తెలంగాణలో ఉద్యమాలు – పాట – తెలంగాణ చరిత్ర (రెండోభాగం)

- సి.కాశిం

ఉద్యమ పాటకు ప్రజల పాటలే మూలం

కష్టజీవుల జీవితమే ఓ పాట. “పాట అంటే ఒక చర్చ. చర్చ లేవదీయటం ఒక సత్యాన్ని కనుక్కోవడం. ఆ సత్యాన్ని ఆచరణలో పెట్టడం.” (గద్దర్ – తరగని గని – పుట.1) పాట, గేయం పర్యాయపదాలుగా వాడుతున్నారు. ‘గేయం’ సంస్కృత పదం. పాట తెలుగు పదం. అయినా ఒకే సందర్భానికి ఉపయోగిస్తున్నారు.

“గేయం గీతం సమానార్ధకాలు పాడేది గీతం లేదా గేయం” (అమర కోశం – పుట.140)
“లయబద్దమైన ఒక భావం పూర్తి అయి వేరొక భావం మొదలైనప్పటికి విరుపులు సరిపెణలాగా నడుస్తూ ఉండే బంధం గేయమనబడుతుంది” (రాజగోపాలనాయుడు – పాటలో ఛందస్సు – పుట.26) “కవిత్వానికి గానగుణం స్వాభావికమైనది. పాత ఆవేశానుభూతుల సమాహారాన్ని వ్యక్తీకరించగల సామర్ధ్యం గలది. అది ఒకే శృతిలో పాడేది” అని కాడ్వెల్ అన్నారు.

కవిత్వానికి ఒక లయ ఉంటుంది. కవి మనస్సులో మెదిలిన లయాత్మక భావమే కవిత్వంగా పుడుతుంది. సంగీతం తెలిసిన కవి అయితే అతని కవిత్వానికి పాట రూపం వస్తుంది. గేయం, పాట ఒకే అర్ధంలో వాడటంలో ఉన్న ఔచిత్యమేమిటంటే లయబద్దమైన ఛందస్సు ఉండటం.

“గాత్రం అంటే శరీరం, గాత్రం అంటే పాట. శరీర వ్యక్తీకరణ పాట అంటే శ్రమలో ఉత్పత్తిలో పాల్గొనే శరీర వ్యక్తీకరణ పాట” (వరవరరావు-అరుణతార – 1992 ఏప్రిల్)

‘శ్రమచేస్తూ శరీర కష్టాన్ని మర్చిపోవడానికి సమష్టిగా ప్రజలు సృష్టంచే మౌలిక సాహిత్యరూపం పాట అని స్థూలమైన అర్ధాన్ని చెప్పవచ్చు.

సమాజ మార్పు కోసం జరిగే ఉద్యమాలకు చెందిన కవులు ప్రజల భాషలో, వారి ఆలోచనలకు దగ్గరగా చెప్పడానికి వారి జీవితాలతో ముడిపడిన వస్తువుతో పాటు రూపాన్ని కూడా పట్టుకున్నారు. అంటే ప్రజా సాహిత్యాన్ని అధ్యయనం చేసి ఒక విషయాన్ని వ్యక్తం చేయడానికి వారు ఎన్నుకొనే కళాత్మక రూపాన్ని ఉద్యమ కవులు అందుకున్నారు. అంతే కాకుండా శిల్పంలో కూడా ప్రజల నుడికారం, పోలికలు, సామెతలను పోరాట పాటలలో ఉపయోగించారు. ప్రజల పాటల చరిత్రను గమనిస్తే కాని అందులోని టెక్నిక్ మనకు అర్ధం కాదు. అపుడే ఉద్యమ పాటలకు అవెట్లా మూలమయ్యాయో చెప్పవచ్చు.

