Jun2009
మద్ధిస్తం
- వి ప్రతిమ
‘తప్పు చేశాను’. . . . అనేకసార్లు ఈ వాక్యం వివేకానందరెడ్డి మస్తిష్కంలో పదే పదే కంప్యూటర్ స్క్రీన్‌మీదలా నిలిచి మాయవవుతోంది.
కార్తీకమాసపు చలిరాత్రి అతడి నుదటి మీద చిరుచెమట హృదయపు ఆందోళనని బహిర్గత పరుస్తున్నట్లుగా వుంది.
జరిగిపోయిన సంఘటనల గురించి ,చేతిలో నుంచి జారిపోయిన కాలాన్ని గురించి, జీవితాన్ని గురించి వెనక్కి తిరిగి చూసుకోవడం కానీ, పాశ్చాతాపపడ్డం కానీ వివేకానందరెడ్డి జీవిత చరిత్రలో లేదు. . . పారిన నీటికి వంత కట్టే ఆలోచన అతడెన్నడూ చేయడు.
ఎంత పెద్ద అఘాతం ఎదురైనా సరే. . , చేయగలిగిందేమిటా? అని ఆలోచించడమే తప్ప’ ఇలా చేసివుంటే బాగుండదేమో. . అలా మాట్లాడివుంటే సరిపోయేదే అని ఎప్పుడూ మదనపడడు.
ఈ క్షణం మాత్రం ఒక నేరభావన అతడ్ని అతలాకుతలం చేస్తోంది.
శవం దగ్గరి వూదొత్తుల వాసనేదో అతడి హృదయాన్ని చుట్టుకుపోయి ఊపిరితో పాటుగా ముక్కపూటాలలో నుంచి బయటకీ లోపలికీ ప్రయాణిస్తోంది. . . .
దేని మీద దృష్టి సరిగా నిలపడంలేదు.
అతడి కోసం మజ్జిగ గ్లాసు పట్టుకొచ్చిన మంజుల ఆశ్చర్యపోయింది.
చేతిలోని మౌస్ కదులుతోంది గానీ యారో మార్క్ ఏ బాల్‌నూ కొట్టడంలేదు. . . చిందరవందరగా ఒకదానికొకటి సంబంధం లేకుండా కదిలిపోతున్నాయి. అతడి చూపులు స్క్రీన్‌మీద లేవని అర్థమయిందామెకు.
భర్త నలభయ్యయిదేళ్ళ వయసులో పట్టుబట్టి కంప్యూటర్ నేర్చుకున్నాడు.
ఓటర్ల లిస్టు దగ్గర నుంచీ. . . ప్రతీచిన్న సర్టిఫికెట్టు, జీవితబీమా పాలసీలు, బ్యాంక్ కాగితాలు. . . . ఫ్యామిలీ ఫోటోలు అన్నీకూడా అందులో స్టోర్ చేసి పెడతాడు.
ఇటు వ్యాపారము, అటు రాజకీయమూ ఇంకా అనేకానేక ఇతర ఒత్తిడులన్నింటి నుంచీ కంప్యూటర్ ముందు కాసేపు కూర్చొవడం తనకి గొప్ప రిలాక్సేషనని అతడు తరుచూ అంటూంటాడు. . తనకి నచ్చిన ఏదో ఒక ఆటను మొదలుపెట్టి పదేపదే ఆడుతూ గెలుస్తుంటాడు. . . ఓటమినెప్పుడూ చవిచూడడు.
“ ఒక పని చేసేటప్పుడు పూర్తిగా దానిమీదే ఏకాగ్న్రత వుండాలి. ఒకటి చూస్తూ మరొక పనిని గురించి ఆలోచించడం ఒకరితో మాట్లడుతూ వేరొకరితో మాట్లాడాల్సిన విషయాల గురించి మననం చేసుకోవడం సరైంది కాదు” అంటూ అతడు పిల్లలకి చెప్పడం తరుచూగా వింటూవుంటుంది మంజుల.
“ ఏమయింది?” మజ్జిగ గ్లాసు ముందు పెడుతూ అడిగిందామె.
ఆమెకు తెలుసు, నిజంగా ఏదయినా జరిగివున్నా అతడు చెప్పడు.
బయట జరిగినవన్నీ ఏకరువు పెట్టడం కానీ, ఎదుటివారి సలహాలు,సానుభూతి పొందడం కానీ అతడికి అలవాటు లేదు.
అటువంటిది చిత్రంగా చేతికదిలికలాపి మంజులకేసి నిర్భావంగా చూశాడతడు. ఇన్నేళ్ళలో అతడిని అంత బేలగా ఎన్నడూ చూడలేదామె.
ఒకేమాట రెండుసార్లు మాట్లాడ్డం అతడికిష్టముండదు కాబట్టి
“ ఊ “. . చెప్పమన్నట్లు కళ్ళతోనే రెట్టించింది మంజుల.
“ గ్రీష్మని తీసుకొచ్చేద్దాం” అన్నాడతడు హఠాత్తుగా.
దిగ్భ్రాంతితో తలెత్తింది మంజుల.
