Jun2009
జీవాధారం
- డా|| పి. విజయలక్ష్మి
ఇడ్లీ తుంచుకుంటూ ఎదురుగావున్న గోడగడియారంకేసి చూసిన నాగభూషణం ఉలిక్కిపడి గబగబా నోట్లో కుక్కుకోసాగాడు. పదకొండు గంటలలోపు ఖచ్చితంగా తన దగ్గరకి రావాలన్నాడు లాయరు. కావలి నుంచి గూడురుకి ఎక్స్‌ప్రెస్‌లో ఒకటిన్నరగంట ప్రయాణం. అప్పుడే తొమ్మిదవుతోంది. పినాకిని పట్టుకుంటే ఒళ్ళు కదలకుండా సుఖంగా దిగుండేవాడే. ఏంటో అట్టట్నే గడిచిపోయింది. అసలు ఈ ప్రయాణమే మససుకెక్కటం లేదు. పోదామా వద్దా ఎంతకీ తెగని ఊగిసలాట. గూడురు వరకే అయితే అంత ఆలోచనేమిలేదు. రాంపూరుకు వెళ్ళాల్చొచ్చిన పరిస్థితే మనసుకు జీర్ణం కావటంలేదు.
ఇంకో రెండిడ్లీలు వేద్దామని తెచ్చిన కమల అతను చేతులు కడుక్కోవడం చూసి. . ” మద్దేన్నం ఏయాళకో తిండితినేది. కడుపునిండా తింటే కదలకుండావుంటది గదా! ఎందుకప్పుడే చేతులు కడుక్కొన్నావు,” భర్తని కసురుకొన్నది.
“ ఆ. . నీ చీడ తీరిగ్గా తింటాకూర్చొంటే ఆయనాడ చూచ్చూసి హైదరాబాద్ రైలెక్కేస్తాడు”. అని గబగబా ఒక జత బట్టలు బ్యాగులో పెట్టుకొన్నాడు.
“ పొద్దటినుంచి తారాడి. . తారాడి ఇయ్యరజేసుకొంటివి. ఊరికిబోవాలని తెలుసుగదా! ఏందో కొంపమునగతున్నట్లు ఇప్పుడే ఎదురింటాయన్తో యవ్వారాలా,బాగానే తోడయ్యారు. యాపారాలు ఎత్తడాలు చేసి. . . చేసి ఇంతకాడికయ్యింది”. అని విసుక్కుంటానే మంచినీళ్ల డబ్బా తెచ్చిచ్చింది.
“ అబ్బబ్బా సందుదొరికితే చాలు ఈ దెప్పుళ్ళతోనే చస్తావుండం”. అంటూ బ్యాగు చంకన పెట్టుకోని బైటగేటు దగ్గరకొచ్చాడు. అతనితోపాటే వాకిట్లోకొచ్చిన కమల. . ” గూడూర్లో పనైపోంగానే యాడా ఆక్కుండా రాపూరు బొస్సెక్కెయ్యి రేపు మద్దేన్నానికల్లా తిరుక్కో. ఆడ వచ్చిందీ పోయ్యిందీ
ఏం మాట్లాడబాకు. సమయానికి చేతికందలేదని చెప్పు. మీ అక్కని పదిరోజులు ఆసుపత్రిలో
ఉండమని చెప్పు. బాద్దెతంతా తనే జూసుకోవాలన్నట్టు జెప్పు. అవునూ. . కాగితాలు పెట్టుకొన్నావా. ?
ఆ మాటతో ఆగి హడావుడిగా బ్యాగులో వెతుక్కోసాగాడ. రెండంగల్లో ఇంట్లోకిపోయి పేపర్లు తెచ్చిచ్చింది కమల. అవి బ్యాగులో పెట్టుకోని ఆమెకి చెప్పి బైటకు రాగానే ఖాళీ ఆటో కనిపించింది. మాట్లాడుకోని ఎక్కేశాడు. బస్టాండ్ వచ్చేసరికి తిరుపతి బస్సు కదలడానికి సిద్ధంగా ఉంది. పరుగులాంటి నడకతో వెళ్లి బస్సు పట్టుకొన్నాడు. ఖాళీ సీటు కనిపిస్తే వెళ్ళి కిటికీ పక్కన కూర్చొన్నాడు. అప్పటిదాక పడిన ఆదుర్దా తగ్గి స్థిమితమనిపించింది.
బస్సు ఊరుదాటగానే కండక్టరొస్తే టిక్కెట్ తీసుకున్నాడు.