మానవ సమాజ పరిణామంలో ఆదిమ మానవుడు వేసిన తొలికేకనే మొదటి పాట. అదే తొలిపాట. అదే తొలి సాహిత్యరూపం. సంగీత రూపం. మాటకు మూలం. పాటకు మనిషికున్నంత చరిత్ర ఉంది. “ప్రజలు తమ జీవిత క్రమంలో శ్రమతో కలిసి ఆశువుగా నోటితో పాడుకొనే పాటలే ప్రజల పాటలు” (గద్దర్ – తరగని గని – పుట.2) పనితో పాటే పాట పుట్టింది. పాట ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్లేటో లాంటి తత్వవేత్తలు ఈ పాట గొప్పతనాన్ని గుర్తించి ‘ది రిపబ్లిక్’ అనే గ్రంధంలో ” … … ఎని మ్యూజికల్ ఇన్నోవేషన్ ఈజ్ ఫుల్ ఆఫ్ డేంజర్ టూ ద ఓల్ స్టేట్, అండ్ ఆట్ టూ బి ప్రొహిబిటెడ్” పాట గురించి చెప్పాడు. ఆంగ్లేయ రాజకీయ రచయిత ఆండ్రూఫ్లెచర్ “గివ్ మి ద మేకింగ్ ఆఫ్ ద సాంగ్స్ ఆఫ్ ఎ నేషన్ అండ్ ఐ కేర్ నాట్ హు మేక్స్ ఇట్స్ లాస్” అని పాట శక్తిని అంచనా వేశాడు. ప్రజల్ని సమస్యలు పట్టి పీడిస్తున్నప్పుడు పాట పాడగలిగితే ఆ సమస్యల నుంచి ప్రజలను పక్కదారి పట్టించవచ్చని విడోవర్ చెప్పాడు. అంటే ప్రభుత్వాన్ని ఎదిరించకుండా, ప్రశ్నించకుండా ఉండడానికి పాట పాలక వర్గాలకు కూడా గొప్ప సాధనం. అట్లే ప్రభుత్వాన్ని కూల్చే శక్తి కూడా పాటకుందని ఉద్యమకారులు గ్రహించారు. ఆ పాట బలం వలననే తెలంగాణ నైజాం అధికారం కూలిపోయింది.

పాటను ప్రజలు రకరకాలుగా వ్యవహరిస్తారు. పదం పాడటం. కైకట్టడం అంటే కవిత అనే అర్ధం. ప్రజలకు కవిత అంటే పాటనే. కట్టడం అంటే అల్లడం. ” సృజనాత్మకమైన ఉత్పత్తి క్రియ పాటకు ఆధారమని” జయధీర్ తిరుమలరావు అంటారు. ప్రజలు తమ జీవితంలో ప్రతి ఘట్టాన్ని పాటగా మలుస్తారు. ఈ సృజనాత్మక శక్తే ఉద్యమ పాటలకు మూలమైంది. తెలంగాణ పోరాటంలోని రచయితలు సాంప్రదాయిక ప్రజా కళారూపాలను స్వీకరించి ‘ప్రజల నుంచి ప్రజలకూ అనే మార్కిస్టు దృష్టితో వాటి ద్వారా రాజకీయాలను ప్రచారం చేశారు. ఉద్యమాలను నిర్మాణం చేశారు.

