Jun2009
సినిమాపాటల్లో వాద్యాలు
వెబ్ పత్రికలకు ఉన్నదీ, అచ్చయే పత్రికలకూ లేనిదీ అనిపించే ఒక సదుపాయం ఏమిటంటే ఆడియో శబ్దాలనూ, బొమ్మలనూ, వీడియో లింకులనూ రచనలతోబాటుగా వెబ్ పత్రికల పాఠకులు ఉపయోగించుకోవచ్చు. అయినప్పటికీ వెబ్ రచయితల్లో చాలామంది తెలిసో, తెలియకో ఇవేమీ వాడుకుంటున్నట్టుగా అనిపించదు. కొంతమంది కామెంట్లు రాసే చోటనే తమ రచనలు రాసి పంపవచ్చా అని అడుగుతూ ఉంటారు. వెబ్ సదుపాయాలను గురించి అందరికీ తెలియపరచవలసిన అవసరం కనిపిస్తోంది.
సంగీతం గురించిన వ్యాసాల్లో శబ్దాలనుకూడా పొందుపరిస్తే రచయిత చెప్పేది మరింత బాగా అర్థమవుతుంది. తెలుగువారికి శాస్త్రీయసంగీతంలో ఎంత అభిరుచి ఉందో చెప్పడం కష్టం. అభిరుచి ఉన్నవారిలో వెబ్ పత్రికలు చదివేవారు ఎందరున్నారో తెలియదు. కనీసం సినిమాపాటల గురించి రాస్తున్నప్పుడు కొన్ని ఆడియో లింకులు ఇస్తే చదివేటప్పుడు ఉదాహరణల రూపంలో వాటిని వినడానికి బావుంటుంది. ఆ దిశగా చేసే చిన్న ప్రయత్నమే ఈ వ్యాసం.

ఘంటసాల వెంకటేశ్వరరావు (అష్టపదుల రికార్డింగ్ సందర్భంలో) ఎడమవేపు వెనక ఘంటసాల విజయకుమార్, ముందు హార్మోనియం వద్ద పి. సంగీతరావు, ఆయన వెనక తబలాతో జట్సన్, సితార్‌తో జనార్దన్ (Courtesy: www.ghantasala.info)
ఘంటసాల వెంకటేశ్వరరావు (అష్టపదుల రికార్డింగ్ సందర్భంలో) ఎడమవేపు వెనక ఘంటసాల విజయకుమార్, ముందు హార్మోనియం వద్ద పి. సంగీతరావు, ఆయన వెనక తబలాతో జట్సన్, సితార్‌తో జనార్దన్ (Courtesy: www.ghantasala.info)
సంగీతంలో అనేక వాద్యాలను ఉపయోగిస్తారు. మనదేశంలో నాదస్వరం, వీణ, వయొలిన్, వేణువు ఇలా అనేక వాయిద్యాలు వినిపిస్తాయి. అలాగే డోళ్ళు, డప్పులు, తప్పెటలు తాళవాద్యాలుగా పరిచితాలే. సంగీతకచేరీలకు వెళ్ళని సామాన్యప్రజలకు ఈ వాద్యాలు వినబడేది ప్రధానంగా సినీ సంగీతంద్వారానే. నేపథ్యంలో మోగే పాటల్లో ఈ వాద్యాలు కంటికి కనబడకపోయినా వినిపిస్తూ ఉంటాయి.

మాస్టర్ వేణు
మాస్టర్ వేణు
కలకత్తాలో తయారైన తొలి హిందీ సినిమాల్లో సైగల్ తదితరుల పాటలకు వాద్యాలను తక్కువగా వాడేవారు. సరోద్ నిపుణుడు తిమిర్ బరన్ సంగీతం చేపట్టిన బాలం ఆయే అనే పాటలో ఆయనే స్వయంగా వాయించాడు.