ఎండెక్కుతున్నా గాలిలో ఇంకా చల్లదనం పోలేదు. బస్సు వేగానికి కిటికీలోంచి దూసుకొచ్చే చల్లటిగాలి శరీరాన్ని చుట్టేస్తుంది. నాగభూషణానికి తెలియకుండానే కళ్ళు మూతలు పడసాగాయి. కాళ్ళు బారచాచుకొని సీటుకు చేరగిలపడ్డాడు. బ్యాగు ఒళ్ళో పెట్టుకొంటుంటే దానిలోనుంచి పేపర్లు బయటకుకనిపిస్తూ ఉన్నాయి. హడావుడిలో బ్యాగుకు జిప్పేయడం మరిచిపోయాడు. పేపర్లు లోపలికినెట్టి జిప్పేయబోయినప్పుడల్లా ఆగివాటిని చేతుల్లోకి తీసుకున్నాడు. అవి వాళ్ళమ్మ డెత్ సర్టిఫికెట్ కాపీలు.
మడతబెట్టున్న పేపర్లను బ్యాగుమీదపెట్టి సాపు చేస్తున్నట్టుగా రెండు అరచేతుల్తో రాశాడు. బలహీనమైన తల్లి చేతిని నిమురుతున్న భావన ఒక్క క్షణం మనస్సును తాకి వెళ్ళినట్లైంది. సాపు చెయ్యడంమాపి పేపర్లను చాలాసేపు అలాగే చూస్తూ ఉండిపోయ్యాడు.
ఒక బలమైన నిట్టూర్పుతోపాటు శరీరంలోని శక్తంతా ఆవిరైపోయినట్లైంది. మనస్సంతా నిస్సత్తువ ఆవరించుకొన్నది. పేపర్లమీద చేతులలాగే ఉంచి కళ్ళు మూసుకొన్నాడు.
బిడ్డలు పసివాళ్ళప్పుడే భర్తను కోల్పోయి కాయకష్టంతో రాటుదేలిన ఆ శరీరం, ఒక్క తిప్పుతోనే రెండు చక్రాల ఆయిలింజన్ ఆడించగలిగిన ఆ బలం, అరవైయ్యేళ్ళుగూడా రాకుండానే కరిగీ. . . కరిగీ తోళ్ళై వేల్లాడి. . . ఎప్పుడూ దేన్నో వెతుకుతున్నట్లుండే ఆ చూపులు, వెతికీ. వెతికీ. . వెతుకులలాటలోనే నిర్జీవమై శాశ్వతంగా మూతబడి అప్పుడే నాలుగు నెలలు.
వెచ్చటి కన్నీటి చుక్క చెంపమీద జారగానే ఉలిక్కిపడి కళ్ళుతెరిచాడు నాగభూషణం. రెప్పల అడ్డు తొలగ్గానే రెండు కళ్ళ నుంచీ జలజలా కన్నీళ్ళు జారాయి. కళ్ళుతుడుచుకొంటూనే కంగారుగా పక్కసీటువైపు చూశాడు. వాళ్ళిద్దరూ నిద్రలో జోగుతున్నారు. మిగతా సీట్లు మసుషుల తలలకంటే ఎత్తుగా ఉన్నాయి కాబట్టి ఎవరూ కనిపించటంలేదు. ఈ మధ్య ఎందుకో ప్రతిదానికి కన్నీళ్ళు ఆగటంలేదు. మనసుకున్న దృఢత్వం కొద్దికొద్దిగా జారిపోతోంది.
పేపర్లు బ్యాగులోపెట్టి సర్దుకొని కూర్చొన్నాడు. కొద్దిగా మంచినీళ్ళుతాగి కిటికీ దగ్గరగా జరిగాడు. కనుచూపు మేరంతా పచ్చటి మాగాణి పొలాలు,వంగిపనులు చేసుకొంటున్న మనుషులు, జామాయిలు, సుబాబుల తోటలు, ఫారెస్ట్ భూమి, మళ్లీ మాగాణి, పరుగులతీస్తున్న బస్సుతోపాటు పైర్లూ మారిపోతున్నాయి.
బస్సు కొవ్వూరు దాటింది. కిటికీ అద్దం జరిపి కొద్దిగా పక్కకి జరిగి కూర్చొన్నాడు. నెల్లూర్లో ఒకతనొచ్చి నాగభూషణం పక్కన కూర్చొన్నాడు. తిరుపతి వెళుతున్నాని చెప్పాడు. బస్సు కదలటంతోనే న్యూస్‌పేపర్ మొఖమ్మీద పెట్టుకొని నిద్రలోకి జారాడు.