“సాంప్రదాయిక మతతాత్విక భావజాలంతో ఉండే జానపద కళా రూపాల నుండి భావజాలాన్ని అంటే వస్తువును వదిలి రూపాన్ని ప్రజా రాజకీయ చైతన్యంతో నింపి సృష్టించబడిన సాహిత్యమే ప్రజా సాహిత్యం” (కేతవరపు రామకోటిశాస్త్రి – ప్రజాసాహిత్యం – పుట.7) ప్రజల సంప్రదాయిక సాహిత్యంలో వస్త్తువు భావవాదాన్ని కలిగి ఉంటుంది. అది శ్రమ జీవుల సంబంధాల నుంచి రాదు. ప్రజా సాహిత్యంలో నూతన రాజకీయ వస్తువును చొప్పించి చెప్పగలిగే అవకాశాన్ని తెలంగాణ ఉద్యమాలు ఇచ్చాయి. ప్రజల కోసం ప్రజలు, ప్రజల కోసం ఇతరులు అనే ఆలోచన ఈ ఉద్యమాల ఫలితంగా వచ్చింది. ఈ క్రమంలో ఉద్యమ కవులందరు పాట రూపాన్ని ప్రజల నుంచి తీసుకున్నారు. పనితోనే ప్రజల పాట జీవం పోసుకుంటుంది. దీనికి నిర్మాతలు ప్రజలే. ఈ పాటల్లొ ఒక బాణీ ఏర్పడ్డాక చాలకాలం అదే కొనసాగుతుంది. ఈ సమయంలోనే ఉద్యమకారులు ఆ బాణీని కొన్ని మార్పులు చేసి ప్రజలకు తెలిసిన పల్లవిలోనే ఉద్యమ రాజకీయాలు చెబుతారు. ఉద్యమకారులు ప్రజల పాటల రూపం తీసుకొని విప్లవ పాటలు అల్లి ప్రజలలోకి తీసుకెల్లటం ప్రారంభించాక దోపిడీకి ఊడిగం చేసే కొన్ని వర్గాల మేధావులు ప్రజల సాహిత్యాన్ని పాడుచేస్తున్నరనే ప్రచారాన్ని మొదలు పెట్టారు. కాని ప్రజలెప్పుడు అలా భావించలేదు. సత్యాన్ని తెలుసుకొని దోపిడీని ఎదిరించటం నేర్చుకున్నారు. చైతన్యమయ్యారు.

ఒక ప్రజల పాటను ఉద్యమకారులు విప్లవీకరించిన పద్ధతిని చూస్తే అర్ధమవుతుంది.

నీళ్లకు బోయేటి ఓ నీలవేణిరో
నిల్సుండవే గొల్లభామా
నీతో పనివున్నదే ముద్దులేమా
కొత్త కోడలను కొంగు బట్టాకూ
సరసమాడకు శ్రీ కృష్ణా
సంసారము బాపకు కృష్ణ (తరగని గని -పుట.35)

ఈ పాటలో సరసమున్నది. కాపురాలు చెడిపోయే దుర్మార్గమున్నది. ప్రజల జీవితం లేదు. సమస్యలు లేవు. ఈ పాటను ఉద్యమానికి, పోరాటానికి అనువుగా మార్చాలనుకున్న రచయిత పాతభావాన్ని నాశనం చేయాల్సిందే. కొత్త భావాన్ని నింపాల్సిందే. అయితే రూపం పనికొస్తుంది.

“ఎన్నాండ్లూ ఈ ఎట్టి బతుకులూ
ఎదురు తిరగరోరన్నా
నువ్ బెదిరి పోకురోరన్న…..
దుక్కులు దున్ని మొక్కలు నాటిన
నీ రెక్కకు సుఖమేదన్న
నీ డొక్కల మెతుకేదన్న”(అదే.పుట.36)

ప్రజలు నవరసాల్లో పాటలను అల్లుకొని పాడుకుంటారు. శృంగార రసంలో అద్భుతమైన పాటలను అల్లుకుంటారు. పనిలో దాపరికాలు లేనట్లే. ప్రేమలో కూడా ఉండవు.

కందిసేలో కల్లుబెట్టినా మదనా న వయ్యరి
పోతు పోతు తాగిపోతవా నా వయ్యారి
మర్రి తొర్రలో ఆకుబెట్టినా నా వయ్యరి
పోతు పోతు కొరికిపోతవా నా వయ్యారి
నువ్ ఆకువైతే కాసునైతనే నా వయ్యరి
నువ్ తెలుపువైతే ఎరుపునైతనే నా వయ్యారి (తరగని గని – పుట.72)

ఈ పాటలో సహజంగానే ప్రతీకలు వచ్చాయి. దీనిని అల్లినవాడు కావాలని కల్పించిన ప్రతీకలు కావు. ఆమె ఆకు అయితే, అతడు కాసు అవుతాడు. ఉద్యమకారులు ఇక్కడ ప్రేమ సందేశాన్ని తొలగించి పోరాడే పిలుపునిచ్చారు.

