Jun2009
పుష్పసిద్ది
- ఎన్. అరుణ
విత్తనం నుంచి
పువ్వుదాకా నా ప్రయాణం
పువ్వు నా మజిలీ అయినప్పుడు
ఫలం నా గమ్యం
మల్లెలు చుక్కల్ని
ఎందుకాహ్వానిస్తాయో నాకు తెలుసు
విచ్చుకోవడానికి.
వీడ్కోలంటే పారిజాతానిదే
నిశీదికి కృతజ్ఞతలు చెప్తూ
నేలరాలుతుంది.
పువ్వులు లేకుంటే
భూమి ఎలాగుండేదో?
కొండల నిట్టూర్పులకు
అడవి కంపించి పోయేదందుకే
పువ్వులు ఒక ఆదిమ భావన
నా జన్మ రహస్యం.
నా కలలను కాపాడే రెప్పలు
ఈ పూల రేకులు.
మాలలల్లుతున్నప్పుడు
నా జీవన క్రమాన్ని
మళ్ళీ చదువుకుంటున్నట్టుగా వుంటుంది.
అందమని కాదు
ఆఘ్రాణ యోగ్యమని కాదు
ఏదో ఆత్మీయ ప్రక్రియకు
ఆనవాళ్ళీ పువ్వులు.
July 6th, 2009 at 12:13 am
[...] పుష్పసిద్ది : ఎన్. అరుణ [...]