వెనకసీట్లో వాళ్ళు వ్యాపారంలో కష్టనష్టాల గురించి ఆపకుండా మాట్లాడుతూనే ఉన్నారు. ఎప్పటినుంచో సాగుతున్న చర్చకు కొనసాగింపు బస్సులో నడుస్తున్నట్టుగా ఉంది. వాళ్ళిద్దరి సంబంధమేంటో నాగభూషణానికి అర్థంకాలేదు. ఒకరు ఉత్సాహంతో వ్యవసాయం వదిలి వ్యాపారంలోకి దూకాలనుకొంటున్నారు. ఇంకొకరు అడ్డుపుల్ల వేస్తున్నారు. ఆ ఉత్సాహాన్ని అడ్డుపుల్లేం ఆపగలుగుతుందనుకొన్నాడు నాగభూషణం.
పదిహేనేళ్ళక్రితం తల్లి అడ్డుపుల్ల తననాపగలిగిందా? ఉత్సాహంతో దూకేశాడు. అప్పటి నుంచీ అందులోనే మునిగితేలుతున్నాడు. తేలడమెక్కడ అంతా మునుగడమే. దరీ దారీ కనిపించక గిజగిజలాడుతున్నాడు.
రిజర్వాయరు కింద తమ ఊరు మునకలో పోకుంటే వ్యాపారమనే ఆలోచనన్నా వచ్చుండేదా? ఎట్టున్నోళ్ళమట్లే ఉన్నా మనశ్శాంతన్నా ఉండకపోయిందా? ఏం మనశ్శాంతి! ఆ మెట్ట చేలల్లో కొట్టుకోని కొట్టుకోని, నాలుగు చినుకులెప్పుడు రాల్తయో. . . ఇన్ని గింజలెప్పుడూ కళ్ళబడతయోనని ఎదురు చూసీ. . . చూసీ. . ఏళ్ళూ పూళ్ళూ గడిచినా అదే గొర్రెతోక బతుకు. ఆ మెట్టబతుకే అయితే తనకు కమలనిచ్చేవాళ్ళా. తనింతదూరం వచ్చేవాడా?వచ్చిమాత్రం బావుకొన్నదేంటి?
న్యూస్‌పేపర్ కాళ్ళమీద పడటంతో ఈ లోకంలోకొచ్చాడు నాగభూషణం. పేపర్ చేతుల్లోకి తీసుకొన్నాడు. బలవంతంగా తన ఆలోచనలను అటు మళ్ళించాడు.
బస్సు గూడురు చేరేసరికి సమయం పదీముప్పావయింది. లింగయ్య నాగభూషణం కోసం ఎదురుచూస్తూ బస్టాండులో ఉన్నాడు. ఇద్దరూ లాయరు దగ్గరకెళ్ళారు. వీళ్ళకోసమే ఎదురుచూస్తున్నాడాయన. సర్టిఫికెట్లు ఆయనకిచ్చి కేసు గురించి నాలుగు మాటలు మాట్లాడి అక్కడి నుంచి కదిలారు.
లింగయ్య ఇటీల కలిసిన తమ ఊరివాళ్ళ సంగతులేదో చెబుతున్నాడు. మంచోచెడో జరిగినిప్పుడు పదిమందీ కలవడమే. అటు నాలుగు మాటలు ఇటు నాలుగు మాటలు తప్ప కడుపునిండా కలబోసుకొన్నదెప్పుడు? ఊకొడుతూనే చుట్టూ మారిన కట్టడాలు,అంగళ్లు గమనిస్తూ నడుస్తున్నాడు నాగభూషణం.
ఒకప్పుడు ఈ ఏరియా ప్రతి అంగుళం అతనికి తెలుసు. సీజన్లోవారానికి రెండు మూడు రోజులుగూడ ఇక్కడ తిరిగాడు. అప్పుడే ఇక్కడికి రావడం మానేసి పదిసంవత్సరాలౌతోంది. ఇప్పుడైనా లాయరే రెండుసార్లు అతన్ని వెదుక్కొంటూవచ్చాడు, కాబట్టి మళ్ళీ ఇటు రావాల్సొచ్చింది. గవర్నమెంట్ మీకు రావాల్సిననంత ఇవ్వకుండా మోసం చేసింది, మళ్ళీ కేసేద్దామన్నాడు లాయరు. ఎటేటోబోయినళ్ళందర్నీ ఎతికి పట్టుకోని కేసు నడిపిస్తున్నాడు.