అయ్యజేసినప్పుకిందికో దొరోల్ల జీతగాడ
ఆరేండ్ల జీతముంటివా
ఇరవై ఏండ్లు నిండకముందో
అరవై ఏండ్ల వయసు నిండెనా
మీసమన్నా మొలవకముందే
కాశబోసి కుప్పగొడితివా (అదే పుట)

ప్రజల పాటలోని మదనా నా వయ్యారి చోట దొరోల్ల జీతగాడు చేరిండు. కరుణ రసం, వీరరసం కలిపి కొత్త భావాలతో పాటను మార్చాడు.
రెండు రకాల ప్రజల బాణీ తీసుకొని ఒకే ఉద్యమ పాటను అల్లడం కష్టమైనపనే. అయినా పోరాటాలలో అది సాధ్యమైంది.

మొదటి బాణి
వోలి వోలీల రంగ వోలి
సెమ్మకేలీలవోలి
గోగు పువ్వు దెచ్చినారు
వోలి సెమ్మకేలీల వోలి

రెండో బాణి
దుబ్బుర్ దుబ్బుర్ ఎంట్రుకలు
దువ్వరాదు ముడ్వరాదు
దూసి నీకు కొప్పులేతుమే ఓ దొరసాని
కొప్పులేసి పూలు బెడుదుమే ఓ దొరసాని (అదే.పుట.178)

ఈ రెండు బాణీలను కలిపి విప్లవకారులు ఉద్యమకారుల మీద పాటను రాశారు.

మొదటి బాణీలో
వోలి వోలిల రంగ వోలి సెమ్మకేలీలవోలి
వోలి వోలిల రంగ వోలి సెమ్మకేలీలవోలి

రెండవ బాణీలో
యాడబుట్టి యాడబెరిగి
యాడికొచ్చి యాడసచ్చె
ఎవరి కొరకు వచ్చినారు
ఎవరి కొరకు సచ్చినారు
సక్కనైన కొడుకులమ్మా వోలి సెమ్మకేలీల వోలి
సుక్కలల్లో కల్సిరమ్మ వోలి సెమ్మకేలీల వోలి (అదే)

ప్రజల పాటలలోని పాదాలను ఉన్నవి ఉన్నట్లుగా రాయటం కూడా పోరాట పాటల్లో కనిపిస్తుంది. ఒక స్త్రీ తన అన్నలపై ప్రేమను వ్యక్తం చేస్తూ

“నా ఏడుగురన్నాలు
బావుల్ దొవ్వంగో భారతీ కిరియాల
బాయి బాయికి నేను
బతుకమ్మనౌదో భారతీ కిరియాల” (తరగని గని.పుట.181)

ఈ పాటలో మొదటి పాదంలో నా ఏడుగురన్నాలు అనేది తొలగించి ‘నీ కూలీనాలన్నాలు’ అనేది చేర్చి మిగితా పాటనంతా అట్లే కొనసాగించారు. ముగింపులో మాత్రం రాజకీయాలను జోడించారు

“నా కూలినాలన్నలు దండులో చేరంగో
భారతీ కిరియాల – దండులో చేరంగో
దండూ దండూకు నేను ఎర్రజెండా నౌదునో భారతీ కిరియాల”

కొన్ని పాటలకు బుర్రకథ బాణీని కూడా తీసుకున్నారు.

“వినరా భారత వీరకుమారా విజయం మనదేరా! వహవా” బాణీలో
“సకల సంపదలు గల్ల దేశములో దరిద్రమెట్లుందో నాయన” రూపొందింది.

ప్రముఖ విప్లవ కవి శివసాగర్ రాసిన

“విప్పపూల చెట్ల సిగను – దాచిన విల్లంబులన్నీ
నీకిస్తా తమ్ముడా! నీకిస్తా తమ్ముడా!”

అనే పాట శబరినది ప్రాంతంలో “మామతెచ్చిన మల్లెమొగ్గ/నీకిస్తా అల్లుడా! నీకిస్తా అల్లుడా” అన్న ప్రజల పాటను ఆధారం చేసుకొని రాశాడు. మొదట విప్లవ పాట ‘నరుడో భాస్కరుడా’ కు మూలం ‘నరుడో! నారపరెడ్డీ అనే దూల పాట. శివసాగర్ ‘నరుడో! భాస్కరుడా జానపద గేయ ఫణితులకు సాధారణ కావ్య గౌరవాన్ని తెచ్చింది.” (కె.కె.ఆర్. తెలుగులో విప్లవ కవిత్వం సెమినార్ పేపర్) అని చెప్పటంలో నిజమున్నది. తరువాతి కాలంలో బూర్జువ రాజకీయ పార్టీలు కూడా తమ ఎన్నికల ప్రచారం కోసం ఈ పద్ధతినే పాటించే అనివార్య స్థితిని విప్లవ కవులు తెచ్చారు.

