Jun2009
నా విస్తరాకు
- నామిని సుబ్రమణ్యం నాయుడు
రామోజీ రావును నేనేడిపించినానా, ఆయన నన్నేడిపించినాడా అంటే చెప్పడం కష్టం. చూడండి – అమాసను మించిన తమాసా.
సందర్భం ఏమిటిదంటే-
నేను ఈనాడు వాళ్ళన్యూస్ టుడే డెస్క్ లో సబ్బెడిటరుగా ఒకటిన్నర సంవత్సరం దాకా తిరుపతి ఎడిషన్లో (పని) చేసినాను. నన్ను పర్మనెంటుగా తీసుకొని ట్రైనింగు ఇచ్చుకోవచ్చునా అనేదాని మింద పది మందితో పాటు హైద్రాబాదులో నాకు పరీక్ష.
ఒక పక్క జ్వరం కాస్తా వుండినా తిరప్తి నుంచి మొట్టమొదటిసారి హైదరాబాదు దిగి ఆ బహుళ అంతస్త్తుల భవనం ఎక్కి పెద్ద పుడుంగి మాదిరిగా పరీక్షకు కూచ్చున్నాను. ఒకటిన్నర సమ్మచ్చరం ఈనాడులో చేసినాను, నేను రాసిన వార్తలు కొన్ని వందలు అచ్చయినాయి, ఆ మాత్రం టెస్టు నేను రాసి వుండలేనా అనేసి టెస్టు అదరగొట్టేసినానని ఇప్పుడు 25 ఏండ్ల తరువాత చెప్పేయచ్చు. కానీ కూడు తినే నోరిది.
టెస్ట్ అంటే ఎట్ట వుంటుందంటే ఇంగ్లీషులో కూడా రెండు వార్తలిచ్చి తెలుగులో రాయమంటారు. ఒకటి రెండు తెలుగులోనే ఇంగ్లీషు టైపు కొట్టి వాటిని తెలుగులో రాయమంటారు. ఇట్లా ఏవో వున్నాయి.
అనువాదం జోలికి అస్సలు పోనేలేదు. గ్యారంటీ ఫెయిల్, ఇంటర్వ్యూ వుండదనుకున్న నాకు ఇచ్చిత్రంగా పాసయినట్టు, ఇంటర్వ్యూకు ఉండమన్నట్టు గోడకు అంటించిన కాగితంలో వుంది. ఈ జానా బిత్తెడు వాడికి వెయ్యేనుగుల బలం వచ్చింది.
ఫుల్ మీల్స్ తినేసి ఎగరేసుకుంటా నా పేరు పిలవంగానే ఇంటర్వ్యూ జరుగుతున్న గదిలోకెళ్ళి రామోజీకెదురుగా చిన్నంతరం, పెద్దంతరం లేకుండా కూచ్చునేసినా.
“ఎమ్మెస్సీ మ్యాథ్స్ చేసి జర్నలిజంలోకి ఎందుకొచ్చావయ్యా?” అనడిగినాడు రామోజిరావు.
కథలూ నవల్లూ రాయొచ్చు అని సార్ అని చెప్తే ఏమొచ్చి చస్తుందో అని, “నాకిష్టం సార్” అనేసినాను.
ఆ గదిలో ఆయనతో పాటు ఎం. వి. ఆర్. శాస్త్రి అని ఒకాయనా, ఇంకెవరో ఇద్దరు ముగ్గురు అధికారులూ వున్నారు.
“ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరూ?” అనడిగినాడు రామోజీరావు ఆయనకేదో పెద్ద తెలియనట్టు.
పేరు ఘనంగా ఉంది గాబట్టి నేను, “నీలం సంజీవరెడ్డి. ” అనేసినాను పుసక్కన.
ఆయన మొహం చూస్తేనే నాకు అర్థమైపోయింది. ఆన్సర్ చీదేసినట్టుండాదని.
తరువాత ఆయన నాకు రెండో చాన్స్ ఇస్తున్నట్టు, చానా ఈజీ ప్రశ్న వేసినాడు.
“ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి రాజధాని ఏది?” అంటూ.
నాకు వొళ్ళు పొగలు బొయ్యింది. పేరుకిఎమ్మెస్సీ అయినా ఆర్ట్స్ లో, జి. కె. లో మరీ అంత పూర్ ఏం కాదులే అన్నట్టు,
“అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ హైద్రాబాదే సార్. ” అన్నాను.
ఆయన దాదాపుగా బిత్తర పోయినాడు.
“అదేందయ్యా, కర్నూలు మనకు రాజధాని కదా అప్పట్లో!” అన్నాడాయన,
ఇదేందిరా ఖర్మా అని సన్నాగా వొణుకు ప్రారంభమై పోయింది నాలో.
“మన రాష్ట్రానికి జిల్లా లెన్ని?” అన్నాడు వున్నట్టుండి.
నేను సెకను కూడా ఆలోచించకుండా 22 వుంటే 23 అనో, లేదా 23 వుంటే 24 అనేసినాను. ఇప్పటికీ ఎన్ని జిల్లాలున్నాయో నాకనవసరం.
ఆయనెంత దయగల మనిషంటే నిజంగానే, “ఏమయ్యా, జిల్లాలూ వాటి కేంద్రాలూ అన్నీ చెప్పెయ్. నీకు వుద్యోగం ఇస్తానమ్మా. ” అన్నాడు.
నేను రాష్ట్రం మొత్తం మీద పన్నెండు జిల్లాలు మాత్రమే చెప్పగలిగినాను.
ఇంటర్వ్యూ సభ్యుల్లో రామోజీరావు తప్ప మిగతా అందరూ ” ఈ గాడిద కొడుకుని పంపించేయండిక. ” అన్నట్టు చూస్తున్నారు నన్ను.
రామోజీరావు మాత్రం నన్ను వొదలడం లేదు.
“ప్రకాశం జిల్లా ముఖ్య పట్టణం చెప్పు పోనీ!” అన్నాడు.
నేను మొహం వేళ్ళాడేసుకొని నీళ్ళు తాగినాను.
నెల్లూరుకి నెల్లూరే, చిత్తూరికి చిత్తూరే అన్నట్టు ప్రకాశానికి ప్రకాశమే కదా అని తల దించుకుని నంగినంగిగా”ప్రకాశం పట్టణం” అన్నాను, మచిలీ పట్టణం మాదిరిగా ఆ వూరూ వుండకపోతుందా అని.
అక్కడున్న వాళ్ళంతా ఎంత నవ్వు నవ్వినారో చెప్పలేను.
ఆ ఇంటర్వ్యూ మొదలైన 5 నిమిషాలల్లోనే నేను ఫుట్ బాల్ అయిపోయినట్టు నాకు తెలస్తా వుంటే గదా.
రామోజీ రావు ఎవరితోనో అన్నాడు.
“చూడయ్యా, పీజీ చేశాడు. ఇతని స్టాండర్డ్ చూడు. ఇంత ఘోరంగా వుందా ఇప్పుడు ఎడ్యుకేషన్?
ఒనండాఫ్ ఇయర్ ఇతను ఈనాడులో పనిచేయడమేంటసలు? తిరప్తి ఎడిషన్ వాళ్ళకు లైను కలుపు” అనేసి నాతో జాలిగా, అవిటి కొడుకుని చూసినంత దయగా, “మీదేవూరమ్మా!” అన్నాడు.
“మిట్టూరు సార్. “అన్నాను.
“బాగా రిమోట్ ఏరియా నా?” అన్నాడు.
దైవసాక్షిగా రిమోట్ ఏరియా అంటే తెలీక, “అంటే ఏందిసార్, ఏమంటారు సార్ మీరు” అనడిగినా.
“సారీ అమ్మా. వెళ్ళు” అనేసి పంపించేసినాడాయనా.
ఆ ఇంటర్వ్యూ గదిలో నుంచి ఈనాడు బయటికి రోడ్డు మీదికి ఎట్లా వచ్చినానో కూడా తెల్లా నాకు.
