Jun2009
సంఘర్షణ
- డా. కొలకలూరి మధుజ్యోతి
కాలింగ్ బెల్ శబ్దం విని, చేస్తున్న పని ఆపి వచ్చి తలుపు తీసింది లత. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి, ఎంత ఆశ్చర్యం ఆ ముఖంలో. లేచిన కనుబొమ్మలు దిగటం మర్చిపోయాయి విచ్చుకొన్న కళ్ళతో ఆనందం, వచ్చిన మనిషి ఎంత ప్రియమో తెలుపుతూ ఉంది. ముప్పిరిగొన్న ఆనందాశ్చర్యాలతో స్తబ్ధంగా నిల్చున్న లతను గుమ్మంలో నిల్చొన్న సుధ చూస్తూ ఉంది. ఆ చూపు, కుచ్చిళ్ళు ఒక పక్కకు చెక్కి, చెదిరిన జుట్టుతో అప్పుడే నిద్ర లేచినవైనంతో ఉన్న లతను ఆప్యాయంగా తడుముతూ ఉంది. ఒక్కసారి ఈ లోకంలోకి వచ్చిన లత, సుధను గుమ్మంలో గట్టిగా తీసుకొని, రెండు బుగ్గలు ముద్దాడి, లాక్కెల్లి సోఫాలో కూర్చోబెట్టింది. ఇంత చేస్తున్నా, ఈ లోకంలోకి పూర్తిగా వచ్చినట్టు మాత్రం లేదు. ఒక్క మాట మాట్లాడకుండా ఉక్కిరి బిక్కిరి అవుతున్న లతను అదే చిరునవ్వుతో చూస్తూ ఉంది సుధ.
అరగంట తర్వాత గుండెల్లో సందడి సద్దుమనిగిన పిమ్మట కాఫీ తెస్తూ సుధను ప్రశ్నించింది.
“ఏమిటీ అనుకోని రాక! చెప్తే స్టేషన్ కు వచ్చేదాన్నిగా!”
“అనుకోకుండా వచ్చాను. ”
“సర్లే అసలంటూలా వచ్చావు. ఆయనకు నేను లేకపోతే పని జరగదు. అని సొడ్డు పెడుతూ ఎప్పుడూ తప్పించుకొనే దానివి. ఇప్పటికైనా వచ్చావు. ఇంతకీ ప్రసాద్ ఎలా ఉన్నాడు?
“ఉ. . . . !” చిన్నగా మూలిగింది సుధ.
ఆ జవాబుతో నిమిత్తం లేనట్టు ఉంటావుగా. . . ! నాతో
ఉందామనేగా వచ్చావు. వెళ్తానన్నావో. . . . . . ! నే చెప్పేదాకా కదలకు!”
సమాధానం ఆశించకుండా తాగిన కప్పులు తీసుకొని వంటింట్లోకి వెళ్ళింది. వెన్నంటి అడుగులేస్తూ “సూర్యమేడీ కనిపించలేదు!” ఆరా తీసింది సుధ “ఆయనా. . . లేడు. పల్లెకు వెళ్ళాడు. రెండు రోజులు రాడు. ” ఆ మాట వినగానే ఊపిరి సలిపినట్టయింది సుధకు. లతతో హాయిగా మనస్సు విప్పి మాట్లాడుకోవడానికి అవకాశం ఉన్నందుకేమో!
లత పరిచిన పక్కమీద నడుం వాల్చింది సుధ. నిద్ర పట్టక మెసులుతూ ఉంది. ఉండి ఉండి నిట్టూరుస్తూ ఉంది. అటూ ఇటూ తిరుగుతూ లత ఇదంతా చూస్తూనే ఉంది. అసహనంగా అశాంతిగా పక్క మీద దొర్లుతున్న సుధను ప్రశ్నార్ధకంగా చూస్తూ, “అప్పట్నుంచి గమనిస్తున్నా, రాత్రి ప్రయాణం చేసి వచ్చావు, అయినా నిద్రపట్టటం లేదా? లే టిఫిన్ చేద్దాం” అంది లత. సమాధానం చెప్పే అవసరం తప్పినందుకు ఊరటతో మోకాళ్లపై చేతులాన్చి లేచింది సుధ.