గోరటి ఎంకన్న, గద్దర్, వంగపండు, గూడ అంజయ్యలకు భిన్నమైన శైలిని పాటలోకి తెచ్చాడు. అచ్చమైన ప్రజల బాణీలనే కాకుండా సజీవమైన పల్లె పదాలను పాట ద్వారా వినిపించాడు. ఎండిపోయిన వాగు గురించి వేదన పడినా పల్లెను కన్నీరు పెట్టించినా, రాజ్యహింసను ఖండించినా, సంతను చిత్రించినా, గల్లిని గౌరవించినా పదాలు నీటి సెలిమెలా ఊరుతాయి

“పూజెంత బాగున్నదో శ్రీ మల్లికార్జున
ఎక్కడివో టెంకాయల్ని
చక్కగా సంచులకు నింపి
అమ్మమని గున్నమ్మకిస్తే
అఠానా ధరచెప్పే”

ఇది పూర్తిగా భక్తి రసంతో కూడిన పాట. ఈ బాణీలో పూర్తి భిన్నమైన భావాన్ని చొప్పించడం ఎంకన్నకే సాధ్యమైంది.

“రాజ్యహింస పెరుగుతున్నాదో
తెలంగాణ గడ్డ నెత్తుటేరులు పారుతున్నాదో
అన్నెము పున్నెము ఎరుగని
చిన్ని తమ్ముల తీసుకెళ్లి
అడగారాని ప్రశ్నలడిగి
అన్నాలను చూపెట్టమని” (గోరటి ఎంకన్న – ఏకునాదం మోత)

 

పోలీసులు చేసే రాజ్యహింసను చిత్రించాడు. దుఃఖ రసం, వీరరసం, మేళవించి పాటను రాశాడు. వాన శ్రమజీవులకు మధురమైన అనుభూతి. ‘నువ్వు వస్తానంటే నేనొద్దంటానా’ సినిమాలో ఎగిరినట్టు కాకుండా, వానవస్తే మనిషిలో కలిగే అనుభూతిని దృశ్యరూపం చేశాడు. దీనికి ప్రజల బాణీని ఎన్నుకున్నాడు.

“డెడ్డెనక ఎవడాయేనమ్మ
మొలతాడు లేనోడు మొగుడాయేనమ్మ”

ఈ బాణీలో సుందరమైన ప్రకృతి వర్ణన చేశాడు.

“వానొచ్చెనమ్మ వరదొచ్చెనమ్మ
వానతో పాటుగా వణుకొచ్చెనమ్మ
కొట్టాము మీదున్నా మట్టంత కడిగింది
కోడి పుంజు జుట్టు కొంటేగా తాకింది
… … …   … … …
సుత్తి కొడవలి మీద ముత్యమై మెరిసింది” (గోరటి పాట క్యాసెట్ నుంచి)

అనే ముగింపు కప్పిచెప్పిన విప్లవం వలె ఉంది. కవితాత్మక భావన గొప్ప సౌందర్య శాస్త్రాన్ని రూపొందించింది. ఇట్లా రాస్తూ పోతే ప్రతి పాటకు ఒక కథ ఉంది. ప్రజల బాణీ ఉంది. ప్రజల జీవితముంది. రాసే వారంత అల్లేవారిని అనుకరించేవారే. శ్రమజీవుల మౌఖిక సాహిత్యమే సమస్త కావ్యాలకు పునాది. సకల కళలకు జీవం.

 

(మిగిలింది వచ్చే సంచికలో…)

అభిప్రాయాలు లేవు »వీడియో / ఆడియో, సాహిత్య వ్యాసాలు

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో