నడు. కాని నాకు మాత్రం పేగులు ‘మెలి’ పడ్డట్టు కాదు ‘మెలికలు’ పడ్డట్టయినది. మల్లేషు తన తల్లి లచ్చుమమ్మ కు కడుపు కోత పెట్టిండొచ్చు. గట్లాగనె కొంత మంది గుండెల్లో గూడు కట్టుకొనియుండొచ్చు గదా
Sampath Kumar Aug 8, 2009 7
సుమన్ భాయ్ ……
“మల్లేషు తన తల్లి లచ్చుమమ్మ కు కడుపు కోత పెట్టిండొచ్చు. గట్లాగనె కొంత మంది గుండెల్లో గూడు కట్టుకొనియుండొచ్చు గదా”……… అని మీరంటాండ్రు గని,
దార్శనికునిగ కంటె “గుండెల్ల గూడు గట్టు కొని” ఉండుటాన్కి గా ఎక్కువ సమానులయిన తల్లులు కడుపు కోత భరించుడు,
గసువంటి కుటుంబాల్లల్ల, వంశాల్లల్ల తొడ్గక తొడ్గక తొడ్గిన ఓ మొగ్గ గట్ల నల్గి పోవుడు, “గుండెల్ల గూడు గట్టుకొని” ఎవల్లో ఉండాలనె అవసరం కోసం సచ్చుడు
నాయెం గాదేమొ సార్!
జెరంత సోంచాయిచుండ్రి. మీ మాటలు నా పేగుల్ని ఇంకా మెలి వెట్టినయ్. మెలి వెడ్తున్నయ్.
పేగులు రగిలి పోతయ్ గూడ సార్!!
గట్ల తీర్మానం జెయ్యకుండ్రి సార్ !! మీ కాల్మొక్త……
ఎన్ని? ఎన్ని?? యెన్ననున్నై సార్ గిస్వంటి గూల్లు గా/గీ గుండెల్ల.. బగ్గయినై .. బగ్గంటె బగ్గయినై సార్ !! యాదికచ్చి గుండెలు పగులుతున్నట్టైతాంది సార్ !! ఒక్కడంటె, ఒక్కడు గూడ దార్శనికునిగ రాలేక పాయె గద సార్ !!
గుండెల్ల గూల్లైనోల్లు ఇగ జాలు సార్! గా అంబేద్కరునోలె దారి జూపె దార్శనికులు గావాలె సార్ !!
మీ మాటల్ నాకు నచ్చ లేదు సార్ !! గిది, గిస్వంటి మాటలినుడు మొదటి సారేం గాదు సార్ !! మీరే మొట్ట మొదటోల్లు గూడ గాదు సార్ !! ఆల్లను మొకం మీదనె దిట్టిన సార్ !
ఆఁ … ఊం … అన వోతె గూడ నోరిప్పనియ్యలె! నోర్మూపిచ్చన సార్ !!
నా గొప్పతనమేం లేద్సార్ !! ఇసయం అస్వంటిది……
dropped_dead Aug 16, 2009 8
I could not type in telugu sorry for that.
I started of reading this with a generic reading like I do with other mails or stuff on the internet and initially the language used I could not get it and I was running line after line just for the heck of reading it, I am not sure at what point of the story I was involved but when I completed the story my mind was dumb and filled with the feel of the Lachumamma. I would really like to follow this writer and when I read this for second time I realised that not even one word in the whole story is extra or not related to the content or existing with out reason. Every word and sentence need to exist and has its own importance. the twist at the end that the Malleshu is no more would have got in to every ones mind at the initial stages of the story but when it is revealed I was not ready to take taht he is no more as the leading character Lachumamma. The interesting thing is the writer never missed the dialects of telangana in any expression may be that could be one reason that I could not come to my mormal senses and I felt like I am Lachumamma and I miss my son, that strong the feeling was.. I am not sure about the details of the writer but I would like to really see some of writers earlier work and will wait for the upcoming work. This story has soul. The writer has a very grace way of penning down the expressions and drive the reader’s emotions to the way he/she wants to drive. Really happy to share my thoughts along with the following take of mine on the on going discussion.