- ఇదంతా నేనిప్పుడెందుకు చెప్పినట్టు? సాక్షి పత్రికలోకొచ్చి ఈనాడు పెద్దాయన్ని పలచన చేద్దామనా? ఈ యెక్క నామిని సుబ్రహ్మణ్యం నాయుడుగారిని ఆ యెక్క రామోజీ ఎట్టా మిస్ చేసుకున్నాడో చూడండి అని చెప్పుకుందామనా? ఇదే అవితే నా కళ్ళిప్పుడే పోతాయి!
ఎందుకోసరమని చెప్పుకున్నానంటే – నా పతంజలి ప్రభువు ఈ చేపలు పట్టుకునే చెంగణ్ణి, “నాయుడు గారూ!” అని పిలిచి నా వెనకాన రండి అని నన్నెత్తుకొని భుజాల మింద పెట్టుకొని మోసినాడని చెప్పుకోవడానికి!
ఇప్పుడు టీవీ 5 ని చూసే కొమ్మినేని శ్రీనివాసరావు అప్పుడు పతంజలి కింద పని చేసేవాడు. “ఈనాడు”లో. శ్రీనివాసరావు కింద ఇప్పుడు విశాఖపట్నంలో టీవీ 9 విలేఖరిగా వున్న శశాంకమోహన్ కింద నేనుపని చేసేవాడ్ని. నెలకు 300 రూపాయల జీతం మీద.
ఒకసారి రాత్రి 9 గంటలకు దాకా నన్ను వడేసి పట్ట్టుకొని నాకేమాత్రమూ వినబుద్దికాని గోగోల్ ఓవర్ కోటు మీద వుపన్యాసమిచ్చి,” నాయుడు గారూ సైకిలెక్కండి. ” అని సైకిల్ మీద కూర్చోబెట్టుకుని ఇంటికి తీసుకుని పోయినాడు భోజనానికి పతంజలి.
అన్నంలో వుల్లగడ్డల కూర కలుపుకుని” వుల్లగడ్డలు చానా బాగుండాయి సార్. ” అని తింటూవుంటే, ప్రమీలమ్మని పిలిచి, “నాయుడు గారు నువ్వు చేసిన బంగాళదుంపల కూర భలే ఉందని మెచ్చుకుంటున్నాడు ప్రమీ!” అన్నాడు.
ప్రమీలమ్మా, పతంజలీ పడీ పడీ నవ్వుతుండారు.
“ఏం సార్, దీంట్లో అంత నవ్వేదానికి ఏముండాది! వుల్లగడ్డల కూర బాగుండ కూడదా ఏంది?” అన్నాను.
” నాయుడు గారూ! మీకొక తమాషా చెప్పనా? ఇది వుల్లగడ్డల కూర కాదోయ్. మాంసాన్ని ఖైమా చేసి వండింది!”
అన్నాడు ప్రమీలమ్మ ను చూపిస్తూ.
“ఇది చియ్యల కూరా! పొండి సార్. మాంసం కూర అంటే తునకలు తునకలుగా ఉంటుంది. ఇదేంది ముద్ద మాదిరిగా! ఆమెని చెప్పమనండి ఇది మాంసం కూరేమో!” అన్నా. మొగుడూపెళ్ళాలు మళ్ళీ నవ్వేదానికి పెట్టుకున్నారు.
పతంజలి ఇంట్లో తినేదాకా మాంసం కూరను అట్లా ఖైమాచేసి తింటారని నాకు తెల్వనే తెల్వదు.
ఇదట్టా పెడితే, సందేళ డ్యూటీలో ఉన్న నన్ను టీకి పిల్చి రోడ్డుపక్క గుడిసె దగ్గరకి తీసుకెళ్తాడా- మూడు గంటలు నాలుగు గంటలయినా ఆఫీసులోకి ఆయన రాడు, నన్ను పోనియ్యడు. టీలూ, సిగరెట్లూ, సాహిత్యం!
“సార్. నేను పనిజేసేది మీ కింద కాదు. మీ కింద కింద కింద మూడు కిందల కింద పని చేసేవాడిని గదా. వాళ్లేమన్నా అనుకుంటారు సార్. రండి ఆఫీసులోకి పోదాం!” అని అంటా నేను ఉంటే ఆయన, “ఇప్పుడు నాయుడు గారూ, చెహోవ్ జీవితాన్ని శుభ్రంగా గడపాలని కోరుకున్నాడు. కానీ ఆయన చచ్చిపోతే ఆయన శవం గుడ్స్ లో ఉప్పుచేపల మధ్య ప్రయాణించాల్సి వచ్చింది. లైఫ్ లో ఉన్న ఐరనీ” ఇట్లా ఏవో మాటలు! (ఆయనకేం, ఎడిషన్ ఇన్ ఛార్జి , పనంతా ప్రకాష్ చూసి పెట్టేస్తాడు. )
“ఐరనీ అంటే ఏంది సార్”? అంటూ నేను. ఆయన అర్ధం చెప్పేవాడూ. పాపం కొమ్మినేని శ్రీనివాసరావు ఎందుకో నన్ను తమ్ముడూ!”అనడం తప్ప ఇంకోమాట అనేవాడు కాదు.
“సార్ లేటయ్యింది. పతంజలి వదిల్తే గదా!” అంటూ పనంతా అయిపోయినాక ఆఫీసుకెళ్తే అప్పుడు శ్రీనివాసరావు,
“తప్పు తమ్ముడూ! పతంజలి గారు అనాలి” అనేవాడు.
పతంజలి ఒక సారి, ” నాయుడు గారూ! “ఖాకీవనం” అని నేనొకటి రాశాను. ఇదేమైనా చదివి నాతో ఏమైనా చెప్తారా?” అని “చతుర” పుస్తకాన్నొకసారి ఇచ్చినాడు.
నేనొక రోజులో చదివేసి, “ఏమన్నా అర్ధం ఉండాదా? మీకేమిటికి పోలీసోళ్ళతో! ధూ నాశనం. దరిద్రంగా ఉండాది సార్. మీ ఊరోళ్ళ గురించి ఏమన్నా రాయండి బాగుంటాది. ” అనేసినా.
“నాయుడు గారూ! ఒక్కడన్లేదీ మాట. మనకు జనాలలో మంచి పేరు తెచ్చిందోయీ యీ పుస్తకం!” అన్నాడాయాన. ఎప్పుడైనా కులుకు ఎక్కువైపోతే “ఓయీ ఓయీ” అనడం ఆయన వాడిక.
ఆయనకు టాల్ స్టాయ్ అంటే పిచ్చి. పిచ్చి అనేపదం కంటే ఉమాదం అనే పదం వాడడం మంచిది.
ఒకసారి నన్ను పట్టుకొని టాల్ స్టాయ్ గొప్పతనం చెప్పేదానికి కుచ్చునేసినాడు. గంటకాదు, రెండు గంటలు కాదు, మూడు గంటలు కాదు. ఒక రోజంతా ఇల్లు దగ్గరున్నా మెస్ లోనే భోజనం ఇద్దరమూ. ఆయనా స్నానం చెయ్యలా, నేనూ చెయ్యలా. ఆయన టాల్ స్టాయ్ “ఆరడుగుల నేల” కథ నాకు మొత్తం పూస గుచ్చినట్టు చెప్పినాడు.
నేను పొగురుగా ఒకేమాట అన్నాను.
“ఆయనంత చెత్త రచయిత ఈ భూమండలం మీద ఇంక పుట్టడు సార్. ఇదా మీరు చదువుకున్న చదువు? నన్ను చదువుకోమనే చదువు?” ఈ మాట నా నోట్లో ఉండంగానే ఆయన చెయ్యిపైకి లేచింది నా చెంపమీద పడేదానికి.