విజయరాఘవరావు
విజయరాఘవరావు
బొంబాయి సినీరంగంలో ఎక్కువ వాద్యాలనూ, అకార్డియన్ మొదలైన కొత్త వాద్యాలనూ మొదట ప్రవేశపెట్టినవాడు నౌషాద్.
తెలుగు సినీరంగంలో వాయిద్యాల విషయం చెప్పుకుంటున్నప్పుడు మొదట గుర్తొచ్చే పేరు మాస్టర్ వేణు. ఆయన స్వయంగా ఎన్నో వాద్యాలు వాయించగలిగేవారు. విజయా సంస్థ షావుకారు సినిమా తీస్తున్నప్పుడు మన దేశంలో మొట్టమొదటి హేమండ్ ఆర్గన్ వాద్యాన్ని కొని ఉపయోగించడానికి కారణం ఆయన నైపుణ్యమే. ఆర్కెస్ట్రా నిర్వాహకుడుగా ఆయన అద్వితీయుడు. ఘంటసాల, రాజేశ్వరరావు మొదలైన సంగీతదర్శకులందరూ ఆయన సహాయం లేకుండా రికార్డింగ్ నిర్వహించే వారుకాదు. కాలక్రమాన ఆయన స్వతంత్ర సంగీతదర్శకుడుగాకూడా పేరు సంపాదించుకున్నాడు.
అలాగే సుప్రసిద్ధ వేణువిద్వాంసుడు ఏల్చూరి విజయరాఘవరావు బహుముఖప్రజ్ఞాశాలి. భరతనాట్యంతో మొదలైన ఆయన కళాజీవితం ఫిల్మ్‌స్ డివిజన్‌కూ, అనేక సినిమాలకూ సంగీత దర్శకుడుగా, సంగీతప్రయోక్తగా, కవిగా, కథకుడుగా అనేక పార్శ్వాలతో కూడుకున్నది. ఆయన అనేక రికార్డింగ్‌లలో వివిధ వాద్యాలను ఉపయోగించి అద్వితీయమైన ప్రయోగాలు చేశారు. ప్రముఖ సంగీత దర్శకుల్లో నౌషాద్, రాజేశ్వరరావు తదితరులు స్వయంగా ఎన్నో వాద్యాలు వాయించగలిగేవారు.
సినీరికార్డింగుల్లో ఆర్కెస్ట్రా నిర్వహణ చూడటానికి కొన్నేళ్ళ క్రితం నౌషాద్ స్వయంగా దూరదర్శన్ కోసం రఫీ చేత పాడించిన దృశ్యాలు పనికొస్తాయి.

ఈమని శంకరశాస్త్రి
ఈమని శంకరశాస్త్రి
మన దేశపు సినిమాల్లో చాలా గొప్ప వాద్యకళాకారులు తమ సంగీతాన్ని వినిపించారు. జెమినీ సంస్థలో సంగీతదర్శకుడుగా పనిచేశాక ఈమని శంకరశాస్త్రిగారు సీతారామకల్యాణం, వెంకటేశ్వర మహత్యం మొదలైన సినిమాల్లో వీణ వాయించారు. సీతారామకల్యాణంలో రావణుడు తన పేగులనే తంత్రులుగా వీణ వాయించే సన్నివేశానికి ఆయనే వాయించారు.

చిట్టిబాబు
చిట్టిబాబు
ఆయన శిష్యుడు చిట్టిబాబు ఎన్నో సినీగీతాలకు వీణ వాయించారు. చిట్టిబాబు వాయించిన అసంఖ్యాకమైన పాటల్లో నడిరేయి ఏజామునోవంటివి ఎన్నో ఉన్నాయి.

ఎం.ఎస్.గోపాలకృష్ణన్
ఎం.ఎస్.గోపాలకృష్ణన్
పూజాఫలం సినిమాకు ఎం.ఎస్.గోపాలకృష్ణన్ వయొలిన్ వాయించారు.

రవిశంకర్
రవిశంకర్
హిందీ, బెంగాలీ భాషల్లో రవిశంకర్ తన సితార్ వాద్యాన్నీ, సంగీతదర్శకత్వాన్నీ అనేక సినిమాలకు అందించారు.

విలాయత్ ఖాన్
విలాయత్ ఖాన్
విలాయత్ ఖాన్ సితార్, సంగీతదర్శకత్వం రెండూ నిర్వహించిన సినిమాలున్నాయి.

బిస్మిల్లాఖాన్
బిస్మిల్లాఖాన్
గూంజ్ ఉఠీ శహనాయీ సినిమాలో బిస్మిల్లాఖాన్ తన కళను ప్రదర్శించారు. తేరే సుర్ఔర్ పాటలో ఆయన అద్భుతశైలి వినబడుతుంది.

