Jun2009
క్రీడ
మార్చి నెల
ఉదయం ఎనిమిదిన్నర
అంత వుదయమైనా గానీ అప్పుడే ఎండ మాత్రం జనాలకు చెమటలు కురిపిస్తోంది.
కలెక్టరేట్, సమ్మర్ స్కూల్ ర్యాలీ కోసం గుమిగూడిన స్కూల్ పిల్లలతో, అధికార గణాలతో ప్రాంగణమంతా విరబూసిన పత్తి పొలంలా ఉంది. ఆ రంగుల పొలం కలెక్టర్ కారు కోసం ఎదురు చూస్తున్నది. ఊళ్ళోని ప్రముఖ స్కూళ్ళన్నీ రంగురంగుల పూలలాంటి పిల్లల్ని కలెక్టర్ ఆదేశంతో గొర్రెల్లాగా తొలి వరుసలు దీర్చి నిలబెట్టారు. కదలడానికి సిద్ధంగా వున్న పిల్లల చేతుల్లో రకరకాల రంగుల్లో, సైజుల్లో, ప్లకార్డులూ, బ్యానర్లూ వున్నాయి. బ్యానర్ల వనం కింద కొందరు వాటిని నీడలా నెత్తిన బెట్టుకునో, విసనకర్రలా గాలిని విసురుకుంటానో రకరకాలుగా ఆడుకుంటున్నారు. అన్ని బ్యానర్లూ, ప్లకార్డుల మీద బాలకార్మికుల గురించీ, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన గురించీ, పిల్ల్లల హక్కుల గురించీ ఇంకా ఏవేవో అట్లాంటి ఆదర్శ బాల్యం గురించిన చోద్యాలను కవితాత్మకమైన నినాదాలుగా రాసున్నాయి.
అన్నీ బ్యానర్లూ ప్లకార్డులూ కలెక్టర్ స్వయంగా ఒక బృందాన్ని ఎంపిక చేసి వాళ్లను కూర్చోబెట్టి రాయించి తయారు చేయించినవే.
“ఇంత చిన్న విషయం పట్ల కూడా ఎంత శ్రద్ధో సార్కు” అని అధికారగణం ఆశ్చర్యపోయోంత శ్రద్ధ అయినది.
తొమ్మిదికి ఐదు నిముషాలుందనగా కలెక్టర్ కిరణ్ కుమార్ పడవలాంటి ఏసీ కారు దిగారు.
స్పోర్ట్స్ షొ తో తెల్లని డ్రెస్ లో నల్లని పొట్టీ శరీరంతో పండిన పత్తి చెట్టును గుర్తు చేస్తున్నా, ఎర్రజీరలు తేలిన కళ్ళతో కలెక్టర్ అసహనంగా వున్నాడు. ఎన్నో రాత్రులుగా అతని కళ్లలో కాయలుగాస్తున్న తారా నక్షత్రాల వ్యధ సుడులు తిరిగి పడ్డ ఎర్రజీరలవి. పత్తి చేల మధ్యా పాశవికంగా నాశనం చేయబడ్డ బాల్యం ఒకటి అతన్ని కొంతకాలంగా వెంటాడుతూ వుంది. దానికి తోడు ఆ కేసు విషయమయి, సమస్య నిర్మూలనకు ఏం చర్యలు తీసుకున్నావని. మానవ హక్కుల కమీషన్ నుండీ నోటిస్ అందుకున్నాడు.
దిగుతూ దిగుతూ అప్రయత్నంగా ఆకాశంలోకి చూశాడు. తళతళలాడుతున్న కిరణాలు గుచ్చుకున్నాయి. అప్రయత్నంగా కళ్ళు మూసుకున్నాడు. ఎర్రని పూలవంటి తారా, నక్షత్రాలు కళ్ళముందు మెదిలారు. వాళ్లతో పాటు, ఆ బిడ్డల్ని కన్న తల్లిపొందిన దుఃఖం సుడులు సుడులుగా గుండెను చుట్టుకుంది.
సార్ దిగి దిగంగానే ఒక్క పెట్టున నినాదాలు అందుకున్నాయి పిల్లలూ, అధికారులు ఆశ్చర్యపోయి చూడగా.
అర్ధనగంగా పది పదహైదు మంది యువకులు నల్లని మేఘంలాగా గర్జిస్తున్నారు.