వసంతకాలపు చిగురింతల మధ్య. . . పారుతోన్న సెలయేరు పక్కన నిలబడి నీటి గలగలనీ,కోయిల కుహుూరావానిన ఒకేసారి వింటున్నట్లుగా చెవులలో అమృతం పోసుకున్నట్లుగా అన్పించిందామెకి.
ఒక్కగానొక్క కూతురు గ్రీష్మకి నాలుగు నెలల ముందు పెళ్ళయింది. డిగ్రీ కూడా పూర్తవకుండానే, పద్దెనిమిదేళ్ళు నిండని,కాఫీ పెట్టడం కూడా చేతకాని గ్రీష్మకి పెళ్ళమిటని నెత్తీ,నోరు బాదుకుంది మంజుల.
వివేకానందరెడ్డి దగ్గరి స్నేహితుడొకరు ఈ సంబంధం తీసుకొచ్చాడు. కావలిలో ఒక గొప్ప రాజకీయనాయకుడి కొడుకు, బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడంటే ముందువెనుకా ఆలోచించకుండా పేరుప్రతిష్టలుంటే చాలునని కోటి రూపాయల కట్నం ఇచ్చి జిల్లా అంతా గొప్పగా చెప్పుకునేలా రంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు వివేకానందరెడ్డి.
ఒక కుటుంబానికి కావాలసిన వస్తువుల కంటే మిక్కటంగా కొని బెంగుళూరులో కూతురి ఇంటిని నింపి,వియ్యాలవారి చేత శభాస్ అనిపించుకున్నాడు. . . అప్పును పదేపదే లెక్కచూడ్డం నచ్చడతడికి.
అయితే పెళ్లయిన పదోరోజు నుంచే అతడి కనపడని హింస అనుభవంలోకి రాసాగింది గ్రీష్మకి. రెండు నెలలు పంటిబిగువున,రెప్పచాటున దాచిదాచి చివరికి వెలుపలి దారి వెతుక్కోక తప్పలేదు.
గ్రీష్మని తీసుకొచ్చేదామని, ఎవరయినా పెద్ద మనుషుల చేత అబ్బాయికి చెప్పిద్దామంటుంది మంజుల. కాదు పరువు ముఖ్యమంటాడు వివేకానందరెడ్డి. ఇద్దరి మధ్య గత రెండు మూడు నెలలుగా మౌనయుద్దం కొనసాగుతోంది.
“ ఉదయం లేస్తే పదిమందికీ న్యాయం చెప్పి పంచాయితీలు చేసే నేను,వేరేవాళ్ళ ముందు నిలబడి నా కూతురికి న్యాయం చేయమని దేహీ అని అడగాలా?, పెళ్ళయిన కొత్తలో ఎవరైనా అంతే. . అడ్జస్టవ్వడానికి కొంత కాలంపడుతుంది వెయిట్ చేయాలి. . ” అంటాడతడు.
ఆడవాళ్ళు మాత్రమే సర్దుకుపోవాలని మంజులకు బాగా తెలుసు. అతడు పెట్టే మానసిక,శారీరక హింసకు కేవలం యాపిల పండ్లతోనూ,టామోటో జ్యూస్‌లతోనూ పెరిగిని గ్రీష్మ సర్దుకుపోవడం సాధ్యమయ్యే పనేనా? తలుచుకున్నా, తలచుకోకపోయినా
కళ్ళు నిండిపోతూనే ఉంటాయి మంజులకి.
అయితే ఇప్పుడు బాధతో కాదు. ,భర్త మాటతో కలిగిన సంభ్రమాశ్చర్యాలతో. . మదిలో గిర్రున తిరిగిన జ్ఞాపకాల వలని పక్కకకుతోసి భర్తకేసి చూసిందామె.
“ తప్పు చేశాను. . తప్పు చేశాను” అంటూ మెల్లగా కుర్చీలోనే వెనక్కివాలి కళ్ళు మూసుకున్నాడతడు. అతడి కనురెప్పల వెనుక పెద్దపెద్ద కనుగుడ్లు అటుఇటు చేపపిల్లల్లా కదలాడుతున్నాయి.
“ నువ్వు నాకు చెప్పిపోయినావా?,పిల్లకాయలకి నాకు వండిపెట్టిపోయినావా?. నిజ్జం చెప్పే. . ” కుడిచేతి చూపుడు వేలును వేగంగా ఆడిస్తూ దబాయించాడు సుధాకర్ పెద్ద గొంతుతో. .
“ అవును వొండిపెట్టేపోయినా. . చిక్కుడు కాయకూర చేసి చారు పెట్టినా. రవణమ్మొస్తే రెండు రూపాయిలు మజ్జిగపొయ్యిచ్చి పెట్టినా. . ,నా శక్తి అదీ. . ” సుజాత కూడా ఏమీ తగ్గలేదు. అసహనంతోనో, ఆవేశంతోనో ఎత్తయిన సుజాత ఎద మరింత ఎగిసిపడుతోంది.
“ సుజాత నువు గమ్మునుండు సుధా ఏదో చెప్పబోతుండాడు చెప్పనీ” అడ్డుకున్నాడు వివేకానందరెడ్డి.
వివేకానందరెరడ్డి ఒకసారి చెప్తే వందసార్లు చెప్పినట్లే.