పన్నాలాల్ ఘోష్
పన్నాలాల్ ఘోష్
సుప్రసిద్ధ వాద్యకళాకారులు పన్నాలాల్ ఘోష్ మైఁ పియా తేరీ అనే పాటకు వేణువు వాయించారు.

అలీఅక్బర్ ఖాన్
అలీఅక్బర్ ఖాన్
అలాగే మేటి కళాకారుడైన అలీఅక్బర్ ఖాన్ సునో ఛోటీసీ గుడియాకీ అనే పాటకు సరోద్ వాయించారు.
కొంజుం సలంగై (తెలుగులో మురిపించేమువ్వలు) సినిమాలో నాదస్వరం వాయించిన కారుకురుచ్చి అరుణాచలం నీలీల పాడెదదేవా పాటద్వారా మనకు తెలిసిన గొప్ప కళాకారుడు.

హరిప్రసాద్ చౌరాసియా
హరిప్రసాద్ చౌరాసియా
సుప్రసిద్ధ వేణువిద్వాంసుడు హరిప్రసాద్ చౌరాసియా, ప్రఖ్యాత సంతూర్ విద్వాంసుడు శివకుమార్ శర్మలిద్దరూ అనేక సినిమాల్లో వాయించి, కలిసి సంగీతదర్శకత్వంకూడా చేపట్టారు. శివకుమార్ శర్మ తేరేబిన్‌సూనే అనే పాటకు వాయించిన సంతూర్ అందంగా వినిపిస్తుంది.

శివకుమార్ శర్మ
శివకుమార్ శర్మ

రామ్‌నారాయణ్
రామ్‌నారాయణ్
గొప్ప సారంగీ నిపుణుడు రామ్‌నారాయణ్ అనేక సినిమాల్లో వాయించారు. దోహంసోంకా జోడా అనే పాటలో ఆయన శైలి వినబడుతుంది.

కారుకురుచ్చి అరుణాచలం
కారుకురుచ్చి అరుణాచలం

కున్నక్కుడి వైద్యనాథన్
కున్నక్కుడి వైద్యనాథన్

కదిరి గోపాల్‌నాథ్
కదిరి గోపాల్‌నాథ్
కున్నక్కుడి వైద్యనాథన్ (వయొలిన్), కదిరి గోపాల్‌నాథ్ (సాక్సోఫోన్) మొదలైన విద్వాంసులు కూడా సినిమాలకు పనిచేశారు.

ఇమ్రత్ ఖాన్
ఇమ్రత్ ఖాన్
ఇమ్రత్ ఖాన్, రయీస్ ఖాన్ లిద్దరూ సినిమాల్లో సితార్ వాయించారు. ఇమ్రత్ ఖాన్ సితార్ ఢూంఢో ఢూంఢో అనే పాటలో వినవచ్చు.

రయీస్ ఖాన్
రయీస్ ఖాన్
దస్తక్ మొదలైన సినిమాల్లో రయీస్ ఖాన్ సితార్ వాయించిన పాటలు అనేకం.

టి.వి.గోపాలకృష్ణన్
టి.వి.గోపాలకృష్ణన్
మృదంగ నిపుణుడు టి.వి.గోపాలకృష్ణన్ ఇళయరాజాతో చాలా కాలం పనిచేశారు.

అల్లారఖా
అల్లారఖా
సినిమాల్లో తాళవాయిద్యనిపుణులు వాయించిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ప్రసిద్ధ తబలా విద్వాంసుడు అల్లారఖా మొదట్లో ఏ.ఆర్. కురైషీ అనే పేరుతో కొన్ని హిందీ సినిమాలకి సంగీత దర్శకత్వం చేశాడు.

ఉమయాళ్పురం శివరామన్
ఉమయాళ్పురం శివరామన్
శివాజీగణేశన్ నటించిన మృదంగచక్రవర్తి అనే తమిళసినిమాకి ప్రఖ్యాత మృదంగ విద్వాంసుడు ఉమయాళ్పురం శివరామన్ వాయించారు. శాంతారాం తీసిన ఝనక్‌ఝనక్ పాయల్ బాజే సినిమాలో ప్రసిద్ధ తబలా కళాకారుడు శాంతాప్రసాద్ వాయిచారు. ఆయన తబలా నాచే మన్ అనే రఫీ పాటద్వారా అందరికీ పరిచితమే.