పడుకొందే కాని సుధలో ఏమాత్రం స్థిమితం లేదు. మనస్సులో బాధ. సుళ్ళు తిరిగే వేదన. ఎవరికైనా చెప్తే అర్ధం చేసుకొంటారో లేదోననే భయం, చెప్పొచ్చో చెప్పకూడదో తెలియని సందిగ్ధత, ఎవరితోనూ పంచుకోలేక, తనలో తాను దాచుకోలేక సతమతమవుతున్న దానిలా ఉంది సుధ స్థితి. సుధను చూస్తే, పెదవి విప్పి ఏమీ చెప్పకపోయినా, ఏదో స్పష్టంగా ఉందన్నది మాత్రం స్పష్టం. ఆ రాత్రి మూగన్నుగా నిద్ర పట్తుండగా, భయంకరమైన పీడకల వచ్చినట్టు తుళ్ళిపడి మేల్కొంది. వేదనా కెరటం ముప్పిరి గొంటుండగా, తడితేరుతున్న కళ్లను తెరచింది. రెప్పలు అల్లార్చింది. చీకట్లో చూపులు చొప్పించి, లత ఇంట్లో ఉన్న విషయాన్ని గుర్తు తెచ్చుకొంటూ, ధైర్యం చెప్పుకొంటూ నిద్ర పోవటానికి ప్రయత్నించింది సుధ.
మరు రోజు బ్రష్ చేసుకోవటానికి వెళ్తున్న సుధను చూసింది లత. వయస్సు పెరిగి, పెద్దతనం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎప్పుడూ ఆ ముఖంలో చెదరని కళ వచ్చినప్పట్నుంచీ లేదు. నిర్లిప్తంగా ఉంది. ఎప్పుడూ స్వచ్చంగా ఉండే కళ్ళు, ఎర్రదనాన్ని వదలటం లేదు. “గాయం మానలేదా? సంవత్సరమైనా అదే దుఃఖం ఇంత ఎక్కువగా ఉందా? తనలో తను అనుకొంది లత.
“ప్రసాద్ మనకు ఒక బిడ్డ చాలు. ” పెళ్ళైన కొత్తల్లో అంది సుధ. “అదేమిటి సుధ”
“మనం అవసరాలకు వెతుక్కోకుండా ఇద్దర్ని పెంచొచ్చు, చదివించొచ్చు. ఒక బిడ్డను మనం పెంచుకొందాం. ఎంతమంది పిల్లలు అనాధలుగా ఉంటున్నారు. వారికి భవిష్యత్తు ఏమైనా ఉందా? వారంటే నాకున్న ఇష్టం నీకు తెలుసు. ఎంత ఇష్టం ఉన్నా, అందరికీ నేను ఏదీ చేయలేను. కనీసం ఒక బిడ్డను పెంచుకొన్నా అదో తృప్తి. మన బిడ్డకు తోడూ మనం పెంచుకొనే బిడ్డ. ఎన్నో కష్టాలుంటాయి, అంటావేమో! దేన్నైనా ఎదుర్కొందాం ఏమంటావు! చెప్పాలనుకొన్న తన ఆలోచన స్పష్టంగా చెప్పనా లేదా అన్నట్టు చూస్తున్న సుధతో –
“నీ లో ఉన్న ఈ మంచితనమే, నువ్వంటే ఇంకా ఇంకా ఇష్టం పెంచుతోంది. నీ ఇష్టమే కాని. . . ” భార్య గాజులు కదుపుతూ ప్రేమ నిండిన గొంతులో అన్నాడు ప్రసాద్.
సోఫాలో తల వెనక్కి వాల్చి తమ వివాహ కాలపు ఆలోచనలతో సతమత మవుతున్న సుధ దగ్గరికి చాటలో శెనగకాయలు చేసుకొచ్చి కూర్చొంది లత.
“నిన్నటి నుంచి చూస్తున్నాను. ఏమిటంత పట్టనట్టున్నావు” నేనే మాట్లాడుతున్నానంతా!”
“ఏముంది! నిరాప్తకంగా అంటున్న సుధను వింతగా చూస్తూ
“ప్రసాద్ బావున్నాడా? బానే ఉంటున్నాడా? గొడవలేం లేవు కదా!” ప్రశ్నించింది లత.
“ప్చ్. . . . !” చప్పరించేసింది సుధ.
సుధా!. . . . నీవు బావున్నావా. . ! లత గొంతులో సందేహం ఏమో చెప్పాలన్నట్టు తలెత్తి నిశ్శబ్దంగా తలదించుకొంది. ఆ కళ్లలో పొలమరిస్తున్న తడి.
