చిత్తూరు జిల్లా యానాదుల సంస్కృతి- సాహిత్యం

- ఆచార్య పేట శ్రీనివాసులు రెడ్డి

ఆంధ్రపదేశ్ లో చిత్తూరు జిల్లాకు ఎనలేని ప్రాధాన్యం ఉంది. అందుకు కారణం పపంచ ప్రసిద్ధి చెందిన తిరుమలేశుడు ఈ జిల్లాలోనే వెలసి ఉండడం. ఈ జిల్లాలో దట్టమైన అడవులు అనేకం ఉన్నాయి. ఈ అడవులు ౩౦. 5 శాతం భూమిని ఆక్రమించుకొని ఉన్నాయి. ఈ జిల్లాలో భాకరాపేట, తలకోన, తిరుమల, మామండూరు, పలమనేరు, మదనపల్లి అడవులు చెప్పుకోదగ్గవి.

పలమనేరు, హార్సిలీ హిల్స్ ప్రాంతాలలోని అడవుల్లో గంధపు చెట్లు పెరుగుతాయి. మదన పల్లి అడవుల్లో టేకు లభిస్తుంది. భాకరాపేట, తలకోన, తిరుమల, మామండూరు అడవుల్లో ప్రపంచంలో ఎక్కడా దొరకని ఎర్రచందనం చెట్లు విస్తారంగా పెరుగుతాయి. ఇవి ఎంతో విలువైనవి. బంగారమంత విలువైనవి కాబట్టే వీటిని “ఎర్ర బంగారం” అని కూడా అంటారు.

చిత్తూరు జిల్లా అడవుల్లో కుందేళ్లు, చిరుతపులులు, ఏనుగులు, రకరకాల పక్షులు, పాములు, కొండచిలువలు, కోతులు, ఎలుగుబంట్లు, దుప్పులు, జింకలు, కొండముచ్చులు, అదవి పందులు, ముళ్ళపందులు, నక్కలు, గుంటనక్కలు, పెద్ద జింకలు, కొండ గొర్రెలు, ఉడుములు వంటి ఎన్నో జంతువులున్నాయి. వీటితో పాటు ఒకప్పుడు ఆటవికులు సైతం సహజీవనం చేసేవారు.