నిమ్మకాయల కొట్లవైపు రాగానే ఆ వాసన ముక్కుపుటలాకి తగిలి మనసెట్లో అయిపోయింది నాగభూషణానికి. ఆ మండీ,రైతులూ, బేరాగాళ్ళతో సందడి సందడిగా ఉంది. తెలిసినోళ్ళు చూసి పలకరించకుండా తప్పించుకోవటానికి లింగయ్య పక్కగా తలొంచుకొని నడుస్తున్నాడు నాగభూషణం.
ఎవరో వెనుకనుంచి “అన్నా. . . న్నా. . . ఆగాగు”, అని గట్టిగా కేకలుపెట్టి పిలిచారు. లింగయ్య ఆగిపోయాడు. దాంతో నాగభూషణానికి ఆగక తప్పలేదు.
లావుగా పొట్టిగా ఉన్న మనిషి గబగబా పరిగెత్తినట్టు అడుగులేస్తా వీళ్ళ దగ్గరికొచ్చాడు. నాగభూషణం చేతులు పట్టుకొని ఊపేస్తా. . .
“ అబ్బ. . ఎన్నాళ్ళయిందన్న నిన్నుజూసి, కావిల్లో ఉండవని తెలిసింది. ఏమన్నా. . ఎంత దూరముంది కాయిలు ఈడకే పంపిచ్చొచ్చు గదన్నా, తెలిసిన నలుగురూ చెయ్యేస్తేనేగదన్నా నేనూ నిలబడగలిగేది” ఆ గొంతు నిష్టూరంగా పలికింది.
‘ఇంకా అన్నకి మట్టి పిసుక్కోవాల్సిన ఖర్మేంది భాస్కర్ బామ్మర్ధితో కలిసి పురుగుమెందులు,పంటగింజలూ ఒకటికి రొండు యాపారాలు చేసుకుంటా లచ్చణంగా ఉండ్లా. . ఎటూ గాకుండా పోయింది మేమే”లింగయ్య మాటలకు నాగభూషణం మనసు కలుక్కుమన్నది. ’పిచ్చోడ. దూరపుకొండలు అట్నే ఉంటయిరా. ఒకదాని అప్పొసూలుకే ఇంకోదాంట్లో మునిగింది. మట్టి మర్మమే తప్ప మార్కెట్‌మాయాజాలం అంతుచిక్కక నలిగి చస్తున్నాన్రా.
మనసులోని ఆలోచనలను బైటికికనిపించకుండా జాగ్రత్తపడి సంభాషణని నిమ్మకాయల బేరాలవైపు మళ్ళిచ్చాడు నాగభూషణం.
భాస్కర్ నిమ్మకాయల డీలరు. చాలాకాలం వాళ్ళ బావదగ్గర పనిచేసి ఈ మధ్యనే స్వంత వ్యాపారం పెట్టుకొన్నాడు. పంటదిగుబడి మార్కెట్ పోకడలు గురించి పదినిముషాలు మాట్లాడి ఇద్దరూ అక్కడి నుంచి కదిలారు.
సందులూ గొందులూ తిప్పితిప్పి ఇల్లని ఒక దగ్గరికి తీసకపోయ్యాడు లింగయ్య. తరవాతెప్పుడన్నా వస్తాలెమ్మని నాగభూషణం ఎంతచెప్పినా వినిపించుకోలేదు.
అది ఇల్లనుకోవటం కంటే తమ ఊళ్ళో గొడ్లకోసం దించిన రేకుల షెడ్డులాగా ఉంది. అంతా గదులు గదులుగాజేసి బాడుగలకి ఇచ్చారు.
ఇంటిముందు నడవడానికి మూరెడు స్థలమేవదిలారు. ఆ చివరి మనిషి నడవడం మొదలుపెడితే ఈ చివరి మనిషి నిలబడాలి.
ముందు లింగయ్య నడుస్తుంటే వెనకే నడుస్తున్నాడు నాగభూషణం. లోపలికి రమ్మంటూ అతను ఒక వాకిలిలోంచి నడిచాడు. గుప్పుమని ముక్కవాసన ముక్కుల్నితాకి ఉక్కిరిబిక్కిరయ్యాడు నాగభూషణం. ఇల్లంతా చీకటిగా ఎక్కడేంటో అర్థంకాక వాకిట్లోనే ఆగిపోయ్యాడు. చీకటిముద్ద కదులుతున్నట్టుగా వజ్రమ్మ వాకిట్లోకొచ్చి పలకరించింది.