ఒక్క కథ కూడా అచ్చుకాని వాడికి అంత పొగురు ఉండకూడదనేది ఆయన ఉద్దేశం. ఉండాలనేది నా ఉద్దేశం. నేనూ ఏంతగ్గలా! “కొట్టండి సార్ పర్వాలేదు. ఈ ఆరడుగుల నేల అనేది ఎట్లా మంచి కథో చెప్పండి వింటా. అది ఏరకంగా చెత్త కతో నేను జెప్తా విందురు” అన్నాన్నేను కుదురుగా, ఆయన సిగరెట్లనే కాలస్తా.
“అది ప్రపంచంలోనే గొప్ప కథ. ఆయనంత పరిశుద్ధమైన రచయిత మరోడు లేడు. రష్యన్ సాహిత్యం, ప్రపంచ సాహిత్యం మీకు బొత్తిగా తెలియదు” అనేసి అన్నాడు ఆయన.
“అది ప్రపంచంలోనే చెత్త కథ. తగ్గించుకొని నేను చెప్పేది వినండి. నేను చదువుకోలా. మేథ్స్ లో వచ్చే సిన్స్, ఫ్రం, దేర్ఫోర్, వై బికాస్ ఇట్టాంటి పదాలకు మించి ఇంగ్లీషు నాకు రాదు. మీరొకసారి టాల్ స్టాయ్ ని వుద్దేశించి ఆయనో కౌంట్ అని అంటే కౌంట్ అంటే లెక్కించడం కద సార్. ఆయన్ని నేనిక్కడ లెక్కించేది అని అడిగిన్నాకొడుకుని నేను. మీరు నన్నప్పుడు ఎగతాళి చెయ్యకుండా కౌంట్ అంటే వందలాది ఎకరాలున్న ప్రభువు అని అర్ధం చెప్పినారు. గుర్తుండాదా? వందలాది ఎకరాలు ఉన్నవాడూ, వ్యవసాయాల్ని గుర్రాలమెద తిరిగిచెయ్యించేవాళ్లూ మాత్రమే రాసే కథ అది. నాకు మాదిరిగా రెండెకరాలే ఉండి, దానికి తోడు ఒక అన్న కూడా ఉన్నవాడు ఆ కథ రాయనే రాయుడు. చచ్చినాక ఆరడుగుల నేలచాలు సరే , బతికున్నప్పుడా ! ఈ భూమండలాన్నంతా జనాభాతో భాగించేస్తే పాయింట్ల తరువాత వచ్చేనేల కూడా కావాల నాకు. మీరు రాజు, ఆయన ప్రభువు. ఇద్దరూ దొందూ దొందే!”
ఆ రోజు నాకొచ్చింది చూడూ కోపం. చంద్రబాబు మీద వైఎస్ మండిపడ్డాడూ అని పత్రికల్లో రాస్తారే అట్లా నేను టాల్ స్టాయ్ మీద మండి పడ్డాను. ఇంకా నేను ఏం వాగానంటే “మీరు టాల్ స్టాయ్ దే ఇంకో చెత్త పుస్తకం ఫాదర్ ఫెర్గ్యూసన్ గురించి చెప్తిరి. అది ఇంకా చెత్త. భూమిని వేలంలో పాడుకొని క్షేమంగా ఫెర్గ్యూసన్ ఇంటికొస్తే టాల్ స్టాయ్ కేం తీపా? కానీ ఆయన రానియ్యడు. అదే మాదిరిగా టాల్ స్టాయ్ దే ‘అన్నాకెరీనినా’ – రైలుకింద పడి కుక్క చావు చచ్చినట్టు ఆ నవల గెంటల కొద్దీ చెప్పినారు. లంజరికం చేసినంత మాత్రాన ఆ ఆడమనిషి అట్లాంటి చావు చచ్చి పోవాల్నా? నీతేంది సార్, నీతి దరిద్దరంగా. . . ! ఇట్టాంటి వన్నీ బూములు బావులు పుష్కలంగా ఉన్నవాళ్లు తప్ప లేనివాళ్లు రాయరు సార్. మీరు చెప్పండి దాస్తోవిస్కీ ఇట్టాంటి చెత్త ఏమన్నా రాసినాడా? ఆయన నిత్య దరిద్రుడని మీరే చెప్తిరి. ఆయన చచ్చినా రాసుండడు. ఇంకా ఏ రష్యన్ రచయిత అన్నా బీదా బిక్కీకి ఇట్టాంటి శిక్షలు వేసుంటే చెప్పండి చూద్దాం ఆ టాల్ స్టాయ్ ప్రభువు తప్ప”. తోటకూర కాడ మాదిరిగా ఆయన అట్లానే మెడ వాల్చేసినాడు, నాతో ఏగలేక.
నేను దేశదేశాల సాహిత్యాన్ని చదువుకోలేదని ఆయనకు పెద్ద బాధ. నాకు ఇంగ్లీషు పుస్తకాలిచ్చేవాడు చదవమని చెప్పి. నాకు ఒక వాక్యంలో అన్ని పదాలకూ అర్ధాలు డిక్షనరీ చూసి తెలుసుకున్నా ఆ వాక్యం అర్ధమయ్యేది కాదు. నాకొక సారి కోపమొచ్చేసి, “సార్, నన్నుగాని ఇంగ్లీషు పుస్తకాలిచ్చి చదువుకోమంటే మీమొకం కూడా చూడను” అన్నా. ఆ తరువాత నన్నెప్పుడూ ఆయన” ఇంగ్లీషు పుస్తకాన్నిచ్చి చదువుకోండి నాయుడూ గారూ” అని అననే అనలేదు.
టాల్ స్టాయ్ మీద చర్చ జరిగినాక ఒక రోజు, “నాయుడు గారు! మిమ్మల్ని మెప్పించేది ఒకటి రాయాలని మహా దురదగా ఉంది. మీ ఊరి వాళ్ళమీద మీరొక పెద్ద కథా, మా ఊరోళ్ళమీద నేనొక పెద్ద కథా రాద్దాం. నాలుగే నాలుగు రోజుల్లో రాసెయ్యాలి. ఇద్దరం రాసేసి “చతుర”కు పంపిద్దాం. ” అని సవాలేసినాడాయన.
నేనూ కూచ్చున్నా , ఆయనా కూచ్చున్నాడు.
నేను “పాలపొదుగు” అనేది రెండు రోజులలో రాసినా, పతంజలి “రాజుగోరు” అనేది నాలుగైదు రోజ్లకు రాసినాడు. ఒకరిదొకరం చదువుకున్నాం. ఆయనొకేమాట అన్నాడు.
” నాయుడు గారూ! మీరు మీ కథనిఎట్టి పరిస్థితుల్లో ఎడిటరికి కూడా అర్థం కాకూడదనీ, అది అచ్చుకాకూడదనీ రాశారు. నేను ఇది ఎలాగైనా అచ్చైపోవాలని రాశాను. అదీ తేడా!”
“రాజుగోరు” నవల రాయక ముందు ఆయన రాసిన కథలన్నా, ఖాకీవనం నవల అన్నా నాకు పట్టేవి కావు. “రాజుగోరు” నవల ఎంత గొప్పదంటే అలమండలో పుట్టీపెరిగిన వాడు తప్ప మరో నరమానవుడు రాయలేని పుస్తకమది. రావిశాస్త్రి ఎక్కడా తొంగి కూడా చూడడు.
ఆయనా ,నేనూ ఇద్దరమూ చతురకు ఎయిర్ పార్సిల్ లో పంపించినాము. ఖచ్చితంగా మూడో రోజు కే చతుర ఎడిటర్ చలసాని ప్రసాదరావు నుంచి నాది తిరిగొచ్చేసింది. “రాజు గోరు ” నవలకు యాక్సెప్టెన్స్ కార్డు కూడా నా కథ తిరిగొచ్చిన ఎయిర్ పార్సిల్ లోనే వచ్చింది.
చలసాని ప్రసాదరావు కు పాపం చెముడు. దాన్ని దృష్టి లో పెట్టు కొని పతంజలి ఏమన్నాడంటే ,”నాయుడు గారూచెవిటి మేళానికి పాలపొదుగు సొగసు అర్దమవుతుందా?”అనేసి అన్నాడు.