మండిపోతున్న పత్తిచేలల్లో చిటపటలా వాళ్లకళ్ళూ నోళ్ళూ పేలిపోతున్నాయి.
“అధికార అలసత్వం నశించాలి”
“నల్లమేకలపల్లి నక్షత్ర కేసును నీరుగారుస్తున్న పొలీసులు డౌన్ డౌన్”
“కామాంధుల కన్నెదాహాలు అంతం కావాలి అంతం కావాలి”
“నక్షత్ర కిచ్చిన హామీలు మరచిన కలెక్టర్ డౌన్ డౌన్”
నినాదాల హోరుకు అడ్డుకట్ట వేస్తూ లాఠీలు పరిగెత్తాయి.
అరుపులూ, పెడబొబ్బలూ. . .
“నశించాలీ. . ”
“డౌన్. . . డౌన్. . ”
నోరునొక్కినా కీచుగా బొంగురుగా విన్పిస్తున్న అరుపులు. . . దూరమవుతున్న “దౌర్జన్యం నశించాలి. . . ” గొంతులూ. . .
కలెక్టర్ దిగుతూనే షూటింగ్ బిగిన్ చేసిన నాలుగైదు వీడియో కెమరాలు, యీ గలబాను చిత్రిస్తుంటే కలెక్టర్ ఒక కంటి చూపుతో ఒక విసురుతో దాన్ని బంద్ చేయించాడు. అప్పట్నించీ కెమరాలు కలెక్టర్ను గురిపెట్టాయి.
అప్పటి వరకూ ఎదురు చూస్తుండిన నగర మేయర్ దశరధరెడ్డి కలెక్టర్ను అభినందించి, షేక్ హ్యాండిచ్చాడు.
ఆ చేయిని తాకుతుంటే మంచి ఏపుమీదున్న పచ్చని పత్తిపంటను నములుకు తిని బలిసిన పత్తి పురుగును తాకినట్లయింది. జలదరింపు. కాటుపడకుండా తప్పించుకునే వాడి వొడుపుతో చేతిని వెనక్కు తీసుకొని కలెక్టర్ ర్యాలీకి రిబ్బన్ కట్ చేశాడు. ర్యాలీ బయల్దేరే కన్నా ముందు కళ్లలో నక్షత్రాలు మెరిపిసోతున్న ఒకమ్మాయిని పిలిచి, బాలల హక్కుల పత్రాన్ని చదివించి చప్పట్లు కొట్టించాడు.
ఆ పాప బుగ్గలు చూస్తుంటే. . .
నల్లమేకల పల్లిలో రాత్రి బసచేసి వుదయం చూసిన లేత తడీ బుగ్గలు గుర్తొచ్చాయి.
ఎంతందమైన ముఖం, ఎంతందమైన కళ్ళు ఎంతందమైన పేరు! ఆ వూళ్ళో. . .
ఉదయపు సమావేశంలో గుమికూడిన పిల్లల్లో ఒక పాపను చూసి
“నీ పేరేమిట”ని అడిగితే
“నక్షత్ర” అంది.
సరిగా విన్లేదేమోననుకొని
“ఏంపేరూ. . . ” అంటే
“నక్షత్ర. . . నక్షత్ర. . ” రెండు సార్లు నవ్వుతూ అంది.
ఇంత మోటు పల్లెటూల్లో యింతందమైన పేరుంటుందా అని తెగ ఆశ్చర్యపోయాడు.
“నక్షత్ర!” స్వగతంగా అనుకొని
“నక్షత్రా యిట్రా. . . నువ్వేంచదువుతున్నావు”
“నేను బడికి పోను. . ఇదిగో మా అక్క తార యీయమ్మగూడా పోదు. . . ” ధైర్యంగా మాట్లాడూతున్న ఆ అమ్మాయిని చూసి ముచ్చటపడ్డాడు.
“నువ్వు బడికి పోవా? మరేం చేస్తావు. మీఅమ్మా నాన్న ఎవరు”
“ఇంతకు ముందు పోతాంటీమి నేనేమో మూడోక్లాసు మా అక్క ఐదు, ఇప్పుడూ పోతలేము” ఇంతలో గుమికూడిన జనాల్లోంచి, ఒకరు
” ఆ పిల్లలు యా స్కూల్ కీ పోరు సార్. . . , పనికిపోతారు” అన్నాడు.