ఆ వాసనకి, చీకటికి తట్టుకొన్నాక నెమ్మదిగా ఇంట్లోకి నడిచాడు.
మనుషులు మెసలడానికి స్థలముంచి మిగతా అంతా సామాన్లు కుక్కేసినట్లుందా గది. ఒక పక్క ముసలామె పడుకోనున్న మంచం. ఇంకోపక్క వంటబండ,మంచినీళ్ళు తాగాక అతనికి కుర్చీవేసి తను మంచమ్మీద కూర్చొన్నాడు లింగయ్య.
అలికిడికి ముసలమ్మలేచింది. కళ్ళు చికిలించి కొత్తమనిషిని ఎగాదిగా చూడసాగింది.
“ నేనే పెదమ్మా! నాగభూషణాన్ని గుర్తుపట్టలా! అప్పుడే అంత ఒగ్గైపొయ్యావేందే” చేతులు పట్టుకొని అన్నాడు. ఆమె అతని మొఖంలోకి అట్నే పట్టిపట్టి చూసి గుర్తుతెలియగానే మనిషంతా కదిలిపోయింది గట్టిగా అతని చేతులు పట్టుకోని బోరున ఏడ్చింది.
“ అబ్బబ్బా ఇంటికి మనిషి రాగూడదు. ఇన్నాళ్ళకొచ్చిన మనిషి, నోరారా మాటామంతీ లేకుండా ఈ ఏడుపులూ పెడబొబ్బలూ ఏందే” కసిరినట్టుగా అన్నాడు లింగయ్య.
ఆ దుఖాన్ని అర్థంచేసుకొన్నట్లుగా చేతులు నిమురుతూ మౌనంగా
ఉండిపోయ్యాడు నాగభూషణం. మనుషులకు మొఖంవాచి ఎప్పటినుంచో గడ్డకట్టిన దుఖం కరుగుతోంది.
“మీయమ్మ పుణ్యాత్మురాలు తండ్రీ దాటిపోయింది. ఇంకా ఎన్నాళ్లీ చెరనుభగించాలో. . ఎన్నాళ్లీ మురికిచావు చావాలో ఎక్కిళ్ళలో నుంచి మాటలు పెగిలివస్తున్నాయి.
“అబ్బ. . . ఏందే ఇది గమ్మునుండు” లింగయ్య లేచి ముసలమ్మ భుజంతడతా అన్నాడు. ఆ గొంతులో ఇందాకటి గదమాయింపులేదు.
“ ఎంత ధాటిగా వున్న మనిషి నాయనా, పాతాళంలోంచి నీళ్ళురప్పించి ఒక నిమ్మకాయలేనా పండిచ్చిందా! చేనూ చెట్టే పెంచిందా. . రాత్రీపొగులూ అదేలోకమైన మనిషి. ఆ వైభోగమంతా ఏమాయతండ్రీ. . అంతకష్టం కడుపులో పెట్టుకొని నా బతుకుజూసి కంటికి కడవిడేడ్చిపోయెనే తండ్రీ”. ముసలమ్మ అందర్నీ ఆ ఆవేదన చుట్టూ తిప్పుతోంది.
“ అటు ఇటు ఏ సాల్లోనులేదు. అత్తకా పిచ్చెందుకొచ్చింది బావా” అది జవాబు ఆశించిన ప్రశ్నకాదు. నాగభూషణం తలొంచుకోని దీక్షగా అరచేతుల్ని చూస్తున్నాడు. వజ్రమ్మ ప్రశ్నకి మనుసులో జవాబు వెదుకుతున్నాడు.
ఊరు మునకలో పోకతప్పదన్నప్పుడు మనసు రాయి చేసుకొన్నది. యాడన్నా ఇంత నీటి తడుండే పొలం కొనమని ఎంత సతపోరింది. ఇద్దరి మధ్యా కొన్ని నెలలు మాటలు లేకుండానే గడిచిపోయింది. అంతో ఇంతో వచ్చిన డబ్బులు చేతిలో ఏసుకొని తను ఊరుదాటినప్పుడు అక్కడి నుంచి కదలలేదు. ఒక్కరొక్కరుగా ఊరంతా కదిలిపోతున్నా ఊరొదలలేదు. రిజర్వాయర్ పనిపూర్తై బలవంతంగా లేపితేనే అక్కడి నుంచి కదిలింది. అప్పటి నుంచీ పిచ్చిగా. . . పిచ్చిపట్టినట్టుగా తిరిగింది. చేనుకోసం, చెట్టుకోసం, మందికోసం, గూటి నుంచి చెల్లాచెదురైన పక్షుల్ని వెతుక్కొంటూ వెతుక్కొంటూ. .