కొన్ని వేల సంవత్సరాల ముందు తిరుమల కొండలు దట్టమైన అడవులతో, సుందర జలపాతాలతో, సెలయేర్లతో నిండి ఉండేవి. దాదాపు నాలుగైదు వేల సంవత్సరాల నుండి ఇక్కడ ఆదిమ మానవులు నివశించినట్లు ఆధారాలున్నాయి. అందుకు సాక్ష్యం తిరుమల కొండల్లోని నాటి ఆదిమ మానవుల రాతిపని ముట్లు, వర్ణచిత్రాలు, రాతిమీద చెక్కబడిన చిత్రాలు మొదలైనవి. పరిశోధకుల అంచనా ప్రకారం ఇక్కడి రాతి మీద చెక్కబడిన చిత్రాలు ఎగువ రాతియుగం నాటివని, వర్ణచిత్రాలు నవీన మధ్య శిలాయుగానికి చెందినవని అంటారు. ఇవి సుమారు మూడు, నాలుగు వేల సంవత్సరాల నాటివని భావిస్తున్నారు. అలాగే ఇక్కడ కనిపించే చిత్ర చిహ్నాలు, సంజ్ణలు వంటివి సింధులోయ, తుంగభద్రానదీ లోయ నాగరికతల చిత్రాలతో పోలి ఉన్నాయని అంటారు. వర్ణ చిత్రాలు తిరుమల శ్రీవారి గుడికి ఉత్తరంగా రమారమి పదకొండు కి. మీ. దూరంలోని “తాంత్రిక కోన: లోను, అలాగె శ్రీవారి ఆలయానికి తూర్పున సుమారు ఏడు కి. మీ దూరంలోని “గంగులోడికోన” లోను బయల్పడ్డాయి. రాతిమీద చెక్కబడిన చిత్రాలు తిరుమలకు ఉత్తరంగా ఇరవై ఐదు కి. మీ దూరంలో గల యుద్ధగళ తీర్ధంలోను అలాగే ఆదిమానవుల ఇతర అవశేషాలు తిరుపతి పరిసరాలలో జింకల మిట్ట, రేణిగుంట, రాళ్లకాలవ వంటి ప్రదేశాలలో లభ్యమయ్యాయి. శ్రీ వారి మెట్టుకు దగ్గరలో వుండే చంద్రగిరి కోటకు సమీపంలోని పాండవ గుడీ (మెగాలిధ్) పై కప్పుకు వేసిన వర్ణచిత్రం నేటికీ చెక్కు చెదరలేదు. కాబట్టి తిరుమల కొండలు ఒకప్పుడు ఆటవిక జనసందోహంతో కూడిన ఆవాస ప్రాంతాలు.
టాలెమీ, ప్లీనీల ప్రకారం ఈ ప్రాంతం క్రీ. శ. ఒకటవ శతాబ్దంలో కురుంబులు, వడుకలు వగైరా కొండజాతి వాళ్ళ ఆధిపత్యంలో వుండేది. అలాగే క్రీ. శ 1800 లకు చెందిన మెకండీ కైఫీయత్రుల్లో కూడా తిరుమల గుడి నాలుగు మూడ వీధులు మినహా మిగిలిన అన్ని చోట్ల ఆటవికులు, అదవి పందులు సహజీవనం చేస్తున్నట్లుందని పేర్కొనబడింది. అలాగే సుమారు లక్ష మంది యానాదులు తేనె, మైనం చందనం, వన మూలికలు, కందమూలాలు మొదలైన వాటీని సేకరించి జీవించే వారని కూడా వివరించబడి ఉంది.
దీనిని బట్టి చితూరు జిల్లాలో ముఖ్యంగా తిరుమలలో యానాదులు ఎంతో ప్రాచీన కాలం నుండి నివశిస్తున్నారని తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలో యానాదులే కాకుండా ఎరుకల, సుగాలీ, కురవ, నక్కల, ఇర్ల, కొండ్రాజు, చెంచు వంటి గిరిజనులు కూడా నివశిస్తున్నారు. అయితే ఈ పరిశోధనా పత్రంలో యానాదుల సంస్కృతిని గూర్చి పరిశీలించడం జరిగింది.
1. పుట్టుక : – అడవుల్లో అనాది నుండి జీవిస్తున్నవారు కాబట్టి వీరికి యానాదులు అనే పేరొచ్చిందని అంటారు. చిత్తూరు జిల్లాలో శేషాచలం అడవులు పెద్దవి. ఇక్కడ మొదటి నుండి వీరే నివశిస్తున్నట్లు మనకు అనేక ఆధారాలు లభిస్తున్నాయి. ఇప్పటికీ తిరుమల కొండల్లో ఎక్కడికి వెళ్లాలన్నా యానాదులు వెంటలేకపోతే వెళ్ళలేం. ఇక్కడ కొండ పేటులు, తీర్ధాలు, అడవులు, కోనలు, గుహలు వీరికి సుపరిచితాలు. వీళ్ళకు నల్లమల అడవుల్లో నివశించే చెంచులకు సంబంధం