“ఇంత చిన్నపిల్లలు ఏంపనికి పోతారు, వీళ్ళమ్మా నాన్నా ఎక్కడ. . ”
ఇంతందమైన పేర్లున్న ఈ పాపలు, బడీకి పోకుండా పనికిపోతున్నారా అని తెగ బాధపడ్డారు. వాళ్లనూ వాళ్లస్థితినీ అంచనా చేస్తూ.
“ఎంతమంది పిల్లలు” అడిగాడు.
“ఎనిమిది మంది సారూ. . . ” తలగోక్కుంటూ చెప్పాడు కురవబజారన్న.
“ఆఁ!” ఆశ్చర్యపోయాడు సారు.
“ఎట్లా పెంచి పోషిస్తునారు. యింత మందిని ఎందుకు కన్నారు? ఫ్యామిలీప్లానింగ్ ఆపరేషన్ ఎందుకు చేయించుకోలేదు?”
అధికారపు ప్రశ్న పరంపర. పల్లెల అభివృద్ధికి అజ్ఞానమే ప్రధాన అడ్డంకి అనే వివేచనతో నీలమ్మను ప్రశ్నించాడు.
“ఏం చేసేము సారూ, మోటోల్లమై గంపడు సంసారం చేసుకున్నాము ఏందో పనీ పాటా చేసుకుని బతుకుతాండాము”
“పిల్లల్ని ఎందుకు చదివించట్లేదు. . . ”
“సదివిచ్చి యావూరు ఏలాల సారూ మా పిల్లలు, సదవడానికి లెక్కగా వద్దా, మామేమో కూలీ నాలి చేసుకునే వాళ్లము, వున్న ఆరెకరాల రేగడినేలలో ఏం పండుతాయి సారూ. . ”
“మీ పిల్లల్ని చదివించడానికి ఏర్పాటు చేస్తాను, పంపిస్తారా. . . ”
భార్యాభర్తలిద్దరూ పంపిస్తామన్నారు.
అప్పటికప్పుడే తన వెంటవున్న అధికారులకు తారా నక్షత్రల చదువును అప్పగించాడు. వాళ్లను బ్రిడ్జి స్కూల్లో వేసి ఆ తరువాత మంచి స్కూల్లో చదువుకునే ఏర్పాటు చేస్తామని తల్లిదండ్రులకు భరోసా యిచ్చాడు. ఆ రోజంతా ఆ పిల్లల అందం, చొరవల గురించే ముచ్చటపడ్డాడు.
ఆ తర్వాత, ఎన్నో రాత్రి బసల్లాగా నల్లమేకలపల్లి బసకూడా స్మృతి పధంలో వొదిగి పోయిన కొంతకాలానికి.
“కలెక్టర్ గారిని ముచ్చటపరిచి హామీలు పొందిన తారా నక్షత్రాలు పత్తి చేలో రాలిన శవాలు” శీర్షికన జిల్లా ఎడిషన్లలో మొదటి పేజీ వార్తగా కన్పించింది.
ఆ అక్కా చెళ్ళెళ్లను దారుణంగా అత్యాచారానికి గురి చేసి చంపి పడేసి వెల్లిన వార్త. దర్యాప్తుపరంగా యిప్పటీకీ ఒక్క యించ్ కూడా ముందుకు వెళ్ళని దుర్ఘటన.
వార్త వచ్చిన రెండు రోజులకే ఆ పిల్లల తల్లి కలెక్టర్ను కలిసింది చాంబర్లో. “వంకపక్కనే మా ఆరెకరాల రేగడీనేల వుందని, దాన్ని వాళ్ళతోటలో కలిపేసుకొనీకి ఆడుగుతావుండ్రి మావూరి రెడ్డోల్లు, నా మొగుడూ తాగుబోతోడు, పిల్లలకి ఆయింత పొలమన్నా వుండనీ అని నాను పడనీ లేదు, దిక్కులేనోల్లమని ఆకోపాలంతాఅ మా పిల్లల మీద సూపిచ్చినారు సారూ, పిల్లోల్లని సదివిచ్చుకుందామనుకుంటే యిట్లా యీగతి. . . “
ఆ తల్లి దుఃఖం వెంటాడుతూనే వుంది – న్యాయం కోసం.