ఆ టయింలో “పాలపొదుగు” ను చదివిన ప్రకాష్ కూడా అక్కడే వున్నాడు. ఆయన పతంజలి తో ,”ఏంటండీ! వేషాలేస్తున్నారా ?”రాజుగోరు” అచ్చుకాకపోవడమేమిటి? పాలపొదుగు అచ్చు అవడమేమిటి? నాయుడు గారిని మీరు పొరపాటున నాయుడు గారు నాయుడు గారు అని అంటున్నారు. ఆయన నాయుడుగారు కాదు, సైనాయుడు గారు. సైనేడ్ వేసుకున్న వాడు రుచీ పచీ చెప్పలేక చస్తాడు గదా. అలాగే మన సైనాయుడు రచనను జనాలు చదవ లేరు చస్తారు” అన్నాడు.
ముప్పూటలా నన్ను పోషిస్తూ కూడా ప్రకాష్ ఆ మాట ఎందుకన్నాడంటే – నేనేమైనా రాస్తే అది ఎవరికైనా అర్ధమవ్వాలి కదా అనే పేపరు భాషలో భయాందోళనలతో!
ఈనాడులో వుద్యోగం పోయింది గదా. ఇంక మా వూరికెళ్లి పోయినాను. రెండు మూడు రోజులు వూర్లో, మూడు నాలుగు రోజులు ప్రకాష్ వాళ్ల ఇంట్లో.
“నాయుడు గారూ! రేణిగుంటలో ఒక స్కూలు పెట్టకూడదూ! లక్షలు సంపాదిద్దురుగానీ! ” అన్నడొకసారి పతంజలి.
“మీ గురువు రావిశాస్త్రికి మించి రచయిత అయిపోదామని గదా గుల!” అని అన్నా.
ఇంతలో దాసరినారాయణరావు “ఉదయం” పేపరు పెట్టడం ఆయన అక్కడకు – ఆ దరిద్రపు హైదరాబాదుకు వెళ్ళిపోవడం జరిగింది.
నేనొకసారి మావూరి నుంచి రేణిగుంట కొచ్చి ఆయన్ని కలిస్తే, “నాయుడుగారూ రడీగా వుండండి, నేను ఉదయానికి వెళ్తున్నాను. మీకక్కడ ఉద్యోగం చూస్తా వచ్చేద్దురుగానీ. ” అని సామాను తో పాటు లారీ ఎక్కేసినాడు.
ఆయన హైదరాబాదుకు పోయిన కొంత కాలానికి నాకు ఉత్తరం.
“నాయుడు గారూ! అర్జంటు. వచ్చేయండి చార్జీలకు డబ్బులున్నాయా? వెంటనే వచ్చేయండి. ”
నేను వెంటనే బయలుదేరేసి, “పతంజలి స్వామీ! రెండేండ్లు పని చేశాక టెస్టు పెట్టి ఇంటర్వ్యూ చేసేస్తాడు దాసరి నారాయణ రావు. రామోజీ రావు ఇంటర్వ్యూ చాలు నా బతుక్కి. ఇంగ్లీషుతో ఇంటర్వ్యూలతో నేను వేగలేను. నేను తిరిగి వెళ్ళిపోవాల్సిందే గదా” అన్నా హైదరాబాదు వెళ్ళి ఆయన సీటు ముందు కూర్చోని.
నిజంగా సిగరేట్ ఫ్యాక్టరీ పక్కన వుండిన ఆ ఉదయం రేకుల షెడ్డులో నేను సొర్గాన్ని చూస్తిని. మహామహులు అ ఉదయంలో వున్న సబ్ ఎడిటర్లు. అంబటీ సురేంద్రరాజు, గుడిహాళం, మురళీ, రామ ప్రసాద్, ఇప్పటి ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్, కె. ఆర్. మూర్తి, ఇప్పుడు ప్రెస్ అకాడమీ చైర్మన్ అయిన దేవులపల్లి అమర్, ఇప్పటి లాయర్ మాడభూషి శ్రీధర్, మహామహులు అని ఎందుకంటున్నానంటే ప్రతి గన్నయ్య చేతిలోనూ దెయ్యం మాదిరిగా ఒక ఇంగ్లీషు పుస్తకం. నీషే అంట, ఆక్టోవియాపజ్ అంట, కంఠస్తం పెడితే తప్ప నోరు తిరగని పేర్లు.
అక్కడ వులిక్కిపడాల్సింది ఏమంటే ఆడపిలకాయలు కూడా భలే చదువుకున్న వాళ్లే. ఒక్క చిన్న వూరి నుంచి వచ్చిన నాకు ఇది విచిత్రమే. మృణాళిని, ఇప్పటి ఆంధ్రజ్యోతి ఫీచర్స్ ఎడిటర్ వసంతలక్ష్మి, సత్యవతి.
అందరిలోకీ అ ఆఇఈలు రాంది నిజంగా నాకొక్కడికే. నాకున్న ఒకే అర్హత నా యెనకన పతంజలి కొండ.
అందరూ ఇంగ్లీషు వచ్చిన వాళ్ళ సరసన ఈ గులకరాయిని కూచ్చోబెట్టేసినాడు పతంజలి.
ఏం మంత్రం వెశాడోగానీ నాకు ట్రైనింగు కూడా లేదు. దేవీప్రియ కింద “ఆదివారం ఉదయం”లో పడేశాడు. నాతో కూడా అంబటి సురేంద్ర రాజు. నాకు దేవీ ప్రియ ఎప్పుడైనా ఇంగ్లీషు వ్యాసం ఇచ్చి తెలుగు చేసెయ్యమంటాడేమోనని వుచ్చ. సురేంద్రరాజు వుండాడులే అని ధైర్నం. అంత టెంసం పగవాడికి కూడా వద్దు.
ఉదయం పదిరోజుల్లో ఇంక ప్రారంభమవుతుందనంగా పతంజలి, ” నాయుడుగారూ! ఇట్లా ఎడిటర్ గారి దగ్గర కొస్తారా ఒక మాటు ” అని పిలిచుకుపోయాడు. కాబిన్ లోకి పోయి ఎడిటర్ ఎ. బి. కె. ప్రసాదుకి నమస్తే చెప్పి నోర్మూసికొని గమ్మునుండాను.
“చూపులకు అట్లా వుంటాడు గానీ మన ఎడిటోరియల్ స్టాఫ్ మొత్తానికీ తెలివైన వాడు. ఇతని గురించి నాకు మొత్తం తెలుసు. మీరు ఇతనికి ఒక కాలమ్ ఇస్తున్నారు, ఇతను రాస్తున్నాడు. ఇతనితో మీరేం మాట్లాడక్కర్లేదు. నాయుడు గారూ! మీరొక కాలమ్ ప్లాన్ చేసుకోండి. బుధవారం బుధవారం మీరు కాలం రాస్తున్నారు. ” అని అన్నాడు పతంజలి.
సబ్ ఎడిటర్లలో అందరికీ నాకేంది? కాలమేంది? ఇట్లాంటి విచిత్రాలు కూడా జరుగుతాయా అని ఆ అజామాబాద్ అంతా ముక్కున వేలేసుకునే పనే.
ఇంక అంతే. ఎడిట్ పేజీని వసంత లక్ష్మి చూశేది. నేను ఎడిటర్ కి కానీ, పతంజలికి కానీ, ఎడిట్ పేజీ చూసే వసంతకి కాని, ఏరోజూ నేను రాసింది చూపించేది లేదు. కంపోజ్ చేయించి నేను బ్రోమైడ్ తీసుకుని ఇచ్చేవాణ్ణి.
ఆరు వారాలు పచ్చనాకు సాక్షిగా. . రాసేసరికి పతంజలి నాకొక వుత్తరం చూపించినాడు. “నాయుడు గారూ!