ఉన్నట్లనిపిస్తుంది. ఎందుకంటే యానాదులకు చెంచులక్ష్మి కులదేవత. చెంచులక్ష్మినే నరసింహస్వామి పెళ్ళాడాడు. తిరుమల కొండల్లో నివసించే యానాదులను చెంచులుగా భావించి తరిగొండ వెంకమాంబ “చెంచునాటకం” అనే యక్ష గానంలో వారిని గురించి ఇలా పేర్కొంది. – ఒకప్పుడు వెంకటేశ్వరస్వామి కూడా చెంచు (యానాది) స్త్రీల కోసం తంబురు కోనకు వెళ్లి వారితో సరస సల్లాపాలాడేవాడు. చెంచితలు స్వామివారిని ఆలరుల శయ్యపై పడుకోబెట్టి పునుగు పూసి, పుప్పొడి జల్లి పూలతో పూజచేసి, పండ్లను సమర్పించి, నెమలి ఈక కుచ్చుల్తో విసురుతూ పాదసేవ చేసేవారు. తర్వాత వెంకన్న వారిని కూడేవాడు. ఆతరువాత చెంచెతల నుండి కస్తూరి, పునుగు చుట్టలు, జాజిపువ్వుల చెండ్లు, నక్క కొమ్మువంటి వాటిని తీసుకొని గరుడ వాహనంపై తిరుమలకు చేరుకొనే వాడు. ఇలా చెంచు స్త్రీలతో వెంకటేశ్వర స్వామికి సంబంధాలున్నాయని జానపద కధలు కూడా చెప్తున్నాయి.
2. వృత్తి :- యానాదులుతిరుపతి కొండల్లో లభించే అటవీ సరుకులైన తేనె, వనమూలికలు, కాయలు, పండ్లు సేకరించి తిరుపతి ప్రజలకు అందించేవారు. ఒకప్పుడు అడవిలోని కట్టెలను నరికి మోపులుగా కట్టి, నెత్తిన పెట్టుకొని తిరుపతి పురవీధుల్లో అమ్ముకునేవారు. 25సంవత్సరాల క్రితం వరకు కూడా వీరు కట్టెలను అమ్మేవారు. అలాగే వీరు మేకలను కూడా మేపుకుంటుంటారు. అడవుల్లోని జంతువులను వేటాడి, వాటి మాంసాన్ని జంతుమూలికలను, పులిగోర్లను ప్రజలకు అమ్ముకొని జీవించేవారు. అదేవిధంగా పొలాలను నాశనం చేసే ఎలుకలను కూడా పడ్తారు. కొంగలను ఉచ్చులెసి పడ్తారు. ఏటిలో, నీటిగుంటల్లో, చెరువుల్లో చేపల్ని కూడా పడ్తారు. పాములను పట్టి వాటి చర్మాలను కూడా అమ్ముకుంటుంటారు. వర్శాకాలంలో పుట్ట ఈ సుళ్ళను పట్టి, వాటిని వేయించి తినుబండారంగా అమ్ముతుంటారు. వీళ్ళు చెట్ల మొదళ్ళను సేకరించి బొగ్గును కూడా తయారు చేస్తారు. వీళ్లు వేటాడేప్పుడు బావమరుదులను వెంట తీసుకొని వెళ్తారు. వేటలో వేలాడ్తూ తేనె తీసే సమయంలో తమ నడుముకు కట్టుకొన్న తాడును బావమరిది చేతికే ఇస్తారు. దాయాదుల చేతికి ఇవ్వరు. తమ పెళ్ళాల కోసం దాయాదులు ఎక్కడ దారుణానికి ఒడిగడ్తారోనని వాళ్ళ భయం.
3. ఆహారపుటలవాట్లు :- వీళ్లు అడవుల్లో కుందేళ్లను జంగం (జంగు) పిల్లులను, పునికి (పునుగు) పిల్లులను, తాబేళ్ళను, ఎంటవ (మెంట్రవ)లను ఇతర జంతువులను వేటాడి వాటి మాంసాన్ని అడవుల్లోనే కాల్చుకొని తింటారు. కొంతమంది తమవెంట తీసుకెళ్ళిన ఉప్పు, కారం వేసి వాటికి వేసి కాల్చుకొని తింటారు. ఒక్కోసారి ఆమాంసాన్ని ఉప్పు, కారం వేసి ఉడకబెట్టుకొని కూడా తింటారు. వీరు అడవుళ్ళో వేటకు వెళ్ళినప్పుడు భార్య బిడ్డల్ని కూడా వెంట తీసుకొని వెళ్తారు. రెండు మూడు రోజులుగాని, వారంరోజులు గాని, పది రోజులు గాని, ఒక్కోసారి నెల కూడా అడవిలో లభించే జంతువుల మాంసాన్ని తింటూ గడిపేస్తారు. వాళ్లు ఇళ్ల దగ్గరున్నప్పుడు వెదురు బియ్యంతో అన్నం చేసుకొంటారు. అలాగే రాగి సంగటి, జొన్న సంగటిలను ప్రధాన ఆహారంగా తీసుకొంటారు. గిట్టగడ్డలతో, దేవదారాకుతో, తాబేటాకుతో కూరలు చేసుకొంటారు. చింతపులుసు, టమేటారసం, ఎర్రగడ్డల మిరపకాయ చారును తయారు చేసుకొంటారు. అలాగే చింతకాయల ఊరుమిండి, చింతాకు పచ్చడి, గోగాకు పచ్చళ్ళను కూడా వీరు చేసుకొని తింటారు.