నోరెత్తడానికి ఎవరికీ ధైర్యం చాలదు.
మనసులో ఏమనుకుందో ఏమో కానీ వివేకానందరెడ్డికేసీ,భర్తకేసి,
నాయుడు,చందయ్య కేసి మార్చిమార్చి చూస్తూ ఎడంచేత్తో పైటకొంగుతీసి
మూతితూడ్చుకొని మౌనంగా ఉండిపోయింది సుజాత. ఐతే అమె కళ్ళు మాత్రం చాలానే మాట్లాడుతున్నాయి. అసలే నల్లగా ఉన్న సుజాత మోహం మరింత నల్లగా మాడిపోయింది.
వివేకానందరెడ్డి మాటలతో సుధాకర్‌కి ధైర్యం వచ్చింది. . హుషారొచ్చింది.
“ నేను ఏమన్లేదు సార్. . నాకు చెప్పకుండా ఇంట్లో నుంచి కాలు బయటపెట్టకూడదన్న. . అంతే దాని మీద మాటలు పెరిగినాయి. . .
అసలది పెళ్ళాం మాదిరి అణిగి పడుండదు సార్. .
వూరికే మాటకి మాట మాట్లాడతాది
నాకు చెప్పకుండా పేటకు దేనికి పోయినట్టు?
ఆడ ఎవరుండారు?. . చెప్పానా నువ్వే అడుగునా. . . ” సుధాకర్‌కి మాట తడబడుతుంది.
ఒకసారి అన్నా అని, ఒకసారి సార్ అని తానేం మాట్లాడుతున్నాడో తనకే అర్థం కావడంలేదు. .
ఇక్కడికి కూడా తాగొచ్చినట్టున్నాడు.
“ నేను సూళ్ళూరిపేటకి ఇంటి పనిమీదే పోయినన్నా.
ఈయనకీ చెప్పేసేపోయిన డబ్బుల కోసం పోయినా. . . ,వాళ్ళన్న చెప్పిన చెప్పుడు మాటలినేసి
నా మీదికి ఒంటికాల్తో లేసినాడు. . లేనిపోని నిందలేసినాడు నామీద. .
“ పొంగుకొస్తున్న దుఖాన్ని పంటి చాటున బింగిపట్టి మళ్ళీ మాట్లాడసాగింది సుజాత. “వాళ్ళన్న నరికెయిరా దాన్ని. . ఎవురడ్డమొస్తారో చూస్తాను. ఓరుమంటే ఆరునెలలువుంటే గావాల జైళ్ళో. . నీకెందుకు నేను తీసుకొస్తా నిన్ను బయటకి. . వివేకన్న వుండేదాక మనకేం బయంలేదు, ఏసేయిదాన్ని” అన్నాడు సార్. . . అంతే ఈ మనిషి ఆపట్నే కత్తెత్తుకుని నా మీదికొచ్చినాడు చంపడానికి. . నేను పరిగెత్తి, పరిగెత్తి రెంఢీధిలవతలుండే ఫారెస్టాఫీసరు శీనన్న ఇంట్లో దూరినా. . ఆయమ్మ తల్లి మాదిరిగా నన్ను కడుపులో దాపెట్టుకుంది. . . రాత్రంతా వొణకతా కూర్చునేవుణ్ణాను. పొద్దన్లేసి యిట్ట పరిగెత్తినా. . మాకు మీకంటే ఎవుండారు చెప్పునా మంచికయినా చెడ్డకయినా. . ” మొగుడు తన మీదికి కత్తితో వచ్చిన సంఘటన అప్పుడే జరిగినట్లుగా భయం భయంగా వొగురుస్తూ చెప్పింది సుజాత. ఆమె ముఖం నిండా చిరు చెమటలు అలుముకున్నాయి.
అస్తమిస్తోన్న అరుణబింబం తాలూకూ కాషాయ ఛాయలా చెమట చుక్కల మీదపడి వింత కాంతులీనాతున్నాయి.
సుజాత గతంలో పేట నియోజకవర్గంలో మహిళా కార్యకర్తగా పనిచేసిన జానమ్మ కూతురు. . ఎండకాలంలో, వానాకాలంలో కొంత వరకూ చదువుకున్నది.తల్లితో తిరగ్నడం మూలంగా జీవితాన్ని చూసింది.చిన్నకుటుంబంలో పుట్టినా మట్టూ,మర్యాద, సంస్కారమూ తెలిసిన పిల్ల.
నెత్తిమీద గింజ నేలబడిన్నాటి నుంచీ మొగ్నుడ్నీ,వాడి తాగ్నుబోతుతన్నాన్నీ,తిరుగ్నుబోతుతనాన్నీ భరిస్తూ వాడిని మార్చుకోవాలనీ పిల్లల్ని మంచిగా చదివించుకోవాలని శతవిధాలుగా ప్రయత్నిస్తోంది.
