Jun2009
సందిగ్ధ సంధ్యలకు ఆవల….
- ఝాన్సీ కె.వి.కుమారి
ఇప్పుడు. . . ఇక్కడ. .
క్షణం ఆగుదామా?
గడియారంలోని క్షణాల ముల్లును
వెనుకకు తిప్పి
యుగాల ఆవలకు
అడుగులు వేద్దామా?
మనం. . . ఒక్క క్షణం
మనసులు విప్పుకుందామా?
హృదయాలను పక్షుల్లా
స్వేచ్చగా ఎగరేసుకుందామా?
అక్షరాలకు ఎల్లలను చెరిపేసి
సరిహద్దుల సంకెళ్ళను ఛేదించి
నిప్పుల నిజాల కణికలను
గుండెల్లోకి ఎక్కుపెడదామా?
మనం. . . . ఒక్కసారి. . . . ఒకే ఒక్కసారి
అభినయాల పరదాలను
ఆవలికి నెట్టేసి
తెరచిన కళ్ళకు
చూపులను అతికించి సూటిగా. . . . మన ఎదలలోకి
ప్రసరించుకుందామా?
సరే. . . ఆ అజ్ఞాన కాలంలో
అంధకార యుగాల్లో
తెలుసో. . . తెలియకో. . .
తప్పుటడుగులు వేశాం!
వెలుగు వాకిళ్ళు అక్షరాలను సైతం
చీకట్ల బురదలో ముంచి
అసత్యాల అసంబద్ధ పునాదులను
ఎంత పటిష్టంగా వేశాం. . . .
నవయుగపు ఉషస్సులో కూడా
తిష్టవేసుకున్న తిమిరాలకు
మురిసిపోతూ
మన జబ్బల్ని మనం చరుచుకోవడం
అజ్ఞానాన్ని. . . . అనంతంగా
పేర్చుకుంటూ పోవడం కదూ. . .
ఎండమావులను
ఒయాసిసులుగా భ్రమింపజేయడం
నేరం. . . . . నేస్తం,
రేపటి తరాలకు
చీకట్లను కానుకగా ఇవ్వడం
క్షంతవ్యం కాదు. . . .
ఏనాడో. . . . గుండెలోతుల్లో
నిక్షిప్తమైన సత్యాలను
న్యాయపు బొకెన్లతో
తోడుకురావడం. . . .
తక్షణ కర్తవ్యం!
సందిగ్ధ సంధ్యలకిక వీడ్కోలు
విచ్చుకున్న ఉషోదయాలకిక
నేలపరచుకున్నంతమేరా
చీకట్లే లేకుండా చేయాలని
ప్రతినబూనడం
ఇప్పుడత్యంతవసరం!
మిత్రమా, ఒక్కసారి
ఒకే ఒక్కసారి
అభినయాల పరదాలను
కాల్చివేద్దాం
అస్మదీయ తస్మదీయ
చీకటికుడ్యాలను
కూల్చివేద్దాం
కేవలం స్వేచ్ఛకోసమే కదూ
వేలాది యుద్ధరంగాల్లో
కోట్లాది ప్రాణుల బలి!
ఒక మనిషి స్వేచ్ఛగా బ్రతకడం కోసం
స్వేచ్ఛగా మాట్లాడడం కోసం
స్వేచ్ఛగా ఆలోచించడం కోసం
స్వాతంత్ర్య జ్యోతులను వెలిగిద్దాం. . .
అసలుసిసలైన ఆత్మకాంతిని
ప్రజ్వలింపచేద్దాం. . .
స్వార్ధాల గాడాంధకారమంతా
గతకాలానిదేనని ప్రకటిద్దాం. . .
ఆగామికాలమంతా
కాంతి కేంద్రానిదేనని
ఎలుగెత్తి చాటుదాం
ఒక్కసారి. . . . కాంతితో కరచాలనం చేసి
వెలుగుతో సంధి కుదుర్చుకుంటే
ఇక ఎప్పటికీ. . . . .
మన ముందూ. . . వెనుకా. . . .
తోడుగా. . . . నీడగా
కాంతికిరణాల సమూహాలే
నింగికెగసిన స్వేచ్ఛాబావుటాలే!!