కాలరిగి కూలబడినప్పుడే తన దగ్గరికి చేర్చుకోగలిగాడు. కాలీడ్చుకొంటూనే సందులూ గొందులూ అదే పిచ్చి వెతుకులాట. ఆ పిచ్చితనాన్ని భరించే ఓపికలేక, పిచ్చాసుపత్రిలో చేర్చలేక, ఇంటిల్లిపాది ఆమె చావుకోసం ఎదురుచూసి. . . సాగనంపి. . . . పళ్ళబిగువున బలవంతంగా తన్నుకొస్తున్న ఏడుపును ఆపుకొన్నాడు నాగభూషణం.
“గాచారం తక్కువైతే ఏమైనా వస్తయి. యెనకటోళ్ళు ఎవురన్నా ఊరొదిలిండ్రా. దిక్కుకొకరమై కూలిబతుకు బతకడంల్యా?. . “ ఏవో ఆలోచనల నుంచి బైటపడి వజ్రమ్మకి సమాధానం అన్నట్లుగా చెప్పాడు లింగయ్య.
“గాచారమే తండ్రీ గాచరమే. ఆనాడు నెత్తినెక్కి నిలవనీలా, ఒడిలో ఒడిడు నాయినా. . లచ్చింతల్లిని నాచేత్తోనే సాగనంపినా. నలుగురు బిడ్డల్నీ నాలుగుదిక్కులు జేసుకున్నా” రెండు చేతుల్తో నెత్తిగొట్టుకొన్నది ముసలమ్మ. ఆమె ఏడుపు సన్నగా సుడులు తిరుగుతోంది.
“బాగుపడతామనేగదే లారీ కొన్నది. ఇట్టంతా ఊడ్చకపోద్దని ఎవురు కలగన్నారు?” గొణుక్కొంటున్నట్టుగా అన్నాడు లింగయ్య.
“ ఆ డబ్బులకి యాడన్నా నాలుగెకరాలు పొలం కొనుక్కోనున్నా ఈ గతి రాకపోను”. వజ్రమ్మ లేచి వంటబండవైపు కదిలింది.
“ చెడినకాడికి చెడినం. ఆ లాయరు దయతో నాలుగు రూపాయలు చేతికొస్తే నిలబడే దారి జూసుకొందాం. ”
“ ఎవుడికి ఎవుడి దయ. . ఎవుడాశవాడిది. ఒకటే పెద్దకేసు పట్టుకొంటే ఇంత పర్సంటేజి వస్తదని వాడాశ. పోయిన కాడికి పోయింది. ఇట్టన్నా నాలుగు రూపాయాలు చేతికొస్తయని మనాశ”
ఏదో పెద్దపెద్దంగా వాదించుకొంటూ ఇంట్లోకొచ్చిన లింగయ్య పిల్లలు కొత్తమనిషిని చూసి బెరుగ్గా ఆగిపొయ్యారు. నాగభూషణం వాళ్ళని పలకరించి చదువుల వివరాలడిగాడు. ఒకడు ఇంటరు ఇంకొకడు పది చదువుతున్నారు. మాటల్లో వాళ్ళ బెరుకు తగ్గింది.
లింగయ్య అందర్నీ లేవమని చాపలు మడతబెట్టి కిందపరిచాడు. అందరూ కాళ్ళూ చేతులూ కడుక్కోనొచ్చి కూర్చొన్నారు. ముసలమ్మ ఇంకా సన్నగా ఎక్కిళ్ళు పెడుతూనే ఉంది. అన్నం తినమంటే ఒద్దన్నది. లింగయ్య కసిరి గిన్నెతెచ్చి పెడితే దాన్లోకి చెయ్యి కడుక్కొన్నది. ఇంతన్నం పళ్ళంలో పెట్టి మంచమ్మీదికే అందించింది వజ్రమ్మ.
లింగయ్య అన్నం కలుపుకొంటూ క్రిష్ణారెడ్డి ఇల్లుజూసినా మూడంతస్తులదాకా జుయ్‌మని కారు ఆక్కుండా పోద్దంట. వాడెమ్మా బడవా. అంత డబ్బులు ఏడనుంచొచ్చినయో! ఎట్టగట్టిండో అప్పుడు కలిగిన ఆశ్చర్యం జ్ఞాపకంలోగూడ ఆయన మొఖంలో అట్లే కదులుతోంది.