నమస్కారమండీ మీ దగ్గర జాగ్రత్తగా వుండాలండోయీ. ఎక్కడికో వెళ్ళిపోయేటట్లున్నారు. మమ్మల్నిగుర్తుంచుకుంటారా?” అని అంటా.
వుత్తరం చూస్తే అది ఏమ్వీఎల్ ది.
“నేను ముఖ్యమంత్రినైతే మూడేళ్ళేమి ఖర్మ ఎప్పుడూ ఒ నామినినే విద్యాశాఖామంత్రిగా పెట్టుకుంటా” అంటూ – నేను రాసిన “మూడేళ్ళూ విద్యాశాఖామంత్రినే!” అనేది చదివి – రాసిన ఉత్తరమది. అప్పట్నుంచీ “ఈనాడు ముందు వెళ్తుంటే అబ్బో నేనెంత పొగరుగా ఆ బిల్డింగును చూసేవాణ్ణో చెప్పలేను.
పత్రికల్లో పని చెయ్యాలంటే జిల్లాలెన్నో తెలియాలనా? వాటికి ముఖ్య కేంద్రాలు తెలియాల్నా? రామోజీరావూ! పత్రికల్లో పని చెయ్యాలంటే ఏమె తెలియఖ్ఖర్లా! ఒక్క పతంజలిలాంటివాడు వెనకానవుంటే చాలు, చిటికేసినంతలో ప్రఖ్యాత రచయితా అయిపోవచ్చు, జర్నలిస్టూ అయిపోవచ్చు! అని తమాషాగా ఈనాడు ముందు నిలబడీ నోరు తెరచి అనే వాణ్ణికూడా.
నాకు ఊపిరాడేది కాదు. ఆంధ్రదేశం మొత్తం మింద నక్క తోక తొక్కిన రచయిత ఎవరన్నా వుంటే అది నేనే!
నాబట్టా అని రాస్తే అది అచ్చుఅయిపోయేది. లంజా అని రాస్తే అది అచ్చయిపోయ్యేది. ఇంతలో నాకు పెండ్లి కుదిరింది.
“నాయుడుగారూ! మీకు సొంత పెళ్ళాం ఒకటీ, సొంత పొయ్యి ఒక్కటీ, ఇంకా సొంత కలం ఒకటీ!” అని వెక్కిరించే వాడు.
నేను హైద్రాబాద్ లో పతంజలి ఇంట్లో తిన్నన్ని సార్లు మా అత్త గారి ఇంట్లో అయినా తిని వుంటానా! ఎన్ని నీసులు ? ఒకటా రెండా?
కోడి గుడ్డును అర్దం చేసి అన్నకూ తమ్ముడికి పెట్టని తల్లి మా జిల్లా లో లేదు నాకు తెలిసి.
మా చంద్రబాబుకు,రామ్మూర్తికి కూడా మా అమ్మణ్ణమ్మ కోడిగుడ్డును సగం చేసి పెట్టిన తల్లే!
కాని పతంజలి రాజు. ఆ ఇంట్లో ఎన్నెన్ని వుంటాయి అంటే కోడి గుడ్లూ,కోడి కూరా ,పొట్టేలి కూరా ,చేపలూ,నెండ్రకాయలూ!
నాకు పెండ్లై నాలుగు నెలలు అయిందో లేదో వున్నట్టుండి మా అక్క చచ్చిపోయింది. వూరికే తేలు కుట్టి. ఆరోజు విరిగి పోయిన నడుములు ఇప్పటికి కుదురుకోలా. మా అమ్మ, మా నాన్న,మా అక్క వదలి పెట్టిన రెండేండ్ల పసి పాప.
నాకు తెలిసినంతలో 1984 చివర్న ఉదయం మొదలైందనుకుంటా. ఒక పక్క పచ్చనాకు సాక్షిగా. . . . .
ఇంకో పక్క పాల పొదుగు అచ్చవుతా ఉండాయి. అనవసరంగా పేరు. పది రూపాయల కష్టానికి నూటాపది వచ్చేస్తున్నట్టు. బలే బలే చదువుకున్నవాళ్ళ మధ్య ఏమీ చదువుకోని నేనే హీరో.
మాఅక్క చావుతో ఆ మత్తంతా పోయింది. “ఉదయం”లో పనంతా అయి పోయినాక ఇంటి కొచ్చి మా అక్క లేని మా అమ్మని ,మా నాన్నని ,ఆ పసి బిడ్డని తల్చుకొని తల్చుకొని బోల పొనుకొని ఎడ్వడం! ఇట్టాంటిరాతల వల్ల ఏమైనా ఈ చావు సంభవించిందా అని ఒకటే మనేద. రుచిగా ఏమన్నా తింటావుంటే ఈ తిండి ౩౦ ఏండ్ల వయసుకే మా అక్కకు లేక పాయనే అని దిగులు. నా మొకం చూసి ,పతంజలే ఒకసారి ,”అవునండీ. నాయుడుగారూ చచ్చింది మీ అక్క గారా ,ఇంట్లో వుండే నీ కొత్త పెండ్లి కూతురా ?”అని తిట్టినాడు.
కాని మేం బతికింది అట్లా! మా అమ్మా, మా అక్కా నేను ముగ్గురమూ ఒకరి కొంగులు ఒకరం పట్టుకొని తిరిగినవాళ్ళం.
ఇంతలో ఆంధ్ర జ్యోతి హైద్రాబాద్ ఎడిషన్ పెట్టినారు. ఎ. బి. కె. నన్ను దాంట్లోకి రమ్మన్నాడు. పతంజలికి ఎట్లా చెప్పాలో అర్ధంకాలా.
పిల్లి మాదిరి ఆయనకెదురుగా కూర్చొని, “సార్. రెండు నిమిషాలు నోరు తెరవకుండా నేను చెప్పేది వినండి. నన్ను ఎబికె జ్యోతి కి రమ్మన్నాడు. నేను పోతున్నాను. ఇక్కడ నాకు ఏం కొదవ అని అక్కడకి పోతా వున్నట్టు చెప్పండి. ఆంధ్రజ్యోతి వాళ్ళు తిరప్తిలో కూడా తొందరలో ఎడిషన్ పెడతారంట. నన్నక్కడికి పంపిస్తానని కూడా ఎబికె మాటిచ్చినాడు. నేను రేణిగుంటలో ఉద్యోగం చూసుకుంటా మావూళ్ళోనే కాపురం వుండి నా తల్లి దండ్రులకు ఆ పసి బిడ్డకు తోడుగా వుండి పోతాన్ సార్ ” అని బొరో మని ఏడ్చేసినా.
నావి మరీ నంగి ఏడుపులు అని ఆయన ఆత్మలో కూడా అనుకోని వుండడు. గానీ అప్పటికీ ఆయన ఒప్పుకోలా.
“నాయుడు గారూ! మీ తీరే నాకు విచిత్రంగా వుంది. నోరు మూసుకొని హైద్రాబాద్ లోనే వుండండి. తిరప్తి వద్దు. మీరక్కడికెళ్ళి ఏం చేస్తారు ? ఇక్కడి అవకాశాలు అక్కడ వుండవు. జర్నలిస్టులకు ఇక్కడ స్థలాలిస్తారు. బాగా రాసుకోవచ్చు. ఇంకేం మాట్లాడొద్దు. ఆ పాప ని ఇక్కడికి తెచ్చేసుకోండి. ఇక్కడ సాక్కుందురు చక్కగా! లేచెళ్ళి పని చూసుకోండి. “ఇదీ ఆయన వాటం.
నేను నేరుగా ఆంధ్ర జ్యోతికొచ్చి ఎ. బి. కె. ను కలసినా. ఎ. బి. కె. నన్ను తీసుకొని జ్యోతి యమ్. డి. జగదీష్ ప్రసాద్ కేబిన్ లోకి వెళ్తుండగా “సార్ ఇంటర్యూ ఏం చేయడు గదా సార్ ఆయన! రెండు సెకన్లలో నన్ను బయటికి పంపించేయండి”. అని అన్నా.