ఉద్యోగాలు చేసేంత చదువులేకపోవడంతో చాకలి కాలనీలో చీరలమ్మింది.కొన్నాళ్ళు బజ్జీలంగ్నడి పెట్టింది.నలుపే అయినా తీరుగా, పద్దతిగా కన్పించే సుజాతని ఎక్కడ కాలనీ కుర్రాళ్ళు మోహించేస్తారోనని అంగెడెత్తెయించాడు సుధాకర్. ఆ తరువాత టెయిలరింగ్ నేర్చుకుని జాకెట్లు కుడ్తోంది.
‘‘ నాకు మాత్రం కాపరమొదులుకోవాలని ఏమయినా ముచ్చటా సార్.. అట్టా వొదులుకునే దాన్నయితే మీబోటోళ్ళ చుట్టూ తిరిగి నాయుడిపేట నడిధీలో అయిదంకణాల స్థలమూ..కనా కష్టంచేసి రెండంకణాల యిల్లు ఏసుకుంటానా?.. ఇప్పుడు దొంగ్నచేతికిస్తే కూడా రెండున్నరలక్షలు యిస్తారుగ్నదా సార్.., ఇదంతా వొదిలిపెట్టిపోవాలని ఎందుకనుకుంటుండానో మీరే ఆలోచించండి..’’సుజాతకి జీవితంపట్ల చాలా ప్రేమ వుంది.మొగ్నుడి మీద పిల్లల పట్ల అక్కరుంది.
సుజాత చెప్తోన్న విషయాలని లోతుగా లోపలికి తీసుకుని విశ్లేషిస్తున్న వాడిలా మౌనంగా కూర్చుని వున్నాడు వివేకానందరెడ్డి..
సుజాత కట్టుకున్న ఆకుపచ్చ టెర్లిన్ చీర కుచ్చిళ్లని లాగ్నుతూ..
‘‘ అమ్మా…మా…మా’’ అంటూ నిర్విరామంగా అరుస్తోంది నాలుగేళ్ళ భారతి సుజాతికి వూపిరాడనీకుండా.
చేతులు తిప్పుతూ తన పరిస్థితిని విన్నవించుకుంటోన్న సుజాత అసహనంగా ఒక్కటేసింది కూతుర్ని. ఆ పిల్ల గ్నుక్కతిప్పుకోకుండా ఏడుపెత్తుకొన కొంతదూరంలో మామిడి చెట్టుకింద నిలబడివున్న తాత దగ్న్గరికి పరిగెత్తింది.
ఆరుబయట తురాయి చెట్టుకింద వివేకానందరెడ్డి పక్కనే కూర్చునివున్న నాయుడు చంద్రయ్య గ్నబుక్కున్న పైకి లేచాడు.
‘‘ ఏమే.. ఎందుకుమే బిడ్డను కొడ్తుండావు?.. నీ ఆవేశం చూస్తుంటే నువ్వే సుధాగాడ్ని ఏప్పిచ్చేట్టుగా ఉండాది, వాడుత్త అత్తేపాతకుడు. నోరు తెరుస్తుండాడేమొ చూడు.నువ్వెన్ని అడ్డసవాళ్ళేస్తావుండావు? అన్నాడు చేయి చూపిస్తూ.
కృంగిపోయింది సుజాత.
‘‘ అంతేలేన్నా..మీ కట్నే అన్పిస్తాది. ఆడది రీజనుగా మాట్లాడింటే దానికి జవాబు చెప్పల్యాక మీ మొగోళ్ళందరూ యిట్నే అంటారు.మంచయినా..శభ్రయినా. ఆడోళ్ళదే తప్పు… ఏమయినా మా ఆడోళ్ళ బాధ మీకర్థంకాదులేనా.’’చంద్రయ్య మీదికి బుస్సుమంటూ లేచింది సుజాత.
వివేకానందరెడ్డి దవడ కండరాలు బిగిసుకున్నాయి.
సుజాత ఎక్కువగా మాట్లాడ్తున్నట్టన్పిస్తోందతడికి.
తప్పులులెక్కపెట్టుకుంటోన్న శ్రీకృష్ణుడిలా మౌన గ్నంభీరంగా వున్నాడతడు.
‘‘ ఇప్పుడే వంటావు మే అయితే?’’ కొంచెంతానే తగ్గి ప్రశ్నించాడు చంద్రయ్య.
బిగించి వుంచుకున్న మూతిని కొంత సడలించి..‘‘ మీర చెప్పడి ఏం చెయిమంటారో?…నేను చెప్పాల్సింది చెప్పినా..’’అన్నది కోపంగా సుజాత.
‘‘ ఎన్నిటికని పడేది చెప్పండినా ఒకరింటికి పోగ్నూడదు,ఒకరితో మాట్లాడగ్నూడదు,మానాయినొచ్చినా మా అన్నొచ్చినా సరే అన్నంపెట్టగ్నూడదు…బిడ్డల్ని బడికి తీసకపోతే అయ్యవార్లతో మాట్లాడగ్నూడదు,..అంగ్నడికిపోయి శెట్టితో పలక్కూడదు..కుర్చుంటే అనుమానం.. లేస్తే అనుమానం, ఆ ఎమ్మెల్యే మణెయ్య భార్య ఎప్పుడయినా నన్ను వంట చెయిడానికి పిలిస్తాదని,నాతో బాగ్న మాట్లాడతాదని అదొక కోపం, మా అమ్మ వల్ల మీ బోటోళ్ళంతా నాకు పరిచయం.. మీరందరూ తెలియబట్టే కదన్నా ఆ లోను ఈ లోనూ తీసి యిల్లు కట్టుకున్నాను..లేకుంటే నా మొహం ఈన మొహం చూసి గ్నవుర్మెంటోళ్ళు పిలిచి పిలిచి అప్పులిచ్చినారా?..దీనికింత పెదిష్టా?! అందర్లో అని అదొక కోపం. ఇంక అంతకంటే నావల్ల మరేం తప్పు జరిగిందో చెప్పమనండినా చూద్దాం..’’ నిలదీసింది సుజాత చంద్రయ్యనీ,వివేకానందరెడ్డినీ యిద్దర్నీ కలగ్నలిపి.