“ ఎట్టేంది. మనిషెత్తు జంబోరం నిమ్మ చెట్లు నాటె. ఎవురికి తినిపిచ్చాల్సిందివాడికి తినిపిచ్చి లక్షలకు లక్షలు ముద్దరకుడిమూలాల చేతిల ఏసుకొనె. మనకొచ్చిన ఆ అరాకొరాగూడ అప్పుడు నాలుగురూపాయిలు ఇప్పుడు నాలుగురూపాయలు అన్నట్టు పదేళ్ళు సాగినే! మంచినీళ్ళ గ్లాసందుకుంటూ అన్నాడు నాగభూషణం.
“ ఊరు మునకేమోగాని బాగుపడ్డోళ్ళు బాగానే బాగుపడ్డారు” అన్నది వజ్రమ్మ.
“ ఒక్కో ఆఫీసరుగాడు రావడం మూటగట్టుకోగలిగనంత కట్టగానే వాడుబోవడం. ఇంకొకడు రావడం. పోయ. . ఎటు మారేదటు చేతులు మారిపోయె” నాగభూషణం ఎడమ చేతిని గాల్లో ఊపాడు.
“ మన పొలం ఇప్పుడు సెజ్జుల్లో పోయినా బాగుండు. కావాల్సినంత డబ్బు చేతిలో బెట్టినంకనే పొలం తీసుకొంటావున్నారు”మొఖం బాధగా పెట్టి అన్నాడు లింగయ్య పెద్ద కొడుకు.
“ పుట్టినకాడి నుంచి మట్టిపిసుక్కోని బతికినోళ్ళం. మాకే చేనూచెట్టూ అంటే డబ్బులాల్నే కనబడ్డాయి. ఇంక మీదేముంది?. కళ్ళు తెరిచి చూస్తే ఏముంది? ఏడదాడ జారిపోయింది. ”లింగయ్య మాటలతో ఇంక మాటలు అయిపోయినట్లుగా అందరూ ఎవరాలోచనల్లోవాళ్ళు మౌనంగా వుండిపొయ్యారు.
అన్నాలుతిన్నంక పదినిముషాలు ఆ మాటా ఈ మాట్లాడి బ్యాగుతీసుకొని లేచాడు నాగభూషణం.
“ ఏ చెట్టుకింద కూర్చొన్నా కంటినిండుగా జగమెళ్ళిపోవాల్సింది. కుక్కిమంచం పాలైతిగద తండ్రీ. ఇట్టొచ్చినప్పుడైనా ఈ ముసల్దాన్ని మర్చిపోబాకు” ముసలమ్మ మళ్ళీ కళ్ళనీళ్ళుపెట్టుకొన్నది.
అందరూ సాగనంపడానికి వీధి చివరిదాకా వచ్చారు. వద్దన్నా వినకుండా లింగయ్య బస్టాండుకి వచ్చాడు. బస్సు కదిలేదాక అతనూ కదలలేదు.
ఇన్ని రోజులకు కలిసిన మనుషులు, సంతోషంతో నిండిపోవాల్సిన మనసు నాగభూషణానికి బరువెక్కిపోయింది. ఒంట్లో సర్వశక్తీతోడేసినట్లుగా మనసంతా వెలితిగావుంది. బస్సు వేగంగా పోతోంది. చెట్టూ, చేమా , ఊళ్ళూ వెనక్కెళ్ళిపోతున్నాయి. కళ్ళు చూస్తున్నాయేగాని ఆ దృశ్యం మనసుకెక్కటంలేదు. ఒక్కక్షణం రావూరు ప్రయాణం మానుకొని వెనక్కెళ్ళిపోతేనో అనిపించింది నాగభూషణానికి. కాని వెళ్ళక తప్పదు. కమలకి గర్భసంచిలో గడ్డొచ్చింది. ఇన్‌ఫెక్షన్ వచ్చి గర్భసంచి పెద్దపేక్కి అతుక్కొని ఉందంట. వైద్యం కోసం మద్రాసుకి పోవాల్సిందే. ఎంత ఖర్చవుతుందో ఏమో. ఇన్నాళ్ళకి బాతగానోడల అక్కని అప్పడుక్కోవాల్సి రావటమే నాగభూషణానికి మింగుడుపడటంలేదు. పిల్లలిద్దరి చదువు, ఇంటి ఖర్చు ఎట్లోనెట్టుకొస్తున్నాడు. ఇంత ఖర్చుకి వేరేదారి దొరకలేదు.