“నువ్వురారా మగడా “అని ఎ. బి. కె. నాచెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళి జగదీష్ ప్రసాద్ తో ,”రే అబ్బాయ్ జగదీషూ! చాకు లాంటి వాడు. నీకు తెలీదులే. ఉదయం నుంచి పట్టు కొచ్చేశా” అన్నాడు.
జగదీష్ ప్రసాద్ నా బిత్తర చూపుల్ని భరించలేక, “కూర్చోండి” అని అంటూ వున్నా యజమాని ముందు కూర్చోవడం ఎందుకులెండి అని మర్యాదకు పోయినట్టు యాక్సన్ చేసేసి పట్టూ పరుగు!
నేను జ్యోతిలో చేరిన సంగతి చెప్పాలంటేనే భయమేసేసింది పతంజలికి. ఒకరోజు ఆలస్యం చేసి పెద్ద తప్పు చేసి రెండోరోజు ఆలస్యం చెయ్యలేక చేసేసి మూడోరోజు పతంజలి ఇంటికి పోయ్ చెప్పేసినా.
“నాయుడు గారూ మీరు ఎన్ని ఏడుపులు ఏడ్చినా ఇది అన్యాయం, మీ ఖర్మ” అని ఆయన అంటా వుంటే నేను తలొంచుకుని జారుకుంటా వుంటే, “సొంతంగా ఉద్యోగం కూడా సంపాదించడం ఏమీ బాగా లేదండీ నాయుడూ గారూ!” అని ఎత్తి పొడిచినాడు.
ఆంధ్రజ్యోతి ఆఫీసు బంజారాహిల్స్ లో నేనుండేది శంకరమఠం దగ్గర. అయినా ఇల్లు మార్చలా. పతంజలిని మాత్రం ఇంటికెళ్ళి అప్పుడప్పుడూ కలిసే పనే.
అట్లా ఏడెనిమిది నెలలయ్యిందో లేదో తిరుపతి జ్యోతి ఎడిషన్ ప్రారంభమైంది. మా వూరొచ్చేసినా.
1987 మొదట్లోవొచ్చేసిన వాణ్ణి ఆయనకొక జాబు రాసుంటే వొట్టు. 1988 లో మా నాయన చచ్చిపోయినాడు. మా అమ్మ మా అక్కను తల్చుకోని ఏడ్చే వాటం చూస్తే ఆమె కూడ చచ్చి పోతుందని భయమేసి దేముడి సత్యానికన్నట్టు సినబ్బ కతలు, మిట్టూరోడి కతలు, ముని కన్నడి సేద్యం వొరసబెట్టి రాసేసినా. 1991 లో మా అమ్మ ఇప్పటి పతంజలి వయసంతలోనే చచ్చి పూడిసింది. ఇదేందిరా 85 లో ఒకరు, 91లో ఒకరా. . అని దిగులు. 1994లో నేను చచ్చిపోతానేమో ఒకవేళ అని బిత్తర. 94 దాటినాక నాకు కాసింత వూపిరాడింది. ఎగతాళి చేసినట్టు సొంత రచనలు ఇన్ని చేసినా పుస్తకాలు అచ్చయిన కబుర్లు చావు కబుర్లు కానీ ఆయనకు ఫోను చేసి కానీ జాబు రాసికానీ చెప్పిన పాపాన పోలా. దీన్నంతా ఆయన కృతఘ్నత అనుకునేవాడో ఏంకర్మో!
1988 ఆగస్టులో నాకు ఆంధ్రజ్యోతి వీక్లీకి హైదరాబాద్కు ట్రాన్స్ ఫర్ అయింది. అప్పట్లో నేను గడపతొక్కింది రెండే ఇండ్లు. ఒకటి పతంజలిదీ, రెండు తోట వైకుంఠానిదీ.
పతంజలి ఇంటికి పోయి, సిగరెట్టు ముట్టిస్తూ, “సార్. వీక్లీకి ఈ హైద్రాబాద్కు వొచ్చి చచ్చినా. ఏమన్నా రాయండి సార్” అనడిగినా, పద్కొండేండ్ల తరవాత ఆయన మొకం చూసి.
“ఆ సిగరెట్టు అక్కడ పారేస్తారా నాయుడుగారు! సొంతంగా సిగరెట్టొకటీ!” అని ఆయన ఎగతాళి. చేతిలో ఉన్నదాన్ని పారేయించి ఆయనిచ్చిందాన్ని తాగనిచ్చాడు.
చివరకు ఆయన వీక్లీకి రాసిందేమంటే “పతంజలి ఆయుర్వేదం”. వారం వారం ఒక పేజీ. అడ్రసూ, ఫోన్ నెంబరూ ఇచ్చి కింద వేయమన్నాడు. అందువల్ల ఆయన డిక్షనరీలోనే లేని బిజినెస్సు అనే పదం వాడి అది పెరుగుతుందన్నాడు.
ఆయన చెప్పినట్టే వేసినా. మూడు వారాలయ్యే సరికి మా ఎం. డి నన్ను కిందికి రమ్మని పిలిపించినాడు.
“అదేంది నామినీ! ఎవరో ఆయుర్వేదం డాక్టరుది అడ్రసూ, ఫోన్ నెంబరు వేస్తున్నావంట. తీసెయ్” అనేసి అన్నాడు. నేను దీనికి జగదీష్ ప్రసాద్ ఎదురుగుండా కుర్చీలో చక్కాముక్కాళ్లు వేసుకుని కూర్చొని, “చూడండి సార్. ఆయన ఆయుర్వేద వైద్యుడూ కాదు పాడూ కాదు. పతంజలి. ఇక్కడ తిరుగులాడే జర్నలిస్టులందరి కంటే పనోడు. ఆయననే వోడే లేకపోతే నేననే వోడే మీఎదురుగా కూర్చొన్ని వుండను. మీరంటూ ఉంటారు చూడండి “నామినీ ఇది నా ఆబ్లిగేషను” అని. అట్లా ఆ పేజీ నా ఆబ్లిగేషను” అనేసి అన్నా.
ఎం. డి తలకాయ గీరుకొని, “నిన్నెవురన్నా ఆపేజీ తీసేయ్ మని అంటే అట్లాగే అని అంటూ అది వేస్తూనే ఉండు. నాతో మాట్లాడినట్టు వాళ్ళతో మాట్లాడొద్దు. సరేనా?” అన్నాడు.
నేను సరే అని చెప్పి ఒకాయన చెప్పినా, రెండాయన్లు చెప్పినా ఆ పేజీ పతంజలి రాసినాన్ని వారాలూ వేస్తూనే వున్నా. జగదీష్ ప్రసాద్తో చెప్పి ఆ ఆయుర్వేద పేజీకి ఆయిదారు వేల రూపాయల చెక్కొకటీ! దాన్నిచ్చేప్పుడు నేనెంత సిగ్గు పడినానో పతంజలి అంత పొంగిపోయినాడు. కుడుమిస్తే పండగనే వెర్రి మారాజు.
సరే, ఆంధ్రజ్యోతిని మూసేసినారు. 2001 జనవరి 1 న ముందూ వెనకగా నాకు ఇంటికి సీ సుబ్బారావూ, పతంజలీ ఫోను చేసినారు.
“ఏమోయి నాయుడు గారూ! ఆంధ్రజ్యోతిలో మీకెంతిచ్చీ వోరు ఏటి?” అంటూ పతంజలి.
“12 వేలు సార్” అన్నాన్నేను.
“నేను నెలనెలా 15 ఆరేంజ్ చేస్తా. చెప్పాపెట్టకుండా తిరుపతికెళ్లిపోతే అక్కడికొచ్చి తన్నేయగలను. ” అనేసి ఆయన. రాజు గదా, కోటలు దాటే మాటలు. ఆయనే ఆయన్ని మోసుకోలేక ఎన్ని అగచాట్లు పడినాడో అందరికీ తెలుసు. నన్ను మోస్తాడంట. అదాయన గుణం.