4. వేడుకలు :- చిత్తూరు జిల్లా యానాదుల్లో అనేక వేడుకలు చోటు చేసుకొని ఉన్నాయి. ఈ వేడుకల్లో ప్రధానంగా పెద్ద మనిషి, పెళ్ళి, సీమంతం, పురుడు వంటి వాటిని చెప్పుకోవచ్చు.
4. 1. పెద్ద మనిషి :- చిత్తూరు జిల్లా యానాదుల్లోని బాలికలు యుక్త వయస్సుకు వస్తే వారిని పెద్ద మనిషి అయిందని అంటారు. ఇలా పుష్పవతి అయిన బాలికను అంటుపడిందని చెప్పి బాలిక మేనమామ చేత ఇంటి ముందుఒక పక్కన ఆకు మండలతో గుడిసె కట్టిస్తారు. ఆ అమ్మాయిని గుడిసెలో కూర్చోబెట్టే ముందు ఆకు, వక్క తాంబూలాన్ని మేనమామ చేతికిచ్చి గుడిసెలో కూర్చోబెడతారు. ఆ అమ్మాయి భవిష్యత్తులో ఇంటికి దూరమైనప్పుడు గాని, కాన్పు అయినప్పుడు గాని నొప్పి, బాధలు లేకుండా ఉండడానికని బియ్యం పిండి, బెల్లంతో కొబ్బరి, పలక్కాయలు, నెయ్యిలతో తయారు చేసిన “పిట్టు” ను తినిపిస్తారు. ఆ పిట్టును చుట్టు పక్కల వారికి కూడా పంచి పెడ్తారు. ఆ అమ్మాయిని గుడిసెలో తొమ్మిది రోజుల పాటు కూర్చోబెడ్తారు. తొమ్మిదోరోజు సాయంత్రం ఆ అమ్మాయికి తల స్నానం చేయించి బాగా అలంకరించి పేడతో అలికిన నేలమీద పీట వేసి కూర్చోబెడ్తారు. ఐదుమంది నిండు ముత్తైదువుల చేత అక్షింతలను వేయిస్తారు. ఆమె బంధువులంతా చీర, రవిక పండ్లు సారెను తెచ్చి ఆ అమ్మాయి బడిలో పెడ్తారు. తరువాత సారెను తెచ్చిన వరి అమ్మాయి వాళ్ళు తిరుగు సారెను ఇస్తారు. పదవరోజు అమ్మాయి నిద్రలేవక ముందే ఆమె మేనమామ చేత ఆమెను కూర్చోబెట్టిన గుడిసెను తీయించి దూరంగా తీసుకెళ్ళి కాల్పించేస్తారు.
4. 2. పెళ్ళి :- చిత్తూరు జిల్లా యానాదుల్లో పెళ్ళిళ్ళు ఎక్కువగా మేనరికం ఉంటుంది. మేనమామ కొడుకు గాని, మేనత్త కొడుకును గాని చేసుకుంటారు. కట్నం ప్రసక్తే లేదు. పెళ్ళిళ్ళ సమయంలో అందరూ కలిసి మద్యం సేవించి పాటలు పాడ్తూ, చిందులేస్తారు.
4. 3. సీమంతం :- స్త్రీ గర్భం ధరించిన తొమ్మిదో నెలలో అమ్మగారింట్లో సీమంతం జరుపుతారు. ఈ సీమంతానికి అత్తగారు చీర, రవిక, పూలు పండ్లు, తిను బండారాలతో సారెను పెడ్తారు. ఈ సారెను “కడుపుసారె” అని కూడా అంటారు. గర్భవతికి సీమంతం చేసే రోజు సాయంత్రం జడను పూలతో కుట్టి అలంకరించి కుర్చేలో కూర్చోబెట్టి ఆశీర్వదింపజేస్తారు. ఆ రోజు కూడా అందరూ మద్యం సేవించి వాద్యాలతో పాటలు పాడ్తూ చిందులేస్తారు.
4. 4. పురుడు :- చిత్తూరు జిల్లా యానాదుల్లో పురుఊడ్ను కూడా వేడుకగా నిర్వహిస్తారు. కాన్పు చేసేటప్పుడు మంత్రసాని చేత బొడ్డును చురకత్తితో కోయిస్తారు. తొమ్మిదోరోజు పురుడు చేసేటప్పుడు పూడ్చి పెట్టీ మాయ ఉన్న చోట బొమ్మరిల్లులూ గుడిసేను కట్టి అందులో మూడు రాతిశిలలను ప్రతిష్టించి పసుపు కుంకుమలతో పూజ చేస్తరు. తల్లిచేత స్నానం చేయించి బొమ్మరిల్లు దగ్గరకు తీసుకెల్తారు. అక్కడ మంత్రసాని బిడ్డ కావాలా? గడ్డ కావాలా? అని మూడు సార్లు అడుగుతుంది. అప్పుడు తల్లి బిడ్డ కావాలని బదులుచెప్పి బిడ్దను తీసుకుంటుంది. పురుడు రోజు పిండి వంటల్ని చేసుకొని, మాంసాన్ని వండి తల్లితో పాటు అందరికీ వడ్డిస్తారు. అప్పట్నుంచి తల్లి మాంసం తింటుంది.