“సార్ చాలా హారిబుల్ గా వుంది. It’s so horrible వాతావరణం” అంటూ జిల్లా ఎస్పీ కలెక్టర్ నెత్తిమీద టోపి పెట్టాడు. ప్రొసెషన్ వెళ్తూవుంది. నినాదాలు హోరెత్తుతున్నాయి. ప్రజా వుద్యమ పాటల బాణీలో అనుకరణతో చదువు గురించిన చవకబారు పాటలు వెంటవస్తున్న వాహనం మైకుల్లోంచి వస్తున్నాయి. స్కూలు పిల్లలు కళ తప్పుతున్న పూలలా, వేలాడుతున్న కాడల్లా నడుస్తున్నారు. అధికారులు బలవంతపు పాదయాత్రలో నెత్తిన కర్చీఫ్ లు వేసుకొనే, కర్చీఫ్ లతో విసురుకుంటూనో కాళ్ళీడుస్తున్నారు.
“నిజమే ప్రసాద్ ఈ వుదయపు ఎండలా నీ దర్యాప్తూ హారిబుల్ గానే వుంది”.
ఎన్నోసార్లు అన్నాడు ఎస్పీతో, వారం క్రితం కూడా అదేమాట అన్నాడూ. ఎస్పీ ఎంతో నొచ్చుకుంటాడు ఆమాటకు.
“నోసర్, నోనో సర్ మనం చేసేదంతా చేస్తున్నాం, ఎక్కడా ఒక్క క్లూ కూడా వదలకుండా వెళ్ళారు. నిందితులు. స్పెషల్ టీంలు వేసాం రిపోర్ట్సు యివ్వలేకపోతున్నాయి, చివరకు ఆ అమ్మాయిల పేరెంట్స్ కూడా కేసును పట్టించుకోవడం లేదు”.
” ఎందుకు పట్టించుకోలేదు ప్రసాద్ మహిళా సంఘాలు ఎన్ని సార్లు అడిగారు, ప్రజా సంఘాలు ఎంత డిమాండ్ చేస్తున్నాయి. వాళ్ళమ్మ పొదుపు గ్రూపుల లీడర్ కదా ఆ సంఘాలు కలిసాయి. మనమే సరిగా దర్యాప్తు చేస్తున్నామా అని అనుమానం, అసలు అందరికంటే ఎక్కువగా దశరధరెడ్డి గారు పట్టించుకున్నారు, వాళ్ళూరే కదా అయినా నిందితులు దొరకలా. . “
“అవును సార్ మనకంటే కూడా దశరధ రెడ్డి సారే యీ విషయం గురించి ఎక్కువ పట్టించుకున్నాడు. ఆ పిల్లల తల్లి దండ్రులకు ఆర్ధిక సహాయం చేశాడు కూడా. “
మనోళ్లను కూడా దశరధ రెడ్డి బాగా పట్టించుకున్నాడని నేను వింటున్నానే. కేసు మీద ఆయనకు అంత శ్రద్ధ మనం పట్టించుకొకూడదనే కదా. “
“నో సర్ నో నో సర్ మీరట్లా మనవాళ్ల మీద అనుమాన పడొద్దండీ సార్, ఎన్నో వందలాది కేసుల్తో మనవాళ్లు సతమతమవుతుంటారు, అన్ని కేసుల్లాగే దీన్నీ చూస్తరు. మీరు వర్రీ అవ్వద్దండి సార్, యీ సంవత్సరం యిప్పటికి 380 అత్యాచార కేసులు జరిగాయి. జిల్లాలొ అన్నింటి పట్లా మన దృష్టి సమానంగానే కదా సార్ వుండాల్సింది. ఈ కేసు గురించి మాత్రమే ఎందుకు అనవసరంగా వర్రీ అవ్వాలి మీరైనా నేనైనా?”
“ఆ 380 కేసుల్లో 116 బాలికల మీదనే, చిన్నపిల్ల మీదనే, స్కూళ్లలో ఎగురుతూ గెంతుతూ ఆడుకోవాల్సిన పిల్లలు కొండల్లో, గుట్టల్లో, పశువులు కాస్తూ, తోటల్లో వాగువంకల్లో పుల్లలేరుతూ, పొలాల్లో పనులు చేస్తూ అత్యాచారాలకు బలి అవుతూంటే మనం ఏం చేస్తున్నామనీ, ప్రభుత్వపరంగా మనం ఆలోచించకపోయినా, సమాజమూ కోర్టులూ ఆలోచించకపోయినా, సమాజమూ కోర్టులూ ఆలోచించవా ప్రసాద్. ఇప్పుడు చూడు మానవహక్కుల కమీషన్ నుంచీ యీ నోటీసు, దీనికి సమాధానం ఇవ్వాలి. స్వయంగా హాజరుకావాలి అని తాఖీదు మరీ ముఖ్యంగా తారా నక్షత్రల కేసు గురించే అడుగుతున్నారే దీనికి మన సమాధానమేమి”.