శాంతాప్రసాద్
శాంతాప్రసాద్
మల్లీశ్వరి సినిమాకి అంజయ్య అనే ఆయన మృదంగం వాయించారట. పిలచిన బిగువటరా అనే పాటలో ఆయన మృదంగవిన్యాసాలు వినిపిస్తాయి.
ఇటీవలిదాకా లక్ష్మణరావువంటి నిపుణులైన తబలా, పఖ్‌వాజ్ కళాకారులు మద్రాసులో సినీసంగీతానికి వాయించేవారు. రహ్మాన్ సంగీతం సమకూర్చిన చిన్నిచిన్ని ఆశ పాటకు వి. సురేశ్ వాయించిన ఘటం అద్భుతమైన లయను జతచేసిందట.
శంకర్ జైకిషన్ పనిచేసిన సినిమాల్లో నేపథ్యసంగీతానికి అందాలను సమకూర్చిన వ్యక్తి సెబాస్టియన్. అలాగే ఆవారా హూఁ మొదలైన పాటలకు మరపురాని అకార్డియన్ సంగీతం వాయించిన గుడీ సీర్వై మంచి వాద్యనిపుణుడు.
అతన్ని ఆవారా సినిమాలో పార్టీ సన్నివేశంలో అకార్డియన్‌తోసహా చూపారు. అలాగే బార్‌బార్‌దేఖో పాటలోకూడా అతన్ని శమ్మీకపూర్ వెనకాల గమనించవచ్చు.

సజ్జాద్ హుసేన్, మనోహరీసింగ్
సజ్జాద్ హుసేన్, మనోహరీసింగ్
ముత్యాలముగ్గు సినిమాలో నేపథ్యసంగీతానికి మేండొలిన్ వాయించిన సజ్జాద్ హుసేన్ హిందీ సినీ సంగీతదర్శకుడు కూడా. అలాగే బొంబాయి కళాకారుల్లో మనోహరీసింగ్ మంచి సాక్సోఫోన్ నిపుణుడు. పాత తెలుగు సినిమాల్లో హవాయియన్ గిటార్ వాయించిన సుబ్రహ్మణ్యంరాజు మంచి వైణికుడు, సంగీత దర్శకుడుకూడా. ఆయన నైపుణ్యం సా విరహే పాటలో వినవచ్చు.
మనసున మనసై, ఎవరివో మొదలైన పాటలకు వాయించిన మిట్టా జనార్దన్, మహాదేవన్ పాటలకు వాయించిన అహ్మద్‌ఖాన్ మంచి సితార్ విద్వాంసులు. సంగీతదర్శకుడు దేవి శ్రీప్రసాద్ మేండొలిన్ నిపుణుడు. ప్రతి సినిమా పాటకూ కనీసం అరడజను వయొలిన్లూ, ఒకటి రెండు చెల్లోలూ, గిటార్లూ, ఇలా అనేక వాద్యాల సహకారం ఉంటుంది. రకరకాల బెల్స్, రిధ్‌మ్స్ ఉపయోగిస్తారు. వీటన్నిటివల్లా పాట స్వరూపం అందాలను సంతరించుకుంటుంది. మనకు తెలియని నిపుణులు ఇంకెందరు ఉన్నారో చెప్పడం కష్టమే.
జోరుమీదున్నావు తుమ్మెదా వంటి సినిమాపాట బావుండడానికి నేపథ్యసంగీతం తక్కువగా ఉన్నా ఇబ్బంది కలగలేదు.
మరొకవంక ఆ అబ్‌లౌట్‌చలేఁలాగా బ్రహ్మాండమైన ఆర్కెస్ట్రా ఉన్న పాటలూ బావుంటాయి.
సమర్థుడైన సంగీతదర్శకుడికి నేపథ్యసంగీతాన్నీ, వివిధ వాయిద్యాలనూ ఎలా ఉపయోగించాలో తెలుస్తుంది.
గత కొన్ని దశాబ్దాలుగా సినీసంగీతంలో ప్రవేశించిన పోకడలను గమనిస్తే సంగీతవాద్యాల లోని వైవిధ్యం తగ్గిపోతున్నట్టు తెలుస్తుంది. ఎటువంటి శబ్దాన్నైనా కృత్రిమంగా పలికించగల సింతసైజర్లూ, కీబోర్డ్ వాద్యాలూ ఉన్నాయి కనక సినీసంగీతంలో వాటినే ఎక్కువగా ఉపయో గిస్తున్నారు. ఇక తాళవాద్యాల పరిస్థితీ అంతే. ఎందరో నిపుణులైన కళాకారులను కలిసికట్టుగా తర్ఫీదు చేసి, ఒక్కతాటిపై సంగీతసారథ్యం చెయ్యడంకంటే ఎలక్ట్రానిక్ సౌకర్యంతో లయతప్పని నిక్కచ్చి లక్షణాలతో తాళవిశేషాలను కృత్రిమంగా సృష్టించి రికార్డింగ్ పూర్తిచెయ్యడం సంగీతదర్శకులకు సులువుగానూ, చవకగానూకూడా అనిపిస్తోంది. ఐతే ఈ కృత్రిమశబ్దాలు అసలైన వాద్యాలకి సాటి రావని అనిపిస్తుంది. కొన్నేళ్ళ క్రితం సినిమాపాటల పరిస్థితి మెరుగుగా ఉండేది. వాటిలో ఎటువంటి తాళవాద్యాలను ఉపయోగించారో స్పష్టంగా వినబడుతుంది.
సినిమాపాటల్లో తాళవాద్యాల విన్యాసాలు వినడానికి కొన్ని ఉదాహరణలు చూద్దాం. రోజులు మారాయి సినిమాలోని ప్రసిద్ధగీతం ఏరువాకా పాటలో డప్పు వినిపిస్తుంది.