“నేరుగా ఇంటికొచ్చేయండి” అని ఒక రోజు ఫోను. నేరుగా ఇంటికెళ్లిపోతే “అవునోయ్ నాయుడుగారూ! మీకు మన రామకృష్ణారెడ్డి తెలుసుగదా” అనేసి అన్నాడు పతంజలి.
ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గురించి కాసింత చెప్పాల. మామూలుగా జర్నలిస్టులంతా వీలైతే కట్డ్రాయర్లో పెట్టుకుని సిగరెట్లు కాల్చేస్తూ వుంటారు. ఈ రామకృష్ణారెడ్డి పతంజలి నాణ్యంలో 10% వున్నవాడు కూడా. నన్నాయన “ఏమబ్బా నామినీ!” అనేవాడు. నేను ఆయన్ని “ఏమబ్బా కేప్ స్టెన్” అనేవాణ్ణి. ఇంతకుమించి మేమిద్దరం ఒక ముక్క మాట్లాడుకున్న పాపాన పోలా. ఇప్పుడీయన “సాక్షీ”లో ఏదో పొజిషన్లో వున్నట్టు వింటూనే వున్నా.
బాపూ రమణా, వైఎస్సు కేవీపీ అని స్నేహాల గురించి చెప్తావుంటారు కదా, పతంజలి నాతో అన్నదాన్ని బట్టి ఇది మూడో జంట. పతంజలీ రామకృష్ణారెడ్డి. ఇంతకంటే నేను చెప్పలేను. ఈ రామకృష్ణారెడ్డి సాహిత్యం గురించి ఎప్పుడూ మాట్లాడంగా కూడా నేను వినలా. రామకృష్ణారెడ్డి అప్పట్లో పతంజలితో కంటే కూడా మోహన్ తో, ప్రకాష్ తో తిరిగేవాడు జాస్తిగా. పతంజలి “సాహితీ వైచిత్రి”కి కూడా రామకృష్ణారెడ్డి మూర్చపోయింది లేదు. పతంజలి అమాయక చక్రవర్తి అని నమ్మిన రామకృష్ణారెడ్డి పతంజలిని కడదాకా భుజాల మీద ఎత్తుకుని తిరిగినాడు.
రామకృష్ణారెడ్డికి నా గురించి చెప్పి యాభయ్యో, లక్షో పెరికి నాకు కొంచెం వూపిరాడేటట్టు చేద్దామని పతంజలి నన్ను ఇంటికి పిలిపించిన కథ.
“నాయుడు గారూ! మన చేతినిండా టీవీ సీరియల్స్ ఉన్నాయి. వాటినన్నిటినీ మీకు చూపిస్తా. మీరు రాయాలి మీకు నెలకు 25 వేలు, అడ్వాన్స్ 50 రామకృష్ణారెడ్డితో చెప్పి!” అన్నాడు.
నాకు ఏకకాలంలో అన్ని అవయవాలకూ చెమట్లు పట్టేసినాయి. అమ్మో! ఇప్పుడీయన టీవీ చూపిస్తాడా! “సార్, ఊపిరుంటే వుప్పమ్ముకుని బతకతా” అని అనబోతున్నానో లేదో, “నాయుడు గారూ గాభరా పడకండి. అత్తో కోడలో ఒకటుంటుంది. అది దేనికో ఒక దానికి టీ ఇస్తుంది. ఆ టీ ఉప్పగా వుందని విసిరి కొడుతుంది! దట్సాల్. ఒక్క వారం అయిపోతుంది. నోర్మూసుకోని మీరు రాస్తున్నారు. ” అనేసి అన్నాడు.
“సార్, నేనక్కడ రాస్తాను సార్ అవన్నీ. ” అనేసి అన్నాడు.
“రేయ్ నంజికొడకా. పైకి లెయ్ రా. ప్రపంచ సాహిత్యాన్నంతా చదువుకున్న వాడినిరా, మార్క్వెజ్ అంటే స్పెల్లింగ్ రాదు నీకు, నేను మేధావినా నువ్వు మేధావివా? నేను రాయంగా లేంది నువ్వు రాయలేవు ఆ ఆడంగి రాతలు. అప్పటికి నేను ఆడంగి రాతలు రాసే వాణ్ణన్న మాట. ఆహాహా వోహోహో! అబ్బో! బాగా పొగరు పట్టిందే! భార్యాబిడ్డల కోసం నానా చంకలూ నాకాలండీ. లైఫ్లో ఐరనీ అంటే ఏంటనుకున్నారు. తన్నేవోడు లేకపోతే సరి. ” అనేసి తిట్టీనాడు.
నేను నవ్వతానే వుండిపోయినా.
ఆ తరువాత రెండు మూడు సార్లు ఆయన ఫోన్ చేసినా పిలకాయల చేత లేడని చెప్పించేసి, పిల్లల స్కూల్ల సీజను అయిపోయినాక 2001 జూన్ కంతా తిరప్తికి తిరిగొచ్చేసినా. 2004 లో అనుకుంటా. ఆయన సెల్లు నెంబర్ సంపాయించి సోక్రటీసాయిన సెల్లు నుంచి ఫోన్ చేసినా. ఎందుకంటే ఒక వారమంతా “కె ఎన్ వై పతంజలి రచనలు” అనే పుస్తకం చదివి.
ఆయన్ని సంతోషపెట్టాలని చెప్పి నాలుగు వేలకు డి. డి. తీసి కొరియర్ చేసి “సార్, గెలుపు సరే. . బతకడం ఎలా? ఆ ఎగతాళి పుస్తకాల్ని కొన్ని పంపించండి. ” అంటే అయిదో ఆరో పంపించి ఫోన్ చేసినాడు.
” ఏమోయి నాయుడుగారూ! డి. డి. లు కాదు నాకావలసింది. మీ నుంచి నాకు అంకితం ఎప్పుడోయీ ! ఒక్క పుస్తకం కాని నాయుడు గారూ, నాకు అంకితం ఇవ్వకపోయారో పురుగులు పడిపోతారు” అని మాట్లాడినాడు.
ఆ తరువాత ఆయన ఫోను చేసింది లేదు. నేనూ చేసింది లేదు.
“సాక్షీ” ఎడిటర్ అయిన అయిదారు రోజుల్లో ” నాయుడు గారూ! నేనిప్పుడు ”
సాక్షికి ఎడిటర్ నోయీ! మీరు వైఎస్ నయినా సరే తిడుతూ ఒక కాలమ్ రాయాలి. దొంగమాటలు మాట్లాడకూడదు. మీరు ఏమి రాస్తే అది అచ్చు అవుతుంది. నా మాట వినండి. మీరు రాయాలి. నేను రాస్తున్నాను అని చెప్పండి. చెప్పండి. నా ఎడిట్ పేజీలో మీ కాలమ్ లేకుండా ఏమిటి నాన్సెన్స్. నాయుడు గారూ! మీరు రాస్తున్నారు. ఎప్పుడు రాస్తున్నారు. పంపించండి. మీరు రాస్తున్నారు. . ”
ఆయన బతికుండంగా ఇదంతా రాసి సంతోషపెట్టాల్సిన ఈ దొంగముండాకొడుకు ఆయన చచ్చిపోయినాక రాసిందిదీ!
బంద్ల మాధవరావు Jun 1, 2009 1
నామిని గారూ పతంజలి గారు గుర్తుకు వచ్చి కళ్ళమ్మట నీళ్లు తియిగాయి సార్. ఒక 20ఏళ్ళ చరిత్ర కళ్ల ముందు నిలిపారు. కృతజ్నతలు.
chavakiran Jun 2, 2009 2
జీవితం.
GURRAMSEETARAMULU Jun 8, 2009 3
నామిని గారికి
మీ గ్నాపకాలు గొప్పవి …..