చాలాసేపు మౌనంగావుండిపోయారంతా..
లోపల్నుండి ప్రసాద్ ‘‘ టీ ’’ లు తెచ్చి అందరికీ యిచ్చాడు.
సుజాత ముందు వొద్దని మళ్ళీ కప్పు చేతికి తీసుకుని మామిడి చెట్టుకిందికి వెళ్ళి ఏడుస్తున్న కూతుర్ని సముదాయించి.,టీ తాగించి.., కాంపౌండ్‌లోనే ఒక మూలగా వున్న కొళాయి వద్దకెళ్ళి ముఖం కడిగి తీసుకొచ్చింది.
‘‘ ఏం సుధాకరా నువ్వేం చెప్తావ్?’’ ప్రశ్నించాడు వివేకానందరెడ్డి.
సుధాకర్ గొంతు పెగ్నల్చుకున్నాడు.
‘‘నేనేం చెప్తాన్నా నువ్వెట్టి చెప్తే అట్ట యింటా.. మొదట్నుంచీ నువు చెప్పిందే కదా యిన్నాను..నువు పంచాయితీకీ నిలబడితే సర్పంచిని చేసినా..,పెద్దాయనని జెడ్పీటీసీ చేసి జిల్లాదాక పంపించింది..,నువు చెప్తేనే కదనా, ఎప్పుడయినా పార్టీ చూసినానా నువు ఏ పార్టీకి ఓటేసి ఎమ్మెల్యేను గెలిపించాలంటే ఆ పార్టీయే.. అడ్డం చెప్పెరుగ్నుదునా!.. చాకలి కాలనీ అయితేమీ.. పొగ్నగొట్టం కాడయితేమి.. నిలబెట్టి ఓట్లేయించే మొగోడు నన్ను కాదని ఎవురుండారో చెప్పునా..నువ్వెట్ట చెప్తే అట్నే..’’కుడిచేయి చూపుడు వేలిని వూపుతూ వూపుతూ నిలదొక్కుకోలేక గిర్రున చుట్టు తిరిగి ధబేల్‌మని కిందపడి లేచి కూర్చున్నాడు సుధాకర్.
కడుపులో ఒత్తుపడ్డాక ముసలితాత భుజాన సోలిపోయిన భారతి తండ్రి వీరంగ్నంతో ఉలిక్కిపడి లేచి మళ్ళీ ఏడుపెత్తుకుంది… సముదాయిస్తూ దూరంగా తీసుకెళ్ళాడు ఏసయ్య సుజాత తండ్రి.
మౌనంగా రెప్పార్పకుండా తనకేసి చూస్తోన్న వివేకానందరెడ్డికేసి చూస్తూ నిల్చున్నాడు సుధాకర్..‘‘నో… యాడికి పోగ్నూడ్దున్నా.. ఇంటోనే వుండి యిల్లు కనిపెట్టుకొనుండాల..పిలకాయిల్ని చూసుకోవాల.. యిల్లా వాకిలీ శుద్దంగా పెట్టాల గ్నమ్మున వొండి పెట్టి పడుండాల.. నేనెప్పినట్టినాల తిరిగి మాట్లాడగ్నూడదు. నేను మొగ్నుడ్ని..మొగోడ్ని..అంతే’’ అప్పటికి తాగింది పూర్తిగా తలకెక్కినట్టుంది సుధాకర్‌కి.
వెక్కుతోన్న భారతిని జోకొడుతోన్న తాత గ్నుండె తడి అయింది.
జానమ్మ బతికున్నప్పుడు ఈ పెద్దపెద్దనాయకులంతా ఎలచ్చన్లొస్తే చాలు తమ యింటికి వొచ్చేవాళ్ళు.. జానమ్మ చేతుల్లో అయిదొందల ఓట్లుండాయని ఆ పార్టీవాళ్ళూ, ఈ పార్టీవాళ్ళూ పదివేలిస్తాం.. ఇరవై వేలిస్తామని ఎర చూపించేవాళ్ళు.
వివేకాంనందరెడ్డి తండ్రి హయాంలో అతడి వెంట తన బృందంతో కలిసి వెళ్ళి రామారావు పార్టీలో చేరింది జానమ్మ.అప్పట్నుంచీ తెలుగ్ను మహిళగా జానమ్మ జిల్లాకంతటికీ తెలుసు.కలెక్టరుతో కూడా పొయి నేరుగా మాట్లాడుతొచ్చేది. ఇప్పుడు బతికుంటే కూతురు కాపురానికీ పంచాయితీ కావొల్చిచ్చేదా? ఈ ఎదవసచ్చినోడు సుజాతని నరకడానికొచ్చింటాడా?..