డప్పు (Image courtesy: www.nscottrobinson.com)
డప్పు (Image courtesy: www.nscottrobinson.com)
జగదేకవీరుని కథ సినిమాలో శివశంకరీ పాటలో హిందూస్తానీ శైలిలో తబలా శబ్దం ప్రధానంగా వినిపిస్తుంది.
బుద్ధిమంతుడు సినిమాలో టాటా వీడుకొలు పాటలో బాంగో డ్రమ్స్ వినిపిస్తాయి.
విప్రనారాయణ సినిమాలో రారా నాసామి పాటలో మృదంగం ఉపయోగించారు.

తబలా
తబలా

మృదంగం
మృదంగం

బాంగో డ్రమ్స్
బాంగో డ్రమ్స్
భార్యాభర్తలు సినిమాలో జోరుగా హుషారుగా పాట పల్లవిలో జాజ్ డ్రమ్స్ వింటాం.
అరుదుగా కొన్ని ప్రయోగాలూ జరుగుతూంటాయి. లాహిరిలాహిరి పాటలో ఘటం వినిపిస్తుంది.
నౌషాద్ స్వరపరిచిన మేరా ప్యార్ భీతూహై లో మృదంగం వాడారు.
ప్యాసా సినిమాలో ఆజ్‌సజన్ మొహే పాటలో ఖోల్ అనే బెంగాలీ తాళవాయిద్యం వినిపిస్తుంది.
జానే క్యా తూనేకహీ పాటలో టిక్‌టిక్‌మని మోగే చైనీస్ బ్లాక్స్ వినిపిస్తాయి.
1980లలో జనాదరణ పొందిన ఆప్ జైసా కోయీ పాటలో డిస్కో డ్రమ్స్ వాడారు.
ఇద్దరు మిత్రులు సినిమాలోని ఖుషీఖుషీగా సినిమాపాట చివరి చరణం మొదలయే నేపథ్యసంగీతం వినండి. తాళవాద్యాలు తక్కువగా ఉపయోగించడంతో గాలిలో తేలుతున్న భావన కలుగుతుంది.
తుమ్‌న జానే అనే పాటలో అసలు తాళవాద్యాలే వాడలేదు.
ఇటువంటి ఇఫెక్ట్‌లు సినీగీతాల్లో చక్కగా వాడుకుంటారు. ఇలా సన్నివేశాన్నీ, సందర్భాన్నీ బట్టి సంగీతదర్శకులు రకరకాల తాళవాయిద్యాలని విడిగానూ, కలిసికట్టుగానూ ఉపయోగించుకుంటారు. జానపదగీతాల్లో ఢోలక్, కర్ణాటకసంగీత లక్షణాలకు మృదంగం వాడతారు. ఆధునికసంగీతంలా అనిపించడానికి రకరకాల డ్రమ్స్ ఉపయోగిస్తారు. ఈరోజుల్లో వందలరకాల ధ్వనులు పలికించగల ఆక్టాపాడ్స్ (Octapads) ఉన్నాయి.
ఏ పారిజాతములీయగలనో వంటి కొన్ని పాటలు పద్యాల్లాగా లయ, తాళం లేనివిగా ఉంటాయి.
హిందీ సినీసంగీతపు ఆర్కెస్ట్రాలో ఎన్నో వినూత్న ప్రయోగాలు చేపట్టిన నౌషాద్ ఓ దూర్‌కే ముసాఫిర్ అనే తన పాటలో కోరస్ గొంతుకలనే వాద్యబృందానికి బదులుగా ఉపయోగించాడు.
విజయరాఘవరావు కొన్ని డాక్యుమెంటరీలలో రేడియోలో తలెత్తే ఎలక్ట్రానిక్ ‘ఘోష’ను వాద్యాలకు బదులుగా ఉపయోగించారు.

