Jun2009
ఒక కాలం గడిచిపోయాక
- అనిశెట్టి రజిత
1
ఒక కాలం రోజులూ నెలలుగా
నడిచి వెళ్ళి పోయాక
మరో కాలం వచ్చి చేరుతుంది
చెట్టాకులు రాలిపోతాయి
మారాకులు చిగురేస్తుంటాయి
ఒక కాలం గడిచిపోయాకా
జీవితం నిట్టూర్చి విశ్లేషితమవుతుంది
తూకాలు చూసుకొని లెక్కల్ని సరిచేసుకుని
మళ్ళీ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది
కాలచక్రం రుతుగీతికల్ని పాడుకుంటూ
చరణాలన్ని పూర్తి చేసి పల్లవినందుకుంటుంది
మళ్ళీఒక మొదలకు సిద్దమవుతుంది
అందుకేనేమో మనిషి పునర్జన్మను విశ్వసిస్తూ
మళ్ళీపుట్టాలని కోరుకుంటాడు.
2
ఒక మొదలు ఉగాది
ఒక ప్రారంభం నూతన సంవత్సరాది
మార్పులు చేర్పులతో రోజులు గడిచిపోతుంటాయి
ఆటుపోట్ల అలలు ఎగసిపడుతుంటాయి
కాలం అదే పనిగా ముందు కెళ్లి పోతుంటుంది
వెనక్కెప్పుడూ రాకుండా వేగాన్ని నియంత్రించుకుంటూ
ఎండ వేడికీ వాన తడీకీ చలికీ వణుకుతూ
అనుభూతి వలయాల్లో మనిషి గిరగిరా తిరుగుతూ
పడి లేస్తూ పరావర్తనం చెందుతుంటాడు
ఒక జననం ఒక మరణం అనే
మహా ఘటనల్లో ఇమిడి పోతాడు.
3
సుఖాలోచ్చినప్పుడు కలిసొచ్చిన కాలమంటూ
కోరుకున్నది జరిగినప్పుడు మంచి కాలమంటూ
అనుకున్నది జరగనప్పుడు
లాభించేది లభించనప్పుడు
పాడు కాలమంటూ నిందిస్తూ వాపోవడం
మనిషికి అలవాటయ్యింది
ప్రతి మంచి ప్రారంభం ఉగాదనీ
ప్రతి రోజూ సంవత్సర కాలానికొక ఆది అనీ
అంగీకరించే విశాలత్వం లేని మనిషి
కొన్ని రోజులకు కొన్ని రంగులనద్ది
అదే వేడుకంటూ చెలరేగిపోతుంటాడు.
4
ఒక రోజుకు ఒక ఉదయమనే ప్రారంభం
ఒక రాత్రనే ముగింపుంటుంది
ఒక మెలకువ జీవన చైతన్యం
ఒక నిద్రా సమయ విరామం
ప్రతి రోజొక కొత్తా పాతల కలయికతో
నలుపూ తెలుపులని అతికేసుకున్న జీవితం
కొనసాగింపై కవ్విస్తుంది
ఒక పుట్టుక ఒక్క రోజు నాటి
ఆహ్వానపు వేడుక కాలేదు
ఒక ఆఖరు శ్వాస ఒకే రోజు నాటి
వియోగమూ కాలేదు
జననానికి బతుకు మాధుర్యం
మరణానికి విషాద జ్ఞాపకం
పొడిగింపునిస్తుంది
5
ఎప్పుడూ మొక్కలే కాదు
మనిషి భావనలూ చిగురిస్తాయి.
అప్పుడు అక్కడ నీళ్లలో తడిసిన పక్షిలా
ఉగాదొచ్చి రెక్కలల్లారుస్తూ ఆడుతుంది
పక్షులే కాదు మనిషి ఆశలూ విహంగిస్తాయి
అప్పుడు ఉగాదొచ్చి తొలకరి
జల్లుల్ని చిలకరిస్తుంది
కోకిలల సమ్మేళనంలో క్రొంగొత్త
పాటలు సమ్మోహితం చేస్తాయి.
ఉషస్సులన్నీ ఉగాదులుకావనీ
తమస్సులన్నీ తుది రోజులు కావనీ
జీవితం చేదూ వగరూ పులుపూ
తీపిల సంగమమనీ
రసానుభూతులనూ శీతోష్ణ తాకిళ్లనూ
సమతుల్యం చేసుకుంటే
ఆ గెలుపులో ఒక ఉగాదిని
ఆవిష్కరించుకోవడమే పండగనీ
మనిషీ అదుగో చూడగలవు
వసంతకాలపు ఆగమన పరిమళాల
ఆకుపచ్చని దృశ్యాలూ
వీడ్కోలంటున్న శిశిరపు
చిహ్నాలిక అదృశ్యాలూ.
vijayprakash Jun 5, 2009 1
nice poem about time whea ther, about the humanlife thanks to the poetess. thganks tothe publishes