మామిడి చెట్టుకింద పైగ్నుడ్డపరిచి మనవరాలిని పడుకోబెడుతోన్న ఏసయ్య చెయ్యి వొణికింది.
తల్లి గ్నుర్తొచ్చిందో.. వొంచిపెట్టి పడుండాలన్న మొగ్నుడి మాటలకో సుజాతక్కూడ దుఖం పెల్లుబికింది.
నాయుడు చెంద్రయ్య పైకి లేచి వారించాడు సుధాకర్ని .
వివేకానందరెడ్డి మౌనంగా జరగ్నుతోన్నదాన్ని మనసులోనే బేరజు వేసుకుంటున్నాడు… సమీక్షించుకుంటున్నాడు.
అతడెప్పుడూ అంతే పంచాయితీల్లోఎక్కువ మాట్లాడడు…. ఇరు పక్షాల వారు చెప్పేదీ లతుగా వివరంగా వింటూ
ఆలోచిస్తూంటాడు. ఆచుట్టుపక్కల చాలా పల్లెల్నుండి వివేకానందరెడ్డి వద్దకే మద్యస్తాలకివస్తుంటారు జనం… చాల ఖచ్చితంగా
వుంటుండత తీర్పు….
‘‘ విడిపోవడానికయితే నాదగ్న్గరికి రానవసరంలేదు … కలిసి వుండదానికయితేనే నాదగ్న్గరికి రావాలి… విడిపోవడానికి
పంచాయితీలెందుకు‘‘? చాలా కటువుగా వుండి వివేకానందరెడ్డి గొంతు .
‘‘అద్దీఅట్ట చెప్పన్నా … యిడిపోద్దంటి…యిడిపోద్ది‘‘ చప్పట్లు చరచాడు సుధాకర్‌కి వెకిలిగా నవ్వుతూ.
‘‘రేయినువు గ్నమ్మునుండ్రా…. ‘‘ప్రసాదు సుధాకర్ని పక్కకి లాక్కెళ్ళాడు సుధాకర్‌కి పెళ్ళాం కావాలి. రోజు తాగొచ్చి తన్నడానికీ
నోటిదూల తీర్చుకోడానికి ఒక మనిషి కావాలి…. వంటచేసి యిల్లూడ్చడానికి నమ్మకమైన పనిమనిషి కావాలి….
పిల్లల్ని కనిపెట్టుకునుండడానికో ఆదరవకావాలి…
ఇటువంటి మొగ్నుడ్ని భరించే శక్తి సహనమూ యిక సుజాతకి లేవు.
అతడితో కలసి బతకాలని లేదు సుజాతకి.
పరిస్దితంతా వివేకానందరెడ్డికి బాగానే అర్దమవుతోంది … విడదీస్తే యిద్దరి జీవితాలూ చిందర వందరయి పొతాయేమొ
… పిల్లలు ఎటూగాకుండా పోతారేమొ… కలిసి వుంటే కొన్నాళ్ళకయినా సర్దుకుపోతారని అతడి వుద్దేశ్యం . సుజాత ఆత్మవిశ్వాసం
తెలసి కూడ సర్దుకుపోవడమన్నది ఆమె వైపు నుండే జరగాలని అతడి ఆలోచన కావొచ్చు..
స అయినా సజాత పొరుకులాడ్డం ఆపలేదు. సధాకర్ మీది ఆరోపణలన్నీ సంఘటనలు , సంఘటనలుగా వివరించి
ఎట్టబతకమంటారిట్టాటి భర్తతో కలసి అని నీలదీస్తోంది పెద్దమనుషుల్ని.
‘‘ నిజమే సుజాత వోడు మంచొడని మేము చెప్పడంల్యా. ఈసారికి బెదిరిచ్చి పంపిస్తాము… యింక తాగ్నడు … సర్దుకొని
సంసారం చేసుకోబండి… మాకు మీటింగ్నుండాదిప్పు…పోవాల ‘‘ నచ్చచెప్తున్నట్టుగా చెప్పాడు చంద్రయ్య……
‘‘అందుకేగ్నన్నా యింతకు ముందు రెండుసార్లు మీరు చెసితే గ్నమ్మున యింటి పోయినాను…ఇంక మాంత్ర నేను కలిసి వుండలేన్నా… మీకు చెప్పుకోలేనాటివి కూడ ఎన్నో వుండాయి… సిగ్గిడి చెప్పండా యొంటికే అదోళ్ళని తీసుకోచ్చి నాపడక మీదనే పండబెడ్తాడు… అంటూ యింకా ఏదో చెప్పుబోయి గోంతు కేదోవ్డు అడ్డం పడ్డట్టుగా అయి ఆగిపోయింది సుజాత..
ఎంత దిగ్నమంగ్నుకుందామన్నా అప్పుడప్పుడూ నేమన్నానంటీ బయటపడ్తూనే వుంది. దు:ఖం…సంసారంలో సమస్యలుయిలా అందరిముందూ పరవడం ఆమెని అవమనానికి గ్నురించేస్తున్నట్లుగా వుంది.