1. జాజ్ డ్రమ్స్, 2. ఖోల్, 3. ఘటం, 4. చైనీస్ బ్లాక్స్
1. జాజ్ డ్రమ్స్, 2. ఖోల్, 3. ఘటం, 4. చైనీస్ బ్లాక్స్

ఆక్టాపాడ్స్
ఆక్టాపాడ్స్
ఈ వ్యాసంలో ఉదహరించిన పాటలు అందరికీ తెలిసినవే అయినప్పటికీ వాటిని కాస్త శ్రద్ధగా మళ్ళీ వింటే కొన్ని విషయాలు గమనించవచ్చు. మంచి నిర్వహణతో, చక్కని రికార్డింగ్ సౌకర్యాలతో నిర్వహించిన ఆర్కెస్ట్రా వాద్యబృందం సినిమా పాటలకూ, రీరికార్డింగ్ నేపథ్యసంగీతానికీ అందాలను చేకూరుస్తుంది. పాటలకు ట్యూన్లనూ, మధ్యలోని ఇంటర్లూడ్ అంశాలనే కాక వెనకాల సన్నగా మోగే కౌంటర్ మెలొడీస్ జతచేసి మెరుగులు దిద్దుతారు కనకనే మన సినిమాపాటలకు నిండుదనం కనిపిస్తుంది. సినిమాలను మరిచిపోయి దశాబ్దాలు గడిచినా పాటలు మన చెవుల్లో మారుమోగుతూ ఉండడానికి కారణం అదే.
4 అభిప్రాయాలు »ప్రత్యేక వ్యాసాలు, సంగీతం
sarvesh Oct 21, 2009 1
నెను హర్మొనియమ్ నెర్చ్కొవలి ,ఎక్కద నెర్చుకొవలి? ఎవరు నెర్పుతరు ?దయచెసి చెప్పంధి?
Rohiniprasad Oct 21, 2009 2
సర్వేశ్ గారూ,
మీరెక్కడుంటారో చెప్పలేదు!
నాగరాజు రవీందర్ Jun 19, 2010 3
శ్రీ డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారికి నాగరాజు రవీందర్ నమస్కారాలు. ప్రాణహిత జూన్ 2009 లో మీ వ్యాసం “సినిమా పాటల్లో వాద్యాలు” నేను మళ్ళీ ఒకసారి చూద్దామని తెరుస్తే పాటల లింకులు పనిచేయడం లేదు. smaashhits.com పని చేస్తుంది కాని musicindiaonline.com పని చేయడం లేదు. ఎందుకంటే వారు ఈ మధ్యనే ఒక కొత్త వెర్షన్ ను ప్రవేశపెట్టారు. దయచేసి మీరు కొత్త లింకులు అతికించగలరని నా యొక్క విన్నపం.
Rohiniprasad Jun 23, 2010 4
మీరన్నది నిజమే. లింకుల కోసం ప్రయత్నిస్తాను.