” ఆయాం సారీ సార్, మీరీ జిల్లాకు మేజిస్ట్రేట్ నేను పోలీసింగ్ హెడ్, మీరే కోర్టు, నేను విచారణాధికారిని, మనల్ని దాటి బయటకోర్టులున్నాయి. వాటికి తలకు మించిన కేసులున్నాయి. ఫలానా కేసు ఏమయిందని అడిగితే ఎవరికైనా సమాధానం చెప్పడం కష్టం, అడ్మినిస్ట్రేటివ్ లాప్సెస్ చాలా వున్నాయి. నేను కాదనను. అందుకే వన్స్ ఎగైన్ అయామ్ సారీ, కానీ సార్, కోర్టుకు సమాధానమిద్దాం, మనం చేసింది చెబ్దాం, మనం ఏం చేస్తామో కూడా చెబ్దాం, మనం యాక్షన్ లేకుండా వుంటామా సార్, అలా ఎప్పటికీ వుండదు. మీరు ఆర్డర్ వెయ్యండి. రిపోర్టు కోర్టుకు సబ్మిట్ చేయడానికి ఏమేమి చేయాలో అన్నీ చేస్తాను. అయితే యీ తారా నక్షత్రల కేసును హ్యూమన్ రైట్స్ కమీషన్ కు వేసి మనకు తాఖీదు యిప్పించిన “దళిత ప్రజా సంఘం” నాయాళ్లను మాత్రం వూరికే వదల్కూడదు. సార్, ఆ నాయాళ్లకు వేరే ఏ పనీ లేదు సార్, యిలాంటి లిటిగేషన్స్ వేయడమే పని. మనకు ఎన్ని పనులుంటాయి, అర్ధం చేసుకోరు నా కొడుకులు, మనిద్దమూ వున్నాం సార్, మనమేమన్నా అప్పర్ కాస్ట్ వాళ్లమా సార్, దళితుల్ని పట్టించుకోకుండా పోవడానికి, ఆ నాయాళ్లకు అర్ధం కావడం లేదు గానీ, మీరు చేసినంత దళితులకు ఏ కలెక్టరన్నా చేసుంటాడా సార్. దళిత విధ్యార్ధులకు కూడా కార్పోరేట్ కాలేజీల్లో చేర్పించారు. అదెవ్వరూ ఆలోచించరా సార్. . . “
“అదేనండీ ఎస్పీ గారూ మనంఏమేం చేసామో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం, పిల్లల చదువు కోసం అదంతా ఒక రిపోర్ట్ కోర్టుకు పంపిద్దాం. . . అంతకంటే ముందు మనం యీసారి కొత్తగా ఒక ప్లాన్ తయారు చేద్దాం. యీ సమ్మర్ వెకేషన్ లో మొత్తం జిల్లా యంత్రాంగంఅంతా పల్ల్లెల్లో గడపాల. అక్కడ నిరక్షరాస్య తల్లిదండ్రులకు వాళ్ల పిల్లతోనే చదువు చెప్పించే ఏర్పాట్లు చేయాల. అట్లాగే ప్రతి డిగ్రీ విద్యార్ధీ వాళ్ల వాళ్ల వూర్లలో రాత్రి బడులు చెప్పి పిల్లలందరినీ విద్యావంతుల్ని చేయాల. జిల్లాలోని అందరు అధికారులు ఒక్కో మండలాన్ని ఎంచుకొని ఆ మండలంలోని మండల విద్యాధికారుల్నీ, టీచర్లనూ కూడగట్టూకొని మహిళా పొదుపు సంఘాలకూ, నిరక్షరాస్యులకూ చదువు చెప్పే ఏర్పాటు చేయాల. ఈ ప్లానంతా కోర్టుకు రిపోర్ట్ చేద్దాం, దీంతో వూర్లలో బాలకార్మికులుండరనీ బడికి వెళ్ళని బడీడు పిల్లలూ వుండరనీ, వుండనీయమని కోర్టుకు భరోసా యిద్దాం, ఎట్లాగైనా కోర్టు అక్షింతలు తప్పించుకోవాల, అందుకే వచ్చేవారం జిల్లాలో “సమ్మర్ స్కూల్ ర్యాలీ” ని ఏర్పాటు చేద్దాం, డి. యి. వోనూ, బాల కార్మిక నిర్మూలనా సంస్థ పి. డి. ని, జిల్లా అధికారుల్నీ అందరినీ పిలవండి, మీటింగ్ పెట్టి ఏర్పాట్లు చేద్దాం. . . “
“అలాగే సార్ మీ ప్లాన్ బ్రహ్మాండం సార్, ర్యాలీకి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను సార్, ఆర్యాలీని మొత్తం షూట్ చేయించి ఆ సీడీని కోర్టుకు ఇద్దాం సార్. ఆ ఏర్పాట్లకు ఫండ్ మొబిలైజ్ చేయిస్తా సార్”, సెల్యూట్ కొట్టి శెలవు తీసుకున్న ఎస్పీ అనుకున్నట్లు గానే ర్యాలీ నడూస్తోంది.