అన్ని ఏళ్ల తమ స్నేహంతో ఎప్పుడూ చూడని నిస్తేజం, సుధలో కనిపించింది లతకి. సుధ దగ్గర చేరి
“నేనేమైనా సాయం చేయగలనా!?” అడీగింది.
తల్లిలా అనునయించే, ఓదార్చే లత నుంచి ఏదో స్వాంతన. రెండు నిమిషాల మౌనం. అనంతరం ఏదో నిశ్చయం చేసుకొన్నట్టు లతను పక్కన కూర్చోబెట్టుకుంది.
“మాకు పిల్లలు లేకపోవటానికి కారణం నేనా?” ఆవేదనగా ప్రశ్నించింది సుధ.
“బాబు. . . ఏక్సిడింట్. . . కదా! అయినా ఇదేం మాట!”
“అదే అంటాడు ప్రసాద్” గత సంవత్సరం ఒక్కగానొక్క బాబు పోవటం మా ఇద్దరికీ ఎంత దెబ్బో నీకు తెల్సు కదా!” గొంతు బొంగురు పోతుండగా అడిగింది సుధ. లత తలూపింది. “ఆ దెబ్బ ఎవరికి ఎక్కువ అని బేరీజు వేయటం వ్యర్ధం. కాని కోల్పోయింది మాత్రం, కోలుకోలేనంత దెబ్బ తీసింది. మౌనం మా ఇద్దరి మద్య దూరాన్ని పెంచింది. ముప్పైయేళ్ల సహజీవనాన్ని ఈ సంవత్సరం కాలం రూపు మాపుతూ ఉంది. జీవితంలో ఏ కోరికా మిగలలేదు. ఎదిగిన బిడ్డ పోయాడనే బాధ, తీరని వ్యధ. అది తగ్గలేదు. తగ్గాలని అనుకోలేదు. కాని ప్రసాద్. . . ప్రసాదే అర్ధం కాకుండా ఉన్నాడు. చూపు తప్పించటం, విసుగుకోవటం, కసురుకోవటం, ఏం చేసినా తప్పులు పట్టటం, విసిరి కొట్టటం, పిచ్చి కోపం తెచ్చుకోవటం – నాకేం అర్ధంకాలేదు. బిడ్డ పోయిన బాధ, అసంతృప్తి ఇలా బయటపడుతోందేమో అనుకొన్నాను. ఎన్ని ఆశలు బిడ్డ చుట్టూ! కల కళ్లముందే కరిగి కుప్ప అయిపోతే ఇలాగే ఉంటుందేమో అని భావించాను.
ఒకరోజు బాబు ఫోటోలు చూస్తున్న ప్రసాద్ బాధగా చూస్తూ “నీ మూలానే నాకుపిల్లల్లేరు” పదునుగా అన్నాడు. కఠినంగా మారిపోతున్న ఆ ముఖకవళికలను చూస్తున్నానే కాని నాకేం అర్ధం కాలేదు పిచ్చి కోపంతో ” నువ్వే. . . నువ్వే. . . మనకు ఒక్కడు చాలని, నాకు పిల్లలు లేకుండా చేశావు!” పంటిని నొక్కి పల్కి విసురుగా పడక గదిలోకి వెళ్ళిపోయాడు. ”
ఏనాటి మాట!. నీకూ తెలుసు అప్పుడు మేం వల్లించుకొన్న ఆదర్శాలు. ప్రసాద్ అన్నమాట అర్ధం అవ్వటానికి చాలా సేపే పట్టింది. జీర్ణమే కావటం లేదు. మనస్సులోది బయటపడిన నాటి నుంచి, నిరసన స్పష్టంగా మాటల రూపం దాల్చింది. నా పొడ గిట్టనట్లే, “నా కళ్లెదుట నుంచి పో, నాకు కనిపించకు, నా యింట్లో ఉండొద్దు, నాకు కనిపించి నన్ను చంపొద్దు. . . ” అంటూ మాటల బాణాలు – నరక ప్రాయం జీవితం. నాబాధే పడాలో, ఆ బాధే అర్ధం చేసుకోవాలో. . . . . ఏమో. . . భరించలేకపోతున్నా. . . . . . ! దుఃఖం మాట మింగేస్తుంటే అచేతులలో తల దూర్చుకొని మౌనం అయింది సుధ
అంతకాలం తాను మోస్తున్న బరువు దించుకోవటంతో తేటపడ్డ సుధ పేపరు తిరిగేస్తూ కూర్చొంది. వంట పూర్తి చేసి వచ్చి సుధ పక్కన కూర్చొంటూ,
“ప్రసాద్ ఇలా అవుతాడని అర్ధం చేసుకోవాడానికి నాకింత సేపు పట్టింది. దాని కోసం ఇల్లు వదిలి పారిపోతున్నావా!
