Jun2009
బతుకు పాట
- హరగోపాల్
మెతుకు మెతుకు మీద నీ పేరున్నదె రైతన్నా
ముద్ద ముద్దా నీ నెత్తురుముద్దలేనె కూలన్నా
ఏడ నిన్ను మరిచిపోదురా నా కన్నతండ్రీ
ఎట్ల నిన్ను విడిచివుందురా నా ప్రేమలతండ్రీ
దుక్కి దున్నిన సాళ్ళలోన మొక్క మొక్కా మొగ్గలందున
సక్కనీ నీసేతిసలవే బుక్కెడంతా బువ్వైతది
ఆకలార్చిన దూపబుడ్డిలొ తెల్లవారగ మొగులుసందెలొ
పొద్దు నువ్వై అగుపిస్తివి మా అయ్య నువ్వే అనిపిస్తివి
బుక్కెడన్ని నీళ్ళు తాగబోతే నువ్వే యాదికొస్తవు
షెంబు నీళ్ళలోన నీ షెమటసుక్కలె కనిపిస్తయి
కట్టబోతె బట్టలల్ల నీ పొట్టపేగులె పోగులాయె
కష్టమంతా మాకె కడితివీ మా బతుకు జెండా నువ్వేనైతినీ
ఒంటిగా నేనింటిలోపల గోడకొరిగి ఏడ్వబోతె
గోడలే నీ శేతులయ్యి గుండె నిమిరీనట్లయితది
అక్షరాలె దిద్దబోంగా పలక బలపాల్ నువ్వెనైతివి
అమ్మసేతుల ఉయ్యాలైతివీ మా బతుకుబాధలు తీర్చిపోస్తివి
కాళ్ళ శెప్పులు చేసిన నా కన్నతండ్రికె మొక్కుకుంట
కూటికి, కాటికి కుండలిచ్చిన అయ్యకే నా దండమంటా
కర్రునాగాలిచ్చి నన్ను పొలముల దింపిన జేజల్లారా
కొసపానం ఉన్నదాకా బాసచేసి మీతోనెవుంటా
muralikrishna Jun 2, 2009 1
చాల రొజుల తరువాత సామాజిక స్ప్రుహ వున్న మంచి కవిత చదివాను