నినాదాలు ఆవేడి గాలిలో బరువుగా తేలిపోతున్నాయి. ముందు వరుసలో నడుస్తున్న కలెక్టర్, ఎస్పీ, మేయర్ దశరధరెడ్డీ, వాళ్ల వెనుకగా మిగతా జిల్లా అధికారులూ ఆ వెనుక స్కూలు పిల్లలూ రోడ్డు మీద ఒక ఫర్ లాంగు దాకా వ్యాపించిన బ్యానర్లూ, నినాదాలూ కలెక్టర్ కు పదెడుగుల ముందు నుండీ రకరకాల కోణాల్లో ర్యాలీని షూట్ చేస్తూ ఐదారు వీడియో కెమెరాలు. . . పత్తి చేలొకటి నడుస్తున్నట్లుంది.
కొత్తగా జాయిన్ అయిన ఎ ఎస్పీ చల్లనీళ్ళు బిస్లెరీ బాటిల్ ను కలెక్టర్ కు అందించాడు. ముఖం మీద కొన్ని చల్లుకొని కొన్ని తాగుతూ నిన్నటి సంభాషణను గుర్తు చేసుకున్నాడు కలెక్టర్.
“ఏమైంది సాగర్”
“ఐ హ్యావ్ డన్ యిట్ సర్”
“మీ ఎస్పీకి తెలుసా”
“హి టూ నో యిట్ సర్, ఆయన అయినా ఎంత కాలమ్ దాస్తాడు సర్, హి హాజ్ టూ షో ద అరెస్ట్”
“మీ ఎస్పీ కమిట్ అయ్యాడు. . . ద కర్రప్ట్ ఓల్డ్ బగ్గర్. . . “
“యస్ సర్ కమిట్ అయ్యాడు, పెద్దాయనకు సేవు చేస్తానని ప్రామిస్ చేసినట్లున్నాడు. దట్స్ వై కేసు ముందుకు పోవడం లేదు. నేను వదలను సర్, రేపు ప్రొసెషన్ తర్వాత మీరు అనౌన్స్ చేయొచ్చు అబౌట్ ద అరెస్ట్. . . ”
“వెరీ గుడ్, క్యాచ్ ద ఫెలోస్ అండ్ బ్రింగ్ టుది ప్రెస్ కాన్ఫరెన్స్, ఓకే బట్ బికేర్ ఫుల్ అబౌట్ ద మేయర్ హీ క్లోజ్ రిలేటివ్ టు బిగ్ బాస్”
“యస్ సర్. . . ” ఎస్పీ మీద ఏ ఎస్పీని ప్రయోగించాడు. పాచిక పారుతుందనే నమ్మకంతో వున్నాడు కలెక్టర్.
రెండున్నర కిలోమీటర్ల ర్యాలీ ఐదురోడ్ల కూడలిలో ఆగింది. అక్కడొక సభలాంటిది జరిపి ర్యాలీని ముగించాలని అధికారులు ప్లాన్ చేశారు.
మొదట డియివో ర్యాలీ ముఖ్యవుద్ధేశ్యమూ, కలెక్టర్ గారి ఆకాంక్ష, సమ్మర్ లో జిల్లాలో జరగబోయే సామాజిక మార్పు గురించి మాట్లాడారు.