As few readers had a discussion about whether the key role Malleshu has done rite or wrong, it always depends many factors of an individual like personal experiences, intelligence, intellectuality, etc. So my take on this is, from the day an animal called human started of with a dependency on other human on the way of evolution, so called society has formed and like in every other hurd, human race also had some differences with in the individuals existed in the same hurd and individual interests which makes that person diferent from the rest of the society. I am a strong supporter of Democracy which existed from so long with so many human individuals where the dependency of each indivual on another individual with clkear said rites and duties of teh both the parties involved in the process of dependency. But I am more strong supporter as a person to give the rite and the good of the democracy was supposed to give it to the poor. I am very devasted thinking about the very fact that the rules and regulations society has formed or some intellectuals formed for the society are looks like only for poor guys. The one with the money or the other means of money can get away with any kind of law breaking. when this extremes are touched obviously some body from the society will raise their voice and start working for providing the justice that not given the one it was supposed to.
I think till this point any human feels the same. But to get the justice or do the justification to the needy which way are we supposed to take that is a big question are we going to fight with ‘them’ and who are these people that called as them. They are a very part of the society and each one of us. Just targetting a single individual or killing a single individual of system does not make any difference, on a personal level i think no. First thing an individual have to realise that the functionality of the system is wrong and if we say take this as as disease. By not treating the disease and just treating the symptoms of the desease does not do any difference except the dependents of the individuals of either side pain and emotional losses.
I am with Sampath kumar that the emotional and physical loss of an individual how it effects the dependends of that particular individual but, I strongly support Suman, if I think about my personal loss or my dependents loss who will do that for me, some individual from the society should raise to fight against the disease of the society, if that is taken for granted taht some bosy should fight, why it should not be me and as an individual if I do not fight, who will fight for me against the unjustification.
Now the big question is what should be my approach to fight against it, is it naxalism? I think, NO. Only because as I understood treating the symptoms of a disease does not make any difference keeping in the view of enormous size of teh disease and I feel with so called naxalism we do not fight to the disease or the system we fight against the individuals like us in the system.And I take good and bad are individual to the indivual.
I am NOT open for discussions, but every one has every rite to express their feelings …..
Sampath Kumar Aug 17, 2009 9
The comment of ‘dropped_dead’ left an assuasive feeling to me that, yeah (!), there is one more soul in the crowd around us passoinate, passoinate first and intellectual next, towards the human element…..
After reading the comment and specially because of the mention of my name in the context of my earlier comment(s) in it I felt to give a translated version of my earlier comments. But, I am afraid that I am not capable of giving the exact translation of my comments. The reason: I fell back to the position of a fellow in the rural crowd except with a difference of viewing at things with a little component of review, while I was keying-in the first comment. Again, at the time of my second comment, I fell back to the position of a fellow in the crowd, of course, rural but intellectually agonised than upset. Both these back drops handicap me for any translation.
I request my fellows in this crowd of pranahita readers to do it for me. If any one can do it for me please……….
However, I react in English too. But at present my moods are in an insipid state.
Also, I want, defiinitely, to say, in spite of my present limitations due to the above stated state of mine, a few words, particularly for the consumption of our ‘dropped_dead’.
My two comments leave no kind of scope to undermine the need to be cautious not only in emotions but also in thinking in the domains of social responsibility. Rather it is the other way round. I insisted not only emotionally but also out of an enormous thought to be more socially responsible by getting rid of the socially irresponsible ways of thinking and doing things in the forums or braces of socilly responsible domains. Lest SOCIAL RESPONSIBILITY will be rendered to a category of word within quotes or so called terminology….. A few have already done that. In the circles concerned with social responsibility a few eulogisers too are sailing. At times they are posing themselves as intellectual champions.
I only wanted Malleshu, alive and/or dead, to be a torch bearer than just an emotional memory. In these circles there is a lot of deification of the idea of keeping people or of being by one self in the emotional memories of people. Thus, as a result of this, the potential torch bearers are pushed to the category of creatures to be in emotional memories. Emotional memories take a back ground position. What to speak of emotional memories, even the path breaking intellectual memories too take a back ground position. But, the former are momentary, short lived and in most of the cases direction less. Whereas the latter are stretched for a longer period. They have implications for future. More than being just memories, the latter, set a direction. And, above all, if these potential torch bearers do not assume, or are not motivated to take up that role and get immersed in the task of being just in the emotional memories of people, the torch is never coming. In the name of torch it is only eulagisation.
It is high time that the potential torch bearers are warranted of this need. How miserable is the idea of being in the emotional memories of people is to be explained to them. The fact that even their family members, leave alone the rest of their community members, – parents, wife, kids, – are totally forgotten by these advocates of emotional memories even while they live in abudance, even with luxurious expenditure, and the former are living in misery – an added misery and want due to the death of a supporting member.