నాగభూషణంవాళ్ళ ఊరుమీదగానే రావూరుపోవాలి. ఊరు దగ్గరౌతున్నకొద్దీ అతని మనుసు ఉద్వేగానికి లోనవ్వసాగింది. తెలియకుండానే సీటులోనుంచి పైకిలేచాడు.
కండక్టరు పంచింగ్ మిషన్‌తో రాడ్‌మీదకొట్టి బస్సునాపాడు. బస్సులోనుంచి ఇద్దరు మనుషులు కిందికి దిగుతున్నారు. కొన్నివందల సార్లు దిగిస స్థలం. అతని ప్రమేయం లేకుండానే కాళ్ళు కిందకు కదిలాయి. బస్సు కదిలిపోయాక తనేం చేసాడో తెలిసింది.
అక్కడ దిగిన వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ కాలిబాటగుండా నడిచిపోతున్నారు.
ఊరుదాదాపు కిలోమీరుంటుంది. అడ్డరోడ్డుకి ఊరికి మధ్యలో ఉన్న దారంతా ఒకప్పుడు ముళ్ళపొదలు,రాళ్ళుగుట్టలతో నిండుండేది. ఇప్పుడు బత్తాయి,మంచినిమ్మ తోటలుగా మారిపోయింది. ఎప్పుడో తాతలనాటి ఇరవయ్యెకరాల బీటిచేను, గొడ్డుగోదా తిరిగి రావటానికి పనికొచ్చేది. కనుచూపు మేరంతా కలుపుకొని చక్కటి తోటగా దర్శనమిస్తోంది. చుట్టూ కంచె, గేటులోపల చెట్లమధ్యగా చిన్నమేడ కనిపిస్తోంది. క్రిష్ణారెడ్డి గెస్ట్‌హౌజ్‌గా వాడుకొంటున్నట్టున్నాడు. అని అనుకున్నాడు నాగభూషణం.
ఆ పొలాలు మునకలోకి రావని తెలిసినా తామెవ్వరూ నిలుపుకోలేకపోయ్యారు. వదిలేసిపోతూ ఆ బరువెందుకనిపించింది.
ఊరివైపు నడవసాగాడు. పది నిముషాల తరువాత ఇంకా ముందుకు పోనవసరంలేనట్లు అడుగులు ఆగిపోయాయి. కండలేరు డ్యాం నీళ్ళతో తొణికసలాడుతోంది. చూపు ఆనినంతమేర నీళ్ళే ఈ నీళ్ళకి మొఖంవాచేకదూ ఆ రోజు వదిలించుకోవటానికి అందరూ అంత ఆత్రపడ్డది.
ఎక్కడా జనసంచారంలేదు. పక్కనే ఉన్న పెద్దరాయిమీద కూర్చొని ఊరున్నవైపు చూశాడు. ఎలా ఉండేది ఊరు చెట్టూచేమలు మధ్యలో తొంగిచూస్తున్నట్లుగా ఉండే ఇళ్ళు. దూరంగా ఊరిచుట్టూ గిరిగీసినట్లుగా ఉండే కొండలు ఇప్పుడు తమ ‘ పోకూరుపల్లి’ ఆనవాళ్ళేవి?.
నాగభూషణం మనసులో చిన్న మరదలు లత జ్ఞాపకం మెదిలింది. తనకు పెళ్ళైన కొత్తలో వాళ్ళక్కదగ్గరకొచ్చింది. వెళుతూ ఆ పిల్ల ఇక్కడ నిలబడి చేతులు బారాచాచి కళ్ళింతలు చేసుకొని చుట్టూతిరిగి “ ఆ చెట్లమధ్యలో ఇళ్ళు. . దూరంగా కొండలు. . . ఓహ్. . చెయ్యి తిరిగిన చిత్రకారుడు గీసిన చిత్రంలా ఎంతద్భుతంగా ఉంది బావా మీ ఊరు”. .
“ నిజమే అద్భుతమైన చిత్రమ్మీద ఎవరో కక్షగట్టి నీళ్ళు గుమ్మరించేశారు” నాగభూషణం మనసు బాధగా మూలిగింది.
విశాలమైన ఆ రిజర్వాయర్‌ని చిన్న చెరువుగా మార్చి మనసులో నిలిచివున్న ఊరి చిత్రం పక్కనపెట్టి చూశాడు. ఊహమాత్రం నుంచే ఒక హాయి మనసును తాకింది. ఆ రోజు అడక్కుండా విస్మరించేందేదో తెల్లమైనట్లైంది. ధ్వంసమైన చిత్రం బదులుగా సజీవమైన చిత్రాన్ని సాధించుకోగలిగుంటే.