తర్వాత జిల్లా ఎస్పీ పత్తి చేలల్లో బలై పోతున్న బాల్యాన్ని గురించీ, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం చేస్తున్న చర్యల గురించీ ఏకరువు పెట్టాడు. చివరగా నల్లమేకలపల్లె లో నక్షత్ర, తారలను అత్యాచారం చేసి చంపిన నిందితుడ్ని పట్టుకున్నామనీ , యింకాసేపట్లో ఆ వివరాలు వెల్లడిస్తామనీ ప్రకటించాడు.
ఆ తర్వాత కలెక్టర్ భావోద్వేగంతో మాట్లాడుతూ, దళీతులూ, అణగారిన వర్గాల పట్ల జరుగుతున్న అత్యాచారాల్ని తామెట్లా అడ్డుకుంటున్నదీ వివరిస్తూ “సమ్మర్ స్కూల్ కాన్సెప్ట్” తో ప్రజల్నీ అక్షరాస్యుల్నీ చేసి తల్లిదండ్రుల్లో పిల్లల చదువు పట్ల శ్రద్ధపెంచి, వాళ్లను బాల కార్మికుల్ని చేయకుండా ఆపడానికి వుపయోగపడుతుందని చెప్పాడు.
ఆఖరుగా దశరధరెడ్డి, యి మొత్తం వ్యవహారానికి యితోధికంగా సహాయం చేస్తానని హామీ యిచ్చి, తమ వూర్లో తన అనుచరుని పిల్లలకు జరిగిన అన్యాయాన్ని చేధించిన పోలీసుల్ని అభినందించాడు.
ర్యాలీముగిసింది. స్కూల్ పిల్లలు ఆటోగ్రాఫ్ ల కోసం ఎగబడ్డారు. వాళ్లతోపాటు ఇంటర్, డిగ్రీ పిల్లలు కూడా, కలెక్టర్ చుట్టూ పెద్ద గుంపు, తయరైంది. పక్కనే వున్న మేయర్ దశరధరెడ్డీ ఆడపిల్లలకు ఎంతో ప్రేమగా అడిగి అడిగి ఆటోగ్రాఫ్ లు యిస్తునారు, వాళ్ల తలల మీద అభయహస్తాన్నీ అన్చీ, వాళ్ల భుజాలని తట్టీ, వాళ్ల చెంపల్ని నిమురుతూ. . . .
అది చూస్తున్న కలెక్టర్కు కళ్ళలోకి పత్తిపురుగులు ఎగబాకుతున్నట్లుంది, వొళ్ళంతా తేళ్ళు పారాడినట్లు జలదరింపు.
వెంటనే ఆటోగ్రాఫ్ లు యివ్వడం ఆపేసి, అందరినీ పంపేయండని పోలీసుల్ని ఆదేశించి, మేయర్ని తనతో పాటు తన వాహనం దాకా తీసుకెళ్ళాడు. వాళ్ళిద్దర్నీ ఎస్పీ, ఏ ఎస్పీ అనుసరించారు.
తన సఫారీ వెనుక సీట్లో మేయర్ నికూర్చోమని చెబుతూ,
“సార్ యింకాసేపట్లో మీ ఊరి కేసులో నిందుతుల్ని అరెస్ట్ చేయిస్తున్నాం. . . మీ తమ్ముని కొడుకు. . . ”
“కలెక్టర్ గారు మీ సాహసానికి అభినందనలు, నా తమ్ముని కొడుకు ఎన్. ఆర్. ఐ. కోటాలో ఇంజనీరింగ్, హైదరాబాద్ సిద్దార్ధలో చేరిపోయాడు. మీరు అరెస్ట్ చేస్తున్నది నాకు తెల్సు వాడు బోయ అనుమంత గాడని మా గ్రాసగాని కొడుకు. . . ”
కలెక్టర్ ఆశ్చర్యపోయాడు, ఏఎస్పీ వైపు చూశాడు.
వెంటనే ఎస్పీ కలుగజేసుకున్నాడు.
“బోయ అనుమంత అనేవాడు ఆ రోజు పత్తి చేలో పని చేస్తుంటే ఆడపిల్లల్ని, కాపు గాచి వాళ్ల మీంద బడినాడట సార్, పెద్దపాపను చేస్తుండేది చూసిన చిన్న పాప కేకలు వేస్తుంటే ఆ పాపను కూడా గొంతు పిసికి చంపినాడట అంతా వాడే వొప్పుకున్నాడు, వాణ్ణి అదుపులోకి తీసుకున్నాం. . ”
కలెక్టర్ గొంతు తడారిపోయింది. అక్కడికీ ఆగ్రహంతో గొంతు పెగుల్చుకొని.