It seems it – my thinking in English – started. However, it can’t continue now. I am into my escape track as per the schedules of my escapist life. It is already 10. 30 a.m. I don’t know when I would get back to these pages.
I am also disturbed with the story of Gurajada’s UDAATTTHATHAHAHA…..
Of course, the writer doesn’t show an unfairness of a shrewd euligiser. More over I am happy that he tried, indirectly, to emphasize on the crucial aspect of VARNA BASED CASTE SYSTEM, and mind you all, not just a caste system without this qualification or just in abstract.
The only point of disturbance to me is that there is an unnecessary excercise of highlighting Gurajada as a thinker even on the issue of caste system. There are much more great thinkers even before Gurajada on this. There are much more great writers too before.
It is an unnecessary excercise to establish Gurajada in the forefront of this issue. It is much better to realise at least now that one can’t expect from him that status. His later upholders are making him absurd. Of course, the writer of this essay did not go to that extreme. But there is no effort or trace of doing anything against this trend of making GURAJADA an absurdity.
That’s the reason an impetuous comment – at present the sole comment – below this essay dares to prescribe Krupakar Madiga and thus other Madigas and Malas who are working out as per their respective mights on re constructing the past history.
Surprisingly there is no mention of the great poet Gurram Jashuva – the rebell poet on untouchability from untouchable communities – in this essay, though he belongs to the period immediately succeeding that of Gurajada. At least a modest comment that states “what Gurajada could not clinch in poetry was clinched by Jashuva” would have been a bit better.
Anyway I just clip out a few lines here for my elaborate reactions on these……..
“అనాదిగా మన దేశంలో జ్ఞానాన్ని గుప్పిట్లో పెట్టుకుని ఆధిపత్యం చెలాయించిన శ్రామిక జనాన్ని నియంత్రిస్తూ వచ్చిన సామాజిక వర్గ వారసులే వలస పాలనలో సంఘసంస్కరణకు పూనుకోవలసి వచ్చింది. వాళ్లకు మధ్యయుగాలలో శ్రామిక, శ్రామికేతర వర్గాలలోంచి వచ్చి లౌకికతత్వభావాలను ప్రచారం చేసిన వాళ్లు ఆధారమయ్యారు.”
“అస్పృశ్యతను గురజాడ పూర్తిగా తిరస్కరించి దళిత జీవితాన్ని ఉదాత్తీకరించి, కులాంతర వివాహాన్ని ప్రతిపాదించి లౌకిక సమాజ నిర్మాణాన్ని లక్ష్యంగా ప్రకటించాడు.”
“డా.బి.ఆర్.అంబేద్కర్ 1936 లో కులనిర్మూలన ప్రసంగపత్రం రాశారు. భారతదేశంలో మొదట సాంఘిక విప్లవం రావాలని, అది రానిదే ఆర్ధిక రాజకీయ విప్లవాలు రావని, వచ్చినా అవి వక్రంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. సాంఘిక విప్లవమంటే కుల నిర్మూలన, అది జరిగితే గాని భారతీయుల మధ్య సోదరభావం అభివృద్ధి చెందదు. కుల నిర్మూలనకు వనభోజనాలు మార్గం కాదు. కులాంతర వివాహమొక్కటే మార్గం, ఇది ఆ ప్రసంగ పత్ర సారాంశం. గురజాడ 1910 లో సూచన ప్రాయంగా ఈ ఆశయాలను ఆవిష్కరించారు.”
“ఉన్నదంతా తినేశారు. ఉన్న పశువుల్ని తినేశారు. చెల్లాచెదురై పోయారు. ఉన్నకొంచెం పొలాన్ని రాజు, పిల్లలు పండిస్తున్నారు. తెల్లవారింది మొదలు వాళ్ల పాట్లేపాట్లు. అడవిలో కాయి పసురులు తినలేక పిల్లలు బలహీన పడీపోయారు. ఒకరోజు రాజు భార్య అతనిని పిలిచి నవ్వు ముఖంతో ఇలా చెప్పింది. ఇంకమనం చేసే పనిలేదు. ముందు జరగబోయేది చూడాలి. ఈ జన్మ ఇలా గడిచి పోయింది. రాబోయే జన్మ ను గురించి ఆలోచిద్దాం. ఆ జన్మలో జ్ఞాన సంపద కోసం శ్రమిద్దాం.”
All these issues are stirring in my mind and I am unable to process all of them to make a writing right now.