పతంజలి ని బాగా అంచనా వీయగలిగిన0దుకు
……….
Kumar Jun 8, 2009 4
నామిని గారూ,
ఇది పతంజలి గారికి నేను చదివినంతలో అతి గొప్ప నివాళి.కళ్లు చెమర్చాయి.
Thanks,
Kumar
kcube varma Jun 8, 2009 5
మా అలమండ రాజుగారి ఐరావతమంతటి హుందాతనాన్ని, దయాగుణాన్ని, వ్యక్తిత్వాన్ని గొప్పగా అవిష్క్రించారు సార్, మీకు నా పాదాభివందనములు.
naresh nunna Jun 17, 2009 6
Dear Editorial Echelons of Pranahita,
I was/ am fortunate enough to go through Namini Subrahmanyam Naidu (sorry for my Sanskritised spelling)’s tribute, ‘Naa Vistharaaku’, to K N Y Patanjali, immediately the demise of the writer.
Now, probably, thousands of Internet browsers, particularly the browsers of ‘Pranahita’ must also be opportune enough to read so.
Rather confining the text to narrow frames of obituaries/ homage, I call it an indigenous theme with native, original narration. I supposed with a notion that Namini mourns the death of Pathanjali. My notion was torn into pieces. I understood that the text moves beyond the indigenous theme and successfully depicted the saga of indigenous heritage of Campesino of Mittur (Rayalaseema)- Namini.
In that 30- reel mega film named Naa Vistharaaku, Namini is the protagonist, superman, star, idol and champion. Patanjali is only a junior artist (not even a guest-role). The hero leaves the countryside and obtains a masters degree, but contemplates and also achieves a new identity in the complex world of words. He emerges as a writer of golden nib, despite his proud ignorance, ranges from topographies of native state to literatures of neighbouring languages. With all his self-reliance, autonomy and independence of thought and writings, he altered, modified, transformed, revolutionized and amended Pathanjali, who was not with both feet on the ground. This junior artist- Patanjali was fond of a foreign writer- Leo Tolstoy. The hero, Namini had found and shown the aristocratic similarities between Patanjali (Raju garu) and Tolstoy. Patanjali used to write on some alien subjects (Khaki Vanam), spewing venom on Police. The protagonist, Namini, reformed him and brought him to reality/ nativity. Inspired by Namini, Patanjali, a new born, penned a story, with a different native, local narration.
There were some bad / tough times that succumbed Patanjali, but the hero Namini, with his entire firm, unbending, obstinate and steadfast values, had never yielded to the oddity of borrowing his pen to mean tele- serials, and remained conqueror.
Thus, this whole episode, lasted for dozens of pages in print, has been infused with new insights, heightened cultural consciousness among the students of literary history and oafish readers like me. Therefore, I must be grateful to Namini for his article. The article also erased the ‘wrong notions’ that Pantanjali, not only being head of the news desk at Tirupati, but also a prolific, iconic writer, adopted (spiritually) Namini, who was a run- of- the- mill kind activist and campaigner of Virasam from Chittor unit and who was only a pamphleteer. The ‘erroneous conceptions’ further averred that Patanjali carved Namini, while explaining the very objective of writing and while advising him to shun writing something unfamiliar and unknown.
Before concluding, I do agree with one of the responders, who acclaimed that Namini’s article is the great tribute to Patanjali. I am also gloomy, melancholic while brooding on the misfortunes of hundreds / thousands of Telugu literary buffs, who could not read this article, owing to their Internet- illiteracy.
Regards,
Naresh Nunna.
rakesh Jun 18, 2009 7
ఆహా… ఎన్నాళ్ళకు నామినిగారి గురించిన కొన్ని విషయాలు తెలిసాయి.
రాయలసీమ భాషలోని ఎన్నో సొగసైన పదాలను పరిచయం చేసిన ఘనత ఆయనదే!!
అద్భుతమైన ఆయన కథలు (ఉదా: బూడీసుల సుబ్రమణ్యం…) ఎన్నో ఏండ్లక్రితం చదివాను.
తెలంగాణ భాషలోని ఎన్నో పదాలను (100% తెలంగాణాలోనే వాడబడుతూ, మిగతా ప్రాంతాలవారికి తెలియని పదాలను) తెలియపరచడంలో ఒక తెలిదేవర భానుమూర్తికి సాటిగా (హాస్య యుక్తంగా.. రాయడంలో), పక్కా రాయలసీమ భాషలో రాస్తూ రంజంపజేసిన మహానుభావుడికి వందనాలు.
kcubev Jun 19, 2009 8
నరేష్ నున్నాగారికి,
నామిని గారిపై మీకున్న అభిప్రాయాన్ని అంతకంటే బాగా వేరే దగ్గర చెప్పుకోవచ్చు. కానీ ఆయనను గూర్చి చెప్పేందుకు పతంజలిని జూనియర్ ఆర్టిస్ట్ ని చేయనక్కరలేదు. పై నివాళి ఎవరైనా పనిగట్టుకుని రాయించారా అన్నట్టుగుంది మీరు రాసిన దానిని చూస్తే. బతికినంతకాలం పొగడ్తలు, సన్మానాలు గిట్టకుండా తన పనిని నిష్కామ కర్మ యోగిలా చేసుకుపోయిన పతంజలిని ఇలా అవమాన పరచవద్దు.
naresh nunna Jun 20, 2009 9
kcube varma Garu,
It seems, U r thoroughly mistaken me. I am sure that u did not get the sarcasm in my reaction. If I had posted it in Telugu, my opinion and the irony in that would have been understood properly. I will take any friend’s help to post my opinion in Telugu…
regards,
naresh nunna
kumar Jun 22, 2009 10
నరేష్ నున్నా గారి తెలుగు అనువాదం కోసం ఎదురుచూస్తున్నాను. నరేష్ నున్నాని వర్మగారు అపార్థం చేసుకున్నట్లు నామినిగారిని నరేష్ అపార్థం చేసుకుని ఉండవచ్చుకదా.
sreenivas r.s Jun 23, 2009 11
patanjalini nivaalulu chaalaa raastunnaamu ippudu.
kaani, aa rachayita batike vunnappudu atani kathalani gurinchi vokka manchi vyaasam vacchindaa?
nenu patanjali kathalanu ishtapade paathakudini.
inta mandilo evarayinaa vokkaru patanjali kathalanu gurinchi manchi vyaasam raasi vunte, nenu santoshinche vaadini.
chanipoyina vaadi kallu chaaradesi.
batiki vundagaa vaadu perati chettu..vaidyaaniki paniki raadu.
sreenivas sarma
ప్రాణహిత » జూన్ 2009 సూచిక Jul 6, 2009 12
[...] నా విస్తరాకు : నామిని సుబ్రమణ్యం నాయుడు [...]
Sarath 'Kaalam' Aug 14, 2009 13
చాలా బావుంది. పతంజలి గారి గురించి మంచి అవగాహన వచ్చింది.
charan datla Aug 27, 2009 14
నామిని గారు,
పతంజలి గారి తో మీ పరిచయాన్ని గా వివరించారు.
ధన్యవాదములు!
చరణ్ దాట్ల.
vijaya Nov 19, 2009 15
It is my pleasure to inform you that Telugu people are celebrating the silver jubilee year of one of the great contemporary Telugu writer Sri Namini Subramanyam Naidu(1984-2009). As all Telugu readers know that he brought out world class Telugu folktales into limelight with his simple style of Chittoor district Telugu, whom Bapu described as the image of deity. To name some of his books, Mittoorodi Pusthakam, Iskulu Pilakayala Katha, Chaduvula Chavula, Amma Cheppina Kathalu. He is not only a writer but also a journalist of aclaim and independence.
It is also my unhappiness that eventhough he is treated as great writer and journalist, nobody is here to recognize his originality and greatness.
I with that all will certainly extend your good-heartedness to make the people know about him.
Thank you.
regards
Bharadwaza Dec 31, 2009 16
అద్భుతము.