“ఎస్పీ గారు ఏం మాట్లడుతున్నారు. మీరు, చెప్పిందేమిటి, ఇప్పుడూ చేస్తున్నదేమిటి. నిందితులు ఇద్దరినీ, ఒకరు పట్టుకుంటే యింకొకడు – యీయన తమ్ముని కొడుకే రేప్ చేశాడనీ కదా తెల్పింది. . . ఏం మాట మారుస్తున్నారే. . . ”
” కలెక్టర్ గారూ మీ ఏఎస్పీ మీకు తప్పుడు సమాచారమిచ్చాడు. కుర్రవాడు కదా తప్పు అంచనా వేశాడు. ఆ రోజు మావాడు వూళ్లో నే లేడు. హైదరాబాద్ లో వున్నాడు. మీకు నిందితుడూ దొరికాడు అంతే. మీరు సమర్ధులైన జిల్లా అధికారి , మీరింకా మా జిల్లాలో రెండేండ్లయినా పని చేయాలా వొద్దా. . . వొచ్చే సోమవారం సీ. యమ్ గారు జిల్లా పర్యటనకు వస్తున్నారు అప్పుడూ మీ పని తీరు గురించి ఆయనకు వివరిస్తా, యింకా మంచి పనులు మీరీ జిల్లాలో చేయాల, యిక్కడ్నుంచీ వెళ్ళాక ముందు ముందు ప్రభుత్వమూ లొ కీలక పదవులు నిర్వహించాలి. అవునా కాదా చెప్పండి, ఇక ఆ పిల్లల తండ్రి కురవ బజారన్న యీ విషయమై మాట్లాడనే మాట్లాడడు. యింక మీకు సమస్యేముంది చెప్పండి, మా వాడు ఆ తప్పు చేయలేదని మీరు నమ్మాల,. మావాడు చదువుకొని సమర్ధుడైన యిండస్త్రియలిస్టో, ఎంటర్ ప్రినరో కావాలనా వొద్దా చెప్పండి, వాడికి
మీ ఆశీస్సులు కావాలి”.
ఎస్పీ వెంటనే కలుగజేసుకొని
“సార్ అన్ని ఎవిడెన్సులూ బోయ అనుమంత చేసినట్లుగానే వున్నాయి. మనం యీ అరెస్ట్ ను రిపోర్టులో కోర్టుకు నివేదించుకోవచ్చు. మనం యాక్షన్ తీసుకున్న వాళ్లం అవుతాం. . . “
“సీ. ఎమ్. పర్యటన ఏర్పాట్ల బాగా చెయ్యండి కలెక్టర్ గారూ, మీకేంగావాలన్నా నా సహకారముంటుంది, ఏ వేళప్పుడైనా పిలవండి అధికార పార్టీ నాయకున్ని సంకోచం పడద్దండి. . . ”
కలెక్టర్ తల వాలిపోయింది. మౌనం అర్ధాంగీకారంగా భావించి,
“చాలా ధ్యాంక్సండీ. . చాలా ధాంక్స్. . ” అంటూ మేయర్ దశరధరెడ్డి, కలెక్టర్ కు షేక్ హ్యాండిచ్చి వెళ్ళిపోయాడు.
సెల్యూట్ కొట్టీ ఎస్పీ సెలవు తీసుకున్నాడు.
పత్తి చేలో రాలిపడ్డ శవాల మీద గాలిలా వాతావరణం బరువుగా వుండిపోయింది.
కలెక్టర్ చేతిపై నుండీ ఒక పత్తి పురుగు కళ్ళలోకి పాకుతోంది. ఆకళ్ళ నుండీ తారా నక్షత్రలు రాలి రాలి వ్యర్ధంగా తెల్లని డెనిమ్ షర్ట్ కి యింకుతున్నాయి. కళ్ళు వొత్తుకుంటున్న కలెక్టర్ కిరణ్ కుమార్ కు బిలబిల కారు దాటుకుంటూ వెలుతున్న పిల్లలు నడీచి వెళ్తున్న పత్తిపూలలా ప్రతి పువ్వు మీద ఒక పత్తి పురుగు పాకుతున్నట్లుగా అనిపిస్తోంది.