మౌనంగా లత కళ్ళలోకి చూసింది సుధ.
“మనిషికి అనుకోని దెబ్బ తగిలితే దానికి కారణం వెదుకుతాడు. ఏక్సిడెంటులో బాబు పోయాక ప్రసాద్ చేసిన పనీ అదే సుధ. ఎవరో ఒకరిని కారకులు చేసి నిందించటం ద్వారా తనను తాను ప్రలోభపెట్టుకోవటం, ఓదార్చుకోవటం ఒక రకంగా భ్రమలో ఉండటమే. బాధను మర్చిపొవటానికి దారి మల్లించటమే అన్నది మీ ఇద్దరికీ తెలుసు.
ఒక్క బిడ్డే ఉండాలనే నీ ఆలోచన అంగీకరించిన వాడు ఇంకో బిడ్డను ఎందుకు పెంచుకోలేడు! నీ ఆదర్శం ప్రసాద్ కేమో ఆచరణీయం కాలేదు. అది నీ తప్పు కాదు. కారణాలు ఎన్ని ఉన్నా పెంపకం తెచ్చుకోలేదు అన్నది సత్యం. అలాంటప్పుడు తప్పు అతనిదేగదా! ఇంతకు మునుపు ఎలాగూ పెంచుకోవాలనుకొన్నారు. కనుక అది ఇప్పుడైనా చేయచ్చు.
బిడ్డను కోల్పోవటం ప్రసాద్ ప్రేమా ఆప్యాయతలకే కాదు ఆశలు ఆశయాలకూ కూడా తీరని దెబ్బ. కాని నీకు ఈ ఎదురుదెబ్బ తగిలింది ప్రేమా ఆప్యాయతలకే. ఈ లెక్కన అతని కంటే నీవే ఎక్కువగా నష్టపోయింది. . అది ప్రసాద్ కి అర్ధమయ్యేలా చేయి.
ఈ నిజాలు మీ ఇద్దరికి తెల్సుననే బాధపడే వాడినెందుకు నొప్పించాలని నీవూ అనుకొని ఉండొచ్చు. నిజాలను ఒప్పుకొలేక ప్రసాద్ తనను తాను మభ్య పెట్టుకుంటూ ఉండొచ్చు. వీటిని, ఇబ్బంది అనిపించినా ఖచ్చితంగా విడమర్చి చెప్పు. ఇప్పటికీ నిజం చేదుగా ఉన్నా, జీవితాంతం కలసి ఉండటానికిది దోహదమవుతుంది. పొమ్మన్నాడని ఎంతకాలం ఇల్లు పట్టకుండా తిరుగుతావు!? అది నీ ఇల్లు అతను నీ మనిషి. అది అచ్చంగా నీ సమస్య. దాన్ని నీవే పరిష్కరించుకోవాలి కాని పారిపోకూడదు. లత ముగించి సుధ తలను సవరించి లోనకు వెళ్ళింది.
నిన్నటి వరకు మసక బారిన మార్గం సుస్పష్టంగా ఉందిప్పుడు సుధకు. తిరిగి వెళ్తున్న సుధ బిడ్డను పెంపుకు తీసుకొవాలని, ఒకప్పుడు ప్రసాద్ ఒప్పుకున్నాడు కనుక ఆచరణ కష్టం కాకపోవచ్చని అనుకొంది. ఇద్దర్ని పెంచుకొంటే ఏమీ? ఒక్కడు మాత్రం వద్దే వద్దు. అవును ఇద్దర్ని పెంచుకోవాలి స్థిరంగా అనుకొంది. మొక్కవోని నిశ్చయంతో ప్రశాంతంగా తల వెనక్కి వాల్చింది సుధ.
అరుణ పప్పు Jun 1, 2009 1
కథ బావుంది. అభినందనలు.
pal Jun 4, 2009 2
katha chala baavundi.maanava sambandhalu chaala chakkaga vrasaru.