5. దేవతలు – పూజా విధానాలు :- వీళ్లు ప్రధానంగా చెంచు లక్ష్మిని ఆరాధిస్తారు. వీళ్ళ కులదేవత చెంచులక్ష్మే. వీళ్ళు ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో అందరూ గుంపుగా చేరి ఊరి బయటకు వలస వెళ్తారు. ఒక మామిడి చెట్టు కింద మూడు శిలలను ప్రతిష్టిస్తారు. ఆ శిలలను నీళ్లతో కడిగి పసుపు పూసి కుంకుమలతో బొట్లు పెట్టి పూలతో అలంకరిస్తారు. అక్కడికి వెళ్లేటప్పుడు డప్పు వాద్యాలతో చిందులేస్తూ పాటలు పాడుకుంటూ వెళ్తారు. వీళ్ళు అక్కడికి పొంగళ్ళను, తీసుకెళ్ళి చెంచులక్ష్మిని ఆరాధించి, ప్రసాదాలను ఆరగించి సాయంత్రం వరకు అక్కడే గడుపుతారు. అక్కడ మాంసాహారాలను వినియోగించరు. అక్కడి నుండి సాయంత్రం బయలుదేరి ఇంటికి వచ్చినతరువాత మరుసటిరోజు మాంసాహారాన్ని భుజిస్తారు. అలాగే చెంచులక్ష్మిని ఆరాధించే ఇతర కులస్తులు కూడా యానాదుల చేతనే పూజలు చేయిస్తారు. వారు ఆ సమయంలో బురదను కందెనను ఒళ్ళంతా పూసుకొని వేషాలను కూడా వేస్తారు. విల్లంబులను చేత ధరించి వేటాడుతున్నట్లు నటిస్తుంటారు.
6. వేష భూషణాలు :- ఒకప్పుడు వీళ్లు నార పంచెలు, నార చీరలను ధరించేవారు. పురుషులు చొక్కాలు, స్త్రీలు రవికలను ధరించరు. అయితే పురుషులు పై పంచను ధరిస్తారు. స్త్రీలు తమ ఎదను నార చీర పైటుకొంగుతో కప్పుకుంటారు. అయితే నేడు వీళ్ళు నేత పంచెలు, చీరలను ధరిస్తున్నారు. మగవాళ్లు జుట్టు పెంచుకొని ముడువేసుకుంటారు. అయితే నేడు జుట్లు పెంచడం తగ్గినా, వయసు మళ్ళిన వారు మాత్రం జుట్లు పెంచుకునే ఉంటారు. పురుషులు ఆభరణాలను ధరించరు. స్త్రీలు పగడాల పూసల దండలను మెళ్ళో ధరిస్తారు. ప్రస్తుతం స్త్రీలు కాలికి మెట్టెలు, పట్టీలు, మెడకు గజ్జెల పట్టెడ, మట్టి గాజులు, చెవులకు సాధా కమ్మలు, పక్క కమ్మలు, మాటీలు ధరిస్తున్నారు. పురుషులు వేళ్ళకు ఉంగరాలు, చేతి గడియారాలను కూడా ధరిస్తున్నారు.
7. చిత్తూరు జిలా యానాదుల సాహిత్యం :- చిత్తూరు జిల్లా యానాదులు పాడుకొనే పాటలు చిక్కగా ఉండవు. అంటే అంత పరిణితి చెందిన పాటలు కావు. ప్రాచీన మానవుడి మనస్తత్వం చిన్న పిల్లవాడి మనస్తత్వమ్ లా ఉంటుంది. అలాగే వారి పాటలు కూడా అలతి అలతి పదాలతో చిన్న పిల్లల పాటల్లా ఉంటాయి గానీ మిగిలిన జానపద గేయాల్లా పరిణితి చెంది ఉండవు. వాళ్లు వాయించే వాద్యాన్ని “దుబ్బాంకు ” అని అంటారు. చిన్న కుండకు మూతి దగ్గర తోలును బిగించేస్తాడు. దానిని కడుపు ముందర కొచ్చేటట్లు కట్టుకుంటారు. జానెడు పొడవుండే రెండు కర్రలతో “దుబ్బాంకు” ను వాయిస్తారు. అలా వాయిస్తూ వీళ్ళుపాటలను పాడ్తుంటారు. వీరు పాటల్లోని సాహిత్యానికన్నా వాయిద్యానికి, చిందులకు ప్రాధాన్యమిస్తారు. వీరు వ్యవహరించే భాష తెలుగు. వీళ్ళు వేడుకలప్పుడు, లేదా కాలక్షేపం కోసం దుబ్బాంకును వాయిస్తూ, పాటలను పాడ్తూ చిందులేస్తుంటారు. కింది యానాదుల పాటను గమనించండి–