ఇదసలు పెద్దవిషయమే కాదన్నట్టుగా నవ్వాడు చంద్రయ్య.
‘‘మే సుజాతా…ఏమొగోడు చెప్పుఈ రోజుల్లో పవిత్రంగా వుండేది?.. అంతా అంతే అందరిళ్ళల్లోవుండేది…దీనికేం నువ్వు పగ్నవబళ్ళే మెగ్నుడూ పెళల్ళాలాన్నా పాట పుట్టిచంటాయి. అయ్యనీల్న బయటి పెట్టికోగ్నూడదు పోయి లచ్చనంగా కాపురం చేసుకోబోంది.టయిమవుతావుందాది.మాకు ‘‘ఇదే అఖరితీర్పున్నట్లుగా పెకి లేచాడు చంద్రయ్య.
దెబ్బతిన్నట్లుగా చూసిందది సుజాత.
ఇంతకంటే రోజూ మొగ్నుడు మాట్లాడే మేలుగా వుండాయి.ఆమెకి ఏంజవాబు చెప్పాలోల అర్థంకాకుండా వుందది.
అసహనంతోనూ, అలటతోనూ. అమానంతోనూ దు:ఖం ముంచుకోస్తోంది.. ఆఏడుపు లోపలికి పోలేకా బయటకి రాలేకా గోంతు లోలోపలే సుళ్ళు తిరుగ్నుతూ మంట పెడతతోంది. ఆమంట గోంతులోంచో కడుపులోంచో, హృదయంలోంచో తెలినట్లుగా ఒళ్ళంతా సెగాలు రేగ్నుతున్నాయి.
మారం చేస్తోన్న భారతిని ఎత్తుకోచ్చి సుజాత చేతికిచ్చాడు తాతా
పాపని హుజనేసుకుని చిచ్చి గోడుతూ గ్నడ్డిగా కళ్ళుమూసుకుంది. కళ్ళల్లో నిండి పోయిన దు:ఖన్ని లోపలికి పంపడానికన్నట్లుగా మామిడి చెగ్న్టు కిందకి నడిచింది. నిల్చుని నిల్చుని కాళ్ళు పీకుతున్నాయి.నిండి నిండిమనసు పీకుతోంది.
‘‘అన్నా నా పెళ్ళాన్ని నాతోగాని పంపిచ్చక పోయినారంటే నేన్నీడ్నే వురేసుకుంటా..నాకు నాపెళ్ళాం కావాల అంతే…..‘‘ఏడవడం మొదలు పెట్టాడు సుధాకర్…
‘‘ పెళ్ళాం కావాల..పెళ్ళాం విరక్తిగా నవ్వుకుంటూ జాలిగా చూసిందతడికేసి సుజాత..
‘‘ మేం పంపిచ్చేదేందిరా..నువ్వే దూరంచేసుకున్నావు ఇట్ల తాగి తందనాలాడితే ఏ పెళ్ళామయినా యింట్లో వుంటాడా?నువు తాగ్నుడు మానకపోతే సుజాత రాదు నీతో.. ఇక్కడే ఏదయినా పనిప్పిస్తా.. వుండి పోతాది.’’ కరిÄనంగా చెప్పాడు వివేకానందరెడ్డి.
‘‘ ఆలుమగ్నల తగ్నవులు ఆరిక కూడువుడికేదాకేనని వూరికే అన్లేదు పెద్దోళ్ళు…అందులోనూ సుధాకర్ మంచోడే..వాళ్ళన్న ప్రమేయం లేకుండా మేం చూసుకుంటాంలే.. రేపు పిల్చి మాట్లాడతా మీ బావతో, నువు భయపడకుండా పో సుజాత, నీ కెందుకు మేముండాం కదా.. వాచీ చూసుకుంటూ రెండడుగ్నులు ముందుకేశాడు చంద్రయ్య.
అప్పటికి వివేకానందరెడ్డి కూడ సర్దుకుంటూ కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు.
‘‘ ఏం సుధా..తీసుకుపో సుజాతని.. ఇంక ఏదయినా నీ మీద కంప్లెయిటచ్చినందుకో వాసిపోద్ది నీకు.. తాగ్నుడు మానెయి.
మీ అన్న మీ యింటిఛ్చాయలకు రాగ్నుడదు…‘‘ గ్నట్టిగా సుధాకర్‌కు వార్నింగిస్తూ రెండడుగ్నులు ముందుకేశాడు వివేకానందరెడ్డి.
మౌనంగా కూతుర్ని భుజానేసుకుని వివేకానందరెడ్డి గానీ నాయుడు చంద్రయ్యకి గాని వస్తానని కూడా చెప్పకుండా తండ్రి రెట్టని ఆసరా చేసుకుని గేటువైపుగా కదులుతోంది సుజాత..
జీవితమంతా అమావాస్య చీకట్లిలోకి కూడా వెలుతురునే చూస్తూ వచ్చిన సుజాత ఆ కాంపౌండ్‌లో మిరుమిట్లు గొలుపుతోన్న నియాన్ లైట్లు వెలుతురులోంచి చీకట్లోకి నడుస్తున్నట్లుగా ఉంది..
వివేకానందరెడ్డికీ చంద్రయ్యకీ వొంగి వొంగి దణ్ణాలు పెడ్తు.
‘‘ లేదన్నా లేదు..రేపుట్నుంచీ తాగ్నడంమానేస్తానన్నా..మీరెట్టా చెప్తే అట్టయింటా.. నా పెళ్ళాన్ని బాగా చూసుకుంటా.. ఆ,,’’
అంటూనే వున్నాడు మళ్ళీ మళ్ళీ వెర్రెక్కిన వాడిలా సుధాకర్ అత్యంత అతి వినయంగా..
‘‘ రేపట్నుండి అన్నపుడే సుధాకర్ని మందలించి వుండాల్సింది.‘‘ప్చ్’’ శవం దగ్న్గర వూదొత్తుల వాసనేదో మళ్ళీ మళ్ళీ వివేకానందరెడ్డి ముక్కుపుటాలలో నుంచి శరీరమంతా పాకి జలదరింపచేస్తోంది.
‘‘ మీరూ మగాళ్ళే కదా వాడు తాగ్నుబోతయినా,తిరుగ్నుబోతయినా మగాడ్నే సమర్థిస్తారు..వాడితోనే కాపురం చేయమని శాసిస్తారు. ఆడదాని గ్నుండె ఎన్నిటికీ అర్థంకాదు మీకు..’’ కసిగా అంది మంజుల.
కట్టికట్టి అటకమీద దాచివుంచిన గాయాల మూటని విప్పుకుంటున్నట్లుగా వుందామె.ఆ భారాన్ని తట్టుకోలేక కాబోలు సుదీర్ఘంగా నిట్టూర్చిందామె.
కొంత సమయం గ్నడిచాక అన్నీ మర్చిపోయి
‘‘ గ్రీష్మని ఎప్పుడు తీసుకొద్దాం?’’ అంది ఆతృతగా
‘‘తీసుకొద్దాం..రేపీ తీసుకొద్దాం మరో తప్పు జరక్కూడదు’’.
‘‘ఊ’’
‘‘అవును మరో తప్పు జరుగ్నకూడదు.. నీకు తెలుసా సుజాత చచ్చిపోయింది…‘‘నేరస్థుడిలా తలవంచుకున్నాడతడు..అద్దిరి పడింది మంజుల.
ఉక్కిపిడికిలితో ఆమె గ్నుండెనెవరో కర్కశంగా పిండినట్టయి తలమీద చేతులాన్చి కుర్చీలో కూలబడిందామె…పల్చటి నీటితెర కళ్ళకడ్డంపడి భర్త,కంప్యూటరూ..మొత్తంగా గ్నదీ మాయమయిపోయినట్టుగాఅన్పించింది.
‘‘సుధా,వాళ్ళన్నా మొన్నటి రాత్రి తాగొచ్చి సుజాత మీద పడ్డారంట.. వాడే చంపేవాడో తనే తనువొదిలేసిందో.. గొంతులోంచి మాట పెగ్నలడంలేదతడికి..
అవమానం నిండిన సుజాత మొహం పదేపదే కట్టెదుటి నిలుస్తోంది.‘‘ నేనే చంపేశాను..న్యాయం చేయాలి.. సుజాతకి న్యాయం జరగాలి..’’లోలోపలే గొనుకుంటూన్నాతడు.
మంజుల శరీరమంతా విద్యుత్తు పాకినట్టయి కొయ్యబారిపోయింది..
వివేకానందరెడ్డిచేతిలో అప్రయత్నంగా కదులుతోన్న మౌస్ నాలుగ్ను వికృతమైన గెద్దల్ని తెరమీదకు తీసుకొచ్చింది.
ethakota subbarao Jun 13, 2009 1
బాగున్నది.మ0చికథ
చదివాము.
…ఈత కొట
geethanjali Jul 14, 2009 2
ప్రతిమ గారి కథ మద్దిస్తం పురుష ప్రపంచం మూసిన తలుపుల వెనకాల చేసే విక్రుతత్వాలన్నీ వెలికి తీయడమే కాక సుజాత సమస్య తీవ్రతని అంతగా అర్థం చేసుకొని వి.రెడ్డి తన కూతురు విషయం కొచ్చే సరికి ఎంత గా కదిలి పోయి సుజాత జీవితం నాశనం అవడానికి, ఆమె మరణానికి తనే కారణం అని కన్ఫెస్ చేసుకోవడాన్ని బాగ విశ్లేషించారు రచయిత్రి. తనను తాను దక్కించుకోవడానికి సుజాత పోరాటం చేసినా బలవంతం గా ఆమెను మల్లీ ఆ కొలిమిలోకి తోసి ఆమె మరణించడానికి కారణం ఐన వి.రెడ్డి తన కూతుర విషయంలో మాత్రం సరైన నిర్ణయం తీస్కున్నా బతకాలని ఆశ పడిన సుజాత మరణం బాధ కలిగిస్తుంది. రాయలసీమ మాండలికంలో కథ బాగుంది.రచయత్రికి అభినందనలు. గీతాంజలి