” చెరువు కట్టకింద – నల్లేరీ పొద కింద
నల్ల చెరువు కట్ట కింద- నల్లేరి పొద కింద
కుందేలీ వున్నాదే – లెయ్యొసే పోదాము
వలెత్తి బైటేయ్యే – వలెత్తి బైటెయ్యే
వల బుట్లెత్తి బైటెయ్యే
అబ్బబ్బ నేను రాను – తలకాయ్ నొస్తుంది ||అబ్బ ||
లెయ్యొసే పోదాము – పోదాము ఓసే పిల్ల
వలెత్తి బైటేసి – సద్దుకూడు కుండకు పోసి ||వలెత్తి ||
లెయ్యొసే పోదాము – ఎండేమొ అయిపోయె”
ఇలా వేటకు సంబంధించిన పాటలను యానాదులు పాడుకుంటుంటారు. నయకుడు కుందేళ్ళ కోసం వలలను , బుట్టలను తీసుకొని వేటకు పోతాం రమ్మనడం, నాయిక తన వల్ల కాదు తల నొప్పిగా ఉందనడం, చద్ది అన్నం కుండకు పోసుకొని, త్వరగా వెళ్ళాలని ఎండ వచ్చేస్తోందని నాయకుడు బతిమాలడం పై పాటలో కనిపిస్తోంది.
అలాగే మరో గేయాన్ని పరిశీలించండి -
” ఓయమ్మో మాహాలచ్చిమమ్మ – కురిసెనే మా ఇంట్లో ముత్యాల వాన
అమ్మరా ఓ యమ్మా మహాలచ్చిమమ్మ – కురిసెనే మా ఇంట్లో ముత్యాల వాన
అందరూ పోతారు అందరూ పోతారు – అచ్చిరాల తిరనాల
మా రెడ్డి పోతాడు బోగు తిరనాలకి
నా మొగుడు పోతాడు బొబ్బు పొవ్వకు తాను
బొబ్బు పొవ్వకు తాను అందరూ పోతారు
కాళాస్త్రి తిరనాల అందరూ పోతారు ||కాళాస్త్రి||
మా రెడ్డి పోతాడు మురిపెరి మెత్తలు దాను ||ఓయమ్మో||
పై గేయంలో ఒక నాయిక తన ఇంట్లో ముత్యాల వాన కురవాలని కోరుకుంటుంది. అలాగే వాళ్ళ యజమాని అయిన రెడ్డి బొంగు తిరునాళ్ళకు పోతున్నాడని, తన మొగుడేమో బొబ్బు పొవ్వాకు (పొగాకు) కోసం వెళ్తున్నాడని, అలాగే కాళాస్త్రి తిరునాళ్ళకు కూడా అందరూ వెళ్తారని, తమ రెడ్డి మొత్తాళ్ళు కోసం వెళ్తున్నాడని ప్రస్తావించింది.
కొంత మంది యానాదులు నాటకాలను చూసి, అక్కడ పాడే పద్యాలను పేరడీ చేసి ఎలా పాడుకుంటున్నారో కింది పేరడీ హాస్య పద్యాలను గమనించండి-
“ఎద్దు వుచ్చ బోయంగ – ఏరులై పారంగ
తాటాకు పడవ కట్టి – దాటి నను”
“చెరువు నిండ నీళ్ళుంటే – చెరువు నిండ నీళ్ళుంటే
కట్టమీద బోయి – కట్ట మీద వచ్చి నానూ”
“అదే చెర్లో రెండు గుడ్డి కొంగలు కూర్చో నుండ
దొంగలని పరిగెత్తుకొని ఎల్లినాను”
“గాది కింద – మా ఇంటి ముందర గాది కింద
పంది కుక్కను జూచి – ఎలుగుడ్డులని ఎగిరి దూకి – ఎల్లినాను”
“కడవ కింద కప్ప – కడవ కింద కప్ప
గర్ర్ గర్ర్ గర్ర్ మనరవగా
పోయాము తీసుకొని కసక్కున పొడిసినాను”
” ఒకే ఒక మానుకు – రెండు ఉడత పిల్లలు – కరుసు కొని వుంద
పెద్ద పులులని జాబు రాసినాను
ఎవరికి? మాతాతకి
భలెరె భలెరె మా తాత వేటాడగనే
అది సూసి నేను వేటాడగనే
గొర్రిపింటికి గుండ – పొయ్యికాడ మాటు – వాకిట్లో సూపో”
ఇలా హాస్య పేరడీ పద్యాలను కూడా రాగయుక్తంగా చిత్తూరు జిల్లా యానాదులు పాడుకొంటూ తమ వారినందరినీ వినోదింప జేస్తుంటారు.
ఇలా చిత్తూరు జిల్లా యానాదుల సంస్క్రతి – సాహిత్యం ఎంతో వైవిధ్య భరితంతో అలరారుతోంది.

5 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు

5 అభిప్రాయాలు

  1. varalaxmimurthy Jul 14, 2009 1

    మాకు తిరుమల గురుంచి పూర్థిగా వివరాలు తెలియజెయంది

  2. chaganti Jul 26, 2009 2

    అర్య నెను మీకు లెలి చెయునది ఎమనగ
    మీకు తెలియని విషాయలగురించి ఎలా రయా గ్లుగుతున్నరు

  3. Sampath Kumar Aug 1, 2009 3

    చాగంటి గారు జవాబు కోరిండ్రా, లేక, ఉత్తగ ఆయన భావన జెప్పిండ్రా……. దాన్కి ఏదో ఒక జవాబు ఇయ్యాలె గదా…. రచయిత గారు దాని సంగతి జూస్తె మంచిదేమొ…. సన్పాదకులు ఈ విసయమ్ యెన్క వడాలె.

    చాగంటి గారి మాటల్ల నాకెందుకొ మస్థు మతలబ్ ఉన్నట్టు అనిపిస్తాంది.

  4. sahadeva Feb 13, 2010 4

    ఇది చాలా నచినది.దన్యవాదాలు స్రీనివాస రెద్ద్ గారు

  5. sahadeva Feb 13, 2010 5

    బాగావునంది

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో